– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

త్రిమూర్తుల సమైక్య తేజస్సు దత్తాత్రేయుడు. జ్ఞానానికి ప్రతీక.  అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తి స్వరూపుడిగా అవతరించిన ఆయనకు ఆబాల్యంలోనే సర్వశాస్త్రాలు వశమయ్యాయి. మనిషిలోని సంకుచి తత్వాన్ని పోగొట్టి సన్మార్గులుగా చేసేవాడు గురువు, ఆయన జ్ఞానజ్యోతి అనుకుంటే అలాంటి సద్గురువు స్థానానికి పరమోదాహరణ దత్తాత్రేయుడు. పరిపూర్ణ భక్తితో తనను ఆశ్రయించే వారిలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞాన కాంతులను ప్రసాదిస్తాడని విశ్వాసం. ఆధ్యాత్మిక సాధనకు మూలమైన యోగవిద్యకు పరమగురువుగా ఆయనను ఆరాధిస్తారు.

భక్తి, కర్మ, జ్ఞాన, ధ్యానయోగాల సమైక్యత తత్త్వమే దత్తప్రభువు అవతారం. లోకంలో యోగవిద్య క్షీణించి నప్పుడల్లా అవతరించి యోగరక్షణ చేస్తాడు కనుక దత్తాత్రేయుడు ‘యోగవిద్య’కు నాథుడు (దత్తస్మ్వయోగా దధఃయోగనాథః) అని శ్రీమగద్భాగవతంలోని నారాయణ కవచం వాక్కు. ‘అరిషడ్వవర్గాల బారినపడి పతనదిశగా పయనించే మనిషిని సన్మార్గంలోకి తెచ్చే సాధనం యోగసాధన. ఆ యోగసాధనను అందించగలిగేది గురువు. సద్గురువులు త్రికాలవేదులు. తాము మానవాకారంలో సంచరిస్తున్నా సామాన్యునిలా దేహానికి కట్టుబడరు. సంకల్ప మాత్రంతోనే శరీరం నుంచి విడివడి సూక్ష్మరూపంతో ఇతర లోకాలనూ సంచరించగలరు. ఇతరుల కర్మలను గ్రహించి నివృత్తి చేయ గలుగుతారు. ఆ గురు సంప్రదాయానికి మూలపురుషుడే దత్తమూర్తి’ అని చెబుతారు. యోగసాధనే మోక్షమార్గమని, మానవమానాలకు పొంగడం, కుంగడం కాక మానాన్ని విషతుల్యంగా, అవమానాన్ని అమృతప్రాయంగా స్వీకరించగలగాలని ఆయన అలర్కుడికి ఉపదేశించారు.

 పది మంది బ్రహ్మమానస పుత్రులలో రెండవ వారైన అత్రిమహర్షి. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ పత్ని అనసూయాదేవితో చేసిన తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు వారి కోరిక మేరకు తమ అంశంతో కుమారుడిగా జన్మించారు. దత్తాత్రేయుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించాడు. అన్ని శాస్త్రాలు ఆయన పరమయ్యాయి. అక్షరాభ్యాసం లేకుండానే శిష్యులకు వేదపాఠం బోధించాడు. బాల్యంలోనే కన్నవారికి జ్ఞానబోధ చేశాడు. ప్రకృతి పరిశీలన ద్వారా జ్ఞాన సముపార్జన చేశారు. భూమి నుంచి క్షమ, ఆకాశం నుంచి సర్వవ్యాపకత్వం, వాయువు నుంచి నిస్సంగత్వం, జలం నుంచి నిర్మలత్వం, అగ్ని నుంచి తేజస్సు గ్రహించారు. వాటినే గురువులుగా భావిస్తూ వాటిలోని మర్మాలను ఎరిగి లోకానికి వివరించాడు.

సత్త్వం రజ స్తమో గుణాలకు ప్రతీకలు త్రిమూర్తులు. మార్కండేయ పురాణం, ‘స్మృతికౌస్తుభం’ గ్రంథం ప్రకారం, విష్ణువును సత్వరూపం కలవాడిగా దర్శించాలన్న కోరికను నారదుడు విన్నవించగా, త్రిమూర్తులు ఒక్కటైనప్పుడే అది సాధ్యమని శ్రీహరి చెబుతాడు. అందుకు అవసరమైన కథ నడిపాడు నారదుడు. ఒకనాడు అత్రి,అనసూయ దంపతుల అతిథ్యం స్వీకరించిన నారదుడు వైకుంఠం, కైలాస,సత్యలోకాలను సందర్శించిన సందర్భంలో అనసూయను మించిన పతివ్రత సృష్టిలోనే లేరని క్ష్మీ పార్వతీ సరస్వతులతో అనడంతో ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని ‘త్రిమాతలు’ త్రిమూర్తులను కోరారు. వారు వారి మాటలను మన్నించడంతో పాటు అనసూయాదేవి ఉన్నతిని చాటేందుకు అంగీకరించారు. బ్రాహ్మణ వేషధారులుగా అత్రి ఆశ్రమానికి వచ్చి భిక్ష కోరారు. అయితే వివస్త్రగా తమకు వడ్డించాలని రుషి పత్నికి షరతు పెట్టడంతో ఆమె భర్త ఇచ్చిన మంత్రజలాన్ని వారిపై చల్లగా త్రిమూర్తులు పసిపాపలుగా మారిపోయారు. ఆ చిన్నారులకు అతిథి మర్యాదలు చేయడమే కాదు.. మాతృప్రేమనూ పంచింది. భర్తల జాడ వెదుక్కుంటూ వచ్చిన ‘త్రిమాత’లకు లోకనాథులను నిజరూపాలతో అప్పగించింది. సంతానంలేని తమకు పుత్రుడిగా జన్మించాలన్న అత్రి దంపతుల విన్నపాన్ని మన్నించిన త్రిమూర్తులు తమ అంశంతో మార్గశిర పౌర్ణమి రాత్రి పుత్రుడిని ప్రసాదించారు. మూడు ముఖాలు, ఆరు చేతులతో పుట్టి ‘దత్తుడు’ (తనను తానే ఇచ్చుకున్నాడు)గా పేరు పొందాడు. అత్రి కుమారుడు కనుక ‘దత్తాత్రేయుడు’ అయ్యాడు.

భోగమోక్షాలనిచ్చే దత్తుడు దేహంపైకానీ, వస్త్రంపై కానీ అపేక్షలేనివాడు. భిక్షాన్నం మాత్రమే స్వీకరించే నిరాసక్తుడు. తనను త్రికరణశుద్ధిగా నమ్మినవారికి శాంతిరూపుడై దర్శనం ఇస్తున్నట్లే, విశ్వాస రహితంగా చూడగోరే వారికి వికృత రూపంతో దర్శనమిచ్చేవారట. మద్యం తీసుకుంటున్నట్లు, ఖండ యోగం ద్వారా శరీర అవయవాలను వేర్వేరు చోట్ల పడేసినట్లు వ్యవహరించేవారు. ఉన్మత్తుడు, మద్యపానాసక్తుడు, అవధూత, యోగి, సిద్ధుడు, మురికి దుస్తులు ధరించిన వికారి, చితాభస్మధారుడుగా కనిపించే వాడు. తాటిచెట్టు కింద కల్లు ముంత చేపట్టేవాడు. ఇవన్నీ మానవుడి చిత్త ప్రవ•ృత్తులు, వారిలో కనిపించే సహజ లక్షణాలను పోలి ఉంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అన్ని అపవిత్రాలను పవిత్రం చేసే వేదాలు ఆయన ముందు శునకరూపంలో సాగిలప•డడాన్ని బట్టే దత్తమహిమ బోధ పడుతుందని, ఆయనను ఆరాధించడం, ఆయన పాదుకలను సేవించడం శ్రేయోదాయకమని పెద్దలు చెబుతారు. కుల మత వర్ణాలకు అతీతంగా సర్వులను సమభావంతో చూడడాన్ని దత్త సంప్రదాయంగా చెబుతారు. జీవులంతా సమానమని, సకలజనులకు సేవలు అందించడం ఆయన బోధనలుగా ఆరాధకులు అంటారు. పరమాత్మారాధనలో అభేదం చూపుతూ, ఇష్టదైవాలను ఆరాధిస్తూ ముక్తి పొందాలని సూచన ఈ అవతారంలో గోచరిస్తుంది. ధర్మరక్షణ కోసం దైవం నిరంతరం ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటుందని ఈ ‘దత్తా’వ తారం మరోసారి రుజువు చేసింది. యోగిరాజు, అత్రివరదుడు,  దత్తాత్రేయుడు, కాలాగ్ని శమనుడు, యోగిజన వల్లభుడు, లీలా విశ్వంభరుడు, సిద్ధిరాజు, జ్ఞానసాగరుడు, విశ్వంభరావధూత, అవధూత, మాయా ముక్తావధూత, ఆదిగురువు, శివరూపుడు, దేవదేవుడు, దిగంబరుడు, కృష్ణ శ్యామ కమలనయనుడు.. అనేవి ఇతర అవతారాలని వాసుదేవానంద సరస్వతీస్వామి తమ ‘దత్తపురాణం’లో వివరించారు.

‘జటాధరమ్‌ ‌పాండురంగమ్‌ ‌శూలహస్తం కృపానిధిమ్‌

‌సర్వరోగహరమో దేవమ్‌ ‌దత్త్తాత్రేయ మహంభజే’

By editor

Twitter
Instagram