యథార్థాలను తొక్కిపెట్టడం, వాటిని వక్రీకరించడం, మసిపూసి మారేడుకాయ చేయడం.. వంటి విద్యల్లో చైనాది అందెవేసిన చేయి. వాస్తవాలకు వక్రభాష్యం చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించడంలోనూ బీజింగ్‌ ‌దిట్టే. ఈ విషయంలో దానికి ఎవరూ సాటిరారు. కాలం మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, ప్రపంచం మారుతున్నా.. ఆ దేశ నాయకుల వైఖరిలో మాత్రం మార్పు కనపడటం లేదు. ఇది ఆశ్చర్యకరమైనా, అదే సమయంలో ఒకింత ఆందోళన కలిగించే అంశమే. మొండిగా వ్యవహరించడం, వితండవాదన చేయడం, కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ఒక అసత్యాన్ని అదేపనిగా ఊదరగొట్టడం వంటి విషయాల్లో బీజింగ్‌ ‌పాలకులు నేర్పరులు. ఈ విషయం గతంలో అనేకమార్లు విస్పష్టంగా రుజువైంది. వివిధ అంశాలకు సంబంధించి డ్రాగన్‌ ‌వైఖరిని అంతర్జాతీయ సమాజం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆక్షేపిస్తున్నా దాని వైఖరిలో మార్పు కనపడటం లేదు.

తాజాగా గల్వాన్‌ ‌ఘటనకు సంబంధించి బీజింగ్‌ ‌పెద్దలు నిన్నమొన్నటి దాకా చెప్పినవి కల్లబొల్లి మాటలేనని వెల్లడైంది. 2020 జూన్‌లో భారత్‌-‌చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. జన్మభూమి కోసం వారు తమ ప్రాణాలు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడారు. అంతిమంగా నేలకొరిగారు. మాతృభూమి పరిరక్షణలో పునీతులయ్యారు. తమ సైనికుల మరణానికి సంబంధించి స్పష్టంగా భారత్‌ అప్పుడే ప్రకటించింది. దేనినీ దాచలేదు. యావత్‌ ‌జాతి వారికి ఘన నివాళులు అర్పించింది. వారి సేవలను స్మరించుకుంది. అమరవీరులకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. గల్వాన్‌ ‌ఘటనకు సంబంధించి భారత ప్రభుత్వం ఏనాడూ, ఎక్కడా ఏ విషయాన్ని దాచలేదు. పూర్తి పారదర్శకంగానే వ్యవహరించింది. కానీ చైనా ఇందుకు పూర్తిగా తనకు సహజసిద్ధంగా అబ్బిన భిన్నమైన వైఖరిని అవలంబించింది. గల్వాన్‌ ‌ఘటనకు సంబంధించి ఏ విషయాన్ని బయట పెట్టలేదు. జరిగిన నష్టం గురించి వెల్లడించ లేదు. ఎప్పటిలాగానే ఘర్షణకు సంబంధించిన కారణం గురించి భారత్‌నే నిందించింది. మన సైనికులు దుందుడుకుగా వ్యవహరించడమే అసలు సమస్యకు కారణమని మాయామాటలు చెప్పింది. తమ సైనికులు నలుగురు మాత్రమే మరణించినట్లు అప్పట్లో చెప్పింది. ఘర్షణకు సంబంధించి ఏ చిన్న సమాచారాన్ని బయటకు పొక్కనీయలేదు. పూర్తిగా తొక్కిపెట్టింది. కానీ సైనికుల మరణాలకు సంబంధించి చైనా వాదనను అంతర్జాతీయ సమాజం విశ్వసించలేదు. వాస్తవాలను వివరించడానికి చైనాలో స్వతంత్ర మీడియా లేదు. విదేశీ మీడియాను తమ దేశంలోకి అది అనుమతించదు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సైనికులు నలుగురే మరణించారన్న వాదనకు ఎంతమాత్రం విశ్వసనీయత లేదు.

అయితే చైనా వాదనలోని డొల్లతనం ఇటీవల వెలుగుచూసింది. నలుగురు సైనికులే మరణించారన్న దాని వాదనలో ఎంతమాత్రం విశ్వసనీయత లేదని, అది పూర్తిగా అవాస్తవమని తేలింది. కనీసం 38 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని నిర్ధారణ అయింది. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధనాత్మక వార్తా పత్రిక ‘ది క్లాక్సన్‌’ ఈ ‌విషయాన్ని వివరించింది. ఈ మేరకు ఆ పత్రికలో ‘గల్వాన్‌ ‌డీ కోడెడ్‌’ ‌పేరుతో ఒక కథనం ప్రచురిత మైంది. ఆ పత్రిక సంపాదకుడు ఆంటోనీ క్లాక్‌ ఈ ‌విషయమై ఇటీవల ఓ భారతీయ వార్తా సంస్థతో మాట్లాడారు. తాము అనేక పరిశోధనలు చేసిన తరవాతే నిర్ధారణకు వచ్చామని, ఆషామాషీగా తమ అధ్యయనం సాగలేదని, పకడ్బందీగా చేశామని క్లాక్‌ ‌వివరించారు. చైనాకు చెందిన సామాజిక మాధ్యమ కారులు సైతం పరిశోధనల్లో పాల్గొన్నారు. ఉభయ దేశాల సైనికుల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులను ఆయన సోదాహరణంగా వివరించారు. సహజంగానే భారత్‌ – ‌చైనా సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. చైనాతో కశ్మీర్‌, ‌సిక్కిం, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌తదితర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నప్పటికీ లద్దాఖ్‌ ‌సరిహద్దు అత్యంత కీలకమైనది. ఇక్కడ తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. చైనా సైనికులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంటారు. దీనికి ప్రతిగా భారత సైనికులు దీటుగా స్పందిస్తుంటారు. సరి హద్దుల్లో భారత సైన్యం తమ రోజువారీ అవసరాలకు గల్వాన్‌ ‌నదిపై ఓ తాత్కాలిక వంతెన నిర్మించింది. సైనికులు, నిత్యావ సరాలు, ఆయుధాల రవాణాకు ఈ వంతెన ఉపయోగపడు తుంటుంది.

ఈ వంతెన నిర్మాణం చైనాకు కంటగింపుగా మారింది. ఇది భారత్‌కు ప్రయోజనకారిగా, చైనాకు ప్రతిబంధకంగా మారింది. దీంతో ఎలాగైనా వంతెనను ధ్వంసం చేయాలని చైనా పన్నాగం పన్నింది. ఇందుకు సమయం కోసం కాచుకుని కూర్చొంది. పగటిపూట అయితే తమ ఆటలు సాగవని గ్రహించింది. అందుకే వంతెనను కూల్చివేయడానికి రాత్రిపూట సరైన సమయమని భావించింది. ఈ మేరకు పథకం ప్రకారం ముందుకు సాగింది. కానీ అప్రమత్తమైన భారత సైనికులు దీటుగా ప్రతిస్పందించారు. డ్రాగన్‌ ‌సైనికులను అడుగు ముందుకు వేయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. పూర్తిగా నిలువరించారు. దీంతో చేసేదేమీ లేక కొందరు చైనా సైనికులు కాళ్లకు పనిచెప్పారు.

మరి కొంతమంది ప్రాణాలు కాపాడు కుందా మన్న ఉద్దేశంతో గల్వాన్‌ ‌నదిలో దూకారు. శీతల వాతావరణం కారణంగా నది నీరు బాగా చల్లగా ఉంది. సున్నా కన్నా తక్కువ ఉష్టోగ్రతల్లో నది నీరుంది. దీంతో కొంతమంది అతి శీతల వాతావర ణాన్ని తట్టుకోలేక చనిపోయారు. మరికొంత మంది నదిలో నీటి ప్రవాహ తీవ్రతకు కొట్టుకు పోయారు. కనీసం వారి మృతదేహాలు కూడా దొరకలేదు.

కానీ చైనా ఎక్కడా ఈ విషయాన్ని బయటకు పొక్క నీయలేదు. గల్వాన్‌ ‌ఘటనలో నలుగురంటే నలుగురు సైనికులే మరణించారని అధికారికంగా ప్రకటించింది. స్వదేశీ, విదేశీ మీడియాలకు తప్పుడు సమాచారాన్నే అందించింది. ఇక సామాజిక మాధ్యమాల సంగతి చెప్పక్కర్లేదు.

జాతీయ, అంతర్జాతీయ మాధ్యమాల్లో చర్చ జరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. అధ్యక్షుడు జిన్‌ ‌పింగ్‌ ‌నుంచి విదేశాంగ మంత్రి వరకూ ఒకటే పాట పాడారు. ‘చైనా పేర్కొన్న మరణాల సంఖ్య కంటే ఇంకా ఎక్కువ ఉంటుందని మాకు తెలుసు. కానీ అప్పటికప్పడు నిర్ధారించే అవకాశం లేదు. అసలు చైనా నేతల మాటలు వింటేనే ఎవరికైనా అనుమానం కలుగుతుంది. భారత్‌ ‌వైపు మరణాల సంఖ్య 20 ఉంది. అదే సమయంలో అటువైపున కూడా మరణాలు అంతకంటే ఎక్కువ కాకపోయినా తక్కువగా ఉండే అవకాశం లేనేలేదు. ఈ విషయాన్ని ప్రాతిపదికగా తీసుకుని పరిశోధన సాగించాం. చివరికి మా అనుమానం నిజమే అయింది. భూమి మీద ఘర్షణ జరిగి ఉంటే సైనికుల మృతదేహాలు కనపడేవి. కానీ నదిలో దూకడం వల్ల వారి మృతదేహాలు లభ్యం కావు. ఈ నేపథ్యంలో వివిధ అధ్యయనాలు, విశ్లేషణలు అనంతరం కనీసం 38 మందికి తక్కువ కాకుండా చైనా సైనికులు మరణించినట్లు స్పష్టమైందని ‘ది క్లాక్సన్‌’ ‌సంపాదకుడు ఆంటోనీ క్లాక్‌ ‌వివరించారు.

ఈ అధ్యయనం వెలుగులోకి రావడంతో చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అయినప్పటికీ చైనా పాలకులు మౌనం వీడలేదు. ‘ది క్లాక్సన్‌’ ‌పత్రిక కథనం వెలుగులోకి వచ్చిన తరవాత ఇప్పటివరకు దానిని ఆ దేశం ఖండించిన దాఖలాలు లేవు. దీనినిబట్టి వాస్తవం ఏమిటో ఎవరికైనా చాలా స్పష్టంగా బోధపడుతుంది. వాస్తవాలను వక్రీ కరించడం బీజింగ్‌ ‌పాలకులకు కొత్తేమీ కాదు. గత పాలకుల కన్నా ప్రస్తుత పాలకులు ఈ విషయంలో నాలుగాకులు ఎక్కవే చదివారు. అయితే నిజం నిప్పులాంటిది. అది దాచాలన్నా దాగదు. దానిని ఎంత తొక్కిపెట్టాలని ప్రయత్నించినా అది ఏదోనాడు వెలుగులోకి రాక మానదు. ఈ విషయం చైనా పాలకులకు తెలియదని అనుకోలేం. అయితే తెలిసినా తెలియనట్లు ప్రవర్తించడం వారి నైజం. అందువల్లే అంతర్జాతీయంగా దాని ప్రతిష్ట, ప్రభ, విశ్వసనీయత నానాటికీ మసకబారుతోంది. దీనిని బీజింగ్‌ ఎప్పటికి గుర్తింస్తుందన్నది ప్రశ్నార్థకమే.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram