తెలంగాణ ప్రభుత్వం.. ప్రధానంగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కేంద్రంతో వ్యవహరించే తీరు మారిపోయింది. గడిచిన బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి భిన్నంగా రేవంత్‌ ‌నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఒకరకంగా కేంద్రం సహకారం రాష్ట్రానికి ఆవశ్యకమన్న తీరులో కాంగ్రెస్‌ ‌సర్కారు వ్యవహారశైలి ఉంటోంది. కేంద్ర ప్రభుత్వంతో ఏమాత్రం ఘర్షణ అవసరం లేదని, సుహృద్భావ సంబంధాలు నెలకొల్పాలన్న ఉద్దేశ్యం ప్రతిసారీ కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పటిష్టంగా ఉండేందుకు అవసరమైన స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్రంతో సంబంధాల పరిస్థితి ఒకలా ఉండేది. అదే.. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి భిన్నంగా మారిపోయింది. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

గతంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్‌ ‌వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ప్రధానమంత్రిగానీ, కేంద్రమంత్రులు గానీ రాష్ట్రంలో పర్యటించిన సమయంలో కనీస ప్రొటోకాల్‌ ‌కూడా పాటించని తీరు వివాదాస్పదం కూడా అయ్యింది. ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా ఒకరకంగా అవమానాల పాలు చేసిన తీరుపైనా చర్చ జరిగింది. అయినా.. కేంద్ర ప్రభుత్వం గానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గానీ.. ఆ అంశాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏ మాత్రం చిన్నచూపు చూసిన ఆనవాళ్లు ఎప్పుడూ కనిపించలేదు. అయితే, అధికారిక కార్యక్రమాల్లో మాత్రం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీల మధ్య ఉన్న దూరాన్ని కేసీఆర్‌ ‌మరింతగా భూతద్దంలో కనిపించేలా వ్యవహరించారు. కానీ, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పరిస్థితి మారిపోయింది.

కేంద్రం, రాష్ట్రం మధ్య పూర్తి స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ఆ ప్రభావం ఇటీవలి కాలంగా జరుగుతున్న కార్యక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల వేగం కూడా పెరిగింది. ప్రగతి బాట కూడా పరుగులు పెడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటున్న ప్రతీ అధికారిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా హాజరవు తున్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై సుహృద్భావ ప్రసంగం చేస్తున్నారు. కేంద్రం మన్ననలు చూరగొంటున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ఆదరణ పెరిగిపోయింది. కానీ, గత బీఆర్‌ఎస్‌ ‌సర్కారులో మాత్రం కేసీఆర్‌ ఓ ‌రకంగా అహంభావ తీరును చూపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొనకుండా తన నిరంకుశత్వాన్ని చూపించారన్న చర్చ ప్రతిసారీ జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మార్పు మొదలైందని, అది స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

రాజకీయ చతురతను, పరిణతిని చూపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై రాజకీయాలకతీతంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్రమోదీని పెద్దన్నయ్యగా సంబోధించారు రేవంత్‌రెడ్డి. ఇటీవల ఆదిలాబాద్‌ ‌జిల్లాలో జరిగిన అధికారిక కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే గుజరాత్‌మోడల్‌ను అనుసరించాలని,‘పెద్దన్నయ్య’ మోదీ బాటలో పయనిస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానమంత్రి అండదండలు, కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరిగా అవసర మన్న రేవంత్‌రెడ్డి.. అందుకే కేంద్ర ప్రభుత్వంతో తాము ఘర్షణపూర్వక వాతావరణాన్ని సృష్టించుకోలే మన్నారు. కేంద్రంపై పోరాడబోనని చెప్పారు. ఆదిలాబాద్‌లో 56,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన 30 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

‘‘ప్రధానిగా నరేంద్ర మోదీ.. రాష్ట్రాలకు పెద్దన్న లాంటివారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. కేంద్రంతో మేం ఘర్షణ పడబోం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి ఉంటే అంతిమంగా ప్రజలకే నష్టం కలిగిస్తుంది. కేంద్రంతో ఘర్షణ పడితే అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడుతుంది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశాం. రాజకీయాలు ఎన్నికల వరకే. ఆ తరువాత , కేంద్రంతో ఘర్షణ పడితే అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడుతుందన్న రేవంత్‌.. అం‌దుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశామన్నారు.ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత విజ్ఞులైన ప్రజాప్రతినిధులు అభివృద్ధి కృషి చేయాల్సి ఉంటుంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చినందుకు ప్రధానికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి పట్ల తమ ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుందని, మున్ముందు కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఎన్‌టీపీసీ ద్వారా పదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాల్సి ఉండగా గత ప్రభుత్వ విధానాలతో కేవలం 1,600 మెగావాట్లకే పరిమితమైంది. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్‌టీపీసీ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో వెలుగులు ప్రసరించనున్నాయన్నారు.

హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌ ఏరియాలో రక్షణ శాఖకు చెందిన 190 ఎకరాల విలువైన స్థలాన్ని స్కైవేల కోసం ఇప్పించినందుకు, టెక్స్‌టైల్‌ ‌పార్కు ఏర్పాటు విషయంలో సానుకూలంగా స్పందించినందుకు ప్రధానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీ వీరులు రాంజీ గోండ్‌, ‌కుమురం భీం జన్మించిన ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లా గత పాలకుల నిరాదరణతో అన్ని విధాలుగా వెనకబడిందని, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు 180 ఎకరాల భూసేకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించేలా ఓ మాట చెప్పాలని ప్రధానిని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణమైతే ఆదిలాబాద్‌ ‌జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని చెప్పారు. సెమీ కండక్టర్‌ ‌పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు.

 ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై సరసన హైదరాబాద్‌ను నిలిపేందుకు కూడా మీ మద్దతు కావాలని, సబర్మతి నదిని ప్రక్షాళన చేసినట్లుగా మూసీ అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని రేవంత్‌ అభ్యర్థించారు. హైదరాబాద్‌ ‌మెట్రోలైన్‌ ‌విస్తరణకు దోహదపడాలని కోరారు.

 పెద్దపల్లిలో ఎన్టీపీసీకి చెందిన 800 మెగావాట్ల తెలంగాణ సూపర్‌ ‌థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అల్ట్రా-సూపర్‌‌క్రిటికల్‌ ‌టెక్నాలజీపై ఆధారపడి పని చేసే ఈ ప్రాజెక్టు తెలంగాణకు 85 శాతం విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. దేశంలోని అన్ని ఎన్టీపీసీ పవర్‌ ‌స్టేషన్లలో కంటే ఇది దాదాపు 42 శాతం అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

రాష్ట్ర ప్రగతికి సహకరిస్తా: ప్రధాని

తెలంగాణ ప్రజల అభివృద్ధి కలను సాకారం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.అనేక రాష్ట్రాలోని రూ. 56 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించగలవని అన్నారు. ప్రస్తుత త్రైమాసికంలో 8.4 శాతం వృద్ధిని సాధించడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఏకైక దేశం భారత్‌ అన్నారు. ఈ వేగంతో భారత్‌ ‌ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ధీమా వ్యక్తంచేశారు.

మోదీ పెద్దన్న ఎలా?:బీఆర్‌ఎస్‌

‌తమ పాలన కంటే మెరుగైన పరిస్థితి కనిపించడంలేదని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వ్యాఖ్యానించింది. రేవంత్‌ ‌సర్కార్‌ ‌కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతను కొనసాగించడంపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు ప్రతిస్పందిస్తూ, ప్రధాని మోదీ ‘పెద్దన్న’ ఎలా అవుతారంటూ విమర్శల వర్షం మొదలెట్టారు. వాటికి రేవంత్‌ ‌దీటుగా సమాధానం చెబుతూ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌లా తాము మోదీ చెవిలో ఏమీ చెప్పలేదంటూ చురకలంటించారు. రాష్ట్రానికి కావాల్సిన విషయాలను మైక్‌లోనే చెప్పానని. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన చెప్పారు. పదేళ్లలో కేసీఆర్‌ ‌వందేళ్ల విధ్వంస చేశారని మండిపడ్డారు. ఆ విధ్వంసాన్ని వంద రోజుల్లో సరిదిద్దే పనిలో ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి.. సమాచారాన్ని ధ్వంసం చేశారని, దీనిపై లీగల్‌ ‌గా చర్యలు ఉంటాయని సీఎం రేవంత్‌ ‌హెచ్చరించారు.

 వంద రోజుల తమ పనితనంపై వచ్చే ఎన్నికల్లో తీర్పునివ్వండి అని అన్నారు. తమ పాలన మీద తమకు విశ్వాసం ఉందన్నారు. పారదర్శక పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు ప్రజలు పొలిటికల్‌ ‌పనిష్మెంట్‌ ఇచ్చారన్నారు. విచారణ లేకుండా ఎవరికీ శిక్ష వేయలేం కదా అన్నారు. మేడిగడ్డ మరమ్మతుల గురించి కేసీఆర్‌, ‌హరీశ్‌ ‌రావుల వాదనలో పసలేదని వంత్‌ ‌వ్యాఖ్యానించారు.తమ దొంగతనం కప్పిపుచ్చు కునేందుకు మరమ్మతులు చేయాలని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.‘కేటీఆర్‌, ‌కేసీఆర్‌, ‌హరీశ్‌ ‌రావులే మేడిగడ్డ దొంగలు. ఆ దొంగల సలహాలు తీసుకుని మరమ్మతులు చేపట్టాలా?’ అని సీఎం రేవంత్‌ ‌ప్రశ్నించారు. మేడిగడ్డకు మరమ్మతులు అవసరమని నేషనల్‌ ‌డ్యామ్స్ ‌సేఫ్టీ అథారిటీ నివేదిక ఇస్తే అమలు చేస్తామన్నారు. కేసీఆర్‌ ‌చదివింది కేవలం బీఏనే.. కానీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పీజీ చేసినట్లు సమాచారం ఇచ్చారని రేవంత్‌ ‌సంచలన ఆరోపణలు చేశారు.

 మొత్తానికి తెలంగాణ సమాజం గత కొన్నేళ్లలో చూడని పరిణామాలు చూస్తోంది. రాజకీయంగా, ప్రగతి, సంక్షేమ పథకాల పరంగా కూడా మార్పు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీలు వేరు.. ప్రభుత్వాలను నడిపించడం వేరు అన్న స్పష్టత అందరిలోనూ వస్తున్నట్లు కనిపిస్తోంది.

-సుజాత గోపగోని, 

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram