చరిత్ర పునరావృతమవుతుందని చెప్పడం తిరుగులేని సత్యం. తమ చుట్టూ పేర్చిన అబద్ధాలను దగ్ధం చేసుకుంటూ చారిత్రకసత్యాలు నేరుగా న్యాయస్థానాల ముంగిట వాడం ఇవాళ్టి కొత్త పరిణామం. ఒక జాతి వారికి చెందిన పురాణాలు పరలోకానికి సంబంధించిన పాపపుణ్యాల గురించి చెబుతాయి. ఆత్మ క్షాళనకు దారి చూపుతాయి. కానీ ఆ జాతి చరిత్ర కోల్పోయిన ఆత్మగౌరవం గురించి చెబుతుంది. జాతి పునర్నిర్మాణం గురించి చెబుతుంది. కోల్పోయిన దేమిటో గుర్తు చేస్తుంది కూడా. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది అదే. వందల ఏళ్లు మౌనం దాల్చిన చారిత్రకసత్యాలు గతం పుటల నుంచే తమ ఘోషను స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ ఘోష ఏడెనిమిది వందల ఏళ్ల కాంలో హిందువులు అనుభవించిన క్షోభకు సంబంధించినదే. ఆ బాధకు నివారణ చారిత్రక తప్పిదాలను సరిదిద్దుకోవడమే. సరిగ్గా ఈ మహా యజ్ఞమే సరికాదంటున్నాయి కొన్ని శక్తులు. అబద్ధాల కింద, వక్రభాష్యాల చాటున ఉండిపోయిన చరిత్రను ప్రపంచానికి తెలియనీయడం దేశానికి శ్రేయస్కరం కాదని సుద్దులు చెబుతున్నాయి. అంతిమంగా దానర్ధం హిందువులు రాజీ పడాలనే. మసీదుల కింద మగ్గుతున్న ఆలయాలు వెలుగు చూడకూడదనే. ఇంకా, ముస్లింలోని విజేత మనస్తత్త్వం భద్రంగా ఉండాలి. విదేశీ దురాక్రమణదారులంతా హిందూధర్మాన్ని నాశనం చేసి, ఆలయాలను నేలకూల్చిన మాట నిజమే కావచ్చు. కానీ దానిని మరచిపోవడం భవిష్యత్తుకు మంచిదన్నది సెక్యులరిస్టుల ఉవాచ. వందా రెండు వందలా! 40,000 మసీదుల కింద ఉన్న దేవాలయాలను వెనక్కి ఇమ్మంటే మైనారిటీల మనసుకు ఎంత నెప్పో కదా అంటున్నారు మేధావులు. ఇందుకు తాజా ఉదాహరణ జ్ఞాన్‌వాపి మసీదు ఉందంతం, దాని మీద వస్తున్న వాదనలు.


కాశీలో విశ్వనాథుని మందిరాన్ని కబళిస్తున్నట్టే ఉంటుంది జ్ఞాన్‌వాపి మసీదు. ఒక సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత మే 19న వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశంతో ఈ మసీదు లోపలి భాగాలను వీడియో సర్వే చేసి, కోర్టుకు సమర్పించారు. మసీదులో హిందూ ఆనవాళ్లు ఉన్నాయన్నదే హిందువుల వాదన. కోర్టు నియమించిన ప్రత్యేక సహాయ కమిషనర్‌ ఈ ‌కార్యక్రమం నిర్వహించారు. అయోధ్య తరువాత హిందువులు చేస్తున్న మరొక ఆత్మగౌరవ ప్రకటనగా ఇప్పుడు అంతా భావిస్తున్న ఈ సర్వే కార్యక్రమం ఐదుగురు సాధారణ గృహిణులు కోర్టుకు చేసుకున్న విన్నపం మేరకు పునఃప్రారంభ మైంది. అయితే శబరిమలై అయ్యప్పస్వామి ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశం గురించి అసలు హిందూమతంతో సంబంధం లేని, మతాచారాలు అసలే పట్టని, వాటితో సంబంధమే లేని, హిందూ ధర్మాన్ని కించపరచడమే ధ్యేయంగా ఆ కొందరు మహిళలు వేసిన వ్యాజ్యం వంటిది కాదిది. వీరంతా ఏ రాజకీయ దురుద్దేశాలు లేకుండా కేవలం ధార్మిక దృష్టితో తమ మత హక్కును నిలబెట్టి న్యాయం చేయవలసిందని కోర్టును అర్థించారు. జ్ఞాన్‌వాపి గోడను ఆనుకుని ఉన్న శృంగార గౌరీ అమ్మవారికి నిత్యం పూజలు చేసుకునే వెసులుబాటు కల్పించమన్నదే ఆ విన్నపం అసలు ఉద్దేశం. రోజుకు ఐదు పర్యాయాలు విధిగా దైవ ప్రార్థన గావించే మతస్థులు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే హిందువులు ఆ అమ్మవారిని సేవించుకోవడానికి అనుమతించడం ఏం న్యాయం? మొత్తానికి తీగ లాగితే చరిత్ర డొంకంతా కదిలినట్టయింది. శృంగార గౌరీ నిత్య ఆరాధన అంశం చరిత్ర పుటలలోని హిందువుల ఘోషకు ఊపిరినిచ్చింది. 40,000 మసీదుల కింద ఉన్న పవిత్ర దేవాలయాల శిథిలాలలో కదలికను తెచ్చింది. ఇదంతా జ్ఞాన్‌వాపి మసీదు మీద తమకు ఉన్న హక్కు గురించి హిందువులు సాగిస్తున్న న్యాయపోరాట స్వరూపం.

విషయంలోకి వెళ్లే ముందు ఒక్క విషయం గమనించాలి. అయోధ్య, కాశీ, మధుర – ఈ మూడు పరమ పవిత్ర క్షేత్రాల మీద హిందువులు తమ హక్కును నిరూపించుకోవడానికి న్యాయస్థానాలనే ఆశ్రయించారు.దశాబ్దాలు, శతాబ్దాలు కూడా నిరీక్షించారు. ఇందులో ఎన్నో అపజయాలు. కొన్ని విజయాలు. అయోధ్య ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడే జ్ఞాన్‌వాపి అంశం కూడా కోర్టు ముందుకు వచ్చింది. 1991లో, అంటే వివాదాస్పద కట్టడం కూలడానికి ఒక సంవత్సరం ముందే వారణాసికి చెందిన కొందరు అర్చకస్వాములు వారణాసి న్యాయస్థానంలో ఒక పిటిషన్‌ ‌దాఖలు చేశారు. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవుళ్లకు నిత్యపూజలకు అనుమతించా లన్నదే వారి విన్నపం. కానీ వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణను మూడు దశాబ్దాల తరువాత అలహాబాద్‌ ‌హైకోర్టు 2021లో నిలిపివేసింది. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారన్న ఆరోపణలో నిజమెంతో తేల్చడానికి తలపెట్టిన సర్వేను కూడా సస్పెండ్‌ ‌చేసింది. ఇంకోపక్క, ఇలా సర్వే చేయించడం జూలై 11,1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి విరుద్ధమని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు వాదించింది. ఈ చట్టం ప్రకారం 1947 నాటికి ఆలయాలు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిని కొనసాగించాలి. ఇలా వివాదాన్ని త్రిశంకు స్వర్గంలో వదిలివేసిన సమయంలోనే మరొక పరిణామం జరిగింది. ఆ ఐదుగురు హిందూ సోదరీమణుల ద్వారా కేసు మళ్లీ పట్టాలెక్కింది. అంతకు ముందే ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్‌ ‌మౌర్య, వాస్తవం మీద ముసుగును ఈ సర్వే తొలగిస్తుందని ప్రకటించి, దేశప్రజల దృష్టిని ఈ అంశం మీదకు మళ్లించారు. ఇక్కడొక విషయం గుర్తు చేసుకోవాలి. 1991 నాటి ప్రార్థనాస్థలాల పరి రక్షణ చట్టం చెల్లుబాటును పరిశీలించవలసిందేనని 2021 మార్చిలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ ‌బాబ్డే ధర్మాసనం ప్రకటించింది. సాక్ష్యాలు పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఒక కట్టడం మూలరూపాన్ని నిరాకరించడం తగదని చాలామంది న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు కూడా.

జ్ఞాన్‌వాపి గోడల మీద కనిపించే హిందూ దేవతామూర్తులను నిత్యం పూజించుకోవడానికి అనుమతి మంజూరు చేయించవలసిందిగా ఢిల్లీలో ఉండే ఆ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టు వీడియో సర్వే నిర్వహించి మే 10వ తేదీకి సమర్పించాలని ఆదేశించింది. ఈ సర్వే జ్ఞాన్‌వాపి-శృంగార గౌరీ అమ్మవారి ప్రతిమ ఉన్న ప్రాంతంలో చేయాలి. కానీ కోర్టు ఆదేశాలను మొదట మసీదు నిర్వహణ సంఘం ఖాతరు చేయకుండా సర్వేకు అనుమతించలేదు. కోర్టు నియమించిన కమిషనర్‌ అజయ్‌కుమార్‌ ‌మిశ్రాకు ఆ అర్హత లేదని ఆ సంఘం వాదించింది. ఆయనకు పక్షపాత దృష్టి ఉందని, కాబట్టి వేరే కమిషనర్‌ను నియమించాలని కోరింది. ఆ విన్నపాన్ని కోర్టు పట్టించుకోలేదు. ప్రాథమిక సర్వే నిర్వహించిన మిశ్రా కొన్ని అంశాలను మీడియాకు వెల్లడించారన్న ఆరోపణతో ఆయనను మార్చారు. మిశ్రా స్థానంలో విశాల్‌సింగ్‌ను నియమించారు. మే 17కు సర్వే పూర్తి చేయాలని మే 12న ఆదేశించింది. మే 13న అంజు మన్‌ ఇం‌తేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లి, సర్వే మీద స్టే కోరింది. కమిటీకి చుక్కెదురైంది. 14వ తేదీన సర్వే మొదలయింది. మొదటి రోజున నాలుగు గదులలో సర్వే జరిగింది. ఇందులో మూడు ముస్లింలవి, ఒకటి హిందువులది. రెండో రోజు సర్వేలోనే హిందూ ఆలయం ధ్వంసం చేసినట్టుగా చెప్పే ఆనవాళ్లు దొరికాయి. మే 16న సర్వే పూర్తయింది. అప్పుడే హిందువుల తరఫున వాదిస్తున్న ఒక న్యాయవాది వజూఖానాలో శివలింగం ఉన్నట్టు బయటకు చెప్పారు. వెంటనే సుప్రీంకోర్టు ముస్లింల ప్రార్థనలకు అడ్డు లేకుండా, శివలింగం ఉన్న ప్రదేశాన్ని సీజ్‌ ‌చేయవలసిందని ఆదేశాలు ఇచ్చింది. ఇది హిందువుల మనోబలాన్ని పెంచింది.

రుజువులు కళ్లెదుటే ఉన్నా, చరిత్ర ఘోషిస్తున్నా ఒక వాస్తవాన్ని ఇంతకాలం గట్టిగా చెప్పడానికి సందేహించిన హిందూ సమాజం ఇప్పుడు గళ మెత్తింది. హిందువులు పరమ పవిత్రంగా పూజించు కునే కాశీ విశ్వేశ్వరుని మందిరాన్ని గ్రేట్‌ ‌మొగల్స్‌లో చివరివాడు ఔరంగజేబ్‌ ‌నేలమట్టం చేసి, అదే స్థలంలో మసీదు నిర్మించాడు. తిరుగులేని ఈ చారిత్రక వాస్తవాన్ని ఇన్నాళ్లకి హిందువులు గుండె ధైర్యంతో చెప్పగలుగుతున్నారు. దీనికి చరిత్రలో ఇంకా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్క హిందువులు అందించిన పుస్తకాలలోనే కాదు, ముస్లిం పాలకులు, వారి ఆస్థానకవులు, విదేశీ యాత్రికులు రాసిన పుస్తకాలు కూడా అదే ఘోషిస్తున్నాయి. ముస్లిం పాలకులు ఈ దేశంలో మిగిలిన మతాల వారి ప్రార్థనామందిరాలను, మరీ ముఖ్యంగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి వాటి మీదనే మసీదులు కట్టారు. అయోధ్య, కాశీ, మధుర మాత్రమే కాదు, ఈ దేశంలో దాదాపు నలభయ్‌ ‌వేల మసీదులు అలా హిందువుల ఆత్మగౌరవాన్ని తొక్కుతూ నిలబడినవే. ‘మాసీర్‌ ఇ అలంగిరి’ అనే గ్రంథం ఉంది. సాకి మస్తాయిద్‌ ‌ఖాన్‌ ‌దీని రచయిత. ఇది ఔరంగజేబ్‌ ‌పాలనా కాలం మీద వ్యాఖ్యానం వంటి చరిత్ర గ్రంథం. అందులో కాశీ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది. ఏమిటది?

ఈ గ్రంథంలో మొదటి భాగం ఔరంగజేబ్‌ ‌జీవించి ఉండగానే రచించారు. రెండో భాగం అతడు మరణించిన తరువాత రాసినది. పర్షియా భాషలో ఉన్న ఈ గ్రంథాన్ని ప్రముఖ చరిత్రకారుడు జదునాథ్‌ ‌సర్కార్‌ అనువదించారు. ఆ పని జరిగినది బీజేపీ హయాంలో అనుకుంటే పొరపాటు. బ్రిటిష్‌ ఇం‌డియా కాలంలోనే అనువదించారాయన.

‘మాసీర్‌ ఇ అలంగిరి’ చెబుతున్నదాని ప్రకారం బెనారస్‌లో ఉన్న ‘అవిశ్వాసులు’, అంటే హిందువుల గురించి ఏప్రిల్‌ 8,1669‌లో ఔరంగజేబ్‌కు తెలిసింది. టెట్టా, ముల్తాన్‌, ‌మరీ ముఖ్యంగా బెనారస్‌లో బ్రాహ్మణులైన అవిశ్వాసులు తమ మత గ్రంథాన్ని బోధించడానికి పాఠశాలలు ఏర్పాటు చేశారని దేవుడికి తెలిసింది. అటు హిందువులే కాకుండా, ముస్లిం విద్యార్థులు కూడా వాళ్ల పాఠశాలలకు ఆకర్షితులై వెళుతున్నారని తెలిసింది అని ఆ పుస్తకంలో ఒకచోట రాశారు. ఇంకా, అవిశ్వాసులకు సంబంధించిన ఇలాంటి పాఠశాలలు వెంటనే కూల్చాలని, ఇస్లాం ఆదేశాలను అమలు చేయడానికి ప్రభువుల వారు వేగిరపడుతున్నారని కూడా రాశారు. ఆ అవిశ్వాసుల నిత్య ఆచార వ్యవహారాలు, పాఠశాలలు, బోధనలు అన్నీ కట్టిపెట్టాలని ఆదేశించారు. పాదుషా ఆజ్ఞ మేరకు సెప్టెంబర్‌ 2,1669‌న మొగలాయిల అధికారులు వారణాసిలో విశ్వనాథుని ఆలయాన్ని నేలకూల్చారు అని ఆ పుస్తకంలో నమోదు చేశారు.

మళ్లీ వర్తమానానికి వచ్చి, సర్వేను పరిశీలిస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. మే 19వ తేదీన కోర్టుకు సర్వే నివేదిక అందింది. అడ్వకేట్‌ ‌కమిషనర్‌ ‌విశాల్‌ ‌సింగ్‌ అం‌దులోని అంశాలను వెల్లడించడానికి నిరాకరించారు. అయినా కొన్ని అంశాలు బయట పడిపోయాయి. పిటిషన్‌ ‌దాఖలు చేసినవారు చెప్పినట్టే మసీదు లోపల సనాతన ధర్మానికి చెందిన కొన్ని ప్రతీకలు ఉన్నాయి. అవి డమరుకం, త్రిశూలం, కమలం. మొదటిగా సర్వే నిర్వహించిన మిశ్రా కూడా పగిలిన హిందూ దేవతాప్రతిమలు మసీదులో ఉన్నాయని నమోదు చేశారు. అవి శేషుడు, దీపం. కానీ మసీదులోని వజూఖానాలో దొరికిన శివలింగాన్ని ఫౌంటేన్‌గా నమ్మించడానికి ముస్లింలు శతవిధాల ప్రయత్నించినా దానిని దేశం నమ్మలేదు.

తమ ప్రార్థనా స్థలాల గురించి హిందువుల వాదనకు బలం, లోతు పెరిగిన కొద్దీ సెక్యులరిస్టులు, మేధావులు రంగంలోకి దిగి రాజీ మార్గాలు సూచించడం చాలాకాలంగా జరుగుతున్నది. ఇప్పుడూ అదే జరుగుతున్నది. ఇలా గతాన్ని తవ్వుకుంటూ ఎంత వెనక్కి వెళతాం? ఒక ముగింపు ఉండాలి కదా? ఇదీ ఇప్పుడు వినిపిస్తున్న మాట. అయితే ఈ మాట కేవలం హిందువులను దృష్టిలో పెట్టుకుని అన్నమాట. ఇలాంటి సూచన ఏదీ కూడా ముస్లింలకు వినిపించకుండా చర్చలు జరపాలనీ, ఒక పరిష్కారానికీ రావాలనీ, రాజీకి రావాలనీ చెప్పడమంటే హిందువులను వెనక్కి తగ్గమనే అర్ధం. జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం సహా, కొన్ని హిందూ ప్రతీకలు బయటపడినాయని వెల్లడి కాగానే ముస్లింలలో మేకపోతు గాంభీర్యం, మేధావులలో నక్క వినయం ఒక్కసారిగా పొటమరించాయి. ఇలా చిరకాలం హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే దేశానికి మంచిది కాదని ఇప్పుడే ఆదరాబాదరా వారికి గుర్తుకు వచ్చింది. అక్కడ శివలింగం దొరకడం, కావలసినన్ని చారిత్రక ఆధారాలు ఉండడం చూస్తే, అయోధ్య తరహాలో ఒక పెద్ద రాజకీయ, సామాజిక, న్యాయ సంఘర్షణ దేశంలో అనివార్యమని మేధావులు బెదిరించడం మొదలుపెట్టారు. నిజమే, ఈ ఆధారాలను బట్టి, కాశీ విశ్వనాథుడి గుడిని మింగుతున్నట్టు ఉండే మసీదును బట్టి హిందువులు దాని మీద తమ హక్కును చాటుకోవడం అనివార్యం. ఇన్ని రుజువులు, ఆధారాలతో సహా బయటపడినా హిందువులు అది తమదేనని ప్రకటించుకోకుండా ఇంకా ఎలా ఉండగలరు? వారికి ఆత్మగౌరవం ఉండదా? ఉండకూడదా? రేపటితరాల వారికి ఏం సమాధానం చెబుతారు? దీనికి నక్క వినయంతో సెక్యులరిస్టులు చేస్తున్న ప్రతివాదం- హిందూ దేవాలయాల మీద నిర్మించినట్టు చెబుతున్న 40,000 మసీదులు అప్పగించాల్సిందేనని హిందువులు ఇప్పటికే గళం ఎత్తారు. ఇదెలా సాధ్యం? బెంగళూరుకు చెందిన శ్రీరామసేన నాయకుడు ఈ మాట ఇప్పటికే అన్నారు కూడా. అంటే అలనాడు ముస్లింలు చేసిన విగ్రహ ధ్వంసం కార్యక్రమాన్నే తిరిగి ఇప్పుడు ప్రారంభించి నట్టు అవుతుంది కదా అని నీళ్లు నములుతున్నారు. అంత రక్తపాతం జరగాలా అని అంటున్నారు. కాబట్టి మరీ పాత నిర్మాణాల జోలికి పోవడం సరికాదన్నదే చాలామంది మేధావులు, సెక్యులరిస్టుల అభిప్రా యంగా తేలుతుంది. నిజానికి ఇలాంటి అభిప్రాయా నికి ఇప్పుడు ఈ దేశంలో పూచిక పుల్ల విలువ కూడా లేదు. 1991 నాటి ప్రార్థనా స్థలాల యథాతథ స్థితి కాపాడే చట్టం చెల్లుబాటే ప్రశ్నార్థకమైనప్పుడు మసీదులు కింద ఉన్న ఆలయాలు తమకు కావాలి అని హిందువులు కోరితే తప్పేమిటి? అయినా ఇన్ని ఆలయాలను మెజారిటీ హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ మాత్రం ఎలా అప్పగించగలదు? అన్నది కూడా వారి వాదనే. ఇది అంతర్యుద్ధానికి దారి తీయదా అని కూడా ముందే భయపెడు తున్నారు. అసలు ఈ వివాదాలేవీ తెర మీద లేనప్పుడే అంతర్యుద్ధం గురించి కొందరు ముస్లిం మౌల్వీలు ఫత్వాలు ఇచ్చిన సంగతిని మాత్రం వీరు సౌకర్యంగా పక్కన పెడుతూ ఉంటారు.

—————————————————————————————

1937 నుంచి 2022 వరకు

జ్ఞాన్‌వాపి మసీదును హిందూ దేవాలయ శిథిలాల మీదనే నిర్మించారని ఇప్పుడు అనేక మంది హిందువులు, హిందూ సంస్థలు విశ్వసించక తప్పడం లేదు. ప్రపంచ ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో  కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడం, ఆ సర్వేలో బయట పడినదిగా చెబుతున్న శివలింగం ఇలాంటి నమ్మకానికి వచ్చేటట్టు చేస్తున్నాయి. 1669లో మొగల్‌ ‌వంశీకుడు ఔరంగజేబ్‌ ‌పురాణ ప్రసిద్ధమైన ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి దాని మీద మసీదు కట్టాడని చరిత్ర చెబుతోంది. ఇది భారతీయ చరిత్రకారులు రాసుకున్న చరిత్ర కూడా కాదు. విదేశీ యాత్రికులు, మొగల్‌ ‌వంశీకులు, వారి కొలువులో పనిచేసిన వారు రాసిన డైరీలలో లభ్యమవుతున్న సమాచారమే. ఇంతకీ జ్ఞాన్‌వాపి మసీదులో ఉన్నట్టు చెబుతున్న హిందూ దేవాలయ ఆనవాళ్లలో ఇవి ఐదు శాతం కూడా కాదన్న వాస్తవం గమనించాలి. మసీదు గోడల మీద కనిపించకూడని లతలు, పుష్పాలు కనిపించాయి. చివరికి నమాజ్‌కు ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునే చోటు (వజూఖానా) శివలింగం ఉన్నట్టు సమాచారం బయటకు వచ్చింది.  ఇలా సర్వే విశేషాలు బయటకు రావడం మీద కోర్టు ఆగ్రహం ప్రకటించగలదు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఆ ఆనవాళ్ల నేపథ్యాన్ని కోర్టు కూడా తిరస్కరించలేదని భావించాలి. ఏమైనా మసీదులో ఉన్నట్టు చెబుతున్న హిందూ దేవుళ్ల ప్రతిమల పట్ల హిందువులు సహజంగానే ఆసక్తిని పెంచుకున్నారు. అసలు ఈ వివాదం ఎప్పటిది? కోర్టులలో దీని ప్రస్థానం ఎలా సాగింది? ప్రభుత్వాల వైఖరి ఏమిటి?

1937: 1937లో అలహాబాద్‌ ‌హైకోర్టు ఈ వివాదానికి సంబంధించి ఒక డిక్రీ ఇచ్చింది. ఇది దీన్‌ ‌మహమ్మద్‌ ‌వర్సెస్‌ ‌రాష్ట్ర కార్యదర్శి కేసుగా ప్రసిద్ధి గాంచింది. దీని ప్రకారం జ్ఞాన్‌వాపిని వక్ఫ్ ‌బోర్డు ఆస్తిగాను, మసీదు కింది భాగం వ్యాస్‌ ‌కుటుంబి కులకు చెందినదిగాను ఆ డిక్రీ ప్రకటించింది.

1991: అయోధ్య వివాదం తారస్థాయికి చేరిన దశలో పీవీ నరసింహారావు ప్రభుత్వం  ప్రార్థనాస్థలాల (స్పెషల్‌ ‌ప్రావిజన్స్) ‌చట్టాన్ని తీసుకువచ్చింది. అయోధ్యలోని రామజన్మ భూమి తప్ప దేశంలోని మిగిలిన అన్ని ప్రార్థనా స్థలాల విషయంలో ఆగస్ట్ 15,1947 ‌నాటి స్థితిని యథాతథంగా కొనసా గించాలి. ఈ చట్టాన్ని చూపుతూ శృంగార గౌరీ మాత పూజకు అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని ముస్లింలు వారణాసి కోర్టుకు వెళ్లారు. అసదుద్దీన్‌ ఒవైసీ ఈ ఒక్క చట్టాన్ని అడ్డం పెట్టుకునే మొత్తం వ్యవహారం నడుపుదామని అనుకుంటు న్నారు. అసలు ఈ చట్టాన్ని తొలగిస్తే సమస్య తీరుతుందని డాక్టర్‌ ‌సుబ్రహ్మణ్య స్వామి వాదన. వాస్తవాలు కళ్లెదుట ఉన్నా ఒక చట్టం ఆధారంగా కోర్టు న్యాయాన్ని ఎలా నిరాకరిస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిర్ధారిత సాక్ష్యాలు ఉంటే ఈ చట్టం కారణంగా ఒక కట్టడానికి ఉన్న మత ప్రాధాన్యాన్ని నిరాకరించలేమని సుప్రీంకోర్టు కూడా ఇటీవల వ్యాఖ్యానించింది.

అక్టోబర్‌ 15, 1991: ‌జ్ఞాన్‌వాపిలో కొత్త ఆలయాన్ని నిర్మించుకుని, అక్కడ పూజాదికాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పండిత్‌ ‌సోమ్‌నాథ్‌ ‌వ్యాస్‌, ‌డాక్టర్‌ ‌రామ్‌రంగ్‌ ‌శర్మ వారణాసి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును జిల్లా జడ్జీ ఆగస్ట్ 13, 1998‌కి వాయిదా వేశారు. అయితే వారణాసి కోర్టు ఆదేశాల మీద అలహాబాద్‌ ‌హైకోర్టు స్టే విధించింది.

మార్చి 2000: సోమ్‌నాథ్‌ ‌వ్యాస్‌ ‌మరణించారు. దీనితో ఆ కేసును నిర్వహించే బాధ్యతను 2018లో న్యాయస్థానం న్యాయవాది విజయ్‌శంకర్‌ ‌రస్తోగికి అప్పగించింది. తరువాత రస్తోగి జ్ఞాన్‌వాపిలో సర్వే నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కేసును కోర్టు స్వీకరించడంతోనే జ్ఞాన్‌వాపి మసీదు నిర్వాహకులు సర్వేకు వ్యతిరేకంగా కేసు వేశారు.

ఆగస్ట్ 18, 2021: ‌జ్ఞాన్‌వాపి గోడకు ఉన్న శృంగార గౌరీమాతనే కాకుండా అక్కడ మిగిలి ఉన్న హిందూ దేవతా ప్రతిమలకు పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించారు. పాత దేవాలయం ప్రాంగణంలో కనిపించే, కనిపించని దేవతా మూర్తులను ఆరాధించుకోవడానికి అనుమ తించాలని వారు విన్నవించారు. సర్వే జరిపించాలని ఏప్రిల్‌ 26, 2022‌న కోర్టు ఆదేశించింది. మొదట ముస్లింలు ఇందుకు అంగీకరించక పోయినా తరువాత వెనక్కి తగ్గారు. ఎట్టకేలకు మే 14-16 తేదీలలో సర్వే పూర్తయింది.

మే 16: శివలింగం ఆకృతి బయటపడిందని ఆరోజు వెల్లడైంది. కానీ ఇది వజూఖానాలో ఏర్పాటు చేసిన ఫౌంటేన్‌ అని ముస్లింలు వాదించారు. దీనితో శివలింగం ఉన్న ప్రాంతానికి సీలు వేయవలసిందిగా వారణాసి కోర్టు ఆదేశించింది. మే 17న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను చేపట్టింది.

మసీదులో దొరికిన శివలింగం ప్రస్తుతం ముస్లింల అధీనంలోనే ఉందని, ఆకృతిని మార్చడా నికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హిందువుల తరఫు న్యాయవాది విష్ణు జైన్‌ ‌కోర్టులో ఫిర్యాదు చేశారు. అది శివలింగం కాదని, అది ఫౌంటేన్‌ అని చెప్పడానికి 60 సెంటీమీటర్ల రంధ్రం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ ఉంది.

—————————————————————————————

పీఎఫ్‌ఐ ‌బెదిరింపు

జ్ఞాన్‌వాపి వివాదం కోర్టులలో ఉంది. కానీ ‘ముస్లింల ప్రార్థనా స్థలాలను ఆక్రమించడానికి క్రూరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ) ‌గగ్గోలు మొదలుపెట్టింది. అంతేకాదు, ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావలసిందిగా తన సంస్థ లేదా వర్గం యువకులకి, సభ్యులకి పిలుపును కూడా ఇచ్చింది. మసీదులకు వ్యతిరేకంగా ఏ రకమైన చర్యలనైనా ఎదుర్కొవాలంటూ ట్విటర్‌లో పోస్ట్ ‌చేసింది. ఇదంతా ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర హిందుత్వ శక్తుల కుట్రేనని కూడా తేల్చేసింది. జ్ఞానవాపి మసీదు మీద, మధుర షాహీ ఈద్గా మీద అవాంఛనీయంగా హక్కును కోరుతున్నారని, దీనిని ఎదుర్కొవాలని కూడా సలహా ఇచ్చింది. కొత్తగా మంగళూరు మసీదు మీద కూడా ఆధిపత్యాన్ని కోరుతున్నారని గుర్తు చేసింది. పీఎఫ్‌ఐ ‌కోర్టులను కూడా విడిచిపెట్టలేదు. హిందువులు సాక్ష్యాలుగా ప్రవేశపెడుతున్న అంశాలను అవి పరిశీలించడం లేదని ప్రకటించింది.

జ్ఞాన్‌వాపి సర్వేలో శివలింగం ఆకృతి బయటపడిందన్న వార్త బయటకు రాగానే పీఎఫ్‌ఐ ఈ ‌ట్వీట్‌ను వెలువరించింది. చిత్రం ఏమిటంటే ఈ నెత్తుటి చరిత్రల అకృత్యాల గురించి దేశ వ్యాప్తంగా దర్యాప్తు చేసే పనిలో ఉండగా హిందువుల మీద మతోన్మాదం ముద్ర వేయడానికి పీఎఫ్‌ఐ ‌విఫలయత్నం చేస్తున్నది. జ్ఞాన్‌వాపి వివాదం తరువాతనే  కేరళలోని అళప్పుజాలో జరిగిన ఒక ఊరేగింపులో ఒక పిల్లవాని చేత ఈ సంస్థ మాట్లాడించిన మాటలు దేశం విస్తుపోయేటట్టు చేశాయి. ఈ దేశంలో హిందువులు, క్రైస్తవుల పని పడతామని ఆ పిల్లవాడు అరవడం కనిపించింది. కానీ ఈ నినాదాలు తమవి కాదని ఇప్పుడు పీఎఫ్‌ఐ ‌వాదిస్తోంది. అయితే ఈ ఊరేగింపు నిర్వాహకుల మీద, అక్కడ వినిపించిన నినాదాల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

—————————————————————————————

ఇంతకీ ముస్లింలు ఏమంటారు? ఆ అంశంలోకి వెళ్లే ముందు హిందూ ఆలయాల మీద ముస్లింల దాడుల గురించి కొన్ని అంతర్జాతీయ ఆధారాల గురించి చూద్దాం. కాశీ నగరం మీద, విశ్వేశ్వరుని ఆలయం మీద దాడులు మహమ్మద్‌ ‌గజనీ కాలపు దాడుల నాటివే. అబుల్‌ ‌ఫజల్‌ ‌రాసిన ‘అల్‌ ‌బేహకి’ గ్రంథం ప్రకారం భారత్‌లో గజనీ తరఫు పాలకునిగా ఉన్న అహ్మద్‌ ‌నియాల్‌తిగిన్‌ ‌క్రీస్తుశకం 1033లో ఆ పవిత్ర నగరాన్ని దోచుకున్నాడు. ఉదయం పూట ప్రార్థన సమయంలో మొదలైన దోపిడీ మధ్యాహ్న ప్రార్థనల దాకా సాగిందట. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఔరంగజేబ్‌ ‌కూల్చాడని చెబుతూ ప్రపంచ ప్రఖ్యాత ఇండాలజిస్ట్ ‌జేమ్స్ ‌ప్రిన్సిప్‌ ‌చూపించిన సాక్ష్యాలు ఉన్నాయి. అయినా ముస్లింలు తమ పూర్వీకుల దురాక్రమణల మీద తమకే హక్కు ఉండాలనీ, అవి అలాగే ఉండాలని, దురాక్రమణతో కట్టిన మసీదులే అయినా అవి హిందూ ఆలయాల కంటే పవిత్రమైనవనీ చెబుతున్నట్టే ఉంది. పైగా ఒకసారి ముస్లింల అధీనంలోకి వచ్చిన స్థలం లేదా కట్టడం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ముస్లింలకే అంటే తమ దైవానికే చెందుతాయని వాదిస్తున్నారు. నిజానికి ఇదే అసలు సమస్య. జ్ఞాన్‌వాపి సర్వేకు అనుమతి ఇచ్చిన నాడే, ‘మేం ఒక్క మసీదును కూడా వదిలిపెట్టబోమ’ని అసదుద్దీన్‌ ఒవైసీ యుద్ధభేరీ మోగించారు. గతంలో చట్టవిరుద్ధంగా అయోధ్యను లాక్కున్నా, మరొక మసీదు ఏదీ అప్పగించడానికి సిద్ధంగా లేమని ముస్లింలు అంటున్నారు. అయోధ్య హిందువులదే నంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఇదే ధోరణిని వారు ప్రదర్శించిన సంగతిని గుర్తు చేసుకోవాలి. అయోధ్య ఎప్పటికీ తమదేనని, మళ్లీ స్వాధీనం చేసుకుంటామని మౌల్వీలు చెప్పలేదా? కాబట్టి ముస్లింలు వెనక్కి తగ్గరు. వాళ్లు మైనారిటీలు కాబట్టి, వాళ్లని నొప్పించడం సెక్యులరిస్టులకి నచ్చదు. కాబట్టి హిందువులే రాజీ పడాలని వారి కోరిక. రుజువులతో సహా ప్రార్థనా స్థలాలు హిందువులవేనని తెలుస్తున్నా, మళ్లీ హిందువులే రాజీ పడాలని చెప్పే ఏ శాసన్నానైనా వారు ఎలా గౌరవిస్తారు? ఎందుకు గౌరవించాలి? ఐదువేల ఏళ్ల నాగరికత ఉన్న దేశంలో 1991 చట్టం చలామణి ఎంతటిదన్న ప్రశ్న అందుకే వచ్చింది. పైగా ముస్లింలలో కనిపిస్తున్నది ఏ రోటి దగ్గర ఆ పాట అన్నట్టే ఉంది. 370 రద్దుకు సంబం ధించిన మూలాలు రాజ్యాంగంలోనే ఉన్నప్పటికీ వాటిని గౌరవించడానికి నిరాకరించిన వారు, ఇప్పుడు 1991 చట్టాన్ని గౌరవించాలంటూ ఎలా చెప్పగలరని కూడా హిందు వులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ సెక్యులరిస్టుల రాజీ మార్గం ఏమిటి? అయోధ్య వివాదం సమసిపోయింది. కాశీ, మధురలను హిందు వులకు అప్పగించే రీతిలో ఇరు వర్గాలు రాజీ పడడం దేశానికి మంచిదని కొందరు సుద్దులు చెబుతు న్నారు. అంటే ఆ మూడూ తీసుకుని హిందువులు సంతోషమేనని ప్రకటించాలి. మొదట ఈ రాజీ సూత్రాన్ని ముస్లింలు అంగీకరిస్తారేమో కనుక్కుంటే మంచిది. జ్ఞాన్‌వాపి, మధుర ఈద్గాలను శాంతియుతంగా హిందువులకు అప్పగిస్తారేమో అడగాలి.

ఢిల్లీలో కుతుబ్‌ ‌మీనార్‌ ‌దాదాపు పాతిక హిందూ దేవాలయాలను కూల్చి కట్టినదని భారత పురావస్తు శాఖ నివేదిక ఇచ్చింది. ఇటీవల మంగళూరులో ఒక మసీదును పునర్‌ ‌నిర్మించడానికి కూల్చితే దాని కింద, పక్కన హిందూ ఆలయాల ఆనవాళ్లు బయట పడ్డాయి. తాజ్‌మహల్‌లో కూడా సర్వే చేయించాలని కొందరు కోరారు. అది తాజ్‌ ‌మహల్‌ ‌కాదు, తేజో మహల్‌ అనే శివాలయమన్న వాదన ఇప్పటిది కూడా కాదు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే 140 వరకు ఇలాంటి వివాదాలు ఉన్నాయి. జ్ఞాన్‌వాపి మసీదును సర్వే చేయించడానికి కోర్టు ఆదేశించిన తరువాత దేశంలో పలుచోట్ల మసీదుల సర్వే కోసం విన్నపాలు వెల్లువెత్తాయి. కోర్టుల మాట పట్టదు. పురావస్తు శాఖ ఆధారాలు నమ్మమని చెబుతారు. ఒక్క మసీదును కూడా వదలబోమని చెబుతున్నారు. మరి ఇలాంటి వర్గంతో హిందువులు తలొంచుకుని రాజీకి రావాలని మేధావులు, సెక్యులరిస్టులు ఎలా కోరతారు? కాబట్టి కోర్టుల నిర్ణయమే తుది నిర్ణయం కావాలి. జ్ఞాన్‌వాపి అంటే జ్ఞానపు బావి. ఇప్పుడు చారిత్రక జ్ఞానాన్ని తోడిస్తున్న బావిగా కనిపిస్తున్నది.

జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram