వ్యావసాయక భారతావనికి  వ్యవసాయాభి వృద్ధే శ్రీరామరక్ష. ఇది గుర్తించే  కేంద్ర ప్రభుత్వం పలు పథకాలతో ఆ రంగాన్ని బలోపేతం చేస్తున్నది. కరోనా కష్టకాలంలో చాలా దేశాల ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమైనప్పటికీ, మన దేశ ఆర్థిక స్థితి కకావికలం కాకుండా నిలబడడానికి దోహదం చేసినది సేద్యమే.

ఈ  బడ్జెట్‌  (2021-22) అటు గ్రామసీమల వృద్ధితో పాటు వ్యవసాయాన్ని బలోపేతం చేయటం, రైతుల ఆదాయాన్ని ఇనుమడింపజేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిందనడం వాస్తవం. గత సంవత్సరం, వ్యవసాయరంగానికి రూ.1.45 లక్షలు కేటాయించగా ఈసారి ఏమాత్రం కోత లేకుండా రూ.1.48 లక్షల కోట్లను కేటాయించడమే ఇందుకు నిదర్శనం.  రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని గణనీయంగా పెంచటం హర్షిణీయం. గత బడ్జెట్‌లో 15 లక్షల కోట్లుగా ఉన్న ఈ రుణ పరిమితిని, ఈ బడ్టెట్‌లో 16.5 లక్షల కోట్లకు పెంచారు. ఈ పెంపును రైతులకు పూర్తిస్థాయిలో, ఇబ్బందులు లేకుండా అందజేసేందుకు రుణ పంపిణీని సరళీకృతం చేయాలి. ఇందుకు కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డులను ఎక్కువ మంది రైతులకు అందివ్వాలి. ఆ కార్డుల ద్వారా రుణాలను తీసుకున్నపుడు ఒక పంటకాలం వరకు వడ్డీ లేకుండా, ఆ పైన మాత్రమే పావలా వడ్డీ తీసుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

గతంతో పోల్చితే ఈ బడ్జెట్‌ ‌కేటాయింపులలో కొద్దిపాటి పెంపే కనిపించినప్పటికీ, ఇప్పటికే వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు అమలవుతున్న   పథకాలన్నీ యధాతథంగా కొనసాగుతాయని అర్ధం చేసుకోవాలి.

కరోనా కాలంలో ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాలకు లక్ష కోట్లకు పైగా కేటాయించి ప్రగతికి బాటలు వేశారు. అదే క్రమంలో ఈసారి కూడా వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాల వృద్ధికి పెద్దపీట వేశారు. వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయాల వృద్ధికి ‘ఆగ్రిసేన్‌’ ‌పేరుతో పెట్రోల్‌పై రూ. 2.50, డిజీల్‌పై రూ. 4.00 సుంకం విధించటం ద్వారా వచ్చే ఆదాయంతో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశించారు. దార్శనికతతో కూడుకున్న ఈ చర్య మౌలిక సదుపాయాల కల్పనలోనూ వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఆ రెండు చమురు ఉత్పత్తుల మీదనే గాకుండా ఇంకో 10 వస్తువులపై సుంకాన్ని విధించి, వేలకోట్ల రూపాయలను సేకరించవచ్చు. అలా సేద్యంలో మౌలిక సదుపాయాల కల్పనను పటిష్టం చేయవచ్చు. రైతుల అవసరానికి సరిపడా రుణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు తగినన్ని పెట్టుబడులను పూర్తి స్థాయిలో కల్పిస్తే, కరోనా కాలంలో ఆదుకొన్న తీరులోనే మన ఆర్థికప్రగతికి  వ్యవసాయం దోహదపడుతుంది.

రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలంటే వ్యవసాయోత్పత్తులను పెంచడంతో పాటు, వాటికి గిట్టుబాటు ధర కల్పించటం అవసరం. ఈ దిశగా కేంద్రం ఇప్పటికే సాగు వ్యయాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా 30 శాతం పెంచి కనీస మద్దతు ధరల విధానాన్ని రూపొందించింది. కనీస మద్దతు ధరలు ఇదే విధంగా కొనసాగుతాయని ప్రభుత్వం హామీ ఇవ్వటం ముదావహం. కనీస మద్దతు ధరను ఆ పరిధిలోని పంటలతో పాటు ఇతర పంటలకు విస్తృతపరచేందుకు ప్రభుత్వం సత్వర చర్యలకు నాంది పలకటం మంచి చర్యే.

పంటల ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు మించి విక్రయించేందుకు  మార్కెటింగ్‌ ‌వ్యవస్థలోని మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడం ముఖ్యం.  పూర్తిగా సంక్షేమానికే గాకుండా, ఇలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తే వ్యవసాయ రంగాభివృద్ధికి,  రైతు సంక్షేమానికి దారి ఏర్పడు తుంది. గ్రామీణ ప్రాంత మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో రూ. 40,000 కోట్లు  కేటాయించి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంది.

ప్రస్తుతం దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ‌కమిటీలు క్రమబద్ధీకరిస్తున్న మండీలు సుమారు ఏడు వేలున్నాయి. ఇప్పటివరకు గ్రామాల్లో ఉన్న 22,000 సంతలను అభివృద్ధి చేసి, జాతీయ స్థాయిలో అనుసంధానం చేస్తూ, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక సంత (మండీలను) ఏర్పాటు చేసే విధంగా మున్ముందు చర్యలు తీసుకోవాలి. ఈ చర్యల ద్వారా మార్కెట్లను విస్తృతపరచి, ప్రైవేట్‌ ‌రంగాన్ని కూడా పోటీదారుగా చేర్చి, వ్యవసాయ ఉత్పత్తుల సత్వర కొనుగోలుతో పాటు కనీస మద్దతు ధరల కన్నా హెచ్చుగానే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ దిశగానే లక్ష కోట్ల మేరకు మౌలిక వసతుల నిధిని మార్కెటింగ్‌ ‌కమిటీల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించటం ముదావహం. కిసాన్‌ ‌సమ్మాన్‌నిధికి ఈ బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు కేటాయించినప్పటికి అర్హులైన ప్రతి ఒక్కరికి నగదును మూడు దఫాలుగా ఇవ్వటం జరుగుతుందని ప్రభుత్వం చెపుతున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పనులు కల్పించేటపుడు,  రైతులను అందుబాటులో ఉంచడం వల్ల వ్యవసాయపనుల్లో కూలీల కొరత లేకుండా, వ్యవసాయం కుదేలు కాకుండా సాగుతుంది. వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పనులను అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులు ఆశిస్తున్నారు.

ఈనామ్‌ ‌మార్కెట్ల బలోపేతానికి వెయ్యి కోట్లు కేటాయించటం మంచి పరిణామమే. అలాగే పత్తిలో దిగుమతి సుంకాన్ని విధించటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ బడ్జెట్‌ ‌మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు కొనసాగింపు, వ్యవసాయ రుణపరిమితి లక్ష్యం పెంపు, పశు, మత్స్య, పాడి పరిశ్రమ రంగాలపై ప్రత్యేక దృష్టి, వ్యవసాయ మార్కెట్ల సాధికారతకు నిధులను కేటాయించటం సంతోషదాయకం. ఈ బడ్జెట్‌తో పాటు ఆత్మనిర్భర్‌ ‌ద్వారా భారత్‌ ‌పటిష్టమై తలఎత్తు కుని ముందుకు సాగుతుందని ఆశించవచ్చు.

– ప్రొ।। పి. రాఘవరెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా, వ్యవసాయ

విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

About Author

By editor

Twitter
Instagram