గగన వీధిన ఎగసిన మువ్వన్నెల భారత పతాక నీడలో, మనం సాధించిన ఒలింపిక్‌ ‌క్రీడాపతకాలు తళతళలాడాయి. టోక్యో మహాసంరంభంలో మరీ ముఖ్యంగా క్రీడాకారిణుల పోరాటపటిమ ఎందరెందరితోనో ‘జయహో’ అనిపించింది. తెలుగు మెరుపుతీగ సింధు పసిడి కాంతులతో మరింత ధగధగలాడాలని దేశమంతా పరితపించలేదూ? ఆ పరమోన్నత ఆశయాన్ని ఫలప్రదం చేసుకొనే క్రమంలో, ఇప్పుడు తాను కాంస్య పోటీ విజేత అయింది కదా! ప్రపంచ దేశాలన్నీ కళ్లు విప్పార్చి చూసే మహత్తర ఉత్సవాల వేదికమీద ఆమె మహోత్సాహి. అంతకుముందూ సాధించిన పతకంతో కలిపి తానే అగ్రనాయిక. ప్రతిసారీ గెలుపు వరించాలని రగిలి పోయే కోట్లాది అభిమానుల పాలిట శాశ్వత ఆశాదీపిక. అలా సరికొత్త చరిత సృజించిన సింధు మాత్రం మిశ్రమ భావోద్వేగాల్ని ప్రకటించింది. ‘వచ్చే 2024 పారిస్‌ ఒలింపిక్స్ ‌బరిలోకి దిగి తీరుతా. నేనూ నా దేశమేమిటో లోకం ముందు తప్పనిసరిగా నిరూపిస్తా. ఏదీ అసాధ్యం కాదని అందరికీ చాటి చెప్తా’ అంటుంటే ఆమె స్వరం పిడుగు! మొత్తం 18 క్రీడాంశాల్లో పోటీపడన మనవాళ్లు 7 పతకాలు సంపాదిస్తే, ఆ ఘన విజేతల్లో మరో ఇద్దరు వనితారత్నాలు మీరాబాయి చాను, లవ్లీనా. ఒకరు రజతం, మరొకరు కాంస్యంతో భారత క్రీడాఖ్యాతిని విశ్వయవనికపైన మెరిపించారు. గెలుపు ఓటములకన్నా ఆటలపోటీల్లో పోరు ప్రదర్శనే మిన్న. గోల్ఫ్‌లో తిరుగులేని శక్తిని చాటిన అమ్మాయి ఆదితి కేవలం రెప్పపాటు తేడాతో పతకం కోల్పోయింది. చరిత్రలోనే మొదటిసారిగా సెమీస్‌కి చేరన భారతహాకీ మహిళల బృందం చిట్టచివరికి వట్టి చేతులతో వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అయినా పోరాటం పోరాటమే, పటిమ అంటే పటిమే! జపాన్‌లో ఏర్పాటైన ప్రతిష్టాత్మక సంబరాల్లో భారత అతివల పాటవం నిస్సందేహంగా స్ఫూర్తిదాయకమే!!

తిరుగులేని సింధు

గత నెలలోనే పుట్టినరోజు జరుపుకొన్న పీవీ సింధుకు చిన్నప్పటినుంచీ బ్యాడ్మింటన్‌ ‌ప్రాణం. రంగంలోకి దిగడం, నెగ్గేందుకు తుదికంటా శ్రమిం చడం ఎన్నటికీ వీడనంత గట్టి అలవాటు. అప్పటి రియోలోనైనా, ఇప్పటి టోక్యోకైనా అందుకే ఆమె మణిపూసగా నిలిచింది. రెండింటా పతకాలు కైవసం చేసుకుని, మొట్టమొదటి భారతీయ రజత వనితగా తనదైన శైలిని ప్రదర్శించింది. కేవలం పాతికేళ్లు దాటిన ఈ వయసులో ఇంతటి రికార్డును సొంతం చేసుకుందంటే, ఎంత అంకిత భావం ఉండాలి? విజయాల పరంపరతో ఉక్కిరిబిక్కిరి కావడం తనకు ఇదేమీ కొత్తకాదు. దశాబ్దం క్రితం బ్యాడ్మింటన్‌ ‌సమాఖ్య వెలువరించిన అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో తొలి 20మందిలోనూ ఉంది. అటు తర్వాత చైనా నిర్వహించిన ఛాంపియన్‌షిప్‌ ‌క్రీడోత్సవాల్లో పతక ధారిణిగా నిలిచింది. అంటే నాడు ఆ మెడల్‌ ‌గెలుచుకున్న పప్రథమ భారతీయ అతివ తానే. తదుపరి అన్నీ వరస విజయాలే. అందుకనీ, ఆ ప్రతిభా సామర్థ్యాలకు దీటైన గుర్తింపుగానే, నిరుడు పద్మభూషణ అయింది సింధు. అమ్మా నాన్నా క్రీడాకారులు. క్రీడా స్ఫూర్తిని ప్రత్యక్షం చేసే ఆదర్శప్రాయులు. వారి క్రీడా విజయం వాలీబాల్‌లో, తన ఆసక్తి – శక్తులన్నీ బ్యాడ్మింటన్‌లో. కుటుంబ నిరంతర ప్రోత్సాహ పర్యవసానంగా.. కొరియా ఓపెన్‌ ‌సూపర్‌ ‌సీరిస్‌ (‌ప్రీమియర్‌), ‌జూనియర్‌ ‌ఛాంపియన్‌షిప్స్ (‌ప్రపంచ స్థాయి), చైనా సీరిస్‌, ఇం‌డోనేసియా ప్రీమియర్‌, ‌జపాన్‌ ఓపెన్‌ – ఇలా అన్నింటా గెలుపు ఆమెదే. ఇండియా సూపర్‌ ‌సిరీస్‌, ఓపెన్‌ ‌గ్రాండ్‌ ‌ప్రిక్స్‌లో కూడా విజయమంతా తనదే. ఒత్తిడిని తట్టుకోవడం ఆటలో ఎప్పుడూ ఎక్కడా ఓర్పుకోల్పోకుండా ఉండటం తన ఘనత రహస్యాలని ఇదివరకే తేటతెల్లం చేసింది.

సదా పోరాట పటిమ

ఐదేళ్ల కిందట సైతం అంతే, ఆనాటి ఒలింపిక్‌ ‌క్రీడల్లో ప్రతి దశలోనూ దూసుకెళ్లింది బంగారు సింధు. ఒక్కటంటే ఒక్కటి వచ్చినా చాలు, అదే పదివేలని తపించిన భారతీయులకు మహాదానందం కలిగించింది. తన దేశానికి ద్వితీయ పతకాన్ని నిశ్చయించేసి అశేష అభిమానుల విశేష ఆదరాన్ని అందుకుంది. లలనల సింగిల్స్ ‌బ్యాండ్మింటన్‌లో మొట్టమొదటగా, అదీ ఒకే ఒకటిగా రజతాన్ని వశపరచుకుంది. రెండేళ్లనాడు వరల్డ్ ‌ఛాంప్‌ ‌పోటీల్లో స్వర్ణపతకం ఆర్జించి అహో అనేలా చేసింది. అంతటి తొలి భారతీయురాలు ఆమె. ఈసారి ఒలింపిక్స్‌లో వరసబెట్టి ఇజ్రాయెల్‌, ‌హాంకాంగ్‌, ‌డెన్మార్క్, ‌జపాన్‌ ‌పోటీదారులతో తలపడి నెగ్గింది. తృతీయస్థానానికి నిర్వహించిన పోటీలో చైనా క్రీడాకారిణిని ఓడించి కాంస్య విజేతగా పతాకాన్ని ఎగురవేసింది. జట్టుపరంగానే కాదు, వ్యక్తిగతంగా చూసుకున్నా సింధుకు గెలుపే గెలుపు. ఎంచుకున్న రంగంలోకి అడుగిడి పుష్కర కాలం కావస్తోంది. కొలంబో, ఇరాన్‌, ‌మాల్దీవులు, దక్షిణ కొరియాల్లో విజయురాలు. కామన్వెల్త్, ఆసియా, ఉబెరకప్‌- ఏ ‌స్థాయి పోటీలోనైనా తానే విజేత. వీటన్నింటి కారణంగా గతేడాది మహిళా దినోత్సవాన ప్రకటితమైన జాబితాలో అత్యుత్తమ భారతీయ క్రీడాకారిణి ఆమె. అందుకున్న పురస్కుృతుల్లో మహోత్తమ క్రీడా గుర్తింపుగా ఖేల్‌రత్న, అర్జున మరెన్నో. ఎంత గౌరవాదరాలు లభించినా; ఆ సంతోషం, సంతృప్తితో తాను ఆగలేదు సరికదా. ఇంకెంతో పరిశ్రమించింది. అప్పట్లో వరసగా రెండు సంవత్సరాలపాటు టైటిల్స్‌కు దగ్గరగా వచ్చినా, పరిస్థితి మారింది. రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సిన దశ ఎదురైనా సింధు కుంగిపోలేదు. మడమ తిప్పకుండా, వెనుకడుగు వేయకుండా పోరాడుతూనే ఉందంటే- అదీ ఆమె ఆత్మవిశ్వాసం. దాని మూలంగానే 2019లో వరల్డ్ ‌ఛాంప్‌ ‌కిరీటం పొందింది. ఇప్పుడిక పసిడి సాధనే లక్ష్యంగా చెమటోడ్చినా, స్థితిగతుల తీవ్రతకు జంకలేదు. కాంస్యాన్ని తనదిగా చేసుకోగలిగింది. విశ్వక్రీడల్లో రెండు పతకాలందుకున్న మొదటి భారత ముదిత. తోడుగా ప్రపంచ స్థాయి పోటీల్లో సువర్ణంతోపాటు ఐదు పతకాలు ఇప్పటికే ఆమెను వరించి ఉన్నాయి. క్రీడారంగ భవితమీద శతకోటి ఆశలు పెంచుతున్నందుకే – సింధు శాశ్వత విజేత.

ధీర మీరాబాయి చాను

టోక్యో క్రీడోత్సవాల్లో భారత్‌కు సంబంధించి, పతకాల ఖాతా తెరిచిన ధీర క్రీడామణి మీరాబాయి చాను. మళ్లీ ఇరవై ఏళ్ల తదనంతరం (మల్లీశ్వరి కాంస్య సాధన దరిమిలా) వెయిట్‌ ‌లిఫ్టర్‌గా గెలుపుబావుటా ఎగురవేసిందీమె. స్నాచ్‌, ‌క్లీన్‌ అం‌డ్‌ ‌జర్క్ అం‌శాల్లో కిలోల కొద్దీ బరువునెత్తి ఇన్నాళ్లకు భారత్‌కు తిరిగి రజతాన్ని అందజేసింది. ఈమెదీ పాతికేళ్లకు పైగా వయసు. మణిపురి క్రీడా దీపకళిక. ఇదివరకు కామన్వెల్త్ ‌పోటీల్లోనూ స్వర్ణ, రజత పతకాలు సంపాదించిన అనుభవముంది. వరల్డ్ ‌ఛాంప్‌ ‌క్రీడల్లోనూ నాలుగేళ్లనాడు స్వర్ణపతక ధారిణి. ఆసియా స్థాయి పోటీలకు కూడా పతక విజయం ద్వారా వన్నె తెచ్చింది. పదీ పన్నెండేళ్ల ప్రాయం నుంచీ ఆ క్రీడాసక్తి. వరస పోటీల్లో నెగ్గుతూ వచ్చి, మునుపటి ఏడాది సమ్మర్‌ ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డునూ సృష్టించింది. నిజానికి బరువు మోయడం ఇప్పుడీమెకు నూతనంగా అలవడింది కాదు. మొదట్లో కుటుంబ పోషణకు కట్టెలు మోసిన చేతులే అవి. కొండ ప్రాంతంలో జీవనం. చుట్టుపక్కల అడవుల్లోకి వెళ్లి, కట్టెలుకొట్టి, మోపులుగా చేసి, అమ్ముకొని పొట్టనింపే పరిస్థితి తనది. ఆఖరి సంతానమైనా, కుటుంబాన్ని చూసుకోవడంలో బాధ్యత రీత్యా తానే పెద్ద. అలాంటి యువతే తొలిసారిగా కామన్వెల్త్ ‌గేమ్స్ (2014)‌లో పతకం గెలుచుకుంది. బాల్యం నుంచీ తాను తీసుకున్న శిక్షణా కఠినతరమే. రెండేళ్లు గడిచాయో లేదో, రాష్ట్రస్థాయి వెయిట్‌ ‌లిఫ్టింగ్‌లో స్వర్ణపతకం సాధించింది. మునుపటి ‘రియో’లో ప్రతికూలత ఎదురైనా భరించి సహించి, ప్రస్తుత ఉత్సవాల్లో మెరుపులు మెరిపించింది. ఇంతకుమించిన క్రీడోత్సాహం ఇంకెక్కడ ఉంటుంది?

అసమాన లవ్లీనా

ఒలింపిక్‌ ‌క్రీడా సంబరాల్లో పతకం సాధించిన భారత బాక్సర్లలో మూడో క్రీడారత్నం లవ్లీనా. పోటీల ప్రథమ రోజుల్లోనే కాంస్యాన్ని నెగ్గి, ఘన విజయ శుభారంభం చేసింది. పోడియంపై నిలబడిన మేటి బాక్సర్‌గా తనదైన ప్రత్యేకత చాటుకుంది. తనదీ పాతికేళ్ల ప్రాయమే. కిందటేడాది సమ్మర్‌ ఒలింపిక్స్ ‌లోనూ పతక విజయం ఆమెదే. అంతకుముందే వరల్డ్ ‌బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌ ‌పోటీల్లో కూడా గెలు పొందింది. ఢిల్లీలో ముగిసిన ప్రథమ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం సంపాదించుకుంది. అసోం నుంచి ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌. ‌మునుపటి ఏడాదిన అర్జున అవార్డును స్వీకరించింది. అందిన నగదు ప్రోత్సాహకాలూ అనేకం. ఈ అన్నింటికీ మూలకారణమైన బాక్సింగ్‌ ఎప్పటికీ తన ఆరో ప్రాణముంటుందీ యువ క్రీడాకారిణి. ఆటలు, పోటీలు, క్రీడోత్సాహం, విజయానందం వీటన్నింటి నడుమ పురోగమిస్తూ ఉంటుంది క్రీడాస్ఫూర్తి. దీన్ని పుణికిపుచ్చుకున్న జీవితం ఏనాడూ వెన్ను చూపదు, వెనక్కి తగ్గదు. పోరాడు తుంది, గెలుపు లభించేదాకా శ్రమిస్తుం టుంది. వచ్చింది స్వర్ణం, రజతం, కాంస్యం – ఏదైనా ఎప్పటికీ గెలిచేది పోరు పటిమ ఒక్కటే. ఆ విధంగా చూసినప్పుడు ‘మేరా భారత్‌ ‌మహాన్‌’ అనాల్సిందే మనమంతా!

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram