‌దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌పర్యటనకు వస్తే.. సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లోనే ఉన్నా ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనారోగ్యం కారణంగా పాల్గొనలేక పోతున్నట్టు ప్రగతిభవన్‌ ‌వర్గాలు వెల్లడించినా దీని వెనుక రాజకీయ కారణాలు న్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రికి ప్రోటోకాల్‌ ‌ప్రకారం స్వాగతం పలకాల్సిన సీఎం ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. గత శనివారం హైదరాబాద్‌కు ప్రధాని రాగా.. గవర్నర్‌ ‌తమిళిసైతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌, ‌సీఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ముఖ్యులూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. అక్కడినుంచి నేరుగా ఇక్రిశాట్‌కు వెళ్లిన ప్రధాని.. స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముచ్చిం తల్‌కు వెళ్లి రామానుజ సమతామూర్తి విగ్రహావిష్కరణ వేడుకలో పాల్గొన్నారు.

ఢిల్లీ నుంచి రాష్ట్రానికి చేరుకున్న ప్రధానిని స్వాగతించి సాయంత్రం వరకు ఆయన వెంట వివిధ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ ‌పాల్గొనాలని షెడ్యూల్‌లో ఉంది. రాష్ట్రంలో ఏవైనా ప్రతిష్టాత్మక సంస్థలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెళ్లి స్వాగతించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్రిశాట్‌ ‌స్వర్ణోత్సవాలతో పాటు ముచ్చింతల్‌ ‌చినజీయర్‌ ఆ‌శ్రమంలోని రామానుజుల విగ్రహావిష్కరణలో ప్రధానితోపాటు కేసీఆర్‌ ‌పాల్గొనాల్సి ఉంది. ఈ రెండు కార్యక్రమాలకు కేసీఆర్‌ ‌దూరంగా ఉండటం రాజకీయంగా ఊహాగానాలకు తెరలేపింది.

గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌ ‌కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేంద్రం బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్‌ ‌మీడియా సమావేశం ఏర్పాటుచేసి విరుచుకుపడ్డారు. ప్రధానిపైనా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని, కొత్త రాజ్యాంగం కావాలని కూడా అన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే ప్రోటోకాల్‌ ‌ప్రకారం వెళ్లి స్వాగతం పలుకుతానని అదే రోజు మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్‌ ‌బదులిచ్చారు. కానీ అందుకు భిన్నంగా వ్యవ హరించారు.

 బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌మధ్య వైరం పెరిగినందునే ప్రధాని పోగ్రామ్‌కు సీఎం హాజరు కాలేదని తెలుస్తోంది. దుబ్బాక, హుజురాబాద్‌ ఉపఎన్నికల తర్వాత బీజేపీకి, టీఆర్‌ఎస్‌కు ‘నువ్వా నేనా’ అన్నట్లు రాజకీయ పోరు నడుస్తున్నది. కేంద్ర బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శంచిన కేసీఆర్‌ ‌కొత్త రాజ్యాంగం కావాలని అన్నారు. ఇది కేసీఆర్‌కి తలనొప్పిగా మారింది. దీన్ని బీజేపీ సహా, ప్రతిపక్షాలన్నీ సీరియస్‌గా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్‌ ‌విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టారు. ఈ పొలిటికల్‌ ‌హీట్‌లో ప్రధానిని నేరుగా కలుసుకునేందుకు కేసీఆర్‌ ‌వెనుకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతున్నది.

ప్రధానితో కలిసి ముచ్చింతల్‌ ‌రామానుజ సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నా.. కేసీఆర్‌ ‌రెండురోజుల ముందే కుటుంబంతో కలిసి ఆశ్రమాన్ని సందర్శించడం గమనార్హం. ముచ్చింతల్‌ ‌పర్యటన ప్రైవేటు పోగ్రామ్‌గా భావించినా.. ఇక్రిశాట్‌ ‌స్వర్ణోత్సవ వేడు కలు అధికారిక కార్యక్రమం కిందకే వస్తాయని, ఆ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ‌పాల్గొనాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఉద్యమకాలం నుంచీ ఏదైనా కార్యక్రమాలు, సభల్లో పాల్గొనడం కేసీఆర్‌కు ఇష్టంలేకపోతే అనారోగ్య కారణాలను సాకుగా చూపుతుంటారని గతంలో ఆయనకు సన్నిహితంగా మెలిగినవారు చెబుతుంటారు.

కేసీఆర్‌ ‌వ్యూహం గురించి ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాలో చర్చలు, సోషల్‌ ‌మీడియాలో విమర్శలు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇందులో భాగంగానే ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలికే బాధ్యతలను ఒక్కరోజు ముందు మంత్రి తలసాని శ్రీనివాస్‌కు సీఎం కార్యాలయం అప్పగించింది. ఈ విషయం మీడియాకు తెలియడంతో రాష్ట్రమంతా చర్చ జరిగింది. ప్రధానితో కలిసి వేదిక పంచుకోవాల్సి వస్తుందనే కారణంతోనే కేసీఆర్‌ ‌డుమ్మా కొట్టినట్లు చర్చ జరిగింది.

ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నాడంటేనే కేసీఆర్‌కి చలి జ్వరం పుట్టుకొచ్చిందని నిప్పులు చెరిగారు బండి సంజయ్‌. ‌ప్రధాని పదవిని గౌరవించాలని, సీఎం పదవి ఉండబట్టే కేసీఆర్‌ను గౌరవిస్తున్నారని, లేకపోతే ఆయనను ఎవరూ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సీనియర్‌ ‌కమ్యూనిస్టు నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి కంకణాల నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కి ‘పొలిటికల్‌’ ‌ఫీవర్‌ ‌పట్టుకుందని అన్నారు. కేసీఆర్‌కి ఒకవేళ నిజంగానే జ్వరం వస్తే వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ ‌విడుదల చేసేదన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రధాన మంత్రి పర్యటనలో ప్రోటోకాల్‌ ‌పాటించాలని సీనియర్‌ ‌రాజకీయ నాయకులు, అధికారులు చెబుతున్నారు.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram