సాటిలేని సేనాపతి

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

దేశం కోసం బాధలు పడి, త్యాగాలు చేసిన సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌తూర్పు ఆసియా భారతీయులను ఆయస్కాంతంలా ఆకర్షించటంలో వింత లేదు. ఫెల్ట్ ‌హాట్‌ ఎడమచేతితో పట్టుకుని క్రీమ్‌ ‌కలర్‌ ‌సూటులో సింహంలా నడచివచ్చి సింగపూర్‌ ‌విమానాశ్రయంలో మొట్టమొదటి సైనిక వందనం స్వీకరించిన క్షణానే ఐఎన్‌ఎ ‌సైనికులను జీవితకాల పర్యంతం ఆయన ‘హిప్నటైజ్‌’ ‌చేసిన తీరు మాత్రం నిజంగా అద్భుతం.

‘‘సాథియోం ఔర్‌ ‌దోస్తోం’’ అని తమని ఉద్దేశించి బోస్‌ ‌చేసిన మొట్టమొదటి సంబోధనే గార్డ్ ఆఫ్‌ ఆనర్‌ ‌కవాతులో పాల్గొన్న సైనికులను పులకరింప చేసింది. ‘‘అంత గొప్ప నాయకుడు మనల్ని సహచరులారా! స్నేహితులారా! అని ప్రేమగా పిలిచాడు. అందరం కలిసి కత్తిపట్టి బ్రిటన్‌తో పోరాడి మన దేశాన్ని విమోచన చేద్దాం రండి అని ఆహ్వానించాడు- తెలుసా?’’ అని బారక్స్‌కు తిరిగి వెళ్ళాక తోటివారితో గొప్పగా చెప్పుకున్నారు. విన్నవారు ‘‘నిజమా’’ అని నోరెళ్ళ బెట్టారు. ఐఎన్‌ఎ ‌సైనికుల వీరవిదేయతను, వీరాభిమానాన్ని నేతాజీ మొదటిరోజునే చూర గొన్నాడు. ‘‘సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌సింగపూర్‌లో అడుగు పెట్టినది లగాయతు నేను ఆయన ప్రతి మాటను, కదలికను జాగ్రత్తగా గమనించాను. ఆయన ప్రసంగాలు కనికట్టులాగా నన్ను కట్టిపడేశాయి. భారతదేశం వాస్తవ చిత్రాన్ని ఆయన మా ముందు పెట్టాడు. మొదటిసారి నేను ఒక భారతీయుడి కళ్ళతో భారతదేశాన్ని చూశాను.’’ అని INA And Its Netaji గ్రంథంలో మేజర్‌ ‌జనరల్‌ ‌షానవాజ్‌ ‌ఖాన్‌ ‌గుర్తు చేసుకున్నాడు.

సుప్రీమ్‌ ‌కమాండర్‌ అన్న టైటిల్‌ అక్షరాలా నప్పిన ప్రపంచ స్థాయి సైన్యాధిపతులలో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌పేరును మొదటి వరసలో చెప్పుకోవాలి. ఆయనలోని అణువణువూ సుప్రీం గానే కనిపించేది. యుద్ధరంగం లోనూ, శిబిరాలలో ఉన్నప్పుడూ పలికినా కదిలినా ఆయనలో తొణికిసలాడే నిబ్బరం, హుందాతనం సైనికులకు గొప్ప స్థైర్యాన్ని ఇచ్చేవి. యూనిఫాంలో ఆయన వేదిక మీద నిలబడి సేనల సెల్యూట్‌ ‌స్వీకరిస్తూంటే సేనాపతి అంటే ఇలా ఉండాలి అనిపించేది.

ఆ యూనిఫాం వరకూ విశేషమేమీ లేదు. అంత సాదాసీదా యూనిఫాం ప్రపంచంలో బహుశా మరే సేనాధిపతీ వేసివుండడు. ఎరెర్ర బాడ్జీలు లేవు. డాబుసరి రిబ్బన్లు లేవు. మెరిసే మెడల్స్ ‌లేవు. భుజానికి సొగసైన అడ్డపట్టీ లేదు. పెక్కు స్టార్ల భుజకీర్తులు లేవు. ధగధగలాడే లెదర్‌ ‌బెల్టు లేదు. నడుముకు కత్తి వేలాడదు. గుర్రం ఎక్కి స్వారీ చేయడు. ధరించేది మామూలు ఖాకీ కాటన్‌ (‌జపాన్‌ ‌వెళ్ళి నప్పుడు మాత్రం చలిని తట్టుకొవటానికి ఉలెన్‌ ‌యూనిఫాం వేసేవాడు). పెట్టుకునేది మామూలు కాప్‌. ‌దానికి ముందు రెండు చిన్న ఇత్తడి గుండీలు ఉండేవి. విశాలమైన బోస్‌ ‌నుదురు మీద ఆ టోపీ ముచ్చటగా అమిరేది. గులాబీ గోధుమ రంగులు కలిసిన శరీర ఛాయ. గంభీరమైన మోము. నవ్వితే వెన్నెల. గర్జిస్తే బెంగాల్‌ ‌టైగర్‌.

‌తాను సర్వసైన్యాధిపతి, సర్వాధికారి, సుప్రీం కమాండర్‌ అయినప్పటికీ ఏ మిలిటరీ రాంకూ తీసుకోనివాడు ఆధునిక చరిత్రలో బహుశా సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఒక్కడేనేమో. ఎలాగూ మిలిటరీ యూనిఫాం వేశారు కాబట్టి మీ స్థాయికి తగ్గట్టు పెద్ద రాంకును కూడా స్వీకరించటం సబబని సహచరులు సలహా ఇచ్చినా బోస్‌ ‌వినలేదు. సైనికులు ఏరికోరి ఇష్టంగా తనకిచ్చిన ‘నేతాజీ’ యే వెయ్యి రాంకుల పెట్టు అని ఆయన అనేవాడు. హోదాలూ, పతకాలూ కొలవలేని సహజమైన కమాండింగ్‌ ‌వ్యక్తిత్వం ఆయనది. సైనికులనో సివిలియన్లనో ఉద్దేశించి ప్రసంగించటానికి ఎంత పెద్ద సభలోనైనా నేతాజీ వేదిక ఎక్కితే అందరూ గుడ్లప్పగించి మంత్ర ముగ్ధుల్లా ఆయననే చూస్తూండిపోయేవారు. నెత్తిన ఫోరేజ్‌ ‌కాప్‌, ‌విశాలమైన ఛాతీకి అతికినట్టు సరిపోయే ఖాకీ బుష్‌ ‌కోటు, మొకాలి కిందికి దిగిన లాగు, పాలిష్‌ ‌చేసిన టాప్‌ ‌బూట్లు ధరించి నేతాజీ నిటారుగా నిలబడి విరోధుల గుండెలదిరేలా దేశభక్తుల మేను పులకలెత్తేలా మాట్లాడుతూంటే భారతీయల స్వాతంత్య్ర కాంక్ష జిబ్రాల్టర్‌ ‌రాక్‌ ‌వలె మూర్తీభవించి నట్టు తలపించేది. ఎంతటివారినైనా డామినేట్‌ ‌చేయగల నేతాజీ మహా మూర్తిమత్వానికి థాయి, బర్మీస్‌, ‌జపనీస్‌, ఇం‌డోనీసియన్లు కూడా ముగ్ధులయ్యే వారు. తూర్పు ఆసియా మొత్తంలో ఆయనకు సరితూగగల దిగ్గజం మరొకరులేరని అన్ని జాతుల వారూ అంగీకరించేవారు. సింపుల్‌ ‌యూనిఫాంలోనే రాజాధిరాజులా తేజరిల్లే తమ సుప్రీం కమాండర్‌ను తలచుకుంటేనే సిపాయిల ఛాతీ గర్వంతో పొంగేది.

నేతాజీ మాటలు వింటే చాలు సైనికులు మనస్ఫూర్తిగా ఆయనకు సరండర్‌ అయిపోయేవారు. బహుశా లోకంలో ఏ ఆర్మీ కమాండరూ అలా మాట్లాడి ఉండడు. సైనికులను కదనరంగానికి సాగనంపే ముందు ఆయన ఏమన్నాడో తెలుసా? ‘‘తాము ప్రాణాలు అర్పించబోతున్నది ఎంతటి మహదాశయం కోసం అన్న విషయంలో ఎవరికైనా ఏ మాత్రం అనుమానం ఉన్నా పక్కకు తప్పుకోండి. ధైర్యం చాలకో, నమ్మకం కుదరకో యుద్ధానికి వెళ్ళటం ఎవరికైనా ఇష్టం లేకపోతే ఆ మాట నిర్భయంగా చెప్పండి. మీ నిజాయితీని, నిష్కపటాన్ని నేను మెచ్చు కుంటాను. ఏ కళంకమూ అంటకుండా వారిని వెనక్కి పంపించి ఉపయోగకరమైన ఇంకో బాధ్యత అప్పగి స్తానని నేను మాట ఇస్తున్నాను. నాకు కావలసింది సంఖ్యాబలం కాదు. ఉన్నది కొద్దిమంది అయినా సరే-దేనికీ బెదరని, చావుకు వెరవని ధీరులైతే చాలు.’’

ఇలా పలికిన కమాండర్‌ను ఆ సైనికులు అంతవరకూ చూడలేదు. ‘‘నా వెంట ఎవరు వచ్చినా ఎందరు రాకపోయినా నేనైతే ముందుకే సాగుతా. అనుకున్నది సాధిస్తా’’నన్న నేతాజీ అపరిమిత ఆత్మవిశ్వాసం వారికి నచ్చింది. ఎక్కడలేని ధైర్యాన్ని ఇచ్చింది. బలవంతమేమీ లేదు. కావాలనుకుంటే వెనక్కి పోవచ్చునని నేతాజీ ఇచ్చిన చాయిస్‌ ‌వారిని ఇష్టపూర్వకంగా బలిదానానికి పురికొల్పింది.

For the present I can offer you nothing except hunger thirst, privation, and death. But if you follow me in life and death, I shall lead you to victory and freedom. Give me blood and I promise you freedom. (ప్రస్తుతం మీకు నేను ఇవ్వగలిగింది ఏమీ లేదు- ఆకలి, దప్పిక, కష్టాలు, చావు తప్ప. కాని చావులో బతుకులో నా వెంట ఉంటే నేను మిమ్మల్ని స్వాతంత్య్రానికి చేరుస్తాను. నాకు మీ నెత్తురు ఇవ్వండి. నేను మీకు స్వాతంత్య్రం సాధిస్తా.) – అని ఆయన అంటూంటే వారికి భయం వేయకపోగా ఉత్తేజం ఉప్పొంగి ‘‘నేతాజీ కీ జై’’ నినాదంతో దిక్కులు దద్దరిల్లేవి. నాయకుడికి చేసిన బాసకు తగ్గట్టే వారు అష్టకష్టాలనూ ఇష్టంగా పడ్డారు. కొందరైతే యుద్ధభూమిలో తిండి దొరకక అడవి గడ్డి తిని పదకొండు రోజులు పోరాడారు.

చూడగానే పూజ్యభావం కలిగించే నాయకుడికి శ్రేణులతో కలిసి మమేకం కావటం సాధారణంగా కష్టం. నేనూ మీలో ఒకడినన్న ఆత్మీయత తన సేనలకు నేతాజీ అలవోకగా కలిగించాడు. పగ్గాలు చేతపట్టీ పట్టగానే సైనిక శ్రేణుల జీతాలను, అలవెన్సులను అడగకుండానే సహేతుకంగా సవరించాడు. తనకు వేరు- సైనికులకు వేరుగా వంట వండటానికి వీల్లేదు. సైనికులకు వండే ఆహారాన్నే తనకూ పెట్టాలి అని ఆయన రూలు. అది సరిగా అమలవుతున్నదా లేదా అని తరచూ తనిఖీ చేసేవాడు. ఏ శిబిరంలోనో భోజనాల వేళ ఒకరి వీపుకు ఒకరు ఆనుకుని వరసల్లో కూచుని ఉండగా ఆకస్మికంగా నేతాజీ వెళ్ళేవాడు. నేరుగా వంటశాలకు వెళ్లి ఏమి వండారు, ఎంత శుభ్రంగా వండారు అన్నది క్షుణ్ణంగా తనిఖీ చేసేవాడు. తరవాత భోజనశాలకు వెళ్లి ఏదో ఒక వరసలో సామాన్య సైనికుల సరసన కూచుని భేషజం చూపకుండా తానూ భోంచేసేవాడు. సిపాయిల తిండే తానూ తిని, పదార్థాల నాణ్యత గురించి కాంప్‌ ‌కమాండెంట్‌కు చెప్పేవాడు. సాక్షాత్తూ నేతాజీ తమమధ్య కూచుని తమతోపాటు భోంచేసిన సంగతి చెమర్చిన కళ్ళతో సిపాయిలు జీవితాంతం గుర్తుచేసుకునే వారు. నూనె, పప్పుల నుంచి ఎప్పుడైనా చేపలు, మాంసం వరకూ ఒక్కో సైనికుడికీ ఇచ్చే రేషన్‌ ఎం‌తెంత అన్న లెక్క నేతాజీకి వేళ్ళమీద ఉండేది. అది సక్రమంగా అందరికీ అందుతున్నదా లేదా అని ఆయన జాగ్రత్తగా కనిపెట్టేవాడు.

 హెడ్‌ ‌క్వార్టర్స్ ‌లో ఉన్నప్పుడు ఖాళీ దొరికితే బోస్‌ ‌తన ఆఫీసర్లతో బాడ్మింటన్‌ ‌లాంటి ఆటలాడే వాడు. అవసరమైతే బట్టలు మార్చుకోవటానికి వారిని తన నివాసానికి తీసుకువెళ్ళేవాడు. వాళ్ళు ముఖం కడుక్కుంటున్నప్పుడు పక్కనే నిలబడి టవల్‌ అం‌దించేవాడు. అలాగే గాయపడిన సైనికులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులకు నేతాజీ వీలైనప్పుడల్లా వెళ్లి ఒక్కొక్కరినీ పలకరించి కుశలం కనుక్కునేవాడు. అప్పుడప్పుడూ తన ఇంటినుంచి మిఠాయిలు చేయించి రోగులకు పంపించేవాడు. ఇలాంటి లక్షణాల వల్లే నేతాజీ తనకు ఆప్తమిత్రుడు, ఆప్తబంధువు అని ప్రతి సిపాయీ, ప్రతి ఆఫీసరూ ఫీల్‌ అయ్యేవాడు. దేశం, స్వాతంత్య్రం తప్ప ఇంకో ధ్యాస లేని, ఎవరికీ తలవంచని అటువంటి మహా నాయకుడి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వారు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు.

ఏ మాత్రం అవకాశం ఉన్నా నాయకుడు తమకు ఏదీ తక్కువ చేయడన్న భరోసాతో సైనికులు లోటుపాట్లను లెక్క చేసేవారు కారు. యుద్ధభూమిలో అన్నిటికీ కరువే. కూరగాయలు దొరకక అడవిగడ్డితోనే కూర చేసుకునేవారు. ఆఖరికి ఉప్పుకు కూడా కటకటే. ఏరోజైనా సరఫరాలు అంది ఉప్పు దొరికిందంటే పండగే. ఆ పూట ప్రతివారూ మామూలుకంటే ఎక్కువ అన్నం సంబరంగా తినేవారు. కనీస పోషకాహారం లేక సైనికులు తరచూ జబ్బుపడే వారు. అయినా ఎవరూ నేతాజీ స్వయంగా వాకబు చేసినా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేసేవారు కారు. ‘‘మేము బాగున్నాము. ఇక్కడ ఏ లోటూ లేదు’’ అని కష్టాలు భరిస్తూ బింకంగా చెప్పేవారు. కాంప్‌ ‌కమాండెంట్లు చెపితేనే రేషన్‌ ‌కొరతల గురించి నేతాజీకి తెలిసేది. ఎస్‌.ఎ. అయ్యర్‌ ‌స్వయంగా చూసి ‘‘Unto Him A Witness’’ గ్రంథంలో రాసినట్టు ‘‘దీనంతటికీ కారణం నేతాజీ అంటే సైనికులకు ఉన్న మేరలేని భక్తి. ఆ నాయకుడికీ సైనికుడికీ నడుమ పెనవేసుకున్న మానవీయ బంధం విశిష్టమైనది. వారు ఒకరికోసం ఒకరు ఏమైనా చేసేవారు. నేతాజీ ఆర్మీని హిప్నటైజ్‌ ‌చేశాడు. నేతాజీని ఆర్మీ హిప్నటైజ్‌ ‌చేసింది’’ (పుట 214)

మానవీయ బంధం ఎంత పటిష్ఠంగా ఉన్నా మానవీయ బలహీనతలూ, ప్రలోభాలూ కనీసం కొందరి మీదనైనా పనిచేస్తూనే ఉంటాయి. వాటినీ నేతాజీ తనదైన ఫక్కీలో డీల్‌ ‌చేశాడు. పైన ఉటంకించిన గ్రంథంలో అయ్యర్‌ ‌పేర్కొన్న ఇంకో ఘటన దీనికి చక్కని ఉదాహరణ. రంగూన్‌ ‌దిశగా దూసుకువస్తున్న బ్రిటిష్‌ ‌బలగాలను నిలవరించటానికి బర్మా రంగంలో ఐఎన్‌ఎ ‌హోరాహోరీగా పోరాడు తున్న సమయాన జరగకూడనిది జరిగింది. సెకండ్‌ ‌డివిజన్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ‌లోని ఐదుగురు ఐఎన్‌ఎ ఆఫీసర్లు శత్రువుకు దాసోహమన్నారు. అది ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌కు తగిలిన మొట్టమొదటి విఘాతం. భారతీయ సమాజం దృష్టిలో నేతాజీకి, దేశభక్త సేనలకూ ఉన్న ప్రతిష్ఠకు తలవంపులు తెచ్చిన విపరిణామమది. అనుక్షణం ప్రమాదభరితమైన యుద్ధక్షేత్రంలో ప్రాణాలకు తెగించి పర్యటిస్తూండగా నేతాజీకి ఈ పిడుగులాంటి కబురు తెలిసింది. అప్పటికే బర్మా, జపాన్‌ ‌వారికి కూడా వార్త పాకింది.

విషణ్ణ వదనంతో నేతాజీ పర్యటన రద్దుచేసుకుని రంగూన్‌ ‌తిరిగివెళ్ళాడు. రోజూ లాగా సుప్రీం కమాండ్‌ ‌కార్యస్థానానికి గానీ లీగ్‌ ఆఫీసుకి గాని వెళ్ళకుండా, ఎవరినీ కలవకుండా ఇంటిదగ్గరే ఉండిపోయాడు. సరిగా అదే సమయాన ఆయన తొడ ఎముక వ్యాయామం చేస్తూండగా బెణికింది. పర్సనల్‌ ‌వైద్యుడు కల్నల్‌ ‌రాజు చికిత్స చేశాడు. భరించలేని నొప్పి. పక్కకు తిరగలేడు. ఎటూ కదలలేడు. శారీరక బాధను మించింది మానసిక వ్యథ. పక్క మీద ఉన్నవాడు ఉన్నట్టు పడుకొని తీవ్రంగా మథన పడ్డాడు. వారం తరవాత నెప్పి కాస్త తగ్గిన తరవాత కూడా భోజనానికీ బయటకు రాకుండా గదిలోనే ఉండి తీవ్రంగా ఆలోచించాడు. అత్యవసరమైన ఏదో పని మీద తనను కలవటానికి అయ్యర్‌ ‌వచ్చినప్పుడు ‘‘ఈ వెధవలు ఎందుకలా చేశారు? తోటివాళ్ళకూ దేశానికీ ద్రోహం చేయటానికి వాళ్లకు మనసెలా ఒప్పింది? పోనీ బ్రిటిషు వాళ్ళేమన్నా వీరికి చేతులు చాచి స్వాగతం పలుకు తారా? వీళ్ళు బావుకునేదేమిటి? సరే, జరిగినదానికి విచారించటం వృథా! ముందు సంగతి చూడాలి. ఒక ఆయిదుగురు జారుకుంటే మాత్రం ఐఎన్‌ఎకు ఏమయింది? ఇకముందు ఎవరూ పారిపోకుండా ఎలా జాగ్రత్తపడాలి. చూద్దాం’’ అన్నాడు.

జరిగిన ద్రోహానికి జాతీయ సైన్యంలోని ప్రతి సోల్జరుకూ, ప్రతి ఆఫీసరుకూ ఒళ్ళు కుతకుతలాడింది. కట్టు తప్పి పారిపోయిన వారిని చంపేయాలన్నంత ఉద్రేకం అందరికీ కలిగింది. నేతాజీ ఎలా స్పంది స్తాడు, ఏమి చేయమంటాడు అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూశారు. దీర్ఘాలోచన తరవాత దారి దొరికింది. చికాకు పోయి నేతాజీ ముఖం తేట పడింది. ‘‘అంతా మన మంచికేలే. ఈ విషాదాన్నే ఐఎన్‌ఎకి విజయంగా మారుస్తాను చూడు’’ అని అయ్యర్‌కి చెప్పి రంగూన్లో అందుబాటులో ఉన్న సైనికులందరినీ పిలిపించాడు.

