– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్నాయి. ఒక్కో దేశం ఒక్కో రకంగా సతమతమవుతోంది. భూతాపం ఒక్కసారిగా పెరిగిపోవటం వల్ల మొట్టమొదటి సారిగా యూకేలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటి పోయాయి. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గత ఏడాది వీచిన వేడిగాలుల వల్ల దావానాల ప్రభావానికి లోనయితే, మరికొన్ని హారికేన్ల బారిన పడ్డాయి. పాకి స్తాన్‌ను వరదలు, తూర్పు ఆఫ్రికాను కరవు, ఆహార కొరత వంటి సమస్యలు పీడిస్తున్నాయి. నైజేరియాలో వరదలకు 600 మంది మరణించారు. 1.3 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. మన దేశంలో 75 శాతం జిల్లాలు తీవ్రమైన పర్యావరణ ప్రభావా నికి లోనవుతున్నాయని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్‌, ‌వాటర్‌ (‌సీఈఈ) అధ్యయనం వెల్లడించింది. 2021 గ్లోబల్‌ ‌క్లయిమేట్‌ ‌రిస్క్ ఇం‌డెక్స్ ‌నివేదిక ప్రకారం, ప్రపంచంలో తీవప్రభావానికి లోనయ్యే దేశాల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉంది. పర్యావరణ ప్రభావం వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పసిపిల్లలు, వృద్ధులు అకాల మరణాల పాలవుతున్నారు.

ఈ ముప్పును అధిగమించటానికి ప్రపంచ దేశాలు సమష్టిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు ఏ మేరకు బాధ్యత వహించాలి? అనే అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి ఏటా పర్యావరణ సదస్సును నిర్వహిస్తోంది. ఆ క్రమంలో ఈ ఏడాది ఈజిప్టులో 27వ సదస్సు (కాప్‌ 27) ‌నవంబరు 6 నుంచి 18 వరకూ షర్మ్ -ఎల్‌- ‌షేక్‌లో నిర్వహించారు. 200 దేశాలకు చెందిన 35వేల మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ‘లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజెస్‌’‌కు అభివృద్ధిచెందిన దేశాలు బాధ్యత తీసుకోవాలని, అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఈసారి సమావేశాల్లో ప్రముఖంగా చర్చ జరిగింది. సదస్సుకు ముందు 66 అభివృద్ధి చెందిన దేశాలు తమ ‘లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజెస్‌’‌కు సంబంధించిన నివేదికలు సమర్పించాయి. ఏ రంగానికి ఎంత నష్టం సంభవించిందనే అంశంపై స్పష్టత లేదు. 2024కు ముందే ఒక అంచనాకు రావాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు.

కాప్‌ ‌సదస్సులంటే..

కాప్‌ అం‌టే.. కాన్ఫరెన్స్ ఆఫ్‌ ‌పార్టీలు . ఇక్కడ పార్టీలు అంటే సదస్సుకు హాజరయ్యే దేశాలు. ఇవన్నీ కూడా 1992లో ‘యునైటెడ్‌ ‌నేషన్స్ ‌ఫ్రేమ్‌ ‌వర్క్ ‌కన్వెన్షన్‌ ఆన్‌ ‌క్లయిమేట్‌ ‌ఛేంజ్‌ ( ‌యూఎన్‌ఎఫ్‌సిసి)పై సంతకం చేసిన దేశాలు. చమురు, బొగ్గు, గ్యాస్‌ ‌వంటి శిలాజ ఇంధనాలను కాల్చటం వల్ల ఉద్గారాలు విడుదలై భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూ ఉష్ణోగ్రతలు 1.1మీకి పెరిగాయి. ఇవి 1.5కి చేరుకునే దిశగా సాగుతున్నాయని ఇంటర్నేషనల్‌ ‌ప్యానల్‌ ఆన్‌ ‌క్లయిమేటు ఛేంజి (ఐపీసీసీ•)లోని ఐరాస శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 1850లలో నమోదయిన స్థాయిని దాటి 1.7 నుంచి 1.8మీకి పెరిగితే ప్రపంచ జనాభాలో సగం మంది ప్రాణాంతకమైన వేడి, ఉక్కపోతకు గురవుతారని ఐపీసీసీ అంచనా వేసింది. ఈ పరిస్థితిని అధిగమించి ఉష్ణోగ్రత 1.5మీ నుంచి పెరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిని చర్చించటమే పర్యావరణ సదస్సుల ప్రధాన లక్ష్యం. వీటిని కాప్‌ ‌సదస్సులు అని పిలుస్తారు.

అందరి చూపు భారత్‌ ‌వైపు

నరేంద్రమోదీ నాయకత్వంలోని భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దానికి తోడు ఈ ఏడాది డిసెంబరులో జీ-20 అధ్యక్ష హోదాను ఇండోనేసియా నుంచి భారత్‌ ‌స్వీకరించ నుంది. భద్రతామండలిలో ఇప్పటి వరకూ తాత్కాలిక సభ్యత్వ దేశంగా ఉన్న కొనసాగుతున్న భారత్‌కు అధ్యక్ష స్థానం దక్కనుంది. అలాగే వచ్చే ఏడాది షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్సీఓ) ఛైర్మన్‌ ‌షిప్‌ ‌కూడా దక్కనుంది. ఈ నేపథ్యంలో కాప్‌ ‌సదస్సులో భారత్‌ ‌కీలకపాత్ర పోషించాలని చిన్న దేశాలు కోరుతున్నాయి. పర్యావరణ అంశానికి సంబంధించి భారత్‌ ‌కొన్ని లక్ష్యాలకు కట్టుబడి ఉంది. మిగతాదేశాల మాదిరిగా గాంభీర్య ప్రకటనలు చేయకుండా సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని తన నిబద్ధతను ప్రకటించుకుంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపు, ఉద్గారాల జీడీపీ సామర్థ్యం తగ్గింపు, అడవుల విస్తీర్ణాన్ని పెంచటం వంటి లక్ష్యాలను విధించుకుని ముందుకు వెళుతోంది.

నిధుల సంగతేమిటి?

వాతావరణ మార్పుల కట్టడికి అందిస్తున్న నిధులను మూడు భాగాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది: మార్పుల తీవ్రతను తగ్గించటం కోసం, అంటే శిలాజ ఇంధనాలతో పాటు ఇతర కాలుష్య కారక చర్యలకు దూరంగా ఉండాలి. రెండోది : మార్పులను తట్టుకుని నిలబడటం కోసం..ఇక మూడో రకం నిధులు వివాదాస్పదమైనవి. వీటినే ‘లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజ్‌ ‌ఫైనాన్స్’‌గా పిలుస్తారు. ఇప్పటికే సంక్షోభం ఎదుర్కొన్న దేశాలకు పరిహారంగా ఈ నిధులు అందిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2020 నాటికి ఏటా వంద బిలియన్‌ ‌డాలర్లు (రూలలో 8, 19,160 కోట్లు) వంతున నిధులు అందిస్తామని అభివృద్ధి చెందిన దేశాలు 2009లో అంగీకరించాయి. అయితే 2020 ఆ మొత్తం 83.3 బిలియన్‌ ‌డాలర్లు (రూ.6,82,360 కోట్లు)కు చేరింది. 2023 నాటికి ఆ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ కేవలం ఐదు యూరోపియన్‌ ‌దేశాలు లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజెస్‌కు నిధులిస్తామని వాగ్దానం చేశాయి. అందులో జర్మనీ, ఆస్ట్రేలియా, బెల్జియం మొత్తం 220 మిలియన్‌ ‌యూరోలు అందిస్తామని హామీ ఇచ్చాయి. అంతకు ముందు డెన్నార్క్, ‌స్టాట్లాండ్‌ ‌వరుసగా 13 మిలియన్‌ ‌పౌండ్లు, 5 మిలియన్‌ ‌పౌండ్లు ఇవ్వటానికి ముందుకొచ్చాయి. స్వీడన్‌ ‌లాంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే నాయకత్వాన్ని ప్రదర్శించాయి.

అభివృద్ధి చెందిన దేశాలు సహజ ఉత్పాదకాలపై ముందస్తు హెచ్చరికలకు స్పందించి 800 మిలియన్‌ ‌డాలర్లు గనక వెచ్చించగలిగితే, ఏటా 3 నుంచి 16 బిలియన్‌ ‌డాలర్ల వరకూ నష్టాలను అధిగమించ గలరని వరల్ట్ ‌మెటీరియాజి కల్‌ ఆర్గనైజేషన్‌ ‌పేర్కొంది. ఇలా అభివృద్ధి చెందిన దేశాల ‘లాస్‌ అం‌డ్‌ ‌డ్యామేజెస్‌’ 2050 ‌నాటికి ఒకటి నుంచి 8 ట్రిలియన్‌ ‌డాలర్లకు చేరతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

బొగ్గును ఇంధన వనరుగా ఉపయోగించటమే భూతాపానికి కారణమని గత ఏడాది యూకేలోని గ్లాస్గోలో నిర్వహించిన కాప్‌ 26 ‌సమావేశం మొట్ట మొదటిసారిగా తేల్చింది. ఆ వినియోగాన్ని దశల వారీగా పూర్తిగా నిలిపివేయాలని వివిధ దేశాలు ప్రతిపాదించాయి. ఆ మేరకు భారత్‌, ‌చైనా ప్రతిపాదించి అందులో మార్పులు చేశాయి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఆపటమే వాతావరణ సమస్యల పరిష్కారానికి మార్గమని ఈ దఫా సదస్సులో భారత ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భారత్‌ ‌తన కర్బన ఉద్గారాల నియంత్రణకు 2070 వరకు తన దీర్ఘకాలిక ప్రణాళిక (రోడ్‌ ‌మ్యాప్‌)‌ను ఈ సదస్సులో ప్రవేశపెట్టింది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాలు త్వరితగతిన తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత చొరవ చూపాలన్నారు. తన పర్యావరణ ప్రణాళికలను ఐరాసకు అందించిన దేశాల్లో భారత్‌ 57‌వ దేశం. పేదదేశాలకు ధనిక దేశాలు పరిహారం అందించటం అనే అంశం పైన చర్చించటం, బాధితుల పట్ల సంఘీభావాన్ని ప్రకటించినట్టవుతుందని కాప్‌ 27 అధ్యక్షుడు, ఈజిప్టు పర్యావరణ మంత్రి సమే షౌక్రి అభిప్రాయపడ్డారు. ఐరాస వాతావరణ ప్యానెల్‌ ‌చీఫ్‌ ‌హౌసంగ్‌ ‌లీ.. గ్లోబల్‌ ‌వార్మింగ్‌ ‌ప్రభావాలకు అనుగుణంగా జీవించటం, గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయువుల ఉద్గారాలను తగ్గించటానికి కృషి చేయటం వంటి అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఈ దఫా అమెరికా, చైనా అధికారిక చర్చలకు సిద్ధం కాలేదు గానీ, రెండు దేశాల ప్రతినిధులు జాన్‌ ‌కెర్రీ, షునీ జూనూహా ఇందులో అనధికారికంగా చర్చలకు సిద్ధం కావటం విశేషంగా చెప్పుకోవాలి. యూఎస్‌ ‌హౌస్‌ ‌స్పీకరు నాన్సీ పెలోసి తైవాన్‌ ‌సందర్శన అనంతరం గత ఆగస్టులో బీజింగ్‌ అన్ని రకాల చర్చలను నిలిపివేసింది.

గ్లోబల్‌ ‌వార్మింగ్‌ను నియంత్రించేందుకు ప్రపంచం అంతా కర్బన ఉద్గారాలను తగ్గించవలసిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ‌సదస్సులో పిలుపు నిచ్చారు. ఆయన ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. పారిస్‌ ఒప్పందం మేరకు 2030 నాటికి తాము లక్ష్యాలకు కట్టుబడతామని చెప్పారు. తాము చేపట్టే చర్యల వల్ల ఉద్గారాలు 2030 నాటికి బిలియన్‌ ‌టన్నులు తగ్గుతాయని చెప్పారు. ఇక ఉక్రెయిన్‌ అయితే, రష్యా ప్రకటించిన యుద్ధం వల్ల పర్యావరణానికి, మానవాళికి సంబంధించిన వినాశనాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపింది. దాదాపు రెండు డజన్ల మంది అధికారులు హాజరయ్యారు. భారీగా ఆయుధాలతో దాడులు, పెద్ద ఎత్తున సైన్యం కదలికల వల్ల భూమి, నీరు, వాయువుల కలుషితమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఐదోవంతు రక్షిత భూమి నాశనమైందని, సాగు భూమి విషతుల్యం కావటం వల్ల 11.4 బిలియన్‌ ‌డాలర్ల నష్టం సంభవించిందని చెప్పుకొచ్చారు. బ్రిటన్‌ ‌ప్రధాని రుషిసునాక్‌ ఈ ‌సమావేశాలకు హాజరై అర్ధాంతరంగా వైదొలిగారు. ఇందుకు కారణాలు వెల్లడి కాలేదు.

హైదరాబాద్‌ ‌విద్యార్థికి అరుదైన అవకాశం

హైదరాబాద్‌ ‌పబ్లిక్‌ ‌స్కూలు విద్యార్థి అంకిత్‌ ‌సుహాస్‌రావుకు ఈ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశందక్కింది. సదస్సుకు హాజరయిన వారందరి లోకి అతడు అత్యంత పిన్నవయస్కుడు. వ్యవసాయంలో స్థానికత గురించి ప్రముఖంగా ప్రస్తావించి అందరి మన్ననలు అందుకున్నాడు. స్థానికంగా సాగుకు అనుకూలమైన కాయగూరలు ఎంచుకోవాలని, వాతావరణానికి సరిపడనివి ఎంచుకున్నప్పుడు ఎరువులు, పురుగుమందులు ఎక్కువ అవసరం అవుతాయని ప్రకటించాడు. తన బృందంతో కలిసి ‘గ్లోబల్‌ ‌ఛైల్డ్ ‌క్లయిమేట్‌ ‌మేనిఫెస్టో’ రూపకల్పనలో భాగస్వామి అయ్యాడు. ‘ఇది నా జీవితకాల అనుభవం. సదస్సులో రైతు పక్షాన సుస్థిర వ్యవసాయం గురించి మాట్లాడటమే కాదు, తీవ్రమైన వాతావారణ మార్పులు మహిళలు, పిల్లలు, వెనకబడిన వర్గాల్లో కలిగించే దుష్ఫలితాల గురించి తెలుసుకోగలిగాను. ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల కలుగుతున్న వినాశానాన్ని అర్థం చేసుకోగలిగాను’ అని సదస్సు అనుభవాలను పంచుకున్నాడు. షర్మ్ఎల్‌ ‌షేక్‌ ‌సమీపాన గల దహాబ్‌ ‌బీచ్‌ను శుభ్రపరిచే కార్యక్రమంలో కూడా ఆ విద్యార్థి పాల్గొన్నాడు. అవినీతి, ఆర్థిక అస్థిరత్వం, పర్యావరణ మార్పులు వంటి అంశాల్లో మార్పులు తేగల శక్తి తమకు ఉందని తన బృందం తరఫున గట్టిగా చెప్పాడు.

ఈజిప్టులో నిర్వహించిన కాప్‌ 27 ‌సదస్సులో ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి. అవన్నీ కార్యాచరణకు నోచుకున్నప్పుడే అనుకున్న పర్యావరణ లక్ష్యాలను సాధించటం వీలవుతుంది. ఇది చెప్పినంత తేలిక కాదు. చాలా దూరం ప్రయాణించాలి.

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

About Author

By editor

Twitter
Instagram