భారత్‌కు సుదీర్ఘ చరిత్ర, ప్రాచీన సంస్కృతి, శ్రేష్ఠమైన వారసత్వం వచ్చాయి. అందులో భాగమైన ఉత్సవాలు మన జాతీయ జీవనానికి గుర్తులు. ఈ ఉత్సవాలు సమాజంలో స్నేహం, సంఘటన, నూతనోత్సాహం, ఆహ్లాదకర వాతావరణాన్ని నిర్మిస్తు దేశభక్తిని పెంపొందిస్తాయి.

మూస జీవితంతో విసుగు, అలసట కనిపించడం మానవ స్వభావం. మనం నిర్వహించుకునే ఉత్సవాలతో అవి దూరమవుతాయి. విలువలతో కూడిన జీవితం గడపాలనే కోరిక పెరిగి, మరింత ముందుకు వెళ్లేందుకు ప్రేరణ లభిస్తుంది. సమాజంలో ఆత్మీయత, ఏకాత్మత,  సమరసత నిర్మాణమై దేశాన్ని సుదృఢం చేసే కార్యం ఉత్సవాల ద్వారా సహజంగానే కలుగుతుంది.

ఆధునిక భారత చరిత్రలో పరమపూజనీయ డాక్టర్‌ ‌కేశవరావు బలీరాం హెడ్గేవార్‌ ‌యుగద్రష్ట. హిందూ సంఘటనను ప్రారంభించి, హిందూ జీవన చైతన్యానికి ఆయన అనుసరింపజేసిన కార్యపద్ధతిలో ఉత్సవాల నిర్వహణ ఒకటి.

నిత్యజీవితంలో ఎవరికి వారు వ్యవహారాలలో తలమునకలై ఉండిపోతారు. అలాంటి సమయంలో ఆశయ విస్మరణ జరగకుండా ఏ ప్రేమ, ఆత్మీయత, విద్యా విజ్ఞానాల మీద మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తు చేసేదే శ్రావణ పౌర్ణమి.

విదేశీయుల దాడులు, సమాజ ఆత్మవిస్మృతి కారణంగా వందల సంవత్సరాలు అస్తిత్వం కోసం మనం పోరాటం చేయవలసి వచ్చింది. సామాజిక సంబంధాలు దెబ్బతిన్న కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ధ్వంసమైన ఆ బంధాలు పటిష్ట పరచాలంటే సామరస్యం నిర్మాణం కావాలి. ఈ దిశలో జరిగే ప్రయత్నాలకు ప్రేరణ శ్రావణ పౌర్ణమి నాడు మనం నిర్వహించుకునే రక్షాబంధన్‌ ‌పండుగ.

రక్షాబంధన్‌ ‌సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయభావనను నిర్మించడమే కాక కుటుంబ విలువలను శక్తిమంతం చేస్తుంది. అంతమాత్రమే కాకుండా ఈ పండుగ ప్రేమ, సహోదరత్వానికి ప్రతీక. ఇది సమాజాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను రక్షిస్తుంది. విశ్వమానవ కల్యాణానికి అనువైన వాతావరణాన్ని నిర్మిస్తూ విశ్వశాంతికి, అభ్యుదయానికి పునాదులు వేయడానికి ప్రేరణ ఇస్తుంది.

విశ్వమంతా ఒకే కుటుంబమనే భావనను ప్రకటించిన ఏకైక నాగరిక దేశం మనది. కులం, భాష, ప్రాంతం, విభిన్న ఆహారపు అలవాట్లు వంటి వైవిధ్యాలెన్నో ఉన్నప్పటికి మనమంతా ఒకటి అని నిరూపించే విశేష సంస్కృతి సంప్రదాయాలు ఉన్న దేశమిది.

వ్యక్తి నిర్మాణం ద్వారా సామాజిక పరివర్తన సాధించి భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపడం అనే లక్ష్యంతో సంఘం పనిచేస్తుంది. శుద్ధ సాత్విక ప్రేమ మన కార్యానికి ఆధారం. సాత్విక ప్రేమతో ఎలాంటి వ్యక్తిలోనైనా మార్చు తేవచ్చు. ఆత్మీయత, బంధుత్వభావన, సాంస్కృతిక వారసత్వాల ద్వారా సామాజిక పరివర్తన సాధ్యమని చరిత్ర చెబుతోంది.

రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి బాల్యంలో జరిగిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. వివాహం తర్వాత కొంత కాలం ఆమె తల్లిగారింట్లో ఉన్నారు. జయరామవటీ (శారదాదేవి పుట్టిన గ్రామం) నుండి కొంతమంది కలకత్తాకు వెళుతున్నారు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి గ్రామస్తులతో కలసి ఆమె కూడా కాలినడకన ప్రయాణం ప్రారంభించింది. ఆ అడవిమార్గం బంది పోటు దొంగలకు నిలయం. శారదాదేవి, ఒకరిద్దరు వృద్ధులు నెమ్మదిగా నడస్తున్నారు. తోటివారికి ఇబ్బంది కలుగ కూడదని తారకేశ్వరం అనే గ్రామంలో ఉన్న దుకాణం వద్ద అందరం కలుసుకుందామనుకొని తోటివారిని వెళ్లిపొమ్మని చెప్పింది. భయంకర మార్గం కాబట్టి వారంతా వేగంగా వెళ్లిపోయారు. శారదాదేవి, ఆ వృద్ధ మహిళలు మిగిలారు. చీకటి పడింది. అప్పుడే పొడవైన జుట్టుతో భయంకర రూపం గలవాడు ఎదురుగా నిలబడ్డాడు. ‘ఎవరు మీరు, ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారం’టూ అరిచాడు.

శారదాదేవి తన కాలి గొలుసులు తీసి అతని చేతిలో ఉంచి, ‘నాన్నగారు! నేను మీ బిడ్డను, దారి తప్పిపోయినాను. మీ అల్లుడుగారు దక్షిణేశ్వరంలో రాణి రాసమణి ఆలయంలో ఉన్నాడు’ అని మధుర స్వరంతో పలికేసరికి ఆ దొంగ గుండె కరిగిపోయింది. ఇంతలో ఆ దొంగ భార్య అక్కడ చేరగా ఆమెతో, ‘అమ్మా! నేను మీ బిడ్డను. దారితప్పి ఈ అడివిలో చిక్కుకున్నాను. నీవు, నాన్న ఇప్పుడు రాకపోతే నా గతి ఏమై పోయేది!’ అని ఆమె చేతులు పట్టుకొన్నది. ఒక్క నిమిషంలో బందిపోటు దంపతులు ఆమెకు తల్లిదండ్రులైపోయారు. ఆ రాత్రి ఆ దంపతులు ఆమెకు పహారాగా ఉండి, మరుసటి రోజు ఉదయం శారదామాతకు తోటివారికి కూడా సరిపోయే తినుబండారాలు తెచ్చి కొంగుకు ముడివేసి బందిపోటు దొంగ భార్య ‘సారె’ కూడా పెట్టింది. తోటివారిని ఈ అపూర్వ బంధుత్వం ఆశ్చర్యపరిచింది. కొంత కాలానికి బందిపోటు దంపతులు శారదాదేవిని దక్షిణేశ్వరంలో కలుసుకున్నారు. అప్పుడు రామకృష్ణులు వారిని గౌరవించి అల్లుడిగా వ్యవహరించారు. శారదాదేవి సమయస్ఫూర్తితో ‘మీ బిడ్డను’ అని సంబోధించడం బందిపోటు దంపతుల పరివర్తనకు కారణమైంది.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం రక్షాబంధన్‌ ‌పండుగను ఒక సామాజిక ఉత్సవంగా నిర్వహించి సమాజంలో పరస్పర బంధుభావనను నిర్మిస్తుంది. మన పాఠశాలల్లో విద్యార్థులు చెప్పే ప్రతిజ్ఞలో ఉన్నట్లు ‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరు నా సహోదరులు…’ అనే భావనను దీని ద్వారా నిర్మాణం చేసి సమాజంలోని కొన్ని కురీతులను తొలగించవచ్చు.

ముంబై, పుణే నగరాలకు చెందిన చాలామంది లోకల్‌ ‌రైలులో కార్యాలయాలకు వెళ్లివస్తుంటారు. పరిచయం లేకున్నా రోజు కలుసుకునే అవకాశం వారికి ఉంటుంది. వారిలో కొందరు తుంటర్లు మహిళలను వేధించడం నిత్యకృత్యం. ఆ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో కొందరు రాష్ట్ర సేవికా సమితి కార్యకర్తలు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం వారికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే ‘రక్షాబంధన్‌’ ‌వచ్చింది. ముందుగా యోజన చేసుకుని ఆ మహిళలు ప్రతిరోజు తమను ‘అవహేళన’ చేసే పురుష ప్రయాణీకులను దిగ్భ్రాంతికి గురిచేస్తూ, వారి చేతులకు ‘రాఖీలు’ కట్టేశారు. ఆ మరుసటి రోజు నుండి ఆ పురుష ప్రయాణీకులు తమతో రోజు కలసి ప్రయాణించే మహిళలను గౌరవంగా చూడడం ప్రారంభించారు. ఒక చిన్నదారం పోగు పెద్ద సమస్యకు చక్కని పరిష్కారం చూపించి బంధుభావన నిర్మాణం చేసి పరివర్తనకు ఆధారమైంది.

సాంస్కృతిక వారసత్వంతో సామాజిక పరివర్తన, తద్వారా కఠిన సమస్యలకు సులభమైన పరిష్కారం సాధ్యమేనని చెప్పవచ్చు.

గుజరాత్‌లోని కచ్‌ ‌ప్రాంత సముద్రతీరంలో చేపల వేటే మత్స్యకారులకు జీవనాధారం. ఆ తీరంలో విలువైన, అరుదైన ‘వేల్‌’ ‌చేపలు లభిస్తాయి. ఒక్కొక్క చేప ధర లక్షల్లో ఉంటుందని జనవాక్యం. కాబట్టి వేల్‌ ‌చేపలను నిరంతరంగా వేటాడటం వలన ఆ జాతి క్షీణిస్తున్నది. ఆ చేపల జాతిని రక్షించడం కోసం ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసింది. చివరకు వాటిని వేటాడుతూ దొరికిన వారికి జరిమానా సహా జైలు శిక్ష విధించేటట్టు చట్టం చేసింది. అయినా వేల్‌ ‌చేపల వేట ఆగలేదు. దీనికి శాశ్వత పరిష్కారం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచిన భాగవత ప్రవచకులు ‘పూజ్య మురారీ బాపు’ తన భాగవత ప్రవచనం కొనసాగి స్తున్నారు. కొంతమంది సంస్కృతి సంరక్షకుల సలహా మేరకు ప్రభుత్వ అధికారులు పూజ్య మురారీ బాపును కలసి సమస్యను ప్రస్తావించారు. ఇక్కడ గమనించ దగినది ఏమిటంటే వేల్‌ ‌చేపలు కొంతకాలం సముద్రంలోపలికి వెళ్లి, పిల్లలు పెట్టే సమయానికి తీరానికి చేరుకుంటాయి. ఈ విషయమే పూజ్య మురారీ బాపుకు వివరించారు.

పూజ్య మురారీ బాపు మత్స్యకారులు నివసిస్తున్న ప్రాంతంలో భాగవత ప్రవచనం ప్రారంభించారు. సందర్భోచితంగా వేల్‌ ‌చేపల ప్రస్తావన చేశారు. ‘హిందూ సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఆడపిల్లకు యుక్తవయసు రాగానే వివాహం చేసి అత్తారింటికి పంపుతాం. ఆమె గర్భవతియై ప్రసూతికి పుట్టింటికి వచ్చినపుడు సంస్కారాలన్నీ పూర్తిచేసి పురుడు పోసి కట్నకానుకలు సమర్పించుకొని అత్తారింటికి తిరిగి పంపడం మన సంప్రదాయం. కానీ మీరందరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం, మీరు వేటాడుతున్న వేల్‌ ‌చేపలు కూడా మన ఆడపడుచు మాదిరిగా ప్రత్యేకంగా పురుడు పోసుకోవడానికి తీరానికి వస్తున్నాయి. అవి మనకు ఆడపడుచులతో సమానం. మనం ఎంతో గౌరవంగా ఆనందంగా ఆడపిల్లలకు పురుడు పోసి పంపే సంస్కృతికి చెందిన వారమై ఉండి ఆ చేపలను వేటాడటం పాపం కాదా! మన సాంస్కృతిక వారసత్వానికి విరుద్ధం కాదా! ఇక ముందు ఆ పాపకార్యం చేయబోమని ప్రతిజ్ఞ చేద్దాం!’ అని తనదైన శైలిలో భాగవత ప్రవచనంలో పూజ్య మురారీ బాపు చెప్పారు. ఆ ప్రవచనం మత్స్యకారుల గుండెలు కదిలించింది. తర్వాత వేల్‌ ‌చేపల వేట నిలిచిపోయింది. చట్టాలూ, శిక్షలూ చేయలేని పనిని సంస్కృతి ఆధారంగా నిర్వర్తించవచ్చునని రుజువైంది.

పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, మానవీయ విలువలు, దేశరక్షణ భావన సమాజంలో నిర్మాణం కావడానికి ప్రధాన ఆధారం భారతీయ కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పునరుజ్జీవనం పొందగలదో అప్పుడు ‘హైందవ చైతన్యమే భారత సంక్షేమం: భారత సంక్షేమమే విశ్వకల్యాణం’ అన్న నినాదం నిజమవుతుంది.

96 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం ఈ ఆవశ్యకతను గుర్తించి పనిచేస్తున్నది. సంఘం ప్రతి సంవత్సరం రక్షాబంధన్‌ ‌సమయంలో విస్తృతంగా సమాజంలోనికెళ్లి అందరిని కలిసి ‘నీకు నేను రక్ష, నీవు నాకు రక్ష, మనం ఇద్దరం ఈ దేశానికి, సమాజానికి, సంస్కృతికి రక్ష’ అనే సందేశం అంది స్తున్నది. ఈ ఆలోచనలను వేగవంతంగా విస్తరించాలి. అప్పుడే మనదేశం శక్తిమంతమవుతుంది. తద్వారా ప్రపంచంలో శాంతి నెకొంటుంది.

సామాజిక సంబంధాలను శాస్త్ర, సాంకేతికత నిర్వచించలేదు. అవి మనసుల నుండి పెల్లుబికి రావలసిన భావాలు. పరస్పర సంబంధాలతో వస్తాయి. అందుకే ఎప్పుడూ మన పెద్దలు కుటుంబ భావనను గుర్తు చేస్తుంటారు. పరస్పర సోదరసోదరీ భావన అందులో ఉంది. ఈ రక్షాబంధన్‌ ‌సమయంలో మన సోదరి మనకు రక్ష కడుతుంది. నేను ఈ కుటుంబానికి చెందిన దానినే, నా రక్షణ బాధ్యత మీపై ఉన్నదనే సందేశం అందులో ఉన్నది.

ఇటువంటి సోదరసోదరీ భావం పటిష్టంగా ఉన్నప్పుడు ఈ దేశంలో స్త్రీలకు గౌరవం దక్కింది. రక్షణ దొరికింది. ఈ రోజున మహిళలపై జరుగుతున్న దాడులను పూర్తిగా అరికట్టాలంటే భావాత్మకమైన మార్పు సమాజంలో రావాలి. నేడు యువత అన్ని రంగాలలో దూసుకొని పోతున్నది. వారికి మన సామాజిక సంబంధాలు, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుచేసి చైతన్యవంతం చేయాలి. అప్పుడే పరంపరాగత విషయాలు, ఆధునిక శాస్త్రసాంకేతిక విషయాల మధ్య సమన్వయం ఏర్పడి మార్పు సంభవిస్తుంది. ఈ దిశలో వేగవంతంగా పనిచేయటం నేటి ఆవశ్యకత.

– బూర్ల దక్షిణామూర్తి, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌

About Author

By editor

Twitter
Instagram