ఐదు వేల మందికి పైగా సిపాయిలు, ఆఫీసర్లు సైనిక శిబిరం ఎదుట బారులు తీరారు. నేతాజీ వారితో ఏకబిగిన నాలుగు గంటలు హిందుస్తానీలో మాట్లాడాడు. జీవితకాలానికి సరిపడా ఉత్తేజాన్ని అందరిలో నింపాడు. యుద్ధరంగంలో ఇకపై శత్రువు వైపు ఫిరాయించే పాపానికి ఎవరు పాల్పడినా నిర్దాక్షిణ్యంగా కాల్చివేయండి. అలాంటి దేశ ద్రోహానికి మీ పై ఆఫీసరే ఒడిగట్టినా సరే అక్కడికక్కడే షూట్‌ ‌చెయ్యండి – అని సైనికులకు సంపూర్ణాధికారం ఇచ్చాడు. ప్రపంచంలో అంతకుముందు ఏ సైన్యానికీ ఏ సైన్యాదిపతీ ఇవ్వని ఉత్తర్వు అది. దాంతో వాతావరణం మొత్తం మారిపోయింది. సైనికుల నైతిక స్థైర్యం వంద రెట్లు పెరిగింది. దానితో పాటు- ద్రోహుల వ్యతిరేక దినం త్వరలో జరపబోతున్నాం. శత్రువుతో చేతులు కలపటం ఎంత మహాపాపమో తెలియజెప్పే నాటకాలకు ఆ రోజున పోటీ పెడతాం; ఉత్తమ నాటకాలకు మంచి బహుమతులు ఇస్తాం- అని నేతాజీ ప్రకటించాడు. ఆ పోటీకి న్యాయనిర్ణేతల్లో అయ్యర్‌ ‌కూడా ఒకడు.

‘‘ఎప్పటిలాగే నేతాజీ గెలిచాడు. ప్రతికూలతను కూడా అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో చేసి చూపించాడు. రంగూన్‌ ‌లోని మిలిటరీ క్యాంపులు, ఆక్సిలరీ క్యాంపులు అన్నీ నాటకాల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ద్రోహుల భరతం పట్టటం ఎలాగన్నదానిపై తమ సృజనాత్మకతను రంగరించి, ప్రథమ బహుమతి ట్రోఫీ గెలుచుకోవ టానికి సైనికులు రాత్రింబవళ్ళు సాధన చేశారు. ఆ క్రమంలో వారిలోని సైన్యపు నైతిక ధృతి అమాంతం పెరిగింది. దేశభక్తి అందరిలో పొంగిపొర్లింది. పోటీలు అయిపోయాక కూడా సెంటిమెంటు స్థిరంగా నిలిచింది.’’

[Unto Him A Witness, S.A.Ayer, PP 203]

అది భారతదేశాన్ని మతవిద్వేషాలు పట్టిపీడిస్తున్న కాలం. మాజీ జాతీయవాది మహమ్మదాలీ జిన్నా మతోన్మాదిగా మారి, హిందువులూ మహమ్మ దీయులూ కలిసి ఉండలేరంటూ ద్విజాతి సిద్ధాంతాన్ని భయానకంగా ప్రచారం చేస్తున్నాడు. తడవకో మడతపెచీతో,మూర్ఖపు పంతంతో అతడు అంటించిన మతచిచ్చుకు జాతీయనాయకులనబడిన వారు బెంబెలెత్తి గింగరాలు తిరుగుతున్నారు. విశేషమేమి టంటే అప్పట్లో భారతదేశం మొత్తాన్నీ దహిస్తున్న మతవైషమ్యం ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో కలికానికి కూడా కనిపించేది కాదు.

వ్యక్తిగతంగా బోస్‌కు హిందూమతం, సనాతన ధర్మాలలో పరిపూర్ణ విశ్వాసం ఉండేది. ఆయన స్వయానా కాళీమాత భక్తుడు. వివేకానందుడి పటాన్ని లేవగానే కనపడేలా ఎప్పుడూ మంచం పక్కనే పెట్టుకునేవాడు. ఆయన సింగపూర్లో ఉండగా తీరిక దొరికినప్పుడల్లా అక్కడి రామకృష్ణా మిషన్‌కు వెళ్లి ప్రశాంతంగా ధ్యానం చేసుకునేవాడు. హిందూ మతానికి సహజ లక్షణమైన పరమత సహిష్ణుత బోస్‌కు నరనరాల్లో జీర్ణించింది. మతాల అంతరాలను ఐఎన్‌ఎలో పొరపాటునకూడా సుభాస్‌ ‌బోస్‌ ‌చొరనిచ్చే వాడు కాదు. ఏ బాధ్యత అప్పగించే ముందైనా వ్యక్తి ప్రతిభనే తప్ప ఆ వ్యక్తి కులం మతం ప్రాంతాలను పట్టించుకునేవాడు కాదు. తానూ స్వతహాగా సెక్యులర్‌ ‌కావడం ఒకటే కాదు. సెక్యులర్‌గా ఉన్నట్టు లోకానికి తెలపటానికీ బోస్‌ ‌ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు.

ఉదాహరణకు టోక్యో నుంచి బెర్లిన్‌కు బయలుదేరినప్పుడు సుభాస్‌ ‌బోస్‌ ఒక హిందువునూ, ఒక సిక్కునూ, ఒక మహమ్మదీయుడినీ వెంట తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. తీరా బయలుదేరేముందు తన వెంట ఒకరికి మించి చోటులేదని జర్మన్లు చెప్పటంతో ఆబిద్‌ ‌హుస్సేన్‌ అనే మహమ్మదీయుడిని సహాయ కుడిగా ఎంపిక చేసుకున్నాడు. బర్మా రంగంలో యుద్ధానికి తరలిన ఐఎన్‌ఎ ‌సేనలకు డివిజనల్‌ ‌కమాండర్లు మేజర్‌ ‌జనరల్‌ ‌షా నవాజ్‌ ‌ఖాన్‌, ‌మేజర్‌ ‌జనరల్‌ ‌కయాని. ఇద్దరూ ముస్లింలే.

మనుషుల మధ్య కులం, మతం, ప్రాంతాల తారతమ్యం నేతాజీ ఎన్నడూ చూపేవాడు కాదు. అందరం ఒకే మాతృభూమి బిడ్డలం. మన నడుమ ఏ రకమైన తేడాపాడాలు ఉండటానికి వీల్లేదు అని ఆయన సైనికులకు నూరిపోసే వాడు. తేడాలేమైనా ఉంటే• అవి విదేశీ పాలకులు మనల్ని చీల్చి ఛిద్రం చేసే దుర్బుద్ధితో తెచ్చిపెట్టినవేనని చెప్పేవాడు. ఎవరి మతాన్ని వారు ఆచరించటానికి పరిపూర్ణ స్వేచ్చ ఇచ్చేవాడు. ఒకరి మత ఉత్సవంలో ఇతర మతాల వారూ పాలు పంచుకునేందుకు ప్రోత్సహించేవాడు. అంతేకాదు. మతపరమైన వ్యవహారంలో కూడా దానికి సంబంధించిన మతం వారికే ప్రాధాన్యం ఇచ్చి, అన్యమతస్థులు రాకూడదంటే ఒప్పుకునేవాడు కాదు. ఆజాద్‌ ‌హింద్‌ ‌కేబినెట్లో మంత్రిగా కూడా పని చేసిన సైన్యాధికారి ఎ.సి. చటర్జీ వర్ణించిన ఈ ఉదంతం నేతాజీ సెక్యులర్‌ ‌తత్వానికి పరాకాష్ఠ.

 సింగపూర్‌లోని టాంక్‌ ‌రోడ్‌ ‌దగ్గర చెట్టియార్‌ ‌గుడి అని ప్రసిద్ధ దేవాలయం ఉండేది. మీ ఉద్యమానికి మాకు చేతనైన విరాళం ఇవ్వదలిచాము. మీరొకసారి మా గుడికి వచ్చి మాట్లాడగలరా అని అలయ నిర్వహకులు సుభాస్‌ ‌చంద్ర బోస్‌ను సాదరంగా అడిగారు. చాలా పెద్దమొత్తమే వారు ఇవ్వదలిచారు.

బోస్‌ ‌స్థానంలో మరొకరుంటే మహద్భాగ్యం అని వెంటనే వెళ్లేవారే. కానీ నేతాజీ ఇష్టపడలేదు. దేవుడంటే భక్తిలేకా? విరాళం అవసరం లేకా? రెండూ కాదు. దేవాలయం పవిత్రమైన పూజాస్థలం. అక్కడ మతపరమైన, భగవత్‌ ‌సంబంధమైన విషయాలు మాత్రమే ఆలోచించాల్సిన అలాంటి చోటికి తాను వెళ్లి స్వాతంత్య్ర ఉద్యమమనే రాజకీయ, లౌకిక వ్యవహారం నిమిత్తం విరాళాలు ఇమ్మని కోరటం బాగుండదని నేతాజీ భావన (పార్టీ ప్రచారానికి, రాజకీయ స్వార్థానికి కూడా దేవుడి సొమ్మును తేరగా కాజేయాలని చూసే ఈ కాలపు పాలకులకూ, పవిత్ర స్వాతంత్య్రోద్యమానికి గుడి నిధులు ఆపేక్షించటం కూడా భావ్యం కాదన్న నేతాజీకీ నడుమ ఎంత తేడా?).

గుడి పెద్దలు వినలేదు. తప్పులేదు రండి అని మరీ మరీ పిలిచారు. ‘‘అయితే ఒక షరతు. నావెంట కుల, మతాల తేడాలేకుండా నా ఆఫీసర్లు కూడా వస్తారు. వారిని సైతం గుళ్ళోకి రానివ్వాలి. అందుకు మీ ఆచారం అడ్డు వచ్చేట్టయితే నాకు మీరూ వద్దు. మీ విరాళమూ వద్దు’’ అని నిక్కచ్చిగా చెప్పాడు బోస్‌. అం‌తరాలయం లోకి ఎవరిని అనుమతించాలన్న విషయంలో ఆ గుడి నిబంధనలు మహా స్ట్రిక్టు. కాబట్టి వారు పిలవరనే అంతా అనుకున్నారు. కాని- ఆశ్చర్యం! ‘‘మీరు ఎవరినైనా వెంటబెట్టుకు రావచ్చు. మాకు అభ్యంతరం లేదు.’’ అని ఆలయ ట్రస్ట్ అధికారుల నుంచి సమాధానం వచ్చింది.

 హిందూ, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్‌ ఆఫీసర్లను వెంటబెట్టుకుని నేతాజీ చెట్టియార్‌ ‌గుడికి వెళ్ళాడు. హిందువులు కాని వారికి అనుమతి లేని అంతరా లయంలోకి అందరినీ అడుగుపెట్టనిచ్చారు. అంతే కాదు. బ్రాహ్మణులకు తప్ప ప్రవేశం లేని గర్భగుడి లోనికి కూడా వారందరినీ వెళ్ళనిచ్చారు. పైగా పూజారులు అందరికీ కుంకుమబొట్టుపెట్టి ప్రసాదం కూడా చేతిలో పెట్టారు. మహమ్మదీయ, క్రైస్తవ ఆఫీసర్లు సైతం బొట్టు పెట్టించుకుని దేవుడి ప్రసాదం ఆనందంగా ఆరగించారు.

మతాల తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఒక మతం వారి పండుగవేడుకలలో మిగతా మతాల వారూ పాలు పంచుకోవటం నేతాజీ ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ఆఫీసర్లకూ సైనికులకూ చక్కగా అలవరచాడు. ఈద్‌ ‌వచ్చిందంటే హిందువులు మసీదుకి వెళ్లి, ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగిస్తే దీపావళి నాడు ముస్లింలు హిందువుల ఆలయానికి వెళ్లి, హిందూ సోదరులతో కలిసి విందు చేసేవారు. సిక్కుల పండగరోజు హిందువులు, ముస్లింలు కలిసి గురుద్వారాలకు వెళ్లి సిక్కు సోదరులతో సహపంక్తి భోజనాలు చేసేవారు.

[India’s Struggle for Freedom, Maj. Gen. A.C. Chatterji, pp. 147-149 ]

విభజించి పాలించిన బ్రిటిష్‌ ‌వారి పద్దతికి పూర్తిగా భిన్నంగా నేతాజీ సైనికులకు కామన్‌ ‌కిచెన్లు ఏర్పాటు చేయించాడు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఒకే చోట వండిన పదార్థాలను ఒకే చోట కూచుని కలిసి భోంచేసేవారు.సేనల్లో జాతీయభావం పెంపొందడానికి అది బాగా ఉపయోగపడింది. భారత సైనికులకు నేతాజీ చేసిన మహోపకారం ఏమిటంటే బ్రిటిషు కొలువులో ఉండగా వారికి తెల్లవాళ్ళు చేసిన అన్యాయాలను సరిదిద్దాడు. అంతకు పూర్వం భారతసైన్యంలో ఒకే యూనిట్‌లో ఒకే హోదాలో పనిచేస్తున్నా జీతాలూ భత్యాలూ యూరోపియన్లకు వేరు. భారతీయులకు వేరు. బ్రిటిషు సోల్జరుకు నెలకు 75 రూపాయల జీతమైతే భారతీయ సిపాయికి జీతం దానిలో మూడవవంతు (నెలకు పాతిక రూపాయలు). తిండిలో, బసలో కూడా అడుగడుగునా జాతివివక్ష. బ్రిటిషు ‘టామీ’ ఎక్కువ. భారతీయుడు తక్కువ.

మొదట్లో ఇండియన్‌ ఆర్మీలో ఆఫీసర్లందరూ యూరోపియన్లే. అవసరాలు పెరిగే కొద్దీ గత్యంతరం లేక భారతీయులనూ తీసుకోసాగారు. ఇండియన్‌ ‌కమిషన్డ్ ఆఫీసర్‌ (ICO)‌లకు తర్ఫీదు ఇవ్వటం కోసం డెహ్రాడూన్‌లో ఇండియన్‌ ‌మిలిటరీ అకాడమీని పెట్టారు. ఐ.సి.వో.లకు బ్రిటిష్‌ ఆఫీసర్లతో సమా నంగా జీతాలూ, బత్తేలూ, ఇతర సదుపాయాలూ, అవకాశాలూ కల్పిస్తామని ఇచ్చిన హామీని తెల్లదొరలు గాలికొదిలారు. జూనియర్‌ ‌బ్రిటిష్‌ ఆఫీసర్లు కంపెనీలను కమాండ్‌ ‌చేస్తూంటే ఐ.సి.వో.లు నడపగ లిగింది ప్లాటూన్లను మాత్రమే. డివిజన్‌ ‌కమాండ్‌ ‌చేయటానికి ఒక్క ఐ.సి.వో. కూడా నోచుకోలేదు. బ్రిగేడ్‌ ‌కమాండ్‌ ఒకరికి మాత్రమే ప్రాప్తించింది. సీమలోని ప్రిన్స్ ఆఫ్‌ ‌వేల్స్ ‌రాయల్‌ ఇం‌డియన్‌ ‌మిలిటరీ అకాడెమీనుంచి వచ్చిన కింగ్స్ ‌కమిషన్డ్ ఆఫీసర్‌ (‌KCIO)లకు తమకింద పనిచేసే బ్రిటిష్‌ ‌ట్రూప్స్‌ని శిక్షించే పవరు ఉండేది. అదే దేశవాళీ ఐ.సి.వో.కు ఆ అధికారం లేదు. జీతభత్యాల విషయంలో భారతీయ ఐ.సి.వో. అధికారులకు అడుగడుగునా జాతి వివక్ష. దేశీయ లెఫ్టినెంటుకు నెలకు 400 రూపాయలు చెల్లిస్తే అదే పని చేసే బ్రిటిషువాడి జీతం 600 రూపాయలు. అంటే 50 శాతం ఎక్కువ. అడ్జటెంటు, క్వార్టర్‌ ‌మాస్టర్లకిచ్చే అలవెన్సు బ్రిటిషు ఆఫీసరుకైతే వంద రూపాయలు. అదే ఇండియన్‌ ఆఫీసరుకు మాత్రం అరవై రూపాయలే. సామర్ధ్యంలో, పరాక్రమంలో తెల్లతోలు వాళ్లకంటే మనవాళ్ళే మెరుగు. అయినావారికి అన్నిటా చిన్నచూపే.

