– జస్టిస్‌ ఎన్‌. ‌నగరేశ్‌, ‌కేరళ హైకోర్టు న్యాయమూర్తి

కొందరుంటారు, జన్మతః భారతీయులే. ఇక్కడే, ఈ దేశంలోనే పుట్టారు. ఇక్కడే పెరిగారు. ఈ దేశంలోనే జీవిస్తున్నారు. ఇక్కడి గాలే పీలుస్తున్నారు. ఇక్కడి నీరే తాగుతున్నారు. ఈ నేలతల్లి పెట్టిన మెతుకులు తినే బతుకుతున్నారు. వారిలో కొందరు మేధావులుగానూ చెలామణి అవుతున్నారు. కానీ, అదేమి దురదృష్టమో వారికి ఈ దేశం అంటే చిన్నచూపు. మన సంస్కృతీ, సంప్రదాయాల పొడ గిట్టదు. సిరివెన్నెల చెప్పినట్లు ‘ఈ దేశపు జాడ్యానికి విదేశాల మందు తప్ప పెరటిచెట్టు పనికిరాదు’ అన్నట్లుంది. అంతేకాదు, బ్రిటిష్‌ ‌పాలకులు దేశానికి స్వాతంత్య్రం ఇచ్చి వెళ్లిన తర్వాతనే భారతదేశం ఆవిర్భవించిందని అంటారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే భారతదేశం బట్ట కట్టిందన్నది ఈ మేధావుల నమ్మకం కావచ్చు. పాశ్చాత్య సంస్కృతిని, విదేశీ భావజాలాన్ని నరనరాన నింపుకున్న ఈ కలుషిత మేధావుల దృష్టిలో స్వాతంత్య్ర పూర్వ భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, మేధోసంపద, పరిపాలనా దక్షత అంతా ఒక మిథ్యే.

బ్రిటిష్‌ ‌వలస పాలకులు దేశాన్ని విడిచి వెళుతూ.. మనలో ఆత్మన్యూనతా భావాన్ని నింపేందుకు ‘భాతీయులకు పరిపాలన అనుభవం లేదు. పరిపాలన తెలియదు’ అంటూ విషబీజాలు నాటి వెళ్లారు. అలా వారు నాటిన విషబీజాలు కాంగ్రెస్‌, ‌కమ్మీ (కమ్యూనిస్ట్)‌ల పోషణలో కొంత మంది మేధావుల మెదళ్లలో మొలకెత్తి విషవృక్షాలుగా పెరిగాయి. అదిగో ఆ మేధావులే భారతీయత అంటే అదేదో పాత చింతకాయ పచ్చడి అనే విధంగా ఎగతాళి చేస్తున్నారు, వెక్కిరింతలకు పోతున్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని, ఆచార వ్యవహారాలను, చివరకు పూర్వికులు మనకు అందించిన సుసంపన్న సంప్రదాయ పరిపాలనా పద్ధతులనూ అవహేళన చేస్తున్నారు. ‘పాశ్చాత్య ప్రపంచమే ప్రపంచం. పాశ్చాత్య సంస్కృతే సంస్కృతి, పాశ్చాత్య పాలనే పాలన, పాశ్చాత్య చట్టాలే చట్టాలు’ అనే భావనతో మన సంస్కృతిని, జాతీయ స్వాభిమానాన్ని చిదిమేసే ప్రయత్నం సాగించారు, సాగిస్తున్నారు. ఆ విషసంస్కృతి ఫలితాలు ఏమిటన్నవి అందరికీ తెలిసినవే.

అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఆలోచనలూ మారుతున్నాయి. భారతీయత మూలాల్లోకి అందరి ఆలోచనలూ సాగుతున్నాయి. ఇది మంచి పరిణామం. ఇటీవల భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ న్యాయవ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని నొక్కి చెపుతూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయి. కర్ణాటక బార్‌ ‌కౌన్సిల్‌ ‌కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ‌మోహన్‌ ఎం. ‌శాంతనా గౌదర్‌  ‌సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో జస్టిస్‌ ‌రమణ ప్రధాన ఉపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘న్యాయవ్యవస్థలో పరాయీకరణ ప్రభావం’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టుల్లో ఏమి జరుగుతుందో తెలియక సామాన్య ప్రజలు అయోమయానికి గురవుతున్నారని, పరాయి భావనలలో ఉంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, ఆ సమయం ఆసన్నమైందని చెప్పారు. న్యాయవ్యవస్థ పనితీరులో స్థానికీకరణ, భారతీయీకరణ (ఇండియనైజేషన్‌) అవసరమని అన్నారు. సమాజ వాస్తవ పరిస్థితులు ఆకళింపు చేసుకుని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయవ్యవస్థ పనితీరును, పని విధానాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ‌రమణ పేర్కొన్నారు. ఆయన ఇటీవలే ఈ సూచన చేసినా నిజానికి ‘న్యాయవ్యవస్థలో భారతీయత’ అనే అంశంపై ఎప్పటినుంచో చర్చలు సాగుతున్నాయి. అలాగే, న్యాయ సంస్కరణల అవసరాన్ని కూడా న్యాయమూర్తులు, న్యాయ వాదులు, శాసనకర్తలు, మేధావులు చర్చిస్తూనే ఉన్నారు. అయితే, ఆశించినంత వేగంగా అడుగులు పడడం లేదు. కానీ, ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి సూచన చేయడంతో ఇది మరోసారి ప్రముఖంగా చర్చకు వచ్చింది. ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. న్యాయస్థానాలలో ఈ పరిస్థితికి సుదీర్ఘకాలం పాటు ‘ప్రత్యక్ష సాక్షి’గా నిలిచిన జస్టిస్‌ ‌రమణ వ్యాఖ్యలు న్యాయసంస్కరణల తక్షణ అవసరాన్ని నొక్కి చెపుతున్నాయని కూడా న్యాయవాద, రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో శాసననిర్మాతలు న్యాయసంస్కరణల దిశగా అడుగులు వేస్తారని.. న్యాయమూర్తులు, న్యాయవాదులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఆశిస్తున్నారు.

పురాతన భారతీయ చట్టాలు, పురాతన భారతీయ న్యాయవ్యవస్థ పనితీరును అధ్యయనం చేసినవారు.. ఆధునిక న్యాయవ్యవస్థ కంటే ప్రాచీన భారతీయ న్యాయవ్యవస్థే ఎంతో మెరుగైనదని, మేలైనదని, స్థానికమైనదని, భారతీయమని అంగీకరిస్తున్నారు. పురాతన న్యాయవ్యవస్థలో చక్కగా, సమగ్రంగా నిర్వచించిన, లౌకిక స్వభావం గల ధార్మిక చట్టాల ఆధారంగా ధర్మబద్ధంగా తీర్పులు వెలువరించేవని అంటారు. ఈ నేపథ్యంలో పురాతన, ఆధునిక న్యాయ వ్యవస్థలలోని కార్మిక సంక్షేమ చట్టాలను పరిశీలిస్తే కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడంలో ఆధునిక చట్టాల కంటే అవి ఎంతో పటిష్టమైనవి. నిజం, ఈరోజు ‘ఆధునికం’ అని మనం మురిసిపోతున్న శ్రామిక విలువలు, చట్టాలు మనకు ప్రాచీన భారతీయ న్యాయశాస్త్ర గ్రంథాలలోనే కనిపిస్తాయి. ఈ విజ్ఞాన భాండాగారం సంస్కృత భాషలో, శ్లోకాల రూపంలో నిక్షిప్తమైంది.

దురదృష్టం ఏమంటే పాశ్చాత్య మేధస్సు ప్రసాదించిన పెడధోరణులను మెదళ్లలో నింపుకున్న ఆధునిక మేధావివర్గం.. పురాతన భారతీయ న్యాయవ్యవస్థలో కార్మికులకు రక్షణ లేదని; ఉద్యోగులు, కార్మికులను ఎలాంటి హక్కులు లేని బానిసలుగా చూసిందనే విషప్రచారాన్ని దిగ్వి జయంగా ముందుకు తీసుకుపోయింది. ఆ విధమైన వాతావరణాన్ని, అంతే దిగ్విజయంగా సృష్టించింది. అయితే, ఈ వాదనలో ఇసుమంతైనా నిజం లేదు. పురాతన భారతీయ సమాజంలో ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు సంపూర్ణ స్వేచ్ఛను అనుభ వించారు. వివక్ష అన్నది ఎరగనే ఎరగరు. నాడు శ్రామిక వర్గం పొందిన గౌరవం అద్వితీయం. అసలు ప్రపంచ చరిత్రలో పనిని దైవంగా, ధర్మంగా భావించే; యజమాని, కార్మికుడు అనే వ్యత్యాసం లేని; శ్రామిక వర్గానికి సముచిత గౌరవం దక్కిన కాలం ఏదైనా ఉందంటే అది సనాతన భారతీయ ధర్మం నాలుగు పాదాల నడిచిన ప్రాచీన కాలమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు, ఓ చిన్న ఉదాహరణ: ఒక భూస్వామి తన భూమిలో ఇల్లు లేదా మరేదో కట్టాలని అనుకున్నాడనుకోండి. ఆయన ఆ బాధ్యతను తాపీ మేస్త్రికి అప్పగించేవాడు. అంతే, ఆ తర్వాత భూమి స్వభావాన్ని బట్టి ఇల్లు ఎక్కడ కట్టాలి, ఎంత విస్తీర్ణంలో, ఎలా కట్టాలి? అనేది తాపీ మేస్త్రినే నిర్ణయిస్తాడు. అలాగే వాస్తు నియమాలు, ఇతర సాంకేతిక అంశాల ఆధారంగా అన్ని నిర్ణయాలూ మేస్త్రినే తీసుకుంటాడు. సాంకేతిక అంశాల విషయంలో యజమాని పాత్ర, ప్రమేయం పరిమితంగానే ఉంటుంది. తాపీ మేస్త్రి, నిర్మాణ కార్మికులు మాత్రమేకాదు, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి ఇలా విభిన్న వృత్తులల్లోని అందరూ తమ పరిధిలో సమాజ గౌరవాన్ని సమానంగా పొందారు. అంతేకాదు, నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశ సమయంలో యజమాని ప్రతిఒక్క కార్మికుడిని కుటుంబ సమేతంగా  సముచిత రీతిన సత్కరించడం ఒక సంప్రదాయంగా ఉండేంది. నిజానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. కార్మికులు, శ్రామికులను సేవకులుగా చూడటమన్నది నాటి సమాజంలో ఇంచుమించుగా లేదనే చెప్పవచ్చు.

అలాగని శ్రామికవర్గ సంక్షేమం, హక్కుల పరిరక్షణకు నాడు చట్టాలు లేవా? అంటే ఉన్నాయి. కేవలం చట్టాలు ఉండడమే కాదు రాజు, పేద తేడా లేకుండా అమలయ్యాయి కూడా. నిజానికి పారిశ్రామికీకరణ తర్వాతే సంప్రదాయ పని సంస్కృతి తెరమరగవుతూ వచ్చింది. అలాగే, శ్రామికవర్గం గౌరవం సన్నబడుతూ వచ్చింది. చివరకు యాజ మాన్యం, కార్మికుల మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో ఎర్రజెండాలు రంగప్రవేశం చేశాయి. వర్గ విభేదాలు సృష్టించాయి. ఇద్దరి మధ్య అడ్డుగోడలు కట్టాయి. యాజమాన్యం-కార్మికుల బంధం మధ్య మార్పు చోటుచేసుకుంది. వర్గవైషమ్యాలు తలెత్తి వాతావరణం కలుషితమైంది.

ప్రాచీన భారతీయ చట్టాలు-పాశ్చాత్య సంస్కృతి ప్రసాదించినటువంటి నేడు అమలవుతోన్న కార్మిక సంక్షేమ చట్టాలతో పోల్చి తులనాత్మకంగా పరిశీలిస్తే ఆధునిక చట్టాల అసలు రంగు బయట పడుతుంది. ఉద్యోగులకు సంబంధించిన ప్రాచీన భారతీయ చట్టాలను ప్రధానంగా నాలుగు తరగతులుగా విభజించారు. అందులో మొదటిది: వేతన దాన (వేతనాల చెల్లింపు), రెండవది: స్వామి-పాల వివాద్‌ (‌యజమాని-సేవకుని వివాదం) ఈ రెండు చట్టాలు కూడా పాశ్చాత్య సమాజం ఇంకా కళ్లు అయినా తెరవకముందు అంటే, క్రీ.పూ. 1250లో మనుధర్మ శాస్త్రం అమలులోకి వచ్చిన నాటి నుంచి అమలవుతున్నాయి. ఇక మూడోదాని విషయానికి వస్తే.. యాజ్ఞవల్క్యుడు క్రీ.పూ. 300 సంవత్సరంలోనే ‘అభ్యుపేత్య సుశ్రుష’ పేరుతో ఉద్యోగ ఒప్పంద ఉల్లంఘనకు సంబంధించిన న్యాయ సూత్రాలను వివరించారు. వేతనాలు చెల్లించకపోవడానికి సంబంధించి, క్రీ.పూ. 400 సంవత్సరంలోనే ‘వేతనశ్యానప కర్మ’ పేరిట నారదచట్టం అమలులోకి వచ్చింది. ఇంకా.. ప్రభుత్వ ఉద్యోగుల వర్గీకరణ (శుక్ర 813-814) కనీస వేతన చట్టం (మను క్రీ.శ. 1250), ఉద్యోగ ఒప్పంద ఉల్లంఘన, నష్ట పరిహార చట్టం (నారద స్మృతి), వేతన సవరణ చట్టం (మనుస్మృతి) ఇలా ఆధునిక చట్టాలకు ఒక విధంగా మాతృకవంటి అనేక చట్టాలు ప్రాచీన భారతీయ న్యాయవ్యవస్థలో దర్శనమిస్తాయి. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా మనదేశంలో కార్మిక సంక్షేమ చట్టాలు అమలవుతున్న నాటికి చాలావరకు పాశ్చాత్య దేశాలలో చట్టబద్ధ పాలన అనేది కనీసం మొగ్గ తొడగలేదు.

వేదకాలంలో శుక్రాచార్య రచించినట్లు చెపుతున్న ‘శుక్రనీతి’లో వేతనాలను కార్యమాన (పనిని బట్టి వేతనం), కాలమాన (పని గంటలను బట్టి వేతనం) కార్యకాల మాన (పని, పని గంటలు ఆధారంగా వేతన నిర్ణయం) మూడు తరగతులుగా విభజించారు. ‘శుక్రనీతి’ వేదకాలం నాటి గ్రంథం కాదు. క్రీ.శ. 4వ శతాబ్ది రచన అనే వాదన కూడా ఉంది. అది వేరే విషయం.

ఆధునిక భారతదేశంలో కార్మికుల వేతనాలకు సంబంధించిన తొలి చట్టాన్ని 1929లో రాయల్‌ ‌కమిషన్‌ ‌ప్రతిపాదించింది. మరో ఏడేళ్లు గడిచిన తర్వాతే 1936లో వేతన చెల్లింపుల చట్టం అమలులోకి వచ్చింది. అందులోనూ పనిని బట్టి వేతనం, పని గంటలను బట్టి వేతనం మధ్య ఉన్న తేడాను గుర్తించలేదు. 1948లో చేసిన కనీస వేతన చట్టం మాత్రమే పని ఆధారిత వేతనం, పని గంటల ఆధారిత వేతనాలను ప్రత్యేకంగా గుర్తించింది.

ఈ నేపథ్యంలో జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రస్తావించినట్లు ప్రాచీన భారతీయ చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కార్మిక చట్టాల భారతీయీకరణలో పని స్వభావం ఏదైనా కార్మికులు సమానమైన గౌరమర్యాదలకు, అలాగే న్యాయబద్ధమైన వేతనానికి అందరూ అర్హులనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయంలో ప్రాచీన భారతీయ చట్టాలు ఆదర్శంగా నిలుస్తాయి. అలాగే, న్యాయవ్యవస్థ భారతీయీకరణ కోసం చేసే చట్టాలు వ్యక్తి కేంద్రంగా, సమాజ కేంద్రంగా ఉండాలే కానీ, న్యాయస్థానం కేంద్రంగా ఉండకూడదని న్యాయనిపుణులు అంటున్నారు.

శ్రమైక జీవన సౌందర్యానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రత్యేక ప్రాధాన్యం గురించి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ‘సత్యమేవ జయతే’తో పాటు ‘శ్రమయేవ జయతే’ అనే ఆర్యోక్తికి విలువనిస్తూ శ్రమను గౌరవించడం అంటే ఏమిటో ప్రధాని మోదీ మనకు ఆచరించి చూపుతున్నారు. గంగా నది శుద్ధి కోసం తలపెట్టిన ‘నమామి గంగే’ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛ భారత్‌ ‌కార్యకర్తల కాళ్లు కడిగి ఆయన దేశానికే ఆదర్శంగా నిలిచారు.

About Author

By editor

Twitter
Instagram