సహనానికీ ఒక హద్దు ఉంటుందని అంటారు. సహనం నశిస్తే తిరుగుబాటు అనివార్యం. అలాంటప్పుడు ఎంతటి శాంతమూర్తులకైనా ఆగ్రహం కలుగుతుందనేందుకు గాంధీజీ స్పందనే ఉదాహరణ. స్వామి రామానందతీర్థ, హైదరాబాద్‌లో నిజాం పరిపాలన తీరును, ప్రజల ఇక్కట్లను గాంధీజీకి వివరించినప్పుడు, ‘రజాకారులను చూసి పిరికి వారుగా పారిపోవడం కంటే ఆయుధాలు తీసుకు పోరాడండి. అన్ని సమస్యలకు సత్యాగ్రహమే పరిష్కారం కాదు. అవసరమైతే ఆయుధాలు ధరించండి, రక్షించుకోండి. వీరులుగా మిగలండి’అని గాంధీజీ కూడా ఉద్బోధించారు.

నిజాం పాలనలో తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ‘నీ బాంచను దొర (నీ బానిసను). నీ కాలు మొక్కుతా దొర’ అని అన్న తరువాతే విషయం చెప్పాలి. ఇది అక్కడ సర్వ సాధారణం. గ్రామాల్లో వివిధ వృత్తుల వారు ‘వెట్టిచాకిరీ’ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. దొరల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు గ్రామంలోని ఇతర కులాలవారు ఉచితంగా సంభారాలు సమకూర్చడం వంటివి జరిగేవి. గ్రామానికి వచ్చే అధికారులకు విందులు వినోదాలకు ధాన్యం, మాంసం, కూరగాయలు వంటివి అందచేసే బాధ్యతను ఊరందరికి అప్పగించేవారు. దొరల గడీల్లో వెట్టి పనిచేసి దయనీయంగా జీవితాన్ని గడప వలసి వచ్చేది.

స్వాతంత్య్రం వచ్చిందని దేశవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటూంటే తెలంగాణా ప్రజలు మాత్రం భయం గుప్పెట్లో క్షణమొక యుగంగా బతుకుతున్నారు. రజాకార్లు తపంచాలతో ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తారోనన్న భయం ఒకవైపు, ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వాన్ని కూల్చాలనే తలంపుతో కమ్యునిష్టుల దాష్టీకం మరొకవైపు. వీరిద్దరిని అదుపు చేయడానికి ప్రభుత్వం చేపట్టిన పోలీసుచర్య. ఎటుచూసినా తపంచాల మయం, భయం గుప్పెట్లో ప్రజలు.

రైతుకు భూమి పట్ల ఉండే ఆశను వారు పూర్తిగా వినియోగించుకున్నారు. ‘‘నెహ్రూ ప్రభుత్వం పేద ప్రజల దురవస్థలన్నిటికీ కారణం. ఈనాడు లభించిన స్వాతంత్య్రం నిజమైన స్వాతంత్య్రం కాదు. అందుచేత మనం ఆ పరిపాలకులతో గట్టి పోరాటం జరిపి, భూస్వాముల నుండి విముక్తి సాధించాలి. అందు కోసం వీలైన మార్గాలన్నిటినీ అనుసరించాలి’’ అని ఆలోచించి జమీందార్ల గడీలను, మేడలను నేల మట్టం చేశారు. తిండిగింజలను నిల్వ చేసే వారి గాదెలను, పశువులను, గడ్డిమేట్లను తగులబెట్టారు. ఈ కార్యక్రమాలను సమర్ధించని వారిని క్రూరంగా ఖూనీ చేశారు. పట్టపగలు మిలిటరీ వారి జులుం భయం, రాత్రిళ్లు కమ్యూనిష్టుల దాడి భయం. రజాకార్ల భయం ఎలానూ ఉండనే ఉంది. పరిస్థితి ఎంతో విషాదకరంగా ఉందని స్వామి రామానంద తీర్థ వాపోయారు.

ఆ రోజుల్లో ఖాసింరజ్వీ బాధ్యతా రాహిత్యంగా ఉపన్యాసాలు ఇచ్చాడు. ‘మా ప్రభువు పాదాల్ని బంగాళాఖాతం (తూర్పు సముద్రం) జలాలు క్షాళనం చేసే రోజు అనతి కాలంలోనే వస్తుంది’ అని వ్యాఖ్యా నించాడు. అంతటితో అతని ఆవేశం ఆగలేదు ‘‘అసఫ్‌జాహీ నవాబుల పతాకం ఢిల్లీలోని ఎర్రకోటపై రెపరెప లాడుతుంది’’ అనే వరకు విజృంభించింది. మీనన్‌ ‌వెల్లడించిన అభిప్రాయం ప్రకారం ‘‘ఖాసిం రజ్వీ కత్తి ఝళిపింపులు ఎక్కువగా చేస్తూ, సర్వ స్వతంత్ర ఇస్తామిక్‌ ‌రాజ్యం ఏర్పడే వరకూ హైదరాబాద్‌ ‌ముస్లింలు దూసిన కత్తులను వరలో పెట్టవద్దని రెచ్చగొట్టాడు.

ఒక చేతిలో ఖురాన్‌, ‌మరో చేతిలో కత్తి ధరించి శత్రువులను వేటాడవలసిందని రజ్వీ ఉద్భోదించాడు. వీటికన్నా అత్యంత ప్రమాదకర ప్రకటన ఒకటి చేశాడు. ఇండియన్‌ ‌యూనియన్‌లో ఉన్న 45 మిలియన్ల (నాల్గున్నర కోట్ల) ముస్లింలు హైదరాబాద్‌ – ఇం‌డియన్‌ ‌యూనియన్ల మధ్య జరిగే ప్రత్యక్ష పోరాటంలో హైదరాబాద్‌ ‌పక్షాన గూఢచారులుగా, అంతర్‌ ‌శత్రువులుగా పని చేస్తారనేదే ఆ ప్రకటన సారాంశం.

యథాతథపు ఒడంబడిక ప్రకారం, భారత ప్రభుత్వం హైదరాబాదులో తన ఏజెంట్‌ ‌జనరల్‌ ఒకరిని నియమించవచ్చు, కె.ఎం.మున్శీని ఆ పదవిలో నియమించడానికి నిర్ణయం జరిగింది. ఈలోగా హైదరాబాద్‌లో పరిస్థితులు త్వరితంగా విషమిస్తున్నాయని, సత్యాగ్రహోద్యమం ఆపి మీ శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి ఆత్మరక్షణ చేసుకోవాలని, మీ ధన, ప్రాణాలను మీరే రక్షించు కోవలసిన క్లిష్ట పరిస్థితి వచ్చిందని ప్రజలకు చెప్పడం భావ్యంగా గుర్తించామని రామానందతీర్థ ఆ సందర్భంలో గాంధీజీని కలసి ఈ విషయాన్ని వివరించగా, ‘‘మీకు ఎట్లా సాధ్యమైతే అట్లా ఆత్మరక్షణ చేసుకొనండ’ని హైదరాబాదు ప్రజలకు సూచించి నట్లు చెప్పారు, ఈ మాటల్లో ఆయుధాలు వాడవచ్చు ననే సలహా ఇమిడి ఉంది. అవును..! పిరికితనంతో పారిపోవడం కంటే ఆ పరిస్థితుల్లో అదే మంచిది. దౌర్జన్యమార్గం చేపట్టి నప్పటికీ సాహసీకులు, వీరులూ అనిపించుకుంటారు. వారి పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు’’ అన్నారు గాంధీజీ.

1947లో రజాకార్లకు వ్యతిరేకంగా పి.వి. నరసింహారావు (అనంతర కాలంలో దేశ ప్రధాని) యువ స్వాతంత్ర సమరయోధుడుగా తన స్వగ్రామం వంగర నుండి 20 మంది యువకుల బృందానికి నాయకత్వం వహించారు. ఆ ప్రాంతంలో రజాకర్లు పట్టు సాధించకుండా అడ్డుకోగలిగారు.

విద్య, ఉద్యోగాల విషయంలోనూ ఉర్దూ భాషకు ప్రోత్సాహం లభిస్తూ, ఆ భాష నేర్చుకున్న వారికే ఆ అవకాశాలు దక్కేవి. తెలుగుభాష అణచివేతకు గురైంది. భాషా సంస్కృతుల అణచివేతను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన వివిధ సంస్థలు… భాషోద్యమం, గ్రంధాలయోద్యమాలలో కొంతవరకూ విజయాన్ని సాధించాయి. తెలుగు పత్రికలను చదవడాన్ని కూడా ఒప్పుకోని జాగీరీదారులు ఉండేవారని దాశరథి రంగాచార్య రాసిన ‘‘మోదుగపూలు’’ వంటి రచనలు పేర్కొంటున్నాయి.

తెలుగుభాషా సంస్కృతులను పరిరక్షించే లక్ష్యంతో 1921 నవంబరు 12న హైదరాబాదులో టేక్‌మాల్‌ ‌రంగారావు ఇంట్లో ‘‘ఆంధ్రజన సంఘం’’ ఏర్పడింది. మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణా రావు, ముందుముల నరసింహరావు, ఆదిరాజు వీరభద్రరావు, రామస్వామి నాయుడు, టేకుమాల్‌ ‌రంగారావులతో ఏర్పాటైన ఈ సంఘం, ప్రజలపై అమలు అవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది. వెట్టిచాకిరికి వ్యతి రేకంగా ప్రజలను చైతన్యపరచి 1930 నాటికి ఆంధ్ర మహాసభగా రూపుదిద్దుకుంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్లోపన్యాసకుడు అబ్దుల్‌ ‌లతీప్‌ ‘‌జనాభా మార్పిడి’ (ఎక్స్ఛెంజ్‌ ఆఫ్‌ ‌పాపులేషన్‌) అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం హిందువులు హింసకు బలికాకుండా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని వదిలిపోవాలి. ఈ ప్రాంతాన్ని ముస్లిం జనాభాతో నింపివేయాలి. ఈ సిద్దాంత ప్రభావం వలన 1948 నాటికి 8 లక్షల ముస్లిం జనాభా వచ్చి చేరారు. అంటే ఆ సందర్భంలో హిందువులు ఎంతటి హింసకు గురైనారో తెలుస్తుంది. ‘అంజుమనే తబ్లిగ్‌ ఇస్లామ్‌’ అనే సంస్థ మతమార్పిళ్లు చేసేది. దీనికి విరుగుడుగా ఆర్యసమాజం మతం మారిన వారిని ‘శుద్ది ఉద్యమం’ ద్వారా తిరిగి హిందూ మతంలోనికి పునరాగమనం చేయించేది.

రైతులపై పన్నులు పెంచడం, కట్టలేకపోతే వారి వద్ద గల ఆహార నిల్వలను ధ్వంసం చేయడం, లేదా దొంగిలించడం వంటివి చర్యలకు పాల్పడేవారు. బెరాన్‌పల్లి సంఘటన దీనికి ఉదాహరణ. నిజాం పర్యటనకు వెళ్లినప్పుడు మార్గమధ్యలో పెళ్లిళ్లు జరుగుతుంటే, తనకు పెళ్లికూతుళ్లు నచ్చితే తీసుకెళ్లి పోయేవాడు. 50 వేలమంది దాకా గల రజాకారు, నైజాం ప్రయివేటు సైన్యం, దానికి పూర్తి మద్దతుగా ఉండేది. ప్రైవేటు సైన్యానికి విసునూరి దేశ్‌ముఖ్‌ ‌రాంచందర్‌ ‌రెడ్డి డిప్యూటీ కమాండర్‌గా ఉండేవాడు. ఆస్ట్రేలియాలోని సిడ్ని కాటన్‌ ‌వద్ద ఆయు ధాలు ఖరీదు చేశారు. వాటితో అనేక ఘాతుకాలకు పాల్పడ్డారు.

  1. తాటికొండ పోరాటంలో మిట్టా యాదవరెడ్డి సహా 30 మంది యువకులను హింసించి చంపారు.
  2. జోడేఘాట్‌లో కొమరం భీం సహా 12 మంది గిరిజనులను హత్య చేశారు.
  3. సలావుద్దీన్‌ (‌మొగల్‌ ‌మియా) అకృత్యాలకు అంతేలేదు. స్త్రీలు కనిపిస్తే చాలు. వారి కుటుంబ సభ్యుల ముందే బలాత్కారం చేసేవారు. ఎదిరిస్తే ఇళ్లు గడ్డివాములు తగలబెట్టేవారు.
  4. గాండ్లాపూర్‌లో స్త్రీలతో నగ్నంగా బతకమ్మ ఆడించి పైశాచిక ఆనందం పొందారు.
  5. నేరడ గ్రామంలో 70 మంది స్త్రీలకు పైజమాలు తొడిగించి అందులో తొండలను వదిలారు.
  6. పాలమూర్‌ ‌జిల్లా బోర్‌పల్లిపై దాడి చేసి దళిత యువకుల పురుషాంగాలకు• కిరోసిన్‌తో తడిపిన గుడ్డలు చుట్టి నిప్పంటించారు. వారు ఆహాకారాలు చేస్తుంటే వారి భార్యలను మానభంగం చేశారు. ఈ ఘోరాన్ని తట్టుకోలేక వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
  7. స్త్రీ రొమ్ములను పట్టుకారుతో లాగడం, పిరుదులపై గిల్లడం, తల్లుల ఎదుటే పిల్లలను మానభంగం చేయడం సర్వ సాధారణం.
  8. భువనగిరి తాలూకా నారిగూడెంలో పచ్చి బాలింతపై అత్యాచారం చేశారు.
  9. ఎనుపాడులో నిండు గర్భిణీపై అత్యాచారం చేశారు.
  10. 1948లో వందలమంది సైనికులు బైరాన్‌పల్లిపై దాడిచేసి వారిని వరుసగా నిలబెట్టి 118 మందిని కాల్చిచంపారు. ఈ దాడిని నల్గొండ జిల్లా కలెక్టర్‌ ‌మొహజ్జిం హుస్సేన్‌, ‌డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్‌ ‌హసీం స్వయంగా పర్యవేక్షించారు.
  11. ప్రజల శరీర భాగాలను నరికి బాధితుల తోనే తినిపించడం రజాకార్లకు ఆనందాన్నిచ్చే ఓ ‘పైశాచిక క్రీడ’.
  12. గర్భవతులను భర్తలు చూస్తూ ఉండగా కత్తులతో కడుపులు కోసి శిశువులను బయటకు లాగేవారు (ఈ ఘాతుకాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ అంశాలపై పెద్ద ఎత్తున పరిశోధన చేయాల్సిన అవసరం వుంది). ఈ ఘోర కలి, అకృత్యాలకు సర్దార్‌ ‌వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ‌సెప్టెంబరు 17, 1948న చరమగీతం పాడారు. ఆపరేషన్‌ ‌పోలోతో నిజాం ఆరోజున లొంగిపోయాడు. మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌స్వాతంత్య్రం తరువాత రాజ ప్రముఖ్‌ అయ్యారు.

‘కాశీ యాత్రా చరిత్ర’ కర్త ఏనుగుల వీరాస్వామి 1820-30 మధ్య కాలంలో రెండుసార్లు హైదరా బాద్‌ ‌నగరాన్ని దర్శించారు. ‘హైదరాబాద్‌ ‌నగరంలో సాయుధులైన వ్యక్తులు మెత్తని వారిని (బలహీను లను) కొట్టి నరికే పరిస్థితి ఉంది. సుంకాలు వసూలు చేసేవారు, సరిగా చెల్లించని వారిని చంపినా అడిగే దిక్కులేదు’అని పేర్కొన్నారు.

రజాకార ఉద్యమంలో బలైన వారిపై కేంబ్రిడ్జ్ ‌విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్రకారుడు సునీల్‌ ‌పురుషోత్తం పరిశోధనలు జరిపారు. దీనికి పండిత్‌ ‌సుందర్‌లాల్‌ ‌నాయకత్వం వహించాడు. వారి నివేదక ప్రకారం 27 వేల నుంచి 40 వేల మంది దాకా మరణించినట్లు అంచనా. మరికొందరి పరిశీలన ప్రకారం మరణాలు 2 లక్షలు అంతకంటే ఎక్కువనే తెలుస్తోంది.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
Instagram