– నామని సుజనాదేవి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘‘చిన్నా! మరొక్కసారి ఆ నంబర్‌తో ట్రాక్‌ ‌చేస్తావా నాన్నా! చాలా పెద్దపెద్దవి, అన్ని రకాలు ఒళ్లో పెట్టడానికి జాగ్రత్తగా తయారుచేసి పంపాను నాన్నా! నేను ఇక్కడ కొరియర్‌ని అడిగితే•, చేరింది అంటున్నారు నాన్నా’’

‘‘వస్తే చెప్తా కదా! అయినా కొరియర్‌ ‌పంపాక వెంటనే ఆ ట్రాకింగ్‌ ‌నంబర్‌ ‌పంపలేదు. సరే! ఇప్పుడు పంపావుగా.. ఇప్పుడు మరోసారి వెళ్లి చూస్తాలే!’’

 * * * * *

‘‘ఏమయ్యింది నాన్నా! చేరాయా?’’

‘‘ఆ! చేరాయి. ఏవీ అక్కరకు రాకుండా బూజుపట్టి, అన్నీ విరిగిపోయి. నువ్వు నమ్మవని ఇదిగో ఇప్పుడే ఫొటో కూడా పెట్టాను’’

‘‘అయ్యో! ఏమంటున్నావురా? ఎంత జాగ్రత్తగా ఎంత పెద్దపెద్దవి చేసాను. అదే కొరియర్‌ ‌ద్వారా ఎన్నోసార్లు పంపాను కదా! అప్పుడు బాగానే ఉన్నా యిగా! మరి ఇప్పుడు ఇలా ఎందుకయ్యాయి? అస్సలు కొంచెం కూడా పనికిరాకుండా ఉన్నాయా?’’

‘‘వీడియో కాల్‌లో చూపించమంటావా? మా అత్తమ్మా వాళ్లు ప్రతీ ఒక్క ఐటం జాగ్రత్తగా, శ్రద్ధగా విడివిడిగా పాక్‌ ‌చేసి పంపారు. అవి ఉన్నాయిలే !’’

‘‘అవునా? పోనీలే! శ్రీమంతానికి అవయినా ఆదుకున్నాయి. మరి నేను పంపిన చీర అందిందా?’’

‘‘ఆ! అందింది’’

‘‘ఆ రోజు కనీసం ఆ చీర అయినా కట్టుకోమను. నేను పంపిన చీర క•ట్టుకుని, మీ అత్తగారు పెట్టిన చీర ఒళ్లో పెట్టించుకుని, కట్టుకున్నాక దానిలో ఫలహారాలు పెట్టించుకో’’

‘‘ఎలా కట్టుకుంటుంది అమ్మా? నాకు బట్టలు పంపలేదుగా! నాకు లేకుండా తను ఒక్కతే కట్టుకుని కూర్చుంటుందా?’’

 వాడి మాటలకు హతాశురాలినైనాను.

‘‘అది… నేను ఇక్కడ తీసుకుంటే, నీకు సరిపోక పోతే ఇబ్బంది అవుతుంది కదాని, ఇది ఆడవారి ఫంక్షన్‌ ‌కదా, నీకు… నిన్నడిగి అమెరికాలో నీ దగ్గరకు వచ్చినపుడు తీసుకుంటే బావుంటుంది అనుకు న్నారా!’’

‘‘సరేలే! నన్నడిగితే నేను నంబర్‌ ‌చెప్పేవాడిని కదా! మా అత్తమ్మా వాళ్లు పంపించారులే! ఈ ఫంక్షన్‌ ఈరోజు జరుగుతుంది అని ఎప్పటి నుండో చెబు తున్నా. వాళ్లు చాలా రోజుల నుండే ప్లాన్‌ ‌చేసుకుని, శ్రద్ధతో, ప్రత్యేకంగా అన్నీ ముందుగానే షాపింగ్‌ ‌చేసుకుని పంపారు. సరే అదంతా వదిలేయి. రేపు పది గంటలకు ఇక్కడ ఫంక్షన్‌ ‌మొదలవుతుంది. అక్కా బావ ద్వారా లింక్‌ ‌పంపుతాను. అందులో జాయిన్‌ అయి చూడండి’’

‘‘ఒళ్లో పెట్టాక అవి తీయకముందే ఎవరైనా జాగ్రత్తగా పట్టుకుని, దేవుడి దగ్గర ముందు దండం పెట్టుకోవాలి’’

‘‘అమ్మా! చాదస్తం చేయకు. ఇది మేముండే అపార్ట్‌మెంట్‌. ‌కింద హాల్లో ఈ ఫంక్షన్‌ ‌జరుగుతుంది. అక్కడినుండి ఇంట్లోకి కిలోమీటర్‌ ‌దూరం ఉంటుంది. కాబట్టి అది కుదరదు’’

‘‘సరే నాన్నా’’ అతి కష్టంపై గొంతులో నా ఏడుపు వినపడకుండా జాగ్రత్త పడ్డాను. గొంతులో పలక కుండా జాగ్రత్తపడ్డా, కాని మదిలో వేదన సుళ్లు తిరుగుతోంది.

‘అమ్మా! అన్నంలోకి కూర లేదని నా దగ్గర చెప్పడానికి ఎందుకు బాధ పడుతున్నావు? నీ చేతితో పచ్చడి మెతుకులు తిన్నా పరమాన్నమేనమ్మా!’ అంటూ, అనుకోకుండా బయట నుండి వచ్చి, ‘ఆకలి’ అన్నప్పుడు నేను బాధపడుతుంటే ఓదార్చిన ‘చిన్నా’ నేనా ఈ మాటలంటూన్నది.

‘అమ్మా! ఎక్కడికైనా నడిచీ, నడిచీ ఈ వయస్సులో ఎంతో కష్టపడుతున్నావు. ఇక ఇప్పటి నుండి నువ్వు ఈ వెహికిల్‌ ‌మీద వెళ్లు’ అంటూ, రోడ్డుకు దూరంగా ఉన్న కాలనీ నుండి, ప్రతీ అవసరా నికి ఆయన లేనప్పుడు, ప్రతీవారం గుడికి పరుగు పరుగున వెళ్లే నన్ను చూసి, నా కష్టం చూడలేక నాకు వాహనం నడిపే శిక్షణ ఇచ్చి, నేను సెకండ్‌ ‌హాండ్‌ ‌వాహనమో, చిన్నపాటి స్కూటీనో కొనుక్కుంటా నని అన్నా వినకుండా వాడే పెళ్లిరోజు కానుకగా బైక్‌ ‌కొనిచ్చిన నా కడుపున పుట్టిన కొడుకేనా ఇలా మాట్లాడుతున్నది?

‘ఎప్పుడూ ఏదో అవసరం అని ఇప్పటివరకు ఎన్నిసార్లు అడిగినా కనీసం గాజులు కూడా చేయించ లేదు’ అంటూ శ్రీవారితో అన్న మాటలు విని, వాడికి డబ్బు ఆవశ్యకత ఎంత ఉన్నా, నా పుట్టినరోజుకు బహుమతిగా నాకిష్టమైన సింహం మూతి బంగారు కడియాలు చేయించిన నా బంగారం చిన్నానేనా ఇన్ని మాటలు అన్నది? ఈ విషయం జీర్ణించుకోవడానికి, ఆ బాధ నుండి బయటపడడానికి చాలా సమయమే పట్టింది.

వద్దన్నా ఉబికుబికి వస్తున్నాయి కన్నీళ్లు. కడుపులోకి ముద్ద దిగడం లేదు. కంటి మీదకు కునుకు రావడంలేదు. అతిథ•లకు మర్యాదలు పాటించినట్లు నా కడుపున పుట్టినవారికి కూడా పాటించాల్సి వస్తుందా? ఎందుకు పెళ్ళికాగానే కన్నవారికి, కన్నబిడ్డలకు మధ్య ఇంతగా దూరం పెరిగిపోతుంది? నా కలలన్నీ కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోతున్నాయి.

 ఇది ఒకరు తీర్చగలిగే బాధ కాదు. కేవలం వాడు ఒక్కమాట, ‘ట్రాన్స్‌పోర్ట్‌లో అలా జరిగితే ఎవరం ఏం చేస్తాం? దాంట్లో నీ తప్పేం ఉంది? బాధ పడకమ్మా… అవి పాడయినా నీ దీవెనలు, ఆశీస్సులు మాపై ఉన్నాయి కదా! అది చాలదా?’ అంటే బావుండేదేమో?

‘‘ఏంటి? ఇంకా దాని గురించే బాధపడు తున్నావా?’’

‘‘బాధపడక, మీరు చేసిన పనికి ఎంత వేదన పడుతున్నానో చూశారా? మీకు ఏమీ తెలియదు. మీ బిజీలో అన్నీ లైట్గానే తీసుకుంటారు. నేను ఎప్పటి నుండో మిమ్మల్ని అడుగుతున్నా. అమెరికాలో జరిగే శ్రీమంతం కదా! కొంచెం ముందే అన్నీ పంపాలని. మీరు విన్నారా? ‘పిచ్చిదానా! ఇప్పుడు అమెరికా హైదరాబాద్‌లా అయిపొయింది. మరీ ముందు పంపితే ఫలహారాలు తాజాగా ఉండవు. అయినా మనబ్బాయికి మనం బట్టలు ఇక్కడ నుండి పంపడమేంటి? వాడికి సైజు ఎక్కువ, తక్కువ అయితే వేలుపోసి కొన్నవన్నీ దండగ. మనం పాప పుట్టగానే అక్కడికి వెళతాం కదా, అప్పుడు ఇద్దాంలే, నువ్వు టెన్షన్‌ ‌పడకు’ అన్నారు. చివరికి మాటపడ్డది నేను’’ ఏడుస్తూనే గయ్యిమని లేచాను శ్రీవారి మీదకు.

‘‘ఇది మరీ బావుంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఇదెక్కడి చోద్యం? ఆ ట్రాన్స్‌పోర్ట్ ‌వాడిని కొప్పడ్డా. వాడు, ‘పెద్దపెద్దవి కావడం వల్ల అలా జరిగిందేమో’ అన్నాడు! వాడు చేసిన తప్పుకు మనం ఎలా బాధ్యులమవుతాం. అయినా మన గాడిద అర్థం చేసుకోవాలిగా!’’

ఎంత ఓదార్చినా నేను పడ్డ బాధ వర్ణనాతీతం. వాడి ప్రతీమాట నా గుండెల్లో గునపాల్లా గుచ్చు కున్నది. అంటే, నేను పట్టించుకోలేదని, వారిపై ప్రత్యేక శ్రద్ధతీసుకోలేదని (ప్రయారిటీ), ఒక్కరికే బట్టలు పంపి, వాడికి పంపలేదని వాడు అన్నమాటలు నా మనసును ముక్కలు చేసాయి. అందరూ పెళ్లయ్యాక మగపిల్లలు మారతారు అంటే నేను, ‘నా కొడుకు మాత్రం అలా ఎన్నటికీ కాడు’ అంటూ ఛాలెంజ్‌ ‌చేసింది. కాని ఇప్పుడు శతకోటి బోడి కోతుల్లో ఒకడిగా, నా కొడుకు కూడా చేరబోతు న్నాడా? అంటే ఇంతకాలం నేను నా కొడుకుపై పెట్టుకున్న నమ్మకం, నా గర్వం పటాపంచలు కానున్నాయా?

కూతురు కళ్యాణి, అల్లుడు రవితేజ కూడా అమెరికాలో వీడికి ఒకరోజు ప్రయాణదూరంలో ఉంటారు. వెంటనే కళ్యాణికి ఫోన్‌ ‌చేసాను.

‘‘అమ్మలూ! ఇక్కడ కొరియర్లో ఫలహారాలు పంపితే, అక్కడికి చేరేసరికి విరిగిపోయాయట. బాధనిపించిందిరా. కొంచెం శ్రమ అనుకోకుండా ఎలాగయినా ఒడిలో పెట్టడానికి బయట కొంటావో, నువ్వు చేస్తావో కాని కనీసం ఒక్కోటి ఐదు వచ్చేలా, ఐదు రకాలు చేసి శ్రీమంతం రోజు తీసుకెళ్లవే’’

‘‘ఐదురకాలంటే చాలాకష్టం అమ్మా! ఎంతోపని ఉంటుంది. రేపు మేము బయలుదేరాల్సిందే! ఇంత హడావిడిగా కావు. అయినా నువ్వేం బాధ పడకు. నేను మంచి పెద్దపెద్ద బహుమతులు కొన్నాలే’’

‘‘అయ్యో! మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకుండా ఎలాగైనా వీలుచేసుకుని, కొంచెం చేసి తీసుకెళ్లవే’’

‘‘సరేలేమ్మా! నువ్వేం బాధపడకు. నేను ఎలాగూ రెండురకాలు చేశా, మిగతావి అరేంజ్‌ ‌చేస్తాలే. ఆఫీస్‌ ‌టైం అవుతుంది, ఉంటాను’’ అంటూ పెట్టేసింది. కొంచెం భారం తగ్గింది.

 * * * * *

 నిజంగా కాలమెంత అద్భుతమైనది. మనసు గాయాలని మాన్పడంలో కాలానికి మించిన వైద్యుడు మరొకరు ఉండరు, అన్నది నిరూపిస్తూ కాలం కరిగి నాకు మనవరాలు పుట్టింది. నాకు అమెరికా వెళ్లాలని లేకపోయినా, కోడలి తల్లికి ఆరోగ్యం బాలేకపోవ డంతో, కోడలికి ఈ సమయంలోనైనా సహాయం చేయకపోతే, మళ్లీ రేపు కొడుకు ఎప్పుడైనా ఈ విషయంపై నా బాధ్యత నిర్వహించలేదని అంటాడని భయపడి ప్రయాణానికి సిద్ధం అయ్యాను.

మనవరాలికి పేరు కోసం శ్రీవారు, నేను కల్సి పుస్తకాలు తిరగేస్తూ తెగ కసరత్తు చేసాము.

‘‘నార్మల్‌ ‌డెలివరీ అయితే అమ్మవారి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నా కదా! ‘త్రైలోక్య’ పేరు బావుంది కదా! మూడులోకాల అమ్మవారు. నేనయితే ఈ పేరు నిర్ణయిస్తున్నా’’ అన్నాను శ్రీవారితో మంచిపేరు దొరికిన సంతోషంతో.

‘‘మన ఇలవేల్పు, నాపేరు, మానాన్న పేరు శివుడి పేర్లే కదా! అయినా శివుడిలోనే అర్థనారీశ్వర రూపంలో అమ్మవారు కూడా ఉందికదా! అందుకే శివుడి పేరు మీద ఉన్న పేర్లే పెట్టాలి. లేదంటే నేను ఒప్పుకోను’’ శ్రీవారి పంతం.

 అయితే అప్పుడు మాకు తెలియదు, మేమిద్దరం ఊహించని సంఘటన జరగబోతుందని.

తెల్లవారి చిన్నా ఫోన్‌ ‌చేసి మాట్లాడుతూ, ‘‘ప్రవ్యకి కొంచెం జాండీస్‌ ‌వస్తే ఇంక్యుబేటర్‌ ‌లో పెట్టారు’’ అన్నాడు.

‘‘ప్రవ్య ఎవరు?’’ మా ఇద్దరి నోట్లలో నుండి ఒకేసారి వచ్చింది.

‘‘ఇంకెవరమ్మా? నాబిడ్డ’’ అన్నాడు వాడు.

‘‘ఆ!’’ ఇద్దరం నోర్లు తెరిచాం.

 ‘‘అదేంటి! పేరు పెట్టేసావా? కనీసం ఒక్కమాట కూడా చెప్పలేదు. మేము ఎంతో కష్టపడి మంచిపేర్లు ఎంపికచేసి పెట్టాము. నువ్వింత పని చేస్తావను కోలేదు’’

‘‘అబ్బా! అమ్మా వదిలేయ్‌! ఇక్కడ పాపపేరుతోనే అన్నీ రిజిస్టర్‌ అవుతాయి. వీసా, కార్డ్ అన్నీ ఆ పేరుతోనే వస్తాయి. కాబట్టి పెట్టాల్సి వచ్చింది’’

‘‘సరే!’’ అంటూ నీరసంగా పెట్టేసాను. ఎదురుగా మేము రాసిన పేర్లున్న డైరీ వెక్కిరిస్తూ కనబడింది. నిజంగానే పెళ్లయ్యాక ప్రతిబిడ్డకు తల్లితండ్రులు మూడో వ్యక్తులే (థర్డ్ ‌పర్సన్స్) అవుతారు. వారికి వీరు, వీరికివారు ఇంట్లోని అతిథులే అవుతారని పించింది.

 * * * * *

ముందు చిన్నా దగ్గరకు వెళతాము, తర్వాత అందరం కలుద్దాం అని కళ్యాణి, తేజలను విమానాశ్రయానికి రావద్దన్నాను.

వాడికి డ్రెస్సులు, కోడలికి చీరలు, మనవరాలికి గౌనులు, బంగారుగొలుసు, కొన్ని ఫలహారాలు అన్నీ ముందుగానే ప్లాన్‌తో, ప్రత్యేక శ్రద్ధతో అన్నీ పాక్‌ ‌చేయించుకున్నాను. ఏవీ వాడికి చెప్పలేదు. రెండు విమానాలు ఎక్కి, దిగి అమెరికా చేరుకున్నాము. విమానాశ్రయానికి వచ్చేవాడిని చూడడానికి కళ్లు ఆత్ర పడ్డాయి. మనసు వేగిరపడింది. అక్కున చేర్చుకుని కన్నీరవ్వడానికి మది ఉవ్విళ్లూరింది. అవును మరి! ఇంతకుముందు వాడు కేవలం నాకు కొడుకు అంతే! కాని ఇప్పుడు వాడూ మరో బిడ్డకు తండ్రి.

 ఫోన్లో టచ్‌లో ఉన్నవాడు రాగానే సుడిగాలిలా నన్ను చుట్టేసాడు. నాలుగేళ్లుగా చూడని, నా రెండుకళ్లు నా మాట వినక సమ్మెచేసి, గంగా గోదారులను రెండుకళ్లల్లో సాక్షాత్కరింపజేసాయి.

వాడి కళ్లూ సజలాలయ్యాయి. ఈలోగా కళ్యాణి వాళ్లు కూడా ఫోన్‌ ‌చేయడంతో మావారు ఇద్దరినీ దగ్గరకు తీసుకుని ముందుకు నడిపించారు.

‘‘ఇక్కడే అమ్మా ఫంక్షన్‌ ‌జరిగింది. ఇక్కడి నుండి మన ఇంటికి దూరం కాబట్టి నువ్వు చెప్పినట్లు దేవుడి పటం ఇక్కడికి తెచ్చి ఇక్కడే దండం పెట్టించాను’’ ఇంటికి వెళుతుంటే కింది హాలు చూపించాడు.

వాడన్నది నిజమే! చాలాదూరం. 9 నెలల నిండు చూలాలు నడవలేదు.

‘‘చిట్టితల్లి పేరేంటిరా? నోరు తిరగదు’’

‘‘ప్రవ్య. అంటే ఒక అర్థం శివుడు, నాన్న పేరు. మరో అర్థం చాలా తెలివైనది అంటే నీలాగా. అందుకే ఆ పేరు పెట్టా’’ అపార్థం చేసుకున్నందుకు కళ్లు సజలాలయ్యాయి.

మనవరాలిని చూడగానే ముద్దుల్లో ముంచేసాను. కోడల్ని అక్కున చేర్చుకున్నాను. స్నానపానాదులై, మాటాముచ్చట తీరి కాస్త స్థిమితపడ్డాక, మనసాగక బ్యాగులు ఓపెన్‌ ‌చేసి నేను తెచ్చినవి వాడి ముందు ఉంచాను.

‘‘చిన్నా! ఈ సారి శ్రద్ధగా, ప్లాన్‌గా, నిర్లక్ష్యం చేయకుండా అన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చారా!’’ పదాలు నాకు తెలియకుండానే ఒత్తిపలికినట్లు అయ్యాయేమో! వాడు చటుక్కున నావైపు చూసాడు.

‘‘అమ్మా! ఆరోజు నేను మాట్లాడిన మాటలు నిన్ను బాధించాయి కదా! నాకు తెలుసు. కాని నేను అప్పుడు చాలా టెన్షన్‌ ‌లో ఉన్నాను. ఒక్కడిని, ఖర్చు ఎక్కువ కావడం వల్ల రెండుజాబ్‌లు చూసుకోవాలి. మీటింగ్స్ అటెండ్‌ ‌కావాలి. వారంవారం ఈమెను చెకప్‌కి డాక్టర్‌ ‌దగ్గరకు తీసుకెళ్లాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే, నువ్వు ప్రేమతో పంపిన లడ్డూలు, ఫలహా రాలు అన్నీ విరిగిపోతే చాలా బాధ•నిపించింది. నాకు నువ్వు సెంటిమెంట్‌ అమ్మా! పరీక్షల్లో పాసయినా, ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్‌ ‌వచ్చినా ఏదైనా నువ్వు చెప్పినట్లుగా ముందు దేవుడికి చెప్పాక నీకే చెబుతాను. నీచేతి నుండి స్వీట్‌ ‌తిన్నాకే ఏదైనా! అది నా కూతురుకు కూడా అందాలని ఎంతో ఆశపడ్డా! అందుకే నువ్వు శ్రద్ధగా, జాగ్రత్తగా పాక్‌ ‌చేయలేదని కోపం వచ్చింది.

పైగా అప్పుడు ఫంక్షన్‌ ‌రెండు రోజుల్లోకి వచ్చింది. ఆ ఏర్పాట్లు చూసుకోవాలి. అన్ని టెన్షన్స్ ఉన్నాయి. అందులో ఆ చిరాకు నీపై చూపించా నేమో? బాధ పడ్డావామ్మా? మాకు ఇవ్వేమీ అక్కర లేదు. కేవలం నీచేయి నాతలపై ఉంచి చేసే దీవెనలు చాలమ్మా? నువ్వే చెప్పావుగా, ఇంతకు ముందు ఒకసారి, నువ్వు నన్ను కోప్పడితే నేను అలిగినప్పుడు, ఏమన్నావో గుర్తుందామ్మా? ‘అరేయ్‌! ‌నేను కోప్పడితే ఇంకా అలా అన్నం తినక అలుగుతావా? ఎప్పుడైనా అత్మీయులపైనే కోపం వెళ్లగక్కుతాం. దారిన పోయే దానయ్యపై కోపం వ్యక్త పరుస్తామా? అంటే ఎవరు కోపంగా నీపై అరుస్తారో వారు నీ ఆత్మీయులన్న మాట. వారికి నీపై ఆ అధికారం, ప్రేమ ఉందన్న మాట’ అన్నావు కదా! మరి నేను అయినా నీ కొడుకునే కదా! నా కోపం నీమీద తీర్చుకున్నానంటే నీకు ఆత్మీయుడననే కదా!’’

నాకు ఎక్కడో చదివిన కథ గుర్తొచ్చింది.

ఒక పక్షి తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా ఒక చెట్టు మీద ఉన్న మరో పక్షిని అడుగుతుంది. ఆ పక్షి, ‘నేను ఆశ్రయం ఇవ్వను. పొమ్మంటుంది’ అది ఆ పక్కనే ఉన్న మరో చెట్టుపైనున్న పక్షిని అడిగితే అది ఆశ్రయం ఇస్తుంది. ఇంతలో విపరీతమైన వర్షాలు వచ్చి మొదట ఆశ్రయం ఇవ్వని పక్షి చెట్టు, గూడు కూలి వరదల్లో కొట్టుకు పోతుంటూంది.

అది చూసి ఆశ్రయం అడిగిన పక్షి, ‘నీకు మంచి శాస్తి జరిగింది. నాకు ఆశ్రయం ఇవ్వమంటే ఇవ్వనన్నావు. పరోపకారం చేయకపోతే ఇలాంటి దుర్గతే పడుతుంది’ అంటుంది అక్కసుగా. దానికా పక్షి, ‘మిత్రమా! నాకు ఈ విషయం ముందే తెలుసు. వర్షానికి, జడివానకు నా చెట్టు నాకే ఆశ్రయం ఇవ్వలేదని. కాని నీకు ఆశ్రయం ఇస్తే, నీగతీ నాలాగే అయి నీ బ్రతుకు కడతెరుతుందని తెలుసు. అందుకే ఆశ్రయం ఇవ్వలేదు. నువ్వు నేను ఆశ్రయం ఇవ్వకపోతే, పక్కచెట్టులో ఆశ్రయం పొందుతావని అది చాలా దృఢమైన చెట్టు కాబట్టి నీ జీవితం నిలబడుతుందని తెలిసే అలా చేసాను మిత్రమా! సెలవు’’ అంటూ కనుమరుగయిపోతుంది.

అంటే ఎప్పుడైనా మన కనులు కూడా మనల్ని మోసం చేయవచ్చు. ఎదుటి వారి మనసు పసిగట్టడంలో మన మనసు మనల్ని మోసం చేయవచ్చు. అందుకే ఎవరిలోనైనా మంచినే చూడు. మనమూహించని మంచి ఆ తిరస్కారంలోనో, ఆ కోపంలోనో ఉండవచ్చు, అన్న అద్బుతమైన నీతికథ అది.

నేను చెప్పిన పాఠం నాకే చెబుతున్న నాకొడుకు నా ముందు, ‘ఇంతింతై వటుడింతై…’ అన్నట్లు కనబడి నీళ్లు నిండిన నాకళ్లక మసగ్గా కనబడుతుంటే, ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాను. దేవుడి గదికి ఉన్న చిరుగంటలు గాలికి మృదుమధురంగా మోగాయి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram