ఆర్థిక వ్యవస్థను కుంగదీసిన కరోనానూ, ఆర్థిక స్థితిగతులు మరీ పతనం కాకుండా మరొకసారి కాపాడిన కర్షకులనీ దృష్టిలో ఉంచుకుని రూపొందించినదే 2021-2022 కేంద్ర బడ్జెట్‌. ‌కొవిడ్‌ 19 ‌వంటి మహమ్మారి నుంచి దేశం కోలుకుంటున్న వేళ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థకు ఒక వ్యాక్సిన్‌ ‌వలె పనిచేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆరోగ్య రంగానికి 137 శాతం అదనంగా నిధులు కేటాయించడం కనిపిస్తుంది. అలాగే చమురు ఉత్పత్తులతో పాటు, వెండి, బంగారాల మీదా వ్యవసాయ రుసుమును కూడా విధించారు. డిజిటల్‌ ‌రూపంలో తొలిసారి పార్లమెంటు ముందుకు వచ్చిన ఈ బడ్జెట్‌ ఎట్టి పరిస్థితులలోను అందరి మెప్పు సాధించలేదు. బడ్జెట్‌ అం‌టే కళ్లు మూసుకుని విమర్శించడమే పనిగా పెట్టుకున్న పార్టీలు ఉన్న దేశంలో నిజమైన అంచనాను ఆశించలేం. అయితే జనాకర్షక పథకాలకే కాదు, భారీ పన్నులకు కూడా ఈ బడ్జెట్‌ ‌దూరంగా ఉంది. కానీ ఇందులో ఉన్న నిర్మాణాత్మకమైన యోజనలకు తగిన ప్రాచుర్యం లభించలేదన్న అభిప్రాయం కూడా బలంగానే ఉంది.

కొవిడ్‌ ‌సమయంలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఈ దశాబ్దపు తొలి బడ్జెట్‌ (2021-22) ‌గురించి ఊహించినట్టుగానే దేశంలో చర్చ జరుగుతున్నది. బడ్జెట్‌ను కొందరు విమర్శించడం, కొందరు సమర్థించటం, కొందరు నిరుత్సాహ పరటం ఏటా జరుగుతుంది. ప్రభుత్వం ఆ సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటి సాధనకు అవలంబించ బోయే పద్ధతులు, కార్య ప్రణాళిక, వాటిని అమలు చేయటానికి అవసరమైన వనరుల సమీకరణ, సేకరించిన వనరుల సమర్థ వినియోగం వంటి వివరణాత్మక అంశాలతో కూడుకొన్నదే బడ్జెట్‌. ‌కాబట్టి దానికి అత్యంత ప్రాధాన్యం.

పెరుగుతున్న రుణాలు

దేశంలో జిఎస్‌టి అమలు తరువాత పరోక్ష పన్నులలో సవరింపులు చేసే స్వేచ్ఛ ఆర్థికమంత్రులకు (కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ) తగ్గింది. కానీ ఏ కార్యక్రమ చేపట్టాన్నా నిధులు కావాలి. దానికి ప్రభుత్వాలకి ఉండే మార్గాలు- పన్నులు, సేవలకు రుసుములు వసూలు చేయటం, అవకాశమున్న వాటిని అమ్మటం లేదా అప్పులు చేయటం. వీటిలో పన్నుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవటానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తాయి. కానీ ఆ ఆదాయం చాలట్లేదు. కాబట్టి ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెరిగింది. ఇతర మార్గాలలో వనరులు సేకరించే క్రమంలో అప్పులు చేయటం పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు గణనీయంగా పెరగటం వల్ల ఇతర వ్యాపార, వాణిజ్య వర్గాలకు సంఘటిత రంగం నుంచి లభించే ఆర్థిక వనరులు తగ్గిపోతున్నాయి. ఈ సంవత్సరం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గతంలో కంటే ఎక్కువ స్థాయిలో అప్పులు చేయబోతున్నట్టు తెలుస్తున్నది. గతంలో ప్రభుత్వం చేసే ఖర్చులో ఎక్కువ భాగం పన్నులు, పన్నేతర మార్గాల నుంచి సమకూర్చుకుని, మిగిలిన దానికి అప్పులు చేసేవారు. ఇప్పుడు దాదాపు పన్ను ఆదాయం ఎంతో అంత మేరకు అప్పు చేయవలసి వచ్చింది. దేశ రాజకీయాలలో 2014వ సంవత్సరం కీలకమైనది. అప్పుడు  కేంద్ర ఆదాయం, ఆ సంవత్సరం ప్రభుత్వం చేసిన అప్పుల గురించి తెలుసుకోవటం లేదా గుర్తు చేసుకోవటం ఈ సందర్భంగా అవసరం.

2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి మన ఆర్థిక పరిస్థితి ఏమిటో 2013-14 గణాంకాల నుంచి తెలుస్తుంది. మొదటి దఫా ప్రభుత్వ కాలంలో ప్రభుత్వ ఆర్థిక స్థితి కొంతమేరకు మెరుగు పడింది. ప్రధానంగా పన్ను ఆదాయ వసూళ్లులో 2014 నుంచి తొలి 4 సంవత్సరాలలో మంచి వృద్ధి నమోదయింది. మొదటి అయిదు సంవత్సరాల కాలంలో పన్ను ఆదాయం 62శాతం కంటే ఎక్కువగా పెరిగింది. అదే కాలంలో ఖర్చు వేగంగా పెరగటంతో అప్పులు కూడా పెరిగాయి. అయితే పై పట్టికలో చూపినట్టు 2013-14లో ప్రభుత్వం చేసిన అప్పులు ఆ సంవత్సర పన్ను ఆదాయంలో పోల్చినప్పుడు 61.32 శాతం ఉండగా అది 2018-19 నాటికి 59.44 శాతానికి తగ్గి మెరుగైన ఆర్థిక స్థితికి అద్దం పట్టింది. అయితే 2019-20లో ఎన్నికలు జరగడంవల్ల కొంతమేరకు ఆదాయం తగ్గటం వల్ల అప్పులు ఎక్కువగా చేయవలసి వచ్చింది.

కొవిడ్‌తో అంచనాలు తారుమారు

గత సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే దిశగా చర్యలు చేబట్టి అప్పును ప్రభుత్వ పన్ను ఆదాయంతో పోల్చినప్పుడు 48.68 శాతానికి కుదించే విధంగా అంచనాలు రూపొందిం చారు. అయితే కొవిడ్‌ ‌వల్ల అంచనాలు తారుమారై, ఆశించిన మేర ఆదాయం రాలేదు. కానీ విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం ఖర్చు తగ్గించటం మంచిది కాదు. కాబట్టి ఎక్కువగా అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కొవిడ్‌ ‌ప్రభావం తగ్గటం, ఆర్థిక స్థితి గాడిలో పడటంవల్ల మన ఆర్థిక వ్యవస్థ 2021-22లో వేగం పుంజుకొని 11 శాతం వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా వేశారు. అయినా ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గత బడ్జెట్‌లో వేసిన అంచనాల మేరకు కూడా చేరుకోలేమని ఈ బడ్జెట్‌ అం‌చనాలు తెలియజేస్తున్నాయి. ఆదాయం అంతగా లేకపోయినా వర్తమాన పరిస్థితులో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించటం వల్ల ఆర్థిక వ్యవస్థకు కావలసిన ఉత్సాహాన్ని ఇవ్వలేమని భావించి కాబోలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ చేయని స్థాయిలో ఈ సంవత్సరం ప్రభుత్వం అప్పు చేయాలని నిర్ణయించి ఆ మేరకు అంచనాలు రూపొందించారు. కేంద్ర ప్రభుత్వమే కాక, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా అదనంగా అప్పుచేసే వెసులుబాటు కల్పించారు.

ఆత్మ నిర్భర్‌ ‌ప్యాకేజీలో భాగంగా కల్పించిన అదనపు వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలక• వాటి స్థూల ఉత్పత్తిలో 4 శాతం వరకు అప్పు చేసే వెసులుబాటు ఇచ్చారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు ఎక్కువ చేసి వ్యయం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుందనే సందేహం కొంతమందికి కలగవచ్చు. ప్రభుత్వాలు తమ ఆదాయాలకు మించి, అప్పులు చేసి ఖర్చులు చేయడం వల్ల, మన ఆర్థిక వ్యవస్థలో చాలామందికి డబ్బు అంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రజలు డబ్బు ఉంటే ఖర్చు చేస్తారు కాబట్టి, దేశంలో వస్తు, సేవల కొనుగోలుకు గిరాకీ పెరుగుతుంది. దాంతో వస్తు, సేవల ఉత్పత్తి పెంచాల్సి వస్తుంది. వస్తు, సేవల ఉత్పత్తి పెంచాలంటే, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచాలి. ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో తిరిగి మునుపటివలె  వేగం పుంజుకుంటుంది. అలాగే ప్రజలు వస్తు సేవల కొనుగోలు, వినిమయం పెంచటంవల్ల ప్రభుత్వాలకు పన్నుల నుంచి, పన్నేతర మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది. అలా ఆదాయం పెరిగితే తెచ్చిన అప్పుపై వడ్డీలు, అసలు చెల్లింపు వాయిదాలు ప్రజలపై అదనపు భారం మోపకుండా ప్రభుత్వాలు చెల్లించగలుగుతాయి. అందుకని కొవిడ్‌ ‌వల్ల మన ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలలో భాగంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు ప్రభుత్వం తెలియజేసింది.

వైద్యరంగం మీద వరాలు

ఈ ప్రభుత్వం గతంలో సంకల్పించిన విధంగా రైతుల ఆదాయం రెట్టింపు చేయటం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచటం, ఆరోగ్య భారతం, సుపరిపాలన, యువతకు అవకాశాలు, అందరికీ విద్య, మహిళా సాధికారత, సమ్మిళిత సమగ్ర వృద్ధి తదితర అంశాలను దృఢపరిచే లక్ష్యంతో బడ్జెట్‌ ‌రూపొందించి నట్టు ఆర్థికమంత్రి తెలియజేశారు. కొవిడ్‌ ‌వల్ల దేశంలో వైద్యరంగం ముఖ్యంగా ప్రభుత్వ వైద్యసంస్థల పటిష్టత ఆవశ్యకతపై దేశంలో చర్చ జరుగుతున్నది. ప్రజలకు సంక్రమించే వ్యాధులను తొలిదశతోనే గుర్తించి, వీలైనంతవరకు నివారించి, వ్యాధి వచ్చినవారికి చికిత్స అందించే వ్యవస్థలు పటిష్ట పరచాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. వైద్యరంగంలో ప్రభుత్వ సంస్థలను పటిష్టపరచటానికి రూ.64,180 కోట్ల రూపాయలతో ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్‌ ‌స్వాస్థ్ ‌భారత్‌ ‌యోజన అనే పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ పథకం, వాటి లక్ష్యాలు, అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ దీనిని అమలుచేయడానికి ఆరేళ్లు పడుతుందన్నారు.

ఈ సంవత్సరం దీనికి ఎంత కేటాయించారో స్పష్టంగా తెలియజేయలేదు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం చేసిన కేటాయింపులు మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 1.8 శాతం కంటే ఎక్కువ అని బడ్జెట్‌ ‌ప్రధానాంశ పట్టికల్లో పేర్కొన్నప్పటికీ, వివరాలలోకి వెళ్లినప్పుడు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యయం కోసం చేసిన కేటాయింపులు రూ. 71,268.77 కోట్లు మాత్రమే. ఇది 2020- 21 సవరించిన అంచనాల కంటే తక్కువ. వాస్తవ కేటాయింపులను పరిశీలించినప్పుడు ఈ సంవత్సరం ప్రకటించిన ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ ‌స్వాస్థ్ ‌భారత్‌ ‌యోజన అమలు నామమాత్రంగానే ఉండబోతుందని, ఎక్కువ సమయం పథకం విధి విధానాల రూపకల్పనకే తీసుకుని ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నామమాత్రం నిధుల విడుదలతో సరిపుచ్చుతారని అర్థం చేసుకోవచ్చు.

పట్టణాలలో మంచినీటి సౌకర్యం కల్పించటానికి జలజీవన మిషన్‌ (అర్బన్‌) ‌పేరుతో ఒక పథకాన్ని ప్రకటించారు. దేశంలో 4378 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 2.86 కోట్ల గృహాలకు మంచినీటి కుళాయిల సౌకర్యం కల్పించటానికీ, అయిదువందల అమృత్‌ ‌పట్టణాలలో వ్యర్ధాల నిర్వహణ కోసం 2,87,000 కోట్లతో భారీ పథకాన్ని ప్రకటించారు. దీనికి కూడా ఈ సంవత్సరం ఎంత ఖర్చు చేయబోతున్నారో స్పష్టంగా తెలియజేయలేదు. ఇప్పటికే అమలు జరుగుతున్న జలజీవన్‌ ‌మిషన్‌ (‌గ్రామీణ)కు కేటాయింపులు భారీగా పెంచారు కాబట్టి, పట్టణ ప్రాంతాలకు కూడా కొంతమేరకు నిధులు ఈ పథకం క్రింద విడుదల చేస్తారని ఆశించవచ్చు.

తగ్గని రక్షణ రంగ కేటాయింపులు

ఈ ప్రభుత్వం రక్షణరంగం విషయంలో ఎటువంటి రాజీపడదని ప్రజల నమ్మకం. రక్షణ వ్యవస్థను పటిష్టపరచటానికి తగు చర్యలు తీసు కుంటుందని ప్రజల నమ్మకం. అయితే  రక్షణపరంగా దేశం తీవ్ర ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న వేళ, ముఖ్యంగా చైనా మరింత దూకుడుగా మన సైనికుల్ని కవ్విస్తున్న వేళ కూడా రక్షణ రంగానికి కేటాయింపులు పెద్దగా పెంచలేదని, గత బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల కన్నా ఈ సంవత్సరం కొంత ఎక్కువగా కేటాయింపులు చేసినట్టు కనిపించినా, పెరిగిన ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకుంటే వాస్తవ కేటాయింపులు గత సంవత్సరం కంటే తక్కువ అని తేలుతుందని కొంతమంది ఆక్షేపిస్తున్నారు. ఇటువంటి వాదనలు వినిపించేవారు సమగ్ర దృష్టితో చూస్తే వారి వాదనలో అంతగా పసలేదని వారికే తెలుస్తుంది. కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది, దానికితోడు ఇతర ఖర్చులు పెరిగాయి. భారీగా అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలకి నిధులు విడుదల చేయటం జరుగుతున్నది. ఇటువంటి పరిస్థితులలో కూడా రూ. 4.80 లక్షల కోట్ల కంటే ఎక్కువగా రక్షణ రంగానికి నిధులు కేటాయించారు. అవసరాన్ని బట్టి ఈ రంగానికి మరిన్ని నిధులు విడుదల చేయటానికి ప్రభుత్వం వెనుకాడదని ఇటువంటి విమర్శలు చేసేవారికి కూడా తెలుసు. రక్షణ రంగంలో జరిపిన కేటాయింపులలో ఎక్కువ భాగం పెన్షన్లకే ఖర్చు అవుతుందని దాదాపు లక్షన్నర కోట్లకు పైగా ఖర్చు అవుతున్నది కాబట్టి దాన్ని మినహాయిస్తే రక్షణరంగ కేటాయింపులు తక్కువగానే ఉన్నాయన్న భావన కొంతమంది నిపుణులు వెలిబుచ్చుతున్నారు. కొంతమేరకు ఇది వాస్తవమే అయినా వర్తమాన పరిస్థితులలో ఇంతకన్నా ఎక్కువ కేటాయింపులు చేయటానికి వనరులు అనుమతించదనే విషయాన్ని గుర్తించాలి.

సేద్యంలో మౌలిక సదుపాయాల కల్పన

ఈ బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయానికి చేసే కేటాయింపులు భారీగా పెంచి రూ. 5.5 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. పెట్టుబడి వ్యయం పెరగటంవల్ల దేశంలో మౌలిక సదుపాయాల కల్పన వేగం పుంజు కుంటుంది. దానివల్ల అనేక నిర్మాణ వస్తుసేవల ఉత్పత్తిలోని వారికి ఉపాధి పెరుగుతుంది, ఆ రంగంలోని ఆదాయాలు పెరుగుతాయి. దానితో సమాజంలో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుంది. ప్రజలకు మెరుగైన సేవలు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి కాబట్టి, ఔత్సాహకులు చాలామంది నూతన వ్యాపార అవకాశాలను వెతుక్కొంటారు. దాని ప్రయోజనం ఎలా ఉంటుందో వివరించవలసిన అవసరం లేదు. ప్రభుత్వం అప్పుచేసినా పెట్టుబడి వ్యయం పెరిగితే ప్రజలపై అధిక భారం పడదు.

స్వచ్ఛ భారత్‌ 2

‌మనం గతంలో నిర్మల్‌ ‌భారత్‌ అభియాన్‌ ‌చూసాం. దానికి ముందు అటువంటి పథకాలు అనేకం చూసాం. ఆ తరువాత స్వచ్ఛభారత్‌ ‌చూసాం. ప్రభుత్వం భారీ వ్యయంతో ఈ స్వచ్ఛ పరిశుభ్రతలను ఉద్యమస్ఫూర్తితో అమలుచేసింది. దానివల్ల దేశంలో బహిరంగ ప్రదేశాలలో మల మూత్రవిసర్జన తగ్గింది. ఇప్పుడు పట్టణాలలో దీనిలో కొంత మార్పు చేసి స్వచ్ఛ భారత్‌-2 ‌ను అమలు చేయబోతున్నారు. వచ్చే అయిదు సంవత్సరాలకుగాను రూ.1,41,678 కోట్ల  ఖర్చుతో ఈ స్వచ్ఛభారత్‌-2‌ను అమలు చేయబోతు న్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. ఒక రకంగా చూస్తే పారిశుద్ధ్యం, స్వచ్ఛత వంటివి స్థానిక సంస్థలు చూసుకోవాలి. కాని వాటికి ఉన్న నిధులు సరిపోక పోవటం వల్ల, పారదర్శకత లేకపోవడం వల్ల ఇటువంటి పథకాలు అమలు చేయాల్సి వస్తున్నది. అలాగే పట్టణాల్లో ప్రజారవాణా సౌకర్యం మెరుగుపరచటానికి ముఖ్యంగా పట్టణాలలో బస్సు సౌకర్యం పెంచటానికి రూ. 18వేల కోట్లతో ఒక పథకాన్ని ప్రారంభించ బోతున్నట్టు ప్రకటించారు. అనేక పట్టణాలలో ప్రజారవాణా వ్యవస్థ పటిష్టంగా లేకపోవటంవల్ల ప్రజలు వ్యక్తిగత వాహనాలను ఎక్కువగా వాడటం, దానివల్ల ట్రాఫిక్‌తోపాటు అనేక సమస్యలు పెరగటం మనం నిత్యం అనుభవిస్తున్నాం. ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు సాయంగా నూతన పథకాన్ని ప్రవేశపెట్టటాన్ని స్వాగతించవలసిన అంశం. ఈ సమస్యకు 18వేల కోట్లు సరిపోవనే వాదన అనవసరం. సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవచూపటమే తొలి అడుగు. అవసరాన్నిబట్టి మరికొన్ని నిధులు సమకూర్చటానికి అవకాశం ఉంటుంది. అలాగే మెట్రో రైళ్ల వ్యవస్థ 27 రాష్ట్రాల్లో ప్రజల అవసరాలు తీర్చటానికి సేవలు అందిస్తున్న దంటే అందులో కేంద్రం చొరవ ఉన్నదన్న అంశాన్ని గుర్తించాలి.

కొత్త బాటలో మెట్రో

ఇప్పుడు ఈ మెట్రోరైలు వ్యవస్థను మరిన్ని రాష్ట్రాలకు విస్తరించటానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కరోనా సమయంలో కూడా ఇటువంటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపటం ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుంది. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలను అందించ టంలో గతంలో కంటే ఇప్పుడు ఎంత పెరిగిందో వివరాలను ఈ బడ్జెట్‌లో పొందుపరిచారు. రైతుల పంటలకి గిట్టుబాటు ధరల విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

అన్ని వర్గాలను తృప్తి పరచటం అసాధ్యం. కానీ ప్రస్తుత తరుణంలో అన్ని వర్గాల అవసరాలను గుర్తించి, ఉన్న నిధులనే కాక అదనపు నిధులను సమకూర్చుకొని దాదాపు అన్ని వర్గాల అవసరాలకు సాధ్యమైనంత మేరకు నిధులు సమకూర్చడంతో పాటు, ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా కోలుకుని వృద్ధి చెందటానికి వీలుగా చర్యలు తీసుకుంటూ గతంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు కొనసాగిస్తూ, మరిన్ని సంస్కరణలకి శ్రీకారం చుట్టి ఉద్దీపనలు అవసరమైన మేరకు అందిస్తూ, సుపరిపాలనా, సంక్షేమం, అభివృద్ధి వంటి అంశాలకు తగు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టుగా భావించాలి. అయితే దురదృష్టవ శాత్తు ఇందులోని అంశాలలో మంచివాటికి తగిన ప్రచారం లభించలేదని చెప్పవలసి వస్తుంది.

సాయిప్రసాద్‌ : ఆర్థిక నిపుణులు

About Author

By editor

Twitter
YOUTUBE