ఇదేమీ కొత్త విషయం కాదు. కొత్తగా జరుగుతున్న అపచారమూ కాదు. ఈశాన్య రాష్ట్రాలలో దేశ, విదేశీ క్రైస్తవ సంస్థలు చాలా కాలంగా యథేచ్ఛగా, బాహాటంగానే క్రైస్తవ మత ప్రచారం సాగిస్తున్నాయి, మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయి. ఇందులో దాపరికం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే, గతంలో కేంద్రం, రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా క్రైస్తవ మత ప్రచారాన్ని, మతమార్పిళ్లను ప్రోత్సహించాయి. అలా దేశంలో మరెక్కడా లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ మత ప్రాబల్యం సామాజికంగా, రాజకీయంగా పెరిగిపోయింది.

నిజం.. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ మత వ్యాప్తికి చాలా కాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. హిందూ వ్యతిరేక కుహనా లౌకికవాద రాజకీయ శక్తుల అండదండలతో, విదేశీ క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న ఆర్థిక సహకారంతో అక్కడ క్రైస్తవీకరణ క్రతువు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. అస్సాం సహా అన్ని రాష్ట్రాల్లో క్రైస్తవ మత ప్రచారం మూడు చర్చిలు, ఆరు ప్రార్థనలు అన్న విధంగా సాగుతోంది. అంతేకాదు, ఈశాన్య భారతం మొత్తాన్ని క్రైస్తవీకరణ చేసేందుకు, కాలం, కర్మ కలిసొస్తే ప్రత్యేక దేశంగా ప్రకటించుకునేందుకు దేశీయ, అంతర్జాతీయ క్రైస్తవ మతసంస్థలు ఎప్పటినుంచో ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

ఇప్పుడు ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి. ఓ వైపు క్రైస్తవ మిషనరీలు, చర్చిలు, కూటములు మతమార్పిళ్లను మహోధృతంగా సాగిస్తుంటే.. మరోవైపు మిజోరాం స్థావరంగా పనిచేస్తున్న ‘మిజో సైనోడ్‌’ ‌సంస్థ అస్సాంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా తేయాకు పండించే తెగలను, గిరిజనులను క్రైస్తవంలో కలుపు కునేందుకు విశేషంగా ప్రయత్నాలు సాగిస్తోంది. అస్సాం మిషన్‌ ‌ఫీల్డ్ ‌పేరున ‘ఉద్యమ స్ఫూర్తి’తో పని చేస్తోంది. ఇటీవల వెలుగు చూసిన ఈ సంస్థ అంతర్గత నివేదికను పరిశీలిస్తే క్రైస్తవ మిషనరీలు ఎంత పకడ్బందీ వ్యూహంతో పావులు కదుపుతున్నది అర్థమవుతుంది. అవును! రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ఈ మతమార్పిళ్లు సాగిస్తున్నది. ప్రత్యేకంగా గిరిజన తెగలను లక్ష్యంగా చేసుకున్నారు. అంతేకాదు.. నేపాలీ, బెంగాలీ, అస్సామీ తెగలనే లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. వారిని ఆకట్టుకునేందుకు అదే తెగలకు చెందిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుని మతమార్పిళ్లు సాగిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన గ్రామాలు, ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమూహాలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వ్యక్తులు, కుటుంబాలకు వీరు దగ్గరై మతం మారుస్తున్నారు. దీన్ని బట్టి అస్సాంలో క్రైస్తవ మిషనరీలు ఎంత పక్కా వ్యూహంతో మతాంతరీకరణకు పాల్పడుతున్నాయో అర్థమవుతుంది.

నిజానికి, ఈశాన్యంలోనే కాదు, తెలుగు రాష్ట్రాలు సహా ఇంకా అనేక రాష్ట్రాల్లో క్రైస్తవ మతప్రచారం చాలా కాలంగా జోరుగా సాగుతోంది. బలవంతపు మతమార్పిళ్లు యథేచ్ఛగా జరుగు తున్నాయి. ఒక విధంగా, క్రైస్తవీకరణ ప్రమాద ఘంటికలు దేశమంతా మారుమ్రోగుతూనే ఉన్నాయి. అందుకే కావచ్చు, ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం సైతం ‘బలవంతపు మతమార్పిళ్లను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాల’ని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బలవంతపు మతమార్పిళ్లను అరికట్టక పోతే దేశంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తే అవకాశా లున్నాయని కూడా సుప్రీం కోర్టు పేర్కొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎంఆర్‌ ‌షా, జస్టిస్‌ ‌హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ‘బలవంతపు మతమార్పిళ్లను దేశ భద్రత, మత స్వేచ్ఛను ప్రభావితం చేసే సమస్యగా పేర్కొంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇంతకాలం లౌకికవాదం ముసుగులో క్రైస్తవ సంస్థలు సాగిస్తున్న మతాంతీరీ కరణ దుష్ప్రభావాలు మరోసారి తెరపైకి వచ్చాయి. నిజమే.. సుప్రీం కోర్టు వ్యాఖ్యలను గమనిస్తే, దేశంలో ఇంకా అనేక ప్రాంతాలలో మతాంతరీకరణ కుట్రలు ఎలా సాగుతున్నాయన్నది అర్థమవుతుంది. అయితే, ఈశాన్య రాష్ట్రాలలో ఈ పరిస్థితి మరింతగా విషమి స్తోంది. దీనికి సంబంధించి ఇటీవల ఆంగ్ల వారపత్రిక ‘ఆర్గనైజర్‌’ ‌ప్రచురించిన పరిశోధనాత్మక కథనం అనేక ఆసక్తికర పరిణామాలను వెలుగులోకి తెచ్చింది.

అరెస్టయిన స్వీడన్కు చెందిన మత ప్రచారకులు హన్నా మైకేలా బ్లూమ్, మార్కస్ ఆర్నే హెన్రిక్ బ్లూమ్, సుసన్నా ఎలిజబెత్ హకనాసన్

కుట్రలు, కుతంత్రాలు

అస్సోం, మేఘాలయ, మణిపూర్‌ ‌సహా ఈశాన్య రాష్ట్రాలు అంతటా క్రైస్తవీకరణ కుట్రలు, కుతంత్రాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. ‘సువార్త ప్రచారం’ పేరిట క్రైస్తవ ప్రచారం మాత్రమే కాదు, మతమార్పిళ్లూ జరుగుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న నిధులను ఉపయోగించుకుని మతమార్పిళ్లు జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో వందలు, వేలలో కాదు ఏకంగా లక్షల సంఖ్యలో హిందువుల్ని క్రైస్తవ సంస్థలు మాయమాటలు చెప్పి, తాయిలాలతో ప్రలోభపెట్టి మతం మారేలా చేస్తున్నాయి. ఫలితంగా అక్కడ హిందువుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. హిందూ ధర్మ రక్షణ కోసం శ్రీమత్‌ ‌శంకర దేవ్‌ అస్సాంలో స్థాపించిన వైష్ణవ, సత్రియ కేంద్రం రూపమే మారిపోయింది. ఆ ప్రాంతంలో వైష్ణవ సత్రాల కంటే క్రైస్తవ చర్చిల సంఖ్య ఎక్కువగా ఉంది. వైష్ణవ సత్రాలు 34 ఉంటే, చర్చిల సంఖ్య 66కు చేరింది. ఈ పరిణామాలను గమనిస్తే ఇది ఒక వ్యూహం ప్రకారం క్రైస్తవ సంస్థలు సాగిస్తున్న ‘భయంకర కుట్ర’ అని స్పష్టమవుతోంది. గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో క్రైస్తవులు ఉన్నా లేకున్నా ముందు చర్చిలు నిర్మించడం, ఆ తర్వాత చర్చిలను స్థావరంగా చేసుకుని క్రైస్తవమత ప్రచారం చేయడం, ఇక అక్కడి నుంచి మతమార్పిళ్లు సాగిం చడం.. ఇదంతా ఎన్నో దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్ర.

మార్పిళ్లకు ‘అమెజాన్‌’ ఆర్థికసాయం

ఇదిలా ఉంటే.. ‘ఆర్గనైజర్‌’ ‌పత్రిక మరో రహస్యాన్ని బయటపెట్టింది. చర్చి, క్రైస్తవమత సంస్థలు, మిషనరీలు మాత్రమే కాదు, క్రైస్తవ యాజమాన్యంలోని అమెజాన్‌ ‌వంటి వ్యాపార సంస్థలు కూడా ‘మేము సైతం’ అంటూ ఈశాన్య రాష్ట్రాలలో మత మార్పిళ్లకు ‘ఉడతా భక్తి’గా డాలర్లు కుమ్మరిస్తున్నాయి. అమెరికన్‌ ‌బాప్టిస్ట్ ‌చర్చి (ఏబీఎం) భారతదేశంలో సాగిస్తున్న మతాంతరీకరణ క్రతువుకు అమెజాన్‌ ఆర్థిక సహాయం అందిస్తోంది. బయటకు వచ్చింది ఒక్క అమెజాన్‌ అకృత్యమే అయినా ఇంకా అనేక బహుళ జాతి సంస్థలు భారతదేశంలో సాగిస్తున్న మతమార్పిళ్ల మహా క్రతువుకు ఏబీఎం ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా మనీ లాండరింగ్‌ ‌కార్యకలాపాలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి. దేశ వ్యాప్తంగా క్రైస్తవ మిషనరీలు సాగిస్తున్న మతమార్పిళ్లకు ఈ సంస్థలే మనీ లాండ రింగ్‌ ‌ద్వారా తోడ్పాటునందిస్తున్నాయని సోషల్‌ ‌జస్టిస్‌ ‌ఫోరం ఫర్‌ అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌సంస్థ ఆరోపించింది.

అమెరికా బాప్టిస్ట్ ‌మిషన్‌ ‌భారతదేశంలో ‘ఆల్‌ ఇం‌డియా మిషన్‌’‌గా పని చేస్తోంది. ఈశాన్య భారతంలో 25 వేల మంది హిందువులను క్రైస్తవు లుగా మార్చామని ఈ సంస్థ ఎలాంటి దాపరికం లేకుండా వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇంత బహిరంగంగా మతమార్పిళ్లకు పాల్పడుతున్న ‘ఆల్‌ ఇం‌డియా మిషన్‌’ ‌సంస్థకు ఈ కామర్స్ ‌దిగ్గజం అమెజాన్‌.. అమెజాన్‌ ‌స్మైల్‌ ‌ఫౌండేషన్‌ ‌ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తోందని సోషల్‌ ‌జస్టిస్‌ ‌ఫోరం ఆఫ్‌ అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ఆరోపిస్తోంది. ఇంకా దుర్మార్గం ఏమంటే ‘అమెజాన్‌ ‌స్మైల్‌’ ‌ఫౌండేషన్‌ ఎం‌తమంది హిందువులను మతం మార్పిస్తే అంత ఎక్కువ మొత్తంలో నిధులు సమకూరుస్తోంది. ‘ఆల్‌ ఇం‌డియా మిషన్‌’ ‌మతం మార్చిన హిందువుల తలలు లెక్కపెట్టి తలకింత చొప్పున సొమ్ములు చెల్లిస్తోంది.

నిజానికి, అమెజాన్‌ ‌భారతదేశంలో ఎంత కాలంగా ఈ-కామర్స్ ‌వ్యాపారంతో పాటుగా, మతమార్పిడి వ్యాపారం సాగిస్తోందో ఏమో కానీ ఇటీవల అస్సాం పోలీసులు జర్మనీకి చెందిన ఏడుగురు క్రైస్తవ మిషనరీ సభ్యులను అరెస్ట్ ‌చేసిన మీదట గానీ ఆ సంస్థ అసలు రంగు, అది భారత దేశంలో మత మార్పిళ్లకు అందిస్తున్న అదృశ్య సహాయం బయటకు రాలేదు.

ఈ నేపథ్యంలోనే నేషనల్‌ ‌కమిషన్‌ ‌ఫర్‌ ‌ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ‌చైల్డ్ ‌రైట్స్ (ఎన్సీపీసీఆర్‌) అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. అమెజాన్‌ ‌కూడా ఆరోపణలను అంగీక రించింది. ‘ఆల్‌ ఇం‌డియా మిషన్‌’‌కు అమెజాన్‌- అమెరికా ఆఫీస్‌ ‌నిధులు సమకూరుస్తోందని అంగీకరించింది. అలాగే, భారతదేశంలో పనిచేస్తున్న ఆల్‌ ఇం‌డియా మిషన్‌ ‌మరో అనుబంధ సంస్థ అయిన కల్వరి గోస్పెల్‌ ‌మినిస్ట్రీస్‌ ‌ట్రస్ట్ ‌దేశవ్యాప్తంగా ‘ప్రార్థన భవన్‌’ ‌పేరిట చర్చిలు నిర్మిస్తోంది. ‘ప్రార్థన భవన్‌’ అనే సెక్యులర్‌ ‌పేరు తగిలించుకున్న ఈ సంస్థ సాగించే ‘పవిత్ర’ కార్యం కూడా తక్కువేమీ కాదు. అదే మత ప్రచారం. అవే మతమార్పిళ్లు. దీనికి కూడా అమెజాన్‌ ఆర్థిక సహాయం అందిస్తోంది. అంటే అమెజాన్‌.. ‌హిందువుల చేతులతో హిందువుల కళ్లనే పొడుస్తోందన్న మాట.

ఆంధప్రదేశ్‌లోనూ..

క్రైస్తవ మిషనరీలు ఒక్క ఈశాన్య భారతంలోనే కాదు, ఆంధప్రదేశ్‌లోనూ అవే కుట్రలకు పాల్పడు తున్నాయి. అక్కడ విదేశీ క్రైస్తవ సంస్థలు మత ప్రచారాన్ని, మతమార్పిళ్లను ప్రోత్సహిస్తుంటే.. ఏపీలో ప్రభుత్వమే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకుంది. రాష్ట్రంలో క్రైస్తవ మతవ్యాప్తికి ఇప్పటికే పాస్టర్లకు నెలవారీ నజరానాలు అందిస్తున్న ఏపీ సర్కార్‌ ‌తాజాగా రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు నియోజకవర్గానికి కోటి రూపాయల వంతున మొత్తం 170 అసెంబ్లీ నియోజక వర్గాలకు రూ.170 కోట్లు కేటాయించింది. గతంలో, సోనియా గాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా, వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం సహా ఇతర కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లోను ఇదే తంతు నడిచింది. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి అదే పద్ధతిలో క్రైస్తవ మత ప్రచారానికి పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

వీసా నింబధనలను ఉల్లంఘించి భారత్‌కు వచ్చిన ఏడుగురు జర్మన్‌ ‌క్రైస్తవ మత ప్రచారకులు

పేదలకు సాయం పేరుతో..

క్రైస్తవ మిషనరీలు క్రైస్తవీకరణకు పేదరికాన్ని పావును చేసుకుంటున్నాయి. వారికి సాయం చేస్తున్నామనే పేరుతో తాయిలాలు పంచి మతం మారుస్తున్నాయి. ఆ విధంగా పేదరికం, పేదలే లక్ష్యంగా ఈ క్రైస్తవ మతసంస్థలు అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాలలో తేయాకు తోటలలో పనిచేసే కార్మికులు, కార్మిక కుటుంబాలను మతం మారుస్తు న్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ క్రైస్తవ సంస్థల కార్యకలా పాలను కట్టడి చేయడంతో చట్టానికి చిక్కకుండా మిషనరీలు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నాయి. అక్టోబర్‌ 25, 28‌లలో అస్సాం పోలీసులు స్వీడన్‌, ‌జర్మనీకి చెందిన క్రైస్తవ మిషనరీ ముఠాలను అరెస్ట్ ‌చేశారు. స్వీడన్‌ ‌నుంచి వచ్చిన ముగ్గురితో పాటుగా, జర్మన్‌ ‌నుంచి వచ్చిన ఏడుగురు మత ప్రచారకులు, పర్యాటక వీసాల మీద వచ్చి పని చక్క పెట్టుకున్నారు. ఇలా పర్యాటక వీసా మీద వచ్చి మత ప్రచారంలో పాల్గొనడం నేరం. అయినా, గతంలో ఎవరూ పట్టించుకోలేదు. ఈ ముఠాలు తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులే లక్ష్యంగా చాలా పెద్దఎత్తున మతపరమైన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. బలవంతపు మతమార్పిళ్లను ప్రోత్సహించాయి. స్వస్థత సభ పేరిట శిబిరాలు ఏర్పాటు చేసి, వారిని మాయచేసి తేయాకు కుటుంబాలపై మతం మత్తు చల్లాయి. నిజానికి, ఈ క్రతువు దశాబ్దాలుగా  సాగుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని వేల మంది తేయాకు కార్మికుల మెడలలో సిలువలు వేల్లాడుతు న్నాయి. పుణ్య స్త్రీల ముఖాన బొట్టు చెరిగిపోయింది.

విదేశీ నిధులతో

మనం ఇంతకు ముందే అనుకున్నట్లుగా ఈశాన్య రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా సాగుతున్న మతమార్పిళ్లకు మూలధనం, ఇంధనం.. విదేశీ క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న నిధులే అన్నది బహిరంగ రహస్యం. జర్మనీ ఇతర యూరోపియన్‌ ‌దేశాల నుంచి కూడా అస్సాం, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో మత మార్పిళ్లకు పెద్దఎత్తున ప్రోత్సాహం లభిస్తోంది. నిధులు వరదలా వచ్చి పడుతున్నాయి. ఇంతవరకు అంతగా వెలుగులోకి రాని క్రైస్తవ మిషనరీల ఆర్థిక కార్యకలాపాల వివరాలను ఆధారాలతో సహా ‘ఆర్గనైజర్‌’ ‌బయటపెట్టింది. జర్మనీ నుంచి ఈశాన్య రాష్ట్రాలలో మతమార్పిళ్లు సాగిస్తున్న వ్యక్తులు, సంస్థలకు నిధులు ఏ విధంగా అందు తున్నాయో స్పష్టంచేసింది. అస్సాంలోని తేజ్‌పూర్‌కు చెందిన బిషప్‌.. ‌జర్మనీలోని పాస్టర్‌కు ‘కృతజ్ఞతలు’ తెలియచేస్తూ రాసిన లేఖ అసలు గుట్టును బయట పెట్టింది. విదేశీ క్రైస్తవ సంస్థలు పంపిన నిధులు అస్సాంలో మతమార్పిళ్లకు ఏ విధంగా వినియోగిస్తు న్నారో స్పష్టంచేసింది. ఈ లేఖలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న 2021 జనవరి 18న తేజ్‌పూర్‌ ‘‌బిషప్‌’ 7500 ‌యూరోలు, అంటే రూ. 6 లక్షల 55 వేలు విరాళంగా ఇచ్చినందుకు జర్మనీ పాస్టర్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. అంతేకాదు, ఆ డబ్బును మత మార్పిళ్లకు ఖర్చు చేస్తానని ‘ప్రతిజ్ఞ’ చేశారు. అలాగే, కరోనా మహమ్మారిని అడ్డుపెట్టుకుని మత ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నామని కూడా పేర్కొన్నాడు. దీన్నీ బట్టి క్రైస్తవ సంస్థలు ప్రవచించే ప్రేమ, దయ, దాతృత్వం అసలు లక్ష్యం ఏమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. క్రైస్తవ మిషనరీ సంస్థలు ఏది చేసినా అంతిమ లక్ష్యం మాత్రం మత మార్పిళ్లే అన్నది ఈ లేఖ మరోమారు స్పష్టం చేసింది.

ఇంకొక విషయం.. క్రైస్తవ మిషనరీలు కరోనా మహమ్మారి సృష్టించిన విపత్తును కూడా మత మార్పిడికి ఉపయోగించుకున్నాయి. కరోనా సమ యంలో అస్సాం రాజధాని దిస్‌పూర్‌కు సమీపంలోని మూడు హిందూ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చివేశారు. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు! చలి కాచుకోవడానికి అల్యూమినియం రేకుల కట్టలు, కొన్ని వెచ్చని దుస్తులు ఇచ్చి గ్రామాలకు గ్రామాలనే క్రైస్తవ గ్రామాలుగా మార్చేశారు. ఇదేదో సినిమాలో సంఘటన అనిపిస్తుంది, కానీ నిజం. ఆమ్‌సంగ్‌ అటవీ ప్రాంతానికి సమీపంలోని మూడు మారు మూల గ్రామాలలో కలిపి మొత్తం గౌరు సామాజిక వర్గానికి చెందిన 130 హిందూ కుటుంబాలున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోనివి కావడంతో సమాచార సదుపాయాలు అంతగా లేవు. దీన్ని ఆసరాగా చేసుకుని కరోనా సమయంలో క్రైస్తవ సంస్థలు ఆ గ్రామాలపై వాలిపోయాయి. చిన్న చిన్న సహాయం అందిస్తూ మెల్లమెల్లగా ఒక్కొక్క కుటుంబాన్ని మతమార్పిడి ముగ్గులోకి దించారు. చలికాలంలో కుటుంబానికి ఓ రెండు అల్యూమినియం రేకులు, రగ్గులు, స్వెట్టర్లు ఇచ్చి హిందువులను క్రైస్తవులుగా మతం మార్చేశారు. ఇప్పుడు ఆ మూడు గ్రామాలలో మిగిలింది రెండే రెండు హిందూ కుటుంబాలు. ఆ మూడు గ్రామాలు- సంపత్‌హార్‌, ‌లోంగదాన్‌గురి, సువాలి లుకువ ఖాల్‌ ఇప్పుడు పూర్తిగా క్రైస్తవ గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. ఇప్పుడు ఆ గ్రామాలలో ఎవరూ ఇతర ప్రాంతాల వారితో మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు. క్రైస్తవ మిషనరీలు సామాన్య గిరిజన ప్రజలను అంతలా భయానికి గురిచేశారని హిందూ ఫెడరేషన్‌ అస్సాం ప్రదేశ్‌ ‌జనరల్‌ ‌సెక్రటరీ సలేన్‌ ‌బైష్య చెపుతున్నారు.

‘ఆర్గనైజర్‌’ ‌నుంచి

అను: రాజనాల బాలకృష్ణ

About Author

By editor

Twitter
Instagram