– గోపరాజు

ఆయననూ, సంస్కృతాంధ్రాలకు ఆయన చేసిన నిరుపమాన సేవలనూ అవలోకిస్తే ‘పూర్ణఘట న్యాయం’ (నిండుకుండ తొణకదు అన్నట్టు) గుర్తుకు వస్తుంది. ఆయనే ఆచార్య రవ్వా శ్రీహరి (సెప్టెంబర్‌ 12, 1943-ఏ‌ప్రిల్‌ 21, 2023). ‌పడుగూపేకల వంటిది ఆయన జీవితం. ఒక సాధారణ చేనేత పనివారి కుటుంబంలో పుట్టిన ఆచార్య శ్రీహరి విశ్వవిద్యాలయ అధ్యాపకునిగా, ఆచార్యునిగా, కులపతిగా ఒక్కొక్క మెట్టు ఎక్కారు.

నల్లగొండ జిల్లా, వలిగొండ మండలం, వెల్వర్తి గ్రామంలో శ్రీహరి పుట్టారు. తల్లి నరసమ్మ, తండ్రి నరసయ్య. ఐదో తరగతిలో ఉండగానే అమ్మ కన్నుమూశారు. ఒకరోజు అనుకోకుండా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి సంస్కృత విద్యాపీఠం విడుదల చేసిన ప్రకటన చూసి, ఆ సంస్థలో చేరారు. తరువాత సీతారాంబాగ్‌ ‌సంస్కృత కళాశాలలో డీఓఎల్‌, ‌జీవోఎల్‌ ‌వ్యాకరణం అభ్యసించారు. తర్కం, విశిష్ట అద్వైతం, వేదాంతశాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించారు. ఆపై తెలుగు పండిట్‌ ‌కోర్సు, బీఏ, ఎమ్మే కూడా పూర్తి చేశారు. ‘భాస్కర రామాయణం- విమర్శాత్మక పరిశీలనము’ అన్న అంశం మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అం‌దుకున్నారు. ఆచార్య బిరుదురాజు రామరాజు సాయంతో అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. హైదరాబాద్‌ ‌కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా పదిహేడు సంవత్సరాలు సేవలు అందించారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం సహా ఎన్నో పురస్కారాలు పొందారు. 2002లో ద్రావిడ విశ్వవిద్యాలయం కులపతిగా నియమితులయ్యారు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణ విభాగానికి ఎడిటర్‌ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.

ఐదో తరగతి వరకు ఆయనది మామూలు చదువు. కానీ పరిస్థితులు సంస్కృత విద్యవైపు నడిపించాయి. ‘బుల్తా ఖాయిదా’ (ఉర్దూ పెద్ద బాలశిక్ష) పూర్తయింది. తల్లి పోయిన తరువాత తండ్రి ఇక చదివించలేనని చెప్పేశారు. ఆ మాట, చదువు మీద ఉన్న ఇష్టం యాదగిరిగుట్టకు పంపాయి. అక్కడ చదువు, భోజన వసతి ఉచితం. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, సురవరం ప్రతాపరెడ్డి, మందుముల నరసింగరావు దయతో అందులో ప్రవేశం దొరికింది. వేకువనే లేవడం, కొందరు సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే, మిగిలినవారు పురాణ పఠనం చేయడం, తరువాత ప్రసాదమే ఉపాహారంగా వడ్డించడం అన్నీ ఆయన ఏనాటికీ మరచిపోలేదు. ఆయన మొదటి గురువు కేరళ సుబ్రహ్మణ్యశాస్త్రి. గురువులు శఠగోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యులు వంటివారిని ఆయన మరచిపోలేదు. రామానుజాచార్యులు ఇంటికి పిలిచి వ్యాకరణం ప్రత్యేకంగా బోధించేవారు. ఆ గురువు శిష్య వాత్సల్యం, శ్రీహరి శ్రద్ధాసక్తులు వ్యాకరణ సార్వభౌముడిని చేశాయి.

 చదువుకున్నది సంస్కృతమే అయినా డాక్టర్‌ శ్రీ‌హరి భాషాసాహిత్య సేవ బహుముఖాలుగా విస్తరించింది. అందుకు ఆయన రచనలే సాక్ష్యం. ‘సంకేత పదకోశము’, ‘తెలంగాణ మాండలికాలు- కావ్యప్రయోగాలు’ (మాండలికాలంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనే చెప్పుకున్నారు), ‘వ్యాకరణ పదకోశము’, ‘నల్లగొండ జిల్లా మాండలిక పదకోశము’, ‘శ్రీహరి నిఘంటువు’ (సూర్యరాయాంధ్ర నిఘంటువులో చోటు దక్కని 35,000 పదాలతో), ‘అన్నమయ్య సంకీర్తన నిఘంటువు’, ‘ప్రాకృతాంధ్ర నిఘంటువు’ ఆయన వెలువరించారు. సంస్కృతంలో ‘మాతృగీతమ్‌’, ‘‌పిరదౌసీ’, ‘తైలపాయికా’ (గుర్రం జాషువ గబ్బిం పద్యకావ్యానికి సంస్కృతానువాదం), ‘ప్రపంచ నదీ’, ‘సంస్కృత వైజయంతి’, ‘అన్నమాచార్య సూక్తిసుధా’ రాశారు. ఇక ‘ఉభయభారతి’, ‘తెలుగు కవుల సంస్కృతానుకరణలు’, ‘తెలుగులో అలబ్ధ వాఙ్మయం’, అన్నమయ్య భాషా వైభవం’ డాక్టర్‌ శ్రీ‌హరి విమర్శ, పరిశోధన గ్రంథాలు. పాణిని ‘అష్టాధాయి’, ‘లఘు సిద్ధాంత కౌముది’ ఆయన సంస్కృతం నుంచి చేసిన తెలుగు అనువాదాలు. ఇవి కాకుండా ‘సంస్కృత న్యాయదీపిక’ ఆయన ఈతరం వారికి అందించిన చిరస్మరణీయ అక్షర కానుక. ఇది తెలుగు వివరణంతో కూడిన వేయి సంస్కృత న్యాయాల సంకలనం. ఈ పుస్తకం చదవడం గొప్ప అనుభూతి. అంతా దేవభాష అని సమ్మానించు కుంటున్నప్పటికీ సంస్కృత భాషకు ఉన్న లౌకిక పరిధి, విశ్వజనీనత ఈ న్యాయాలలో కనిపిస్తుంది. ‘న్యాయం’ అన్న పదానికి ఆయన చక్కని వివరణ ఇచ్చారు. ‘న్యాయం అన్న పదానికి సంస్కృతవాచస్పత్య నిఘంటువులో ఇతరార్థాలతో పాటు వేదార్థాన్ని నిర్ణయించడానికి సాధనమైన అధికరణమనీ, లోకంలోనూ, శాస్త్రంలోనూ ప్రసిద్ధంగా కనిపించే దృష్టాంతమనీ రెండర్థాలు చూపబడ్డాయి’ అని చెప్పారు డాక్టర్‌ శ్రీ‌హరి. వ్యాకరణాది శాస్త్రాలలోను, సాహిత్యంలోనూ ఆయా విషయాలను నిరూపించేటప్పుడు ఈ న్యాయాలను ప్రయోగించడం పరిపాటి. విషయ నిరూపణ సందర్భంలో ఒక దృష్టాంతాన్ని చెప్పినప్పుడు న్యాయాలను ఉపయోగిస్తే విషయం మరింత స్పష్టంగా, లోతుగా తెలుస్తుంది. గాఢంగా తాకుతుంది. అందుకే పూర్వ పండితులు, కవులు, ఇతర మహానుభావులు అంతా న్యాయాలను ఆశ్రయించారు. కాబట్టి మన పురాతన సాహిత్యం సాకల్యంగా అర్ధం కావాలంటే న్యాయాలను అధ్యయనం చేయడం అనివార్యమంటారు డాక్టర్‌ శ్రీ‌హరి. 2006లో వెలువడిన ఈ పుస్తకం ఆయన ప్రతిభకూ, పరిశోధనా పటిమకూ, అభిరుచికీ అద్దం పట్టింది. అందులో కొన్నింటి గురించి చర్చించు కోవాలి. ఏ న్యాయం తీసుకున్నా అందులోని కవితాత్మ, సముద్రాన్ని తలపించే భావం, పద చిత్రాలు, అక్షర సంగీతం, మనలను విస్మయ పరుస్తాయి.

ఒక గదిలో కాకుండా, నట్టింట్లో దీపం పెడితే మొత్తం కాంతిమంతమవుతుంది. ఈ భావాన్నే ‘అంతర్దీపికా న్యాయం’ అని అంటారు. ‘దేహళీ దీపన్యాయం’ కూడా ఇలాంటిదే. అంటే- గడప మీద దీపం ఉంచితే ఇంటా బయటా కూడా వెలుగు ప్రసరిస్తుంది. ప్రస్తుతం మనలో ఎక్కువ మంది ఢిల్లీ అని పిలుస్తున్న దిల్లీ దీని నుంచి వచ్చిన పదమేనన్న వాదన ఉంది. ‘అంధగజ న్యాయం’ (ఏనుగును అంధులంతా తలా ఒక విధంగా భావించుకోవడం), ‘అంధకర దీపికాన్యాయం’ (అంధుడి చేతిలో దీపం), ‘అంధగోక్షేత్ర న్యాయం (గుడ్డెద్దు చేలో పడినట్టు) ఇలాంటివే. ‘కరదీపికా న్యాయం’ అని మరొకటి. మన చేతిలో దీపం ఉంటే, మనకే కాదు, ఇతరులకూ అది దారి చూపుతుంది అని దీని భావం. రైళ్లు, బస్సులలో ప్రయాణించినప్పుడు అందరికీ ఎదురయ్యే అనుభవం -కదులుతున్న మనం కాకుండా, స్థిరంగా ఉండే చెట్లూ, స్తంభాలే కదలిపోతున్నట్టు భ్రమ కలగడం. దీనినే ‘అచలచల న్యాయం’ అంటుంది సంస్కృతం. ‘అదగ్ధదహన న్యాయం’ (నిప్పు కాలని వస్తువును మాత్రమే కాలుస్తుంది కాని కాలినదానిని కాల్చలేదు అన్నట్టు). నిప్పును నిప్పు కాల్చదట. ‘అధికరణ సిద్ధాంత న్యాయం’ (ఒక సిద్ధాంతంలో మరో సిద్ధాంతం అంతర్భూతమై ఉన్నట్టు), ‘అనిషిద్ధానుమత న్యాయం’ (నిషేధం లేనప్పుడు అంగీకరించినట్టే) వంటి న్యాయాలలోని భావం ఎంత లోతుగా ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఏ న్యాయమైనా ఒక నిండైన తాత్త్వికతను అలంకరించు కుని ఉంటుంది.

‘అపరితానల భూతల న్యాయం’- ఇందులోని భావాన్ని గమనిస్తే దేవభాష ప్రాపంచిక దృష్టి ఎంత లోతయినదో అనుభవానికి వస్తుంది. ఈ న్యాయానికి అర్ధం ఏమిటంటే, భూమి మీద రగిలించిన నిప్పును అక్కడి నుంచి తొలగించినా ఆ స్థలంలో కొద్దిసేపటి వరకు వేడి తొలగిపోదు. ‘అబ్ధిఫేనాదిన్యాయం’ కూడా అలాంటిదే. సముద్రం శాశ్వతమే అయినా, అందులో కనిపించే నురుగ మాత్రం అశాశ్వతమైనదని దీని భావం. సమాజంలోని వికృత, అతి పోకడలను ఈ న్యాయాలు తూర్పారపడతాయి. ‘అర్థకుక్కుటీ న్యాయం’ అలాంటిదే. కోడిని సగం కోసి వండుకుని, మిగిలినదానిని గుడ్లు పెట్టడానికి అట్టేపెట్టుకుందాం అని దీనర్ధం. ఇదే ఇంకొకరూపంలోను ఉంది. అదే ‘అర్థవైశస న్యాయం’.మాంసం కోసం కోడి గొంతు కోయడం, గుడ్ల కోసం కడుపును మిగుల్చుకోవడం అని దాని అర్ధం. సాధ్యంకాని పనినీ తెలియచేస్తుందీ న్యాయం. ఇలాంటి అసాధ్యాల గురించి చెప్పే న్యాయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి- ‘అర్ధజరతీయ న్యాయం’. శరీరంలో సగభాగంలో ముసలితనం, సగభాగంలో యౌవనం ఉన్న స్త్రీ ఎక్కడా ఉండదు అని భావం. వ్యర్థ ప్రయత్నాల గురించి చెంపచెళ్లుమనిపించే రీతిలో చెప్పే న్యాయాలూ తక్కువేమీ కాదు. ఉదా: ‘ఉదకే విశీర్ణ న్యాయం’. అంటే నీటిలో ఎండబెట్టినట్టు. ఎంత చక్కని వ్యక్తీకరణ ఇది.

‘గోపగృహిణీ న్యాయం’ గురించి తెలుసు కుంటున్నప్పుడు ఈడిపస్‌ ‌కథ జ్ఞాపకం రావడం అసహజం కాదు. దీనికే తెలుగులో వగపేటికి చల్ల చిందినన్‌ అన్న పద్యపాదం కూడా ఉంది. ‘చందనగుణ న్యాయం’ అంటే చందనవృక్షం తన సమీపంలో ఉన్న ఇతర జాతి వృక్షాలకి కూడా తన పరిమళాన్ని వ్యాపింప చేస్తుంది. ఇలాంటిదే ‘చందన న్యాయం’. చందన తైలాన్ని శరీరంలోని ఏ భాగానికి పూసినా శరీరం మొత్తానికి ఆహ్లాదం కలిగిస్తుంది. కానీ ఇందులో చూడవలసింది-వేదాంతమే. ఆత్మ అనేది హృదయంలో ఉన్నా శరీరం మొత్తమంతా అది ఉన్నట్టు అని దీని అంతరార్ధం. ‘జలచంద్ర న్యాయం’లో కనిపించేది కూడా ఇలాంటి లోతైన భావనే. మామూలు వివరణ ప్రకారం- చంద్రుడు ఒక్కడే. అయినా వేరు వేరు ప్రాంతాలలో ప్రతిబింబాలు పడి అనేక చంద్రులుగా కనపడినట్టు అని అర్ధం. విస్తృతార్థంలో మాత్రం ఆత్మ ఒక్కటే. అయినా వివిధ శరీరాలో నిలిచి అనేకత్వం పొందినట్టు కనిపిస్తుంది అనే. సూర్యుని మీద కూడా ఇలాంటి న్యాయం ఉంది. అదే- ‘తరంగప్రతిబింబ న్యాయం’. అంటే, కెరటాలలో ప్రతిబింబించే సూర్యుడు ఒక్కడే. అయినా ప్రతిబింబాలు చాలా కనిపిస్తాయి. ఆత్మ ఒక్కటే అయినా అనేక ఉపాధుల యందు ప్రతిబింబించి అనేక ఆత్మలుగా ప్రతిబింబిస్తుంది అని అర్ధం.

ఆజ్ఞానాన్ని చీకటితోనూ, జ్ఞానాన్ని వెలుగుతోనూ సంకేతిస్తుంది సంస్కృతం. ‘చక్షుర్దీప న్యాయం’లోని అంతరార్థం అదే. చీకటి తొలగిపోవడానికి దీపం ఉండాలి సరే, చీకట్లు తొలగిన వాస్తవాన్నీ, వేకువ పొడిచిన నిజాన్నీ గమనించడానికి కళ్లు కూడా ఉండాలి అంటుందీ న్యాయం. అంటే ఒక పనిని సాధించడానికి బుద్ధి, ప్రయత్నం రెండూ అవసర మవుతాయని నిగూఢంగా చెబుతుంది. దీపాలతో పోలిక చెప్పే న్యాయాలు ఈ పుస్తకంలో కోకొల్లలు, ‘తమోదీప న్యాయం’ అందులో ఒకటి. అంటే, దీపంతో చీకటిని చూసినట్టు. దీని అసలు భావం, జ్ఞానంతో మాత్రమే అజ్ఞానాన్ని గమనించగలం అనే. ‘దీప కలికా న్యాయం’ (దీపం చిన్నదే అయినా చీకటినంతటినీ మింగేస్తుంది) అలాంటిదే. ఇంకా లోతైన భావనను అందించే న్యాయం- ‘నివాతస్థిత దీప న్యాయం’. అంటే గాలి లేని చోట దీపం ఉంచినట్టు. చపలత్వం లేని మనసు నిశ్చలంగా ఉంటుందని అసలు భావం. మనిషికీ, భ్రాంతికీ మధ్య ఉన్న బంధం గురించి అనేక న్యాయాలు ఉన్నాయి. ‘దండపట న్యాయం’, ‘దగ్ధపట న్యాయం’ అలాంటివే. వస్త్రం కాలిపోయినా కొద్ది తడవు నూలుపోగులు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అవి చేతికి మాత్రం రావు. ధనమంతా పోయినా దాని మీద అభిమానం కొంతకాలం నిలిచి ఉంటుంది అని ఈ న్యాయాలు గొప్ప అర్ధాన్ని వ్యక్తీకరిస్తాయి.

ఈ పుస్తకంలో పొందుపరిచిన న్యాయాలలో చాలావరకు తెలుగుకు కూడా విస్తరించాయి. ‘అరణ్యచంద్రికా న్యాయం’ (అడవిగాచిన వెన్నెల), ‘అరణ్యరోదన న్యాయం’, ‘కంటక న్యాయం’ (ముల్లును ముల్లుతోనే తీయాలి), ‘కంబళ భోజన న్యాయం’ (గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు లెక్కించినట్టు), ‘కణజ మూషక న్యాయం’ (గాదె కింద పందికొక్కు), ‘కరికపిత్థ న్యాయం’ (కరిమింగిన వెలగ), ‘కాకత్రోటి బింబన్యాయం’ (కాకిముక్కుకు దొండపండు), ‘క్షతే క్షారన్యాయం’ (పుండుమీద కారం చల్లినట్టు) వంటివి ఎన్నో కనిపిస్తాయి.

సంస్కృతం మృతభాష అని తొందరపాటు వ్యాఖ్య చేసే వారికి డాక్టర్‌ శ్రీ‌హరి దీటైన సమాధానం ఇచ్చారు. నిజానికి ఇవాళ సంస్కృతాన్ని బతికిస్తున్నవే తెలుగు పత్రికలని ఒక సందర్భంలో ఆయన ఘంటాపథంగా చెప్పారు. ‘పంచవర్ష ప్రణాళిక’, ‘శిఖరాగ్ర సమావేశం’, ‘ఏకీకృత విధానం’, ‘మధ్యాహ్న భోజన పథకం’, ‘దళం’ వంటి పదాలన్నీ సంస్కృతమే నని ఆయన చెప్పేవారు. సంస్కృత భాషకు ఉన్న వ్యాకరణం అద్భుతమైనదని, దీనిని ప్రపంచంలోని ప్రతి భాషా శాస్త్రవేత్త అంగీకరిస్తాడని ఆయన అంటారు. ‘సంస్కృతమంటే వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారతాలే కాదు. అందులో సాంకేతిక సాహిత్యం కూడా ఉంది. దానిని ప్రాచ్య కళాశాల స్థాయిలో బోధించకపోవడం పెద్ద పొరపాటు. ఉదాహరణకి ‘బృహత్సంహిత’. ఇందులో వరాహ మిహిరుడు భూకంపాల వివరాలతో పాటు, కొన్ని భౌగోళిక శాస్త్ర అంశాలను చర్చించాడు. భాస్కరాచార్యుడి గణితశాస్త్రం కూడా అలాంటిదే’ నంటారు ఆచార్య శ్రీహరి.

సంస్కృతం మీద అజ్ఞానంతో వ్యాఖ్యలు చేయడం ఒక తప్పు. దానిని ఆర్షధర్మానికీ, సాహిత్యానికీ ప్రతినిధిగా ద్వేషించడం అజ్ఞానం. అలాగే న్యాయాలు, సామెతలు, నానుడులు వంటివి అంతరించిపోవడం, అంతరించిపోయే వాతావరణం కల్పించడం భాషకూ, సారస్వతానికీ ద్రోహం చేయడమే. భావాన్ని ‘పూసగుచ్చినట్టు’ వ్యక్తీకరించడానికి ఇవి దోహదం చేస్తాయి. అలాగే ఒక భాష సహజ సౌందర్యాన్ని కాపాడతాయి. ఆయా భాషల అస్తిత్వాన్ని కూడా ఇవే నిలబెడతాయి. ఆ విషయాన్ని డాక్టర్‌ శ్రీ‌హరి వంటివారు సరైన సమయంలోనే గుర్తించారు. చివరిగా ఆచార్య శ్రీహరి సంస్కృత న్యాయదీపికలో కనిపించే ఒక న్యాయం గురించి ప్రస్తావించుకుందాం. అది- ‘సోపానారోహణ న్యాయం’, మేడ ఎక్కదలిచినవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కి మాత్రమే పైకి వెళ్లగలడు అని అర్ధం. ఇక అంతరార్థం- ప్రాజ్ఞుడు క్రమక్రమంగా ఉన్నత స్థితిని పొందుతాడు. ఆచార్య శ్రీహరి జీవితం, కృషి దీనినే ప్రతిబింబిస్తాయి. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్ధిద్దాం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram