హైదారబాద్‌… ఇప్పుడు ప్రపంచస్థాయి నగరం. జీవన ప్రమాణాల్లో, కాస్ట్‌లీ అండ్‌ ‌మోడ్రన్‌ ‌లివింగ్‌ ‌లైఫ్‌లో, సాధారణ జీవితం గడపడంలో.. అన్నిరకాలుగా పేరొందిన అత్యున్నత నగరం. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్లకు నీడనిస్తున్న మెట్రో సిటీ. ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన భాగ్యనగరం. అయితే, పైపై మెరుపులేనా? లోలోపల అంతా డొల్లేనా? అన్న సంశయం ప్రతియేడాదీ కలుగుతోంది. రాకూడని అనుమానం అది. కానీ,  సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. డొల్లతనం జాడ వెంటాడుతోంది. హైదరాబాద్‌ ‌పటం, పైకి చూడటంలో ఘనమే అయినా.. నగరం లోపలికి తొంగిచూస్తే మాత్రం మతిపోయే దృశ్యాలు కలచివేస్తున్నాయి. అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

మిగతా కాలాల సంగతి పక్కనబెడితే.. వర్షాకాలంలో మాత్రం హైదరాబాద్‌ ఆగమాగం అవుతోంది. అందుకే వానాకాలం తలచుకుంటేనే నగరవాసులు వణికిపోతున్నారు. వర్షాకాలం సమీపిస్తుందంటేనే గుండెల్లో దడ మొదలవుతోంది. ఎక్కడ ఏ నాలా కాలనీని ముంచేస్తుందో, ఎక్కడ ఏ మ్యాన్‌హోల్‌ ‌మృత్యుకుహరమై మనుషులను మింగుతుందో, ఎక్కడ ఏ చెట్టు ఉన్నట్టుండి కూలిపోయి ఎవరి ప్రాణాలు తీస్తుందో.. ఏ రోడ్డు ఏ నదిలా మారిపోతుందో, ఏ కాలనీలోని వీధిలో పడవల మాదిరిగా వాహనాలు కొట్టుకుపోతాయో, ఏ అపార్ట్‌మెంట్‌ ‌సెల్లార్‌ ‌నీళ్లతో నిండిపోతుందో, అందులో ఉన్న వాహనాలన్నీ వరద నీటిలో తేలి పోతాయో… ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా అవుతుంది. దేనితో దేనిని పోల్చాలో కూడా కష్టమవుతుంది.

ఇక, ఇప్పుడు వర్షాకాలం సమీపిస్తోంది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్‌ను పలక రించేశాయి. అయితే, హైదరాబాద్‌ను తొలివర్షం ముద్దాడేసింది. నగరాన్ని ముద్ద ముద్ద చేసింది. ట్రాఫిక్‌ అష్టకష్టాలు పడేలా చేసింది. రోడ్లన్నింటినీ వాగులు, నదుల మాదిరిగా చేసి పడేసింది. అపార్ట్‌మెంట్‌ ‌సెల్లార్లను నీటితో నింపేసింది. మరి.. తొలి వర్షానికే.. ఇంకా వర్షాకాలం రాకుండా అకాలంగా ఎండాకాలంలో పడ్డ వర్షానికే ఇలా అయితే.. వర్షాకాలం మొదలై.. వర్షాల మీద వర్షాలు కురుస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో.. అన్న సంకటం అందరినీ పట్టి పీడిస్తోంది.

సరిగ్గా పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పా టయ్యింది. స్వపరిపాలన మొదలయ్యింది. ఉద్యమపార్టీ, తెలంగాణ ఆవిర్భావానికి తామే మూలమని చెప్పుకున్న పార్టీ రెండు పర్యాయాలు.. పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించింది. కానీ, ప్రపంచస్థాయి నగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో శాశ్వత వర్షపు కష్టాలను పారదోలేందుకు చేసిన ప్రయత్నం మాత్రం లేదు. నగరమంతా మునిగిపోయే పరిస్థితి ఎదురైన సమయంలోనూ నీరో చక్రవర్తి మాదిరి పాలన కొనసాగింది. కానీ, కార్యాచరణను ప•క్కన పెడితే.. కనీసం ప్రతిపాదనలు కూడా రూపొందించలేదు. మాస్టర్‌ ‌ప్లాన్‌పైనా దృష్టిపెట్టలేదు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ పాలనా పగ్గాలను అందుకుంది.

కానీ, వీళ్లు కూడా వర్షాకాలం పొంచి ఉన్న పరిస్థితి మీద పెద్దగా దృష్టిపెడుతున్న పాపాన పోవడం లేదు. కాలం రాకముందే వేసవికాలంలోనే కురిసిన ఓ మాదిరి వర్షానికి నగరమంతా చిత్తడి చిత్తడి అయిపోయింది. కానీ, అలాంటి పరిస్థితుల నివారణకు చేసిన, చేస్తున్న, చేయబోతున్న కార్యాచరణ మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఫలితంగా వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. వర్షం కురిసినప్పు డల్లా రహదారులపై నీరు నిలుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లమీద ట్రాఫిక్‌ అవస్థలు తప్పడం లేదు. వాహనాలు ముందుకు కదలడం లేదు. ఒక కిలోమీటర్‌ ‌దూరానికే గంటలకు గంటలు సమయం పడుతోంది. వాహనాలు రిపేర్లకు వస్తున్నాయి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌ ‌ప్రజలకు ప్రతియేటా వరద కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో పరిస్థితి  ఇప్పటికీ• అస్సలు మారలేదు. గతేడాది వరుణుడి దెబ్బకు ముంపు ప్రాంతాల ప్రజలు ఎలా వణికిపోయారో… ఇప్పుడు కూడా అదే భయంతో బతుకుతున్నారు.

సాధారణ వర్షాలు పడితేనే హైదరాబాద్‌ ‌నరకాన్ని తలపిస్తుంది. ఇక. కుండపోత వాన ఎడతెరపిలేకుండా కురిస్తే ఊహించడమే కష్ట మవుతుంది. ఓ మాదిరి వర్షం కురిస్తేనే జనజీవనం స్తంభించిపోతోంది. అలాంటిది భారీ వర్షం కురిస్తే మాత్రం పరిస్థితి అస్తవ్యస్థమయిపోతోంది. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు ఉప్పొంగు తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంటినుంచి కాలు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు.

గతేడాది రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి నగరం సాగరమైంది. వీధులు నదులయ్యాయి. దారులు గోదారులయ్యాయి. కుండపోత.. గుండెకోతను మిగిల్చింది. నీట మునిగిన ఇళ్లు.. బతుకమ్మలను తలపించాయి. మహానగరంలో ఎటు చూసినా ఇప్పటికీ ఇదే సీన్‌ ‌కనిపిస్తోంది. ఆనాటి భయం హైదరాబాద్‌ ‌వాసులను ఇంకా వెంటాడుతోంది. ప్రస్తుతం వానలు దంచికొడితే పరిస్థితి ఏంటన్న భయం వెంటాడుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడు తున్నాయి. దీంతో చినుకు పడితే చాలు నగర ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. మరోసారి అదే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు.

 వరదలు వస్తే హైదరాబాద్‌ ‌శివారులోని అనేక కాలనీలు నీటి మధ్య చిక్కుకుపోతున్నాయి. నగరం నడిమధ్యలో ఉన్న కాలనీలు కూడా నాలాల మధ్య బందీలవుతున్నాయి. ఇక, పక్కనే చెరువులు ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లు నీళల్లో పడవలవుతున్నాయి. తాగునీటిలో సీవరేజీ వ్యర్థజలాలు కలుస్తున్నాయి. గతేడాది వరుణుడి దెబ్బకు ముంపు ప్రాంతాల ప్రజలు ఎలా వణికిపోయారో.. ఇప్పుడు కూడా అదే భయంతో బతుకుతున్నారు. ఇక, నాలా రెయిలింగ్‌ ‌వాల్స్, ‌మ్యాన్‌హోల్స్‌పైనే ఫోకస్‌ ‌పెడుతున్న జీహెచ్‌ఎం‌సీ.. ముంపు ప్రాంతాలను పట్టించు కోవడం లేదు. వరద సమస్య నివారణపై దృష్టిపెట్టడంలేదు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించినా అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఆ పనులను మధ్యలోనే ఆపేసింది. దీంతో భారీ వర్షం కురిసిన ప్రతీసారీ సిటీ నిండా మునుగుతోంది. ముంపు సమస్య అలాగే ఉండి పోయింది. అక్కడి ప్రజల కష్టాలు కూడా అలాగే ఉండిపోయాయి. నిజానికి హైదరాబాద్‌లో వర్షం దంచికొడితే చాలు.. వందలాది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కు కుంటాయి. వేలాది ఇళ్లు నీట మునుగుతాయి. ఒక గంటలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే ముంపు ప్రాంతాలకు ముప్పు పొంచివున్నట్లే.

హైదరాబాద్‌ ‌నగరంలో చిన్న వర్షానికి భారీ ఎత్తున ట్రాఫిక్‌ ‌నిలిచిపోవడం షరా మామూలై పోయింది. వర్షాల సమయంలో మాత్రం ట్రాఫిక్‌ ‌కష్టాలు తప్పడం లేదు. అసలే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం.. ఈ సమయంలో వర్షం కురిస్తే.. ఇక అంతే సంగతులు. త్వరగా ఇల్లు చేరుకోవాలన్న మాట మరిచిపోవాల్సిందే. మే 16వ తేదీ గురువారం నగరంలో సరాసరి 7 సెంటీమీటర్లకు పైగా అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నడి వేసవి కాలంలో హఠాత్తుగా కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్‌ అతలాకుతలమైంది. అవిరామంగా పడిన వాన నరకం చూపింది. సిటీ జనాన్ని భయపెట్టింది. గాలివానతో నగరం చిగురుటాకులా వణికింది. కుండపోత వానతో కుదేలైంది. భారీ వర్షంతో జనం బెంబేలెత్తారు. ఆఫీసుల నుంచి ఇంటికెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. హైదరాబాద్‌ ‌నగరంలోని అన్ని రోడ్లమీద కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ ‌జామ్‌ అయ్యింది. ఉరుము లేని పిడుగులా పడ్డ వాన నగర జనానికి చుక్కలు చూపింది. దానికి తోడు భీకరగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. కాలనీలు చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోరు వాన, హోరు గాలితో నగరం తడిసి ముద్దయింది. వర్షంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు.

హైదరాబాద్‌ ‌మహా నగరంలో గతేడాది గుర్తించిన 339 వాటర్‌ ‌లాగిన్‌ ‌పాయింట్స్ అన్నీ కూడా నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా ఈ బ్లాక్‌ ‌పాయింట్స్ ‌మెయిన్‌ ‌రోడ్లపై ఉన్న ప్రాంతాలు ఖైరతాబాద్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌కింద, లింగంపల్లి రైల్వే అండర్‌ ‌పాస్‌, ‌యూసుఫ్‌ ‌గూడా మెయిన్‌ ‌రోడ్‌, ‌రాజ్‌ ‌భవన్‌ ‌రోడ్‌, ‌ఫిల్మ్ ‌నగర్‌, ‌మూసాపేట్‌ ‌మెట్రో స్టేషన్‌, ‌బాలానగర్‌ ‌బస్‌ ‌స్టాప్‌, ‌చింతల్‌ ‌రోడ్‌, ‌జీడిమెట్ల హై టెన్సన్‌ ‌రోడ్‌, ‌మలక్‌పేట సహా పాతబస్తీలో పలు ఏరియాల్లో నీరు నిలిచి డేంజర్‌ ‌స్పాట్స్‌గా ఉన్నాయి. భారీ వర్షాలతో జీహెచ్‌ఎం‌సీ అప్రమత్తమై డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ ‌ఫోర్స్ ‌టీమ్స్, ‌మాన్‌సూన్‌ ‌టీమ్స్ ‌రంగలోకి దిగుతాయి. గ్రేటర్‌ ‌పరిధిలో 30 డీఆర్‌ఎఫ్‌ ‌టీమ్స్, 60 ‌సీఆర్‌ఎం‌పీ టీమ్స్ ‌క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. అకాల వర్షాలు సాయంత్రంవేళ విరుచుకుపడుతూ ఉండడంతో ఇళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్‌ ‌నరకయాతన చూపిస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసులో నుంచి ఇళ్లకు బయటకు వచ్చిన వారు ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది.

16 తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. దీంతో చినుకు పడితే ట్రాఫిక్‌ ‌చిక్కులు ఎంతలా ఉంటాయో అర్థం చేసు కోవచ్చు. చినుకు పడిన ప్రతిసారి నగరం అష్టదిగ్బం ధనంలో కురుకు పోకుండా గుర్తించిన బ్లాక్‌ ‌స్పాట్స్ ‌వద్ద నాలాల విస్తరణ, నీరు నిలవకుండా వెంటనే తొలగించేలా బల్దియా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దానికితోడు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ‌సిబ్బంది సైతం ట్రాఫిక్‌ ‌రెగ్యులేటింగ్‌ ‌చేసే విధంగా అవసరమైతే వన్‌ ‌వే దారులు డైవర్ట్ ‌చేసే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నగరంలో వర్షం పడిందంటే ట్రాఫిక్‌ ‌షరా మామూలుగా మారిన వేల తక్షణ నివారణ చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.

-సుజాత గోపగోని,

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE