శ్రీ ‌శివాజీ వీరచరిత్ర గ్రంథకర్త డా।। కోటంరాజు చంద్రశేఖరరావ్‌. ‌వీరు సంస్కృత భాషా బోధకులు, సంస్కారవంతులు. శివాజీపై వీరికున్న విశేష భక్తి ప్రపత్తులు, ‘శివభారతం’ (గడియారం వేంకటశేష శాస్త్రి కావ్యం) చదివిన స్ఫూర్తి, ఓగేటి అచ్యుతరామ శాస్త్రి ఉపన్యాసాల ప్రభావం వెరసి ఈ బృహత్‌ ‌గ్రంథం – ‘శ్రీ శివాజీ వీరచరిత్ర’ నిర్మాణం జరిగినట్లు వారి మాటల్లో తెలుస్తుంది.

తెలుగులో లోగడ శివాజీ జీవిత చరిత్ర పుస్తకాలు, చారిత్రక నవలలూ, అనువాద గ్రంథాలు వెలువడ్డాయి – అయితే ఇంత బృహత్‌ ‌గ్రంథం తెలుగువారి చేతుల్లోకి తెలుగు భాషలో రావడం ఇదే ప్రథమం.

1695లో కృష్ణాజి అనంత్‌ ‌సభాసద్‌, 1810‌లో చిట్నీస్‌ ‌బఖర్‌ ‌వ్రాసిన మరాఠీ గ్రంథాలను, ఎన్‌.ఎస్‌.‌టకాఖల్‌ ‌వ్రాసిన”The life of Shivaji Maharaj” వంటి ప్రసిద్ధ పుస్తకాలను పరిశీలించి రాసిన గ్రంథమిది. అంతేకానీ దేనికీ ఇది అనువాదం కాదన్నారు రచయిత.

ఈ గ్రంథంలో 33 అధ్యాయాలున్నాయి. ఓ చక్కటి భావ గర్భితమైన సంస్కృత శ్లోకం – తాత్పర్యం ప్రతీ అధ్యాయానికి మొదటా, చివరా ఇవ్వటం విశేషం. సందర్భోచితంగా ఇచ్చిన ఈ 66 శ్లోకాలు వ్యక్తిత్వ వికాస పాఠాలు.

వీర శిఖామణికి వ్యాస విరచితమైన దుర్గాసప్తశతి ఆధారంగా ఇచ్చిన వీరహారతితో ఈ ‘వీరరస’ గ్రంథానికి నాంది పలికారు రచయిత.

శివాజీ పుట్టిన తేదీపై ఉన్న వివాదాలకు తెరదించుతూ ఓ తిథిని 19.2.1630గా ధృవీకరించారు.

ఇందుకు ఆధారంగా శివాజీ సమకాలీకులైన జ్యోతిష్య శాస్త్రవేత్తల చేతి వ్రాతలను ఉటంకించారు. జాతక చక్రం – రాశి ఫలితాలను విపులంగా ఇచ్చారు రచయిత. పాఠకులచే ఆసక్తికరంగా చదివించే జాతక వివరాలు అవి. ఆ తరువాత ఓ మూడు పేజీలలో దేశ విదేశీ ప్రముఖులు శివాజీని ప్రస్తుతించిన ఆంగ్ల వాక్యాలను సేకరించి ఇచ్చారు. ఆ పిదప అగ్నిధార ఖండకావ్యంలో మహాకవి దాశరథి వ్రాసిన హృద్యమైన పద్యాలను అందించారు. పాఠఖులచే మళ్లీ మళ్లీ చదివిస్తాయి ఈ పద్యాలు.

‘పూర్వీకులు’ అనే పేరిట మొదలైన తొలి అధ్యాయంలో దాదాపు 50 పేజీలలో భోంస్లేల ఆవిర్భావ గాథ – వంశవృక్షం – ఖిల్జీల కుటిలత – గోరాసింగ్‌ ఉదారత-రాణి పద్మిని జోత వర్ణించిన తీరు హృదయాలను తాకింది. అక్కడే హిందీ మహాకవి పండిత్‌ ‌నరేంద్ర మిశ్రా రాసిన కవిత్వాన్ని మూడున్నర పేజీలలో పరుగెత్తించారు. ‘‘జిస్‌ ‌కే కారణ్‌ ‌మిట్టి భీ చందన్‌ ‌హై రాజస్థానీ’’ అంటూ కథ చెప్పి, కన్నీరు పెట్టించారు. రాజపుత్ర స్త్రీలకు ‘జోహార్‌’ ‌చెప్పారు రచయిత.

పరిశోధకులకు పనికి వచ్చే ఎన్నో గ్రంథాలలోని అంశాలను రచయిత ఓ చోట చేర్చటం ఈ గ్రంథంలోని అన్ని అధ్యాయాలలోనూ కనిపిస్తుంది.

1921లో ప్రచురితమైన ‘భారత్‌ ఇతిహాస సంశోధక మండలి’ వాసుదేవ్‌శాస్త్రి ఖరేలు అందించిన వివరాలు, అవసరమైనచోట పేర్కొన్నారు. శివాజీ తండ్రి షహజీ బాల్యాన్ని, జీజాబాయితో ఆమె వివాహ గాథను సహితం రచయిత సేకరించి అందించటం ఆసక్తిదాయకం. 1630లో శివాజీ జన్మించకముందే తండ్రి షహజీ తుకాబాయ్‌ని వివాహం చేసుకోవటంతో ప్రథమ అధ్యాయం పూర్తి చేసారు రచయిత. రెండవ అధ్యాయంలో పండరిపుర భక్తి ఉద్యమం (1271-1640) వివరించారు. ఓ 10 పేజీలలో జ్ఞానదేవుని ఆవిర్భావం. ఆయన యాత్రా విశేషాలు, ఆయన ప్రసాదించిన సాహిత్యం, భగవద్భక్తితో ప్రజల హృదయాలను గెలిచినవారు చూసిన మహత్యాలను వివరంగా ఇచ్చారు. జ్ఞానదేవుని ఈ మహిమలు ఆశ్చర్యంగా చదువుతారు.

ప్రధాన ఘట్టమైన శివాజీ జననం 3 అధ్యాయంలో 12వ పేజీలలో వర్ణించిన తీరు అద్బుతం. ఇక్కడే పారవశ్యంతో పాఠకులకు బహుమతిగా దాదాపు 18 ‘శివభారత’ పద్యాలను ఇచ్చారు. ఆ తర్వాత శివాజీ విద్యాభ్యాసం, దీక్షాధారణులు తల్లి జిజాబాయి కుమారుని వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దినదో వివరించారు. రామాయణ, భారత, భాగవత కథల ఆధారంగా బాల శివాజీలో గురుభక్తి, స్త్రీల పట్ల పూజ్యభావన, బ్రాహ్మణభక్తి, ఇంద్రియ నిగ్రహం సత్య సౌశీల్యాలను తల్లి ఎలా బోధించినదో అందించారు రచయిత. ఇది, తల్లిదండ్రులందరికీ స్ఫూర్తినిచ్చే ఘట్టం.

తల్లితోపాటు దాదాజీ కొండదేవ, తండ్రి షహజీల నుంచి శివాజీ ఎలా యుద్ధ విద్యలలో ఆరితేరినదీ చదువవచ్చు.

ఐదవ అధ్యాయమైన ‘సర్వాజ్య స్థాపనకు పునాది’లో శివాజీ దిన దిన ప్రవర్థమానుడైన ఘట్టాలను, గిరిసీమల్లో పెరుగుతూ, అక్కడి నివాసులతో స్నేహం చేస్తూ – తన అనుచరులను, తనకై ప్రాణాలైనా అర్పించే ‘మావళీ’లను ఎలా తయారు చేసుకొని, కథను కొనసాగించారు.

రాజ్యవిస్తరణ తరువాత, శివాజీ రాజ్య అభివృద్ధిపై దృష్టిపెట్టడం – భక్త తుకారాం, సమర్థ రామదాసుల సాంగత్య విశేషాలు 8,9,10 అధ్యాయాలలో ఆసక్తిగా చదివిస్తాయి.

అన్ని అధ్యాయాలు ఒక ఎత్తు అయితే 13వ అధ్యాయం ఒక ఎత్తు – దాదాపు 36 పేజీలలో సాగిన వీరశివాజీ – అఫ్జల్‌ ‌ఖాన్‌ని వధించిన ‘వీరగాథ’ చాలా హృద్యంగా రచయిత వర్ణించారు. రచయితకు స్ఫూర్తిదాయకులైన ‘ఓగేటి’వారు ఈ కథను కళ్ళకు కనిపించినట్లు చెప్పేవారని ప్రసిద్ధి. కోటంరాజు కూడా ఈ ఘట్టాన్ని అలాగే వర్ణించారు. ఈ సంఘటన గురించి రిచెర్డ్ ‌టెంపుల్‌ అనే చారిత్రక వేత్త అన్నట్లుగా ‘‘అఫ్జల్‌ఖాన్‌ ‌వధ అనేది మహమ్మదీయ దురాక్రమణదారులపై హిందూ జాతీయవాదం కొట్టిన తొలి దెబ్బగా ఎప్పటికీ గుర్తిండిపోతుంది’’- శివాజీ అనే వీరసింహం విసిరిన ‘పంజాదెబ్బ’ తర్వాత శివాజీ పేరు మారు మ్రోగిపోయింది. ఈ వీరచరిత్ర, మరాఠీల వీరత్వం 14వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకూ వర్ణించిన తీరు పాఠకులను రోమాంచితులను గావిస్తుంది. ఆ తర్వాత అధ్యాయాలలో శివాజీకున్న ప్రత్యేక యుద్ధరీతు లను, యుద్ధనీతులను ఉటంకించారు రచయిత. తగ్గవలసినచోట తగ్గటం, విజృంభించాల్సిన చోట విజృంభించటం, రహస్య ఒప్పందాలు, అవసరమైతే సంధి ప్రస్తావనలు – ఇది శివాజీ తీరు. ఆ శక్తి యుక్తులతోనే ‘సింహఘడ్‌’ ‌కోటను చేజిక్కించుకొన్నాడు వీరశివాజీ.

1674వ సంవత్సరంలో జరిగిన శివాజీ పట్టాభిషేక విశేషాలు 26వ అధ్యాయంలో 30 పేజీలలో కొనసాగింది. ‘‘రాష్ట్రాయ స్వాహా…ఇదం నమమ’’ అని భావించే వ్యక్తి ఛత్రపతి శివాజీ ఎందుకు అయ్యాడో, పట్టాభిషేకానికి ఎందుకు అంగీకరించాడో దానికి భవానీమాత ఆశీస్సులు ఎలా లభించిందీ, కాశీ పండితుడైన గాగాభట్టు ప్రేరణ విశేషాలు ఆసక్తి కలిగించాయి.

ఈ సందర్భంలోనే శివాజీ జీవితం మీద కుట్రతో చేసిన చరిత్ర వక్రీకరణలను, ఆంగ్లేయుల ‘కుతంత్రాల’ను వేదనతో, ఆవేశంతో రచయిత వర్ణించారు. ‘‘ఆంగ్లేయులు, నెహ్రూ ఇస్లామిక్‌ ‌కాంగ్రెస్‌ ‌పెంచి పోషించిన దగుల్జాబీ చరిత్రకారుడు జాదూనాథ్‌ ‌సర్కార్‌’’‌ని నానా చివాట్లు పెట్టారు. ఆ దగుల్బాజీ చేసిన కుట్రలను ఆధారాలతో వివరించారు. ‘‘సర్కార్‌ ‌లాంటి నీచులను భారతీయ విద్యారంగంలో ప్రవేశపెట్టిన’’ నెహ్రూని మోహమాటం లేకుండా విమర్శించారు రచయిత. క్రోధంతో, కసితో కొందరు కుహనా చరిత్రకారులు చేసిన నిందలకు శివాజీపై ప్రచారంలో ఉన్న కువిమర్శకులకు ధీటుగా జవాబు చెప్పారు రచయిత.

శివాజీ పాలనా విధానం సర్వకాలాలకు, సర్వరాజ్యాలకు, నాయకులైన వారందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. శివబా మహారాజు నివసించే రాయ్‌ఘడ్‌లో తన ప్రభుత్వాన్ని 18 శాఖలుగా విభజించి, ఎలా కార్యనిర్వహణ గావించారో- విరేక్‌ ‌సభల వంటివి, ఎలా ప్రజాసేవకై అంకితమయ్యాయో వివరించారు. శివాజీ పరిపాలనా యంత్రాంగంలోని మెలకువలు అష్ట ప్రధాన వ్యవస్థ 27వ అధ్యాయంలో వివరింగా చూడవచ్చు.

తండ్రికే చేటు చేయటానికి సిద్ధమైన శంభాజీ దుర్వర్తన, హిందువులపై కపటోపాయంతో వ్యవహరించి, దేవాలయాలను ధ్వంసం చేయించిన ఔరంగజేబు దౌష్ట్యగాథలు – పాఠకులచే కన్నీరు పెట్టిస్తాయి. మతమార్పిడికి కుట్రలు, మన పండుగలపై నిషేధం, నదీస్నానా లపై సహితం పన్ను, ఉదయపూర్‌ ‌చుట్టు ప్రక్కల వున్న 172 దేవాలయాలను కూల్చివేసిన విషాద గాథలు గుండెలు పిండేలా చేస్తాయి.

మొగల్‌ ‌ప్రభుత్వంపై ‘సర్జికల్‌ ‌స్ట్రయిక్‌’ ‌చేసి ధనరాశిని దారి మళ్లించి, శివాజీ చాకచక్య గాథలో మొదలుపెట్టిన 32వ అధ్యాయంలో శివాజీ అస్వస్థత – ఆత్మీయులకు వీడ్కోలు మత్యుదేవత ముందుకొచ్చిన వేళ శివాజీలో నెలకొన్న మనఃస్థైర్యం ప్రశాంతతకు మూలం అతని ఆధ్యాత్మికతే అని విశ్వసించారు రచయిత. ‘‘పురాణపురుషులైన రాజర్షుల అడుగుజాడనే శివాజీ అనుసరించడమే దీనికి కారణం అంటారు రచయిత. రామనామం జపిస్తూ, మృత్యుదేవత వడిలో ఒదిగిన శివాజీ నిష్క్రమణ – ఆ తర్వాత జరిగిన అంత్యేష్టి విషయాలు, వివరించిన రచయిత శివాజీ మిగిల్చిన సంపదల జాబితాను ఆసక్తికరంగా వివరించారు. గ్రంథంలోని చివరి అధ్యాయంలో శివాజీ గుణశీలాలను వర్ణించారు.

కోటంరాజు చంద్రశేఖరరావ్‌ 5 ‌సంవత్సరాల తపః ఫలం ఈ చరిత్ర గ్రంథం. అనేక గ్రంథాలను పరిశీలించి రాసిన ‘శివాజీ చరిత్ర’; దానితోపాటు ‘ఆడక ఆడునట్టి గడియారము వోలె కైత వ్రాసే’ గడియారం వేంకట శేషశాస్త్రి శివభారతం; ప్రతీ అధ్యాయంలో ఆద్యాంతాలలో పరిశోధించి సందర్భానుసారంగా కూర్చిన సుభాషితమాల- భావసహితం – వెరసి శ్రీ శివాజీ వీరచరిత్ర పుస్తకాన్ని త్రిమూర్తి, త్రిమాతా స్వరూపంగా తయారు చేసారు కోటంరాజు. బహుభాషా శాస్త్ర కోవిదులైన వారు మాత్రమే ఇటువంటి బృహత్‌ ‌పరిశ్రమ చేయగలరు. హిందూ స్వాభిమానాన్ని, పౌరుషాన్ని తట్టిలేపే జాగృత గీతం ఈ గ్రంథం. పరిశోధకులకు అరచేతి ఉసిరికాయ. ఛత్రపతి చరిత్రను వక్రీకరించిన జాదూగాళ్లపై ఝుళిపించిన కొరడా! మహమ్మదీయ ఉక్కు సంకెళ్ళనుంచి హిందూ సమాజాన్ని విముక్తం చేసిన సింహ వీర పరాక్రముని చరిత్ర పఠనం – పాఠనాలు చారిత్రకావసరం. రచయిత కోటంరాజు చంద్రశేఖర్‌రావ్‌ ‌తెలుగు పాఠకులకు ఇచ్చిన కానుక ఈ శ్రీ శివాజీ వీరచరిత్ర. చదవండి! చదివించండి!

శ్రీ శివాజీ వీరచరిత్ర

రచన : శ్రీ కోటంరాజు చంద్రశేఖరరావ్‌

‌ప్రతులకు : సాహిత్యనికేతన్‌, ‌బర్కత్‌పురా

పుటలు: 24+678 = 702

వెల: రూ.600/-

 

సమీక్ష : బి.ఎస్. శర్మ, 9246101884

About Author

By editor

Twitter
YOUTUBE