సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ  మాఘ బహుళ పంచమి

21 ఫిబ్రవరి 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఇదంతా ‘2024 ఎన్నికలలో నరేంద్ర మోదీనీ, బీజేపీనీ ఓడించడానికి’ సన్నాహం. ముందే తేలిపోయింది. ఓ మూడురోజుల పాటు గొంతు ఎండిపోయేటట్టు బీజేపీనీ, మోదీనీ దుమ్మెత్తి పోసిన కె. చంద్రశేఖరరావుకు మమతా బెనర్జీ నుంచి ఫోన్‌ ‌వచ్చింది. అన్ని విషయాలు మాట్లాడదాం, నాకు మాత్రం దోశ తినిపించాలని దీదీ అన్నారని కేసీఆర్‌ ‌చెప్పారు. ఇప్పుడు బీజేపీ మీద వేడితో ఓ సంగతి ఆయన గమనించలేదు కానీ, హైదరాబాద్‌ ‌బిరియానీ అడగకుండా, దోశ అడగడమేమిటి? అని దీదీని నిలదీసేవారే కేసీఆర్‌. ఆకర్షణ, వికర్షణ, ఘర్షణ సమపాళ్లలో మేళవించిన ఈ విపక్ష నాయకత్వానికి ప్రభుత్వమంటే ఎన్నికలు, పదవుల వేట. కుటుంబ పాలన. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వీళ్ల నిర్వచనాలు వీళ్లవే. పోలింగ్‌లో ప్రదర్శించే బీభత్సాన్ని, ప్రతిపక్షాల మీద హత్యాకాండను అరికట్టడానికి కేంద్ర బలగాలు దింపితే, అది రాష్ట్రం మీద ఢిల్లీ పెత్తనం. రాష్ట్రంలో ఇష్టారాజ్య నియామకాలు, వ్యవహారాలు కుదరవని, ఇది మీ జాగీరు కాదని చెప్పబోతే ఫెడరల్‌ ‌వ్యవస్థను బలహీనం చేయడం. ఇక, ఏమిటీ కుటుంబ పాలన అంటూ నిలదీయడం సాక్షాత్తు ప్రజాస్వామ్యానికి పాతర వేయడమే. ప్రతి బీజేపీయేతర ముఖ్యమంత్రి ధోరణి దాదాపు ఇదే. ప్రజాస్వామ్యం, ఫెడరల్‌ ‌వ్యవస్థ, రాజ్యాంగం వంటి భారత మౌలిక వ్యవస్థలలో మార్పులు, సార్వభౌమాధికారానికి సంబంధించిన కీలక అంశాలు ఈ ముఖ్యమంత్రులకి కేవలం ఎన్నికల అంశాలు. 135 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తు ఒక్క ఎన్నిక గెలుపోటములకు ముడిపెట్టే హ్రస్వదృష్టి కూడా.

ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల నేపథ్యంలో ఆ ముగ్గురు ముఖ్య మంత్రుల తాజా ముచ్చట పాత ముచ్చటనే తాజాగా ఆవిష్కరించింది. ఆ ఐదింటిలో ఉత్తరప్రదేశ్‌ ఉం‌డడం, అక్కడ స్థానాల సంఖ్య తగ్గినా మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న వార్తే వీళ్లని ఆనందడోలికల్లో ముంచెత్తుతోంది. అంటే ఇంకో రెండేళ్లలో జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి ఆ రాష్ట్రంలో బీజేపీ ఇంకా నీరసిస్తుందని, ఈలోగా తాము కాస్త కాలూ చేయీ కూడదీసుకుంటే మోదీని దింపవచ్చునని ఆ అల్పసంతోషుల దింపుడు కళ్లం ఆశ.

ఇంతేకాదు, మూడో ఫ్రంట్‌ అం‌శాన్ని తెర మీదకు తీసుకొస్తున్న ప్రతిసారి ప్రజల బుద్ధికి పదును పెడుతూ కొత్త ప్రశ్నలను కూడా దేశం ముందుంచుతున్నారు. దేశ సమాఖ్య స్వరూపాన్ని ఎట్టి పరిస్థితులలోను రక్షించుకుంటారట. సమాఖ్య గురించి మమత మాట్లాడడం ఎంత వికృతమో ఆమె రాష్ట్రానికి సంబంధించిన సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ ‌వారిని అడిగినా తెలుస్తుంది. సమాఖ్య రక్షణోద్యమంలో తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో కలసి ముందుకు వెళతారటామె. ఇంతకీ దీదీతో కలసి సాగే ముందు కేసీఆర్‌ ఒక విషయం స్పష్టం చేయడం తక్షణావసరం. మొన్న ప్రగతి భవన్‌ ‌విలేకరుల సమావేశంలో అవసరమైతే కొత్త పార్టీ పెడతామని చెప్పారు. ఇప్పుడు ఆయన మమత, స్టాలిన్‌లతో కలసి మూడో ఫ్రంట్‌తో నడుస్తారా? లేక నాడు బెదిరించినట్టు కొత్త పార్టీ పెట్టాక, ‘ఢిల్లీ కోటలు బద్దలు కొట్టి, భారతీయ జనతా పార్టీని దేశం నుంచి తరిమి కొడతారా?’ తెలిస్తే మంచిది. ఇందులో ఆయన ఏం చేస్తారు? ఇదొక ప్రశ్న.

మహారాష్ట్రలో మహా వికాస్‌ అగాడి ముఖ్యమంత్రిని కూడా మా వెంట తీసుకుపోతామని కేసీఆర్‌ అం‌టున్నారు. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక కూటమి, కేసీఆర్‌ ‌బీజేపీ-మోదీ వ్యతిరేక కూటమి, బీజేపీ- హిందీ-హిందూ వ్యతిరేక స్టాలిన్‌ ‌దుకాణం ఒక విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అది వీళ్లెవరూ కాంగ్రెస్‌ను దరిచేరనివ్వరట. అలాంటిది, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఊతకర్రతో నిలబడి ఉన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ‌ఠాక్రే, దానిని త్యాగం చేసి దభీమని కిందపడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇదొక ప్రశ్న.

ఇంకొక ప్రశ్న. మోదీనీ, బీజేపీనీ గద్దె దించే పనిలో మాతో కలసి రావలసిన బాధ్యత సెక్యులరిస్టులమని చెప్పుకునే వాళ్లకి ఉంది. అది వాళ్ల కర్తవ్యం. అందుకే సీపీఎం, కాంగ్రెస్‌లను రమ్మని నేను కోరాను అని చెప్పారు మమత. ఇంతవరకు బాగానే ఉంది. తన మాట వినకపోతే వాళ్ల దారిన వాళ్లు పోవచ్చు. మా దారిన మేం పోతాం, అని తెగేసి చెప్పారు కూడా. ఆమె మాట తీరు తెలిసిన వారు దీనికి ఆశ్చర్యపోరు గాని, కాస్త విజ్ఞత ఉన్నవాళ్లు మాత్రం ఇది ఒక ప్రత్యామ్నాయ వేదికకు నాయకత్వం వహించేవారికి ఉండవలసిన లక్షణమేనా అని ప్రశ్నించుకోకుండా ఉండలేరు. ఇదో ప్రశ్న. ఈ ముగ్గురు కుటుంబ పాలన ఆరోపణలను ఎదుర్కొంటున్నవారే. గాంధీ-నెహ్రూ కుటుంబ పాలన తరువాత మళ్లీ రాష్ట్రాల నుంచి కేంద్రానికి కుటుంబ పాలన జాడ్యాన్ని పాకిస్తారా? ఇదంతా కుటుంబ పాలన కూహకమేనా? కావచ్చు. అప్పుడు అళగిరి, కనిమొళిని స్టాలిన్‌, ‌కేటీఆర్‌, ‌కవితలను కేసీఆర్‌, అభిషేక్‌ను మమత అసంతృప్తి నుంచి సులభంగా బయట పడేయవచ్చు. ఈ ప్రయత్నం ఆ ప్రయోజనం నెరవేర్చవచ్చు కూడా.

రాష్ట్ర సమస్య తలెత్తినప్పుడు, బీజేపీ బలపడుతుంటే, లేదంటే ప్రధాని పదవి మీద మోజుతో కొందరు ముఖ్యమంత్రులు మోదీకి వ్యతిరేకంగా మోళీ కట్టడం పరిపాటయింది. లావణ్య అనే బాలిక మృతి గొడవ నుంచి తమిళుల దృష్టి మరల్చాలన్నది స్టాలిన్‌ ‌బాధ. తెలంగాణలో బీజేపీ విస్తరణ కేసీఆర్‌ ‌బాధ. ప్రధాని పదవి దీదీ దుగ్ధ. ఈ ముగ్గురు ప్రస్తుతానికి ఒకటయ్యారు. కానీ బీజేపీకి ఎన్నికలే ముఖ్యం కాదు. అందులో గెలుపోటములు ప్రధానం కాదు. బీజేపీ వరకు భారతదేశమంటే మాతృభూమి. ఈ నేల రక్షణ వారి ప్రథమ కర్తవ్యం. అది టీఎంసీ, టీఆర్‌ఎస్‌, ‌డీఎంకేలకు, వాటి నేతలకు అర్థం కావడం సులభం కాదు. అందుకే మమత దోశ కోరిక మాటేమో గాని, ఇదంతా మళ్లీ ఆశ దోశ అప్పడం వ్యవహారమే అవుతుందనిపిస్తుంది.

About Author

By editor

Twitter
Instagram