– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు రూపాయి కూడా కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో వైకాపా ప్రభుత్వానికి కేంద్రం నిర్మించే సదుపాయాలే శ్వాసను అందించనున్నాయి. 2014 నుంచి 2022 వరకు ఈ రాష్ట్రంలో ఎన్నికైన తెదేపా, వైకాపా ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల్లో ప్రధాన అంశాలైన రహదారులు, రైల్వేలకు చేసిందేమీ లేదు. ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం అయితే చిల్లి గవ్వ కూడా విదిలించడం లేదు. కేంద్రం రైల్వేలు, రోడ్లు నిర్మించకపోతే రాష్ట్రం తీవ్రంగా రవాణా సమస్యలు ఎదుర్కొనేది. ఇలాంటి పరిస్థితుల్లో మరల కేంద్ర ప్రభుత్వం 2022-23 ఏడాదికి రూపొందించిన బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్రానికి కూడా మేలు జరగనుంది.

పీఎం గతిశక్తి పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా నిర్మించనున్న కనెక్టివిటీలో ఆంధప్రదేశ్‌ ‌ప్రయోజనం పొందనుంది. ఆరు, నాలుగు లైన్ల రహదారులు, ప్రజారవాణా, గూడ్స్ ‌రవాణాలకు ప్రత్యేక రైల్వేలైన్లు, విమానాశ్రాయాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త ఓడరేవుల నిర్మాణం, సాగరమాల ద్వారా వాటికి రహదారుల అనుసంధానం పెద్ద ఎత్తున జరుగనుంది. దీంతో మౌలిక సదుపాయాలు భారీగా పెరిగి ఆంధప్రదేశ్‌కు లాభం జరగనుంది. 100 కి.మీ. వేగంతో వెళ్లే రైల్వే సరుకు రవాణా వ్యవస్థ ఏర్పాటుకానుంది. రాష్ట్రం విడిపోయాక ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పలురకాల పథకాలు, కేంద్ర సంస్థలు, రహదారులు, రైల్వేలైన్లు, విమాన, ఓడరేవులు వంటి సదుపాయాలు పెంచింది. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి 2020 నుంచి 2025 వరకు రవాణా, శక్తివనరులు, సామాజిక సంక్షేమం, నీటిపారుదుల, ప్రజారోగ్యం, కమ్యూని కేషన్లకు సంబంధించి రూ. 8,16,583 కోట్ల విలువైన 503 జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదించారు. దశలవారీగా చేపట్టే ప్రాజెక్టు పనుల కోసం 2020లో రూ.1,31,358 కోట్లు, 2021లో రూ.174340 కోట్లు, 2022లో రూ.1,59,787 కోట్లు, 2023లో రూ.1,21,170 కోట్లు, 2024లో రూ.1,00,818 కోట్లు, 2025లో రూ.83,898 కోట్లు కేటాయించారు. ఈ పనులకు పీఎం గతిశక్తి పథకం ఊతం ఇవ్వనుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా బడ్జెట్‌ ‌దేశ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా పీఎం గతిశక్తి పథకానికి నిధుల కేటాయింపుతో వేగం పుంజుకోనుంది. ఈ పథకం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ మానస పుత్రికగా అభివర్ణించవచ్చు. దేశంలో మౌలిక సదు పాయాల కల్పన కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2021 అక్టోబర్‌లో దీనిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను మెరుగు పర్చడానికి ఉద్దేశించిన ఈ పథకం ద్వారా 25 వేల కిలో మీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి రూ. 20 వేల కోట్లు ఖర్చుచేయనున్నారు. 2022-23 బడ్జెట్‌లో కేటాయించే నిధులే కాకుండా అదనంగా నిధులను సేకరించి ఖర్చు చేయనున్నారు. గతిశక్తి పథకంలో భాగంగానే, కొత్త తరహా 400 వందే భారత్‌ ‌రైళ్లను ప్రవేశపెడతారు. దేశ వ్యాప్తంగా వందకు పైగా కార్గో టెర్మినల్స్ ‌నిర్మిస్తారు. 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి అవుతుంది. రైల్వే ప్రాజెక్టులు 2026 లోపల పూర్తి కావచ్చు. గతిశక్తి పథకాన్ని మోదీ ప్రారంభించిన తర్వాత గడ్కరీ దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఈ పథకం గురించి వివరించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. ఈ ప్రాజెక్టు 2025 లోగా పూర్తి అయ్యేట్టు చూడటానికి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారాన్ని ఆయన కోరారు. జాతీయ రహదారుల అభివృద్ధిని మాజీ ప్రధాని వాపేయి స్వర్ణ చతుర్భుజీ పథకంలో భాగంగా గతంలో నిర్వహించారు. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా నాలుగు, ఆరు లైన్ల జాతీయ రహదారులను అభివృద్ధి పర్చారు. ఇప్పుడు గతి శక్తి పథకంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా రహదారుల శాఖ మంత్రులను కూడా భాగస్వాములుగా చేయనున్నారు.

రైల్వేలకు జవసత్వాలు

పీఎం గతిశక్తికి అండదండలు అందించేటు వంటి ఏడు అంశాల్లో రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మాస్‌ ‌ట్రాన్స్ ‌పోర్టు, జల మార్గాలు, ఇంకా లాజిస్టిక్స్‌కి సంబంధిం చిన మౌలిక సదుపాయాల కల్పన జరగనుంది. ఇందులో రైల్వేవ్యవస్థకు జవజీవాలు అందనున్నాయి. ముఖ్యంగా సరుకు రవాణాకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయడం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకుం టారు. ఆంధప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ‌పశ్చిమబెంగాల్‌, ఒడిశాల్లోని ముఖ్య నగరాలు, పారిశ్రామిక/వాణిజ్య సంస్థలు, తీర ప్రాంతాల్లోని రేవులకు సరుకు రవాణా లైన్ల వల్ల అధిక ప్రయోజనం చేకూరనుంది. డెడికేటెడ్‌ ‌ఫ్రెయిట్‌ ‌కారిడార్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (డీఎఫ్‌డీసీ) 2006లో ఏర్పడినప్పటికీ, 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ‘గతిశక్తి’లో భాగంగా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం లభించడంతో కార్పొరేషన్‌ అతి వేగంగా పనులు ప్రారంభించింది. కార్పొరేషన్‌కు ప్రపంచ బ్యాంకు, జైకా(జపాన్‌) ‌నుంచి రూ.30 వేల కోట్ల రుణం రాగా.. మిగతా మొత్తాన్ని భారతీయ రైల్వే సమకూరుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ కారిడార్‌లో 1,500 కి.మీ., తూర్పు కారిడార్‌లో 1,700 కి.మీ. మేర ప్రత్యేక రైల్వే లైన్ల నిర్మాణం కొనసాగుతోంది. తూర్పున 351 కి.మీ., పశ్చిమాన 641 కి.మీ. రైల్వే లైన్లు పూర్తయ్యాయి. రెండు కారిడార్లలో ఇప్పటివరకు 20,198 రైళ్లు నడిచాయి. ఈస్ట్‌కోస్ట్ ‌కారిడార్‌లో ఖరగ్‌పూర్‌ ‌నుంచి విజయవాడ (1,115 కి.మీ.), నార్త్-‌సౌత్‌ ‌కారిడార్‌లో ఇటార్సీ నుంచి విజయవాడ (975 కి.మీ.), న్యూపాల్ఘర్‌ ‌నుంచి ఖరగ్‌పూర్‌ ‌వరకు ఈస్ట్-‌వెస్ట్ ‌కారిడార్‌ల నిర్మాణానికి డీపీఆర్‌ ‌పూర్తయింది.

ఏపీలో తొలి దశ ఇలా..

డెడికేటెడ్‌ ‌ఫ్రెయిట్‌ ‌కారిడార్‌ ఉత్తర-దక్షిణ కారిడార్‌ ఆం‌ధప్రదేశ్‌కు పెద్ద ఎత్తున రవాణా సౌకర్యాలు కల్పించి సంపద సృష్టికి దోహదపడ నుంది. రాష్ట్రంలోని గనులు, సిమెంట్‌ ‌ప్లాంట్లు, థర్మల్‌ ‌విద్యుదుత్పత్తి కేంద్రాలు, పెట్రోలియం, ఆయిల్‌ ‌ల్యూబ్రికంట్‌ ‌పరిశ్రమలకు ఈ లైన్ల ద్వారా మేలు కలుగుతుంది. ముఖ్యంగా థర్మల్‌ ‌ప్లాంట్లు, ఎన్టీపీసీ, సిమెంట్‌ ‌ప్లాంట్లు, హెచ్‌పీసీఎల్‌, ‌బీపీసీఎల్‌ ‌సంస్థలు, కంటైనర్‌ ‌కార్పొరేషన్‌, ఎఫ్‌సీఐ గోదాములు, అనేక వ్యవసాయ, ఆహారశుద్ధి, ఆహారోత్పత్తుల పరిశ్రమలు, ఆటోమొబైల్‌ ‌రంగం, జౌళి, మెటల్‌ ‌పరిశ్రమలకు ప్రత్యేక సరుకు రవాణా లైన్ల ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ప్రత్యేక లైన్ల ద్వారా వ్యాపార/ఉత్పత్తి రంగాలు ఊపందుకుంటాయి. ఖరగ్‌ ‌పూర్‌ ‌నుంచి 1,115 కిలోమీటర్ల మేర నిర్మించనున్న కారిడార్‌ ‌ద్వారా.. పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లోని కీలకమైన వ్యాపార/వాణిజ్య/పరిశ్రమలకు రవాణా భారం తగ్గుతుంది. విశాఖ ఉక్కు, ఎన్టీపీసీ సింహాద్రి, విజయవాడ థర్మల్‌, ‌మద్రాస్‌ ‌సిమెంట్స్, ‌మై హోం సిమెంట్స్, ‌కోరమండల్‌, ‌నాగార్జున ఎరువుల సంస్థలు, విశాఖ, గంగవరం, కాకినాడ రేవులు, ఎఫ్‌సీఐ, కంటైనర్‌ ‌కార్పొరేషన్‌ ‌గోదాములకు నేరుగా ప్రత్యేక లైన్లను నిర్మిస్తారు.

కేంద్రం బడ్జెట్‌లో ఈ ఏడాది ఆంధప్రదేశ్‌కు రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం రూ.7,032 కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఇది 21 శాతం అధికం. ఇందులో నడికుడి-శ్రీకాళహస్తి (309 కి.మీ.) కొత్త రైల్వే ప్రాజెక్టు పనుల కోసం రూ.1,501 కోట్లు, కోటిపల్లి-నర్సాపూర్‌ ‌కొత్త లైనుకు రూ.358 కోట్లు, కడప-బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, విజయవాడ-గూడూరు 3వ లైను ప్రాజెక్టు కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు. అలాగే విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నర్సాపూర్‌-‌నిడదవోలు డబ్లింగ్‌, ‌విద్యుదీకరణ పనులకు రూ.1,681 కోట్లు, గుంటూరు-గుంతకల్‌ ‌డబ్లింగ్‌కు రూ.803 కోట్లు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్‌కు రూ.100 కోట్లు, ధర్మవరం-పాకాల సెక్షన్‌ ‌మధ్య విద్యుదీకరణకు రూ.131 కోట్లు, నంద్యాల-ఎర్రగుంట్ల సెక్షన్‌లో విద్యుదీకరణ కోసం రూ.51 కోట్లు కేటాయించారు. ఇక కర్నూలు మిడ్‌లైఫ్‌ ‌రిహాబిలిటేషన్‌ ‌ఫ్యాక్టరీకి రూ.58 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్‌లో దక్షిణం వైపు ప్రవేశద్వారం అభివృద్ధికి రూ.3 కోట్లు, తిరుచానూరు స్టేషన్‌ అభివృద్ధికి రూ.6.5 కోట్లు కేటాయింపులు జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ‌పరిధిలోని లెవల్‌ ‌క్రాసింగ్‌, ‌బ్రిడ్జిలు ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మాణాలకు మొత్తం కలిపి రూ.758 కోట్లు, ట్రాఫిక్‌ ‌పునరుద్ధరణ పనులకు రూ.1,040 కోట్లు, ‘కవచ్‌’ ‌కోసం రూ.54 కోట్లు కేటాయించారు. కాజీపేట-విజయవాడ 3వ లైన్‌ ‌ప్రాజెక్టుకు రూ.592.5 కోట్లు, ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, మహారాష్ట్ర పరిధిలోని విజయవాడ (19.5 కి.మీ.), కాజీపేట (10.65 కి.మీ.), రేణిగుంట (9.6 కి.మీ.), వాడి (7.6 కి.మీ.), గుత్తి (3.8 కి.మీ.) వద్ద బైపాస్‌ ‌లైన్లకు రూ.407.47 కోట్లు, జోన్‌ ‌మొత్తాన్నీ కవర్‌ ‌చేస్తూ 473 కి.మీల మేర అకోలా-ఖాండ్వా-రాట్లం మధ్య గేజ్‌ ‌మార్పిడి ప్రాజెక్టు కోసం రూ.888 కోట్లు కేటాయించారు.

జాతీయ రహదారుల ద్వారా లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ఒక్క రూపాయి కేటాయించకున్నా కేంద్ర నిధుల వల్లే రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి జరుగుతోంది. 2014 నుంచి నేటివరకు రాష్ట్రంలో ప్రధాన జాతీయ రహదారులు ఎంతో వేగంగా అభివృద్ధి చెందు తున్నాయి. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు, విజయవాడ నుంచి హైదరాబాదుకు ఆరు లైన్ల రహదారులు పూర్తికావచ్చాయి. రాజధాని అమరావతి కేంద్రంగా రింగ్‌రోడ్డు, బెంగుళూరు నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే, కృష్ణానదిపై మరో రెండు వంతెనలు, ఇవి కాక రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలను కలుపుతూ 4 లైన్ల రహదారులు నిర్మించారు. ఇక ఈ కేంద్ర బడ్జెట్‌లో మరోసారి రోడ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్‌ ‌హైవేలను విస్తరించాలని నిర్ణయించారు. ఎక్స్ ‌ప్రెస్‌ ‌వేలకు సంబంధించి పీఎం గతిశక్తి మాస్టర్‌ ‌ప్లాన్‌ను రూపొందించనున్నారు. 2022-23లో 25 వేల కిలోమీటర్ల మేర నేషనల్‌ ‌హైవేలను నిర్మించాలనేది లక్ష్యం. ఇందుకోసం బడ్జెట్‌లో రోడ్‌ ‌ట్రాన్స్‌పోర్టు అండ్‌ ‌హైవేస్‌ ‌మినిస్ట్రీకి రూ.1,99,107.71 కోట్లు కేటాయించారు. దీనికి అదనంగా మరో రూ.20 వేల కోట్లను సేకరిస్తారు. పబ్లిక్‌, ‌ప్రైవేట్‌ ‌పార్టనర్‌షిప్‌ (‌పీపీపీ)లో భాగంగా నాలుగు మల్టీ మోడల్‌ ‌లాజిస్టిక్స్ ‌పార్కులను ఏర్పాటు చేయనున్నారు. గతేడాది రోడ్డు ట్రాన్స్‌పోర్టుకు బడ్జెట్‌ ‌లో రూ.1,18,101 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి నిధులను 68 శాతం పెంచింది. గతేడాది నేషనల్‌ ‌హైవేస్‌ అథారిటీకి రూ.76,665 కోట్లు కేటాయించగా, ఈసారి 133 శాతం పెంచి.. రూ.1,34,015 కోట్లు కేటాయించింది. దేశంలో 2019-20లో 10,237 కిలోమీటర్ల మేర నేషనల్‌ ‌హైవేలను నిర్మించగా.. 2020-21లో 13,327 కిలోమీటర్ల మేర నిర్మించారు. 2019-20లో రోజుకు 28 కిలోమీటర్ల మేర రోడ్లు వేయగా, అది 2020-21లో 36.5 కిలోమీటర్ల (30.2%)కు పెరిగింది. ఇక 2021-22లో సెప్టెంబర్‌ ‌వరకు 3,824 కిలోమీటర్ల మేర నేషనల్‌ ‌హైవేలు నిర్మించారు. మన దేశంలో 2019 మార్చి 31 వరకు నేషనల్‌ ‌హైవేలు, స్టేట్‌ ‌హైవేలు, జిల్లా, రూరల్‌, అర్బన్‌ ‌రోడ్లన్నీ కలిపి 63.71 లక్షల కిలోమీటర్ల మేర ఉన్నాయి. రోడ్డు నెట్‌వర్క్‌లో ప్రపంచవ్యాప్తంగా మనమే రెండో స్థానంలో ఉన్నాం.

About Author

By editor

Twitter
Instagram