– డా।। కాశింశెట్టి సత్యనారాయణ

నరేంద్ర గురించి ఒక సందర్భంలో ‘హమారే పూరే కోషిషో పర్‌ ‌పానీ పేర్నా రహాహై’ అని బహదూర్‌ ‌యార్‌జంగ్‌ ‌స్వయంగా నవాబుకు మొర పెట్టుకున్నాడట. మన ప్రయత్నాలన్నింటిని ‘పొట్టి వాడు’ నీటముంచుతున్నాడని దాని అర్థం. పొట్టివాడు అంటే యార్‌జంగ్‌ ‌దృష్టిలో పండిత్‌ ‌నరేంద్ర. ఆయన ముస్లింలుగా మారిన హిందువుల మీద నీరు చల్లుతూ వారిని తిరిగి హిందువులుగా మారుస్తున్నారని బహదూర్‌ ‌ఫిర్యాదు. నిజాం రాజ్యంలో ఆనాటి అన్ని రాజకీయ పోరాటాల నాయకులు ఆర్యసమాజ్‌, ‌పండిత్‌ ‌నరేంద్ర చేత ప్రభావితులైనవారే అని చెప్పడం అతిశయోక్తి కాదు.

హైదరాబాద్‌ ‌సంస్థానంలోని ప్రజల కడగండ్లు చూసి, వారికి అండగా నిలిచింది ఆర్యసమాజ్‌.. ‌ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపి, సమరోన్ముఖులను చేసింది. అద్భుతమైన రీతిలో ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించింది. తమ సంస్థ కార్యకలాపాలకు మాత్రమే కార్యకర్తల్ని పరిమితం చేయకుండా, కాంగ్రెస్‌ ‌వంటి సంస్థలు చేపట్టిన కార్యక్రమాలకు కూడా తమ కార్యకర్తలను ఆర్యసమాజ్‌ ‌నాయకులు పంపేవారు. ఆ సంస్థ విద్య, ఆరోగ్యం, స్వభాష, దురాచారాల నిర్మూలన, గోరక్షణకై బహుముఖంగా కృషి చేసింది. ఆర్యసమాజ్‌ ఉద్యమాలన్నిటిలో నరేంద్ర కీలకంగా వ్యవహరించారు.

నరేంద్ర పేరు వినగానే నిజాంకు సైతం చెమటలు పట్టేవి. గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. సామాన్యుల్లో చైతన్యం కలిగేది. కొండంత ధైర్యం వచ్చేది. హైదరాబాద్‌ ‌సంస్థానం ప్రస్తావన ఎక్కడ వచ్చినా పండిత్‌ ‌నరేంద్ర పేరు కచ్చితంగా చెప్పాల్సిందే. ఆయన చూపిన తెగువ, సాహసం, అనుభవించిన కాలాపానీ శిక్షలు, నిర్బంధాలు, బహిష్కరణలు, లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలు.. అన్నీ ఇన్నీ కావు.

పండిట్‌ ‌నరేంద్ర అసలు పేరు నరేంద్ర ప్రసాద్‌ ‌సక్సేనా. మధ్యతరగతి కుటుంబంలో 1907 ఏప్రిల్‌ 10, శ్రీ‌రామ నవమి రోజున జన్మించారు. తండ్రి రాంకేశవ ప్రసాద్‌ ‌మున్సబ్‌దార్‌. ‌నిజాం నవాబుకు అత్యంత విధేయత గల కుటుంబం. రాంకేశవ ప్రసాద్‌ ‌మరణానంతరం నరేంద్ర అక్క మున్సబ్‌ ‌దార్‌గా కొనసాగారు. నరేంద్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడంతో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆమెను తొలగించాడు.

నరేంద్ర లాహోర్‌ ఉపదేశిక విద్యాలయంలో సిద్ధాంత అధ్యయనం చేశారు. ఆర్యసమాజ్‌ ‌కార్యక్రమాల పట్ల ఆకర్షితులై స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు. హరిజన, గిరిజన అభ్యున్నతికి కృషి చేశారు. హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌ ‌కార్యకలా పాల్లో చురుకైన పాత్ర పోషించారు. ‘వైదిక ధర్మ’ పత్రికను నడిపారు. సుల్తాన్‌బజార్‌ ఆర్యసమాజ్‌ ‌శాఖా మంత్రిగా ఎన్నికయ్యారు. 1940లో మధ్య దక్షిణ ఆర్య ప్రతినిధి సభామంత్రిగా, 1944లో అంతర్జాతీయ ఆర్యన్‌ ‌లీగ్‌ ఉపాధ్యక్షునిగా, 1949లో ఆంధ్ర కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1952లో శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1967లో ఆంధప్రదేశ్‌ ‌హిందీ సమ్మేళన ఆహ్వాన సంఘం అధ్యక్షులు గానూ ఎంపికయ్యారు.. ఇంకా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు.

నరేంద్ర హిందీలో గొప్పవక్త. ఆయన ఉపన్యా సాలు ఎంతో ఉద్వేగభరితంగా ఉండేవి. ‘మనం పాపానికి భయపడాలి కానీ పాపాత్ములకు కాదు’ అంటూ హలీబీడ్‌లో ఆయన ప్రసంగిస్తోంటే ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా హర్షధ్వానాలు చేశారు. తిరుగు బాటును ప్రేరేపిస్తున్నాడని ఆయన ఉపన్యాసాలు, రచనలు ఏడాది పాటు నిషేధిస్తూ నిజాం ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది.

నిజాం హత్యకు యత్నించిన నారాయణరావు పవార్‌, ‌గంగారాం జైల్లో ఉన్నప్పుడు నరేంద్ర వారికి రహస్యంగా ఓ లేఖను పంపారు. దాని సారాంశం ఏమిటంటే ‘కారాగారవాసం ఆత్మచింతనకు, స్వాధ్యాయాలకు ఉపయుక్తమైన స్థలం. మీరు చేసిన ఈ సాహసోపేతమైన త్యాగం హైదరాబాద్‌ ‌సంస్థానంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుంది. మీరు బంధ విముక్తులయ్యే రోజు త్వరలోనే వస్తుంది. నియంత నిజాం పాలన నుండి హైదరాబాద్‌ ‌సంస్థా నానికి విముక్తి లభిస్తుంది. మీ ఇద్దరూ పర్వత సమానంగా నిశ్చలమైన, సుదృఢమైన మనస్తత్వంతో ఉండండి’ అని చెప్పారు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి కూడా.

హైదరాబాద్‌ ‌సంస్థానం విముక్తి తర్వాత శాసన సభ్యునిగా ఎన్నికైన నరేంద్రను ఒకసారి వరంగల్‌కు ఆర్యసమాజ్‌ ‌వారు ఆహ్వానించారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ‘రాజకీయ పదవులు నా స్వభావానికి సరిపడవు. ఇక ముందెన్నడూ ఇలాంటి పని చేయను’ అన్నారు. అన్నట్లే తిరిగి ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. 24 సెప్టెంబర్‌, 1976‌న ఆయన తుదిశ్వాస విడిచారు.

About Author

By editor

Twitter
Instagram