రాంకు ఒకటే బీ చేసే పని ఒకటే అయినప్పుడు తెల్లవారికి మాకంటే ఎక్కువ జీతాలూ అలవెన్సులూ ఎందుకు ఇస్తున్నారు – అని అడిగితే ‘‘ఎందుకంటే వారు తమ దేశం వదిలి ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నారు కనక’’ అని దొరలు చెప్పేవారు. మరి రెండో ప్రపంచయుద్ధంలో మేము కూడా దేశం వదిలి ప్రవాసం వచ్చి ఆగ్నేయాసియాలో పనిచేస్తున్నాము కదా? అదే రూలు ప్రకారం మాకూ తెల్లవారితో సమానంగా జీతాలు ఇవ్వాలి కదా అని అడిగితేనెమో మీ ప్రాప్తమింతేనని కసిరేవారు. దానికి తోడు అమానుషమైన అవమానాలు. ఉదాహరణకు ఆఫీసర్స్ ‌క్లబ్బుల్లోకి ICO అధికారులను రానిచ్చేవారు కారు. రాంకు ఒకటే అయినా యూరోపియన్‌ ఆఫీసరు పక్కన కూచుని ఆసియన్‌ ఆఫీసరు రైల్వే కంపార్టుమెంటులో ప్రయాణం చేయటానికి వీల్లేదని మలయాలో ఆంక్ష.

ఇలా రకరకాల అన్యాయాలతో, పరాభావాలతో లోలోన రగిలిపోతున్న భారతీయ సైనిక దళాలకు సింగపూర్‌లో నేతాజీ రాకతో గొప్ప ఉత్తేజం వచ్చింది. 1942 ఫిబ్రవరిలో సింగపూర్‌ ‌జపాన్‌ ‌వశమయ్యాక యుద్ధఖైదీలుగా పట్టుబడ్డ భారత సైనికుల్లో వేల మంది మోహన్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలో జపాన్‌ ‌వారు పెట్టించిన నేషనల్‌ ఆర్మీలో-దేశభక్తితోనో, యుద్దఖైదీల బానిసబతుకు కంటే మేలన్న ఉద్దేశంతోటో – చేరారు. నాయకత్వ వైఫల్యాల వల్ల వారిలో చాలామంది విసుగెత్తి వెనక్కిపోయారు. దరిమిలా దిక్కుచోచక డీలా పడి ఉన్న సైనిక బలగాలకు సుభాస్‌ ‌చంద్ర బోస్‌ను చూశాక ధైర్యం వచ్చింది. ఆత్మవిశ్వాసం ఇనుమడించింది.

ఇంకా విశేషం ఏమిటంటే తిరుగుబాటులో చేరేకంటే బ్రిటిషు సామ్రాజ్యానికి విధేయంగా యుద్ధఖైదీగా మిడకటమే గౌరవప్రదమని భావించిన ఆర్మీ ఆఫీసర్లలో కూడా చాలామందికి నేతాజీ స్ఫూర్తితో మనసు మారింది. మాలో చేరమని ఎవరినీ బలవంత పెట్టముబీ ఇష్టపడి వచ్చేవారిని స్వాగతి స్తాము. రాదలుచుకోని వారిని సతాయించము – అని ఆయన అభయం ఇచ్చినా పెద్దపెద్ద సైన్యాధి కారులు ఎందరో అడిగి మరీ ఐఎన్‌ఎలో చేరారు.

1857 లోనూ తరవాత లేచిన తిరుగుబాట్ల లోనూ సాధారణ సిపాయిలు, నడిమి రకం ఆఫీసర్లే తప్ప ఇంగ్లండులోని రాయల్‌ ‌మిలిటరీ అకాడమీలో, శాండ్‌హర్సట్‌లో శిక్షణ పొందిన KCIO ఉన్నతాధి కారులు కట్టు తప్పలేదు. కాబట్టి మిలిటరీ కమాండ్‌ ‌మొత్తం తమ గుప్పిట్లో ఉన్నదని భ్రమసిన సీమదొరలకు ఇప్పుడు కళ్ళు పచ్చబడ్డాయి. ప్రిన్స్ ఆఫ్‌ ‌వేల్స్ ‌రాయల్‌ ఇం‌డియన్‌ ‌మిలిటరీ అకాడెమీ బాచ్‌లో గోల్డ్ ‌మెడలిస్టు అయిన మేజర్‌ ‌నృపేంద్ర సింగ్‌ ‌భగత్‌. ‌బ్రిటిష్‌ ఇం‌డియన్‌ ఆర్మీలో విక్టోరియా క్రాస్‌ ‌పతకం పొందిన కెప్టెన్‌ ‌ప్రేమేంద్ర భగత్‌, ‌శాండ్‌హర్టస్ ‌రాయల్‌ ‌మిలిటరీ కాలేజిలో తర్ఫీదు పొందిన మేజర్‌ ‌జనరల్‌ ‌జె.ఆర్‌.‌భోన్సలె లాంటి హేమాహేమీలే బ్రిటిషు కొలువును కాలదవ్ని ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో చేరారని తెలిశాక ఆంగ్ల మారాజులకు కాళ్ళు చల్లబడ్డాయి. 1857 తరహాలో మళ్ళీ సైనిక తిరుగుబాటు వస్తుందా? నమ్మకస్తులనుకున్న ఆఫీసర్లు కూడా తిరగబడితే ఏమవుతుంది? ఇండియాలో ఎదురు లేదనుకున్న ఆంగ్లేయుల పెత్తనానికి పుట్టి మునుగు తుందా? తెల్లవారి ప్రాణాలకు రక్షణ ఉంటుందా- అన్న అనుమానం పెనుభూతమైంది.

సుభాస్‌ ‌బోస్‌ ఇం‌కా దండు వెడలక ముందే తెల్ల రాకాసులకు చలిజ్వరం మొదలైంది.

– మిగతా వచ్చేవారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram