పాకిస్తాన్‌కు కొత్త అధ్యక్షుడు వచ్చారు. అసీఫ్‌ అలీ జర్దారీ మరొకసారి ఆ పదవిని చేపట్టారు. షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. రెండోసారి అధ్యక్షునిగా, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జర్దారీ, షెహబాజ్‌ ‌భారత్‌ ‌పట్ల ఎలాంటి వైఖరిని ప్రదర్శించ నున్నారు? రెండు దేశాల సంబంధాల్లో సానుకూలమైన మార్పులకు అవకాశం కలుగుతుందా? సరిహద్దుల్లో అలజడి తగ్గి ప్రశాంతత నెలకొంటుందా? ఇవి ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. పాక్‌లో నాయకత్వం మార్పు పాత సీసాలో కొత్త సారా అన్న చందంగానో, లేదా కొత్త సీసాలో పాత సారా అన్నట్టో ఏ మాత్రం లేదు. సీసా, సారా రెండూ కూడా పాతవే. అందుకే భారత్‌-‌పాక్‌ ‌సంబంధాలలో వెంటనే పెనుమార్పు సంభవిస్తుందని ఎవరూ భావించడం లేదు.

భారత్‌తో సయోధ్యగా ఉండాలన్న వైఖరిని ప్రదర్శిస్తే తమకు మూడుతుందన్న నమ్మకంతోనే అక్కడి నాయకత్వం ఉందని వెంటనే తేలిపోయింది. ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్‌ ‌షరీష్‌, ‌తొలి ప్రసంగంలోనే కశ్మీర్‌ అం‌శాన్ని లేవనెత్తి భారత్‌పై విషం చిమ్మారు. భారత ప్రభుత్వ అధీనంలో ఉన్న కశ్మీర్‌ ‌భూభాగాన్ని గాజాతో పోలుస్తూ, రెండు ప్రాంతాలు స్వేచ్ఛ పొందాలన్నారు. పాకిస్తానీయులు, కశ్మీరులు స్వేచ్ఛను పొందేందుకు పాకిస్తాన్‌ ‌నేషనల్‌ అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. పొరుగుదేశాలతో పాటు అన్ని ప్రధాన దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటామని అంటూనే జమ్ముకశ్మీర్‌ ‌ప్రత్యేక ప్రతిపత్తిని భారత్‌ ‌రద్దు చేసినా, పాక్‌ ‌తన వైఖరిని మార్చుకోదని స్పష్టం చేశారు.

2030 నాటికల్లా పాకిస్తాన్‌ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తానని, జీ-20లో సభ్యత్వం పొందుతామని హామీ ఇచ్చారు. కశ్మీర్‌లో జీ 20 కార్యక్రమం నిర్వహించరాదని, పాకిస్తాన్‌, ‌చైనాలు గత ఏడాది ఆందోళనలు చేశాయి. ఈ దేశాలు లేకుండానే భారత్‌ ‌విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తరచూ విమర్శలు చేసే గత ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌తో పోలిస్తే, షరీఫ్‌ ‌కుటుంబం భారత్‌ ‌పట్ల సానుకూల వైఖరినే ప్రదర్శిస్తూంటుంది. షెహబాజ్‌ ‌ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ప్రధాని నరేంద్రమోదీ సోషల్‌ ‌మీడియాలో ఆయనకు అభినందనలు తెలిపారు. షెహబాజ్‌ ‌సోదరుడు, మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్‌ ‌షరీఫ్‌ 2014‌లో నరేంద్రమోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చు కునే చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ డిసెంబర్‌ 2015‌లో పాక్‌ను సందర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. లాహోర్‌లో షరీఫ్‌ ‌మనవరాలి వివాహానికి హాజరయ్యారు.

మోదీ మొదటి దఫా పాలనలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడిన వాతావరణం కనిపించింది. 2019లో భారత ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. భారత్‌ ‌తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాక్‌ అసమంజసమైన డిమాండ్‌ ‌చేసింది. ఆగస్టు 2019కి ముందున్న స్థితిలో భారత్‌ ఉం‌టే తప్ప రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం లేదని… ఇప్పటికిప్పుడు భారత్‌-‌పాక్‌ ‌సంబంధాల్లో వచ్చి పడే పెద్ద మార్పు ఏదీ ఉండదని దౌత్యరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ‘మోదీ వైఖరి స్పష్టంగా ఉంది. పరిస్థితులు స్థిరంగా ఉండాలని కోరుతూనే ఆయన అభినందనలు పంపారు. అంతకు మించి ఇతర అంశాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు’’ అంటున్నారు. తీవ్రవాదానికి సంబంధించి పాక్‌ ‌నుంచి తగిన హామీ లభిస్తుందని మాత్రం భారత్‌ ఎదురుచూస్తోంది. పంజాబ్‌, ‌కశ్మీర్‌ ‌ప్రాంతంలో డ్రోన్ల రూపంలో తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో ‘తక్కువ స్థాయి తీవ్రవాదం’ భారత్‌ ‌కోరుకుంటోంది. తీవ్రవాదం పట్ల భారత్‌ అనుసరిస్తున్న ‘జీరో టోలరెన్స్’ ‌విధానం కారణంగా 2015 తర్వాత పాక్‌తో ఎటువంటి దైపాక్షిక చర్చలకు భారత్‌ ఆసక్తిచూపలేదు. పైగా ఆ దేశం తీవ్రవాద కార్యకలాపాల వల్ల సార్క్‌ను పునరుద్ధరించే అవకాశం లేదని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌స్పష్టం చేశారు కూడా. షెహబాజ్‌ను తన సోదరునితో పోలిస్తే భారత్‌ ‌విషయంలో కఠిన వైఖరి తీసుకుంటారనే అభిప్రాయాలున్నాయి. ఈ రెండు దేశాలకు ప్రస్తుతం పొరుగు దేశం అంత ప్రాధాన్య మైనది కాదని దౌత్యరంగ నిపుణులు వ్యాఖ్యా నించారు. భారత ప్రభుత్వం సాధారణ ఎన్నికల హడావిడిలో ఉంది. ఈ సమయంలో పాక్‌తో సంబంధాల అంశానికి అంత ప్రాధాన్యం లేదు. అలాగే పాకిస్తాన్‌కు కూడా. ఇమ్రాన్‌ ‌ఖాన్‌, ఆప్ఘనిస్తాన్‌, ‌యూఎస్‌-‌చైనా సంబంధాలు వంటి కీలక అంశాలు ముందున్నాయి. దాంతో రెండూ కూడా పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచు కోవాలనే ఆలోచనలో లేవని వారు అభిప్రాయ పడుతున్నారు.

పాక్‌ 24‌వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌తండ్రి మహమ్మద్‌ ‌షరీఫ్‌ ‌వ్యాపార వేత్త. సోదరుడు నవాజ్‌ ‌షరీఫ్‌ ‌మూడుసార్లు పాక్‌ ‌ప్రధానిగా పనిచేశారు. 1951 సెప్టెంబరు 23వ తేదీన జన్మించారు. 1947 విభజన సమయంలో షెహబాజ్‌ ‌కుటుంబం భారత్‌లోని అమృత్‌సర్‌ ‌నుంచి లాహోర్‌ ‌కి తరలింది. అక్కడి కళాశాలలో బీఏ చదువుకున్నారు. అనంతరం తన కుటుంబ వ్యాపార సంస్థలోకి ప్రవేశించారు. ఇత్తే ఫాక్‌ ‌గ్రూపు పంచదార, స్టీలు, టెక్సె టైల్‌ ‌వ్యాపారాలను చేస్తుంది. జుల్ఫీకర్‌ అలీ భుట్టో అధ్యక్షునిగా ఉన్న కాలంలో కంపెనీని నేషనలైజ్‌ ‌చేశారు. దీనితో షరీఫ్‌ ‌కుటుంబం తీవ్రంగా దెబ్బతింది. ఆపై షరీఫ్‌ ‌కుటుంబం రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి సిద్ధమపడింది. 1977లో జియాఉల్‌ ‌హుక్‌ ‌హయాంలో కంపెనీ వారి చేతికి తిరిగొచ్చింది.1988లోషెహబాద్‌ ‌రాజకీయ జీవితం ప్రారంభించారు. 1990లో నేషనల్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 93లో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2013 నుంచి 18 వరకూ పంజాబ్‌ ‌ప్రావిన్స్ ‌ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2017లో నవాజ్‌ ‌షరీఫ్‌పై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయటంతో పాకిస్తాన్‌ ‌ముస్లిం లీగ్‌-‌సవాజ్‌ (‌పీఎంఎల్‌-ఎన్‌) ‌పార్టీ పగ్గాలు చేపట్టారు. ఓ వైపు రాజకీయ అనుభవం, మరో వైపు వ్యాపారంలో రాణించటంతో లాహోర్‌ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ అం‌డ్‌ ఇం‌డస్ట్రీకి అధ్యక్షునిగా ఎన్నికై ఏడాది పాటు పనిచేశారు.2018 నుంచి 22 వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పాక్‌ ‌రాజకీయ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 2020లో షరీఫ్‌ ‌ప్రతిపక్షాలన్నింటిని ఒక గొడుగు కిందకు తెచ్చారు. అన్న నవాజ్‌ ‌షరీఫ్‌ ‌తరపున ట్రబుల్‌ ‌షూటర్‌ ‌గా పనిచేశారు. జర్దారీ, అతని కుమారుడు బిల్వాల్‌ ‌భుట్టో జర్దారీ, ఇతర చిన్న పార్టీలతో కలిపి పాకిస్తాన్‌ ‌డొమోక్రటిక్‌ ‌మువ్‌ ‌మెంటు (పీడీఎం) ఏర్పాటు చేశారు. 2022 వరకూ ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌ప్రభుత్వాన్ని కూల్చటానికి పీడీఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం పరిణామాల్లో ఇమ్రాన్‌కు సైన్యానికి మధ్య పెరిగిన దూరం కారణంగా ప్రభుత్వం కుప్పకూలటంతో తొలిసారి షెహబాజ్‌ ‌ప్రధాని బాధ్యతలు చేపట్టారు. నేతలలో ఎవరికి ఎంత అనుభవం ఉన్నా అంతిమంగా పాక్‌ ‌భవిష్యత్తును నిర్ణయించేది సైన్యమే.

పాకిస్తాన్‌లో సైన్యాధ్యక్షులు అత్యంత శక్తిమంతులుగా కనిపిస్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని ఉత్సవ విగ్రహాలుగా మారుస్తారు. కుట్రలు, కుహకాలతో పదవీచ్యుతులను చేయటం రివాజు. ఇప్పటి దాకా ఏ ఒక్క ప్రజాప్రభుత్వం కూడా తన ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయలేదంటే పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ సైన్యాధ్యక్షులు మాత్రం ఒకటి కంటే ఎక్కువసార్లు పదవిని అనుభ వించిన సందర్భాలున్నాయి. ముగ్గురు సైన్యాధ్యక్షులు ఎనిమిదేళ్ల పాటు పాలించారు. ఇది గతం. వర్తమానంలోకి వస్తే, అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ నెల 8వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. స్వతంత్ర అభ్యర్థులు 101 సీట్లను గెలుచుకుంటే, ఇందులో 93 చోట్ల గెలుపొందిన వారు ఇమ్రాన్‌ ‌ఖాన్‌కు చెందిన పీటీఐ మద్దతుదారులే. నిజానికి పాక్‌ ‌ప్రజల దృష్టిలో ఇమ్రాన్‌ ‌హీరో కాదు. అతని పాలనలో పాక్‌ అన్ని రకాలుగా దెబ్బతింది. ఆర్థిక సంక్షోభం తరుముతున్నా, ఐఎంఎఫ్‌ని సంప్రదించటానికి సిద్ధపడలేదు. ఇంధనం, నిత్యావసర ధరలు పెరుగుతున్నా, ద్రవ్యోల్బణం అధికం అవుతున్నా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సైన్యాధ్యక్షుడి నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకించి వాళ్లకు శత్రువుగా మారారు. మరి ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేనికి సంకేతం? ప్రజల దృష్టిలో ఇమ్రాన్‌ ఇమేజ్‌ ‌పెరిగిందా? ఇమ్రాన్‌కి వ్యతిరేకంగా సైన్యం అనుసరించిన అణచివేత చర్యలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారా? అన్న అభిప్రాయం కలుగుతుంది.

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌నేతృత్వంలోని పాకిస్తాన్‌ ‌తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (‌పీటీఐ)ని బలహీన పరిచేందుకు సైన్యం సర్వశక్తులు ఒడ్డింది. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడయిన ఇమ్రాన్‌ను వివిధ అవినీతి ఆరోపణలపైన జైలుపాలు చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందు మూడు కేసుల్లో 14, 10, 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎన్నికలకు ఉమ్మడి గుర్తుపై పోటీ చేయటానికి అవకాశం లేకుండా చేయటంతో పీటీఐ మద్దతుదారులంతా స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. 2018 ఎన్నికల్లో సైన్యానికి ప్రియుడు ఇమ్రాన్‌ ‌రంగంలోకి దిగాడు. ఇప్పుడు నవాబ్‌ ‌షరీఫ్‌ను అధికారపీఠం మీద కూర్చోబెట్టటానికి ఆయన మీద ఉన్న కేసులన్నింటిని తొలగించింది.

రాజకీయ, ఆర్థిక, భద్రతాపరమైన అస్థిరత నెలకొన్న వాతావరణంలో పాక్‌ ఎన్నికలు సాగాయి. రెండో స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌ ‌ముస్లిం లీగ్‌(‌నవాజ్‌) 75 ‌సీట్లను, పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ 54 సీట్లను, ఎంక్యూఎం పాకిస్తాన్‌ 17 ‌సీట్లను గెలు పొందాయి. 265 స్థానాలున్న పాక్‌ ‌పార్లమెంటులో అధికారం చేపట్టటానికి ఏ పార్టీఅయినా 133 స్థానాలు గెలుచుకోవాలి. ఏ పార్టీకి మెజార్టీ రాని నేపథ్యంలో షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయింది. ఇందులో నవాజ్‌ ‌పార్టీ, పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీ, ఎంక్యూఎమ్‌ ‌తోపాటు ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఓటమి పాలయ్యేలా రిగ్గింగు చేపట్టామని రావల్పిండి కమిషనర్‌ ‌రియాఖత్‌ ఆలీ బహిరంగంగా ప్రకటించటం సంచలనమైంది. ఓ అభ్యర్థి, తన గెలుపు రిగ్గింగ్‌ ‌వల్లనే అని సంచలనాత్మక ప్రకటన చేశారు. ఇమ్రాన్‌ ‌పార్టీపై పై నిషేధం విధించటంతో స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారిలో నయూమ్‌ ఉర్‌ ‌రహ్మాన్‌ ఒకరు. తనకు 26వేల ఓట్లు వచ్చాయని, తనతో పోటీ పడిన సైఫ్‌ ‌భారీకి 31వేల ఓట్లు వచ్చాయని, కానీ తర్వాత సైఫ్‌కి 11వేల ఓట్లు వచ్చినట్టు ప్రకటించారని పేర్కొన్నారు. రెహ్మాన్‌ ఆరోపణలను ఎన్నికల కమిషన్‌ ‌తోసిపుచ్చింది. రిగ్గింగ్‌ ఆరోపణలపై వచ్చిన పిటీషన్‌ను పాక్‌ ‌సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఓ వైపు ఇమ్రాన్‌ ‌ఖాన్‌ .. ‌మరో వైపు దేశం ఆర్థిక సంక్షోభం… మూడో వైపు ఎనిమిది పార్టీల సంకీర్ణ ప్రభుత్వంతో సవాళ్లు.. వీటన్నింటి మధ్య షెహబాజ్‌ ఏ ‌మేరకు నెగ్గుకొస్తారు? సైన్యం కరుణాకటాక్షాలు ఆయనపై ఎంత మేరకు ఉంటాయి అనేది వేచిచూడాలి. షెహబాజ్‌కుగల పరిమితులపైన భారత్‌ ‌కు స్పష్టత ఉంది. తన భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరిచేందుకే భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దురుసు వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయంతో ప్రస్తుతం ఉంది. అలాగాకుండా మాటల మంటలు రాజేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్న పాక్‌పైన భారత్‌ ‌వైఖరి తెలియాలంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసేవరకూ ఆగవలసిందే.

 డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

About Author

By editor

Twitter
Instagram