ఘంటసాల శతజయంతి

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌కళ… తాను నమ్మిన సంగీత జగత్తు కులమతాలకు అతీతమంటూ అందరిని ఆదరించి, ఆచరించి చూపిన మానవతామూర్తి ఘంటసాల. హిందూస్థానీ సంగీత సంప్రదాయంలో మేరు శిఖరం ఉస్తాద్‌ ‌బడే గులాం ఆలీ లాంటి వారిని మన్నించి, వర్ధమాన గాయకులను ప్రోత్సహించి, ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే సూక్తికి ప్రతీక. ‘ఘంటసాల గారి అమృతగళం ఉత్తరాదిన పుట్టక పోవడం మాలాంటి గాయకుల ఆదృష్టం’ అని ప్రఖ్యాత గాయకుడు రఫీ అభినందనలు అందుకున్న మృదుమధుర గాయకుడు. గొప్పదనాన్ని గుర్తించడానికి మనిషి వ్యక్తిత్వమే కానీ ఎత్తు,సిరిసంపదలు కావడానికి ఆయన ఒక నిదర్శనం. పనికిరాదన్న గాత్రమే పట్టుదల, వినయంతో సంగీతాన్ని ప్రధానంగా లలిత సంగీతాన్ని పరిమళింప చేసింది. అద్వితీయ గాత్రం నవరసాలను పరిపూర్ణంగా పోషించింది. పాట ఆయన గాత్రంలో మురిసిపోయింది. పద్యం ఆ గొంతులో వయ్యారమొలికి రుణ పడిపోయింది. భగవద్గీత వ్యాఖ్యానం అజరామర కీర్తిని ఆర్జించి పెట్టింది. ‘నువు మలచిన ఈ బతుకు నీకే నైవేద్యం’ అని ఒక చిత్రగీతంలో ఆయనే పాడినట్లు… గంధర్వలోకాల నుంచి వెంట తెచ్చుకున్న ఒకానొక అలౌకిక మాధుర్యాన్ని తనను అభిమానించి, ఆరాధించేవారికి పంచి వెళ్లిపోయారు. ‘ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక ఘంటసాల’ అన్నట్లు గాలి ఉన్నంత వరకు ఆయన గాత్రం చెవికి సోకుతూనే ఉంటుంది.

‘విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం

పాత్రతా ద్ధన మాప్నోతి ధన ద్ధర్మం తతస్సుఖం’ (విద్యవలన వినయం, దాని వలన పాత్రతను, అందు మూలంగా ధనం, ధనం వల్ల సుఖం పొందుతారు) అన్న సూక్తికి ఘంటసాల నిలువెత్తు నిదర్శనం. ధిషహణాంకారానికి బహుదూరం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటే తత్వం.

‘లవకుశ’లో వాల్మీకి పాత్రధారి నాగయ్య గారికి పాడవలసి వచ్చినప్పుడు వణికి పోయారట. వారి సంగీత దర్శకత్వంలో బృందం గానంలో ‘గొంతు కలిపిన నేనేమిటి? ఆయనకు గాత్రమివ్వడం ఏమిటి? ఎంతటి అపచారం?’ అని మధనపడి చివరికి నాగయ్య గారి అనునయం, ప్రోత్సాహంతో పాడక తప్పలేదు. ‘ఎలా పాడాలో నాగయ్యగారి దగ్గర నేర్చు కున్నాను’ అని వినయంగా చెప్పేవారు ఘంటసాల.

గాయకుడిగా ఎంతగా రాణిస్తున్నా పాట పాడే విషయంలో ఆయనకున్న అంకితభావం, నిబద్ధ్దత గురించి వారి తనయ శ్యామల తమ రచనలో ప్రస్తావించిన తండ్రి మాటల్లో… ‘కవి ఎంతో అనుభూతితో రాస్తారు. సంగీత దర్శకుడు కష్టపడి స్వరాలు కూరుస్తారు. వాద్యబృందం (ఆర్కెస్ట్రా) శ్రద్ధగా వాయిస్తుంది. అలాంటప్పుడు మనని ఎవరేమంటార్లే! అనే అహంకారంతో తోచినట్లు పాడితే పాట నిస్సారమవుతుంది. అంతమంది శ్రమా వృథా అవుతుంది. అడిగేవారు లేనప్పుడే మరింత బాధ్యతగా వ్యవహరించాలి. వారి నమ్మకాన్ని కాపాడుకోవాలి. నమ్మకాన్ని, ప్రేమాభిమానాలను శ్రమతో సంపాదించి నిలబెట్టుకోవాలే కానీ డబ్బుతో కొనలేం’ అని ఒక తమిళ పాటను సాధన చేసే సందర్భంలో ఆమెతో అన్నారట. అంతేకాదు…‘నటులు శక్తిమేరకు నటించడానికి ప్రయత్నిస్తారు.వారి పెదవుల కదలికకు అనుగుణంగా నేపథ్య గానం అందించడం గాయనీగాయకుల ధర్మం’ ఒక ముఖాముఖిలో చెప్పారు.

కృతజ్ఞతాబద్ధుడు

బాల్యంలో, చదువుకునే రోజల్లో ఆదరించి ఆకలి తీర్చిన ప్రతి ఒక్కరిని జీవితాంతం గుర్తుంచుకుని, సందర్భానుసారం వారిని స్మరించుకునే వారు. ‘విజయ నగరంలో మధుకర వృత్తితో పొట్ట పోసు కుంటూ మొదటి కబళం వేసిన తల్లిని, ఆర్థికంగా ఆదుకున్న కళాకారిణి సరిదె లక్ష్మీనరసయమ్మ (కళావర్‌ ‌రింగ్‌)‌ను మరువలేదు. ఆయన నేపథ్యగాయ కుడిగా స్థిరపడి, ఆమె కాలం చేసిన కొన్నేళ్లకు విజయగనరం వెళ్లిన ఘంటసాల ఆమె ఇంటిని సందర్శించి నమస్కరించి, భోరుమంటూ గుమ్మం మీద కూలబడి పోయారట. ‘భక్తి విశ్వాలంటే అవి’ అన్నారు ఒక సందర్భంలో రావి కొండలరావు.

పట్రాయని-ద్వారం

గురువు పట్రాయని సీతారామశాస్త్రి అంటే అమితమైన ఆరాధనాభావం. గురుపూజ ఘనంగా నిర్వహించిన తరువాత నాటి మద్రాసులో గృహ ప్రవేశం చేశారు. ‘గురువు’ అన్న మాట శ్రీ శాస్త్రిగారి యెడలనే సార్థక మయిందనిపించింది’ అని చెప్పుకున్న ఆయన వారిపట్ల గౌరవాభిమానాలతో గురుపుత్రుడు సంగీతరావును చేరదీసి జీవిత పర్యంతం సోదరుడిగా చూసుకున్నారు.

గాయకుడిగా రాణించానంటే అందుకు ప్రధాన కారకులు కళాశాల ప్రిన్సిపల్‌ ‌ద్వారం వెంకటస్వామి నాయుడు గారి సలహాయే కారణం అనేవారు. వయోలిన్‌ ‌నేర్చుకోవాలనుకున్న ఘంటసాల కంఠాన్ని విన్న ఆయన గాత్ర విద్య వైపు మళ్లించారు. ‘ఆనాడు నాయుడు గారు అలా మార్గదర్శనం చేయకపోతే వయోలిన్‌ ‌కళాకారుడిగానే స్థిరపడేవాడినే’మో అని గుర్తు చేసుకునేవారు ఘంటసాల.

‘నాన్నగారు రజనీ….!’

‘ఈ లేఖ తెస్తున్న కుర్రవాడు (ఘంటసాల) సంగీతాన్ని అభ్యసించాడు. ఏమాత్రం వీలున్నా రేడియోలో పాడించే అవకాశం కల్పించగలరు’ అని సముద్రాల రాఘవాచార్యులు సంగీత దర్శకుడు, మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో కార్యక్రమ నిర్వహణాధికారి బాలాంత్రపు రజనీకాంతరావుకు లేఖ పంపారు. రజని-ఘంటసాలది ‘కళా సంబంధం’తో పాటు తండ్రీతనయుల లాంటి అనుబంధంగా చెప్పుకోవాలి. వయసులో ఇద్దరికి కేవలం రెండేళ్లే తేడా అయినా ఘంటసాల ఆయనను పితృభావంతో ‘నాన్నగారు’ అని మన్నించేవారు. ‘చలన చిత్రసీమలో నేపథ్య గాయకుడిగా నిలదొక్కుకోకముందు రేడియోలో పాడేందుకు అనేక అవకాశాలు కల్పించి నా జీవనానికి సహకరించారు’ అని వినమ్రంగా చెప్పేవారు ఘంటసాల. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించడం ఆకాశవాణి లక్ష్యం. ఆ పద్ధతిలోనే నా వంతు సాయం చేశాను. పూజ్యులు సముద్రాల వారంతటి వారు సిఫారసు చేశారంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉందనిపిం చింది. ఒక మాటలో చెప్పాలంటే నేను ఘంటసాలను ఆకాశవాణి శ్రోతలకు పరిచయం చేశాను అనడం కంటే ఆయన కీర్తిపతాక ఎగురుతున్నంత దాకా నా ప్రస్తావన ఉండడం నా భాగ్యం’ అని ఘంటసాలతో గల అనుబంధాన్ని రజనీ ఈ వ్యాసకర్తకు వివరించేవారు.

నేపథ్యగాయకుడిగా విఖ్యాతులైన తరువాత కూడా ఘంటసాల రేడియోలో పాడేవారు. ఆ క్రమంలోనే పాడేందుకు ఒకసారి ముందుగానే సమాచారం అందుకుని, అంగీకారం కూడా తెలిపారు. కానీ కారణాంతరాల వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అప్పటికి ఆయనకున్న స్థాయిని బట్టి చిన్నపాటి వివరణతో సరిపెట్టుకోవచ్చు. కానీ తన గైర్హాజరీకి పశ్చాత్తాప పూర్వక సంజాయిషీ లేఖ రాశారు.అది ఆయన సంస్కారమని, వినయం ఆయన సొంతమని, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే దానికి నిలువెత్తు నిదర్శనమని రజనీ గుర్తు చేసేవారు.

సమరయోధుడు… సమాజసేవకుడు

‘సంగీత సభలు చేస్తూ, నాటకాలు ఆడుతూ సంగీత శిక్షణ యిస్తూ ఆర్థికంగా సతమతమవుతున్న సమయంలోనే ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో మునిగింది. మన దేశం పర ప్రభుత్వ దాస్యంలో ఉంది. నాయకులు అందరు జైళ్లల్లో మగ్గుతూ ఉన్నారు.ఆ సమయంలో నా వ్యక్తిగత జీవితం,నా కుటుంబ బాధ్యత, సంగీత సాధన దేశ భవితవ్యం ముందు చాలా అల్పంగా కనిపించాయి. చాలామంది మిత్రులతో నాటి ఆగస్టు (క్విట్‌ ఇం‌డియా) ఉద్యమంలో పాల్గొన్నాను. ఫలితంగా పద్దెనిమిది మాసాలు కారాగార శిక్ష విధించింది. జైలు జీవితం నాకు ఎన్నో విధాలుగా మహోపకారం చేసింది. కర్తవ్య దీక్ష, స్థిర సంకల్పం, నియమబద్ధమైన జీవితం, నేను జైలు జీవితం గడిపినప్పుడే అర్థం చేసుకున్నాను’ అని తమ అభినందన ప్రత్యేక సంచికలో పేర్కొన్నారు.

నాయకులే కాదు… కళాకారులూ సమాజానికి బాధ్యత వహించాలన్నది ఆయన గట్టి విశ్వాసం.‘కళ ఎంత ఉన్నతమైనదైనా కావచ్చును. కళాకారుడు కళను తపస్సుగా భావించవచ్చును. కానీ అతను ప్రజా సమస్యలకు, వారి కష్ఠనిష్ఠూరాలకు దూరం కాకూడదు. కళను ప్రజా శ్రేయస్సుకు వినియోగించి నప్పుడే కళాకారుని జీవితం ధన్యం అవుతుందని నా విశ్వాసం’ అని స్వీయ రచనలో అభిప్రాయ పడ్డారు. ‘సినిమా వ్యక్తిగా ధన సంపాదనచేస్తూ అశేష ప్రజలను ఆకర్షిస్తూ ఆనందిపచేస్తూ , వారి సన్మానాలు అందుకోవడం మాత్రమే కళాకారుని జీవిత పరమార్థంగా భావించలేకపోతున్నాను’ అనీ నిర్మొహ మాటంగా చెప్పారు.

జాతీయ యుద్ధనిధి సేకరణలో, అనేక వైద్యశాలలు, కళాశాలల నిర్మాణంలో, పోలీసుల నిధి సేకరణలో, అనేక సాంస్కృతిక కార్యకలాపాలలో, కళాకారునిగా భాగస్వామిని కాగలడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకున్నారు.

అ కారణం చేతనే దేశమాత పిలుపు ఎప్పుడు ఏ రూపంలో వినవచ్చినా నా సేవల నర్నించడానికి సంసి ద్ధుడుగా ఉన్నాననీ ప్రకటించారు.

సంగీత కళాశాల ‘కలే’

సంగీతం నేర్చుకునేందుకు తాను పడిన కష్టాలు, ఇబ్బందులు ఔత్సాహిక, సంగీతాభిలాషగల విద్యార్థులకు ఎదురు కాకూడదన్న భావన ఆయనను వెంటాడేది. తిరుపతిలో కానీ హైదరాబాద్‌లో కానీ సంగీత కళాశాలను నెలకొల్పి, ఆసక్తి గల వారికి ఉచిత వసతి సదుపాయాలతో సంగీతం నేర్పించా లన్నది ఆయన సంకల్పం. అందుకు తిరుపతిలో స్థలం కూడా కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లో కళాశాల స్థాపనకు ఆయన ఆరాధించే సత్యసాయి బాబా భరోసా ఇచ్చారు. కానీ ఘంటసాల ఆరోగ్యం సహకరించలేదు. సంగీత కళాశాల స్థాపన విషయమై చివరి క్షణం వరకు తపించారట.

పద్యం ఆ గాత్రంలో హృద్యం

‘ఏ సాహిత్యంలోనూ లేని అపురూప సంపద పద్యం. దీని పఠనంలో వినూత్న పద్ధతి ప్రవేశ పెట్టాలని ప్రయత్నిం చాను. అప్పటి ప్రేక్షకాభిరుచిని బట్టి రంగస్థల పద్య ఆలాపన ఉండేది. ఆ రీతి తీసివేయదగ్గది కాకపోయినా ఆ పక్రియలో నూత నత్వాన్ని పరిచయం చేయాలన్నది నా ప్రయత్నం’ అని ఘంటసాల చెప్పేవారు. ఆయన బాణీని ఈలపాట రఘురామయ్య, సూరిబాబు లాంటి రంగస్థల, వెండితెర నటప్రముఖులు కూడా ప్రశంసించారు. హరికథల లోనూ ఘంటసాల శైలిలో పద్యాలు పాడాలన్న ప్రయత్నం అప్రయత్నంగానే మొదలైంది. కవిత్రయం నుంచి ఆధునిక కవుల వరకు ఎందరివో పద్యాలు ఆయన స్వరంలో పల్లవించాయి.

అనేక మంది కవుల రచనలను గానం చేసినా, పేకేటి శివరాం (అనంతరం కాలంలో నటుడు, దర్శకుడు) సహకారంతో ‘నగుమోమునకు నిశానాథ బింబముజోడు….’ పద్యం గ్రామఫోన్‌ ‌రికార్డుగా మొదట వచ్చిందని 1970వ దశకంలో ‘ఆకాశ వాణి’కి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖీలో కృతజ్ఞతా పూర్వకంగా చెప్పారు. ఇతర సంగీత దర్శకులు తమ చిత్రాలలోని పద్యాలకు బాణీలు కట్టే అవకాశం ఘంటసాల వారికే ఇచ్చేవారంటే ఈ అంశంలో ఆయనకు గల సాధికారిత అవగతమవుతుంది. వారి సూచనలను మన్నిస్తూనే బాణీలు కట్టేవారట.

‘యశస్వీభవ..’

ఇది కంచికోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖర సరస్వతీ మహాస్వామి మహదాశీర్వచనం. 1960వ దశకంలో నామమాత్రపు వాద్య సహకారంతో తమ సమక్షంలో ‘గిరిజా కల్యాణం’ యక్షగానాన్ని (ఆ తర్వాత ‘రహస్యం’చిత్రంలో వినియోగించారు) ఆలపించినప్పుడు మహాస్వామి నిండుమనసుతో అందించిన ఆశీస్సులు.సుమారు పుష్కర కాలం తరువాత వారిని దర్శించి ‘భగవద్గీత’ను గానం చేయాలన్న అభిలాషను విన్నవించగా, ‘మంచిపని చేస్తున్నావు. తప్పకుండా ఇది చాలా ప్రజాదరణ పొందుతుంది. నీ జన్మ చరితార్థమవుతుంది నాయనా..!’ అని ఆశీర్వదించారు. వారి ఆశీర్వాద ఫలమో, ఘంటసాల వారి గాత్రవైభవమో ‘గీత’ అనన్య ప్రచారం పొందుతోంది.

కలియుగ ‘గీతా’చార్యుడు

బతుకుతెరువు కోసం సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిస్తున్న నేపథ్యగాన ప్రస్థానానికి క్రమంగా స్వస్తి పలుకుతూ, ఆధ్యాత్మికత వైపునకు మళ్లాలన్న సంకల్పమే భగవద్గీతాలాపన. ఆయన జీవిత ప్రస్థానంలో చలనచిత్ర నేపథ్య గానం ఒక ఎత్తయితే, భగవద్గీత గానం మరో ఎత్తు. ‘గీత’ గానం పట్ల చిరకాలంగా గల ఆసక్తికి, ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్‌ ‌మరింత స్ఫూర్తినిచ్చారు. అనారోగ్యం ఎదురైనా వెనుదీయక లక్ష్యాన్ని సాధించారు. భగవద్గీత పాడిన నోటితో ‘లల్లాయి’ సినిమా పాటలు పాడను అనేవారని వారి ధర్మపత్ని సావిత్రమ్మ గారు చెప్పారు.

ఆ మాట దక్కించుకున్నట్లే అలాంటి పాటలు పాడకపోవడం అంటుంచి ‘గీత’ను వినకుండానే (రికార్డులు విడుదల కాకుండానే) ఆ గాత్రం మూగవోయింది. ఉత్కృష్టమైన గీతను సరళభాషలో, మధురగానంతో జాతికి అందించిన ‘గీత’కు తెలుగునాట దక్కే గౌరవం ఎంత అని ప్రశ్నించు కుంటే అభిమానులకు ఆవేదనే మిగులుతోంది. అది ఆలయాలలో కంటే అంతిమ యాత్రలలో విరివిగా వినిపించడం శోచనీయం. ‘గీత’ వినిపించిందంటే ఆయా ప్రదేశాలలో శవజాగరణో, శవయాత్రో అనే సంకేతాలు అందే స్థితి రావడం బాధించే అంశం. అసలుసిసలు వ్యక్తిత్వ వికాస గ్రంథంగా మన్ననలు అందుకుంటూ, మనిషి మనీషిగా మారే విధానాన్ని బోధించే ‘జ్ఞాన’గీత ఇలా ‘జాగరణ’ గీతగా మారడం బాధించే అంశం. ‘శోభనిచ్చే గీత శోకగీత కాదు.. కారాదనే భావన కలిగినప్పడు, కల్పించ గలిగినప్పుడే ‘గీత’కు గౌరవం. అదే ఆయనకు నిజమైన నివాళి.

‘జయంతితే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః

నాస్తి తేషాం యశః కాయే జరా మరణంజం భయం’

About Author

By editor

Twitter
Instagram