– నిరామయ

జాతీయ విద్య, శిక్షణ, పరిశోధక సంస్థ (NCERT) పాఠ్య పుస్తకాలు, అందులోని అంశాల మార్పు గురించి తాజాగా వివాదం తలెత్తింది. 1969లో ఆరంభమైన ఎన్‌సీఇఆర్‌టీ బీజేపీ బలపడిన తరువాత తన మార్గాన్ని కొంచెం మార్చుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి విపక్షాల కాషాయీకరణ గగ్గోలు బాగా పెరిగింది. మొగలుల చరిత్రను, కొన్ని ఇతర అంశాలను కూడా తొలగించడంపై తాజా వివాదం చెలరేగింది. నిజానికి గడచిన ఆరేళ్లలో ఎన్‌సీఇఆర్‌టీ ఆరు దఫాలుగా పాఠ్యపుస్తకాలలో పెద్ద మార్పులే చేసింది. ఈ మార్పులు ప్రధానంగా చరిత్ర, రాజనీతిశాస్త్రం, సామాజికశాస్త్రం అంశాలలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు సంబంధిం చిన పాఠ్యపుస్తకాలలో చేసిన మార్పులే. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. బడిపిల్లలు ఏం చదువు కోవాలో రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయా? ఎన్‌సీఇఆర్‌టీ విధానాలలో ప్రభుత్వానికి కీలక పాత్రే అయినా బీజేపీ వచ్చిన తరువాత ఏ చర్య తీసుకున్నా గగ్గోలు చేయడం రివాజుగా మారింది.  ప్రతిపక్షాల వైఖరి మాత్రం బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలే లేదన్న రీతిలో ఉంది. మరి గతంలో ప్రభుత్వాలు ఆ పాఠ్య పుస్తకాలలో తీసుకువచ్చిన మార్పుల సంగతేమిటి? అప్పుడొక న్యాయం, ఇప్పుడొక న్యాయమా?

చారిత్రక పాఠ్యాంశాల సంస్కరణలో భాగంగా మొగలాయి యుగాన్ని చరిత్ర పాఠ్యాంశాల నుంచి తొలగించింది. చరిత్ర బూజు పట్టకుండా, నిజాలు భూస్థాపితం కాకుండా, ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయడం ప్రభుత్వం ఆ సంస్థకు ఇచ్చిన స్వాతంత్య్రానికి నిదర్శనం. బాగోగుల పరిశీలనా క్రమంలో దేశానికి జరిగిన ఎగ్గు ఒగ్గుల నిగ్గు తేల్చడం అవసరం అని సంస్థ నిర్వాహకులు  సామాజిక మాధ్యమాలకు వివరణ ఇచ్చారు కూడా. తప్పొప్పులు బేరీజు వేసి, చరిత్రను అంశాల వారీగా విద్యార్థులకు బోధించడం వల్ల వారి దృష్టికోణం సత్యాన్వేషణ వైపు మళ్లుతుంది. విద్యారంగంలో పాఠ్య, పఠనాల ద్వారా సాధించవలసిన పరమార్థం కన్నా కావలసింది ఏమిటి? ఎన్‌డీఏ తరఫున తొలిసారిగా ప్రధాని అయిన అటల్‌ ‌బిహారీ వాజపేయి కాలంలో కూడా ఎన్‌సీఇఆర్‌టీ పుస్తకాలలో ముస్లిం అధ్యాయాలలో మార్పులు జరిగాయి. ఎన్ని పరిశోధనలు జరిగినా, ఎన్ని కొత్త అంశాలు వెలుగు చూస్తున్నా పాత విషయాలనే విద్యార్థుల చేత చదివించాలన్న అశాస్త్రీయ దృష్టి వామపక్ష, కాంగ్రెస్‌ ‌రాజకీయ వేత్తలలో, మేధావులలో కనిపిస్తున్నది. వాజపేయి హయాంలో పాఠ్యపుస్తకాలలో సుల్తానులను, మొగల్‌ ‌చక్రవర్తులను దురాక్రమణదారులు అన్నందుకు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు జరుగుతున్న గొడవ దానికి కొనసాగింపు. విదేశీ దురాక్రమణదారులకు స్థానిక పాలకులు అంటే హిందూ పాలకుల నుంచి వచ్చిన ప్రతిఘటనను చరిత్ర పుస్తకాలు ఏనాడూ పట్టించుకోలేదు. దాని గురించి ఇప్పుడు ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.

క్షమించరాని నేరం, ఘోరం జరిగిపోయిందని, యాగీ చేస్తున్న మేధావుల్లో, వామపక్ష, విపక్షాలకు చెందిన అసంతృప్తి నేతల గళాలు ఎక్కువగా హోరెత్తుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం మతప్రాతి పదికన మొగలాయి యుగాన్ని మినహాయించినట్టు అభియోగాలు గుప్పిస్తున్నారు. ఎక్కువ కాలం రాజ్యం ఏలిన కాంగ్రెసు ప్రభుత్వం, వామపక్షాలతో చేతులు కలిపి, చరిత్రను వక్రీకరించిన  విషయం తెలియనిది కాదు. తమకు ఒక న్యాయం, ఇతరులకు మరొక న్యాయం  కావాలనడం భావ్యమా?

గాంధీని హత్యచేసిన గాడ్సేకు ఆరెస్సెస్‌కు లంకె  ఉన్నదని ఆనాడు నెహ్రూ బాహాటంగా ప్రకటించడమే కాకుండా, నిషేధాజ్ఞలు జారీ చేయించాడు. నాటి నుంచి నేటి వరకు అది చెరగని ముద్రగా సంఘీయులను వెంటాడుతూనే ఉన్నది. హత్య జరిగిన నాటికి ముందే గాడ్సే సంఘానికి దూరం అయ్యాడు. సర్దార్‌పటేల్‌ ‌గృహమంత్రిత్వంలో హత్యకు ఆరెస్సెస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలిన తరువాత నిషేధాజ్ఞలను ఎత్తివేశారు. తాజాగా తొలగించిన పాఠ్యాంశాలలో తీవ్ర జాతీయవాదులలో గాంధీజీ పట్ల ఉన్న వ్యతిరేకత, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌మీద మూడు సార్లు నిషేధం గురించి కూడా తొలగించారు.

ఆరెస్సెస్‌, ‌గాడ్సే, గాంధీజీ హత్యల గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడం అసందర్భం కాదు. ఏ మూలలో మత కల్లోలాలకైనా సంఘ పరివారానిదే  బాధ్యత అంటూ కాంగ్రెస్‌, ‌వామపక్షాలు ప్రచారం చేయడం పరిపాటి. కానీ ఒక్క దర్యాప్తు సంఘం కూడా ఆరెస్సెస్‌ ‌పాత్రను ఏనాడూ నిర్ధారించ లేకపోయింది. ఇందుకు గాంధీజీ హత్య కూడా మినహాయింపు కాదు. అయినా  మూడుసార్లు కాంగ్రెసు ప్రభుత్వం ఆరెస్సెస్‌ను నిషేధించి కక్ష సాధించింది. ఈ విషయాలను చరిత్రలో భద్రంగా దాచిపెట్టి పబ్బం గడుపుకున్నది. ఇదే ధోరణి ఎప్పటికీ కొనసాగాలని కాంగ్రెస్‌, ‌వామపక్ష మేధావుల కోరిక. చరిత్ర సత్యాలను అన్వేషించి, తగిన న్యాయం చేయడమే చరిత్రను పునర్లిఖించుకోవడంలోని అంతర్యం.  అదొక చారిత్రక అవసరం.

చరిత్ర రచనలో వివక్ష, అసమతౌల్యం చోటు చేసుకున్న వాస్తవం. ఒక సమగ్ర చరిత్ర ఇప్పటికీ మనకు అందలేదు. చరిత్ర మిగిల్చిపోయిన విషాదాలతోను, వాటికి మత, కుల రాజకీయాలు జోడించి పబ్బం గడుపుకుంటున్నవారు ఎవరు? ఇది ప్రజలకు ఏనాటికైనా తెలిసి తీరాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, తమ జీవితాలను ధారపోసిన ఉద్యమకారుల త్యాగాలు వెనుక బెంచికి పరిమితమైపోయాయి. స్వాతంత్య్ర సమరవీరులైన వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌లాంటి  నిష్కామకర్మయోగుల మీద బురద చల్లే ప్రయత్నాలు మొదలయ్యాయి. మత ప్రాతిపదికన భారతమాతను విభజించకూడదని గాంధీజీ మొరపెట్టుకున్నా, అధికార వ్యామోహంలో కాంగ్రెసు బ్రిటిషువారి మాయలోపడి విభజించి పాలించు అన్న సూత్రాన్ని  స్వతంత్ర భారతం మెడకు కూడా తగిలించింది. నిన్నటిదాకా, హిందూ మెజారిటీ, ముస్లిం మైనారిటీని అణగదొక్కుతున్న దుష్ప్రచారం ప్రస్తుతం పరాకాష్టకు చేరింది. రాహుల్‌గాంధీ ఆయనతో పాటు ఎందరో మేధావులు భారతీయత గురించి పనికట్టుకు విదేశాలలో దుష్ప్రచారాలు చేస్తున్నారు. భారత స్వాతంత్య్ర సమరం లక్ష్యాలలో ఒకటైన  ప్రజాస్వామ్యం చనిపోయిందని, మైనారిటీలను రక్షించమని, మోకాళ్ల మీద వంగి వీరంతా ప్రపంచ మీడియాను ప్రార్థిస్తున్నారు.

బీజేపీ వచ్చిన తరువాత ఎన్‌సీఇఆర్‌టీ తొలిసారి 2017లో మార్పులు చేసింది. కానీ ఆనాడు ఆ చర్యను సమీక్షగానే పేర్కొన్నది. పునశ్చరణ అని చెప్పలేదు. కొత్త ఆవిష్కరణలకు అనుగుణంగా చరిత్ర పాఠ్యాంశాలను ఆధునీకరించవలసిన అవసరం ఎంతటిదో సంస్థ చీఫ్‌ ‌హృషీకేశ్‌ ‌సేనాపతి వివరించారు. ఇందుకు ఉదాహరణ జీఎస్‌టీ గురించి విద్యార్థులకు తెలియచేయాలి. అందుకు పాఠ్యాం శాలను ఆధునీకరించాలి. ఆ మరుసటి సంవత్సరమే నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకాశ్‌ ‌జవడేకర్‌ ‌విన్నపంతో రెండో దఫా మార్పులకు ఉపక్ర మించింది. ఈసారి మాత్రం పాఠ్యపుస్తకాల హేతుబద్ధీకరణ అన్న పేరుతో ఈ చర్యలు ప్రారంభించారు. దానిలో భాగంగా కొంత మేర పాఠ్య ప్రణాళికను తగ్గించారు. అది 20 శాతం వరకు ఉంది. కేవలం సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలలోనే కాదు, విజ్ఞానశాస్త్ర పాఠ్యాంశాలను కొంతమేరకు తగ్గించారు. విద్యార్థుల మీద పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకునే అప్పుడు మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు తొలగించిన చరిత్ర పాఠాలు ఇవి. మొదటిది సామాజిక సంస్కరణోద్యమాల ద్వారా భారతీయుల వస్త్రధారణలో వచ్చిన మార్పుల గురించి చెప్పే పాఠం. రెండు, క్రికెట్‌ ‌చరిత్ర.  ఈ చరిత్ర కూడా కేవలం క్రీడ గురించి కాదు, రాజకీయాలు, కులం, ప్రాంతానికి సంబంధించి దాని ప్రభావం కూడా అందులో భాగం. తాజాగా చేసిన మార్పు కొవిడ్‌ ‌తరువాత విద్యారంగంలో తీసుకున్న చర్యలలో భాగమే. దాని ప్రభావం నుంచి బయటపడిన విద్యార్థుల మీద భారం మోపరాదన్న ఉద్దేశంతోనే పాఠ్యప్రణాళికను కుదించారు. ఇదే పెద్ద రగడకు దారి తీసింది.

ఇప్పుడు తొలగించిన వాటిలో మొగలుల చరిత్రలోని కొన్ని భాగాలు, 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల••, కులాలకు, సామాజికోద్యమాలకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉన్నాయి. నిజానికి బీజేపీకి ఆయువుపట్టు వంటి 1975 నాటి అత్యవసర పరిస్థితి ఘట్టాలను కూడా రాజనీతి శాస్త్రం నుంచి తొలగించారు. దీనిని గమనించాలి. ఇంకా నర్మదా బచావో ఆందోళన, దళిత పాంథర్స్ ‌చరిత్ర, భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌ ‌చరిత్రలను కూడా తొలగించారు.

 ఏడో తరగతి పాఠ్య పుస్తకాలలో సుల్తానత్‌తో పాటు, మొగలు చరిత్రలో కొంత భాగం కూడా మినహాయించారు. బాబర్‌, ‌హుమాయూన్‌, అక్బర్‌, ‌జహంగీర్‌, ‌షాజహాన్‌, ఔరంగజేబ్‌లు ‘విజయాలు’ చెప్పే రెండు పేజీలను కూడా తొలగించారు. ఎన్‌సీఇఆర్‌టీ కత్తిరింపుల సంగతి కొద్దిసేపు మరచిపోయినా మొగలులు, సుల్తానుల చరిత్రలో వివాదాస్పద అంశాలు ఒక వాస్తవం. వాటిని  తిమ్మిని బ్రహ్మిని చేసే ప్రయత్నం కూడా వాస్తవం. ముస్లిం పాలనా యుగానికి ఒక వర్గం చరిత్రకారులు చెబుతున్న భాష్యం అచారిత్రకమే. బెంగాల్‌ను మార్క్సిస్టులు పాలించిన సమయంలో ముస్లిం దండయాత్రలను మరుగు పరచాలనీ, ఆ విధంగా దేశంలో మత సామరస్యాన్ని కాపాడవచ్చునని అభిప్రాయం పడడం ఒక వాస్తవం. కానీ దేవాలయాల ఆనవాళ్లతో ఇప్పటికీ మన ముందే నిలబడి ఉన్న ఇతర మతాల వారి దురాక్రమణ చిహ్నాల మాటేమిటి? ఘజనీ, ఘోరీలు దేశసంపదను కొల్లగొట్టారు.మొగలాయి పాలన అసలు రూపాన్ని బయటపెట్టినవారు లేకపోలేదు. ఆ కాలంలో దేవాలయాలు, జాతీయతా భావాలు చిత్తయి పోయాయి.

భారతీయుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు. స్వదేశీయుల మధ్య మిత్రభేదం కల్పించి, మత మార్పిళ్లు చేయించి, భరతమాత కడుపులో చిచ్చురగిలించారు. రాజ్యాలను కబళించారు. రాజకన్యలను అపహరించారు. ఆత్మగౌరవం కాపాడుకోవడానికి రాణి పద్మిని లాంటి మహిళలు ఆత్మాహుతికి పాల్పడ్డారు. అంభి అలెగ్జాండరును ఆహ్వానించి మాతృభూమికి, జయచంద్రుడు తురుష్కుడిని ఉసిగొలిపి పృథ్వీ రాజును చంపించి, జాతి సంస్కృతికి, సంస్కారానికి తీరని అపకారం చేశారు. ఆ బాటలోనే మొగలాయిలూ నడిచి భారతజాతి చరిత్రను, నాగరికతకు అపచారం చేశారు.

దేశంలో  బాబరుతో మొదలైన మొగలుల పాలన  ఔరంగజేబుతో దేశంలో  శతాబ్దాలు కొనసాగింది. ఆంగ్లేయ చరిత్రకారులు అలెగ్జాండరును, అక్బరును తమ పబ్బం గడుపుకోడానికి ఘనమైన చక్రవర్తులని పొగిడారు. నిజానికి, అలెగ్జాండరును మించిన రక్తపిపాసి, అక్బరును మించిన మతవాది చరిత్రలో కానరారు.

జలాలుద్దీన్‌ అక్బరు పాదుషా చదువు లేకపోయినా, తెలివిగా తోడర్‌మల్‌, ‌బీర్బల్‌, ‌రాజామాన్‌సింగ్‌ ‌లాంటి ప్రతిభామూర్తులను చేరదీసి, రాజ్యం ఏలాడు. మతమౌఢ్యం గూడుకట్టినా, మత సామరస్యం అంటూ రాజపుత్రికలను వివాహ బంధంలో, రసపుత్రవీరులను మైత్రీబంధంలో, బందీ చేశాడు. ఆధిపత్యంతోపాటు పరపతి పెంచుకోడానికి చేపట్టిన చర్యలు తప్ప దేశాన్ని ఉద్ధరించాలని కాదు. ఒక సామంతుడిని చంపించి నూర్జహాన్‌ను చేపట్టాడు జహంగీర్‌. ‌షాజహాన్‌ ‌కన్నతండ్రిని జైలుపాలుచేసి, అన్నలను హతమార్చి గద్దెఎక్కాడు ఔరంగజేబు. టోపీలు తగిలించి, హిందువుల జుట్టు కత్తిరించి, పేదరికం నటించాడు. కాశీ, అయోధ్య, మథుర, తురుష్క దండయాత్రలకు సజీవ ప్రతీక. చరిత్ర పునరావృతం కాకుండా, ఉజ్వల భవిష్యత్తుకు దారిదీపమై కొత్త వెలుగు ప్రసాదించడానికి తగిన చర్యలు చేపట్టడం, దిద్దుబాటు చేయడం, సత్యాన్ని పరిశోధించడం కోసం మార్పులు చేర్పులు తప్పుకాదు, తప్పనిసరి.

ఇక్కడే ఒక వాస్తవం గుర్తు చేసుకోవాలి. 2012లో యూపీఏ ప్రభుత్వం కూడా ఇలాంటి మార్పులే చేసింది. ఆ మార్పులలో జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, బీఆర్‌ అం‌బేడ్కర్‌ల మీద వచ్చిన వ్యంగ్య చిత్రాలను తొలగింపు ఒకటి. దానిని ఆనాడు విద్యావేత్తలు నిరసించారు.

About Author

By editor

Twitter
Instagram