సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ మాఘ శుద్ధ త్రయోదశి

14 ఫిబ్రవరి 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


సరే, ‘నదుల అనుసంధానం పెద్ద జోక్‌’ అన్నారు. అలాగే, ‘గోదావరి జలాల గురించి ట్రైబ్యునల్‌లో కేసు ఉంది. ఈ జలాల్లో ప్రతి బొట్టు మీద తెలుగు రాష్ట్రాలకే అధికారం ఉంది. మాకు హక్కు ఉన్న జలాలను కావేరిలో ఎలా కలుపుతారు? అభిప్రాయాలు తీసుకోకుండా బడ్జెట్‌లో ఏ అధికారంతో ప్రకటిస్తారు?’ అన్నారు. ఇవన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫిబ్రవరి 1న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వేసిన ప్రశ్నలు. కేసీఆర్‌ ‌వాగ్ధాటి తెలియనిదా? ఇంతకీ ఆయనది బడ్జెట్‌ 2022 ‌రాష్ట్రాన్ని చిన్న చూపు చూసిందన్న వేదనా? లేక బీజేపీ మీద మండిపాటా, లేకుంటే రెండూనా? అర్థం కానంతగా ఆ వాక్ప్రవాహం సాగింది. అవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నవే. సరే. మరి, ఏ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని, భావ సారూప్యత కలిగిన ఏ రాజకీయ పార్టీని, ఏ ఎంపీల బృందాన్ని, ఏ ఎమ్మెల్యేల సమూహాన్ని అడిగి, ఏ మేధావుల వేదికతో చర్చించి కేసీఆర్‌ ‌కొత్త రాజ్యాంగం కావాలంటూ హఠాత్తుగా ప్రకటించారు? ఏ చర్చావేదిక సారమది? ఇలాంటి ప్రకటనతో కేసీఆర్‌ ‌నిస్సందేహంగా పెద్ద తప్పిదమే చేశారు. కొత్త సమస్యలనీ స్వాగతించారు.

కొత్త రాజ్యాంగం కావాలని చెప్పడమంటే పాత రాజ్యాంగాన్ని కాదనడమే.  రాజ్యాంగాన్ని కాలానుగుణంగా సవరించాలని చెప్పడం వేరు. సమూలంగా నిరాకరించాలంటూ బల్లగుద్దడం వేరు. ఈ రెండో భావన, అందులోని భాష ప్రజాస్వామ్యవాదులకు సరికాదు. రాజ్యాంగాన్ని సమూలంగా పక్కన పెట్టి, కొత్త రాజ్యాంగం కావాలని అనడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన, రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి అసలే భావించదగినది కాదు. కేసీఆర్‌ ‌చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రే కావచ్చు, ఒక ప్రాంతీయ పార్టీ అధినేతే కావచ్చు. కానీ ఆ పదవి రాజ్యాంగబద్ధం. అలాంటి పదవిలో ఉన్నవారు-కనీసం, సార్వభౌమాధికారానికి సంబంధించిన ఇలాంటి అంశంలోనైనా, బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుండేది.

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలు దేశ ప్రజలు వినవలసి రావడం బాధాకరమే. ఇవన్నీ భారత సార్వభౌమాధికారం ఔన్నత్యాన్ని కించపరచడానికి కొన్ని అవాంఛనీయ శక్తులకు ఆస్కారం కల్పిస్తాయి. ఒక దేశానికి, జాతికి రాజ్యాంగంతోనే సార్వభౌమాధికారం వస్తుందన్న వాస్తవం తెలియనది కాదు. అలాంటి సమున్నత వ్యవస్థ మీద తొందరపాటు వ్యాఖ్యలు చేయడం, ఒక పార్టీ మీద ఆగ్రహాన్నో, ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతనో వ్యక్తం చేయడానికి రాజ్యాంగాన్ని వాడుకోవడం వ్యవస్థకు ఎలా మంచిదవుతుంది?

వ్యవస్థలో లోపాలు లేవని ఎవరూ అనలేరు. కానీ ఆ లోపమంతా రాజ్యాంగానిదేనని నిర్ధారించడం అనర్థదాయకం. తప్పు రాజ్యాంగానిది కాదు, అది అమలవుతున్న తీరుదే సుమా అంటూ అనేక సందర్భాలలో న్యాయస్థానాలు, పెద్దలు చెప్పిన మాటను ఎవరూ విస్మరించరాదు. రాజ్యాంగాన్ని అవసరం మేరకు సవరించుకుంటూనే ఉన్నాం. 2021 అక్టోబర్‌ ‌వరకు 105 పర్యాయాలు సవరించుకున్నాం కూడా. నిజానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950లోనే సవరణ అవసరమైతే చేశారు. అదే తొలి సవరణ. అంటే మనది కఠిన రాజ్యాంగం కాదు. సరళ రాజ్యాంగమే. అసలు తనను సవరించే అధికారం రాజ్యాంగమే పార్లమెంటుకు దఖలు పరిచిన సంగతిని మరిచిపోతే ఎలా?

నిజానికి మన రాజ్యాంగం రూపుదిద్దుకున్న క్రమాన్ని వేలెత్తి చూపడం సులభం కాదు. ఈ దేశ ఆ సమున్నత చట్టం బలమంతా అక్కడే ఉంది. బ్రిటిష్‌ ‌పతాకం దిగుతున్న వేళ, ఇక్కడి ప్రావిన్సుల నుంచి 299 మంది ఎన్నికై రాజ్యాంగ పరిషత్‌లో సభ్యులయ్యారు. మరొక 93 మంది సంస్థానాల ప్రతినిధులు. పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ‌రాజేందప్రసాద్‌. ‌ముసాయిదా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌. ‌వీరి సమున్నత వ్యక్తిత్వాలకూ, నేపథ్యానికీ తోడు, మిగిలిన సభ్యుల స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ఉంది. వీరు సర్వం త్యాగం చేసినవారు. ఎక్కువ మంది న్యాయనిపుణులు. గొప్ప విద్యావంతులు. ప్రజల మధ్య నుంచి వచ్చినవారు. వీరంతా కలసి రాజ్యాంగానికి రూపురేఖలు ఇచ్చారు. సోషలిజం, సెక్యులరిజం వంటి భావనలు తరువాత వచ్చాయి. ఇందులో సెక్యులరిజం అనే భావనను ఎక్కువ పార్టీలు భష్ట్రు పట్టించిన మాట దాచేస్తే దాగని సత్యం. సెక్యులరిజం చుట్టూ తిరిగిన భ్రష్ట రాజకీయా లతో రాజ్యాంగం అమలు చాలా సందర్భాలలో భంగపడింది. స్వతంత్ర భారతదేశానికి పెద్ద తలనెప్పి ఇదే. ఇలాంటివి ఇంకొన్ని ఉన్నా, స్వాతంత్య్ర పోరాటం, పోరాటయోధులు మనకిచ్చిన సమైక్యతా దృష్టికి, మత సామరస్యా నికి సెక్యులరిజం పేరుతో వక్రీకరణలు సాగిపోతున్నాయి. ఇలాంటి సమస్యలో కుళ్లు రాజకీయాల ప్రమేయాన్ని అంచనా వేయకుండా, రాజ్యాంగం మీద నెపం నెట్టడంతోనే సమస్య తలెత్తుతున్నది.

 దేశ నాయకత్వం నుంచి స్వాతంత్య్రోద్యమ తరం కనుమరుగైనాక ఈ దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థలను సమైక్యంగా ఉంచగలుగుతున్నది రాజ్యాంగమేనన్న వాస్తవికతను విస్మరించడం ఒక గొప్ప వారసత్వ తాత్త్వికతకు దూరం కావడం వల్లనే. అందరికీ సమానావకాశాలు అన్న సమతా సూత్రమే ఈ దేశ ప్రజలకు ఆశాజ్యోతి అనీ, అందుకు రాజ్యాంగమే భరోసా అనీ మరచిపోతే ఎలా? పూవుకు తావి అబ్బినట్టు సాంస్కృతిక ఏకత్వమున్న దేశానికి రాజకీయ ఏకత్వాన్ని అద్దినది ఈ రాజ్యాంగమే! భారత్‌ ‌వంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న, పురాతన చరిత్ర కలిగిన, వందల ఏళ్లు బానిసత్వంలో ఉండి స్వాతంత్య్రం పొందిన దేశాన్ని ఏడు దశాబ్దాల పాటు నడిపించిన ఘనత ఈ రాజ్యాంగానిదే. ఆ రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఒక వ్యక్తి, ఎంతటివాడైనా ఆశుకవిలా చెప్పడం ఎప్పటికీ ఒక వింత, వికృత ప్రతిపాదనగానే మిగిలిపోతుంది.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram