ఆర్యులు ఎక్కడి నుంచో భారతదేశానికి వచ్చి ద్రావిడులను అంతం చేశారు. ఆపై వారి ఆచార వ్యవహారాలు ఇక్కడ ఆచరణ లోకి తెచ్చారు. హరప్పా, సింధు నాగరికత లలో హిందూమతం ఆనవాళ్లు కానరావు. ఇదీ కొందరు చరిత్రకారుల వాదన. ఇవన్నీ ఒకదానితో ఒకదానికి సంబంధం ఉన్న చారిత్రక అంశాలు. వాటిని వివాదాస్పదం చేయడం అందుకే. ఇవి ఎడతెగకుండా ప్రతితరం బుర్రలలోకి కొన్ని దశాబ్దాలుగా చేరుతున్న అభిప్రాయాలు కూడా.

చరిత్ర రచన అంటే వాదం ఉంటుంది. ప్రతివాదం ఉంటుంది. అంతిమంగా సమన్వయ వాదం ఉంటుంది. కానీ పైన చెప్పుకున్న ఆ కీలక చారిత్రకాంశాల మీద వాదనలే గానీ ప్రతివాదాలు బతికి బట్టకట్టడం లేదు. సమన్వయవాదం ప్రశ్నే లేదు. చరిత్ర రచనకు సంబంధించి ఇది. ఈ దేశ దౌర్భాగ్యమే. చరిత్ర రచనకు అంతిమ వాక్యం మాదేనని చెప్పే నియంతృత్వ పోకడ ఇది. కమ్యూనిస్టు నాస్తికులు దీనికి బాధ్యులు. మతాన్నే కాదు, దాని ఉనికినీ, చరిత్రనీ, సంస్కృతి, జీవనం మీద దాని ప్రభావాలనూ కూడా గుడ్డిగా ద్వేషించేవాళ్లు, నిరాకరించేవాళ్లు మత విషయాల మీద వారి వారి రాజకీయ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఇచ్చిన తీర్పుల ఫలితమిది. ఇక, ఆస్తికులైనవారి మౌనం నాస్తికుల స్వైర విహారానికి ఇతోధికంగా దోహదపడింది. ఆస్తికులుగా చెప్పుకుంటున్నవారికి, సత్యనిష్ఠతో చరిత్ర రచన చేయాలన్న సంకల్పం ఉన్నవారికి జరుగుతున్న ఈ అన్యాయం గురించి ఇప్పటికీ పట్టడం లేదు. ఇంత పెద్ద అంశం మీద చైతన్యం లేకపోవడం ఎంత నేరమో వారు గ్రహించకపోవడమూ పెద్ద విషాదమే. ఆ మేధో దగాను నిలువరించే ప్రయత్నం చాలా తక్కువ. ఆ పురాతన నాగరికతలకు చెందినవిగా చెబుతున్న ముద్రికలను, అవశేషాలను సరిగా పరిశీలించకుండానే నాస్తికులైన చరిత్రకారులు తీర్పులు ఇచ్చారు. క్రీస్తుశకం ఒకటో శతాబ్దంలో మాత్రమే హిందూమతం రూపురేఖలను సంతరించు కుందనీ, శివాలయాలు, దేవాలయాల నిర్మాణం ఇవన్నీ అప్పటి నుంచే మొదలైందనీ వీరు సిద్ధాంతాలు చేశారు. అంటే అప్పటివరకు ఉన్నవన్నీ బౌద్ధా రామాలూ, జైనుల ప్రార్థనా మందిరాలే అన్నమాట. వాటి స్థానంలో హిందూ దేవాలయాలు వచ్చాయని చెప్పడం వీరి ఉద్దేశం. తమ పరిశోధన సారాంశాలే అంతిమ తీర్పులని తేల్చేశారు. అక్కడ దొరికిన అవశేషాలను ఇష్టరీతిన పరిశీలించడం, తలకిందు లుగా చూడడం, అర్ధం చేసుకోలేకపోవడం, తమకు అర్ధమైన మేరకే వ్యాఖ్యానాలు చేయడం వారు చేసిన, చేస్తున్న తప్పిదాలే. ఆర్యుల రాక అంశమే కాదు, హరప్పా సంస్కృతిలో హిందూమతం గురించి వారు ప్రకటించిన అంశాలు పూర్తిగా అవాస్తవాలు. హరప్పా మొదలయిన గ్రామాలలో జరిపిన త్రవ్వకాలలో లభించిన అవశేషాలలో శివుని అవతార చిత్రాలు కొన్ని లభిస్తున్నాయి. ఇవి భారతదేశంలో ఐదువేల సంవత్సరాల వెనుక శివారాధన ఉందనడానికి ఆధారాలు. మరి శివారాధననూ, హిందూమతాన్నీ వేర్వేరుగా చూడడం వాస్తవిక, శాస్త్రీయ దృక్పథమని చెప్పడం ఎలా? హరప్పా అవశేషాలలో శివుని ప్రతిమ కనిపించడం నిజం. దీని మీద ఏకాభి ప్రాయం ఉంది. కానీ అప్పటికి హిందూమతం ఆనవాళ్లే లేవని వాదిస్తే ఆ హరప్పా శివుడు ఎవరు?

హరప్పా అనే పదబంధంలో హర పదం శివునికి పర్యాయనామం. హృఞ్‌ ‌హరణే అనే ధాతువు నుండి హర పదం ఏర్పడింది. హరతి ప్రళమే సర్వమితి హరః-ప్రళయకాలంలో సర్వము హరించువాడు అని ఒక అర్థం. భక్తుల పీడను హరించువాడని మరొక అర్థం.

మొహెంజోదారో త్రవ్వకాలలో పశుపతి దేవుని ముద్రిక దొరికింది. ప్రక్కన పశువులుండడం వలన దీనికి పశుపతి అని పేరు పెట్టి ఉంటారు. పశుపతి శివుని పర్యాయపదం (అమరకోశం 1-30). ఈ ముద్రికలో రుద్రుని తలపై పాము, దానికి అయిదు తలలు, దానికి తలపై మణి, మధ్యలో పైకి ఉబుకుతున్న గంగా ప్రవాహం, రుద్రునితలపై మరొక ప్రక్క అర్ధచంద్రుడు వంటి చిత్రాలు కనిపిస్తాయి.

చిత్రంలో కుడివైపున దేవనాగరి ప్రణవం ఉంది. ముద్రికలో ఏనుగు బొమ్మ, మనిషి బొమ్మ, దాని క్రింద ఆయుధం ఉన్నాయి. రుద్రునికి అలంకారాలు, కవచం కనబడుతున్నాయి. దీనికి మూడు తలలు గల పశుపతి దేవుని ముద్రిక అని పేరు పెట్టారు చరిత్రకారులు. కాని మూడు తలలు లేవు. జుట్టు లేని ఒకే శిరస్సు ఉంది. (తరతరాల భారతచరిత్ర, రొమిల్లా థాపర్‌, 21 ‌పుట). కొందరు రెండు కొమ్ముల దేవుడు అన్నారు (చరిత్రలో మతాలు 2పుట). అని కొమ్ములు కావు. ఒకటి సర్పం, రెండవది అర్ధచంద్రుడు.

ఇది వేదం మొదలయిన గ్రంథాలలో వర్ణించిన రుద్రరూపమని నేను రాసిన ‘శ్రుతి సౌరభం’ గ్రంథంలోను, ‘సింధు సంస్కృతి- నమకంలోని రుద్రుడు’ అనే వ్యాసంలోను ఉటంకించాను (వేదపరిషత్‌ ‌వార్షిక సంచిక 2002-2003, 64, 65వ పుట). ప్రణవానికి పరమున గలవాడు పరమేశ్వరుడని తైత్తిరీయారణ్యకం అనే వేదభాగం చెప్పింది (10పు.12 అ.3ప.).

శివధ్యానాల్లో తలపై చంద్రుడు, గంగ, ఉండడం ప్రసిద్ధమే. రుద్రునికి గంగాధరుడని పేరు. గంగను తలపై ధరించినవాడని అర్థం. శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో కూడా ఈ నామముంది (6 శ్లో. అమర 1-54). భీమః అవి మరొక పేరు (అమరః 1-35). వీరి వలన భయపడతారు అని అర్థం. హరప్పా రుద్రుని చూస్తే భయం కలుగుతుంది.

శివ సహస్రనామ స్తోత్రంలో గజేశ్వర, నరర్షభ అనే నామాలున్నాయి (148 శ్లో.). పశుపతి దేవుని ప్రక్కన ఎడమవైపు ఏనుగును, మనుష్యుని చిత్రించారు. శివ సహస్ర నామస్తోత్రంలో ముండః తలపై జుట్టు లేనివాడు అనే నామముంది. పశుపతి దేవునికి జుట్టులేదు. నమకంలో వ్యుప్త కేశనామముంది. దీనికి కూడా అదే అర్థం.

నమకంలో తారాయ అనే నామముంది. ప్రణవస్వరూపుడని అర్థం. పశుపతి దేవుని ప్రక్కన ప్రపంచముంది.

నమకంలో తారాయ అనే నామముంది ప్రణవస్వరూపడని అర్థం. పశుపతి దేవుని ప్రక్కన ప్రణవముంది.

నమకంలో ‘కవచినే’ అనే నామం ఉంది. కవచం కలవాడు శివుడు. పశుపతి దేవునికి కవచం ఉంది.

నమకంలో పశుపతయే అనే నామం ఉంది. పశుపతి దేవుని ముద్రిక అని పేరులోనే ఉంది కదా!

‘ఆయుధినే’ అని నమకంలో ఉంది. ఆయుధం కలవాడు అని అర్థం. పశుపతి ప్రక్క బాణాయుధం ఉంది కదా! నమకంలో కూడా ఇషువు కలవాడని తెలిసే నామం ఉంది (కృష్ణ యజుర్వేదం 4 అ.5ప.).

రుద్రునికి నందీశ్వరావతారముంది. (శివ పురాణం శతరుద్ర సం.6అ.). శివునికి వృషభావ తారముంది (శివపు. శతరుద్ర సం.23అ.) హరప్పా అవశేషాలులో వృషభచిత్రముంది.

రుద్రునికి ద్విజేశ్వరావతారం, ద్విజావతారం ఉన్నాయి (శివపు.శతరుద్ర – 27, 35 అ). హరప్పా అవశేషాలలో యజ్ఞోపవీతంవలె వస్త్రాన్ని ధరించిన ద్విజచిత్రం ఉంది. యజ్ఞోపవీతంవలె ఉత్తరీయం ధరించమని వేదంలో ఉంది (తైత్తిరీయారణ్య 2ప.). నందీశ్వరునికి కొమ్ములుంటాయి. తలపై సర్పముండదు. హరప్పా అవశేషాలలో నందీశ్వర రూపముంది. రుద్రునికి కిరాతేశ్వరావతారముంది (శివపు.శతరుద్ర.37 అ.). హరప్పా అవశేషాలలో కిరాతచిత్రం ఉంది.

ఇలా పేరు, వేదం, శివపురాణాల్లో, శివాష్టోత్తర శతనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం అనే గ్రంథాల ద్వారా పరిశీలిస్తే హరప్పా సంస్కృతిలో శివారాధన ఉందని తెలుస్తోంది. ఆసక్తి కలవారు కోరితే ఈ అవతార కథలను కూడా తెల్పవచ్చు.

హరప్పా, సింధు నాగరికతల అవశేషాలు బయటపడిన తరువాత ఆర్యుల రాక, హిందూ జీవన ప్రాచీనతల గురించి అప్పటిదాకా వినిపించిన కొన్ని వాదనల స్వరం మారింది. లేదా దారి మళ్లింది. రుగ్వేదం సంస్కృతిలో కీలకంగా కనిపించే సరస్వతి నది కల్పితమన్న వాదనను హరప్పా, సింధు తవ్వకాలు పెద్ద అబద్ధమని తేల్చాయి. సరస్వతి నది ఒకనాడు ఉనికిలో ఉందని చెప్పే నాసా ల్యాండ్‌సాట్‌ ఉపగ్రహ ఛాయాచిత్రాలు చాలాకాలం క్రితమే అందుబాటులోకి వచ్చాయి. హరప్పా నాగరికతల కాలం నాటికి హిందూ మతం ఆచరణలో లేదని చెప్పడానికి చాలామంది తమ వంతు ప్రయత్నం చేశారు. అలా హిందూ మత చరిత్రను కుదించే కుట్ర చేశారు. రుగ్వేదం విరివిగా ప్రస్తావించిన సరస్వతి నది ఉనికిని ప్రశ్నార్థకం చేయడమంటే, రుగ్వేదం విలువను తగ్గించే యత్నమే. శివ పశుపతి ముద్రిక హరప్పా తవ్వకాలలో బయటపడింది. కానీ అది శివుని రూపమని ఒకవైపు అంగీకరిస్తున్నా, హిందువులు పూజించే శివుడని అంగీకరించడానికి ఈ చరిత్రకారులకు మనసొప్పదు. ప్రముఖ చరిత్ర పరిశోధకురాలు రొమిల్లా థాపర్‌ ‌తన పుస్తకం ‘తరతరాల భారత చరిత్ర’లో హరప్పా కాలంలో కనిపించేది హిందూధర్మమని చెప్పరు. పైగా గుప్తుల కాలంలోనే హిందూమతం రూపుదాల్చిందని వాదించారు. ఈ వాదనకే ఎక్కువ ప్రచారం వచ్చింది. లేదా ఇచ్చారు. ఆర్యుల దండయాత్ర గురించి మాక్స్ ‌ముల్లర్‌ ఇచ్చిన చారిత్రక క్రమానికి ఆధారాలే లేవని కొయిన్రాడ్‌ ఎల్స్ ‌వంటి వారు ఇటీవలే చెప్పారు కూడా. కానీ వాటిని పరిగణనలోనికి తీసుకోవడం లేదు. అలాంటి వాదాలు వస్తున్నాయన్న విషయం కూడా నేటి పత్రికలకు, మేధావులకు కూడా పట్టడం లేదు. ఇదొక జ్ఞానద్వేషం కాదా? హరప్పా కాలంలో ఆచరించినది హిందూ మతమేనని 88 ఆధారాలు ఉన్నాయి. ఈ కాలానికి చెందినవి 5000 ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. అవి చెల్లాచెదురుగా ఉన్నాయి. కొన్నయినా దొరుకుతాయని కలకత్తా పురావస్తు ప్రదర్శనశాలకు వెళ్లాను. ఢిల్లీ పంపామని వారి సమాధానం. బుర్రలను బూజు పట్టిస్తున్న అంశాల మీద పరిశోధన చేద్దామని నా వంటివారు సంకల్పించినా సాధ్యం కావడం లేదు. ఇక, చరిత్రను యథాతథంగా ఆవిష్కరించే యత్నం చేస్తున్నవారికి ఎదురవుతున్న అనుభవాలు ఎలా ఉన్నాయి? ‘మీ పుస్తకం చదివాను, కానీ మీరు ప్రతిపాదించిన ఏ అంశంతోను ఏకీభవించను’ అన్నారొక పెద్ద ప్రొఫెసర్‌. ఎం‌దుకు ఏకీభవించడం లేదో వాదించడా నికి ఆయనకు త్రాణ లేదట. ఇది నా స్వీయానుభవం. చాలామంది అనుభవం కూడా ఇదే అయి ఉండవచ్చు.

 ఎన్ని చెప్పినా హరప్పాలో విలసిల్లినది వేరే ఏదో మతం కాదు, హిందూ ధర్మమే అన్న ముగింపును ఇక్కడి ఒక వర్గం చరిత్రకారులు ఇవ్వడం లేదు. ఈ ధోరణిని ఇప్పుడు గట్టిగా ప్రశ్నించే అవకాశం వచ్చింది. నా వరకు ‘హరప్పా అవశేషాలలో శివావతారాలు’ పేరుతో వ్యాసాలు చాలాకాలం క్రితమే రాశాను. సంస్కృత వాఙ్మయం ఆధారంగానే నా వాదన నిరూపించే ప్రయత్నం చేశాను కూడా. తరువాత ‘శ్రుతి సౌరభం’ పేరుతో మూడు సంపుటాలు వెలువరించాను. హిందూ దేశ చరిత్రను కుదించడానికి చరిత్రరచన పేరుతో జరుగుతున్న మోసాన్ని భరించలేకే ఇదంతా. హిందూ దేశ చరిత్రను కుదించడమంటే, సంశయాస్పదం చేయడమంటే భారతీయ సంస్కృతిని సంశయాస్పదం చేయడమే. హిందువులను డోలాయమాన స్థితిలోకి నెట్టివేయడమే. హరప్పా నాగరికతలో కనిపించేది నిశ్చయంగా హిందూ మతమే. భారత రామాయ ణాలు కల్పితమంటూ, వేదం బయటి నుంచి వచ్చిన వారు అల్లినది అంటూ చేస్తున్న వాదనలు బుద్ధిజీవుల పరిశోధన ఫలితంలా కాకుండా, సత్యనిష్ఠ కలిగిన పరిశోధన సారంగా కాకుండా ఒక ఊకదంపుడుగానే మన ముందుకు వస్తున్నాయి. దీనిని నిలువరించే ప్రయత్నం ఇంకాస్త వేగవంతం కావాలి. ఆర్యుల వాదం బలహీనపడు తున్న మాట నిజం ఇది మన గతం. రేపటి తరానికి చరిత్రను నిష్పాక్షికంగా, నిర్దుష్టంగా అందించే బాధ్యతను పవిత్ర కర్తవ్యంగా స్వీకరించాలి.

డాక్టర్‌ ‌చిర్రావూరి శివరామకృష్ణ శర్మ

భాషా ప్రవీణ, విశ్రాంత అధ్యాపకులు, ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం

About Author

By editor

Twitter
YOUTUBE