‌గడచిన వందేళ్లలో ప్రపంచం చూడని మహా విపత్తు కొవిడ్‌ 19. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశమైనా ఈ మహమ్మారి ప్రభావంతో నెలకొన్న పరిస్థితులను బట్టే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా కేంద్ర బిందువుగానే నడవవలసి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి స్పృహనూ, వాస్తవికతనూ ప్రతిబింబించినదే మన కేంద్ర బడ్జెట్‌. ఆర్ధికాంశాలతో పాటు, ఆరోగ్యరంగాన్ని విస్మరించడం సాధ్యంకాని ఒక కీలక దశలో ప్రపంచం ఉంది.  కొవిడ్‌ ‌సంక్షోభం నేర్పిన పాఠాల నుంచి జనించిన బడ్జెట్‌ అం‌టూ చాలా పత్రికలు వ్యాఖ్యానించడం అక్షరసత్యమే కూడా. 2020-21 వార్షిక బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి కేటాయించిన రూ.94,452 కోట్ల నుంచి, 2021-22 బడ్జెట్‌లో ఆ రంగానికి 2,23,846 కోట్లకు పెంచారు. అంటే 137 శాతం కేటాయింపులు పెరిగాయి. అందులో 15.6 శాతం కరోనా టీకాల పంపిణీకి కేటాయించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను టీకాల పంపిణీకి రూ. 35,000 కోట్లు కేటాయించడం శ్లాఘించదగినదే. ఈ మొత్తం చాలకపోతే మరిన్ని కేటాయింపులు చేయడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ‌చెప్పడం స్వాగతించదగినది. న్యూమోకోకల్‌ ‌టీకాను కూడా అందించడానికి కేంద్రం సిద్ధపడుతోంది. ఇది కూడా వాస్తవిక దృష్టితో తీసుకున్న మంచి నిర్ణయం. న్యూమోనియా, మెనింజైటిస్‌, ‌సెప్టిసీమియా వంటి వాటి నుంచి రక్షించడానికి ఆ టీకా ఉపకరిస్తుంది. వాటితో ఏటా యాభయ్‌ ‌వేల మంది వరకు మరణిస్తున్నారు.ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాలకే పరిమితమైన న్యూమోకోకిల్‌ ‌ను ఇప్పుడు దేశమంతా విస్తరింపచేయాలని కూడా అనుకుంటున్నట్టు మంత్రి వెల్లడించడం ముదావహమే. పీఎం ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌పథకం పేరుతో ప్రైమరీ, సెకండరీ, ప్రాంతీయ సంరక్షణ ఆరోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని, కొత్తగా వచ్చే వ్యాధులను గుర్తించి చికిత్స అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందిస్తామని బడ్జెట్‌లో చెప్పారు. నిజానికి భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ అత్యవసరం. దీనిని పటిష్టంగా, సాధ్యమైనంత త్వరగా అమలు చేస్తే గ్రామీణ భారతం నుంచి నగరాలకు వైద్యం చేయించుకోవడానికి వచ్చే వారి సంఖ్యను తగ్గించుకోవచ్చు.

చాలా దేశాలు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. దానికి తగ్గట్టే మన బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని అనిపిస్తుంది. వ్యాక్సిన్‌ ‌విషయంలో విధానం కూడా సరైన దిశలోనే ఉందని అనిపిస్తుంది. బయటి మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్‌ అమ్మడానికి ఇంతవరకు అనుమతులు లేవు. అదే జరిగితే సాధారణ ప్రజలకు ఘోరమైన అన్యాయమే జరుగుతుంది. ప్రభుత్వానికి రూ. 200/-లకు, ప్రైవేటు వ్యక్తులకైతే రూ. 1000/లకు ఇస్తారు. నిజానికి ప్రైవేటు మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్‌ అమ్మకాలను అనుమతిస్తే  నల్ల బజారు విస్తరించే ప్రమాదమే ఉంది. అవన్నీ ఎలా ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్‌ ‌తయారీ వరకు కూడా భారతదేశ ఫార్మసీ పరిశ్రమది విజయగాథ. కానీ వ్యాపారం కూడా వాటికి ప్రధానమే కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి తలెత్త కుండా ఈ ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించడమే విశేషం. అలాగే వారియర్స్‌కు ముందు ఇవ్వాలన్న యోచన కూడా సముచితంగా ఉంది. తరువాత పెద్ద వయసువారు, పేదలు ఇలా ప్రాధాన్యం ఏర్పరచడం కూడా సబబే. ఒకటి అంగీకరించాలి. గతంలో చాలా బడ్జెట్‌లు వచ్చాయి. కానీ ఆరోగ్య రంగానికి ఇంత పెద్ద పీట వేసిన బడ్జెట్‌ ‌కానరాదు. చివరిగా కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను రూపొందించడంలో మన శాస్త్రవేత్తల ప్రతిభకు దేశం ధన్యవాదాలు చెప్పాలి.

– డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్‌, అపోలో

About Author

By editor

Twitter
YOUTUBE