– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

అంతర్జాతీయ సదస్సుల మీద సమకాలీన సమస్యలు, సంఘర్షణల జాడలు, ప్రభావాలు ప్రతిబింబించక తప్పదు. ఇండోనేసియా రాజధాని బాలిలో జరిగిన 17వ జీ 20 సదస్సు మీద కూడా వర్తమాన అంతర్జాతీయ పరిణామాల ప్రభావం విస్తారంగానే కనిపించింది. మళ్లీ ఐకమత్యం సాధిద్దాం, మళ్లీ బలోపేతం అవుదాం అన్న నినాదంతో జరిగిన ఈ సమావేశాలలో ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నినాదం తారకమంత్రమైంది. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం నేపథ్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ దేశాల ఆ ఘర్షణ ప్రభావం ఎంత బలంగా ఉందో తెలిసింది. అలాగే 2023లో జరిగే 18వ సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించి, ఆతిథ్యం ఇస్తుంది.


మూడో ప్రపంచ యుద్ధ భయాల నేపథ్యంలో జీ 20 దేశాల సభ్యులు రష్యా దాడిని పదునైన పదజాలంతో ఖండించడం ఆహ్వానించదగినదే. కొన్ని దేశాలు భిన్న స్వరాలు వినిపించినా యుద్ధ ఫలితాల మీద ఆందోళన వ్యక్తం చేయక తప్పలేదు. కరోనా తరువాత సంభవించిన రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు కోలుకునే అవకాశం కొంచెం ముందుకు జరిగింది. మొత్తంగా యుద్ధం నేటి యుగపు ఆయుధం కాదనే ఎక్కువ మంది అంగీకరించినట్టు కనిపిస్తుంది. ఆహార భద్రత, పర్యావరణ మార్పులు, ఆరోగ్యం, ప్రపంచ దేశాలలో ద్రవ్యోల్బణం సమస్య వంటి అంశాలను కూడా సభ్య దేశాలు చర్చించాయి. 1999 నాటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆవిర్భవించిన జీ 20 వేదిక తన మౌలిక కర్తవ్యాన్ని, ఆశయాన్ని మరచిపోనందుకు ప్రపంచం సంతోషిస్తున్నది. మధ్య తరహా ఆదాయాలు ఉన్న దేశాలను ఆదుకుంటూ ప్రపంచ ఆర్థిక పరిస్థితులను సుస్థిరం చేయడమే ఈ వేదిక లక్ష్యం. ప్రపంచ జనాభాలో 60 శాతం జీ 20 సభ్య దేశాలలోనే ఉంది. ప్రపంచ జీడీపీ 75 శాతం ప్రపంచ వాణిజ్యం కూడా ఈ దేశాల కేంద్రంగానే జరుగుతోంది. ఇంత ప్రాముఖ్యం ఉన్న ఈ వేదిక సమావేశాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని నిలువరించే శక్తి భారత్‌కు ఉన్నదని, అందుకు మోదీ నడుం బిగించాలని కొన్ని దేశాలు అభిప్రాయం వ్యక్తం చేయడం తెలిసిందే. కానీ ప్రపంచ శాంతి, ఆర్థిక పురోభివృద్ధి, ఆరోగ్యం వంటి అంశాలను చర్చించ డానికి ఈ అంతర్జాతీయ వేదిక కదిలిన వేళలోనే పోలెండ్‌లోని ఒక గ్రామం మీద క్షిపణి దాడులు జరిగాయి. ఆ దాడి మా పని కాదని రష్యా, కాదు మీదే బాధ్యత అని అమెరికా ఆరోపించుకున్న నేపథ్యంలో సమావేశాలు మొదలయినాయి. అలాగే కెనడా, చైనా మధ్య దూరం పెరుగుతున్న సంకేతాలు కూడా ఈ సమావేశాలలో కనిపించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి భారత్‌ ‌జీ 20 అధ్యక్ష స్థానంలోకి రాబోతున్నది. ఆ దృష్ట్యా 2022లో ఈ వేదిక సాధించిన విజయాలు, 2023లో భారత్‌లో జరిగే సమావేశాలలో ఎలా ఉండగలవో అధ్యయనం చేయడం అవసరం.

రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం, చమురు గ్యాసు ధరలు అందనంత ఎత్తుకు పెరిగిపోవటం, అగ్రరాజ్యాలయిన అమెరికా- చైనాల మధ్య వ్యూహాత్మక వైరం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యరంగంపై నీలినీడలు కమ్ముకోవటం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి మాంద్యం మేఘాలు వ్యాప్తి చెందటం, కొవిడ్‌ అనంతరం ప్రపంచ దేశాల్లో ఉత్పాదకత దారుణంగా క్షీణించటం, ఆహారధరలు విపరీతంగా పెరగటం… వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో భారత్‌ ‌జీ20 అధ్యక్ష స్థానాన్ని అందుకుంది. ఇండోనేసియా అధ్యక్షుడు జోకోవిడోడో నుంచి భారత్‌ ‌ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. డిసెంబరు 1వ తేదీ నుంచి భారత్‌కు ఆ హోదా దక్కుతుంది. వచ్చే ఏడాది జీ20 సదస్సు భారత్‌ ఆధ్వర్యంలో సాగుతుంది. శిఖరాగ్ర సదస్సుతో పాటు, చిన్న చిన్న సమావేశాలు కూడా నిర్వహి స్తుంది. ఇండోనేసియాకు చెందిన బాలిలో నవంబరు 15, 16 తేదీలలో నిర్వహించిన జీ20 సమావేశాల్లో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాంతో ప్రపంచ దేశాల్లో భారత్‌ ‌ప్రతిష్ఠ మరింత ఇనుమ డించింది.

2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం నిర్వహించిన వార్షిక సమావేశాలకు మెక్సికో, చైనా, అర్జంటీనా, సౌదీ అరేబియా, ఇండోనేసియాలు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాయి. అభివృద్ధి చెందిన ఈ దేశాల సరసన ఇప్పుడు భారత్‌ ‌చేరుతోంది. ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇండోనేసియా, అంతకు ముందున్న ఇటలీ కొత్తగా బాధ్యతలు చేపడుతున్న భారత్‌ ఇప్పుడు బృందంగా ఉన్నాయి. దీనిని ‘ట్రోయికా’ అని పిలుస్తారు. ఇలా మూడు దేశాలు కలిసి పనిచేస్తే అంతకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలను తర్వాత కూడా కొనసాగించే వీలుందని ఈ ఏర్పాటు చేశారు. డిసెంబరు 1న భారత్‌ ‌బాధ్యతలు స్వీకరించగానే ఆ బృందంలో భారత్‌, ఇం‌డోనేసియాతో పాటు ఆ తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఈజిప్టు ఉంటాయి. ఇలా మూడు అభివృద్ధి చెందిన దేశాలు ఒక బృందంగా ఉండటం అనేది అరుదయిన విషయం. భారత్‌కు ఈ అంశం కలిసొస్తుందని, అది అభివృద్ధి చెందిన దేశాల కోణంలో సమస్యలను చూడగలుగు తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జీ20 అంటే..

దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేయటం అనేది జీ 20 కూటమి ప్రధాన లక్ష్యం. జీ-20 అంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల 20 దేశాలతో కూడిన కూటమి. ప్రపంచంలో మూడింట రెండు వంతుల జనాభా ఇక్కడే ఉంటుంది. ప్రపంచ స్థూల దేశీ యోత్పత్తి (గ్లోబల్‌ ‌జీడీపీ)లో 85 శాతం వాటా ఈ దేశాల నుంచే వస్తోంది. 75 శాతం అంతర్జాతీయ వ్యాపారం కూడా ఈ దేశాల్లోనే సాగుతోంది.

అందులో ఈయూతో పాటు 19 దేశాలు ఉంటాయి. అవి అర్జంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ‌కెనడా, చైనా, ఫ్రాన్స్, ‌జర్మనీ, భారత్‌, ఇం‌డోనేసియా, ఇటలీ, జపాన్‌, ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకె, అమెరికా. ఆసియా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 1999లో ఇది ఏర్పాటయ్యింది. దీనికి శాశ్వతమైన సెక్రటేరియట్‌ అం‌టూ ఉండదు. నిర్ణయాలు పరస్పర అంగీకారం పైన ఆధారపడతాయి. తొలి సమావేశాలు 1999 లోనే బెర్లిన్‌లో నిర్వహించారు. మొదట్లో ఈ సమావేశాలకు ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్లు మాత్రమే హాజరయ్యేవారు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ కూటమి ప్రాధాన్యం పెరిగింది. పరస్పర సంప్ర దింపులు అవసరం అయ్యాయి. దాంతో ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు  హాజరవుతున్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం సెగలు

ఈ దఫా రష్యా-ఉక్రెయిన్‌ ‌సెగలు జీ20 సదస్సును తాకాయి. సాధారణంగా సమావేశాలకు హాజరైన నేతలు గ్రూపు ఫొటో దిగటం రివాజు. బాలి సదస్సులో అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఈ సారి యుద్ధం నేపథ్యంలో దేశాల వైఖరి రష్యాకు అనుకూలంగా కొందరు, ప్రతికూలంగా కొందరు విడిపోయారు. రష్యాకు మద్దతుగా చైనా వ్యవహరిస్తుండగా, దానికి వ్యతిరేకంగా పశ్చిమ దేశాలను కూడగట్టే పనిలో అమెరికా ఉండటం పరిస్థితిని తీవ్రంగా మార్చింది. ఈ సారి బ్రిటన్‌ ‌కూడా రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడింది. రష్యా అధ్యక్షుడు వస్తే తాను సమావేశా లకు వచ్చే ప్రశ్నే లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ ‌స్కీ ప్రకటించారు. చివరకు రష్యా అధ్యక్షుడు హాజరుకాలేదు. ఆయన బదులు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోస్‌ ‌హాజరయ్యారు. ఇకపోతే ఉక్రె యిన్‌పై రష్యా యుద్ధంపై తీర్మానం ప్రవేశపెట్టటానికి అమెరికా ప్రయత్నించినప్పుడు, అది ‘అనుచితమైన రాజకీయం’ అంటూ రష్యా విదేశాంగ మంత్రి కొట్టిపారేశారు. సదస్సులో సంయుక్త ప్రకటనను రాజకీయం చేయటానికి పశ్చిమ దేశాలు ప్రయత్ని స్తున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆహార సంక్షోభానికి యుద్ధం కారణం కాదనే ఆయన స్పష్టం చేశారు. యూఎన్‌ ‌చార్టర్‌, అం‌తర్జాతీయ న్యాయసూత్రాలకు లోబడి తను ప్రతిపాదించినట్టుగా రష్యా యుద్ధాన్ని తక్షణం నిలిపి వేయమని జీ20 కూటమి కోరాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ ‌స్కీ డిమాండ్‌ ‌చేశారు. భిన్నాభి ప్రాయాల నడుమ 16 పేజీల సంయుక్త ప్రకటన విడుదలయ్యింది. ‘అత్యధిక దేశాలు రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధాన్ని ప్రతిఘటిస్తున్నాయని, అది జన వినాశనానికే కాదు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తోంది’ అని అందులో పేర్కొన్నారు. ఎస్‌సీఓ సమావేశంలో మోదీ ప్రస్తావించిన ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అనే వ్యాఖ్యను తుది ప్రకటనలో జోడించటం కూడా చెప్పుకోదగ్గ అంశం. ఈ సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్‌ ‌లోని నాలుగు నగరాల మీద రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. అదే సమయంలో ఉక్రెయిన్‌ ‌సరిహద్దులో ఉన్న పోలెండ్‌ ‌పైన క్షిపణి దాడి వివాదాస్పదమైంది. పోలెండ్‌ ‌నాటో సభ్యురాలు కావటంతో పర్యవ సానాలు తీవ్రంగా ఉంటాయని అందరూ భావించారు. ఇది రష్యా పనేనని ఉక్రెయిన్‌ ‌గట్టిగా ఆరోపించింది. పోలెండ్‌ అయితే తొలుత రష్యాను, ఆ తర్వాత ఉక్రెయిన్‌ను నిందించింది. తనపై వచ్చిన ఆరోపణలను రష్యా ఖండించింది. చివరకు ఈ దాడికి ఎవరు కారణమో తెలియదని, అది ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదని పేర్కొంది, అటు నాటో, వాషింగ్టన్‌ ‌కూడా ఇదే ప్రకటన చేశాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

మోదీ శాంతి మంత్రం

జీ20 కాబోయే అధ్యక్షునిగా మోదీ, బాలి వేదికపైన శాంతి మంత్రాన్ని వల్లె వేశారు. ప్రపంచ పరిణామాలను స్పృశిస్తూ, బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన చారిత్రక అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆయా దేశాలకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం, సహజీవనం సాగటానికి అందరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. బుద్ధుడు, గాంధీ నడయాడిన భారత గడ్డ పైన వచ్చే ఏడాది జీ20 సమావేశాలు నిర్వ హించుకుంటున్నప్పుడు, ఈ సందేశాన్ని మరింతగా విశ్వవ్యాప్తంగా చాటగలమని స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్లు యుద్ధానికి ముగింపు పలకాలని, అందుకు దౌత్యమార్గాలను అనుసరించాలని సూచించారు. జీ20 దేశాలు ఈ దిశగా చొరవ చూపాలని పిలుపు నిచ్చారు. ఇంధన సరఫరాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంక్షలను ప్రోత్సహించరాదని చెప్పారు. ఉక్రెయిన్‌ ‌మీద దురాక్రమణకు పాల్పడినందుకు నిరసనగా, రష్యన్‌ ఆయిల్‌, ‌గ్యాస్‌ ‌సరఫరాపై ఆంక్షలు విధించా లని పశ్చిమదేశాలు డిమాండ్‌ ‌చేస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంధన భద్రత అనేది అంతర్జాతీయంగా అభివృద్ధికి కీలకం. మార్కెట్లో సుస్థిరత అనేది భారత్‌కు తప్పనిసరి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌, ‌రష్యన్‌ ‌విదేశాంగ మంత్రి పాల్గొన్న ‘ఆహార ఇంధన భద్రత’ సమావేశంలోనే మోదీ ఈ ప్రస్తావన చేశారు. ఇంకా మోదీ ఏమన్నారో చూడండి. ‘భారత్‌ ‌స్వచ్ఛ ఇంధనం, పర్యావరణానికి కట్టుబడి ఉంటుంది. 2030 నాటికి, సగం పైగా విద్యుత్‌, ‌పునరుత్పాదక వనరుల నుంచి లభిస్తుంది. ఇందుకు సుస్థిరమైన సాంకేతికత సరఫరా, ఆర్థిక వనరులు అనేవి అందుకు అవసరం అవుతాయి’ అన్నారు. పర్యావరణ మార్పులు, కొవిడ్‌ ‌విపత్తు, ఉక్రెయిన్లో పరిణామాలకు తోడు అంతర్జాతీయ అంశాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయని, ప్రపంచ రవాణా గొలుసు వ్యవస్థను ధ్వంసం చేశాయని ఆయన చెప్పుకొచ్చారు. జీ 20 దేశాలు ప్రధాన భూమికను పోషించవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ‘నిత్యావసరాల సంక్షోభం పేదలకు సవాలు విసురుతోంది. రోజువారీ పోరాటం వారికి తప్పటం లేదు. ఐక్యరాజ్య సమితి లాంటి వేదికలు ఈ అంశాలను పరిష్కరించటంలో అంతగా విజయవంతం కావటం లేదు. సుస్థిరమైన సంస్కరణలు ప్రవేశపెట్టటంలో మనం విఫలమవు తున్నాం. ఈ నేపథ్యంలో జీ20 దేశాల పాత్ర కీలకం అవుతోంది’ అని స్పష్టం చేశారు. ‘గత శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం అంతర్జాతీయ వినాశనాన్ని సృష్టించింది. అప్పుడు దేశంలోని నేతలంతా శాంతి మార్గాలను అన్వేషించారు. ఇప్పుడు మనవంతు వచ్చింది. కొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో కొత్త ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత మనది’ అని కర్తవ్యబోధ చేశారు.

మోదీ ప్రసంగం వర్థమాన దేశాల నేతలనే కాదు. అభివృద్ధి చెందిన దేశాల వారి ప్రశంసలనూ అందుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యా తక్షణం ముగింపు పలకాలని జీ20 సమావేశం నిర్ణయించ టంలో భారత్‌ ‌కీలకపాత్ర పోషించిందని అమెరికా వెల్లడించింది. ఈ కూటమి సంయుక్త ప్రకటనపై చర్చలు జరపటంలో ప్రధాని మోదీ కీలకపాత్ర పోషించారని వైట్‌హౌస్‌ ‌ప్రెస్‌ ‌సెక్రటరీ కరీన్‌ ‌జిన్‌ ‌పియర్‌ ‌ప్రశంసించారు. ఆహార, ఇంధన భద్రత, స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నాల్లో అమెరికా ఉన్నదని, తమ ప్రయత్నానికి ప్రధాని మోదీ సహకారం కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

వివిధ దేశాల అధినేతలతో మోదీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు బైడన్‌తో సాగిన చర్చల్లో అమెరికా, భారత్‌ల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యా నికి అనుసరించవలసిన వైఖరిపైన చర్చించారు. ప్రధానంగా అడ్వాన్సుడ్‌ ‌కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్సు లాంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాల ప్రస్తావన చేశారు. అంతర్జాతీయ గొలుసు వ్యవస్థను, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచి బలహీనమైన దేశాలకు కొత్త గొంతుక అందించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు ఎప్పటికప్పుడు అమెరికా అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జీ20 అధ్యక్షునిగా పూర్తి సమన్వయాన్ని ఇక ముందు కూడా ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఇకపోతే జిన్‌పింగ్‌ను కలవటం కూడా ఆసక్తికర మైన పరిణామం. జీ20 అతిథుల కోసం ఇండో నేషియా అధ్యక్షుడు జోకో విడోడో విందు ఏర్పాటు చేశారు. జిన్‌పింగ్‌ను చూడగానే మోదీ లేచి వెళ్లి ఆయనతో కరచాలనం చేశారు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. 2020లో గల్వాన్‌ ‌వద్ద భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణల తర్వాత మోదీ, జిన్‌పింగ్‌ ‌కలుసుకోవటం ఇదే మొదటిసారి. అంతకు ముందు ఉజ్బెకిస్తాన్‌లో నిర్వహించిన షాంఘై సమ్మిట్‌లో ఇద్దరు పాల్గొన్నా వ్యక్తిగతంగా కలుసుకో లేదు. ఈ సారి కూడా ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు చోటుచేసుకోలేదు. వ్యక్తిగత పలకరింపులతో ముగిసి పోయింది. అయితే ఈ అడుగు భవిష్యత్తులో చర్చలకు నాంది పలికే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అలాగే మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ ‌మెక్రాన్‌, ‌బ్రిటన్‌ ‌ప్రధాని రుషి సూనక్‌ ‌తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్‌ ‌ట్రాన్స్ ‌ఫార్మేషన్‌ ‌వంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే ఐఎంఎఫ్‌ ‌డిప్యూటీ ఎండీ గీతాగోపీనాథ్‌, ‌డబ్ల్యుహెచ్‌ఓ ‌చీఫ్‌ ‌టెడ్రోస్‌, ‌ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ ‌మాల్వాస్‌ ‌తదితరులతో భేటీ అయ్యారు.

అగ్రనేతలు కలిసిన వేళ…

జీ 20 సదస్సు నేపథ్యంలో, అగ్రరాజ్యాలయిన అమెరికా, చైనాల అధ్యక్షులు బైడన్‌, ‌జిన్‌పింగ్‌ ‌ముఖాముఖీ సమావేశమయ్యారు. ఈ చరిత్రాత్మక భేటీ మూడు గంటల పాటు సాగింది. ఆర్థిక, భద్రతాపరమైన సవాళ్ల నేపథ్యంలో, అంతర్జాతీయ ఆధిపత్యాన్ని సాధించటానికి పోటీ పడుతున్న ఈ రెండు దేశాలు తమ మధ్య ఉన్న వైషమ్యాలను తొలగించుకోవటానికి ఈ రకంగా ప్రయత్నించటం అభినందనీయమైన ముందడుగు అనే చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు చాలా విషయాలను బహిరంగంగా మాట్లాడుకున్నారు. ‘‘తైవాన్‌, ఉ‌క్రెయిన్‌-‌రష్యా యుద్ధం, న్యూక్లియర్‌ ‌భయం, ఉత్తర కొరియా వంటి అంశాలు వారి మధ్య చర్చ కొచ్చాయి. న్యూక్లియర్‌ ‌యుద్ధం ఎప్పటికీ చేయకూడదని, ఆ మార్గంలో ఎప్పటికీ గెలవాలని ప్రయత్నించకూడదని ఇద్దరు నేతలు ఒప్పందానికి వచ్చారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లో న్యూక్లియర్‌ ఆయుధాలతో బెదిరించి గెలవటానికి సాగుతున్న రష్యా ప్రయత్నాలను ఖండించాయి’’ అని వైట్‌హౌస్‌ ‌ప్రకటించింది.

చైనా, అమెరికా పోటీ పడుతూ పరిస్థితిని సంక్లిష్టంగా మార్చటానికి బదులు తమ మధ్య ఉన్న విభేదాలను సర్దుబాటు చేసుకుని కీలకమైన అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించటానికి నడుం బిగించాలని బైడన్‌ ‌పిలుపు నిస్తే, అందుకు సరైన ప్రణాళిక రూపొందించాలని, తాను చర్చలకు సిద్ధంగా ఉన్నానని జిన్‌ ‌పింగ్‌ ‌ప్రతిస్పందించారు. తైవాన్‌ అం‌శం వాషింగ్టన్‌, ‌బీజింగ్‌ ‌మధ్య వివాదాస్పద మైన సమస్య. ఈ విషయంలో బీజింగ్‌లో వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండకపోవచ్చు. హౌస్‌ ‌స్పీకరు నాన్సీ పెలోసీ ఆగస్టులో తైవాన్‌ను సందర్శించటం చైనా ఆగ్రహానికి కారణమైంది. దీనిపై చైనా మిలట్రీ డ్రిల్‌, ‌సమీప జలాల్లోకి బాలిస్టిక్‌ ‌మిస్సెల్స్ ‌ప్రయోగించాయి. ఆ తర్వాత కనీసం ఈ ఇద్దరు అధ్యక్షులు ఫోన్‌లో గానీ, వీడియోలో గానీ ఐదుసార్లు మాట్లాడుకున్నారు. ప్రత్యక్షంగా కలుసుకున్నది మాత్రం ఇదే తొలిసారి. ఈ చర్చలకు కొనసాగింపుగా యూఎస్‌ ‌సెక్రటరీ ఆంటోని బ్లింకెన్‌ను బీజింగ్‌ ఆహ్వానించటం శుభపరిణామం.

జిన్‌పింగ్‌ ‌వర్సెస్‌ ‌జస్టిస్‌ ‌ట్రూడో

జీ20 వేదిక సమీపంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌ ‌పింగ్‌, ‌కెనడా ప్రధాని జస్టిస్‌ ‌ట్రూడో మధ్య సాగిన సంభాషణలు వీడియోతో సహా రికార్డయ్యాయి. ఇద్దరు చాలా దగ్గరగా నుంచుని అనువాదకుని సాయంతో మాట్లాడుకున్నారు. ఇటువంటి సున్నిత మైన అంశాలు బాహ్య ప్రపంచానికి వెల్లడికావటం అనేది అరుదయిన పరిణామం. సాధారణంగా అగ్రనేతల వ్యక్తిగత సంభాషణలు, మనోభావాలు దెబ్బతిన్నప్పుడు భావోద్వేగాలతో వారు స్పందించటం లాంటి సన్నివేశాలు నాలుగ్గోడలు దాటి బయటకు రావు. పైగా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం మీడియా విషయంలో కట్టుదిట్టమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి ఇదెలా బయట కొచ్చిందనేది సమాధానం తెలియని ప్రశ్న. అంతకు ముందు తమ మధ్య సాగిన చర్చలను మీడియాకు లీక్‌ ‌చేశారని జిన్‌పింగ్‌ ‌గుర్రుమన్నారు. ట్రూడోలో నిజాయితీ లోపించిందని పరుషంగా మాట్లాడారు. జిన్‌పింగ్‌ ‌మాటలకు నవ్వుతూ బదులిచ్చారు ట్రూడో. ‘‘కెనడాలో మేం స్వేచ్ఛాయుత, బహిరంగ చర్చలను విశ్వసిస్తాం. అదే విధానాన్ని కొనసాగిస్తాం’’ అని చెప్పారు. ‘‘ఉమ్మడిగా నిర్మాణాత్మకంగా పనిచేయటం కోసం మా కృషిని కొనసాగిస్తాం. అదే సమయంలో విభేదించే అంశాలు కూడా ఉంటాయి’’ అని తొణక్కుండా, బెణక్కుండా సమాధానమిచ్చారు. ట్రూడో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని పూర్తి చేయక ముందే జిన్‌పింగ్‌ ‌మధ్యలో అడ్డుకుని ‘‘అందుకు తగిన పరిస్థితులు కల్పించండి’’ అన్నారు. ఆ తర్వాత కరచాలనం చేసి అక్కడ నుంచి వెళ్లి పోయారు. కెనడాలో చైనా గూఢచర్యం చేస్తోందని, దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందనే అంశం మీద ఈ ఇద్దరు నేతలు గతంలో చర్చించుకున్న అంశాలనే జిన్‌పింగ్‌ ‌మాట్లాడారని భావిస్తున్నారు.

ఇకపోతే, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తన ఆరేళ్ల కుమారైతో కలిసి సదస్సుకు హాజరు కావటంపై విమర్శలు వెల్లువెత్తాయి. జీ20 సభ్యదేశాల అధినేతల్లో ఆమె ఒక్కరే మహిళ. బ్రదర్స్ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన మెలోనీ దేశ తొలిమహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. ‘నేను నా కుమార్తెను ఎలా పెంచాలో మీరు చెబుతారా? అది తల్లిగా నా బాధ్యత. అదే సమయంలో ఈ దేశం కోసం పనిచేసే హక్కు కూడా ఉంది’ అని ఆమె విమర్శలను తిప్పికొట్టారు.

జీ20 సమావేశాలు తమ లక్ష్యాలను నెరవేర్చాయా?

కొవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడించిన అనుభవంతో భవిష్యత్‌లో అన్ని రకాల సంక్షోభాలను ఎదుర్కోవటానికి పటిష్ఠమైన ఆరోగ్య వ్యవస్థ రూపకల్పన చేయటంపై చర్చించటం.. ప్రపంచ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ మరింత సమర్థ వంతంగా అమలయ్యేలా ప్రణాళికలు రూపొందిం చటం, స్వచ్ఛ ఇంధన వనరుల వినియోగం పెరగటానికి అవసరమైన భారీ పెట్టుబడులను సమకూర్చుకోవటం, అందుకు సంపన్న దేశాలను సంసిద్ధం చేయటం వంటి అంశాలపైన చర్చించటం జీ20 సమావేశాలకు లక్ష్యంగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు భవిష్యత్తులో కొవిడ్‌ ‌లాంటి మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కోటానికి 1.4 బిలియన్‌ ‌డాలర్ల ఉమ్మడినిధిని ప్రారంభించ టానికి జీ20 దేశాలు అంగీకరించాయి. ఇండో నేసియా అధ్యక్షుడు జోకోవిడోడో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ 24 దేశాలు భాగస్వామ్యమైన ఈ నిధిలో మూడో వంతు 450 మిలియన్‌ ‌డాలర్లను అమెరికా సమకూర్చింది. భారత్‌, ‌బ్రిటన్‌, ‌చైనా, ఫ్రాన్స్, ‌కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌ ‌కూడా ఇందులో ఉన్నాయి. ఈ మొత్తం సరిపోదని, కనీసం 31 బిలియన్‌ ‌డాలర్లు అవసరమవుతాయని జోకో విడోడో పేర్కొన్నారు.

రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు మోసుకొచ్చిన అనిశ్చితి ద్రవ్యోల్బణాన్ని అమాంతం తారస్థాయికి చేరింది. దీనితో పశ్చిమదేశాల కొనుగోలు శక్తి పడిపోయింది. వృద్ధిని అది కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ గండం నుంచి గట్టెక్కటానికి చాలా దేశాల సెంట్రల్‌ ‌బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. అమెరికా, బ్రిటన్‌లు ఆర్థిక మాంద్యంలోకి జారుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ జీ20 సదస్సులో ద్రవ్యోల్బణం గురించి చర్చ సాగిన దాఖలా లేదు. మాంద్యం నుంచి గట్టెక్కటానికి ఈ కూటమి చర్చించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ‌సూచనను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు. ప్రపంచ పేదల్లో సగం మందిపైగా నివసిస్తున్న 54 దేశాలకు తక్షణమే రుణాలు అందించకపోతే అవి మరింత పేదరికంలో జారుకునే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలంక, పాకిస్తాన్‌, ఇథియోపియా, జాంబియాలు రుణ సంక్షోభంలో కోరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముదురుతున్న ఆర్థిక సంక్షోభం పైన యునైటెడ్‌ ‌నేషన్స్ ‌డెవలప్‌మెంట్‌ ‌పోగ్రామ్‌ (‌యూఎన్‌డీపీ) హెచ్చరికలు చేసింది. జీ20 దేశాలు మరోసారి తమ ఉమ్మడి కార్యాచరణను సమీక్షించు కోవాలని సూచించింది. ఈ అంశాన్ని పట్టించు కున్నారా అనేది ప్రశ్న. సదస్సు అనంతరం విడుదల చేసిన ప్రకటనలో హితబోధలే తప్ప ఆచరణీయమైన సూచనలు లేవన్న విమర్శలు ఉన్నాయి.

భారత్‌ ‌ముందు ఎన్నో సవాళ్లు

రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పైన తీవప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఆయా అంశాలను దారిలోకి తేవటం భారత్‌కు అంత సులువు కాకపోవచ్చు. రష్యాపైన విధించిన ఆంక్షలపై సభ్య దేశాలు రెండుగా చీలిపోవటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. దౌత్యపరంగా అభివృద్ధి చెందిన దేశాలయిన యూఎస్‌, ‌యూకె, యూరోపి యన్‌ ‌యూనియన్‌, ‌జపాన్‌, ‌సౌత్‌ ‌కొరియాల సరసన చేరాలని భారత్‌ ‌భావిస్తోంది. అదే సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించాలన్న సంకల్పంతో ఉంది. ఈ రకమైన వ్యవహార సరళి రెండు వర్గాలతో సానుకూల చర్చలు చేపట్టటానికి ఉపకరించవచ్చు. ఆయా దేశాల మధ్య అంతరాలను తగ్గించి, జీ20 లక్ష్యాలను సాధించటానికి ఇది దోహదం చేస్తుంది. జీ20 అధ్యక్షునిగా తక్షణం వేధించే ఆహార కొరత, ఇంధన భద్రత, పర్యావరణం వంటి సమస్యలతో పాటు పేద దేశాలను వేధించే సమస్యలపైనా దృష్టి సారించాలి. ఇప్పటి వరకూ అధ్యక్షత బాధ్యత నిర్వహించిన ఇండోనేసియా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సమన్వయానికి కొంత వరకూ కృషి చేసింది. అలాగే ఆవిష్కరణలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సహకారానికి కొంత వరకూ ప్రయత్నించింది. భారత్‌ ఆ ‌లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి.

About Author

By editor

Twitter
YOUTUBE