– మార్చి 16 జాతీయ  వ్యాక్సినేషన్‌ ‌డే

 ప్రజారోగ్యం విషయంలో వ్యాక్సిన్ల పాత్ర తిరుగులేనిది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మందిని రోగాలతో మృత్యువాత పడకుండా కాపాడుతున్నది వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమమే. ఇంగ్లండ్‌లో టీకా లేదా వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టిన తరువాత స్మాల్‌పాక్స్, ‌పోలియో, టెటనస్‌ ‌వంటి ప్రాణాంతక వ్యాధులు దాదాపు నిర్మూలించగలిగారు. అత్యల్పంగా మాత్రమే ఇప్పుడు ఆ వ్యాధిగ్రస్థులు కనిపిస్తున్నారంటే కారణం వ్యాక్సిన్‌. ‌మీజిల్స్, ‌డిఫ్తీరియా వంటివి  వ్యాక్సిన్‌ ‌ప్రవేశించిన తరువాత 99.9 శాతం తగ్గిపోయాయి. కొవిడ్‌ 19‌తోనే కాదు, అది ప్రపంచం మీద దాడి చేయడానికి కొన్ని దశాబ్దాల ముందే వ్యాక్సిన్‌ ‌ప్రాధాన్యంలోకి వచ్చింది. వ్యాక్సిన్‌ అం‌టే సాధారణంగా తీసుకునే ఔషధాల కంటే రెండు కోణాల నుంచి చాలా భిన్నమైనది. మొదటిది: వ్యాక్సిన్‌ను వ్యాధిని తగ్గించడానికి కాకుండా, నిర్మూలించడానికి ఉపయోగిస్తారు. వ్యాధి కారకమైన బాక్టీరియాను లేదా వైరస్‌ను గుర్తించి దానిని అరికట్టే రీతిలో వ్యక్తిలో రోగ నిరోధక శక్తిని పెంచడం వ్యాక్సిన్ల ప్రధాన ధ్యేయం. అంటే మానవాళి ఎదుర్కొనక తప్పని కొన్ని రోగాలను ముందే అరికట్టడానికి  వారి రోగ నిరోధక శక్తిని వ్యాక్సిన్లు ఉద్దీపింప చేయగలవు. రెండు: చాలా ఔషధాల మాదిరిగా కాకుండా, వ్యాక్సిన్‌ను జీవ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఇవి రసాయనాల సమ్మేళనం కాదు. మార్చి 16 వ్యాక్సినేషన్‌ ‌డే సందర్భంగా ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ ఆర్‌వి కుమార్‌ (‌కార్డియాలజి విభాగం, నిమ్స్, ‌హైదరాబాద్‌) ‌వ్యాక్సిన్‌ ‌ప్రాధాన్యం గురించి జాగృతితో ముచ్చటించారు. వ్యాక్సిన్‌ ‌డే ఎలా వచ్చింది? వ్యాక్సిన్‌ ‌ప్రాధాన్యం లేదా అవసరం ఎలాంటివి? ఎలాంటి వ్యాధులకు వ్యాక్సిన్‌ ఇస్తారు? బాలలకు ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఏవి? ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్లు ఏమిటి? మన వ్యాక్సిన్లు మనమే దేశంలో తయారు చేసుకుంటున్నామా వంటి అంశాలను ఆయన వివరించారు. డాక్టర్‌ ‌కుమార్‌తో జరిపిన ముఖాముఖీ లోని అంశాలు:  

ప్రస్తుతం భారతదేశంలో ఏఏ వ్యాధుల నివారణకి వ్యాక్సినేషన్‌ అం‌దిస్తున్నారు?

గర్భిణులకు, పిల్లలకు మొత్తం పది రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెండు రకాలు చుక్కల మందు, ఒక రకం ద్రావణం, ఏడు రకాల ఇంజక్షన్లు ఉన్నాయి. పుట్టి భూమ్మీద పడిన క్షణం నుంచి 16 ఏళ్ల వయసు వరకు ఆయా వయసులను బట్టి నిర్దేశించిన ఆయా వ్యాక్సిన్‌ ‌డోసులు వేయించు కోవాల్సి ఉంది. పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్‌ ‌కార్డు ఇచ్చి అందులో వాళ్లకి అందించిన వ్యాక్సినేషన్‌ ‌వివరాలు పొందుపరుస్తారు. గర్భిణులు, పిల్లలకు డీటీ (డిప్టీరియా టెటానస్‌) ఇస్తారు. ఈ టీకాను గర్భం దాల్చిన తొలిరోజుల్లో మొదటి డోసు, తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు, ఆ తర్వాత బూస్టర్‌ ‌డోసు వేస్తారు.

చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌ ‌చాలా ముఖ్యమైనదిగా ఇప్పుడు అంతా అంగీకరిస్తున్నారు. దాదాపు నాలుగైదు దశాబ్దాల నుంచి దీనిని ఒక ఉద్యమంగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు కూడా స్పందిస్తున్నారు. పిల్లల వ్యాక్సినేషన్‌ ‌క్రమం ఏమిటి? ఏఏ వ్యాక్సిన్లు ఇస్తారు?

పుట్టిన సమయంలో మొదట బీసీజీ (క్షయ) ఓపీవీ వ్యాక్సిన్‌ ‌జీరో మోతాదుతో పాటు, హెపటైటీస్‌ ‌బీ మోతాదు కూడా ఇస్తారు. 6 వారాల వయసులో ఓపీవీ-1 (పోలియో రాకుండా) చుక్కల మందు, రోటా-1 (విరోచనాలు రాకుండా) చుక్కల మందుతో పాటు ఎఫ్‌ఐపీవీ-1 ఇంజక్షన్‌ (‌పోలియో రాకుండా), పెంటావాలెంట్‌ (‌డిప్టీరియా, కంఠసర్పి, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు రాకుండా) టీకాలు వేస్తారు. పది వారాల వయసులో ఓపీవీ, పెంటావాలెంట్‌, ‌రోటా టీకాలు రెండో డోసు వేస్తారు. 14 వారాలకు ఓపీవీ, పెంటావాలెంట్‌, ‌రోటా మూడో డోసుతో పాటు ఎఫ్‌ఐపీవీ రెండో డోసు వేస్తారు. 9 నెలలకు తట్టు, రుబెల్లా రాకుండా ఎంఆర్‌ ‌వ్యాక్సిన్‌తో పాటు విటమిన్‌ ఏ ‌ద్రావణం ఇస్తారు. 16 నుంచి 24 నెలలకు డీపీటీ మొదటి బూస్టర్‌, ఓపీవీ బూస్టర్‌తో పాటు ఎంఆర్‌ ‌రెండో డోసు వేస్తారు. 5,6 సంవత్స రాలకు డీపీటీ రెండో బూస్టర్‌ ‌మోతాదు, 10-16 సంవత్సరాలకు టీడీ వ్యాక్సిన్‌ ‌వేస్తారు. దీనిని ప్రతి తల్లి గమనించుకోవాలి. చిన్నారులకు వ్యాక్సిన్‌ ‌విషయంలో సదా జాగరూకతతోనే ఉండాలి. కుటుంబం కూడా సహకరించాలి.

జాతీయ టీకా దినోత్సవం (మార్చి 16) లేదా వ్యాక్సినేషన్‌ ‌డేని ఎలా ఎంపిక చేశారు? నేపథ్యం ఏమిటి?

మార్చి 16, 1995న OPV ఓరల్‌ ‌పోలియో వాక్సిన్‌ను ప్రారంభించిన భారత ప్రభుత్వం దేశం నుండి ఆ వ్యాధిని పూర్తిగా నివారించగలిగింది! ఆ విజయాన్ని స్మరిస్తూ వ్యాక్సినేషన్‌ ‌ప్రాముఖ్యాన్ని వక్కాణించడానికి మార్చి 16 ను ఏటా జాతీయ టీకా దినోత్సవంగా జరుపుకుంటున్నాం!

పిల్లలలోనే కాకుండా వయోవృద్ధులలో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లలో, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లలో ఇన్‌ఫ్లుయెంజా, న్యూమోకాకల్‌ ‌టీకాలు అవసరమవుతుంటాయి. కొవిడ్‌ ‌నియం త్రణలో టీకాలు చాల గొప్ప పాత్రను పోషించడం మనం ఇటీవల చూసాం కూడా!  అంటురోగాలకే కాకుండా కొన్నిరకాల కాన్సరు నివారణలోనూ టీకాలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి! గర్భాశయ ముఖ ద్వార కాన్సర్‌ ‌నివారణకు టీకా ఇస్తున్నారు.

అసలు వ్యాక్సినేషన్‌ ఎం‌దుకు? మనిషిలో సహ జంగా రోగ క్రిములను నిరోధించే వ్యవస్థ ఉంటుందని అంటారు కదా!

సాధారణంగా పరాన్నజీవి శరీరంలో ప్రవేశిం చాక శరీర రక్షణ వ్యవస్ధ ఆ పరాన్నజీవిని అరికట్టె సమర్ధత సంతరించుకుంటుంది! కాని పరాన్నజీవులు మన శరీరంలో చేసే విధ్వంసం పూర్తిగా ఆపలేము! అలా కాకుండా పరాన్నజీవి శరీరంలో ప్రవేశించక పూర్వమే శరీర రక్షణ వ్యవస్ధకు ఆ ఫలానా పరాన్నజీవిని అరికట్టే రోగనిరోధక శక్తిని సమకూర్చే పక్రియే వ్యాక్సినేషన్‌!

‌పరాన్నజీవులకు రోగం కలిగించే శక్తితో పాటు మనకు ఐడెంటిటీ కార్డ్లు ఉన్నట్లుగా ఆంటీజెన్లు అనే అంగాలు ఉంటాయి! సంక్లిష్టమైన జీవ రసాయనిక పక్రియ ద్వార ఇన్ఫెక్షన్‌ ‌కలిగించే శక్తిని తీసివేసి, రోగ నిరోధక వ్యవస్ధను ప్రచోదన చేసే ఆంటీజెన్‌ను సేకరించి వ్యాక్సిను తయారుచేస్తారు! వాటిని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వార ఆ వ్యాధికి శరీర రక్షణ వ్యవస్ధకు రోగనిరోధక శక్తిని కలుగచేస్తాయి.

వ్యాధి బారిన పడే అవకాశం ఉన్న వారికి రోగం రాకుండా నిరోధించడం ద్వార పూర్తి రోగాన్నే మాయం చేయవచ్చు! అలా మానవాళి నుండి మాయ మైన జబ్బులే – చికెన్‌ ‌పాక్స్ , ‌పోలియో! వాక్సిన్‌లు మానవాళికి అందించిన అద్భుత విజయాలివి!

ఏ వయసు వరకు వ్యాక్సినేషన్‌ ఇస్తారు?

బాల్యంలో ఇవ్వవలసిన వాక్సిన్లు ఉన్నాయి. అవి పదహారేళ్ల దాకా ఇస్తారు! వయోవృద్ధులకు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లకు,ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్నవారికి, సీజన్లలో న్యూమోకా కల్‌ ‌వాక్సీను,ఇన్‌ఫ్ల్లుయెంజాలకు కూడా వ్యాక్సిను ఇస్తారు! ఇక కొవిడ్‌ ‌లాగా ఎపిడెమిక్‌లూ, పాండెమిక్‌లూ వచ్చినప్పుడు అన్ని వయసుల వారికి, ఆయా వ్యాధులకు సంబంధించిన వ్యాక్సినేషన్‌ ఇస్తుంటారు! కొన్ని ఆఫ్రికా దేశాలకు వెళ్లాలంటే ఎల్లో ఫీవర్‌ ‌బారిన పడకుండా వ్యాక్సినేషన్‌ ‌తీసుకోవడం తప్పని సరి. కాబట్టి వ్యాక్సిన్‌కు వయసుతో నిమిత్తం లేదు. అదొక నిరంతర పక్రియ. అవసరాన్ని బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి తీసుకోవలసిందే.

వ్యాక్సినేషన్‌ ‌పక్రియ ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్నదా?

ప్రపంచ వ్యాప్తంగా •అఱమీవ• ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ అమలులో ఉంది! ఆయా దేశాల అవసరాలు, వనరులను బట్టి ఏ దేశానికాదేశం వాక్సినేషన్‌ ‌విధానాన్ని రూపొందించుకుంటున్నాయి. ఇప్పుడు వ్యాక్సిన్‌ ‌లేని ప్రపంచాన్ని ఊహించలేం.

ప్రభుత్వాలు అందిస్తున్న వాక్సినేషన్‌ ఏ ‌మేరకు?

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇచ్చే అన్ని వ్యాక్సిన్లు ప్రభుత్వం తరపున అందుబాటులో ఉంచినవే! అవికాకుండా పల్స్ ‌పోలియో వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వాక్సిన్‌ ‌పంపిణీని మరింత బలోపేతం చేస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో సక్సెస్‌ ‌రేటు ఎంత?

మనదేశం ఎంతో పెద్దది. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్‌కు రెండో స్థానం ఉంది. ఈ కోణం నుంచి వివిధ రాష్ట్రాలలో, అక్కడి జిల్లాలకి, మారుమూల ప్రాంతాలకి ప్రజారోగ్య వ్యవస్ధ ఎంత మేర అందుబాటులో ఉన్నదో లేదా విస్తరించినదో అంచనాకు రాలేం. ఈ వ్యవస్థ విస్తరణ, ప్రభావం వేరు వేరు ప్రాంతాలలో వేరువేరుగానే ఉంటుంది కూడా. నిర్దిష్ట గణాంకాలు చెప్పడం కష్టం! కానీ వ్యాక్సిన్‌ ‌కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విశేషంగా కృషి జరుగుతున్నది! అయినా చేయవలసిందీ ఇంకా ఎంతో ఉందనే చెప్పాలి. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహనా రాహిత్యం, మత సాంఘిక మౌఢ్యాలు కూడా ఇంకా అందరికీ ఆరోగ్యం అన్న ఆశయానికి అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు వచ్చాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని కొత్త వ్యాక్సిన్ల అవసరం రావచ్చునా?

కొత్తకొత్త రోగకారక క్రిములొస్తున్న కొద్దీ కొత్త వ్యాక్సిన్ల కోసం పరిశోధన, తయారీ అవసరమెప్పుడూ ఉంటూ ఉంటుంది! కొత్త రోగకారక క్రిములపై నిఘా, వాటికనుగుణంగా కొత్త వ్యాక్సిన్ల తయారీ ఒక నిరంతర పక్రియ! ఉన్నవాటి సామర్ధ్యం పెంచడం, అవలక్షణాలను తగ్గించడానికి, ఇంజెక్షన్ల ద్వార కాకుండా, ముక్కు ద్వార, నోటి ద్వార ఇచ్చే విధంగా మలచడానికి పరిశోధనలు నిరంతరం జరుగుతూ ఉంటాయి!

అరుదుగానే అయినా వ్యాక్సిన్‌ ‌మీద సైడ్‌ ఎఫెక్టస్ ఆరోపణలు వస్తున్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటి గురించి చెప్పండి!

వ్యాక్సినేషన్‌ ‌చేసిన రోజున జ్వరం, వొంటి నొప్పులు రావడం సర్వ సాధారణం! వాక్సిను పనిచేస్తున్నదనడానికి అవి ముఖ్యమైన సాక్ష్యాలు కూడా! అరుదుగా తీవ్రమైన రియాక్షన్లు, ఊపిరి అందకపోవడం, రక్తపోటు తగ్గిపోవడం, శరీరంపై దద్దుర్లు రావడం జరగవచ్చు! అవి సరైన ట్రీట్మెంటుతో తగ్గిపోతాయి! అప్పుడప్పుడు ఏ వ్యాధికి టీకా వేసామో ఆ లక్షణాలు పూర్తిగా కానీ, కొన్ని కాని కనిపించడం కూడా సహజమే! కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌తరువాత వివిధ అవయవాలలో రక్తం గడ్డ కడుతున్నదంటూ నమోదవుతున్న కేసులు అలాంటివే! కానీ ప్రాణాపాయం ఉదంతాలు చాలా అరుదు. అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది విడుదలైన వ్యాక్సిన్లు చేసే మేలుతో పోల్చి చూసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్‌లు, కాంప్లికేషన్లు అంతగా గణించతగినవి కావు.

భారతదేశంలో తయారవుతున్న వ్యాక్సినేషన్‌లు ఎన్ని? దిగుమతి చేసుకుంటున్నవి ఎన్ని?

మనదేశానికి కావాల్సిన వ్యాక్సిన్లన్నీ మనదేశంలోనే తయారవుతున్నాయి! అంతేకాదు నాణ్యమైన వ్యాక్సిన్లను వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇది మనకు గర్వకారణం.

About Author

By editor

Twitter
YOUTUBE