– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ –

‌విద్య,  వైద్యం, సేవ… ఈ మూడు రంగాల్లోనూ సాటిలేని మేటి కాదంబిని. ఎన్నో అంశాల్లో ప్రథమురాలిగా నిలిచి మొత్తం వనితా లోకానికే ఆదర్శప్రాయమయ్యారు. పేరుకు తగిన తీరులో-మేఘమాలికగా జీవన జైత్రయాత్ర సాగించారు. జాబిలి కాంతులతో వేల జీవితాల్లో వెలుగు జిలుగులు నింపారు. నక్షత్ర తేజంతో శాశ్వత కీర్తి సంపాదించి, తదుపరి తరాలకు మార్గదర్శినిలా శోభించారు. ఆరు పదులకుపైగా వయసులోనే మన నుంచి ఆమె శాశ్వతంగా కనుమరుగైనా, స్థాపించిన విలువలు, చేపట్టిన కార్యక్రమాలు, విస్తృతపరచిన ప్రమాణాలు చాలా గొప్పవి. బెంగాలీ వనిత ఖండాంతర గుర్తింపు సాధించి, అంతర్జాతీయ స్థాయిలో సేవాపతాక ఎగుర వేయడమంటే మాటలా? సంఘ సంస్కర్త కుటుంబంలో ఉదయించారు. ఆ కోవలోనే తానే ఒక సేవావ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎప్పుడూ మొదటగా ఉండాలన్నదే తనదైన ఆశ, అభిమతం. స్వస్థలమైన భాగల్‌పుర్‌లోని చారిత్రకతనే పుణికిపుచ్చుకున్న అతివ. బిహార్‌లోని గంగానదికి తీరప్రాంతంలో ఉంది ఆ ఊరు. కాదంబిని గంగూలీ అస్తమించిన ప్రదేశం కోల్‌కతా. ఇప్పటి పశ్చిమ బెంగాల్‌కు రాజధాని. ఇదీ నదీ (హుగ్లీ) ప్రాంతంలోనిదే. శాస్త్ర కళారంగాల కాణాచి. ప్రాంతీయంగా విలక్షణత. జీవితపరంగానూ అంతే విశిష్టతను సంతరించుకున్న ఆమె – ఇప్పుడే కాదు, ఎప్పుడు తలచుకున్నా తారా దీపమే!


కాదంబిని తండ్రి బ్రజకిశోర్‌ ‌బసు. ధార్మిక సంస్కరణల కేంద్రమైన బ్రహ్మ సమాజ ప్రముఖులు. అక్కడి నుంచే భావవాహిని ఆమె అంతరంగాన్ని చేరింది. బోధక వృత్తిలోని భావనలు, అనుభవాలను దగ్గరుండి చూశారామె. అదే ప్రాంతంలో (భాగల్‌పుర్‌) ‌మహిళల సముద్ధరణ కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించిన తండ్రి నుంచి స్ఫూర్తి పొందారు. కాలక్రమంలో ఆ సమితికి మరింత ప్రాచుర్యం కలిగించి, స్త్రీల తలలో నాలుక అయ్యారు. కాదంబిని ఎందెరెందరినో ఆదరిస్తూ, అభిమానిస్తూ సహాయ కారిగా వెలుగుతూ ఒక చక్కని ఒరవడి సృష్టించారు. ఎన్నెన్ని ప్రత్యేకతలు తనవిగా చేసుకున్నారంటే…

–              అలనాటి ఆధునిక వైద్యరంగంలో, పాశ్చాత్య చికిత్సరీతిలో మొట్టమొదటి శిక్షిత నిపుణురాలు దక్షిణ ఆసియాలో ఆమె.

–              భారత స్వాతంత్య్ర సాధనకు పూర్వం బ్రిటిషర్ల హయాంలో, విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష మొట్టమొదటి వరస పట్టభద్రురాలు.

–              ప్రథమ శ్రేణి మహిళాభ్యుదయ సంస్థగా జాతీయ స్థాయిలో పేరు గడించిన ‘సమితి’ ప్రధాన నిర్వాహకురాలు.

–              భర్త ద్వారకానాథ గంగూలీ ఆశయాలమేర, కార్యాచరణకు ఉపక్రమించి, ప్రాంతీయ విభాగాల్ని రూపొందించిన తొలి వ్యూహకర్త కూడా.

కోల్‌కతా వర్సిటీ ప్రవేశపరీక్ష రాసినప్పుడు, ఆమెకు 17 ఏళ్లు! అంతకు ముందు చదివింది బెథూన్‌ ‌విద్యాలయంలో. విశ్వవిద్యాలయం పేరు గల ఆయన పూర్తి పేరు జాన్‌ ఇలియట్‌ ‌డ్రింక్‌ ‌వాటర్‌ ‌బెథూన్‌. ఇం‌గ్లండ్‌లో జన్మించి, కోల్‌కత్తాలో అస్తమించారు. వనితా విద్యను ప్రోత్సహించేందుకు జీవితమంతటినీ అంకితం చేశారు. ఒకప్పటి షిమేల్‌ ‌స్కూల్‌ ‌వ్యవస్థాపకులు (అటు తర్వాత అదే బెథూన్‌ ‌కాలేజీగా వృద్ధి చెందింది). అసాధారణ కళాశాల అది. మొత్తం ఆసియా ఖండంలోనే పేరొందిన పురాతన మహిళా కళాశాల. ఆయన నాటి బ్రిటిష్‌ ఇం‌డియా రాజధాని నగరమైన కోలకతాలో వనితా విద్యా సంస్థను నిర్మించారు.ఆ బెథూన్‌ ‌విద్యా నిలయం నుంచే స్ఫూర్తి పొందారు కాదంబిని. కోల్‌కతా వర్సిటీ ప్రవేశ పరీక్ష రాసి ప్రథమత్వాన్ని సొంతం చేసుకున్నారు. అదే నేపథ్యంలో, సరికొత్త కోర్సులు 1883లో ఆరంభమయ్యాయి. అప్పటికి ఆమెకు 22 సంవత్సరాలు. ఈ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే, మొదటి పట్టభద్ర అతివగా ఆమె పేరు తొలి వరసనే ఉంటుంది. ఇదంతా జాతీయ స్థాయి ప్రఖ్యాతి.

సహనశీలి – ప్రతిభాశాలి

మనకు స్వాతంత్య్రం రావడానికి దాదాపు పాతికేళ్ల క్రితమే కాదంబిని కన్నుమూశారు. కానీ ఆమె ఆనాడు నెలకొల్పిన ప్రమాణాల పరంపరలు మటుకు సజీవంగా మనముందున్నాయి. ఎప్పటి 1886? ఇప్పటికి 136 వత్సరాల కిందటి సంగతి. ఆ రోజుల్లోనే వైద్యశాస్త్రంలో డిగ్రీ అందుకున్న మొదటి భారతీయ వనితారత్నంగా ఆమె రికార్డు సృష్టించారు. వెంటనే వృత్తిని చేపట్టి, ఎందరెందరికో వైద్యసేవ లందించిన నిపుణురాలిగా చిరకీర్తి గడించారు. అంతటితో ఆగలేదు, సామాజిక రంగంలో సైతం ముందుండి తానేమిటో చాటి చెప్పారు. ‘అక్షరం లోకరక్షక’మని విశ్వసించారు కాబట్టే, అనేకానేక వైద్యసంబంధ రచనలు చేశారు. భారత తొలి డాక్టరుగా (వైద్యురాలు) దీక్షా దక్షతలతో రాణించారు వైద్యవిద్యను విజయవంతంగా పూర్తి చేయడంలో, అదే వృత్తిలో సహన సామర్థ్యాలు కనబరచడంలోనూ దిట్ట. అందుకే అపార కృతజ్ఞతాభావంతోసామాజిక మాధ్యమాలు నిరుడు ఆమె 160వ జయంతి ఉత్సవ వేళ ప్రత్యేక రూపచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. కోల్‌కతా వైద్యకళాశాలతోపాటు, ఆస్పత్రి ప్రధాన భవనం దగ్గర ఆమె భారీ వర్ణచిత్రాన్ని ప్రదర్శించాయి. ముదితల స్వేచ్ఛాసాధనకు అహరహం పరిశ్రమించిన ఆ స్ఫూర్తి ప్రదాతను ఉద్యమశీలిగా ప్రస్తుతించాయి.

ఇప్పుడైతే స్థితిగతులు వేరు కానీ, అప్పట్లో కాదంబిని ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారో లెక్కే లేదు. ఇంటి నుంచి బయటికొచ్చి, బాగా చదువుకుని, వైద్య సేవా సహాయాలు అందిస్తున్న ఆమెను కొందరు సూటిపోటి మాటలన్నారు. విమోచనోద్యమాన్ని నిర్వర్తిస్తున్న ఆమెను నానారకాల అవమానాలపాలు చేశారు. నిరుత్సాహపరిచారు. అయినా ఆమె తగ్గిందే లేదు.

తను ఏం కావాలనుకున్నారో అదే అయ్యారు. సంఘానికి చెప్పాలనుకున్నది చెప్పారు. అనుకున్న కార్యాలు నెరవేర్చి డాక్టర్‌ ‌కాదంబినిగా తనను తాను నిరూపించుకున్నారు. ఎంతైనా మేఘమాలిక కదా; వర్షించాలనుకుంటే, వ్యాధిగ్రస్తుల బాధల్ని ఆసాంతం తుడిచిపెట్టాలని నడుం కట్టుకుంటే, ఎవరు ఆపగలరు?

అన్నీ సహించి, ఎన్నో భరించి….

వైద్యకళాశాల (కోల్‌కతా)లో 23 ఏళ్ళకే ప్రథమ మహిళగా ప్రవేశం పొందారన్నా, స్కాట్లాండ్‌ ‌వంటి విదేశీ ప్రాంతాల్లో సమగ్ర శిక్షణ అందుకున్నారన్నా అంతా కాదంబిని ఘనతర ప్రతిభ. ఆనాటి భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో మొట్టమొదటిగా ప్రసంగించిన వనిత కూడా ఆమే. తన 37 ఏళ్ళ ప్రాయంలో భర్తను కోల్పోయారు. పరిస్థితులను అధిగమించి, కష్టనష్టాలను భరించి, ఒంటరి ప్రయాణమే సాగించారామె. కలతలకు కుంగిపోలేదు. ఇతరుల దూషణలకు ంకనూ లేదు. తాను అనుకున్న దారిలోనే, భావించిన రీతిలోనే ముంద డుగు వేసి, అందరితోనూ శభాష్‌ అనిపించుకున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రచార సాధనాలే ప్రాథమిక బాధ్యతలు విస్మరించి వ్యవహరించాయి. వాస్తవాలు తెలుసుకోకుండా, నిర్ధారణ చేసుకోకుండా అవాకులూ, చవాకులూ రాశాయి. ఎంతమంది ఎంతగా వెనక్కి లాగినా, ఆమె అడుగు మాత్రం ముందుకే! అంతటి ధీరత్వం కలిగిన సాహసికురాలు కనుకే, సకల సమాజానికీ వేగుచుక్కగా మారారు. సంగతీ సందర్భాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం చెడు రాతలు రాసిన పత్రిక నిర్వాహకుడికి చివరికి కారాగారశిక్ష పడింది.

కాదంబిని బోస్‌, ‌గంగూలీ జీవితచరిత్ర ఆధారంగా బెంగాలీ చిన్ని తెర ప్రత్యేక ధారావాహిక ప్రసారం చేసింది. రెండేళ్ళ నాడు ప్రారంభమైన ఆ సీరియల్‌ అపార ప్రేక్షకాదరణ పొందింది. ఒకప్పుడు విమర్శలొచ్చాయని వెరిచి ఉండే, అంతటితోనే తన కృషి ఆపేసి ఉంటే, ఆ లేడీ డాక్టర్‌ ‌వైనం వేరుగా ఉండేది. కానీ అక్కడున్నది కాదంబిని! నడవటం, నడిపించటం బాగా తెలిసి ఉన్న ఆ నిపుణురాలు సేవామార్గంలోనే ధీమాగా నడిచారు. తన వెంట మరెందరినో నడిపించి యశస్వినిగా నిలిచి గెలిచారు.

సామాజిక సేవావాహిని

వ్యక్తి, వృత్తిగత జీవితాల్లో కాదంబిని శిఖర సమానురాలు. కుటుంబ బాధ్యతలు, సామాజిక విధులు రెండింటినీ సమన్వయం చేసుకుని జయప్రదం కాగలిగారు. ఆమె సంతానంలో ఒకరు (జ్యోతిర్మయి) భారత స్వాతంత్య్ర ఉద్యమ కారిణి, మరొకరు (ప్రభాత్‌చంద్ర) పాత్రికేయులు. విజయానికి మారుపేరుగా రూపొందిన కాదంబినిని అమెరికన్‌ ‌చరిత్రకారుడు డేవిడ్‌ ‌కాష్‌ ‘‌విమోచ నోద్యమ సేనాని’గా ప్రశంసించారు. అలా విదేశీయుల కితాబులను సైతం అందుకున్న ఆమె, తనను తాను సామాజిక సేవకురాలిగానే ప్రస్తావించు కున్నారు.

భూషణలకు పొంగలేదు, దూషణలకు కుంగలేదు. తిరస్కారాలు ఎదురైనా ఏనాడూ తన మార్గం వీడలేదు. ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ఒక స్త్రీగా ఆమె చదువుకుని, వైద్యవృత్తి చేపట్టి, ఊరూవాడా సేవలందించారంటే… చేతులు జోడించి నమస్కరించకుండా ఉండగలమా? ఆ ప్రశాంత వదనం, సంభాషణ నైపుణ్యం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుని అనంత గౌరవాదరాలు సంతరించి పెట్టేవి. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు కొనసాగుతున్న ఈ తరుణంలో డాక్టర్‌ ‌కాదంబిని స్మరణం ప్రతి ఒక్కరి కర్తవ్యం. మనందరికీ ఎంతైనా సగర్వ కారణం. వైద్యవృత్తి అత్యంత పవిత్రం. తొలి వైద్యురాలిగా ఆమె నిర్వహించిన పాత్ర నిస్సందే హంగా చరిత్రాత్మకం. మహిళా లోక కీర్తి కిరీటం కాదంబినీ బోస్‌ ‌గంగూలీ.

By editor

Twitter
Instagram