కాంగ్రెస్‌ ‌పార్టీ కథ కంచికి చేరిందా? హస్తం పార్టీకి ఇవే ఆఖరి ఎన్నికలు కానున్నాయా? అంటే, కాదని చెప్పడానికి అవసరమైన వాతావరణం కనిపించడం లేదు. నిజానికి, కాంగ్రెస్‌ ఇప్పటికే ఒకటికి రెండుసార్లు ఓటమిని చవి చూసింది. వరసగా 2014, 2019 ఎన్నికల్లో రెండు అంకెల సంఖ్యకే పార్టీ ‘బలం’ పరిమితమయింది. ఒకసారి సోనియా గాంధీ నాయకత్వంలో, మరోమారు రాహుల్‌ ‌గాంధీ సారథ్యంలో శతాధిక సంవత్సరాల పార్టీ చారిత్రక ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు, ముచ్చటగా మూడవసారి మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో అదే పునరావృతమైతే, కాంగ్రెస్‌ ‌తిరిగి కోలుకోవడం కొంచెం కాదు, చాలా చాలా కష్టం. ఖర్గే పేరుకు అధ్యక్షుడు అయినా వాస్తవంలో హస్తం పార్టీ కర్త, కర్మ, క్రియ అన్నీ రాహుల్‌ ‌గాంధీయేనన్నది తెలిసిన విషయమే.

బాధ్యతలు లేని అధికారాన్ని చెలాయించేం దుకు అలవాటు పడిన రాహుల్‌ ‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ‌బతికి బట్ట కట్టడం కాదు కదా, ఐసీయూ నుంచి బయటకు రావడం కూడా జరిగే పని కాదని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. నిజం, ఈ ఎన్నికల్లో పాత ఫలితాలే పునరావృతం అయితే, మళ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ‌కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోందని, ఇందులో రెండవ అభిప్రాయం లేదని కాంగ్రెస్‌ ‌నేతలే వ్యక్తిగత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

అసమర్ధ నాయకత్వం

కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రస్తుత దయనీయ స్థితికి రాహుల్‌ ‌గాంధీ అసమర్ధ నాయకత్వమే ప్రధాన కారణం. పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా దీనిని కాంగ్రెస్‌ ‌నేతలు సహా అందరూ అంగీకరిస్తున్న నిజం. అందుకే రాహుల్‌ ‌నాయకత్వంలో కాంగ్రెస్‌లో పునరుజ్జీవనం కల్ల అనే అభిప్రాయం అంతటా నాటుకు పోయింది. • తనను తాను నిరూపించుకునేందుకు రాహుల్‌ ‌జోడో యాత్రలు చేసినా, ఇంకో యాత్ర చేసినా కనీసం కాంగ్రెస్‌ ‌నాయకుల్లో అయినా ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం కలగడం లేదు. అందుకే కాంగ్రెస్‌ ‌నాయకులు ఎక్కడికక్కడ కొత్తదారులు వెతుక్కుంటు న్నారు. ఏ దారి లేని వారు మాత్రమే కాంగ్రెస్‌లో మిగులుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

రాహుల్‌ ‌గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవనే విషయం ఇప్పడు కాదు, ఎప్పటినుంచో వినిపిస్తున్నదే. దేశ విదేశీ జర్నలిస్టులు మొదలు, రాజకీయ పండితులు, విశ్లేషకులు, ఆఖరికి జ్యోతిష్కులు సైతం రాహుల్‌కి ప్రధానమంత్రి అయ్యే అర్హత, యోగ్యతా రెండూ లేవని ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు. అంతేకాదు, అసలు రాహుల్‌కే అలాంటి ఆశ, ఆకాంక్ష లేవని అయన సన్నిహితులు చెపుతుంటారు. రాజకీయ నాయకులు అందివచ్చిన అవకాశాలను సహజంగా వదులు కోరు. కానీ, రాజకీయాల్లో ఎదిగేందుకు అందివచ్చిన అవకాశాలను అనేకసార్లు రాహుల్‌ ‌వదులుకున్నారు.

చారిత్రక తప్పిదం

రాజకీయ భవిష్యత్‌ ‌నిర్మించుకునేందుకు 2004లో రాహుల్‌కు చక్కని అవకాశం వచ్చింది. ఆ సంవత్సరంలో ఏర్పడింది సంకీర్ణమే అయినా, ఇప్పటి ఇండీ• కూటమి భాగస్వామ్య పక్షాల్లా కాకుండా కాంగ్రెస్‌ ‌నాయకత్వాన్ని, యూపీఏ భాగస్వాములు చాలావరకు ఆమోదించారు. బయటి నుంచి మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని సంకీర్ణానికి దన్నుగా నిలిచారు. అలాంటి సమయంలో • ప్రధాని కాకున్నా, మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మంత్రి వర్గంలో రాహుల్‌ ‌మంత్రి పదవిని తీసుకున్నా ఆయన రాజకీయ భవిష్యత్‌కు పునాదులు పడేవి. కారణాలు ఏవైనా ఆ చక్కటి అవకాశాన్ని ఆయన వదులుకున్నారు. ఒక విధంగా కమ్యూనిస్టులు చేసిన చారిత్రక తప్పిదం వంటిదే రాహుల్‌ ‌చేశారు. కమ్యూనిస్టుల్లానే, ‘ఇలా మిగిలేం’ అనే స్థితికి చేరారు.

తాను గాంధీ-నెహ్రూ వారసుడిని కాబట్టి అధికారం దానంతట అదే నడుచుకుంటూ వస్తుందనే అతివిశ్వాసం లేదా అహంకారంతోనో, కాదంటే, అమాయకత్వంతోనో, ఆ అవకాశాన్ని చేజార్చు కున్నారు. అందుకు ఆయనకు ఉండే కారణాలు ఆయనకు ఉండవచ్చు. కానీ, మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మంత్రి వర్గంలో మంత్రి పదవిని స్వీకరించక పోవడం రాహుల్‌ ‌చేసిన తప్పిదమనే అభిప్రాయం బలంగానే వినిపించింది. ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించిన మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మంత్రివర్గంలో చేరి ఉంటే, పార్టీలో, ఇంకా చెప్పాలంటే దేశ రాజకీయాలలో ప్రత్యామ్నాయ నేతగా నిలిచేందుకు కొంత అవకాశం ఉండేది. మంత్రివర్గంలో చేరకుండా సూపర్‌ ‌ప్రైమ్‌ ‌మినిస్టర్‌గా బాధ్యతలు లేని అపరిమిత అధికారాన్ని చెలాయించారు. మంత్రి మండలి ఆమోదించి, రాష్ట్రపతి సంతకం చేసిన ఆర్డినెన్స్‌ను విలేకరుల సమావేశంలో చించి పోగులు పెట్టారు.

అయినా ప్రధాని సహా ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. చిత్రం ఏమిటంటే ఇన్ని పరిణామాలు జరిగిపోయినా ఇప్పటికీ రాహుల్‌ అదే భ్రమల్లో ఉన్నారు. తనను పాలకుడిగా ఎన్నుకోవడం భారతీయుల విధ్యుక్తధర్మమని ఆయన నమ్మకం. ఇవన్నీ రాహుల్‌ ‌మీద హస్తం పార్టీ అంటే గిట్టని వారు చేస్తున్న విమర్శలు కావు. పార్టీలో కొనసాగుతున్న పాతతరం నాయకుల అంతరంగం కూడా అదే. ఈ ఎన్నికలలో హస్తం పార్టీ మళ్లీ ఐదు పదుల సీట్లకే పరిమితం అయితే, ఆపై పార్టీలో అగ్రనేతలయినా మిగులుతారా అన్నది అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు.

నిజానికి, ఇప్పటికే కాంగ్రెస్‌ ‌చాలావరకు ఖాళీ అయింది. ముఖ్య నేతలనుకున్న వారిలో మూడొంతుల మందికి పైగా వెళ్లిపోయారు. ఇంకా వెళ్లిపోతూనే ఉన్నారు. ఇంచుమించు ప్రతిరోజు కాంగ్రెస్‌ ‌నాయకుల ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇచ్చిన అభ్యర్ధులు కూడా టికెట్‌ ‌వద్దని పక్కకు తప్పు కుంటున్నారు. మూడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులు ముందుగానే చేతులు ఎత్తేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కారణం అయినా మూడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ ‌పోటీలోనే లేదు.

ఒక లెక్క ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించుగా 400 మందికి పైగా పార్టీ ముఖ్యనేతలు ‘చేయి’ వదలి వెళ్లిపోయారు. అందులో ఎక్కువ మంది బీజేపీలో చేరారు. వీరి సంఖ్య తక్కువేమీ కాదు. 11 మంది మాజీ ముఖ్యమంత్రులు, 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. తాజాగా చత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రానికి చెందిన సీనియర్‌ ‌నాయకురాలు రాధిక ఖేరా కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే, కొద్ది రోజుల క్రితం ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన, అరవింద్‌ ‌సింగ్‌ ‌లౌవ్లీ, మరో నలుగురు సీనియర్‌ ‌నాయకులు చేయి వదిలి కమలం గూటికి చేరారు. ఖెరా వంటి వారి ఆరోపణలు, పార్టీ వీడిన కారణాలు కాంగ్రెస్‌లో ఏర్పడిన ప్రమాదకర పరిస్థితికి అద్దం పడతాయి. తాను అయోధ్య వెళ్లినందుకు హింసించారని ఖెరా ఆరోపించారు.

కంచి యాత్ర

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ ‌సారథ్యంలో పార్టీ వరసగా రెండవ సారి ఘోర ఓటమి చెందిననాటి నుంచి కాంగ్రెస్‌ ‌కథ కంచి యాత్ర మొదలైంది. ఓటమిని సవాలుగా తీసుకునేందుకు బదులుగా రాహుల్‌ ‌గాంధీ కాడి వదిలేసారు. మరొకరు ముందుకు రాలేదు. రెండు సంవత్సరాలకు పైగా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండిపోయింది. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగినా, ఆమె వయసు, ఆరోగ్యం దృష్ట్యా క్రియాశీల పాత్రను పోషించలేక పోయారు. అదే సమయంలో జీ23 పేరున గులాం నబీ ఆజాద్‌, ‌కపిల్‌ ‌సిబాల్‌, ఆనంద శర్మ వంటి సీనియర్‌ ‌నాయకులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. చాలా వరకు పార్టీని వీడి వెళ్లిపోయారు. మరోవంక రాహుల్‌ ‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాడి వదిలేయడంతో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ ‌ప్రసాద, ఆర్పీఎన్‌ ‌సింగ్‌, అనిల్‌ అం‌టోనీ, హార్దిక్‌ ‌పటేల్‌, ‌మిలింద్‌ ‌దేవ్‌రా వంటి రాహుల్‌ ‌బ్రిగేడ్‌గా ముద్ర వేసుకున్న యువ నాయకులు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ చిట్టా చాలా పెద్దది. ఒకప్పుడు, కమ్యూనిస్టుల కంటే, మాజీ కమ్యూనిస్టులు ఎక్కవ అనే వ్యాఖ్య ఉండేది. ఇప్పడు కాంగ్రెస్‌ ‌పరిస్థితి కూడా ఇంచుమించుగా అదే. కాంగ్రెస్‌ ‌చేయి వదిలిన నాయకుల చిట్టాలో చెప్పిన పేర్లకంటే చెప్పవలసిన పేర్లు వందల్లో ఉంటాయి. తరతరాలుగా కాంగ్రెస్‌లో ఉన్న కుటుంబాలకు చెందిన నాయకులు సైతం పేగు బంధాన్ని తెంచుకుని మరీ వదిలిపోయారు. పోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అవే ఫలితాలు వస్తే, ప్రస్తుతం మిగిలిన ఆ సీనియర్‌ ‌నాయకులు ఎవరి దారి వారు చూసుకోవడం ఖాయం.

ఎందుకు ఇలా జరిగింది?

ఇలా ఎందుకు జరిగింది? రాజకీయాల్లో, ముఖ్యంగా మన రాజకీయాల్లో పార్టీలు మారడం కొత్త కాదు. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో, (అది అభిలషణీయం అయినా కాకున్నా) పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణం. ప్రజలు కూడా అందుకు అలవాటు పడిపోయారు. అలాంటి వారిని గెలిపించడం ద్వారా ప్రజలు ఆమోదం తెలుపు తున్నారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీలో సంభ విస్తున్న పరిణామాలు, సాధారణ ఫిరాయింపులుగా భావించలేము. కురువృద్ధ కాంగ్రెస్‌ ‌పార్టీ కథ కంచికి చేరింది. అందుకు కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉన్నా, అసలు కారణం మాత్రం, బాధ్యతలు లేని అధికారం కోసం అర్రులు చాస్తున్న పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ ప్రధాన కారణంగా కనిపిస్తారు. అలాగే, నాయకత్వ అసమర్ధతతో పాటుగా, సైద్ధాంతిక భావదారిద్య్రం (וవశీశ్రీశీస్త్రఱమీ•శ్రీ •అ••బజూ•మీ•) కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ చరిత్రను ఆఖరి అంకం వైపునకే శరవేగంగా నడిపిస్తున్నది.

ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి, రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తి గురించి పదే పదే నరేంద్ర మోదీకి పాఠాలు చెప్పడానికి సాహసం చేసే రాహుల్‌ ఇప్పటికీ కుటుంబ రాజకీయాలనే నమ్ముకున్న మాట నిజం. వారసత్వమే తన బలమని ఆయన విశ్వాసం. ఇదిగో నా కుమారుడిని మీకు అప్పగిస్తున్నాను అంటూ సోనియా రాయబరేలీ ఓటర్లను ఎమోషనల్‌ ‌బ్లాక్‌మెయిల్‌కు గురి చేయడమే ఇందుకు తాజా ఉదాహరణ. వయనాడ్‌ ఓటమిని ఊహించి రాహుల్‌ ‌రాయబరేలీ వచ్చారు. మరి ఆ తల్లి కోరినట్టు ఈ నాయకుడిని ఉత్తరాది ఓటర్లు అక్కున చేర్చుకుంటారా?

 నరేంద్ర మోదీ మరొకసారి ఎన్నికైతే దేశానికి ఇవే చివరి ఎన్నికలంటూ ప్రచారంలో ఊదరగొడు తున్నది కాంగ్రెస్‌. ‌దానికి ఒక్క రుజువు కూడా లేదు. కానీ రాహుల్‌ ‌నాయకత్వంలో మరొకసారి ఎన్నికలకు వెళుతున్న కాంగ్రెస్‌కు నిజంగానే ఇవి చివరి ఎన్నికలయ్యే ప్రమాదం మాత్రం చాలా ఉంది.

-రాజనాల బాలకృష్ణ

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE