అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం 1982లో విశాఖ ఉక్కు కర్మాగారం ఆరంభమైంది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది అసువులు బాసిన ఫలితమిది. కానీ నిర్వాహకుల అవినీతి, పొరపాటు నిర్ణయాల వల్ల ఈ కర్మాగారం అప్పుల్లో కూరుకు పోయింది. దీనిని సకాలంలో గుర్తించి సమస్యలను పరిష్కరించలేని కేంద్ర పభుత్వాల విధానాలే ప్రయివేటీకరణకు దారితీశాయి. దీనితో ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని కార్మికులు భయపడు తున్నారు. ఆర్ధికలోటు సాకుతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రయివేటీకరించడమే ఏకైక పరిష్కారమన్న ధోరణి సరికాదు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రారంభం

1971లోనే ఇందిరాగాంధీ శంకం స్థాపనచేసి ‘పైలాన్‌’ ఆవిష్కరించారు. 1978లో జనతా పార్టీ నాయకులు తెన్నేటి విశ్వనాథం, పి.వి. చలపతిరావు, ఎన్‌.ఎస్‌.ఎస్‌. ‌రెడ్డి కేంద్ర ఉక్కుగనుల మంత్రి బిజూ పట్నాయక్‌ను విశాఖకు ఆహ్వానించి ఉక్కు కర్మాగారం అవసరాన్ని తెలపడంతో కేంద్రం రూ।। వేయి కోట్ల• మంజూరు చేసింది. 1982లో భూమిపూజ జరిగింది.  నిర్మాణం మొదలు పెట్టినప్పుడు అంచనా ఖర్చు 4 వేల కోట్లు. 8 వేల కోట్ల ఖర్చుతో 1990 నాటికి నిర్మాణం పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిం చింది. ఆనాడు భూముల విలువ చాలా తక్కువ. కనుక విశాఖ ఉక్కు కర్మాగారానికి 26,500 ఎకరాలు లభించాయి. 64 గ్రామాలకు చెందినవారు నిర్వాసితులయ్యారు. కర్మాగారం వల్ల తమలాంటి పేదవారికి ఉపాధి లభిస్తుందన్న ఆశతో వారు గ్రామాలను ఖాళీచేసి ఇచ్చారు. ఇప్పటికి 50శాతం కుటుంబాలకు చెందిన 8000మందికి మాత్రమే ఉక్కు కర్మాగారంవల్ల ఉపాధి లభించింది. 30 సంవత్స రాల తరువాత 2021లో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించడానికి నిర్ణయం తీసుకుంది. 90-91 నాటికి 14,433 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పుడు 17,500 మంది పనిచేస్తున్నారు.

మొదటినుండి ఆర్ధిక సమస్యలే

  1. ప్రభుత్వరంగంలో కాని, ప్రయివేటురంగంలో కాని పెద్ద కర్మాగారం ప్రారంభింపబడినప్పుడు పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహమిచ్చేవిధంగా కొన్ని రాయితీలను, పన్ను మినహాయింపులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వటం పరిపాటి. కాని విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం పని ప్రారంభించి నప్పటి నుండి ఎటువంటి రాయితీలను, పన్ను మినహాయింపులను ఇవ్వలేదు. ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలే. ఫలితంగా ఈ కర్మాగారం ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుండి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేక ఆర్థికకష్టాలతో పయనాన్ని ప్రారంభించింది.

లోటు (రూ. కోట్లలో)

1990 – 91              480

1993 – 94              573

1991 – 92              988

1992 – 93              567

2001 – 02              75

1990 – 91 నుండి 2001 – 02 వరకు కర్మాగారం లోటులో నడిచింది.

దీనికి మరొక కారణం ఉంది. 1991 నాటికి దేశ ఆర్ధిక పరిస్థితి కష్టాలలో ఉంది. ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాలకు కాంగ్రెస్‌ ‌ప్రధాని పి.వి. నరసింహారావు ప్రభుత్వం పెద్దపీట వేశారు. ఆ విధానాలలో భాగంగానే నాటి కేంద్రం నూతనంగా ఉత్పత్తి ప్రారంభించిన విశాఖ ఈ కర్మాగారానికి ఎలాంటి రాయితీలను కల్పించలేదు.

  1. స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇం‌డియా లిమిటెడ్‌ (SAIL)‌లో విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పాత్‌ ‌నిగం లిమిటెడ్‌ (RINL) భాగం కాకపోవడం.

సెయిల్‌  ‌దేశంలోని ప్రభుత్వరంగ ఉక్కు కర్మా గారాలకు ఒక వేదిక. విశాఖ ఉక్కు కూడా సెయిల్‌లోని 5వ కర్మాగారంగా నిర్మించాలని మొదట్లో నిర్ణయమయింది. నిర్మాణ పక్రియలో తీసుకోవలసిన నిర్ణయాల కోసం, సెయిల్‌ ‌బోర్డు అనుమతి కోసం ప్రతిసారి ఢిల్లీ వెళ్లాల్సి వస్తుండటంతో తీవ్ర జాప్యం జరిగేది. దీనిని నివారించటానికి మాత్రమే రాష్ట్రీయ ఇస్పాత్‌ ‌నిగమ్‌ ‌లిమిటెడ్‌ (RINL) పేరుతో విశాఖ ఉక్కుకు కొత్త యాజమాన్య బోర్డును ఏర్పాటు చేశారు.

నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించేనాటికి తిరిగి సెయిల్‌లో విలీనం చేయవలసి ఉన్నా, పదవులు (సి.ఎమ్‌.‌డి., డైరక్టర్లు) కోల్పోతామన్న స్వార్ధంతో అప్పటి యాజమాన్యం నుండి ఇప్పటి యాజమాన్యం వరకు సెయిల్‌లో విలీనం చేయనివ్వలేదు. విశాఖ ఉక్కు కర్మాగారం సెయిల్‌ ‌పరిధిలో ఉండి ఉంటే అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండేదికాదు. ప్రయివేటీకరణ అవసరం ఏర్పడేదికాదు.

  1. ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగారాల ఉత్పత్తులను అమ్మడానికి దేశవ్యాప్తంగా మార్కెట్‌ ‌యార్డులు నిర్మాణమయ్యాయి. వీటిలో 23 యార్డుల్లో సెయిల్‌, ఆర్‌.ఐ.ఎన్‌.ఎల్‌. ఉత్పత్తులు ప్రక్కపక్కనే అమ్ముతారు. 1994 నుండి ఈ అమ్మకాలలో పోటీ పెరిగింది. దాంతో డిస్కౌంటు ఇవ్వటం ప్రారంభించారు. సెయిల్‌తో పాటు ఆర్‌.ఐ.ఎన్‌.ఎల్‌. ‌కూడా డిస్కౌంటు ఇవ్వడంలో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖ ఉక్కుకర్మాగారం ఆర్థికంగా నష్టాలలో ఉండడానికి ఇది మూడవ కారణం.
  2. ‘‘నెలాఖరు అమ్మకాలకు ప్రత్యేక డిస్కౌంటు ఇచ్చే విధానం మార్కెటింగ్‌ అధికారుల అవినీతికి మరింతగా దోహదపడింది.’’
  3. విదేశాలలో ఉన్న డిమాండుతో విదేశీ అమ్మకాలపై యాజమాన్యం ఎక్కువ దృష్టిపెట్టి దేశీయ మార్కెట్టును నిర్లక్ష్యం చేసింది. దేశీయ మార్కెట్టు వ్యవస్థను బలోపేతం చేయకపోవడం, విదేశీ గిరాకీ తగ్గడం, అంతర్జాతీయంగా మార్కెట్టు పతనం, డిస్కౌంటు కలిసి 1996-97 నాటికి ఉశాఖ ఉక్కు కర్మాగారానికి నష్టాలు పెరిగి బి.ఐ.ఎఫ్‌.ఆర్‌.‌కు నివేదించే పరిస్థితి ఏర్పడింది.

ఆదుకున్న వాజపేయి ప్రభుత్వం

1998 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా విశాఖ, అనకాపల్లి ప్రచార సభల్లో వాజపేయి ‘విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని’ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వాజపేయి ప్రధాన మంత్రి అయ్యారు. ఆనాటి కేంద్ర సహాయమంత్రి బండారు దత్తాత్రేయ .వీ.ణ., బి.ఎన్‌. ‌సింగ్‌తో, కర్మాగార యాజమాన్యంతో కార్మిక నాయకులతో పరిష్కార విధానాలపై చర్చించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేందప్రభుత్వం కర్మాగారాన్ని ఆర్థికంగా ఆదుకుంటే, కర్మాగారాన్ని లాభాల వెంట నడిపిస్తానని ఆనాటి సి.ఎమ్‌.‌డి. – కేంద్ర సహాయ మంత్రి దత్తాత్రేయకు హామీ ఇచ్చారు. వాజ్‌పేయి ప్రభుత్వం 1,333 కోట్ల రూపాయలను ప్రిఫరెన్షియల్‌ ‌షేర్లుగా మార్చటంతో కర్మాగారం బి.ఐ.ఎఫ్‌.ఆర్‌.‌కు వెళ్లకుండా ఆగింది.

లాభాల బాటలో కర్మాగారం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూతను అందిపుచ్చుకుని అత్యంత క్లిష్ట పరిస్థితిని చవిచూసిన కార్మికులు, అప్పటి యాజమాన్యం, అధికారులు అకుంఠిత దీక్షతో కలిసిపనిచేసిన కారణంగా ఉత్పాదకత వందశాతం చేరుకుంది. అంతర్జాతీ యంగా, దేశీయంగా స్టీలు వినియోగం పెరగడంతో మార్కెట్టు పరిస్థితులు మెరుగుపడినాయి. కర్మాగారానికి ఉక్కు గనులు లేకపోయినా 2004 నాటికి అన్ని అప్పులు తీర్చివేసి సుమారు 5 వేలకోట్ల రూపాయల నిల్వ స్థితికి చేరుకుంది.

ఆర్ధిక సంవత్సరం   మిగులు కోట్లల్లో పన్నులు

                చెల్లించక ముందు –   చెల్లించిన తరువాత

2002 – 03              522-522

2003 – 04            1546-1546

2003 – 04              1546-1546

2004 – 05              2284-2008

2005 – 06              1890-1252

2006 – 07              2222-1363

2007 – 08              2995-1943

2008 – 09              2026-1335

2009 – 10              1248-797

2010 – 11              982-658

2011 – 12              1109-751

2012 – 13              526- 353

2013 – 14              548-366

2014 – 15              104-62

2007 – 2008 ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక మిగులుగా 2995 కోట్లు వచ్చింది.

గనుల కేటాయింపునకు అంగీకరించని

నాటి యాజమాన్యం

ఉక్కు కర్మాగారానికి గనులు ఉండి ఉంటే నేటి అప్పుల స్థితి ఉండేది కాదని, కనుక కర్మాగారానికి కేందప్రభుత్వం కొన్ని గనులను కేటాయించాలని కొందరు కోరుతున్నారు. 1999 – 2004 మధ్య కాలంలో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వ హయాంలో ప్రక్క రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌ ‌ముఖ్యమంత్రి డా।। రమణసింగ్‌  ‌కొన్ని ఇనుప గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించటానికి సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఛత్తీస్‌ఘడ్‌లో 500మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ షరతుకు యాజమాన్యం ఒప్పుకోలేదు. దాంతో విశాఖ ఉక్కు కర్మాగారం సొంత గనులను పొందే  సువర్ణావకాశాన్ని జారవిడుచుకుంది.

 పొరపాటు విధానాలు

2004లో మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వం వచ్చింది. అప్పుడే చేతిలో రూ.5వేల కోట్ల• ఉండటంతో కర్మాగారపు ఉత్పత్తిని 3.2 ఎమ్‌.‌టి. నుండి 7.3 ఎమ్‌.‌టి.లకు ప్లాంటును విస్తరిస్తామని, దీనికి రూ.8వేల కోట్లు ఖర్చవుతుందని, మూడు సంవత్స రాలలో విస్తరణ పూర్తిచేస్తామని చెప్పి, యాజమాన్యం కేంద్ర అనుమతి పొందింది. ఈ నిర్మాణ పక్రియలోనే భారీ అవినీతి జరిగింది. విస్తరణ వ్యయం రూ.12 వేల కోట్లకు పెరిగింది.

ఒక కార్మికుడు

(విశాఖ ఉక్కు కర్మాగారం)

(మిగతా వచ్చేవారం)

By editor

Twitter
Instagram