నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసినీ

త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యాదానంచ దేహిమే!

దేశ విభజన జరిగిన మరుక్షణం పాకిస్తాన్‌ ‌వైపు నుంచి కశ్మీర్‌ ‌మీద ‘గిరిజనుల దాడి’ జరిగింది. నిజానికి అది భారత్‌-‌పాక్‌ల మధ్య జరిగిన మొదటి యుద్ధంలో తొలి అడుగు. ముస్లింల కోసం దేశం అన్న మతోన్మాద నినాదంతో ఏర్పడిన పాకిస్తాన్‌ ‌చేసిన ఆ దొంగ దాడి లక్ష్యం కశ్మీర్‌లోని హిందూ సాంస్కృతిక మూలాలు కూడా. ఆ ఉన్మాదంలో నేలమట్టమైన వైజ్ఞానిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రం శారదాపీఠం.75 ఏళ్ల తరువాత ఆక్రమిత కశ్మీర్‌లోని, కుప్వారా జిల్లా, తీత్వాల్‌ ‌గ్రామంలో కొత్త రూపంలో ఆ పీఠాన్ని ఈ ఉగాదికి పునఃప్రతిష్టిం చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వర్చువల్‌ ‌విధానంతో ఆ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ పరిణామం భారతదేశంలో, ప్రధానంగా కశ్మీర్‌ ‌లోయలో జరుగుతున్న సాంస్కృతిక పునరుజ్జీవ నోద్యమంలో మైలురాయి. అయోధ్యలో కొత్త రామాలయం నిర్మాణం ఎంతటి అద్భుతమో, శారదాపీఠం పునఃప్రతిష్ట కూడా అంతే అద్భుతం. అంతే ప్రాధాన్యం కలిగినది కూడా.

 ఒకనాడు హిందూధర్మానికీ, శాస్త్రజ్ఞానానికీ, సాహిత్యానికీ ఆటపట్టుగా ఉన్న కశ్మీర్‌ ‌దేశ విభజనకు ఎంతో ముందే ముస్లిం మతోన్మాదం అడ్డూ అదుపూ లేకుండా చేసిన దాడులలో వందల గాయాల పాలైంది. ఈ మొత్తం పరిణామాల ఫలితాలలో ఒకటి- చరిత్ర ప్రసిద్ధమైన శారదాపీఠం నేలమట్టం కావడం. ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం శారదా పీఠంతో పాటు, ఈ పీఠమే కేంద్ర బిందువుగా తక్షశిల, నలందాల కంటే ముందే ఆవిర్భవించిన విశ్వవిద్యాలయాల అవశేషాలు కూడా మతోన్మా దానికి బలయ్యాయి.

అది కేవలం ఆలయమే కాదు, ఆలయం కేంద్ర బిందువుగా విస్తరించిన అలనాటి విశ్వవిద్యాలయం. క్రీస్తుపూర్వం 273 ప్రాంతంలో ఆవిర్భవించిన ఈ ఆలయం, ఆ విశ్వవిద్యాలయం తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల కంటే పురాతనమైనవి. శారదా పీఠంలోని విశ్వవిదాలయం కంటే ముందే క్రీస్తు పూర్వం 237లో ఆలయం వెలసింది. ఆ విశ్వవిద్యా లయంలో ఆ కాలంలో చదువు కోసం వచ్చి ఉండే విద్యార్థుల సంఖ్య 5000. పై శ్లోకం ఆ అమ్మవారి ప్రార్ధనే.

పురాతన సాహిత్యంలో, విదేశీయుల రచనలలో శారదాపీఠానికి సంబంధించిన ఆధారాలు మెరుపుల మరకల వలె అగుపిస్తాయి. సామాన్యశకం 14వ శతాబ్దానికి చెందిన ‘మాధవీయ శంకర విజయం’ ఈ పుణ్యస్థలిని ‘సర్వజ్ఞ పీఠం’ అని కొనియాడింది. స్థానిక పండితులని తర్కంలో ఓడించి ఈ పీఠంలోని సమున్నత ఆసనాన్ని శంకర భగవత్పాదులు అధిరోహించారని గాథలు చెబుతున్నాయి. సాక్షాత్తు అమ్మవారే ప్రశ్న వేసి, అందుకు శంకరులు చెప్పిన సమాధానికి సంతృప్తి చెంది లోపలికి అనుమతించిం దని చెబుతారు.

కొత్తగా నిర్మించిన తరువాత శారదాపీఠం ఆలయంలో ఏడున్నర దశాబ్దాలకు ఇప్పుడు దీపం వెలిగింది. ఆక్రమిత కశ్మీర్‌లోనే అధీనరేఖకు సమీపం లోనే తీత్వల్‌ ‌గ్రామంలో ఇది కట్టారు. శృంగేరి శారదాపీఠం బహూకరించిన అమ్మవారి అద్భుత ప్రతిమను ప్రతిష్టించారు. ఈ ఆలయాన్ని ఉగాది పర్వదినాన (మార్చి 22) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విధానంతో ప్రారంభించారు. కర్తార్‌పూర్‌ ‌కారిడార్‌ ‌పద్ధతిలోనే శారదాపీఠం సందర్శనానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా అమిత్‌షా అన్నారు. ఆర్టికల్‌ 370 ‌రద్దు తరువాత కశ్మీర్‌లోయ తనదైన సాంస్కృతిక వారసత్వంలోకి పునఃప్రవేశిస్తున్నదని చెప్పారు. కశ్మీర్‌ ‌వైభవాన్ని, ప్రత్యేకతను చాటే 123 దివ్య స్థలాల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో 35 చోట్ల పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ. 65 కోట్లతో ఈ పనులు చేపట్టారు. ఇంతవరకు జమ్ము కశ్మీర్‌లోని ఆలయాలు, సూఫీ ప్రార్ధనా మందిరాలలో 75 కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ కశ్మీర్‌ ‌వాస్తవ సంస్కృతిని గుర్తు చేయడానికేనని అమిత్‌షా చెప్పారు.

కొన్ని ఆంగ్ల దినపత్రికలు తప్ప తెలుగు పత్రికలు ఏవీ ఈ వార్తను పట్టించుకోలేదు. నిజానికి అయోధ్య తరువాత ఈ పరిణామం చెప్పుకోదగినదే. పాత శారదా పీఠం వాస్తు ప్రకారమే ఆలయాన్ని నిర్మించారు. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌లో హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడం అసాధారణమే.

నిజానికి ఇంత ప్రయాస అవసరమా? శత్రు దేశం అధీనంలో ఉన్న ప్రాంతంలోని ఆలయం కోసం ఇంత తపన ఎందుకు? దీనికి రక్షణ ఏమిటి? వీటికి సమాధానం కశ్మీరీల నాగరికత మూలాలలో ఉంది. మిగిలి ఉన్న హిందువుల గుండె చప్పుళ్లలలో వినిపిస్తుంది. డెబ్బయ్‌ ఏళ్లుగా ఆ ఆలయాన్ని కశ్మీరీలు చూడలేదు. అందులో 30 ఏళ్లు చాలామంది పండిత్‌లు కశ్మీర్‌లోనే లేరు. వారిని తరిమివేశారు. అయినా వారు అక్కడి ఆలయాల పునరుద్ధరణకు ఆరాటపడుతున్నారంటేనే సాంస్కృతిక, మత మూలాల పట్ల వారికి ఉన్న ఆర్తి ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆలయంతో కశ్మీరీలకు ఎన్నో ఆధ్యాత్మిక ప్రాధాన్యాలు, మరెన్నో సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. ఈ ఆలయంతో వారిది విడదీయలేని బంధం. శారద, సరస్వతి, వాగ్దేవి అనే మూడు జ్ఞానదీపాలను ఆ దేవతలో వారు దర్శించుకుంటారు. చదువు, జ్ఞానం, వాగ్భూషణం ఆ తల్లి ప్రసాదాలేనని వారి ప్రగాఢ విశ్వాసం. భారతీయ లాక్షణిక గ్రంథాలన్నీ కశ్మీర్‌లోనే పుట్టాయి. ప్రతి రచయిత మొదట తన గ్రంథాన్ని అమ్మవారికి సమర్పించిన తరువాతే బయట ప్రపంచం అందుబాటు లోకి ఉంచేవారు. తమ గ్రంథాలను బయటి ప్రపంచానికి పరిచయం చేయడానికి అమ్మవారి అనుమతి అవసరమని నమ్మారు వారు.

కొత్త పీఠం ప్రతిష్టించిన క్రమం, పాత పీఠం ఆనవాళ్లను ఒక్కసారి అవలోకిద్దాం. భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక పీఠం కేంద్ర బిందువుగా వెలసిన విశ్వవిద్యాలయాలు కొన్ని ఉండేవి. అందులో శారదా పీఠం ఒకటి. ఈ పీఠానికి ఉన్న ప్రత్యేకతలలో ఒకటి- ఉత్తర భారతదేశంలో వ్యాప్తి చెందిన శారదా లిపి జన్మస్థానం ఇదే. ఆ లిపిని శారదా లిపి అనే పిలిచేవారు. దీనికి ఉన్న వ్యాప్తిని బట్టి కశ్మీరాన్ని ఆనాడు శారదాదేశం అని కూడా గౌరవించుకునే వారు. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శివుడు సతీదేవి అమ్మవారి భౌతికకాయంతో విలయ తాండవం చేశాడని ప్రతీతి. ఫలితంగా ఆమె అవయ వాలు పలుచోట్ల పడినాయి. అవే శక్తి పీఠాలు. అమ్మవారి కుడిచేయి పడినన చోటే శారదా పీఠం ఆవిర్భవించిందని భక్తుల నమ్మకం. అమ్మవారి కుడిచేయి పడిన చోటుగా ప్రసిద్ధమైన ఆ ప్రదేశంలోనే విస్తృత ప్రాధాన్యం సంతరించుకున్న లిపి ఆవిర్భ వించడం విశేషమే మరి. మార్తాండ దేవాలయం, అమర్‌ ‌నాథ్‌ ‌గుహాలయం, శారదా పీఠం ఒకనాడు కశ్మీరీ హిందువులతో పాటు, దేశంలోని హిందువులందరికీ దర్శనీయ స్థలాలుగా ఉండేవి. ఈ పీఠం ముజఫరాబాద్‌ (‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌పరిపాలనా కేంద్రం)కు 93 మైళ్ల దూరంలోనే ఉంది. శ్రీనగర్‌కు మాత్రం 81 మైళ్లు. కానీ పది కిలోమీటర్ల దూరంలోనే భారత్‌-‌పాక్‌ను విభజించే అధీన రేఖ ఉంది.

 అసలు శారదా పీఠం వెలసిన శారది గ్రామం నీలమ్‌ ‌నది ఒడ్డున ఉంది. నీలమ్‌ ‌నది మధుమతి, సర్గున్‌ ‌నదులతో ఇక్కడే సంగమిస్తుంది. నిజానికి నీలమ్‌ అసలు పేరు కిషన్‌గంగ. నీలమ్‌ ‌పేరును బట్టే అక్కడి లోయకు నీలమ్‌ ‌లోయ పేరు వచ్చింది. హాముఖ్‌ ‌పర్వత పాదాల వద్ద నీలమ్‌ ‌లోయ ఉంది. శివుడి ఆవాసమే హాముఖ్‌ ‌పర్వతమని కశ్మీరీ పండిత్‌లు నమ్ముతారు. అక్కడే ఉన్న శారది లేదా శార్ది అనే చిన్న గ్రామంలోనే మొద• శారదాపీఠం ఆవిర్భవించింది. శతాబ్దాల నాటి కశ్మీరీల కులదేవత శారద ఆలయాన్ని 1947లో పాకిస్తాన్‌ ‌సైనికులు ధ్వంసం చేశారు. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ఏర్పడడం, అక్కడికి హిందువులు అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ చరిత్రాత్మక ఆధ్యాత్మిక, జ్ఞాన నిలయం ధ్వంసమైపోయింది. ఇదొక్కటే కాదు, మార్తాండ ఆలయం సహ లోయలోని గొప్ప గొప్ప ఆలయాలన్నీ నేలమట్టం చేశారు. భారత సాంస్కృతిక సంబంధాల మండలి జమ్ముకశ్మీర్‌ ‌మాజీ సంచాలకులు ప్రొఫెసర్‌ అయాజ్‌ ‌రసూల్‌ ‌నజ్కి ఏడు దశాబ్దాల తరువాత శారదిలో అడుగు పెట్టిన తొలి కశ్మీరీ. ఈయన 2007లో అక్కడికి వెళ్లివచ్చిన తరువాతే కశ్మీరీలకు ప్రవేశం కల్పించాలన్న డిమాండ్‌లో కదలిక వచ్చింది. ‘ఆ ప్రాంగణం చాలా విశాలమైనది. కానీ పూర్తిగా శిథిలమైపోయింది. అయినా స్థానికులు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని శారదా మాయి లేదా శారదా విశ్వవిద్యాలయం అనే పిలుస్తు న్నారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని వారు శారదా పీఠం గ్రంథాలయానికి వస్తే వారి అన్వేషణ ఫలిస్తుం దన్న కీర్తి ఉంది’ అని చెప్పారు నజ్కీ. శంకరాచార్యకు, అభినవగుప్తునకు మధ్య సంవాదం ఈ ఆలయంలోనే జరిగిందని కూడా నజ్కీ తెలియ చేశారు. ‘ఆ విశ్వ విద్యాలయంలో విజ్ఞాన శాస్త్రం, మతం, తత్త్వశాస్త్రాలు బోధించేవారు.’ అని కూడా ఆయన చెప్పారు.

సరస్వతి అమ్మవారిని కశ్మీరీలు శారదామాతగా కొలుస్తారు. ఇది శాక్తేయానికి అంకితం చేసిన తొలి పీఠంగా ఖ్యాతి వహించింది. వైష్ణోదేవి, ఖీర్‌భవానీ ఆలయాలు ఆ తరువాత శాక్తేయ పీఠాలుగా అవతరించాయి. సామాన్యశకం 6-12 మధ్య దీనిని నిర్మించారని చరిత్రకారుల అంచనా. లలితాదిత్య ముక్తపీడ (సామాన్యశకం 724-760) ఈ ఆలయ, విశ్వవిద్యాలయ నిర్మాణాలను ప్రారంభించి ఉండ వచ్చునన్న అభిప్రాయం ఉంది. విదేశీ యాత్రికుడు అల్‌ ‌బెరూనీ రచనలలో ఈ ఆలయం, అక్కడి విశ్వవిద్యాలయం, దాని బృహత్‌ ‌గ్రంథాలయ ప్రస్తావన కనిపిస్తుంది. తాను విన్నదానిని బట్టి అక్కడ అమ్మవారి దారుశిల్పం ప్రతిష్టించి ఉందని కూడా ఆ యాత్రికుడు నమోదు చేశాడు. తాను విన్నప్పటికే ఆ ఆలయం ఆసియాలోనే ప్రముఖమైనదిగా ప్రశస్తి కలిగి ఉండేదని రాసుకున్నాడు. ముల్తాన్‌ (‌నేటి పాకిస్తాన్‌)‌లోని సూర్య దేవాలయం, స్థానేశ్వర్‌ (‌హరియాణా)లోని మహాదేవ ఆలయం, సోమనాథ్‌ (‌గుజరాత్‌) ‌దేవాలయం ఎంత ప్రఖ్యాతమో శారదా పీఠం కూడా అంతే ప్రసిద్ధి గాంచిందని ఆయన అభిప్రాయపడ్డాడు. సామాన్యశకం ఎనిమిదో శతాబ్దానికే ఈ పీఠానికి వంగ ప్రాంతం నుంచి భక్తులు వచ్చేవారు. కశ్మీర్‌ను పాలించిన సుల్తాన్‌ ‌జైనులుద్దీన్‌ అబిదిన్‌ ‌సామాన్యశకం 1422లో ఈ ఆలయాన్ని దర్శించాడని ‘ద్వితీయ రాజతరంగిణి’ రచయిత జొనరాజ్‌ (‌కల్హణ రాజతరంగిణికి కొనసాగింపు) రాశాడు. 16వ శతాబ్దంలో అక్బర్‌ ‌కొలువులో పనిచేసిన అబ్దుల్‌ ‌ఫాజి ఇబిన్‌ ‌ముబారక్‌ ‌కూడా ఇక్కడికి వచ్చాడు. అక్కడ భవ్యమైన రాతి దేవాలయం ఉందని ఇతడు రాశాడు. ఈ ఇద్దరు కూడా అమ్మవారికి మహిమలు ఉన్నాయని విశ్వసించినట్టు కథలు ఉన్నాయి. సామాన్యశకం 6-8 శతాబ్దాల మధ్య కాలంలో వెలువడినదిగా నమ్ముతున్న ‘నీలమాతా పురాణం’లో కూడా శారదాపీఠం ప్రస్తావన ఉంది. సామాన్యశకం 11వ శతాబ్దం నాటి కవి బిల్హణుడు ఈ ఆలయ ఆధ్యాత్మిక సంపద, విద్యాకేంద్రంగా ఉన్న పాముఖ్యాల గురించి వివరించాడు. అమ్మవారి ప్రతిమ శిల్ప సౌందర్యం గురించి కూడా వర్ణించాడు. 12వ శతాబ్దానికి చెందిన రాజతరంగిణి రచయిత కల్హణుడు కూడా ఈ పీఠం ఔన్నత్యం గురించి వివరించాడు.

ముస్లిం పాలనలోనే శారదా పీఠానికి చీకటి రోజులు ఆరంభమయ్యాయి. అక్బర్‌ ‌కాలంలో, అఫ్గాన్‌ల కాలంలో బొంబా తెగవారు నీలమ్‌ ‌లోయను పాలించేవారు. భక్తుల రాక అప్పటి నుంచే తగ్గు ముఖం పట్టింది. కానీ మహారాజా (డోగ్రా వంశీకుడు) గులాబ్‌సింగ్‌ ఆలయానికి మరమ్మతులు చేయించి, ఆలయ వంశ పారంపర్య అర్చకులు గౌతెంగ్‌ ‌బ్రాహ్మణులకు వేతనాలు ఇచ్చి నియమించాడు.

 దేశ విభజన తరువాత పూర్తిగా చెడురోజులు దాపురించాయి. 1947 నాటి పరిస్థితులను బట్టి స్వామి నందలాల్‌జీ అనే ఆధ్యాత్మికవేత్త కొన్ని రాతి విగ్రహాలను కుప్వారాలోని టిక్కెర్‌ అనే ప్రాంతానికి తీసుకువచ్చాడు. వీటిలో కొన్ని తరువాత బారాముల్లా లోని దేవీబాల్‌కు తరలివెళ్లాయి. ఇక 1947-48 నాటి భారత్‌ ‌పాకిస్తాన్‌ ‌యుద్ధంతో పీఠం చెల్లాచెదు రైంది. అప్పటి నుంచి కశ్మీరీలకు ఆ అమ్మవారి దర్శన భాగ్యం కలగలేదు. ప్రత్యామ్నాయంగా శ్రీనగర్‌, ‌బండిపోరాలలోని ఆలయాలను దర్శించే వారు. ఆ యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య పూజనీయ స్థలాల దర్శనం కోసం ఉద్దేశించిన పర్యాటకం పరిధిలో జరిగిన కరాచీ ఒప్పందంలోను శారదాపీఠం సందర్శనకు పాకిస్తాన్‌ అనుమతి ఇవ్వలేదు. తరువాత అమలు చేసిన పర్యాటక నిబంధనలు కూడా హిందువులను పూర్తిగా నిరుత్సాహపరిచాయి. ఒకవేళ అనివార్యంగా దర్శించుకోదలచిన భారతీయులు అనుమతిపత్రాలు తీసుకోవలసి ఉంటుంది. 2007లో కొందరు కశ్మీరీ పండిత్‌లు ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లినప్పుడు కూడా ఆ పీఠం చూడడానికి అనుమతి ఇవ్వలేదు. 2009లో మాత్రం శాంతి, సంఘర్షణ అధ్యయన సంస్థ ఆధ్యాత్మిక స్థలాలకు ఉద్దేశించిన పర్యాటకం కోసం సిఫారసు చేసింది. అదైనా కశ్మీరీ పండిత్‌ల బృందం ఒకటి శారదాపీఠం చూడడానికి వెళితే, అందుకు బదులుగా కొందరు పాకిస్తాన్‌ ‌ముస్లింలతో కూడిన బృందం శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్‌ ‌మసీదును చూడడానికి వచ్చింది. తరువాత నుంచి కూడా దేశాల మధ్య ఈ పీఠం కోసం పర్యాటకులను అనుమ తించాలని పలువురు భారత్‌, ‌పాక్‌ ‌ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. అక్కడ శిథిలావస్థలో ఉన్న శారద ఆలయ జీర్ణోద్ధరణకు అనుమతించాలని కొందరు రాజకీయ వేత్తలు కూడా పాకిస్తాన్‌ ‌ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే 2019లో పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం కర్తార్‌పూర్‌ ‌కారిడార్‌ను ప్రారంభించింది. ఈ మేరకు సరిహద్దు లోనే పాక్‌ ‌భూభాగంలో ఉన్న గురుద్వారా దర్బార్‌ ‌సాహిబ్‌ ‌కర్తార్‌పూర్‌కు సిక్కు యాత్రికులను పాకిస్తాన్‌ అనుమతించింది. ఇదే విధంగా శారదా పీఠం సందర్శనకు కూడా హిందువులను అనుమ తించాలని పండిత్‌లు కోరారు.

కారణాలు ఏమైనా కర్తార్‌పూర్‌ ‌కారిడార్‌ ‌తరహాలోనే హిందువులను కూడా తీత్వాల్‌ ‌గ్రామం వరకు అనుమతించడానికి పాకిస్తాన్‌ అం‌గీక రించింది. ఏడాది క్రితం ఈ పనులకు భూమిపూజ కూడా జరిగింది. ఇదంతా సేవ్‌ ‌శారదా కమిటీ కశ్మీర్‌, ‌దాని కన్వీనర్‌ ‌రవీంద్ర పండిత కృషితో సాధ్యమైంది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో శారదాపీఠంతో పాటు ఒక గురుద్వారా కూడా ఉండేదని, ఆ రెండు కూడా 1947లో ‘గిరిజనులు’ ధ్వంసం చేశారని రవీంద్ర చెప్పారు. కశ్మీరీ పండిత్‌లు తిరిగి లోయకు వస్తున్నారు. అంతేకాదు, తరలి పోయిన తమ సాంస్కృతిక సంపదను కూడా క్రమంగా ప్రోది చేసుకుంటున్నారు.

About Author

By editor

Twitter
Instagram