తెలంగాణలో మరోసారి రాజకీయ అగ్గి రాజుకుంది. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకూ కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేస్తున్న విమర్శల తీవ్రత పెరుగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతేకాదు, ఏకంగా సర్జికల్‌ ‌స్ట్రయిక్స్ అం‌శంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వాగ్బాణాలు సంధిస్తున్నారు. అయితే, ఇన్నాళ్లుగా కేసీఆర్‌ ‌చేసిన విమర్శలకు, ప్రస్తుతం చేస్తున్న విమర్శలకు మధ్య తేడా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని సమర్థిస్తూ, రాహుల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై మాటల దాడి కొనసాగిస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌లో రోజురోజుకి అసహనం పెరిగిపోతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, గులాబీ బాస్‌కు భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అందుకే చీటికి మాటికి కేంద్రంపై గతంలో ఎన్నడూలేని విధంగా దాడికి దిగుతున్నారని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు విమర్శలకు మాత్రమే పరిమితమైన కేసీఆర్‌.. ఇప్పుడు ఏకంగా తన జోలికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి బీజేపీని దేశం నుంచి తరిమేస్తామని, దేశంలో పాలనకు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

కేసీఆర్‌ అవినీతి చిట్టా కేంద్రం వద్ద ఉందని, త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచూ ఈ అంశాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తుండటంతోనే కేసీఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు, రాష్ట్రంలో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై సమాధానం చెప్పలేకనే కేసీఆర్‌ ‌కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందన్న నివేదికలు.. అది ఎన్నికల నాటికి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాల నేపథ్యంలో కేసీఆర్‌ ‌తన వ్యూహాన్ని ఇలా రూపొందించుకున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అటు.. కేంద్రం కూడా తనదైన ఆలోచనతో కేసీఆర్‌ ‌వ్యవహారాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం లీకవడంతోనే ఆయనలో అసహనం కనిపిస్తోందని, ఎడాపెడా కేంద్రంపై తిట్ల దండకం, ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో బీజేపీ పట్ల దూరం పెంచేందుకు ఈ విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

రెండు నెలల క్రితం వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీని టార్గెట్‌ ‌చేసిన కేసీఆర్‌.. ‌స్వయంగా నిరసనల్లో పాల్గొన్నారు. కానీ, అప్పుడా ఉద్యమం బూమరాంగ్‌ అయింది. కేంద్రం రైతులకు వ్యతిరేకమన్న అంశాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. దీంతో, కొద్దిరోజులు మిన్నకుండి పోయారు. మళ్లీ ఇప్పుడు రైతులకు బీజేపీని దూరంచేయడమే తన లక్ష్యంగా తాజా వ్యూహంలో కనిపిస్తోందంటున్నారు. అందుకే నూతన విద్యుత్‌ ‌సంస్కరణల విషయంలో కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. కేంద్రం రైతులను ఇబ్బంది పెట్టేలా కొత్త విద్యుత్‌ ‌సంస్కరణల్లో కీలక మార్పులు చేసిందని ఆరోపిస్తున్నారు. రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాల్సిందేనని కేంద్రం చెబుతోందని.. తాము మాత్రం ఒప్పుకోబోమని తెగేసి చెప్పారు.

రోజురోజుకి రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీని రైతులకు దూరం చేసేందుకు కేసీఆర్‌ ఈ ‌రకమైన ఆరోపణలు గుప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రైతులు బీజేపీకి దూరంగా ఉంటే.. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్‌కు తిరుగుండదనే నమ్మకంతో కేసీఆర్‌ ఉన్నారని.. అందుకే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కారణంగానే రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెరిగాయనే వాదనను కూడా ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.

అంతేకాదు, రాహుల్‌గాంధీ విషయంలో బీజేపీ నేతల విమర్శలను కేసీఆర్‌ ‌ఖండించారు. రాహుల్‌గాంధీని ఎలా అవమానిస్తారని, అసోం సీఎంను బర్తరఫ్‌ ‌చేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. సర్జికల్‌ ‌స్ట్రయిక్స్‌పై రాహుల్‌గాంధీ చేసిన విమర్శలు, లేవనెత్తిన అనుమానాలు తనకూ ఉన్నాయని, కేంద్రం ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భద్రతా బలగాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా కేసీఆర్‌ ‌వ్యాఖ్యలు చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కేసీఆర్‌ ‌విమర్శలపై రాష్ట్ర బీజేపీ కూడా గట్టిగానే స్పందిస్తోంది. బీజేపీ నాయకులను నశం పెట్టి నలిపేస్తామని కేసీఆర్‌ ‌చేసిన హెచ్చరికకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కౌంటరిచ్చారు. మీరు నశంపెడితే, మేం జండూబామ్‌ ‌రాస్తామని వెటకారంగా బదులిచ్చారు. బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. కేసీఆర్‌లో భయం పెరిగిపోయిందని, అందుకే ఏం మాట్లాడు తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

మరోవైపు టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ  రెండూ ఒకటేనని, పైకి శత్రువుగా కనిపించినా ఒకరికొకరు మొదటినుంచి దోస్తులేనని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అయితే, కేసీఆర్‌ ‌చేస్తున్న వ్యాఖ్యలు, బీజేపీ లక్ష్యంగా మాట్లాడుతున్న మాటలు, రాహుల్‌ ‌గాంధీని సమర్థించడం, రేవంత్‌రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా దానిపై స్పందించకపోవడంపై జనం చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ను పల్లెత్తు మాట అనకుండా, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్నే విమర్శించడం, పైగా కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీని సమర్థిస్తూ మాట్లాడటం చూస్తుంటే కేసీఆర్‌ ‌వ్యూహం వెనుక ఏదో తెలియని నిగూఢార్థం ఉందన్న చర్చ సాగుతోంది. మొత్తానికి బీజేపీ వర్సెస్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పోరులో కేసీఆర్‌ ‌కథ ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదు!

– సుజాత గోపగోని, 6302164068  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram