ఉదయభానుడు భువన బాంధవుడు. అసమాన శక్తిసామర్ధ్య సంపన్నుడు. సర్వ లోక కరుణారస సింధువు. సకల ప్రాణికీ ఆత్మబంధువు. అందుకే కరుణశ్రీ కవిహృదయం-

శాంత మనోజ్ఞమై అరుణసారథికంబయి యేకచక్రవి

క్రాంతము సప్తసప్తి రుచిరంబగు స్యందనమెక్కి స్వర్ణ సం

క్రాంతులతో సహస్రకర కాంతులతో భువనత్రయిన్‌ ‌బ్రభా

వంతమొనర్చు సూర్యభగవానుడు మాకు శుభంబులిచ్చుతన్‌

అని ఆకాంక్షించింది.

స్వాగతమో కృపాబ్ధి జలజాప్త ప్రభాకర కర్మసాక్షి నీ

వాగుమొకింత- కుసుమాంజలి గైకొను- నిత్య నూత్న సు

శ్రీ గమియించు-శాశ్వత విసృత్వర విశ్వవికాసమీవె! ఓ

త్యాగమయానురాగ మహిమాంచిత వీక్షణ లోకరక్షణా!

అంటూ సుధాంశు కలమూ స్వాగతించింది. విశ్వరూపాయ, వందనీయాయ, సుప్రసన్నాయ, రుజుస్వభావచిత్తాయ వంటి విశేషణాలతో జన నీరాజనాలందుకునే మహా భాస్కరుడి రథసప్తమి మహోత్సవ శుభ సందర్భమిది. ఈ నవోత్సాహ తరుణంలో అరసవల్లి దేవాలయ ప్రాంగణమంతా ఆనంద తన్మయంగా చైతన్య చిన్మయంగా నవీన శోభాయమానమవుతోంది.

భానుడిని ప్రతి ఒక్క భక్తమానసం- అంతర్‌ ‌బహిర్‌ ‌ప్రకాశుడిగా కీర్తిస్తుంది. ‘శ్రీమతే శ్రేయసే భక్తకోటి సౌఖ్యప్రదాయినే/ నిఖిలాగమ వేద్యాయ నిత్యానందాయతే నమ’ అని మనసారా కైమోడ్పులందిస్తుంది. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని ఉష, పద్మిని, చాయాదేవి సమేత సూర్యనారాయణ దేవస్థానం సమస్త ప్రసిద్ధం. ఇది అత్యంత ప్రాచీనం, మన భారతదేశంలోనే మరెంతో ప్రశస్తం. ప్రత్యక్ష దైవరూపుడిగా, సత్యజ్ఞాన స్వరూపుడిగా స్వామికి ఇక్కడ రోజూ పూజలే. కష్టనష్టాలు తొలగించి హర్షాతిరేకాలు కలిగించే దర్శనం కావడంతో, నాటి హర్షవల్లి ఈనాటి అరసవల్లి. ఇక్కడి మందిరం గర్భగుడిలోని మూలవిరాట్టు పాదాలను ఏటా రెండుసార్లు… ఉదయసంధ్య వేళలో సూర్య కిరణాలు సోకుతాయి. అనివెట్టి మండప ప్రాంత ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలోకి చేరి అంతిమంగా ఆదిత్యుడి శిరోభాగాన్ని తాకుతాయి. ఈ పర్వాన్ని కనువిందుగా చూసి తరించేందుకే అసంఖ్యాక జనవాహిని తరలివస్తుంది. తొలి కిరణ ప్రసరణంతో పాదాల నుంచి తల వరకు వెలుగొందే అద్భుత దృశ్య వీక్షణం కోసమే ఈ ఫిబ్రవరిలోనూ అందరి తహతహ.

రథాన్ని దివాకరుడు అధిరోహించిన మాఘ శుద్ధ సప్తమినాడే సూర్య జయంతి. స్వర్ణ రథ రూపంలోని భవ్య దివ్య తేజం అది. ప్రచండ మారుత వేగంతో అలుపు సొలుపూ ఆకలి దప్పులూ లేకుండా విజృంభించి సాగే ఏడు ఆశ్వాలకూ జగతి, గాయత్రి, బృహతి, ఉష్ణిక్‌, ‌త్రిష్టుప్‌, అనుష్టుప్‌, ‌పంక్తి అని పేర్లు. సప్తాశ్వాలూ వారంలోని ఏడు రోజులంటారు. ‘రథము కదిలె… రవి తేజములలరగ’ అనుకుంటూ ఉంటేనే జాగృత దాత, ఆరోగ్య భాగ్య ప్రదాతగా మార్తాండుడు హృదిలో మెదులుతాడు. ఆ కారణంగానే ఈ దైవాన్ని భారతీయ పురాణ, వేద, కావ్య, ఇతిహాస వాజ్ఞ్మయమంతా ‘ఆదిత్యాయ నమోన్నమః’గా వేనోళ్ల కొనియాడుతోంది. ధర్మజుడికి అక్షయపాత్ర అందించింది సూర్యుడు. నిత్యం సువర్ణ ప్రసాదితమైన శమంతకమణిని సత్రాజిత్తు దరిచేర్చింది కూడా ఈ భగవానుడే. అంతెందుకు-హనుమకు వేద శాస్త్రాదులను ప్రబోధించిందీ సూర్యదేవుడే. అంతటా బుద్ధి ప్రేరేపకుడిగా సూర్యుడిని సంభావిస్తుంది గాయత్రీ మంత్రం. సూర్యయోగం ధార్మిక పక్రియ అయితే, సూర్య నమస్కారాలు, ఆసనాలు మానవ అంతర్గత సంపత్తి కారకాలు. మానవాళికి సరికొత్త జవజీవాలు క్రియాశక్తి అయిన సూర్యుడి వల్లనే సిద్ధిస్తున్నాయి. భగవానుడి ప్రతి అడుగూ కాల వేగ, గమన కొలమాని. కాలంలా కాకుండా ఆయన మనకు కనిపిస్తాడు కాబట్టే ప్రత్యక్ష నారాయణుడ య్యాడు.

తేజో విరాజితం

రామాయణంలోని ఆదిత్య హృదయ స్తోత్రం సూర్య సంబంధితం. ఇది శ్రీరామచంద్రుడికి అగస్త్య ముని ఉపదేశం.

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం

జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం

చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం

జాతికి జాగృతినిచ్చే భాస్కరుడు అపార తేజోవిరాజితుడు కనుక ఆయననే ఆరాధించాలన్నది ఈ ప్రధాన శ్లోకాల సారాంశం. శివరూపంలోని రవి నుంచి విజ్ఞానాన్ని, విష్ణురూపుడూ కాబట్టి ముక్తిని కోరాలంటుంది సూర్య స్తుతి. అదే అగ్ని స్వరూపుడి వల్ల ఐశ్వర్యం, సూర్య మూలకంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని అభ్యర్ధించాలంటుంది.

త్వం మాతా త్వం శరణం

త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః

త్వం త్రాతా, త్వం హర్తా

విపదమార్క! ప్రసీద మమ భానో!

అన్నీ నువ్వే, మా పోషణా నీదే! రక్షకుడివిగా, ఆపదలు తొలగించేవాడివిగా మమ్మల్ని అనుగ్రహించు – అంటుంది భక్త హృదయం. అందులోనూ రథసప్తమినాడు స్వామి నిజరూప సందర్శనం ఎవరికి వారికే అనుభవైక వేద్యం. నిజానికి సూర్యుడి మరో పేరే- సప్తమి. త్రిమూర్త స్వరూపమైన ఆయన జన్మతిథి సప్తమే! ఆ రీత్యా ఇతర అన్ని సప్తముల కంటే రథసప్తమే విలక్షణం. తల్లి అదితి కాబట్టి ఆదిత్యుడయ్యాడు. చైతన్యస్ఫూర్తికి ప్రతీక సూర్యనారా యణుడు. సూర్య అంటే- ఎవరి పనులు వారు చేసుకునేలా ప్రేరేపించేవాడు (సువతి ప్రేరయతి వ్యాపారేష్యితి సూర్యః). మయూర మహాకవి ‘ప్రభా వర్ణన’ ప్రకారం- సూర్య కిరణాలు ఉదయం పూట… ఐరావత కుంభస్థలంలో సిందూర పరాగాన్ని ధరించినట్లున్నాయి (పై నుంచి చూస్తే). తర్వాత ఉదయ శిఖరంపైన ఉండి చూసేవారికి… కొండ ప్రాంతాల్లో ధాతువుల ద్రవరూప ప్రవాహ రీతితో వేరుగా గోచరించాయి. భూమిమీదకు చేరేసరికి – స్వామి రాకతో వెల్లివిరిసిన పద్మ వన కాంతి మూలాన ఎరుపుమయమయ్యాయి. అలా మూడు లోకాలనూ వెలిగించే భాను కిరణాలు జన జీవితాలను భోగభాగ్య నిలయాలుగా మార్చాలన్నదే కవివాక్యం. ఆయన దృష్టిలో ప్రభాకరుడు ప్రకృతికి సువర్ణ భూషణుడు. పద్మరాగ మణికాంతుడు. గగనమనే నీలి కలువ పువ్వుపై పసుపు వన్నె పుప్పొడి మాదిరి. ఒక మహారత్నం. ప్రపంచ సుందరీమణి కంఠసీమలో మెరిసే మంగళసూత్ర ప్రకాశ దీప్తిమంతుడు.

అరుణ కిరణ ప్రసరణ

భానుడిని ప్రస్తుతిస్తూ పలు పద్యాల శతకం (భాస్కర) వెలయించాడు కవి మారన. తన కవితా యాత్రకు ప్రేరకుడు సూర్యుడేనని ప్రకటించుకున్నాడు. ‘విశ్వకర్తా విశ్వభర్తా దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ!’ అని ప్రస్తుతి. ‘శ్రీసూర్య నారాయణా వేద పారాయణా లోక రక్షామణీ దైవ చూడమణీ’ అన్నదీ భక్తావళికి మహదానంద దాయక చిరకాల ప్రార్ధనమే.

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః

విజయాలు, శుభాలు సమకూర్చే రవితేజుడిని శ్యామ వర్ణ రథాశ్వాలు ఉన్నవాడిగా, అనేకానేక కిరణ ప్రసారకుడిగా ప్రార్ధిస్తారు భక్తులు. ఆరోగ్యంతో పాటు తేజస్సు, పటిమ దాతగానూ అభివర్ణిస్తుంది సామవేదం. కృష్ణ యుజుర్వేదం ప్రకారం- సూర్యా రాధన సదా పరిజ్ఞాన సాధకం. సర్వవ్యాపిత్వాన్ని, భాను గమన విశేషాలను భవిష్య పురాణం విశద పరుస్తుంది. చిత్రరథుడైన సూర్యదేవుడి గురించిన ఆసక్తి కర కథనాలెన్నో రథసప్తమి పర్వదినాన ఆధ్యాత్మిక తత్పరులకు తలపుకొస్తూనే ఉంటాయి. ఒక్క అరసవల్లిలోనే కాదు- తిరుమల వేంకటేశ్వర ఆలయంలో, ఒడిశాకు చెందిన కోణార్క సూర్యక్షేత్రం లోనూ ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు. కర్నూలు జిల్లా శివవరంలో, తమిళనాడులోని కంచి కామేశ్వర దేవాలయంలో, కుంభకోణం సూర్యనార్‌ ‌మందిరంలో; అదే కోవలో కశ్మీరు ప్రాంతపు మార్తాండ గుడి పరిసరాలు కూడా భాను ఆరాధనతో వెలు గొందుతాయి.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE