ఏ దేశంలో అయినా రాజ్యాంగ నిర్మాతలు ఏ వర్గాన్నీ విస్మరించకుండా, అందరి హక్కుల రక్షణకు పూచీ పడుతూ రాజ్యాంగాన్ని నిర్మిస్తారు. కానీ రాజ్యాంగానికి చెందిన ఈ మౌలిక స్ఫూర్తిని భద్రంగా కాపాడుకోవలసినదీ, కొనసాగించుకునేటట్టు చేయవలసినదీ పౌరులేనంటున్నారు పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌. ‌నరసింహారెడ్డి. విభజన నాటి చేదు అనుభవాల నేపథ్యంలో రచించు కున్నప్పటికీ మన రాజ్యాంగం వ్యవస్థ నిర్వహణలో నిర్మాణాత్మక పాత్రనే పోషించగలిగిందని ఆయన అన్నారు. సవరణలు అనేవి ఒక సహజ పక్రియ అని కూడా చెప్పారు. అలా అని రాజ్యాంగ నిర్మాతల ఆశయాలన్నీ వారు కోరుకున్న పంథాలోనే సాగాయని చెప్పే అవకాశం లేదనీ, వారి ఆశయాలకు సరిపడని రీతిలో, ప్రజాస్వామ్యం బలహీనపడే పరిస్థితులు సృష్టిస్తూ కొన్ని చర్యలు జరిగాయనీ జస్టిస్‌ ‌నరసింహారెడ్డి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. మెజారిటీ/ మైనారిటీ వివాదం, ఫెడరలిజం, కొలీజియం వంటి అంశాలపై వివాదాలు, వాదోపవాదాలు, పరిణామాలు అవాంఛనీయమేనని చెప్పారు జస్టిస్‌ ‌నరసింహారెడ్డి. సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను కాలరాయడం కాదని కూడా స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవం (నవంబర్‌ 26) ‌సందర్భంగా జస్టిస్‌ ‌నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: 

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయింది. అందులో రాజ్యాంగం అమలులోకి వచ్చి భారత్‌ ‌గణతంత్ర వ్యవస్థగా సాగిన ప్రస్థానం 72 సంవత్సరాలు. ఈ ఏడు దశాబ్దాలలో రాజ్యాంగం ద్వారా సాధించిన విజయాలను సగౌరవంగా మననం చేసుకొనే స్థితిలో ఉన్నామా?

మీరు సంధించిన ప్రశ్న కొంచెం క్లిష్టమైనది. దాదాపు వెయ్యి సంవత్సరాల పరాయి పరిపాలన తరువాత 1947లో స్వాతంత్య్రం సిద్ధించింది. ఆ సిద్ధించడం మనమందరం గర్వపడే విధంగా, లేకపోతే స్వతంత్ర భారతాన్ని ఉత్సాహంతో పాలించు కునేటట్టు జరిగింది కాదు. సువిశాల భారతదేశాన్ని మూడు ముక్కలు చేశారు. తూర్పుభాగం, పడమటి భాగం- అంటే రెండు భుజాలను నరికిన తరువాత, వాటి మధ్యన మిగిలిన భాగాన్ని భారతదేశమని పిలుచుకుంటున్నాం. ఆ రెండు భాగాలు పాకిస్తాన్‌కు దఖలు పడినాయి. తరువాత తగువులు వచ్చి ఆ రెండు ప్రాంతాలు రెండు వేరే దేశాలైనాయి. కాబట్టి స్వాతంత్య్రంతో పాటు, మూడు ముక్కల భారతదేశమే మనకు దక్కింది. కేవలం భౌగోళిక విభజన జరిగి, మిగిలినదంతా ప్రశాంతంగా జరిగిపోయిందా అంటే, అదీ కాదు. విభజన, ఫలితాలు లేదా పర్యవసానాలు తీవ్రాతితీవ్రంగా పరిణమించాయి. దురదృష్టవశాత్తు కొందరు చరిత్రకారులు గానీ, స్వాతంత్య్రం రావడానికి తామే కారణమని చెప్పుకున్న చాలామంది గానీ ఆనాటి వాస్తవిక చారిత్రక దృశ్యాన్ని యథాతథంగా మనముందు ఉంచలేదు. అయినా స్వాతంత్య్రం వచ్చిందంటూ దేశభక్తి గీతాలు పాడుకున్నాం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనట్టు దాదాపు 15 లక్షలమంది విభజన నేపథ్యంలో చెలరేగిన హింసకి బలైపోయారు. దాదాపు 2 కోట్లమంది నిరాశ్రయులయ్యారు. కేవలం మతం ఆధారంగా ఈ అమానుష కాండ సాగింది. ప్రయాణ సాధనాలు లేనప్పుడు, చేతికి దొరికింది పట్టుకుని, చిన్న, పెద్దా, స్త్రీలు.. కుటుంబ సభ్యులంతా కట్టుబట్ట లతో కొన్ని వందలూ, వేల మైళ్లు ప్రాణాలరచేత పట్టుకుని ప్రయాణించవలసి వచ్చింది. నేను చాలా సందర్భాలలో అన్నాను. ఎవరైతే స్వాతంత్య్రం తెచ్చిన ఘనత మాదేనంటూ చాటుకున్నారో, వారిలో ఈ విషాదం బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పాలని చాలాసార్లు అన్నాను.

స్వాతంత్య్రం తెచ్చినవారు – వ్యక్తులే కావచ్చు, సంస్థలే కావచ్చు.. అది తమ కృషి అని చెప్పుకోవచ్చు. తప్పులేదు. నాడు సంభవించిన మరణాలు, శరణార్థుల రాక, లక్షలలో జరిగిన మత మార్పిడులు ఎన్నో లెక్కకు అందనివే. అక్కడ జమీందారు, పెద్ద వ్యాపారవేత్త విభజనతో సర్వం కోల్పోయి వచ్చారు. స్త్రీలు, పిల్లలు, ఎంతమంది తప్పించుకు రాగలిగారో, ఇంకెందరిని నిర్బంధంలో ఉంచారో తలుచుకోవడమే హృదయవిదారకమైన విషయం. ఈ ఉద్రిక్తతలు కొంత సడలిన తరువాత 1948లో రాజ్యాంగ పరిషత్‌ ‌పని మొదలయింది. దానికి మొట్టమొదట డా।। సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడు. తరువాత డా।। రాజేందప్రసాద్‌ అధ్యక్షులైనారు. వివిధ రంగాల్లో ప్రసిద్ధులైనవారందరినీ పరిషత్‌ ‌సభ్యులను చేశారు. రాజ్యాంగ ముసాయిదా సంఘానికి డా।। అంబేడ్కర్‌ అధ్యక్షులు, డా।। అల్లాడి కృష్ణస్వామి, బి.ఎన్‌.‌రావు వంటివారు సభ్యులు. ఎంతో మేధోమథనం తరువాత రాజ్యాంగ రూపుదిద్దుకుంది.

భారత ప్రభుత్వ చట్టం-1935, ప్రపంచ దేశాల రాజ్యాంగాల నుంచి కొన్ని మంచి అంశాలు స్వీకరించారని అంటారు కదా! అవేమిటి?

బ్రిటిష్‌ ఇం‌డియా తెచ్చిన ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ ప్రభావం రాజ్యాంగం మీద ఇతోధి కంగా ఉంది. ఆ చట్టంలోని న్యాయవ్యవస్థ, ప్రాథమిక హక్కులనే కొన్ని మార్పులు చేసి రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. మిగతా విషయాల కోసం ప్రపంచంలోని కొన్ని రాజ్యాంగాలను పరిశీలించి కొన్ని అంశాలను తీసుకున్నారు. నవంబర్‌ 26, 1949 ‌నాటికి మనదైన రాజ్యాంగం సిద్ధమైంది. జనవరి 26, 1950 నుంచి అమలు చేసు కుంటున్నాం.

వచ్చిన స్వాతంత్య్రం గురించి పూర్తి సంతోషంతో చెప్పలేకపోయినా, స్వతంత్ర భారతం నిర్మించుకున్న రాజ్యాంగం, అందులోని చాలా అంశాలు సగర్వంగా చెప్పుకోదగినవేనని అనుకోవచ్చునా? ఇందులో రాజ్యాంగ నిర్మాతలు, స్వాతంత్య్ర సమరయోధులు ఆశించిన లక్ష్యం సాధించడానికి ఇంకా ప్రయాణం సాగించవలసి ఉన్నదా?

చాలా కోణాల నుంచీ, పొందుపరిచిన ముఖ్య విషయాల గురించీ సగర్వంగా చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఓటుహక్కు, ప్రాథమిక హక్కులు పేర్కొనదగినవి. పరిపాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఏర్పాటు, వాటి హద్దుల నిర్ణయం నిర్మాణాత్మకమైనవే. చాలా వ్యవస్థలకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది రాజ్యాంగం. కమ్‌‌ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌, ఎన్నికల సంఘం వంటి వాటిని చక్కగా పొందుపరిచారు. ఇంత వైవిధ్య భరిత జీవనం ఉన్నప్పటికీ ఇంత పెద్ద దేశాన్ని కూడా వ్యవస్థీ కృతంగా, విజయవంతంగా నడుపుకోవడానికి అవి ఉపయోగపడ్డాయి. అంతవరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు.

 ప్రశ్నలో రెండవ భాగం- లక్ష్య సాధనకు ఇంకా సాగించవలసి ఉన్న ప్రయాణం. అవును, ఇంకా ప్రయాణించవలసింది ఉంది. రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు వంద పర్యాయాలకు పైగా సవరించుకున్నాం. కాలానుగుణంగా వచ్చే మార్పును దృష్టిలో పెట్టుకొని, ఏది వ్యవస్థ నడకకు, ప్రజోపయోగానికి ఇబ్బంది కలిగిస్తుందో దానిని మార్చుకున్నాం. అందరికి ఆమోదయోగ్యమయ్యేటట్టే మార్పు చేసుకున్నాం కూడా. అయినా, సవరణలు ఒక నిరంతర పక్రియ. రాజ్యాంగం అంటే, రాసుకున్న కాలం దగ్గరే ఉండి పోయేది కాదు. మన రాజ్యాంగానికి సరళత్వం ఉంది. అయినా కొన్ని ఒడిదుడుకులు తప్పలేదు. ఆ వివరాల్లోకి వెళితే చాలా విషయాలు ఉంటాయి.

1950లో రాజ్యాంగం అమలైంది. కానీ అంత తాజా రాజ్యాంగాన్ని అదే సంవత్సరం సవరించారు. అదే తొలి సవరణ. ఎలాంటి పరిస్థి తులు తొలి సవరణను అంత వేగంగా అనివార్యం చేశాయి?

రెండు మూడు విషయాలు పరిగణనలోనికి తీసుకోవాలి. మనకు సిద్ధించిన స్వతంత్ర భారతదేశం ఒకే మూసలో, ఒకే రూపంలో ఉన్నదేమీ కాదు. సంక్షుభిత గతం ఉంది. అది తెచ్చిన ప్రశ్నలూ, అపోహలూ ఉన్నాయి. వివిధ జాతులే కాదు, దాదాపు 560 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఎవరి అభీష్టాలు వాళ్లవి. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి స్వార్థం వారిది అని కూడా చెప్పుకోవచ్చు. రకరకాల ప్రాథమ్యాలు. వీటన్నిటిని భారత రాజ్యాంగ వ్యవస్థ పరిధిలోకి తేవడం అనివార్యం. ఈ పరిస్థితే 1950 నాటి సవరణకు దోహదం చేసింది. ఆ సవరణ సహా, చాలా సవరణలు ఆరోగ్యకరమైన రీతిలోనే జరిగాయి. కానీ అత్యవసర పరిస్థితిని (1975-1977) అమలు చేసిన కాలంలో, 1976 సంవత్సరంలో జరిగిన సవరణలు ఇందుకు మినహాయింపు. 42వ రాజ్యాంగ సవరణ అప్పుడే చేశారు. ఆ సవరణ, తద్వారా రాజ్యాంగానికి తెచ్చిన మార్పులు ప్రజాస్వా  మ్యాన్ని నిలబెట్టేవి కాదు. అందుకు విరుద్ధమైనవి.

ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాతల స్వప్న సాకారానికి కొన్ని అడ్డంకులు ఇప్పటికీ ఉన్నాయనే అనుకోవాలా? అవి ఎలాంటివి?

కొన్ని విషయాల్లో రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయాలకు పూర్తి సమర్ధన లభించలేదని నిక్కచ్చిగా చెప్పవచ్చు. హైకోర్టులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం ఎలా జరగాలి? ఈ అంశం మీద రాజ్యాంగ పరిషత్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ నియామకాలలో న్యాయ వ్యవస్థకు కీలకపాత్రను ఇస్తూనే కార్యనిర్వాహక, పరిపాలనా వ్యవస్థలను కూడా పాత్రధారులను చేశారు. ఎవరి పాత్ర ఎంతవరకు అన్నదానిని కూడా నిర్దేశించారు. హైకోర్టులు, సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకాలు చేసేది దేశాధ్యక్షుడు. దేశాధ్యక్షునికి సూచనలిచ్చేదీ, సలహాలిచ్చేదీ కార్యనిర్వాహక వ్యవస్థ. ఈ పక్రియ ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే, న్యాయ వ్యవస్థ నుంచే. న్యాయవ్యవస్థ అభిప్రాయం, అంటే ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం తీసుకుని నియమకాలు జరగాలన్న వ్యవస్థ ఉండేది. ఈ అంశంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని 80వ దశకంలో కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చింది. కొలీజియం వ్యవస్థ పేరు రాజ్యాంగంలో ఎక్కడా కనబడదు. కానీ పాత వ్యవస్థను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించలేదు. పాత ప్రకరణలన్నీ అలాగే ఉన్నాయి. కొత్త వ్యవస్థను కూడా ప్రతిపాదించారు. అంటే అధికారివి నువ్వే, కానీ అధికారాలు నావి అన్నట్లు. ఇదంతా ప్రత్యామ్నాయ వ్యవస్థ తరహాలో కనిపిస్తుంది. ఆర్టికల్‌ 237, ‌యూనియన్‌ ‌జ్యుడిషియరి కానీ, స్టేట్‌ ‌జ్యుడిషియరి గానీ ఫలానా చట్టాలు, ఫలానా ఆర్టికల్‌ ‌తప్పు కాబట్టి కొట్టేస్తున్నాం అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఆ చట్టాలు తప్పయితే అమలులో ఉన్న దానిని కొట్టేయాలి. అలాగే, ఆరోగ్యకర విధానమేమంటే, కొట్టేసిన చట్టాల స్థానంలో కొత్తగా ఏమి తేవాలన్న నిర్ణయం పార్లమెంటుకు వదిలి పెట్టాలి. కొత్తగా వచ్చినవి సరిగా లేవనుకుంటే మళ్లీ కొట్టేయవచ్చు. అది పద్ధతి. ఏ చట్టమైనా అది సరైనది కాదని కొట్టేసినపుడు, దాని స్థానంలో కొత్త చట్టం వచ్చినప్పుడు ఇక అందులో దోషం కనపడకూడదు. ఇక్కడ అలా జరగలేదు. పాతది అలాగే ఉంది. నాడు దీని గురించి జస్టిస్‌ ‌జె.ఎస్‌.‌వర్మ ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. కార్యనిర్వాహక వ్యవస్థను పూర్తిగా నమ్మలేం కాబట్టి ఇలా చేశాం అన్నారు. కానీ దీని మీద చాలామంది న్యాయకోవిదులు ఆనాడే పెదవి విరిచారు. ఇదేమిటి, న్యాయవ్యవస్థ తనకు తానే న్యాయమూర్తులను నియమించుకుంటుందా? అన్నారు. కొలీజియం ఉద్దేశం ఇదే కదా! కానీ 20 ఏళ్ల తరువాత, అదే జె.ఎస్‌.‌వర్మగారు, మేము ఏదో ఉద్దేశించి, ఊహించి ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. కానీ, మాకు అర్థమయిందేమంటే ఆ వ్యవస్థ విఫలమైంది అని ఒప్పుకున్నారు. ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నదోనని ఆనాడే చాలామంది సందేహించారు.

తనకూ ఒక పాత్ర ఉంది కాబట్టి, ఇలాంటి క్లిష్ట పరి స్థితిలో శాసన నిర్మాణ వ్యవస్థ ఎలా స్పందించింది?

ఆ తరుణంలో పార్లమెంటు చరిత్రాత్మకం అనదగ్గట్టే ఒక అడుగు వేసింది. నేషనల్‌ ‌జుడీషియల్‌ అపాయింట్‌మెంట్‌ ‌కమిటీని తెచ్చింది. ఇక నుంచి న్యాయమూర్తుల నియామకం ఆ స్వతంత్ర వ్యవస్థకు అప్పగించాలని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందు లోనూ న్యాయవ్యవస్థది ప్రముఖమైన భాగమే. ఐదారుగురు సభ్యులను నియమించి, ఒక పక్రియ ద్వారా న్యాయమూర్తులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అయినా నియామకాలలో అంతిమ నిర్ణయం న్యాయవ్యవస్థ చేతిలోనే ఉంచారు. కానీ దీనిని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొలీజియం వ్యవస్థ గురించి ఇంత జరిగింది. చాలామంది ప్రముఖ న్యాయకోవిదుల ఉద్దేశం కూడా ఆ వ్యవస్థ సరికాదనే. ఒక విషయం ఇక్కడ గుర్తు చేస్తాను. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన యేల్స్ ‌లా స్కూల్‌ ‌గ్రంథాలయం చూశాను. ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటి మీద అందులో సమీక్షలు, పరిచయాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం గురించి ఏమి రాశారు? ప్రపంచంలోనే అసాధారణంగా ఒక ప్రకరణం ఒక రకంగా చెబితే, దాని అమలు పక్రియ వేరే రకంగా జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం కనిపించింది.

అలాగే రిజర్వేషన్లు. నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కానీ ఒకే తీరులో కొనసాగించుకుంటూ వెళితే అర్హులైన బలహీన వర్గాలకు చేరవు. ఒక మనిషి బలహీనంగా ఉన్నప్పుడు సమాజం ఇచ్చే సాయంతో కొంతకాలం తరువాత సామాన్య స్థితికి రావాలి. ఒకరికి కాలు బాగా లేనపుడు ఆ లోటు తీరేవరకు ఊతకర్ర ఇచ్చి ఆదుకుంటాం. ఆ సహాయం ఎప్పటికీ ఒకరికే పరిమితమైతే మిగతావారు అలాంటి ప్రయోజనానికి దూరమైపోతారు. రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం ఇది కాదు. దీనిని గమనించాలి.

భారతదేశంలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ ఎత్తుగడల కోసం రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకునే తెంపరితనమనవచ్చు. కొంతమంది రాజకీయవేత్తలు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఉదారవాదులు లేక మేధావులుగా చలామణి అవుతున్నవాళ్లు ఒక వికృత వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఒక పక్క రాజ్యాంగాన్ని కాపాడాలి, గౌరవించాలి అంటారు. రాజ్యాంగమే సమున్నతం అంటారు. కానీ రాజ్యాంగమే నిర్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తేవడానికి ఓ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించగానే దానిని వ్యతిరేకిస్తారు. ఉమ్మడి పౌరస్మృతి గురించి రాజ్యాంగమే నిర్దేశించింది. నెహ్రూ, ఇతర రాజ్యాంగ నిర్మాతల ఆలోచన కూడా ఇదే. ఈ ద్వంద్వ వైఖరిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి?

ఒక చిన్న ఉదంతాన్ని ప్రస్తావిస్తాను. అమెరికా రాజ్యాంగ రచన జరుగుతున్న కాలం. దేశమంతా తర్జనభర్జనలు. వచ్చేది ఏ రకమైన రాజ్యాంగం? రూపురేఖలు ఎలా ఉంటాయని ఉత్కంఠ. రచన పూర్తయిన రోజున మొదట థామస్‌ ‌జఫర్సన్‌ ‌లోపల నుంచి బయటకు వచ్చారు. బయట వేచి ఉన్న వారంతా ఉత్సుకతతో అడిగారట, పూర్తయిన ఆ రాజ్యాంగం స్వరూప స్వభావాలు ఏమిటి? అందుకు జఫర్సన్‌, ‘ఇట్‌ ఈజ్‌ ‌గోయింగ్‌ ‌టు బి రిపబ్లికన్‌’ అని ఆగి ‘ప్రొవైడెడ్‌, ‌యూ కీప్‌ ఇట్‌’ అన్నారట. మేం రచించిన రాజ్యాంగమయితే రిపబ్లికన్‌ ‌రాజ్యాంగమే. దానిని అలానే కాపాడుకుంటారో, భ్రష్టు పట్టిస్తారో మీ చేతుల్లో ఉంది అని అర్ధం. రాజ్యాంగం కొన్ని విలువలను పొందుపరుస్తుంది. వాటిని ఎట్లా పాటించాలి, ఎలా కాపాడుకోవాలి అన్నది ప్రజల విజ్ఞత. రాజ్యాంగ స్రష్టలు శక్తి మేరకు అందరికీ మేలు జరిగే విధంగా విలువలను రూపొందించి నిక్షిప్తం చేస్తారు. కానీ ఆ విలువలను ఎవరికి కావలసిన రీతిలో వారు అర్ధం చేసుకుంటే, ఇష్టారీతిలో భాష్యాలు చెబుతూ, అర్థమైనరీతిలో ఆపాదించుకుంటూపోతే వ్యవస్థ నడవ లేదు. ఇక్కడ చెప్పుకోవలసినదేమిటంటే స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో మన దేశాన్ని మనం సమైఖ్య జాతిగా, సమున్నత సంస్కృతి గల సమాజంగా ప్రదర్శించలేక పోయాం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు లేదా విలువలు విదేశీ పాలనలోను తట్టుకుని నిలబడి నాయి. ఆ గొప్పతనాన్ని మనం గుర్తించలేకపోయాం. అది యాదృచ్ఛికమా లేక ప్రయత్న పూర్వకంగా జరిగిందా తెలియడం లేదు. దేశం అనేది ఒకటి ఉంది. దానికి స్వాతంత్య్రం కూడా వచ్చింది. చాలు..నడిచిపోతుంది అనుకున్నాం.

విభజన నాటి అవాంఛనీయ ఘటనలకి స్వాతంత్య్రం తెచ్చామని చెప్పుకుంటున్నవారు బాధ్యత తీసుకోవాలని అభిప్రాయపడుతున్నానని ఇంతకు ముందు చెప్పారు కదా! ఇప్పుడు మీరు చెప్పిన సమాధానంలోని ఆ గుర్తించలేకపోవడం అనే అంశానికి కూడా స్వతంత్ర భారత తొలితరం నాయ కత్వమే బాధ్యత వహించాలని అనుకోవచ్చునా?

ఈ దేశానికి పూర్వం నుంచి వస్తున్న విలువలు, సంస్కృతి, చారిత్రక నేపథ్యం ఉన్నాయన్న స్పృహ స్వతంత్ర భారతదేశంలో నిర్లక్ష్యానికి గురైంది. వాటి పట్ల అప్పుడు పట్టింపే లేదు. కొందరు సమకాలీనులు చెబుతూ ఉండేవారు. నెహ్రూ అందరికీ ఆమోద యోగ్యమైన నేతగా ఆవిర్భవించలేదు. ఏఐసీసీలో ఎన్నికలు పెడితే, ఆయనకు వచ్చింది ఒకే ఓటు. అది తనదే. మిగతావి సర్దార్‌ ‌పటేల్‌కు, కృపలానీ, జయప్రకాశ్‌ ‌నారాయణ్‌లకు వచ్చాయి. నెహ్రూ పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడ్డ వ్యక్తి. తన పార్టీ నుంచి మద్దతు లేదు. ఫలితం, కమ్యూనిస్టుల వైపు మొగ్గారాయన. అపుడు కమ్యూనిస్టు ప్రభావం ప్రబలంగా ఉంది. కమ్యూనిం అంటే ఫ్యాషన్‌. ‌భారతదేశం వేయేళ్లు పరాయి పాలనలో మగ్గింది. అది మరిచిపోయి, పేదరికం పోవాలి, లేదా భూస్వామ్య వ్యవస్థ నశించాలంటూ నినాదాలు ఇవ్వడం ఏమిటి? కొన్ని వర్గాలని శత్రువులుగా చిత్రించడం ఏమిటి? అప్పటికి స్వాతంత్య్రం వచ్చి మూడేళ్లు. ఇక విద్యావ్యవస్థ. అది ఎవరి చేతిలో పడ్డది? మౌలానా ఆజాద్‌. ఆయన గొప్ప విద్యావేత్త కాదు. కానీ మన విద్యా మూలాలు గట్టివి. నలందా, తక్షశిల వరకు పోవద్దు. అప్పటికే బయటి దేశాల నుంచి ఇక్కడకి వచ్చేవారు. బ్రిటిష్‌ ఇం‌డియాలో కూడా భారతీయ విద్య, భారతీయ మూలాలు నేర్చుకొనేవారు చాలామంది ఉండేవారు. అప్పుడు చాలామంది న్యాయమూర్తులు ఆంగ్లేయులు. తీర్పులు వెల్లడించడానికి వారికి కొన్ని కొన్ని భారతీయ సామాజిక మూలాలు, కుటుంబ వ్యవస్థ సూత్రాలు తెలియాలి. అవన్ని సంస్కృతంలో ఉండేవి. అయినా వారు సంస్కృతం నేర్చుకొని, వాటిని విశ్లేషించారు. ఆ కాలంలో వారు ఆ పని చేస్తే, ఇప్పుడొక ముఠా బయలుదేరి ఇదంతా తప్పు, వేదాలు తప్పు, స్మృతులు వ్యర్థం, నీకు ఇది లేదు, అది లేదు అంటున్నది.

ఈ ధోరణి ఎందుకు బయలుదేరింది?

ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ ఔన్నత్యం, దేశీయమైన శాస్త్ర సాంకేతిక, న్యాయపరమైన అంశాలను ప్రతిబింబించే ఏ కార్యక్రమం, చింతన గానీ, అవి సెక్యులరిజానికి వ్యతిరేకమనో, మనువాదమనో, లేక మరొక ముద్ర వేసి మనదైన చింతన, జ్ఞానాల పట్ల వ్యతిరేకతను పెంచే పోకడ తయారయింది. ఆ క్రమంలో జరిగిందే చరిత్ర పుస్తకాల నుంచి మనవైన విషయాలను తొలగించడం. జర్మనీలో ఒక సమయంలో ఇక్కడి నుండి ఎవరు వెళ్లినా వారిని మీకు సంస్కృతం వచ్చా అని అడిగేవారు. వాళ్లు సంస్కృత భాషలోని చాలా గ్రంథాలను ఆధ్యాయనం చేసి లబ్ధి పొందారు. ఇక్కడ దాని మీదే విష ప్రచారం జరుగుతోంది. స్మృతులు, శాస్త్ర, సాంకేతిక అంశాలకు సంబంధించి ఈ దేశానికి ఎన్నెన్నో మూలాలు ఉన్నాయి. ఐన్‌స్టీన్‌ ‌నుంచి మొదలు ఎందరో ఆ వాస్తవాలను గ్రహించారు. వెల్లడించారు. సున్నాను కనుగొన్నది భారత్‌. అది లేకపోతే ప్రస్తుత శాస్త్ర సాంకేతి పురోగతి సాధ్యమేనా? వఎమీ2 అన్నారు. అంటే కాంతివేగం 1,76,000 కి.మీ.లు. సున్నాలు ఉంటేనే ఇంత పెద్దగా ఉంది, రోమన్‌ ‌లెక్క దానికి ఎక్స్‌లు, వైలు, టి.ఎస్‌లు పెట్టుకుంటూపోతే స్థలం సరిపోదు. అలాగే క్వాడాట్రిక్‌ ‌సమీకరణ. దానిని ఐజాక్‌ ‌న్యూటన్‌ ‌కనుగొన్నాడని చెబుతారు. ఆ మధ్య దీని మూలం ఎక్కడిదో ఇమాన్యుయల్‌ అనే శాస్త్రవేత్త కొత్తగా పరిశోధిస్తే, కేరళ అని తెలిసింది. శ్రీనివాస రామానుజం మేధస్సుకు చలించిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయి వారు ఎన్నో సిద్ధాంతాలను కనుగొన్నారు.

సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు?

సెక్యులరిజమనేది భారతీయ సంప్రదాయంలో ఇమడని భావన. ఎందుకంటే, క్రైస్తవం తీసుకోండి. చర్చి అనేది అక్కడ ఒక వ్యవస్థ. అన్నింటినీ శాసిస్తుంది. దేశ పాలన నుండి మనిషి జీవితం వరకు అన్నిటినీ నిర్దేశిస్తుంది. అంటే అన్నీ మత సంబంధ మైనవే. సర్వం మతమే. ఇక మత సంబంధం లేనిది సెక్యులర్‌. ఇపుడు మిలిట్రీ పాలన ఉన్నది. వాళ్ల తుపాకీ గొట్టం ఉన్నది. తుపాకీకి మతం ఉండదు. అది సెక్యులర్‌. ‌మిగతా విషయాలన్నీ మత సంబంధమైనవి. ఇప్పుడు ఈ సమస్య చుట్టూ తిరుగుతున్న అబ్రహామిక్‌ ‌మతాలు ఇదే ధోరణిలో ఉంటాయి. మాదే ఉండాలి. వేరేది ఉండడానికి వీలు లేదు. అప్పుడు సెక్యులర్‌ అన్న భావనకు అవకాశం ఎక్కడ? ఈ పరిస్థితి మన దేశంలో ఎన్నడూ లేదు. పార్శీలు, ముస్లింలు, క్రిష్టియన్స్ ‌వచ్చారు, ఇంకా ఎందరో వచ్చారు. మన రాజులు ఆహ్వానించారు. వచ్చినవారు దుర్బుద్ధితో, దురాశతో అకృత్యాలు చేశారు, అది వేరే సంగతి. మనకు ఒకరి పట్ల ద్వేషం లేదు. సర్వేజనాః సుఖినోభవంతు అన్న సంస్కృతి మనది. అందులో సర్వేజనాస్సుఖినో భవంతు అన్నప్పుడు ఏ శైవమో, వైష్ణవమో ఉండాలి. భగవద్గీతను తీసుకోండి. భగవద్గీత శ్లోకాలలో సగం కంటే ఎక్కువ మానవ జీవితానికి సంబంధించినవే తప్ప, భగవంతుని ఆరాధించడం గురించి చెప్పవు. ఇస్లాం రాకముందు పర్షియన్లు, యూదులు భగవద్గీత శ్లోకాలను పవిత్రమైనవిగా భావించేవారని ఒక ప్రముఖుడు ఒకసారి చెప్పారు.

‘ధ్యాయతో విషయాన్‌ ‌పుంసః సంగస్తేషూప జాయతే/ సంగాత్‌ ‌సంజాయతే కామః కామాత్‌ ‌క్రోధో భిజాయతే’ అంటుంది గీత. మానవుడు అదే పనిగా ఆలోచిస్తే దానిమీద అభిమానం కలిగే అవకాశం ఉంది. అది అందకపోతే దానిమీద మమకారం పెరిగి కోపం కలుగుతుంది. కోపంవలన క్రోధం పెరిగి జ్ఞాపకశక్తి తగ్గి చివరికి అధోగతి పాలవుతాడు. ఇది మానవ నైజం గురించి చెబుతున్నది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి మూలసూత్రాలు. మనస్సన్నది చంచలమైనది. దాన్ని నిలపడం చాలా కష్టం. దానికి రెండే మార్గాలు అభ్యాసం, వైరాగ్యం-ఇదొక శ్లోక భావం. దీన్లో హిందూయిజం ఏముంది? అసలు మతపరమైనది ఏముంది? కానీ ఇది భగవద్గీతలో ఉంది కాబట్టి పనికిరానిది అని ముద్ర వేసి, వాళ్లే సంకుచిత దృష్టితో చూసి సెక్యులరిం పేరుతో అడ్డుకుంటున్నారు.సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం ఎమర్జెన్సీ దురాగతాలలో ఒకటి. ఇందిరాగాంధీ పదవీకాలం పూర్తయి పోతుంది. కాబట్టి ఏం చేయాలి? లోక్‌సభ కాల పరిమితి ఐదేండ్ల నుంచి ఆరు ఏళ్లు అయింది. ఒక సర్పంచ్‌ ‌లేదా ఏదైనా ఎన్నికలప్పుడు పదవీకాలం పెంచాలంటే దానికి చాలా తతంగం ఉంటుంది. కానీ ఒక నియంతలా ఆమె వ్యవహరించారు. అసలు వారి ఎన్నికనే ఎవరూ సవాలు చేయకూడదని భావించారు. వీటిలో ఒక వ్యవస్థను నరికేసే ప్రయత్నం కనిపిస్తుంది.

సెక్యులరిజం అన్న భావనకు రాను రాను కొత్త భాష్యాలు, వక్రభాష్యాలు పెరిగిపోతున్నాయి. ఈ పదం ఆధారంగా ఇప్పుడు భారతదేశానికి కొత్త బెడదలు తయారవుతున్నాయి. చివరికి మెజారిటీ ప్రజలలో తమకు రక్షణ లేదన్న భావన కలిగిస్తోంది. ఎందుకు?

సెక్యులరిజమనేది నాట్‌ ఏ ‌లైసెన్స్ ‌టు ఎబ్యూస్‌ ‌ది మెజార్టీ కమ్యూనిటీ. సెక్యులరిజాన్ని ఎవరు దుర్వినియోగపరిచే ప్రయత్నం చేసినా ఆపడానికి మిగతా వారు ప్రయత్నం చేయాలి. దేనిమీదనైతే నిలబడ్డారో దాన్నే నరుకుతామంటే ఎలా? ఈ అభ్యుదయవాదులంతా ఉన్నారు గదా! వారు ఆదర్శంగా తీసుకుంటున్న ఆ వ్యవస్థలలో ఇలాంటి పోకడలకు వీలుందా? కమ్యూనిస్టులకి చైనా ఆదర్శం. ఉదారవాదం పేరుతో, సెక్యులరిజం పేరుతో ఇక్కడ వీళ్లు మాట్లాడుతున్న మాటలు ఆ వ్యవస్థలలో మాట్లాడితే వాడు మళ్లీ బతికి బయటపడగలడా? అట్లాగే వేరే మతాల పండితుల సంగతి కూడా ఇంతే. హిందూమతం, ఇక్కడి జీవన విధానం ఇచ్చిన స్వేచ్ఛతో వాళ్లు అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. హిజాబ్‌ ‌తీసుకోండి, ఇరాన్‌లో ఏమవుతోంది? ఇస్లాం సంప్రదాయం తిరుగులేని విధంగా ఉండే సౌది అరేబియాలో ఈ వివాదాలు లేవు. కానీ దాని గురించి ఈ మేధావులు మాట్లాడే తీరు ఏ విధంగా ఉంది? భారతదేశాన్ని తృణీకరించడం లేదా నిందించడం వాళ్లకి ఒక ఎజెండా. అది ఎక్కువ కాలం నిలువదు. ఈ మేధావివర్గ కుంచితత్త్వం రాను రాను బయట పడుతుంది. హీనాతిహీనమైన వ్యక్తులు వీరంతా. సెక్యులరిజాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే, మత ప్రసక్తి లేని రాజ్యం కాదు, సెక్యులరిజం పేరుతో మెజారిటీ మత ఆచారాలలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. శనిసింగనాపూర్‌, ‌శబరిమల ఆలయం వివాదాలు ఏమిటి? హిందూమతం ఇలాగే ఉండా లని ఎలాంటి సంబంధంలేని వాళ్లు పాఠాలు చెప్పే ప్రయత్నమే. క్రిప్టో క్రిస్టియన్స్ ‌కాన్సెప్ట్ ‌వచ్చింది. అంటే బయిటికి హిందూ మాదిరిగా కనిపిస్తాడు. కానీ అసలు లక్ష్యం హిందూత్వను తృణీకరించడం, నిందిం చడం. వాళ్ల ఈ అసహనానికి కారణం, మన అధిక సహనం. ఇదంతా చేసేది విదేశాలలో గుర్తింపు కోసం.

ఈ మొత్తం అవాంఛనీయ వాతావరణానికి బలి అవుతున్నది ఫెడరలిజం అనిపిస్తుంది.

ఫెడరలిజం ప్రస్థానం, భావనలను గమనించడం ప్రత్యేకమైన అనుభవం. అవసరం కూడా. కాంగ్రెస్‌పార్టీ బలహీనపడుతూ వచ్చిన క్రమంలో ఆ స్థానాన్ని ప్రాముఖ్యం, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించారు. ఇదే అంతటా కనిపించకపోవచ్చు. ఆ వ్యక్తులు ఎంత పెద్ద నినాదాలు, ఆదర్శాలు వల్లించినా వాళ్లు తెచ్చిపెట్టింది కుటుంబ వ్యవస్థనే. కాంగ్రెస్‌ ‌కుటుంబ వ్యవస్థనే వాళ్లు మళ్లీ తెచ్చి పెట్టారు. ఉదాహరణకు ములాయంసింగ్‌. ఆయన సామాజిక మూలాలు బలమైనవి. ఆర్యసమాజానికి చెందినవాడాయన. తరువాత అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌వచ్చాడు. అతడు తండ్రి వారసత్వాన్ని తీసుకోలేక పోయాడు. వైఫల్యాలు మొదలయినాయి. ఇలాంటి సందర్భంలోనే మా సంస్కృతి వేరు, నా భాష వేరు, మా ప్రాంతం వేరు అంటూ నినాదాలు వస్తాయి. తమిళనాడు, బెంగాల్‌ ఎక్కడైనా కుటుంబ పార్టీలు ఉన్నప్పుడే ఫెడరలిజాన్ని ప్రశ్నార్థకం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ మధ్యలో టీఆర్‌ఎస్‌ ‌కూడా వచ్చింది.

ఈశాన్య భారత రాష్ట్రాలు, ఫెడరలిజానికి అక్కడ ఎదురవుతున్న సవాళ్లని ఎలా చూస్తాం?

ఆ ప్రాంతాన్ని అసలు భారతదేశంలో భాగమని మన తొలితరం నాయకులు అనుకోలేదు. ఆ ప్రాంతాన్ని క్రైస్తవ మిషనరీలకి అప్పగించారు. మరొకరికి ప్రవేశం లేకుండా చేశారు. ఇప్పుడు మారిన పరిస్థితులలో వాళ్లు తామంతా భారత్‌లో అంతర్భాగమని బలంగా విశ్వసించడం శుభ పరిణామం.

ఇటీవల ఒక వార్త వచ్చింది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో హిందువులు మైనారిటీలు. ఉదాహరణకి లక్షద్వీప్‌. ‌కశ్మీర్‌ ‌కూడా. అలాంటి చోట హిందువులను మైనారిటీలుగా గుర్తించే విషయంలో మీ అభిప్రాయం ఏమిటి అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అడిగింది. ఈ ప్రతిపాదనకు వెంటనే సమాధానం చెప్పలేమని, అది సున్నితమైన అంశమని కేంద్రం జవాబిచ్చింది. అసలు మైనారిటీ అనేది ఎంత రాశిని బట్టి నిర్ధారించాలి?

మెజారిటీ కానిది మైనారిటీ. సాంకేతికంగా చూస్తే 49 శాతం ఉన్నా మైనారిటీ కిందకే రావచ్చు. కానీ విషయం అది కాదు. మైనారిటీ, మెజారిటీ అన్నది కాదు. మతపరంగా నీ జనాభా ఎంతన్నదీ కాదు. దేశంపట్ల నీ దృక్పథం ఏమిటి? ఈ దేశం నాది అనుకోవడంలో నీవు ఎక్కడ ఉన్నావు? ఇది ప్రధానం. అందులో స్పష్టత ఉంటే ఇలాంటి చిక్కులు, ప్రశ్నలు రానేరావు. మిగతావారి సంగతి నాకు అనవసరం. నాకు మాత్రమే సకల సౌకర్యాలు ఉండాలి అన్న వాదన మొదలైతే మైనారిటీ, మెజారిటీ అన్న విభేదం తలెత్తుతుంది. వందమంది ఉన్నారు, యాభయ్‌ ‌రొట్టెలే ఉన్నాయి అనుకుందాం. విజ్ఞులు చెప్పేది- మొదట బలహీనులకీ, వృద్ధులకీ, స్త్రీలకీ, పిల్లలకీ ఇద్దామంటారు. అదీ కాకపోతే, అందరికీ సగం సగం. ఇందులో ఏదీ కాకుండా మేం వేరు, మాకే అంతా దక్కాలి అని ఎవరైనా అంటే అది ప్రపంచంలో ఎక్కడా చెల్లదు. కానీ అలాంటి వాదన కూడా ఇక్కడ చెల్లుబాటవుతోంది. అది ఒక్క భారతదేశంలోనే సాధ్యం కూడా. ఇది ప్రథమ ప్రధాని నెహ్రూ వంటివారి పుణ్యం.

మొన్నటికి మొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏమన్నారు? ఇక్కడి ప్రతి రూపాయిలోను తొలి హక్కు ముస్లింలకేనట. ఇలాంటి పోకడ ఏమటి? దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి? మెజారిటీలు ఏమై పోయినా, మైనారిటీలు మాత్రం సుఖంగా ఉండా లనా? ఇది వైవిధ్యం, భిన్న సంస్కృతుల సమ్మేళనం అనే చింతనకు వ్యతిరేకం కాదా? ఇక్కడే ఒక ప్రశ్న. ఇప్పుడు మైనారిటీలుగా చెప్పుకుంటున్నవాళ్లు కొన్నిచోట్ల మెజారిటీలు. అక్కడ మైనారిటీలను ఎలా చూస్తున్నారు? మైనారిటీ హోదా ఇస్తున్నారా? ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా?

కశ్మీర్‌లో హిందువులను మైనారిటీలని చెప్పడం లేదు కదా!

అక్కడనే కాదు. మైనారిటీల మీద దాడులు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ మైనారిటీలుగా గుర్తింపు ఉన్న వర్గాలే రాజ్యాలేలుతున్న ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మైనారిటీలను ఎలా చూస్తున్నారు? దేశంలో మీడియా ఒక అనుచిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. ముస్లింలలో విశాల దృక్పథంతో ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిని వదిలి మీడియా షర్జిల్‌ ఇమామ్‌ ‌జపం చేస్తోంది. నీవు మైనారిటీవి కాబట్టి నీకు ఎలాంటి హక్కులూ లేవు అనే పరిస్థితి ఉంటే రక్షణ కల్పించవలసిందే. కానీ ఏ విషయంలో అయినా పౌరులందరితో సమంగా హక్కులూ, అవకాశాలూ ఉన్నప్పుడు ఆ మైనారిటీ పేరుతో చలామణి కావాలని ఎందుకు అనుకోవాలి? అందరితో పాటు మైనారిటీ లనీ సమానంగా చూస్తున్నారు. అయినా నాకే సమస్తం కావాలని కాలు దువ్వితే, మాకు సరైన వాటా దక్కడం లేదని వాదిస్తే అది దుర్మార్గమే.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram