20 ఆగస్టు, వరలక్ష్మీ వ్రతం

ఏ మాసంలోనైనా ప్రత్యేక తిథి వస్తే పండుగ వాతావరణమే. అలాంటిది ప్రతిరోజు పండుగే అనిపించే శ్రావణ మాసం మరింత ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఆనందాలను దోసిళ్లతో నింపి, సంతోషాలను వాయినాలు ఇచ్చే నెల ఇది. శుభకార్యాలకు, సిరిసంపదలకు, సకల సౌభాగ్యాలకు ఆవాసంగా భావించే శ్రావణంలో సంప్రదాయాలను పాటించే ప్రతి ఇల్లు ముగ్గులతో, పచ్చని తోరణాలతో కళకళ లాడుతూ ఉంటుంది. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం పేరిట ఏర్పడిన శ్రావణ మాసం అనేక విశిష్టతలకు నెలవు.ఈ మాసంలో విష్ణువ్లభను భక్తి శ్రద్ధాలతో కొలిస్తే లక్ష్మీ వల్లభుడు ప్రసన్నుడవుతాడని విశ్వాసం. ‘విష్ణువు జగత్తంతా వ్యాపించినట్లే లక్ష్మీదేవి సర్వవ్యాపితమై లోకజననిగా పేరు పొందింది. ‘సంసార సాగరంలో మునిగిపోయే వారు నన్ను పొందేందుకు లక్ష్మీదేవిని కటాక్ష రూపిణిగా మహర్షులు నిర్ణయించారు. అది నాకూ సమ్మతమే. లక్ష్మీదేవి పట్ల విముఖత చూపేవారు నాకూ ద్వేషులే’ అని స్కాంద పురాణంలో విష్ణు వాక్యంగా చెబుతారు. అంతటి మన్నలను అందుకున్న అమ్మవారు నిత్య ఆరాధ నీయురాలు. విష్ణు జన్మ నక్షత్రం శ్రవణం పేరిట ఉండే శ్రావణ మాసం అంటే మరింత మక్కువ. అది ఆదిదంపతుల అన్యోన్యతకు ప్రతీక.

నవ వధువులు ఆషాఢం అనంతరం అత్త వారింట అడుగిడుతున్న వేళ శుభస్వాగతం పలికే మాసం శ్రావణం. అత్తింటి వారు కొత్త కోడళ్లకు శ్రావణ పట్టీపేరుతో నూతన వస్త్రాలతో పాటు బంగారం పెట్టడం కూడా ఆచారంగా వస్తోంది. ముఖ్యంగా ముత్త యిదువులు ఆచరించే వ్రతాలు, నోములు ఈ మాసంలోనే ఉండడం వల్ల దీని వ్రతాల మాసమని, సౌభాగ్య మాసమనీ అంటారు.ఈ మాసం మంగళగౌరీ వ్రతంతో ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వ్రవేశించిన తొలి మంగళవారం నాడు గౌరీదేవి వ్రతం చేసుకుంటారు కనుక• ‘మంగళగౌరి వ్రతం’ ‘శ్రావణ మంగళవారం నోము’అని వ్యవహారం లోకి వచ్చింది. అర్ధనారీశ్వరి పార్వతీమాతను శ్రావణ మంగళవారం అర్చిస్తే ఆమె కరుణాకటాక్షాలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం.

‘సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధికే!

శరణ్యే త్య్రంబికే గౌరి నారాయణి నమోస్తుతే’….

తమ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందన్న విశ్వాసంతో కొత్తగా పెళ్లయిన వారు, గౌరీదేవిని అర్చిస్తే మంచి భర్త లభిస్తాడన్న భావనతో ఆ సంవత్సరంలో తొలుత వచ్చే శ్రావణ మంగళ వారం నాడు మంగళ గౌరిని పూజించి, ముత్తయిదువులకు వాయినం ఇస్తారు.

ఈ వ్రతాన్ని ఐదేళ్లపాటు నోచిన తరువాత ఉద్యాపన చేస్తారు. పసుపు, కుంకుమ, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఆవునేతితో వెలిగే జ్యోతి రూపంలోనూ గౌరీదేవి కొలువై ఉంటుందని, అందుకే ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు మంగళకరమైన వస్తువులు ఇచ్చి ఆశీర్వాదం పొందుతుంటారు. ఈ వేడుకల వల్ల ఆధ్యాత్మికతే కాక పాటు సామాజిక బంధాలు పటిష్టమవుతాయి. పేరంటం వేడుకలో ఇచ్చిపుచ్చు కోవడంతో పాటు స్నేహభావం, సహకార భావం పెంపొందే అవకాశం ఉంది.

ఆషాఢంలో పుట్టినింట ఉండే నవవధువులు శ్రావణం ప్రవేశించాక, మొదటి మంగళవారం నోము పుట్టింటనే జరుపుకుని మెట్టినింటికి బయలుదేరడం ఆనవాయితి. ‘మాతృదేవో అన్న ఆర్యోక్తి ప్రకారం, తల్లి దైవంతో సమానం కనుక, తొలి నోము తల్లి దగ్గరే నోచుకొని తొలివాయనం ఆమెకే ఇవ్వాలన్నది సంప్రదాయం. పార్వతీదేవి గౌరీదేవిగా మారిన వృత్తాంతం శివపురాణం పేర్కొంటోంది.

నారాయణుడు, నారాయణి అన్నాచెల్లెళ్లు. ఆదిదంపతుల మధ్య ఒకసారి వచ్చిన ప్రణయ కలహం సందర్భంలో శివుడు అమ్మవారిని ‘నల్లనిదానా’అని ఆట పట్టించడంతో కినుక వహించిన పార్వతీదేవి తపస్సు చేసి ‘గౌర’ (ఎరుపు)రంగులోకి మారిందట. అందుకే అమ్మ వారికి గౌరి అనే పేరు వచ్చిందట. కుజుడు మంగళగౌరిని పూజించి మంగళవారానికి అధిపతి అయ్యాడు.

వరలక్ష్మీ వ్రతం

విష్ణుపత్ని లక్ష్మీదేవికి శుక్రవారం ప్రీతికరమైనదిగా చెబుతారు. శ్రావణ శుక్రవారాలు, వాటిలోనూ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మరింత మక్కువట. అందుకే ఆరోజు పేదగొప్పా,చిన్నాపెద్దా తేడా లేకుండా శక్తిమేరకు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.ఇక్కడ పూజకు,వ్రతానికి వ్యత్యాసాన్ని చెబుతారు.’ వరలక్ష్మిని ఒక్కసారి పూజించడమే కాదు…జీవితాంతం ఆచరిస్తూనే ఉంటాను’ అని తొలి పూజ నాడు చేసిన ప్రమాణం వల్లనే వరలక్ష్మీ ‘పూజ’ వరలక్ష్మీ ‘వ్రతం’గా మారిందని పెద్దలు చెబుతారు.

ధనం అనగానే డబ్బే అనుకుంటాం.కానీ మానవమనుగడకు అవసరమైన ఆరోగ్యం, ఆయుష్షు, విద్య, వివేకం, సౌభాగ్యం, ధైర్యం, స్థైర్యం, అభయం, విజయం తదితరాలన్నిటికి శ్రీ మహాలక్ష్మే అధిదేవత. ఆమెను అర్చిస్తే సర్వం సమకూరుతాయంటారు. కోరిన వారి కోరికలు తీర్చే సర్వాభీష్ట ప్రదాయిని వరలక్ష్మీదేవి. అయితే ఆమె కరుణా కటాక్షాలు ఆయా వ్యక్తుల తీరుతెన్నులపై ఆధారపడి ఉంటాయట. సదాచారా పరాయణత, స్త్రీలు మన్ననలు అందుకునే చోటు, కన్నవారిని గౌరవిస్తూ, బంధుప్రీతి, శుచీశుభ్రత, తులసీ తదితర మంగళకర వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, సర్వదేవతలను అర్చించే స్వరం, ఆనందం, ఉత్సాహం, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలన వంటి లక్షణాలు కల ప్రదేశాలలో అమ్మవారు నివసిస్తారట.

ఈ వ్రత ఆవిర్భావానికి సంబంధించిన గాథ ప్రకారం… మగధదేశంలోని కుండిన నగరానికి చెందిన చారుమతి అనే ముత్తయిదువుకు లక్ష్మీదేవి కలలో కనిపించి, శ్రావణ పున్నమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ చేసుకోవాలని సూచించారు. అయితే తనతో పాటు ఇతరులతోనూ ఈ పూజ చేయించాలనే భావనతో చారుమతి తోటి ముత్తయిదువులతో కలసి శ్రద్ధాభక్తులతో పూజ నిర్వహించి, ఆత్మప్రదక్షిణకు ఉపక్రమించారు. మూడు ప్రదక్షిణలకుగాను వారికి వరుసగా, బంగారు గజ్జెలు, హస్తకంకణాలు, సర్వాభరణాలు లభించాయట. అడగకుండానే ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ‘అమ్మ’ను నిరంతరం పూజించాలన్న ఆకాంక్షే ‘వ్రతం’గా మారిందని అంటారు.

పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రతాన్ని ఉపదేశించారని, జగన్మాత పార్వతీదేవి ఐశ్వర్యానికి అధిష్టత దేవత శ్రీవరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి నవరత్న ఖచితమైన లంకానగరాన్ని సంపదగా పొందిందని పురాణ కథనం. వర్ణవయోభేదం లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని సాక్షాత్తు పరమేష్ఠే చెప్పారు.

విశిష్ట పున్నముల ‘శ్రావణం’

ఈ మాసంలోని పున్నమికి ఎన్నో విశిష్టతలు. ‘వాగీశ్వరుడు’ హయగ్రీవుడు అవతరించిన తిథి. కలియుగదైవం శ్రీవానివాసుడి ఆవిర్భావం కూడా శ్రవణ నక్షత్రంలోనే. వైఖానస సంప్రదాయ ప్రవర్తకులు విఖానస మహర్షి కూడా ఆవిర్భవించిన తిథి. వేదాధ్యాయనం ఆరంభించే రోజు. ‘ఇతర పున్నములు అనధ్యాయాలు.ఆనాడు పాఠాలు చెప్పకూడదు. కానీ శ్రావణ పౌర్ణమి అందుకు మినహాయింపు’ అని వేదమూర్తులు చెబుతారు.అందుకే వేదాద్యాయనాన్ని ఈ తిథినాడే ఆరంభిస్తారు. మహారాష్ట్రులు, కన్నడిగులు శ్రావణి పౌర్ణమి నాడు సాగరపూజ చేసి కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఆ రోజును నారికేళ పౌర్ణమి, నార్లీ పూర్ణిమ అంటారు.

జ్ఞానప్రదాత హయగ్రీవుడు

‘జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే’..

వాసుదేవుని అన్ని అవతారాలలో మొట్టమొదటిది శ్రీ హయగ్రీవ అవతారం. ఇది ‘జ్ఞానావతారం’. జ్ఞానమే అన్నిటికి మూలం. సరస్వతీదేవి వాగ్ధేవి కాగా, హయగ్రీవస్వామి వాగీశ్వరుడు. జ్ఞాననందమయుడు. నిర్మలమైన స్ఫటికం వంటి ఆకృతి కలలవాడు. సర్వ విద్యలకు ఆధారభూతుడు. గుర్రపు తల, మానవదేహం గల ఈ స్వామి నాలుగు భుజాలలో శంఖం, చక్రం, పుస్తకం, చిన్ముద్రలను కలిగి ఉంటాడు. గుర్రం సకిలించే ధ్వనిని ‘హేష’ అంటారు. ఆ ధ్వని బీజాక్ష రాలకు ప్రతీకగా చెబుతారు. బ్రహ్మ వద్ద నుంచి వేదాలను అపహరించుకుపోయిన మధుకైటభులు అనే రాక్షసుల సంహారం కోసం విష్ణువు శ్రావణ పూర్ణిమ నాడు యజ్ఞగుండం నుంచి హయగ్రీవుడిగా ఆవిర్భవించారు. రాక్షసులను వధించి వేదాలను రక్షించారు. ఆయన సేవకై బ్రహ్మ తొలుత సరస్వతిని నియమించగా, ఆమె ఈ మూర్తికి విగ్రహ రూపం కల్పించుకొని అర్చించారని పురాణగాథ. శారదాదేవి కాశ్మీరంలో భగవద్రామానుజులకు సాక్షాత్కరించి శ్రీలక్ష్మీ హయగ్రీవమూర్తిని ప్రసాదించగా, వారి నుంచి వారి శిష్యులు పిళ్లైయాచార్యులు, వారి నుంచి వేదాంతదేశికుల వారికి గురుశిష్యక్రమంలో సంక్రమిం చింది. మైసూరులోని శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠంలో ఆ మూర్తి అర్చనలు అందు కుంటున్నారు. అగస్త్యపత్ని లోపాముద్ర పరాశక్తి లలితాదేవిని అర్చించారు. అయితే కలియుగంలో మానవ ఉద్ధరణకు ఉపాయం చెప్పాలని అగస్త్యుడు విన్నవించగా, హయగ్రీవుడు ఋషి రూపంలో కాంచీపురంలో ఆయనకు శ్రీలలితా రహస్యనామాలను, శ్రీవిద్యను ఉపదేశించారు.

నూతన యజ్ఞోపవీతధారణ

శ్రావణ పూర్ణిమనాడు ద్విజులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. జపహోమ ధ్యానాదుల నిమిత్తం దీక్షాసూచికగా నూతన యజ్ఞపవీతం ధరించాలని శాస్త్రవచనం. గడచిన సంవత్సరంలో దోషాలు ఏమైనా చోటుచేసుకుంటే వాటి పరిహారార్థం కూడా నూతన• యజ్ఞోపవీతధారణ చేస్తారని చెబుతారు. జాతమృత అశౌచ్యాదుల శుద్ధి సందర్భాలలో నూతన యజ్ఞోపవీతధారణకు, శ్రావణ పూర్ణిమ నాటి తంతునకు వ్యత్యాసం ఉంది. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీత ధారణతో బ్రాహ్మణాది ద్విజాతులు  నాలుగైదు మాసాలు వేదాధ్యయనం చేయాలని మన సంస్మృతి చెబుతోంది. కొత్తగా ఉపనయనం అయినవారికి ఈ తిథినాడే ఉపకర్మను జరిపిస్తారు. వేదాభ్యాసం చేసేవారికి మాత్రం ఏటా ఈ పౌర్ణిమ నాడు ఉపకర్మ నిర్వహిస్తారు. ఈ పక్రియతో వేద విద్యాభ్యాసం ప్రారంభిస్తారు.

రక్షాబంధన్

ఒకప్పుడు దుష్టశక్తులను పారదోడానికి, విజయం పొందడానికి ఉద్దేశించిన రక్షాబంధనం అనంతర కాలంలో సోదరసోదరీ ప్రేమకు ప్రతీకగా మారింది. భవిష్యోత్తర, విష్ణు, కూర్మ పురాణాలు రక్షాబంధన గురించి చెబుతున్నాయి. యుద్ధవీరులకు పట్టుదల, ఆత్మస్థయిర్యం కలిగేందుకు రక్ష కట్టేవారు. కాలక్రమంలో పాలకుల దుర్నీతి, అరాచకాల బారిన పడుతున్న మహిళల రక్షణ కోసం రాఖీ సంప్రదాయం వచ్చిందని చెబుతారు. పురాణ, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే.. దానవులతో జరిగిన యుద్ధంలో ఓడిన ఇంద్రుడు ఆయన పత్ని శచీదేవి, గురువు బృహస్పతి ముంజేతికి రక్ష కట్టి ప్రోత్సహించడంతో విజయం సాధించాడట. ధ్రువుడు తపస్సుకు వెళుతున్నప్పడు తల్లి, కుమారుడు భరతుడికి శత్రుభయం ఉండ కూడదని శకుంతల, బలిచక్రవర్తి తన సరస్వాన్ని వామనుడికి ధారపోసినప్పుడు ఆయన భార్య వింధ్యావళి, సోదరుల విజయాన్ని కాంక్షిస్తూ ధర్మరాజు రక్ష కట్టారని గాథలు. బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీహరి ఆయన రాజ్యానికి రక్షకుడిగా ఉండగా పతిని (హరి) వైకుంఠానికి రప్పించుకోవాలనే ప్రయత్నంలో లక్ష్మీదేవి బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్ద ఆశ్రయం పొంది శ్రావణ పూర్ణిమనాడు ఆతనికి రక్ష కట్టి తన గురించి వెల్లడిస్తుంది. ఆమె మంచి తనానికి, తెలివికి సంతసించిన అసురపతి విష్ణువును వైకుంఠానికి వెళ్లవలసిందిగా వేడుకుంటాడు.ఇది సోదర ప్రేమకు ఉదాహరణగా చెబుతారు.

చారిత్రక కథనాలను బట్టి…. ఔరంగజేబు తన సామంతుడైన రాజపుత్రుని వంశనాశనానికి కుట్రపన్నగా అది తెలిసిన రాజపుత్రుని భార్య మరో సామంతుడికి ‘రక్ష’ పంపగా అతను ఔరంగజేబు యత్నాలను విఫలం చేసి సోదరి సమానురాలి మాంగల్యాన్ని కాపాడాడు.

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram