– సుజాత గోపగోని, 6302164068

తెలంగాణ.. దశాబ్దం క్రితం దాకా ఓ కల. ఓ ఆశయం. ఓ ఉద్యమం. కానీ, ఇప్పుడదో నెరవేరిన సాకారం. ఓ ప్రత్యేక రాష్ట్రం. ఓ స్థానిక స్వయంపాలనా కేంద్రం. దాదాపు ఆరు దశాబ్దాల ఉద్యమాలు, పోరాటాలకు ఫుల్‌స్టాప్‌ ‌పడింది. భారతదేశ చిత్రపటంలో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ వచ్చి చేరింది. తెలంగాణ ఆశయమే పరమావధిగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (ఇప్పుడు బీఆర్‌ఎస్‌) ‌తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీఠంపై విజయ దరహాసాన్ని చూపించింది. ఇలా.. ఈ పరిణామాల మీదుగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే దశాబ్దం గడిచింది.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనకీర్తిని చాటిచెప్పేలా, చరిత్రను, ఉద్యమ ఆకాంక్షలను స్ఫురణకు తెచ్చేలా అంగరంగ వైభవంగా నిర్వహించా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేసింది.

రూ. 105 కోట్ల నిధులు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం ఆయా జిల్లాలకు 105 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధులను ఖర్చు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు అధికారికంగా నిర్వహించేలా కార్యాచరణను రూపొందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్‌ ‌రెండో తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. రెండో తేదీన దశాబ్ది ఉత్సవాలు మొదలయ్యాయి. మరుసటి రోజు నుంచి 22వ తేదీ వరకు రోజుకు ఒక రంగం చొప్పున.. ఆయా రంగాలకు చెందిన ప్రగతిని వివరించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.

జూన్‌ 3‌వ తేదీని తెలంగాణ రైతు దినోత్సవంగా, జూన్‌ 4‌వ తేదీని సురక్షా దినోత్సవంగా, జూన్‌ 5 – ‌తెలంగాణ విద్యుత్‌ ‌విజయోత్సవంగా, జూన్‌ 6 – ‌తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహిస్తు న్నారు. అలాగే, జూన్‌ 7‌వ తేదీన సాగునీటి దినోత్సవం, 8వ తేదీన ఊరూరా చెరువుల పండుగ, 9వ తేదీన తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10- తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11- తెలంగాణ సాహిత్య దినోత్సవం, 12- తెలంగాణ రన్‌, 13- ‌తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం, 14 – తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం, 15 – తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం, 16 – తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం, 17-తెలంగాణ గిరిజనోత్సవం, 18వ తేదీన తెలంగాణ మంచి నీళ్ల పండుగ, 19వ తేదీన తెలంగాణ హరితోత్సవం, 20వ తేదీన తెలంగాణ విద్యాదినోత్సవం, 21వ తేదీన తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవంగా జరుపు కుంటున్నారు. వేడుకల చివరిరోజు జూన్‌ 22‌న అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ట్యాంక్‌బండ్‌పై కళాకారులతో భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని కేసీఆర్‌ ఆవిష్క రిస్తారు. అదే రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే సభలో పాల్గొంటారు.

లక్ష్యం నెరవేరిందా?

తెలంగాణ ఆవిర్భావం, దశాబ్ది ఉత్సవాలను ఈ స్థాయిలో నిర్వహించుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. స్వరాష్ట్ర సాధన విజయోత్సవాలను మరిచి పోలేని స్థాయిలో జరుపుకోవడం అంటే రాష్ట్రాన్ని గౌరవించుకున్నట్లే. కానీ, ఈ పదేళ్లలో సాగిన పాలన తీరు, నెలకొన్న పరిణామాలను బేరీజు వేసుకోవడం కూడా అవసరమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటికి రెండు సార్లు ఎన్నికలు జరిగితే రెండూ సార్లూ టీఆర్‌ఎస్‌ ‌విజయం సాధించింది. ప్రజాస్వామ్యయుతంగా మెజార్టీ స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పాలన సాగిస్తోంది. అయితే, ప్రభుత్వాన్ని నడిపేం దుకు అవసరమైన మెజార్టీ ఉన్నా, అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌మాత్రం తెలంగాణ ఆవిర్భావం నుంచీ తనదైన మైండ్‌సెట్‌తో ముందుకెళ్తున్నారు. అవసరం లేకున్నా.. విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తన పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని ఉధృతంగా సాగించారు. నయానో, భయానో.. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించి ప్రజా ప్రతినిధులను ఆకర్షించారు. ఒకరకంగా తెలంగా ణలో ప్రతిపక్షం అనేది లేకుండా చూడాలన్న తనదైన ఆలోచనతో అడుగులు వేశారు. ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు. తనను ఎదిరించే వాళ్లు, తనను ప్రశ్నించే వాళ్లు, తనను నిలదీసేవాళ్లు లేకుండా చూడాలన్నది కేసీఆర్‌ ఆలోచన అనేది ఆయన వ్యవహారశైలిని గమనిస్తే అర్థమవుతుందంటున్నారు విశ్లేషకులు.

ఇక, ప్రభుత్వంలో చూస్తే.. కేబినెట్‌ ‌బాధ్యత సమష్టిగా మంత్రివర్గానిదే అయినా, కేసీఆర్‌ ఒకే ఒక్కడుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనడంలో సందేహం లేదు. తనకు ఎదురులేని విధంగా పార్టీని, ప్రభుత్వాన్ని అదుపాజ్ఞల్లో పెట్టుకుంటున్నారు. ఒకరకంగా ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగిస్తు న్నారు. ఫలితంగా కేసీఆర్‌ ‌చెప్పిందే వేదం, ఆయన తీసుకున్నదే నిర్ణయం అన్న మాదిరిగా తెలంగాణ సర్కారు పాలన సాగుతోంది. దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి నెలకొంది.

తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగిసి పడింది. వందల మంది విద్యార్థులు, యువకులు, ఉద్యమకారులు ప్రాణత్యాగం చేశారు. తమ త్యాగంతో అయినా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించా లని మరణ వాంగ్మూలాలు ఇచ్చారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత అమరులను గుర్తించిన, వారి కుటుంబాలను ఆదరించిన తీరు వివాదాస్పద మయ్యింది. అసలు తెలంగాణ కల నెరవేరడానికి, కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి కారణమైన అమరుల విషయంలోనూ ఎన్ని విమర్శలు వచ్చినా, కనీసం ఆ నిర్ణయాన్ని సమీక్షించే ఆలోచన కూడా ప్రభుత్వం చేయలేదు. తెలంగాణ కోసం వెయ్యి మందికి పైగా అమరులయ్యారని ఉద్యమ సమయంలో వాదించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ల సంఖ్యను 459 మందికి కుదించింది. అమరుల కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ సాయం అందించే నెపంతో అమరుల సంఖ్యను తగ్గించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యింది. అయినా కేసీఆర్‌ ‌సర్కారు డోంట్‌కేర్‌ అన్నట్లుగా వ్యవహరించింది.

తెలంగాణ కోసమే ఆవిర్భవించామని, తెలంగాణ అభివృద్దే ఏకైక లక్ష్యమంటూ చెప్పుకున్న టీఆర్‌ఎస్‌ ఈ ‌దశాబ్ద కాలంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. తీసుకుంటూనే ఉంది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది ఆక్షేపించినా, తన వైఖరిని మాత్రం కేసీఆర్‌ ‌మార్చుకోవడం లేదన్నది అనేక సందర్భాల్లో స్పష్టమవుతోంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచీ పార్టీనే నమ్ముకున్న ఉద్యమ కారులను కేసీఆర్‌ ‌పక్కన పెట్టేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇతర పార్టీల నేతలకు గాలం వేసి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ ద్రోహులుగా ముద్రపడ్డ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ పరిణామాలతో చాలా మంది ఉద్యమ నేతలు టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు దూరమయ్యారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్‌ ‌తనదైన ఆలోచనలు అమలు చేస్తున్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను దశాబ్ద కాలంలోపే ముఖ్య మంత్రి కేసీఆర్‌ అం‌డ్‌ ‌కో నీరుగార్చి, అమరవీరుల బలిదానాలను అవమానపరుస్తూనే ఉన్నారని విపక్షాలు, సామాజిక సంస్థలు తరచూ కేసీఆర్‌పై విమర్శల వర్షాలు కురిపిస్తూనే ఉన్నాయి. క్యాబినెట్‌ ‌నిండా తెలంగాణ వ్యతిరేకులను నియమించుకొని, ప్రభుత్వ సలహాదారులుగా కూడా తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులను నియమించుకొని, సీమాంధ్ర పెట్టుబడి దారి శక్తులతో లాలూచీ పడి వనరులన్నీ తెలంగాణ వ్యతిరేకులకు ధారపోస్తూ, తెలంగాణ కాంట్రాక్టులన్నీ సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కమీషన్లకు అప్పజెప్పారన్న విమర్శలు జోరుగా వస్తున్నాయి. తెలంగాణ నిధులను ఇలా ఇతరులకు దోచిపెడుతూ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.

ఇక, నీళ్ల విషయానికి వస్తే.. తెలంగాణ నీళ్లను అటు ఆంధ్రకు ఇటు మహారాష్ట్రకు అప్పజెప్పిన కేసీఆర్‌.. ‌దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీళ్ల పండుగ చేసుకుందామని చెప్పడం హాస్యాస్పదమన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగా, ప్రకృతి సిద్ధంగా పారుతున్న నదులకు ఎగువన ప్రాజెక్టులు కట్టకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దాదాపు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇక నియామకాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదంటున్నారు యువకులు, నిరుద్యోగులు. తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచీ మన నియామకాలు మనకే అని కలలు గన్న యువత.. చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. అయినా నోటిఫికేషన్ల జాడ లేదు. వచ్చిన అరకొర నోటిఫికేషన్లు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌నిర్వహించిన ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడం.. దాదాపు 50 మంది దాకా అరెస్ట్ అవడం టీఎస్‌పీఎస్సీ లోపాలకు, నిర్వహణ తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏండ్లు, నెలల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయి నిజాయితీగా పరీక్షలు రాసిన అభ్యర్థులు.. తమ వ్యయప్రయాసలన్నీ వృథా అయ్యాయని మథన పడుతున్నారు. మళ్లీ నోటిఫి కేషన్లు ఎప్పుడిస్తారో అని ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణే ఊపిరిగా, తెలంగాణే ఏకైక లక్ష్యంగా, తెలంగాణే ఆశయంగా పార్టీని స్థాపించానన్న కేసీఆర్‌.. ఆ ‌పార్టీని కూడా చరిత్రపుటల్లోకి నెట్టేశారు. తెలంగాణ తప్ప..  రెండో ఆలోచన లేదని ఇన్నాళ్లు చెప్పిన కేసీఆర్‌.. ‌తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని కనుమరుగు చేశారు. తమ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. జాతీయ రాజకీయాల పేరుతో.. ఇన్నాళ్లు పాడిన తెలంగాణ సెంటిమెంట్‌కు ఒకరకంగా తన పార్టీ తరఫున పాతరేశారు.

ఈ తరుణంలో తెలంగాణ పేరుతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించే అర్హత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి లేదని విపక్షాలు వాదిస్తున్నాయి. తెలంగాణ పేరుతో, తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకు, తెలంగాణ ప్రజలకు ఏం ఒనగూర్చారని వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram