– పి. చంద్రశేఖర ఆజాద్‌, 9246573575

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


ఇప్పుడు అర్థం అవుతోంది. ఎన్ని రకాల ప్రచారాలు జరిగినా, ఎన్ని ప్రయాణాలు చేసినా, ఆయన దృష్టి నుండి ఏదీ తప్పించుకుపోదు అని. ఆ రోజు రాత్రి రామకృష్ణ రిత్విక్‌ని పిలిచాడు.

ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.

‘‘మీది ఏ ప్రాంతం?’’

‘‘గుంటూరు జిల్లా సర్‌’’.

‘‘ఎప్పటి నుంచి గోవింద్‌ ‌పత్రికకి రాస్తున్నావు?’’

‘‘ముఫై సంవత్సరాలు దాటుతోంది’’.

‘‘ఆ మధ్య కాలంలో నేను పత్రిక చదవటం కుదరలేదు. ఎయిటీస్‌కి ముందు రెగ్యులర్‌గా చదివేవాడ్ని… నీకు ఎలాంటి రచనలంటే ఇష్టం?’’

‘‘సెంటిమెంట్‌ ‌సర్‌. ‌కాస్త భావుకత ఇష్టం. అలాగే మానవీయ కోణం అంటే ఇష్టం’’.

‘‘ఎంతవరకు చదువుకున్నావు?’’

‘‘ఇంటర్‌ ‌మీడియట్‌ ‌తర్వాత ఎప్పుడో గ్రాడ్యు యేషన్‌ ‌పూర్తి చేసాను సర్‌’’.

‘‘‌చదువుకీ, రచనకీ సంబంధం లేదు రిత్విక్‌… అసలు ఏమీ చదువుకోని వారు కూడా గొప్ప తత్వాలు రాసారు. కావలసింది అనుభవం. జీవితాన్ని గురించిన ఎరుక కంటే అనుభవం ఏముంటుంది!’’

‘‘అవును సర్‌’’.

‘‘‌కొంతమంది వస్తున్న టెక్నాలజీని అంత త్వరగా ఆహ్వానించలేరు. నిన్నటి వన్నీపోతున్నాయి అని గోల చేస్తారు. వారు మళ్లీ అన్నీ వాడుకుంటారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్‌ ‌వుంటుంది. దాంతో బండి లాగిస్తుంటారు. అవునా?’’

రిత్విక్‌ ‌మాట్లాడలేదు.

‘‘నాతో డిఫర్‌ అవుతున్నావా?’’

‘‘మీరు మాట్లాడుతుంటే వినాలనుంది సర్‌. ఇప్పుడు నేను చర్చకి సిద్ధంగా లేను. మీ అనుభవం నుండి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను’’.

ఆయన తలూపాడు.

‘‘మీ కుటుంబం గురించి చెప్పు’’ అన్నారాయన.

క్లుప్తంగా చెప్పాడు.

‘‘ఆర్‌ ‌యూ హ్యాపీ’’ అన్నాడు సూటిగా…

‘‘సంతోషంగా వున్నాను సర్‌. ‌వుండటానికి ప్రయత్నం చేస్తుంటాను’’.

‘‘గూడ్‌’’ అన్నాడు.

ఆయన తనని అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తున్నారా అనిపించింది. నిన్నటి ప్రతి ఇండస్ట్రియ లిస్టూ, అలాగే విభిన్న రంగాల్లో పైకి వచ్చిన వారు మధ్య తరగతి, లేదా వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చినవారే అనే అభిప్రాయం రిత్విక్‌కి వుంది. క్రమంగా వారి స్థాయి పెరుగుతుంది. అప్పటి నుంచి వారి అభిప్రాయాలు మారు తుంటాయి. అయితే నాస్టాల్జియా మాత్రం వారిని వదిలిపోదు. మామూలు మనుషుల కంటే, రచయితల కంటే ఎక్కువ మందిని కలుస్తుంటారు. ఎక్కువ ప్రాంతాలకు వెళ్తుంటారు.

అంతే కాదు. ఇదే మనుషులతో పనులు చేయించుకుంటారు. అందుకే వారి బలాలూ, బలహీనతలు వారికి ఎక్కువగా తెలుస్తాయి. కొంత మంది మాత్రం మనుషుల మీద ప్రయోగాలు చేస్తుం టారు. ఎందుకో రామకృష్ణగారు అలా అనిపించటం లేదు అనుకున్నాడు రిత్విక్‌.

‘‘‌నేను ఇంగ్లీష్‌ ‌పుస్తకాలు చదివాను. వారి క్రాఫ్ట్ ‌బాగుంటుంది. వాళ్లు పరిశోధన చేయందే రాయరు. బ్యురోక్రసి, వైట్‌ ‌కాలర్‌ ‌క్రైమ్స్, ‌హాస్పిటల్స్, ఇం‌డస్ట్రీస్‌ ఇలా అనేక విషయాలు రాస్తుంటారు. ఎలా మోసం చేయవచ్చో నేర్పుతున్నట్లుగా వుంటుంది’’.

‘‘నాకు ఇంగ్లీష్‌ అం‌త బాగా రాదు సర్‌’’.

‘‘‌తెలుగు రచయితల్లో చాలా మందికి రాదులే. అయినా నువ్వు ఇంతకాలం నుండి బండి లాక్కురావటం విశేషమే’’ అన్నాడాయన.

కాస్త చివుక్కుమంది రిత్విక్‌కి.

‘‘మన ఇండస్ట్రీస్‌ అన్నీ క్వాలిటీ ప్రొడక్టస్ అం‌దిస్తున్నాయా సర్‌’’ అన్నాడు.

‘‘విదేశాల్లో రోడ్లు ఎలా వుంటాయి సర్‌. ‌మన దేశంలో ఎలా వున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఈ నాలుగు లేన్ల రహదారులు వేస్తున్నాయి. వంతెనలు కడుతున్నాయి. వాటి క్వాలిటీ గురించి చిన్న పిల్లలకు కూడా తెలుసు. అమెరికాలో అవకాశాలు ఇక్కడ రచయితలకు వున్నాయా? నాకు ఓ సబ్జెక్ట్ ‌మీద పరిశోధన చేయాలని వుంది. నా మీద ఎవరు ఇన్వెస్ట్ ‌చేస్తారు. ఏ పత్రిక ప్రచురిస్తుంది. ఇవన్నీ వున్నాయి. అసలు అమెరికా అంతా వున్న డాక్టర్లు, ఐ.టి వారు, ఇంజనీర్లు, సైంటిస్టులు మన ఇండియన్స్ ‌కాదా సార్‌?  ఇక్కడ రచయితలకు స్వేచ్ఛగా రాసుకునే అవకాశం లేదు. అందుకే ఇక్కడ బండ్లు నడుస్తుం టాయి’’ అన్నాడు.

‘‘నువ్వు హర్ట్ అయ్యావా రిత్విక్‌’’.

‘‘‌లేదు సర్‌. ఉన్న విషయాలు చెబు తున్నాను. కొంత మంది గ్లోబల్‌ ‌స్టాండర్స్ ‌కావాలంటారు. పది వేలలో ఓ థర్టీ సెకండ్స్ ఏడ్‌ ‌ఫిల్మ్ ‌రాగలదా? ఆలోచనలకు కొదవ లేదు. పిండి కొద్దీ రొట్టె అన్నారు అందుకే’’.

‘‘నేను అర్థం చేసుకుంటాను. ఏమైనా నీతో మాట్లాడటం నాకు సంతోషాన్నిచ్చింది రిత్విక్‌’’.

‘‘‌నాక్కూడా సర్‌’’ అన్నాడు.

* * * * * *

‘‘హారికా.. ఇదీ జరిగింది పెద్దాయన తన ధోరణిలో తను మాట్లాడారు. నేను అంత రియాక్ట్ ‌కాకుండా వుండాల్సిందేమో కదా’’.

‘‘అంటే అప్పుడప్పుడు నన్ను కోపంగా చూస్తూ, కళ్లు పెద్దవి చేస్తూ మాట్లాడినట్లు మాట్లాడారా?’’

‘‘అప్పుడు నా కళ్లు పెద్దవయ్యాయో, చిన్న వయ్యాయో నాకెలా తెలుస్తుంది. కాస్త దృఢంగా అని వుంటాను’’.

‘‘అదే మార్చుకోవాలి. ఆయన అభిప్రాయం చెప్పినప్పుడు మీలానే ముఖం పెట్టారా? ప్రశాంతం గానే చెప్పారుగా. అసలు ఎవరికయినా కోపం ఎందుకు రావాలి? అసహనం ఎందుకు? ఎలాంటి విషయం అయినా చిరునవ్వుతో చెప్పవచ్చు. నిన్న ఎక్కడో చదివాను. ‘‘బీకేర్‌ ‌ఫుల్‌’’ అని చెప్పటంలో తేడా వుంటుంది. అది నమ్రతగా చెబితే ఓ రకంగా వుంటుంది. సీరియస్‌గా చెబితే మీరు మంచి కోసం చెప్పినా నెగిటివ్‌గా తీసుకుంటారు’’.

‘‘నాది పొరపాటు అంటావా?’’

‘‘మీరు మాట్లాడాక ఆయన ఏమన్నారు?’’

‘‘నిన్ను అర్థం చేసుకుంటాను అన్నారు’’.

‘‘అదీ పెద్దవారి లక్షణం. మన పిల్లలకు ఇలా చెబితే అప్పటి నుండే అభిప్రాయ భేదాలు మొద లవుతాయి. ఎవరి కుటుంబంలో అయినా అంతే. ఈ రోజు మీ పాస్‌పోర్ట్ ‌వచ్చింది’’ అంది హారిక.

‘‘నేను గోవింద్‌ ‌గారికి చెబుతాను’’ అన్నాడు.

* * * * * *

డైరీ రాసుకుంటున్నాడు రిత్విక్‌.

‘‘ఈ ‌రోజు కొత్త అనుభవం. నేను నా ఎదురుగా వున్న వ్యక్తి వయసును మరిచిపోయాను. హారిక అన్నట్లు నేను అలా రియాక్ట్ ‌కానవసరం లేదు. బహుశా వారు నాతో ఇంకేదో మాట్లాడాలనుకుని వుండవచ్చు. ఆ స్రవంతి తెగిపోయింది. నువ్వు సెంటిమెంట్‌ ‌గురించి, భావుకత్వం గురించి ఎలా మాట్లాడతావు. అవన్నీ రాతల వరకే పరిమితమా అని వారు అనలేదు. వారి కళ్లల్లో అలాంటి భావం కనిపించక పోవచ్చు. ఇలాంటి వ్యక్తితో నాకు చర్చ ఎందుకు అని అనుకుని వుంటారు. అదలావుంటే హారిక ఇంకో విషయం ఎత్తి చూపింది. నాతో మాట్లాడినట్లు మాట్లాడారా అంది. పిల్లలకు ఇలా చెబితే వాళ్లు కూడా నెగెటివ్‌గా తీసుకోవచ్చు అని హెచ్చరించింది. ఇప్పటి వరకు నేను ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టలేదు. నాకు బ్లడ్‌ ‌ప్రెషర్‌ ‌వుంది….’’ రాస్తున్న వాడు ఆగిపోయాడు.

ఇప్పటివరకు టాబ్లెట్‌ ‌వేసుకోలేదని అర్థం అయింది.

ఇంటి దగ్గర పరిస్థితి వేరు. అన్నీ హారిక చూసు కుంటుంది. వేళకి అన్నీ అమర్చుతుంది. బయటకు వెళ్తే ఫోన్‌ ‌చేస్తుంది. వచ్చే ముందు మరీమరీ హెచ్చరించింది. టాబ్లెట్స్ ‌వేసుకోవటం మరిచి పోకండి అని.

ఇప్పుడు అర్థం అవుతోంది. భార్య తోడు లేకపోతే ఒక్కరోజు కూడా బతకటం కష్టం. ఇంత వయసులో రామకృష్ణ గారు ఒంటరిగా వుండటం ఏమిటి? వారి భార్య వుందా? చనిపోయారా?

ఇంతకు ముందు గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించిన పెద్దాయనకి ఇప్పుడు గోవింద్‌గారి దగ్గర వుండ వలసిన పరిస్థితి ఏం వచ్చింది. నష్టపోయారా? ఆస్తు లన్నీ కరిగిపోయాయా? నేను అజ్ఞాతంలో బతకవలసి వచ్చింది అనటం గుర్తుంది. ఇందులో ఏదో మిస్టరీ వుంది. అది ఎప్పటికి తెలుస్తుందో తెలియదు. ఎవరి ద్వారా తెలుస్తుందో తెలియదు.

అతనికి గందరగోళంగా వుంది. డైరీ మూసాడు.

ముందు బ్యాగ్‌లోని టాబ్లెట్స్ అన్నీ చూసు కున్నాడు. ఇప్పుడు సమయం కాకపోయినా ముందు బి.పి. టాబ్లెట్‌ ‌వేసుకున్నాడు. తలనొప్పిగా అనిపిం చింది. బయటకు వచ్చాడు. లాన్‌లో ఓ పక్కన నడు స్తుంటే సన్నటి చినుకులు పడుతున్నట్లు    అనిపించి తల పైకి ఎత్తాడు. అప్పుడు వాటర్‌ ‌ట్యాంక్‌ ‌నిండిపోయినట్లుంది. చినుకుగా మొదలై ధారగా నీళ్లు కారుతున్నాయి.

మోటార్‌ ‌స్విచ్‌ ఎక్కడ వుందా అని చూస్తున్నాడు. తోటమాలి ఇంకో పక్క నుండి పరిగెత్తుకు వచ్చి స్విచ్‌ ఆపి, రిత్విక్‌ ‌దగ్గరికి వచ్చాడు. పక్కకు లాగాడు. అప్పటి దాకా అలానే నిలబడ్డాడు.

‘‘తడిసిపోయారు. టవల్‌ ‌తీసుకొస్తాను. ముందు తల తుడుచుకోండి. జ్వరం వస్తుంది’’ అన్నాడు కదలబోతూ…

‘‘ఆగండి. నేను గదికి వెళ్తాను’’ అన్నాడు రిత్విక్‌.

‘‘అయ్యగారికి ఈ విషయం చెప్పకండి బాబూ… తప్పయిపోయింది’’ అన్నాడు భయంగా.

‘‘తప్పు మీది కాదు. ఎప్పుడు టాంక్‌ ‌నిండు తుందో మీకు తెలియదు. అయినా మీరు పనిలో వున్నారు. ఇక్కడ నడవటం చినుకులు తగిలినా నిలబడిపోవటం నా తప్పు’’ అని లోపలకు వెళ్లి పోయాడు.

అప్పుడు రామకృష్ణ గారు హాల్లో వున్నాడు.

‘‘వాట్‌ ‌మై బాయ్‌… ‌డ్రిజిలింగ్‌’’ అన్నాడు.

‘‘లేదు సర్‌… ‌వాటర్‌ ‌ట్యాంక్‌ ‌నిండింది….’’ అంటుంటే…

‘‘అలానా… తల తుడుచుకురా. టీ తాగుదువు గాని’’ అన్నాడు.

చిరునవ్వుతో తలూపి గదిలోకి వెళ్తుంటే తలనొప్పి ఎగిరి పోయిందని పించింది.

* * * * * *

ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్సిటీ….

ఇరవై ఏడుగురు ప్రధాన మంత్రులను అందించింది. యునైటెడ్‌ ‌కింగ్‌ ‌డమ్‌లో అరవై తొమ్మిదిమంది నోబెల్‌• ‌ఫ్రైజ్‌ ‌విన్నర్స్. ‌ముగ్గురు ఫీల్డ్ ‌మెడలిస్టులు. ఆరుగురు టర్నింగ్‌ అవార్డ్ ‌విన్నర్స్… అం‌తేకాదు కనీసం నూట అరవై ఒలెంపిక్‌ ‌విన్నర్స్ అక్కడ చదువుకున్నారు.

స్టీఫెన్‌ ‌హాకింగ్‌, ఆస్కార్డ్ ‌వైల్డ్, ‌జె.ఆర్‌.ఆర్‌. ‌టాల్‌ ‌కీన్‌. ‌డేవిడ్‌ ‌కెమెరాన్‌ ‌లాంటి విభిన్న రంగాలకు చెంది ప్రముఖులు అక్కడ నుండి ప్రపంచానికి చాలా అందించారు.

ఆ యూనివర్సిటీలో చదువుకోవాలనేది ఎంతో మంది కల. రసజ్ఞ అక్కడ చదువుతోంది.

తను ఇప్పుడు మెడిసిన్‌లో ఎం.ఎస్‌. ‌చేస్తోంది.

రసజ్ఞ ఆ యూనివర్సిటీలోకి అడుగు పెట్టిన ప్రతిసారి ఆమె పెదవుల మీద ‘‘ది లార్డ్ ఈజ్‌ ‌మై లైట్‌’’ అనే వాక్యం కదులుతుంది.

రసజ్ఞ తెలుగు అమ్మాయి!

* * * * * *

గోతవింద్‌ ‌బుద్ధ, రిత్విక్‌ ఎదురెదురుగా వున్నారు.

‘‘పాస్‌పోర్ట్ ‌వచ్చిందని హారిక చెప్పింది సర్‌’’ అన్నాడు.

‘‘అచ్ఛా… నేను అది మీ ఇంటి నుంచి తెప్పించే ఏర్పాట్లు చూస్తాను రిత్విక్‌’’ అన్నాడు.

అయిదు నిమిషాల తర్వాత ‘‘ఇప్పుడు నీకో దురదృష్టవంతుడయిన ఓ తండ్రి కథ చెప్పబోతు న్నాను’’ అనగానే అది ఎవరై వుంటారా అని కుతూహలం కలిగింది రిత్విక్‌కి. అప్పుడు ఆయన చెప్పటం మొదలుపెట్టాడు.

‘‘మనం ముంబయ్‌ ‌వెళ్తున్నప్పుడు ఓ ఆర్టిస్ట్ ‌కలిసాడు గుర్తుంది కదా….’’

‘‘ఇంత త్వరగా ఎలా మరిచి పోతాను సర్‌’’.

‘‘ఒకప్పుడు నాకు కూడా సినిమా అంటే ఇష్టం. నేను ఆ రంగంలో పని చేయాలనుకున్నాను. అప్పట్లో నేను కొన్ని కథలు రాసుకున్నాను. ఇప్పటికీ అవి నా దగ్గరున్నాయి’’.

అప్పుడు ఆశ్చర్యం కలిగింది.

‘‘మీరు హీరో కావాలను కున్నారా?’’

‘‘అఫ్‌కోర్స్… ‌నాలో నటన వుంది. అయితే ముందు నేను నిర్మాతని కావాలను కున్నాను. నా ఆలోచనలను ఇతరుల మీద రుద్దటం కాదు. నేను చేసే ఏ పని అయినా లాభనష్టాలు నాకు చెందాలి. కనీసం నా వల్ల ఇంకొకరు నష్టపోకూడదు. ముందు నా మీద ఇంకొకరి ఒత్తిడి వుండకూడదు. సినిమా అంటే వంద మంది వంద రకాల సలహాలు ఇస్తారు. ఇవన్నీ నాకు తెలుసు. అందుకే ముందు ఓ సినిమా తీయటానికి సరిపోయేంత డబ్బులు సంపాదించాలి అనుకున్నాను. ఇంకో విషయం… నేను పత్రిక పెట్టినప్పుడు నాతో ముగ్గురు మిత్రు లున్నారు. మేమందరం ఎవరే పనులు చేయాలో ముందుగా అనుకున్నాం. అయితే….’’ అని ఆగి కొద్ది సేపు ఆలోచనల్లోకి జారిపోయాడు.

తర్వాత మళ్లీ కొనసాగించాడు.

‘‘హైదరాబాద్‌లో పత్రిక మొదలుపెట్టాం. కొద్ది సంవత్సరాల అనుభవంలో నాకు కొన్ని విషయాలు అర్థం అయ్యాయి. ప్రతి ఒక్కరికీ కొన్ని ఆలోచనలు వుంటాయి. వారికంటూ విజన్‌ ‌వుంటుంది. ఎవరికి వారు తమ ఆలోచనే సరయింది అనుకుంటారు. నేనూ అంతే….

సినిమాగాని, పుస్తకంగాని, ఇంకో ప్రొడక్టు గాని జనంలోకి వెళ్లాక గాని అసలు ఫలితం తెలియదు. అప్పటి దాకా అది ప్రయోగమే. ఈలోగా చిన్న చిన్న ఇగోస్‌ ‌మొదలు అవుతాయి. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇది మనందరికీ చిన్నది. అందరం పూర్తి కాలం పని చేసినా మనకు వచ్చేది తక్కువ. కొంతకాలం మనం నష్టాలను భరించాలి… అని అంటున్నప్పుడు ఓ ఫ్రెండ్‌ ‌మధ్యలో అన్నాడు.

‘‘ఇవన్నీ మనం ముందే అనుకున్నాం’’.

‘‘అక్కడికే వస్తున్నా. కథల ఎన్నిక వేరు. ఓ సీరియల్‌ ‌ప్రచురించాలి అనుకున్నప్పుడు మన నలుగురు ఏకాభిప్రాయానికి రావాలి. ముందు మనం రెండు మూడునెలలు చూద్దాం అంటున్నారు ఒకరిద్దరు. అప్పటికీ పుంజుకోకపోతే అది ఆపటం నాకు ఇష్టం వుండదు. అలాగే  ఏ రచయితల్నీ మన పత్రికకు మీ రచన కావాలని అడగటం నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడూ పోస్ట్ ‌మీద ఆధారపడతాను అన్నాను’’.

అప్పుడు ముగ్గురూ నన్ను చిత్రంగా చూసారు.

ఒకతను మాత్రం అన్నాడు…

‘‘ఇది వ్యాపార లక్షణం కాదు గోవింద్‌’’.

‘‘అవును. మనం ఈ రోజున పేరున్న వారితో రాయించుకోకపోతే మన పత్రికను ఎవరు కొంటారు? మనది ఇంకా చిన్న పత్రిక. అవసరమైతే మిగతా వారి కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్‌ ‌యిచ్చి రాయించుకుంటాం’’ అన్నాడు ఇంకో మిత్రుడు.

About Author

By editor

Twitter
YOUTUBE