– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌కలం కన్నా కత్తి గొప్పది. ఆ కత్తికి ఎదురునిలిచే స్వరం ఇంకా పదును.  గొంతులో హెచ్చుతగ్గులు ఉన్నట్లే, అభిప్రాయ తారతమ్యాలూ సహజంగానే వ్యక్తమవుతుంటాయి. ప్రధానంగా ప్రసార, ప్రచార, సమాచార రంగాల్లోని గళాలూ, కళాలూ సూటిదనానికి,  ధాటితత్వానికి ఉదాహరణలు. వార్తలు చెప్పినా / రాసినా, వ్యాఖ్యానాలు చేసినా / వినిపించినా, విమర్శల విశ్లేషణల హోరు కొనసాగించినా మూలాధారమంటూ ఒకటి ఉండనే ఉంటుంది. జనహితమే అభిమతమైనప్పుడు, సామాజిక ప్రయోజనమే అంతిమ లక్ష్యంగా స్పష్టమైనప్పుడు అదురూ బె•దురూ ఇంకెందుకు? నిజాయతీ నిబద్ధతలే స్వభావాలుగా ఉన్న ఒక గళ యోధురాలు ఆ విధంగానే వ్యవహరించారు. తనవైన అనుభవాలను,  అభిప్రాయాలను సంఘ స్థితిగతులకు సమన్వయించి ఓ బాధ్యతతో ప్రవర్తించారు.  అందునా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన వెలువడిందా వనితావాణి. తనకు నచ్చిన, తాను మెచ్చిన ప్రజా కార్యక్రమంలో ఆమె భాగస్వామ్యం కావడం సర్వసాధారణమే. అందులో వింతా విశేషం ఏమీ లేవు. ఉండాల్సిన అగత్యమూ లేదు. ఆ సీనియర్‌ ‌జర్నలిస్టు పనిచేస్తున్న న్యూస్‌ ‌ఛానెల్‌ ‌మాత్రం – ఏదో నేరం జరిగినట్లు భావించింది, ఎంతో ఘోరం చోటు చేసుకుందని చలించిపోయింది.


ఊరికే ఊరుకుంటే ఊరా, పేరా? యాజమాన్యమంటే మాటలా!  కంటగింపు పెచ్చు పెరిగిన దర్పం. అసలే మందమైన తన జూలును పదేపదే విదిల్చింది. అంతటి విదిలింపు, అదలింపుల పర్యవసానంగానే  ఆ పాత్రికేయురాలి మీద సస్పెన్షన్‌ ‌వేటు పడింది. అదీ చాలదన్నట్లు ద్రోహబుద్ధినీ ఆమెకు అంటగట్టి, వరస వేధింపులకు తెరతీసిందా పెత్తందారీ తత్వం? వీటన్నింటి విజృంభణతో, కేరళలో మరీ ముఖ్యంగా వృత్తి జర్నలిజం మీద అణచివేత పతాకస్థాయికి చేరినట్లయింది. అదేమని ఎవరైనా నిలదీస్తే ‘అవునా? మేమా? చర్య తీసుకున్నామా? అదే  నిజమైతే… తప్పనిసరి కాబట్టే తీసుకున్నట్లున్నాం’ అని ఆ భారతీయత వ్యతిరేక వర్గం చెబుతుంది. ఆగ్రహించిన జర్నలిస్టు సంఘాలు, జనజాగృత సంస్థలు మరింతగా నిరసన భేరి మోగించడంతో  ఆ రాష్ట్రంలో ఏమైందంటే…

ఒక్క సిరాచుక్క లక్షలాది మెదళ్లకు కదలిక. నీతి నిండిన ఒక్క మాటైనా నోటినుంచి దూసుకొస్తే, ఆ పటిమకు ఎదురేలేదిక. కేరళ జర్నలిస్టు సుజయ పార్వతికి మొదటి నుంచే శషభిషలు నచ్చవు. మొహమాటం వంటి అలవాట్లు ఏనాడూ లేవు. విధి నిర్వహణ ఒక్కటే తనకు తెలుసు. తన పనీ తాను అన్నట్లు ఒద్దికగా ఉండే ఆమెను ఇంటాబయటా అందరూ ఎంతో ఆదరణగా ‘డాలీ’ అని పిలుస్తుంటారు. నాలుగు పదులు వయసుదాటిన ఆ మహిళామణి స్వస్థలం కొచ్చి. ప్రజాసంబంధాల రంగంలో పోస్టుగ్రాడ్యు యేట్‌. ‌తల్లిదండ్రులకు  ఏకైక సంతానం. తాను కర్తవ్యం నిర్వహించే / నిర్వహించిన సంస్థకు సమ ప్రాధాన్యం. అది ఇరవై నాలుగు గంటలూ (రోజంతా) వార్తల ప్రసార వ్యవస్థ. అక్కడి సంపాదక బృందంలోనే తనది కీలక భూమిక. విశ్లేషణలు రాసినా, చేసినా, వ్యక్తీకరించినా తనదే ప్రశస్థ పాత్ర. విధి నిర్వహణలో ఎవరి నుంచీ మాట పడరు. అనవసరంగా ఎవరినీ ఏ మాటా అనరు. విధేయత ఉంటుందే కానీ- వ్యక్తిగతంగా కాదు, సంస్థాపరంగా. అటువంటి మనస్తత్వమున్న ఆమె వనితా దినోత్సవాన భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ఏర్పాటుచేసిన సదస్సుకు వెళ్లి మాట్లాడారు. జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ, అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన రీతిని మెచ్చుకున్నారు. ఈ మెచ్చు కోలులో వాస్తవిక పరిశీలనే తప్ప, మరి ఏ విధమైన ఇతర ప్రమేయమూ లేదని, ఉండదని అందరికీ తెలుసు. తెలియంది, తెలుసుకోవాలని అనుకోనిదీ తాను పనిచేస్తున్న వార్తా సంస్థ మాత్రమే! అందునా కార్యనిర్వహణ అధికారం చలాయించే వ్యక్తికి జాతీయత అంటే పడదు, భారతీయత అనే పదమే నచ్చదు. ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌ ‌పేరిట ఆమెపైన ఆయుధ ప్రయోగం చేశాడు. అదే అతగాడి మెడకు చుట్టుకుంది.

చెక్కు చెదరని ధీరత

నిబద్ధురాలి పిడికిలి బిగిసింది. ‘ప్రజలకు మేలుచేసే అంశాన్ని నేను మాట్లాడకూడదా’ అని అనిష్టుల్ని నిలదీశారామె. బానిసత్వం కాదు కావాల్సింది,  ప్రతి ఒక్కరు  భావవ్యక్తీకరణ శక్తినే  కోరుకోవాలంటూ పిలుపునిచ్చారు.  సుజయ పార్వతికి ఎందరెందరో మద్దతు పలికి అండ నిలవడంతో, అనిష్టులు దిగివచ్చారు. ఆ మేర ఆమె తిరిగి ఉద్యోగబాధ్యతలు స్వీకరించి 24 గంటలైనా కాకుండానే రాజీనామా చేసేశారు! ‘ఉద్యమ ఉత్తేజం పెల్లుబికిన వేళ, నా వెంట నిలిచిన సహృదయులందరికీ అభివాదం’ అని ప్రకటించారు. ఎంతో ఉద్యమిస్తేనే ఇంత మధుర విజయం లభించిందని ఆ పడతి అనడంలో కృతనిశ్చయం, ఆత్మవిశ్వాసం జోడుగా ప్రతిఫలిం చాయి. కాషాయం అంటేనే కాళ్లు వణికేవారికి దడ, గడబిడ గుండెల దాకా పాకేలా చేసింది తన ధీరోదాత్తత. ఉపాధి, ఉద్యోగం అనేవి అన్ని విధాలా ఎదగనివ్వాలి. మంచిచెడులను ఎంచి చూసే వివేచనను పెంచాలి. అలా కానప్పుడు తనదైన పంథా తనకు ఎప్పుడూ ఉంటుందని నిరూపించారామె. ఈ నిరూపణ మరెవరి పొగడ్తకోసమో కాదు, తను పుట్టి పెరిగి ఎదుగుతున్న సమాజం పట్ల కృతజ్ఞత కోసం. అందువల్లనే తన పేరు ఒక్క  కేరళలోనే కాదు, దేశమంతటా ఇప్పుడు ఇంకా మారుమోగు తోంది.  ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉంటున్న మలయాళీలతో పాటు ఇతర ప్రాంతీయ భాషలవారికీ తానిప్పుడు ఆదర్శ నాయిక.

అన్నిటికీ ఒక్కటే సమాధానం

ప్రాంతాలతో పాటే దేశీయ, అంతర్జాతీయ సమాచార సాధనాలన్నీ సుజయ పార్వతివైపే చూపుసారించాయి. ఎంత బాగా రాస్తారో అంతే ధాటిగా మాట్లాడే ఆమె ప్రత్యేకించి మూడు ప్రశ్నల్ని మీడియా యాజమాన్యాల ముందు ఉంచుతున్నారు. అవి:

  1. ప్రభావం చూపే రంగాల్లోనివారు, ప్రధానంగా గళం/ కలం వీరులు వాటిని సర్వకాల సర్వావస్థల్లోనూ యాజమాన్యాల ఎదుట ఉంచి మోకరిల్లుతూ ఉండాలా?
  2. విద్యాభ్యాసాన్ని తిరువనంతపురంలో కొనసాగించిన వ్యక్తి ఆమె. ఆంగ్లభాష, సాహిత్య అంశాల పట్టభద్రురాలు, మీడియా స్టడీస్‌లో కేరళ వర్సిటీకి తలమానికంగా నిలిచినవారు. రిపోర్టర్‌ / ‌వ్యాఖ్యాత / విశ్లేషకురాలిగా అనేకచోట్ల చక్కని గుర్తింపు, గౌరవం అందుకున్న దక్షురాలు. ప్రయాణాలు చేయాలన్నా, చూసిన వాటిని  పౌరులందరితో వివరాలు పంచుకోవాలన్నా ఎనలేని మక్కువ. దేశ రాజధాని నగరంలోనూ మునుపు కొన్నేళ్లు రిపోర్టింగ్‌ ‌బ్యూరో చీఫ్‌గా పని చేసిన వారు. ఇంతటి విశేష నేపథ్యమున్న సుజయ ఒక అంతర్జాతీయ దినోత్సవ సమావేశంలో మాట్లాడటం అనేది ఏకంగా ఉద్యోగం నుంచే సస్పెండ్‌ ‌చేసేటంత నేరమా? రాజకీయాలతో అంటకాగుతున్న ఛానెళ్ల యాజమాన్యాలు తమ సంస్థల్లోకి ఎవరిని కోరుకుంటున్నాయి. వివేచన శీలత గలవారినా, పైవాళ్లు ఏది చెబితేదాన్ని తలాడిస్తూ పాటించినట్లు కనిపించే మరమనుషులనా?
  3. పొట్టకూటికోసమే అయితే, చేసేందుకు వ్యాపారాలూ, ఉద్యోగాలూ చాలా ఉన్నాయి. తన ఆలోచన, పని ఇతరులకు ఉపకరించాలనే వారికి జర్నలిజం మాత్రమే ఆధారప్రాయం. అంతటి విశిష్ట రంగంలో పనిచేస్తూ, సమయాన్నీ శక్తినీ జీవితమంతటినీ అంకితం చేసే జర్నలిస్టులకు యాజమాన్యాలిచ్చే నజరానాలూ సస్పెన్షన్లూ తొలగింపులేనా?

నిబద్ధతతో ఘన సాధన

వీటికి వరస సమాధానాలను ఆచరణ రూపంలో ఇచ్చిన ఘనత సుజయ పార్వతిది. ఆమె ఇప్పుడు, ఇకముందు కూడా కొనసాగేది వార్తా ఛానెళ్లలోనే. కొత్తగా ఎందులో చేరినా, తనదైన వృత్తిగత అనుభవాన్ని ఏ సంస్థకు పంచి ఇవ్వాలనుకున్నా నిర్ణయం ఆమెదే. భావాలు అనుభవాలను బట్టి  ఎప్పుడూ గళానికీ, కలానికీ స్వతంత్రనే కోరు కుంటున్నారు. ఉద్యోగాలు మారడమన్నది జర్నలిస్టులకు పరిపాటి. సంస్థలు మారవచ్చేమో కానీ, స్వతంత్రతా భావాలైతే మారవు. ఆ స్వతంత్ర స్వభావం భారతీయతతో ముడివడి ఉంటే, అంతకుమించి దేశానికి కావాల్సిందీ ఇంకేం ఉంటుంది? ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు మన జీవితాల్లో భాగాలు. వాటిని కాదని, కూడదని దర్పం చూపించడమే యాజమాన్య అధికారమైతే, ఏ జర్నలిస్టూ తలొగ్గారు. సుజయ పార్వతి వంటి అభిమానధనులు కొందరైనా నేడు మనముందు ఉంటున్నారు. వికృత పోకడల నియంతృత్వాన్ని పాఠక/వీక్షక జన అండదండలతో నిలువరిస్తు న్నారు. ప్రసార సమాచార సాధనాల నిర్వహణ రంగంలో ఉంటూనే సహచర జర్నలిస్టులపైన నానారకాల సతాయింపులకు దిగేవాళ్లకి సుజయ ఆత్మవిశ్వాస తేజం నిరంతర చెంప పెట్టు. స్ఫూర్తి ఇచ్చేవారు, తెచ్చేవారు ఇంకెక్కడో ఉండరు.. మనలోనే మనతోనే మన మధ్యనే ఉండి విజయగీతిక ఆలాపిస్తారు. నిదర్శనం సుజయ పార్వతి. ఆ ధీరతకే జాతీయవాదుల, దేశాభిమానుల అభివాద హారతి.

About Author

By editor

Twitter
Instagram