ఇటీవల పయనీర్‌ ‌పత్రిక ‘సాంస్కృతిక యుద్ధాలు’ అనే పేరుతో సంపాదకీయాన్ని వెలువరించింది. ఆ సాంస్కృతిక యుద్ధాలలో భాగంగానే ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చలనచిత్రాన్ని నిర్మించారని, ఆ చిత్రపు అసలు లక్ష్యం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎజెండాను ముందుకు తీసుకొని వెళ్లటం తప్ప మరేది కాదని, హిందూ రాష్ట్ర స్థాపన బీజేపీ ఎజెండా అని విమర్శించింది.

‘పయనీర్‌’ ‌మనదేశపు పత్రిక. కానీ, విదేశాలకు చెందిన పత్రికలు సైతం అవే విమర్శలు చేస్తున్నాయి. ఉదాహరణకు ‘టైమ్‌ ‌మాగజైన్‌’ ఆ ‌చిత్రాన్ని విమర్శిస్తూ, ఆ చిత్రం భారతదేశాన్ని ఏ విధంగా మరింత మత విద్వేషంలోకి దిగజార్చుతున్నదో రాసింది (టైమ్‌ ‌మాగజైన్‌ అమెరికా నుండి వెలువడుతుంది. దాని ప్రస్తుత యజమాని మార్క్‌బెనిఫ్‌ ‘‌సేల్త్రు ఫోర్సు’ అనే టెక్‌ ‌దిగ్గజ కంపెనీ యజమాని కూడా. ప్రపంచ కుబేరులలో ఆయన ఒకరు. తన సామాజిక ఎజెండాను ప్రపంచంమీద రుద్దుతున్న దావోస్‌ ‌కుబేరులలో ప్రముఖుడు).

వారు చెబుతున్న ‘సాంస్కృతిక యుద్ధాలను ప్రారంభించింది’ ఎవరు? అందులో పాల్గొంటున్నది ఎవరు? అని నేను ఆశ్చర్యపోతుంటాను. ‘లిబరల్‌ ‌మీడియా’గా పిలుస్తున్న కొన్ని పాత్రికేయ సంస్థలు హిందూ సంస్కృతిని అధ్వాన్నంగా చిత్రీకరిస్తున్నాయి. అవే మీడియా సంస్థలు పాశ్చాత్య, క్రైస్తవ సంస్కృతులను ఎందుకు ఒక్కమాట కూడా అనటం లేదు? పైపెచ్చు వాటిని ఆమోదిస్తూ వ్యాసాలు ప్రకటిస్తు న్నాయి. ‘లిబరల్‌’ ‌మీడియా సంస్థలు ఇస్లాం పట్ల, ఇస్లామిక్‌ ‌దేశాల పట్ల సానుకూలంగా వ్యవహ రిస్తున్నాయి. ఇస్లామిక్‌ ‌దేశాలతో ఆ సంస్థలు స్నేహ సంబంధాలు నెరపుతున్నాయి. అలాంటి కొన్ని దేశాలలో క్రూరమైన దైవద్రోహ చట్టాల కింద కిరాతకంగా, బహిరంగ ఉరి తీతలు అమలు చేస్తున్నారు. అయినప్పటికి ఆ సంస్థలు వాటిని పట్టించుకోవటం లేదు. ఇక కమ్యూనిష్టు చైనాతో అవి అంటకాగుతున్నాయి. పత్రికా, వాక్‌ ‌స్వాతంత్య్రాలు లేని చైనాలో ఏకపక్ష, ఏకవ్యక్తి నియంతృత్వ పాలన కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికి వామపక్షాలు, లిబరల్‌ ‌మీడియా ఆదేశాలను విమర్శించటం లేదు. హిందూ సంస్కృతిపై మాత్రమే విరుచుకుపడుతున్నారు. కువిమర్శలు చేస్తున్నారు. అవి హిందూ సంస్కృతిని ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? హిందూ రాష్ట్రం ఏర్పడితే, అల్పసంఖ్యాక వర్గాలు (ముస్లింలు, క్రైస్తవులు) వేధింపులకు గురవుతారని వారు అంటారు.

భారతదేశంలో అల్పసంఖ్యాకవర్గాలకు భద్రత లేదని ఆరోపిస్తూ, హిందూ రాష్ట్రం ఏర్పడితే వారి మనుగడ మరింత కష్టతరం అవుతుందని అనవసర భయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక పసలేని, వాస్తవాలకు విరుద్ధమైన వాదన. అల్పసంఖ్యాక వర్గాలకు భారతదేశంలో హక్కులు ఉన్నాయి. ఇతర ఇస్లామిక్‌, ‌క్రైస్తవ దేశాలతో పోల్చితే, అల్పసంఖ్యాక వర్గాలను మన దేశంలో చూసినట్లుగా, ఆ దేశాల అల్పసంఖ్యాక వర్గాలను అవి చూడటం లేదు. అల్పసంఖ్యాక వర్గాల విషయంలో భారతదేశానిది అద్భుతమైన చరిత్ర. అనేక క్రైస్తవ, ముస్లిం దేశాలది పేలవమైన చరిత్ర. ఉదాహరణకు ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్థాన్‌, ‌బంగ్లాదేశ్‌లలో హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారు. భారతదేశంలో చట్టాలు హిందువులతో పోల్చితే, ముస్లింలకు, క్రైస్తవులకు అనుకూలంగా ఉన్నాయి.

కశ్మీర్‌లో హిందువుల నరమేధం

పొరుగున ఉన్న ముస్లిం దేశాలలోనే కాదు, దేశంలో భాగమైన ముస్లిం మెజారిటీ కశ్మీర్‌లో సైతం అల్పసంఖ్యాక హిందువులను వేధించారు. 1989- 90లో హిందువులపై దారుణ హింసకు ఒడిగట్టారు. హిందువులు మతం మారాలని బలవంతం చేశారు. అందుకు ఇష్టపడకపోతే కశ్మీర్‌ ‌వదలి వెళ్లాలన్నారు. అందుకూ ఒప్పుకోకపోతే చంపివేస్తామని బెదిరించారు. ‘మతం మార్చుకోండి, లేదా కశ్మీర్‌ ‌విడిచి వెళ్లండి… లేదా చావండి’ అన్న నినాదాలు కశ్మీర్‌ ‌లోయ అంతా మార్మోగిపోయాయి. తాము ఎంత క్రూరులో నిరూపించుకోవటానికి, హిందువులను అత్యంత దారుణంగా చంపారు. ఆ మూకుమ్మడి హత్యలకు పాల్పడినవారు నేటికీ పశ్చాత్తాపపడి ఉండరు. ఎందుకంటే తమ భూభాగంపై కఫీర్లు లేకుండా విముక్తి చేయటం వారి మతగ్రంథం వారికి యిచ్చిన దైవ విధి (ఖురాన్‌.8:39).

 ‌కశ్మీర్‌లో జరిగిన ఈ హిందూ నరమేధాన్ని మీడియా ఏనాడూ పట్టించుకోలేదు. మిగిలిన భారతదేశం, ప్రపంచం ఈ దారుణ హత్యాకాండను త్వరలోనే మర్చిపోయింది. కశ్మీర్‌లో భారత సైనిక అత్యాచారాలు గురించి ప్రపంచం వింటున్నది, నమ్ముతున్నది. 1990లో కశ్మీర్‌లో ఏం జరిగిందో ‘కశ్మీర్‌ ‌ఫైల్సు’ సినిమా ప్రపంచానికి మరొకసారి జ్ఞాపకం చేసింది. 4 లక్షల మంది స్వదేశంలోనే కాందిశీకులు అయ్యారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని కట్టుబట్టలతో కశ్మీర్‌ ‌వదలి పారిపోయారు. మార్చి 2022, ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ఆనాటి దారుణాలను, అకృత్యాలను, నరమేధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ప్రతి సన్నివేశాన్ని చారిత్రక ఆధారాల మేరకే తీశారు. ఒక్క సంభాషణ, సన్నివేశం కూడా కల్పితం కాదు. అంతటి నరమేధాన్ని చూపించే క్రమంలో హింసాత్మక సన్నివేశాలు చూపించక తప్పదు. అయితే పనిగట్టుకొని, ఆనాటి రక్తపాత దారుణాలను మాత్రమే చూపలేదు. కశ్మీర్‌ ‌చరిత్రను కూడా చూపించింది. 800 సంవత్సరాల క్రితం కశ్మీర్‌ ‌భారతదేశ మేధో రాజధాని అన్న విషయం మిగిలిన దేశం మర్చిపోయింది. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చింది. 700 సంవత్సరాల క్రితం ముస్లిం పాలన మొదలయింది. అంతవరకు కశ్మీర్‌ ‌శైవం అక్కడ వర్ధిల్లిన తీరుతెన్నులను ఆ చిత్రం చూపించింది.

ఆ చిత్రం అఖండ విజయం సాధించింది. ముస్లింల చేతులలో కశ్మీర్‌ ‌హిందువులకు జరిగిన దురన్యాయాల గురించి మొట్టమొదటిసారిగా, భారత దేశానికి, ప్రపంచానికి తెలియవచ్చింది. ముస్లింలు ఒడిగట్టిన హిందువుల ఊచకోత గురించి ప్రపంచానికి తెలియచెప్పటం కొందరికి నచ్చలేదు. దానితో వారు ఎప్పుడూ చెప్పే కథనాన్ని మరింత దృఢంగా చెప్పటం మొదలెట్టారు. భారత రాజ్యం కశ్మీర్‌ ‌ముస్లింలను తీవ్రంగా అణచివేస్తూందని, ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని, వారికి మద్దతుగా నిలబడాలని అభ్యర్థనలు చేస్తూ కథనాలు రాస్తున్నారు. వ్యాపింపచేస్తున్నారు. హిందువుల ఊచకోత వెనుక పాకిస్తాన్‌ ‌హస్తం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన దారుణ వాస్తవాలు ప్రపంచం నమ్ముతుందేమోనని అది భయపడింది.

ఇలాఉండగా అంతర్జాతీయ ఫిల్మ్ ‌ఫెస్టివల్‌ ‌వచ్చింది. న్యాయ నిర్ణేతల సంఘ అధ్యక్షుడు నదవ్‌ ‌లపీద్‌ ‌వామపక్ష మీడియాకు సంరక్షకుడైనాడు. హేతుబద్ధం కాని వ్యాఖ్యలు చేయటానికి తనకు గల హక్కును ఉపయోగించుకున్నాడు. ‘కశ్మీర్‌ఫైల్స్’ ‌చిత్రాన్ని ఒక అసభ్యకరమైన ప్రచార చిత్రంగా (Uulgar Biopa ganda) విమర్శించాడు. చిత్రాన్ని విమర్శించటం తప్పుకాదు కానీ, దానిని ఒక అసభ్యకరమైన ప్రచార చిత్రం అనడం మాత్రం ఏ విధంగా చూసినా సహేతుకం కాదు.

వాస్తవాన్ని వక్రీకరించి, అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి పూనుకొంటే దానిని ప్రచారం అంటారు. ఆ చిత్రంలో వాస్తవాలను వక్రీకరించ లేదు. పైపెచ్చు వాస్తవాలనే కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆనాడు కశ్మీర్‌లో జరిగిన యదార్థ సంఘటనలను ఏ మాత్రమూ వక్రీకరించకుండా చూపించారు. మరి జ్యూరీ అధ్యక్షుడు ఎందుకు దానిని ప్రచారంగా పేర్కొన్నారు? అప్పటికప్పుడు వ్యాఖ్యానించలేదు. తయారు చేసుకొని వచ్చిన ప్రకటనను చదివారు.

‘వాస్తవ విరుద్ధమైన సన్నివేశం లేదా కల్పితమైన సన్నివేశం సినిమా మొత్తంలో ఒకదాన్ని చూపినా, సినిమా రంగం నుండి నిష్క్రమిస్తాన’ని వివేక్‌ అగ్నిహోత్రి సవాలు చేసినా కూడా జ్యూరీ అధ్యక్షుడు తన ప్రకటనకే కట్టుబడ్డాడు. ఆ చిత్రం ముస్లింలను రాక్షసులుగా చిత్రీకరించిందని ఆయన అనుకుని ఉండవచ్చు.

వాస్తవాలకంటే రాజకీయాలకే పెద్దపీట

అంటే వాస్తవాలు ఇంక ఏ మాత్రమూ చూపించ కూడదా? అయితే ఇలాంటి సౌలభ్యం హిందువులకు మాత్రం లేదు. ‘నిర్భయ’ సామూహిక మానభంగానికి గురి అయినప్పుడు, ‘పితృస్వామ్య హిందూ సంస్కృతి కారణంగానే మానభంగాలు జరుగుతున్నాయి’ అని ప్రపంచం అంతా ముక్తకంఠంతో ఖండించింది. కోల్‌కతాలో ఒక ‘క్రైస్తవ సన్యాసి’ని మానభంగానికి గురి కాగా, దాని వెనుక హిందూ మత ఛాందస వాదులు ఉన్నారని చర్చి అనుమానం వ్యక్తం చేసింది. అయితే దోషులు ఎవరో తర్వాత తేలింది. కానీ చర్చి క్షమాపణ చెప్పలేదు.

 హిందువులను, హైందవేతరులను ఎందుకు సమానంగా చూడడం లేదు. హిందువులపై ఒంటి కాలితో ఎందుకు లేస్తున్నారు? బహుశా సాంస్కృతిక యుద్ధాలలో భాగంగానే ఇలా జరుగుతున్నదేమో! హిందువుల పట్ల వివక్ష అందులో భాగమేమో! కశ్మీర్‌ ‌ముస్లింలు అణచివేతకు గురవుతున్నారన్న కథనం ‘కశ్మీర్‌ ‌ఫైల్స్’ ‌చిత్రం కారణంగా కొంచెం వెనుక బడింది. ఆ సందర్భంలోనే నదవ్‌లపీద్‌ ‌వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్టాకరమైన అంతర్జాతీయ ఫిల్మ్ ‌ఫెస్టివల్‌ ‌జ్యూరీయే ఆ చిత్రాన్ని ఒక చౌకబారు, అసహ్య కరమైన ప్రచార చిత్రంగా వ్యాఖ్యానం చేస్తే ఆ చిత్రం విలువ అకస్మాత్తుగా తగ్గిపోతుంది. ‘ఓ! అది నిజంగా ప్రచారం కోసం, ముస్లింలను అప్రతిష్టపాలు చేసే దురుద్దేశ్యంతో చేసిన చిత్రమా! ఈ హిందువులు ఎంతటి దుర్మార్గులో కదా! ఎంతటి సంకుచిత మనస్కులో కదా!’ అని వాస్తవాలు తెలియని వారు సహజంగానే స్పందిస్తారు. దురదృష్టవశాత్తూ అధిక సంఖ్యాకులకు ఎప్పుడూ వాస్తవాలు పూర్తిగా తెలియవు.

ఈ కారణంగానే బహుశా నదవ్‌లపీద్‌ ‌తన కువాఖ్యలకు కట్టుబడ్డాడు. ఇజ్రాయిల్‌ ‌రాయబారి చెప్పినా, తన ప్రకటనను ఉపసంహరించుకోలేదు. అటువంటి ప్రకటన చేసినందుకు నదవ్‌లపీద్‌ ‌సిగ్గుపడాలని కూడా ఇజ్రాయిల్‌ ‌రాయబారి అన్నారు. అయినా లపీద్‌ ‌పట్టించుకోలేదు. పిడివాద మతాలకు (Dogmatic Religions), వామపక్షాలకు మద్ధతుగా నిలిచాడు. సాంస్కృతిక యుద్ధాలలో హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఏకమై నిలిచిన ఆ రెండు వర్గాలవారి వాదనను బలపరిచేలా మాట్లాడాడు.

ప్రపంచంలో మిగిలిన ఏకైక పురాతన సంస్కృతి

ప్రపంచంలోని మిగిలిన ఏకైక పురాతన సంస్కృతి ఇంకా భారతదేశంలోనే సజీవంగా ఉంది. అనేక ప్రాచీన నాగరికతలను ధ్వంసం చేశారు. ఉదాహరణకు ప్రపంచ ప్రఖ్యాత ఇంకాస్‌, ‌మాయన్‌, అజాటెక్‌, ‌గ్రీకు, ఈజిప్టు, మెసపటోమియా, చైనా సంస్కృతులు క్రైస్తవం, ఇస్లాం, లేదా కమ్యూనిజం పద ఘట్టనల కింద నామరూపాలు లేకుండా ధ్వంసమయ్యాయి.ఇంకా భారతదేశ సంస్కృతి సజీవంగా ఉంది. ఎన్నో శతాబ్దాల నుండి దానిపై దాడి జరుగుతూనే ఉన్నది. అఖండ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఆ దాడులకు తట్టుకోలేక కుప్పకూలాయి. ఆ ప్రాంతాలలో హిందువుల నిత్య జీవితాలు నరకప్రాయాలు అయ్యాయి.

హిందూ సంస్కృతిని ధ్వంసం చేసి తీరాలన్న గట్టి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంత పట్టుదలగా, ఉమ్మడిగా హిందూ వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయి? వాస్తవానికి ప్రపంచ నాగరికతకు అది ఎంతో యిచ్చింది. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది. ప్రపంచ నాగరికతకు అది చేసిన మేలు గురించి, ఎవరూ చెప్పటం లేదు. అనేక రంగాలలో అభివృద్ధికి అది పునాదులు వేసింది. ఇంత దోపిడీ, ధ్వంసం తర్వాత కూడా ఇంకా 4 కోట్ల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని బిబెక్‌ ‌దేబ్రాయ్‌ ‌చెప్తున్నారు. అంతేకాదు, మన పురాతన దేవాలయాలు అనేక ఆశ్చర్యకరమైన అద్భుతాల రహస్యాలకు నెలవులు.

నిజమైన స్వాతంత్య్రం ఎలా?

నిజమైన స్వాతంత్య్రం ఎలా పొందాలో భారతీయ విజ్ఞానం చూపి•స్తుంది. వేదాలు మానవుడి నిజతత్త్వాన్ని ఆవిష్కరించాయి. తమలోని దివ్యత్వాన్ని గురించి మానవులకు అవి తెలియచెప్తాయి. వేద ధర్మాన్ని అనుసరిస్తే, మానవుడు పరిపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందుతాడు. విముక్తుడు అవుతాడు. పరమ శాంతిని పొందుతాడు. తమ నిజతత్వం, తమలోని దైవత్వాన్ని గురించి ఎరుక పెరుగుతున్నకొద్దీ ధ్రువీకరణకు నిలబడని, అనుభూతి ప్రధానం కాని సిద్ధాంతాలను గుడ్డిగా అనుసరించే వారిగా మలిచే శక్తిని పిడివాదులు కోల్పోతారు. హిందూ వ్యతిరేకశక్తులందరూ పిడివాదులే. అదే వారి అసలు భయం కావచ్చు. అందుకే హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చెయ్యాలని, వారు కలసికట్టుగా పనిచేస్తున్నారు. కుట్రలు పన్నుతున్నారు.

మరి ఏ ఇతర సంప్రదాయంలో లేని విధంగా హిందూ సంప్రదాయం సత్యాన్వేషణను ప్రోత్స హిస్తుంది. కొన్ని సత్యాలను సూచనప్రాయంగా ప్రతి పాదిస్తుంది. వాటిని సాధకులు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఉపనిషత్‌ ‌మహావాక్యాలు ప్రతిపాదించే సత్యాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘అయమ్‌ ఆత్మబ్రహ్మ’ అనేది ఒక ఉపనిషత్తు మహావాక్యం. మనలోనూ, విశ్వాత్మలోనూ ఉన్న శుద్ధ చైతన్యం ఒకటేనని ఆ వాక్యం అర్థం. ఒక సముద్రంలోని నీరు, ఆ సముద్రపు అలలు నీరు ఒకటే. కాని అల ఎన్నటికీ సముద్రం కాబోదు. అన్ని అలలు ఉంటాయి. సముద్రం ఆవల అలలు ఉండవు. అలా తన రూపాన్ని కోల్పోయినా, అందులోని పదార్థం (నీరు) ఎక్కడికీ పోదు. సముద్రంలోనే కలుస్తుంది.

ఈ రెంటిలో ఏది హేతుబద్ధంగా ఉంది? సాధనలో అంతటా వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యంతో (బ్రహ్మన్‌) ‌మమేకం చెందవచ్చు అనే భారతీయ సంప్రదాయపు ప్రతిపాదన లేక ఒకే ఒక జన్మపై ఆధారపడి, మనం శాశ్వత స్వర్గానికి లేదా శాశ్వత నరకానికి అర్హులం అవుతామా? కాదా? అనే దాన్ని నిర్ణయించే స్వర్గంలో ఉన్న దేవుడి గురించి ఒక వ్యక్తి చెప్పినదాన్ని గుడ్డిగా నమ్మటమా?

మింగుడు పడని హిందూ ధర్మం

18వ శతాబ్దిలో జర్మన్‌ ‌తత్త్వవేత్తలు ఉపనిషత్తుల అనువాదాలు చదివి, వారి మత సంప్రదాయాలతో, తాత్త్వికతతో పోల్చిచూసి, వేద విజ్ఞానాన్ని ఆకాశానికి ఎత్తి ప్రశంసించారు. అప్పటి నుండి చర్చి అధికారా నికి, ప్రాబల్యానికి గండి పడటం మొదలయింది. అది హిందూయిజంపై కువిమర్శలకు పాల్పడుతు న్నప్పటికి తన అధికారాన్ని క్రమేపి పోగొట్టుకున్నది. నేను ప్రాథమిక పాఠశాలలో చదివే రోజులలోనే హిందూయిజంలోని ‘అంటరానితనం’ గురించి విన్నాను. కాగా మా జర్మనీ ప్రజలు యూదులపై చేసిన మూకుమ్మడి నరమేధం గురించి యుక్త వయస్సు వచ్చేవరకు నాకు తెలియనే తెలియదు.

హిందువుల పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. హిందూ ధర్మం గురించి అవగాహన లేనివారు హిందువులను ‘తీవ్రవాదులు(టెర్రరిస్టులు), ఫాసిస్టులు, రేపిస్టులు, గోమూత్ర సేవకులు’ రకరకాల పేర్లతో వ్యవహరిస్తూ కించపరుస్తున్నారు. అబ్రహామిక్‌ ‌మతాలకంటే హీనంగా చిత్రీకరిస్తున్న ప్పటికీ, తమ ధర్మం మానవాళికి, ప్రపంచానికి దారి చూపగలిగే వెలుగు అన్న విషయం హిందువులు తెలుసుకొని, జాగృతం అవుతున్నారు. హిందువుల ఈ మేలు కొలుపు హిందూ వ్యతిరేక శక్తులకు యిష్టం లేదు. హిందువులు తమ వారసత్వాన్ని అస్తిత్వాన్ని నిల బెట్టుకొనే ప్రయత్నాలు చేయటం వారికి యిష్టం లేదు. అనేకమంది హిందువులు తమ ధర్మం విశిష్ట తకు గర్వపడుతున్నారు. దానిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో మిగిలిన చిట్టచివరి ప్రాచీన నాగరికతను సైతం ధ్వంసం చేద్దామనుకొంటున్న దుష్టశక్తులకు ఇది మింగుడు పడటంలేదు.

అనేక పురాతన సంస్కృతులను ధ్వంసంచేసే పక్రియలోనూ, ఒకరినొకరు మట్టుపెట్టుకొనే పక్రియలోనూ గడచిన కొన్ని శతాబ్దాలలో ఆ పిడివాదులు కోట్లాదిమందిని నిర్దాక్షిణ్యంగా బలి తీసుకున్నారు. మానవాళిని తమ గుప్పెట్లో పెట్టుకోవ టానికి జరుగుతున్న ఈ పెద్ద క్రీడలో తమను పావులుగా వాడుకొంటున్నారని, ఆ పిడివాదాలను మోస్తున్న సిపాయిలకు తెలియదు. హిందూ ధర్మం మనగలగడం మాత్రమే కాదు, వర్థిల్లగలిగితే దాని వలన వారికి కూడా ఎంతో ప్రయోజనకరమన్న వాస్తవం ఆ సిపాయిలు గ్రహించలేకపోతున్నారు. హిందూ ధర్మం సమ్మిళితమైంది. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని అది భావిస్తుంది. ఎందుకంటే మనందరం ఒకే ఒక దివ్య చైతన్య వారసులం కనుక. ‘‘వసుధైవ కుటుంబకమ్‌’’

(‌Maria Wirth జర్మన్‌ ‌దేశస్థురాలు. భారత దేశంలో స్థిరపడిన సాధకురాలు, రచయిత. 19.1.2023న తన బ్లాగ్‌లో ఈ వ్యాసం వ్రాశారు. దాని భావానువాదం ఆర్గనైజర్‌ ‌వారపత్రికలో ప్రచురించారు.)

అను: డాక్టర్‌ ‌బి.సారంగపాణి

About Author

By editor

Twitter
Instagram