‘రాజ్యాంగమే సర్వోన్నతం’- స్వతంత్ర భారత పౌరులందరిని కలిపి ఉంచే పదబంధమిది. వైవిధ్య భరిత భారతావనిని సమైక్యంగా ఉంచే ఏకతా సూత్రమిది. ఆటుపోట్లే చరిత్ర పుటలుగా ఉన్న ఈ దేశంలో ఆధునిక సామాజిక గమనానికీ, జీవనానికీ అదే కరదీపిక. మూలాలను గౌరవించుకుంటూనే, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం నేర్పే తాత్విక భూమిక. కానీ ఆ పదబంధాన్ని ఉచ్చరించే చాలా మందికి రెండు నాల్కలు ఉన్నాయి. ఒక నాలుక ‘రాజ్యాంగమే సర్వోన్నతం’ అంటుంది. మరొకటి ‘వందేమాతరం’ పలకనంటుంది. రాజ్యాంగ నిర్మాతలు శ్రీరాముడిని ఈ దేశపు ఆధ్యాత్మిక వార సత్వంగా గుర్తించలేదా అని అడిగితే ఒక నాలుక తడబడుతుంది. మరొక నాలుక రాముడిని దూషించడాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛ అంటూ దబాయిస్తుంది. ‘గీతా’సారం భారతీయ చింతనాధారగా రాజ్యాంగం చిత్రించింది. కానీ భగవద్గీత పేరు ఎత్తితేనే లౌకిక వ్రత భంగమైపోయిందంటూ గగ్గోలు పెట్టే నోళ్లకీ కొదవలేదిప్పుడు.  ఈ ధోరణిని అత్యధికులైన భారతీయులు ఈసడిస్తున్నారు.

శతాబ్దాల పరాయి పాలన, బానిసత్వాల తరువాత భారతదేశం జనవరి 26, 1950న సార్వభౌమాధికారం ప్రకటించుకుంది. స్వాతంత్య్రోద్యమ సమరంలో అక్కడక్కడ పునరుజ్జీవన దృక్పథం పలచబడినా, స్వతంత్ర భారతీయుల అదృష్టం కొద్దీ రాజ్యాంగ నిర్మాణంలో ఆ దృక్పథం దృఢంగానే పనిచేసింది. అందుకే భారతీయ జీవనసారాన్ని, భారతీయత మూలాలను విస్మరించకుండా తగు జాగ్రత్త వహిస్తూనే రాజ్యాంగ రచన సాగింది. మన రాజ్యాంగ తొలి ప్రతుల (హిందీ, ఆంగ్లం) స్వరూప స్వభావాలు ఇందుకు సాక్ష్యం పలుకుతాయి.

మన రాజ్యాంగ నిర్మాణం చరిత్రాత్మకం. భారత ప్రభుత్వ చట్టాలు- 1858, 1909, 1919, 1935 బ్రిటిష్‌ ఏలుబడిని నిర్దేశించాయి. గోపాలకృష్ణ గోఖలే, తేజ్‌ ‌బహదూర్‌ ‌సప్రూ, వీఎస్‌ శ్రీ‌నివాసశాస్త్రి వంటి భారతీయ మేధావుల నుంచి కొన్ని సలహాలు, సూచనలు స్వీకరించినా ఆ చట్టాల రూపకర్తలు ఆంగ్లేయులే. స్వతంత్ర భారతంలో మనదైన రాజ్యాంగ రచన ప్రారంభ మైంది.

దేశం నలుమూలల నుంచి చట్టసభల నుంచి పరోక్ష పద్ధతితో ఎన్నికైన ప్రతినిధులతో రాజ్యాంగ పరిషత్‌ ఆవిర్భవించింది. పార్లమెంట్‌లోని సెంట్రల్‌ ‌హాలులోనే (కాన్‌స్టిట్యూషన్‌ ‌హాలు) డిసెంబర్‌ 9, 1949‌న రాజ్యాంగ పరిషత్‌ ‌సమావేశాలు మొదలయి నాయి. ఆనాడు 207 మంది సభ్యులు హాజ రయ్యారు. తరువాత ఈ సంఖ్య మారుతూ వచ్చింది.  ప్రత్యేక దేశం డిమాండ్‌తో తొలిరోజే ముస్లింలీగ్‌ ‌సమావేశాన్ని బహిష్కరించింది. జనవరి 24, 1950న రాజ్యాంగ పరిషత్‌ ‌తుది సమావేశం జరిగింది. అంతవరకు ఇదే తాత్కాలిక పార్లమెంటుగా చలామణీ అయింది. ఇందులో 69 శాతం భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సభ్యులే. డిసెంబర్‌ 11‌న డాక్టర్‌ ‌బాబూ రాజేందప్రసాద్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. డాక్టర్‌ ‌హరీంద్ర కుమార్‌ ‌ముఖర్జీ (ప్రముఖ క్రైస్తవ నాయకుడు, మైనారిటీల హక్కుల సంఘం అధ్యక్షుడు) ఉపాధ్యక్షునిగా, ప్రముఖ పత్రికా రచయిత, రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు బెనెగల్‌ ‌నరసింగరావు (కర్ణాటక) రాజ్యాంగ సలహాదారుగా ఎంపికయ్యారు. ఆగస్ట్ 29, 1947‌న డాక్టర్‌ అం‌బేడ్కర్‌ అధ్యక్షులుగా ముసాయిదా సంఘం ఆవిర్భవించింది. ఇంకా అల్లాడి కుప్పుస్వామి అయ్యర్‌, ఎన్‌. ‌గోపాలస్వామి అయ్యంగార్‌, ‌కేఎం మున్షీ, సయ్యద్‌ ‌మహమ్మద్‌ ‌సదుల్లా, బీఎల్‌ ‌మిట్టర్‌, ‌డీపీ ఖైటాన్‌ ఈ ‌సంఘంలో ఉన్నారు. ఇవి కాకుండా మరో ఎనిమిది ఉప సంఘాలు కూడా తరువాత ఏర్పాటయినాయి.  నెహ్రూ, పటేల్‌ ‌వంటివారు ఆ సంఘాలకు నాయకత్వం వహించారు. ముసాయిదా సంఘం నవంబర్‌ 4,1947‌న రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్‌కు సమర్పించింది. రెండేళ్ల, 11 మాసాల, 17 రోజుల పాటు పరిషత్‌ 114 ‌సమావేశాలు జరిపి ఈ ముసాయిదాపై చర్చించింది. నవంబర్‌ 26, 1949‌న ఈ ముసాయిదాకు ఆమోదం లభించింది. ఈ రోజునే జాతీయ శాసన దినోత్సవంగా జరుపుకోవడం ఆరంభించారు. సభ్యులు ప్రతిపాదించిన 2000 సవరణలతో ముసాయిదాకు ఆమోదం లభించింది. జనవరి 24, 1950న 284 మంది రాజ్యాంగ పరిషత్‌ ‌సభ్యులు సంతకాలు చేసిన తరువాత భారత రాజ్యాంగంగా ఆవిర్భవించింది. ఇందులో 22 విభాగాలు, 395 ఆర్టికల్స్, 12 ‌షెడ్యూల్స్ ఉన్నాయి. రెండు అనుబంధాలు కూడా ఉన్నాయి.

‘వుయ్‌ ‌ది పీపుల్‌..’ అం‌టూ రాజ్యాంగం ముందు మాటలో కనిపించే తొలి పదాలు అమెరికా రాజ్యాంగం ముందుమాట ఇచ్చిన ప్రేరణతో తీసుకున్నవే. ప్రాథమిక హక్కులు కూడా అమెరికా రాజ్యాంగం నుంచి వచ్చినవే. పంచవర్ష ప్రణాళికల ఆలోచనను సోవియెట్‌ ‌యూనియన్‌ ‌నుంచి తీసుకున్నాం. ఆర్థిక, సామాజిక హక్కులను ప్రసాదించే ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ ‌నుంచి తెచ్చుకున్నాం. ముందుమాటలో పేర్కొన్న ‘స్వేచ్ఛ’, ‘సమత్వం’, సౌభాత్రం’ ఫ్రెంచ్‌ ‌విప్లవం నుంచి గ్రహించిన ఆదర్శాలే. కానీ వీటిని నాటి రాజ్యాంగ నిర్మాతలు మనదైన జీవనవిధానంతో, ఆలోచన తోను, చరిత్రతోను అనుసంధానం చేస్తూ వాస్తవి కంగా వ్యవహరించారు. రాజ్యాంగ తొలిప్రతుల స్వరూపం, ఆకృతి దీనికి సాక్ష్యం చెబుతాయి. భారతీయుల మనోభావాలకు రాజ్యాంగ నిర్మాతలు ఎంతో విలువనిచ్చారు. దానిని గమనించాలి. దేవనాగరి, రోమన్‌ ‌లిపులలో తొలి ప్రతులను తయారు చేయించారు. ప్రేమ్‌ ‌బిహారీ నారాయణ్‌ ‌రైజాదా(సక్సేనా) స్వదస్తూరితో ఆ ప్రతులు రాశారు. రాజ్యాంగంలోని ప్రతి ముఖ్యమైన అధ్యాయానికి ఒక బొమ్మ వేయించారు. రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌స్థాపించిన శాంతినికేతన్‌కు చెందిన నందలాల్‌బోస్‌, ఆయన సహచరులు, శిష్యులు కలసి ఆ బొమ్మలు వేశారు. ఇవన్నీ మనదైన చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేవే. వీటిని డెహ్రాడూన్‌లో ముద్రించారు. ఆ చేతి ప్రతులను సర్వే ఆఫ్‌ ఇం‌డియా కార్యాల యంలో ఫోటో లితోగ్రాఫ్‌ ‌చేశారు.

ఇందులో 20 పెయింటింగ్స్ ఉపయోగించారు. ప్రతి పేజీని అజంతా శైలి చిత్రాలతో అందంగా అలంకరించారు. లంకా విజయం, గీతోపదేశం, వేదకాలం నాటి గురుకులాన్ని ప్రతిబింబించే దృశ్యం, గంగావతరణం, విక్రమాదిత్య చక్రవర్తి, బుద్ధుడు, మహావీరుడు, నలందా విశ్వవిద్యాలయం, ఛత్రపతి శివాజీ, గురు గోవింద్‌ ‌సింగ్‌, ‌రాణీ క్ష్మీబాయి, అక్బర్‌, ‌టిప్పు సుల్తాన్‌ ‌బొమ్మలు, హిమాలయాలు, మొహెంజదారో ఎద్దు, సుభాశ్‌బోస్‌, ‌గాంధీజీ బొమ్మలు ఇందులో ఉన్నాయి. అంటే పురాణాలతో పాటు మొహెంజదారో నుంచి మహాత్ముడి వరకు చరిత్రనూ రాజ్యాంగ రచనకు స్ఫూర్తిగా స్వీకరించారు. మొదటి భాగం- కేంద్రం, కేంద్రం పరిధులు. దీనికి పైన మొహెంజదారో తవ్వకాలలో బయల్పడిన (ఇదొక ముద్రిక) ఎద్దు బొమ్మను ఉపయోగించారు. ఎంతో బలిష్టంగా, గంభీరంగా, సుందరంగా ఉండే ఈ బొమ్మను ఈ అధ్యాయానికి ప్రతీకగా ఎంచుకోవడంలోని అంతరార్థాన్ని గ్రహించడం కష్టం కాదు. మొహెంజదారో, హరప్పా సంస్కృతిలో వృషభ ఆరాధాన ఒక అంశం. రెండో భాగం- పౌరసత్వం. వేద సంప్రదాయంలోని యజ్ఞవాటిక దృశ్యాన్ని దీనికి ఎంచుకున్నారు. మూడో అధ్యాయం పేరు ప్రాథమిక హక్కులు. దీనికే లంకా విజయం చిత్రాన్ని ఉపయోగించారు. అంటే రావణుని జయించి సీతా సాధ్వితో శ్రీరామచంద్రుడు పుష్పక విమానంలో, లక్ష్మణ సమేతుడై అయోధ్యకు తరలుతున్న దృశ్యమిది. విశ్వాసం, సత్యం కలసి ఒక రాక్షసశక్తి మీద సాధించిన విజయానికి ప్రతీకగా ఈ బొమ్మను రాజ్యాంగ నిర్మాతలు ఎంచుకున్నారు. ఆదేశిక సూత్రాలను నాలుగో అధ్యాయంలో పొందుపరిచారు. ఈ అధ్యాయానికి ఆరంభంలోనే కురుక్షేత్రంలోని గీతోపదేశం చిత్రాన్ని ఉంచారు. ఐదో అధ్యాయం- కేంద్రం. దీనికి బౌద్ధంలోని సంఘం దృశ్యాన్ని ప్రతీకగా తీసుకున్నారు. ఆరో అధ్యాయంలో ‘ఏ’ భాగానికి మహావీరుని బొమ్మ ఉంది. ఏడో  అధ్యాయానికి నటరాజ స్వామి బొమ్మను ఉపయో గించారు.

ఇందులో స్వరాజ్య సమరయోధులలో ఇద్దరే- సుభాశ్‌ ‌చంద్రబోస్‌, ‌గాంధీజీ బొమ్మలు మాత్రమే ఉపయోగించారు. గాంధీ నడిపిన దండియాత్ర, నౌఖాలీ పర్యటనలు ఇతివృత్తంగా తీసుకున్న రెండు బొమ్మలు ఉపయోగించారు. నేతాజీ త్రివర్ణ పతాకానికి వందనం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ తొలి ప్రతులు ఇప్పటికీ పార్లమెంటు గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయి. కానీ ఆ ప్రతులలో భారతీయ పురాణాల చిత్రాలు ఉన్నాయన్న సంగతి ఎవరూ చెప్పరు. ఒకదశలో వీటిని తొలగించాలన్న యత్నం జరిగిందని చెప్పేవారూ ఉన్నారు. రామాయణం, భారతం, శైవం, బౌద్ధం, జైనం వీటన్నిటి ప్రేరణ, ఆలోచన రాజ్యాంగ రచనలో తమకు మార్గదర్శకంగా నిలిచాయని ఈ బొమ్మల ద్వారా రాజ్యాంగ నిర్మాతలు సూచించారు. కానీ సెక్యులరిజం పేరుతో హిందువుల ఆరాధనను చులకన చేయడం ఇటీవలి పరిణామం.

రాజ్యాంగ ముసాయిదాకు ఆమోద ముద్ర వేస్తూ రాజ్యాంగ పరిషత్‌ ‌సభ్యులంతా సంతకాలు చేసిన తరువాత వందేమాతర గీతం ఆలపించారు. జనవరి 24, 1950న జనగణమన అధినాయక జయహే అన్న రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌గీతం, బంకింబాబు రచించిన ‘వందేమాతరం’ గేయంలోని మొదటి రెండు చరణాలను జాతీయ గీతాలుగా స్వీకరిస్తూ రాజ్యాంగ పరిషత్‌ ‌తీర్మానించింది. ఒక రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సమయంలో కూడా కొందరు అది ‘రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయాలకు విరుద్ధం’ అంటూ ఆక్రోశించారు. కానీ ఆ రాజ్యాంగ నిర్మాతలే వందేమాతరం ఆలపించారు. జాతీయగీతంగా స్వీకరించారు. అలాగే స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తిని ఇచ్చిన త్రివర్ణ పతాకం. ఆ జెండా నీడనే రాజ్యాంగ రచన పూర్తయింది!

ప్రస్తుతం కుహనా మేధావులు, కుహనా సెక్యులరిస్టులు యథేచ్ఛగా ఉపయోగిస్తున్న ‘సెక్యులరిజం’ అన్న మాట మొద• రాజ్యాంగంలో లేనేలేదు. ‘సెక్యులర్‌’, ‘‌సోషలిస్ట్’ అన్న రెండు పదాలను 42వ సవరణ చేసి ఇందిరాగాంధీ  ముందుమాటలో చేర్పించారు. రాజ్యాంగ చట్టం (42వ సవరణ) 1976 పేరుతో పిలిచే ఈ సవరణ అత్యవసర పరిస్థితి కాలంలో జరిగింది. ఆ సవరణ తరువాత రాజ్యాంగాన్ని కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇం‌దిరగా  కొందరు నిపుణులు అభివర్ణించారు. 1977లో ఇందిరాగాంధీ అపజయం పాలయ్యారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సవరణలు భారతీయ వ్యవస్థకు సరికాదని, వాటిని సరిచేస్తామని ఆ పార్టీ ప్రభుత్వం చెప్పింది. కానీ చేయలేకపోయింది.

ఆ సవరణ అసలు సార్వభౌమ, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం అన్న నినాదాన్ని సార్వభౌమ, లౌకిక, సామ్యవాద, గణతంత్ర రాజ్యమని మార్చింది. చట్టసభలు చేసిన చట్టాలకు ఉన్న రాజ్యాంగబద్ధత గురించి నిలదీయడానికి సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉన్న మొత్తం అధికారాన్ని ఈ సవరణ దారుణంగా కుదించివేసింది. ప్రాథమిక హక్కులకు పాతరేసింది. ముందుమాట సహా, రాజ్యాంగంలోని చాలా విభాగాల స్వరూపాలను ఆ సవరణ మార్చింది. ప్రధానికి హద్దులులేని అధికారాలను కట్టబెట్టింది. పైగా ఏ అంశాన్నయినా సవరించే నిరంకుశాధికారం పార్లమెంటుకు వచ్చింది. ఈ సవరణకు న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా చేసింది. అసలు భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి తీవ్రంగా భంగం కలిగిస్తూ ఎన్నో రాష్ట్రాల అధికారాలని కేంద్రానికి 42వ సవరణ బదలీ చేసింది. మినర్వా మిల్స్ ‌వర్సెస్‌ ‌కేంద్రం వివాదంలో సుప్రీం కోర్టు జూలై 31, 1980న ఇచ్చిన తీర్పులో 42 సవరణ లోని రెండు అంశాలను కొట్టివేసింది. అందులో ఒకటి చట్టసభల నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయరాదన్న నిబంధన.

సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా భారత్‌ను రూపొందించడం మన రాజ్యాంగ కర్తల ఉద్దేశం కాదు. ఆ రెండు పదాలు రాజ్యాంగంలో ఉండవలసిన అవసరం లేదనే మన పెద్దలు భావించినట్టు కనిపిస్తుంది. పండిట్‌ ‌నెహ్రూ నిరంతరం సెక్యులరిజం గురించి ప్రస్తావించేవారు. సోషలిజం కూడా ఆయన ముద్దుబిడ్డే. ఆ రెండు అంశాలను రాజ్యాంగంలో చేర్చాలన్న ప్రతిపాదనలు వీగిపోయాయి. ఎందుకంటే లౌకికవాదం ఈ దేశ ప్రజల జీవన విధానంలోనే ఉందన్న విశ్వాసం. వేదధర్మం ప్రబలంగా ఉన్న కాలంలో జైనం జన్మించింది. హిందూ జీవనవిధానంలోని కొన్ని లోపాల మీద తిరుగుబాటుతో బౌద్ధం ఆవిర్భ వించింది. అవి కూడా వాటి తప్పిదాలతో మరుగును పడినాయి. పలు రకాల ఆచరణలు, సంప్రదాయాలు ఉన్న విదేశీయులు ఈ దేశం మీదకు వచ్చారు. వారిని కూడా హిందూ జీవన విధానం కలుపుకుంది. పార్శీలు, యూదులు ఈ దేశంలోనే ఆశ్రయం పొందారు. సగౌరంగా జీవించారు. ఆ వాస్తవాన్ని వారే ప్రకటించుకున్నారు.రాజ్యాంగాన్ని మనసా వాచా గౌరవించాలి. అది ఒకే నేల మీద నివశిస్తున్న జాతి కలసి రాసుకున్న ఒప్పందపత్రం. రాజ్యాంగ మౌలికత నాశనమైపోతోందంటూనే, దాని మీద బురద చల్లే పని చేస్తే జనం అర్థం చేసుకోగలరు. రాజ్యాంగ నిర్మాతలకు స్పష్టత ఉంది. ఈ దేశం, దీని గతం, ఆ గతంలోని తాత్వికత రాజ్యాంగ నిర్మాణంలో ప్రతిబింబించాలని వారు కోరుకున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరు గుర్తు చేసినా వారు మతోన్మాదులవుతున్నారు. అదే చారిత్రక వైచిత్రి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram