కొందరు కారణజన్ములు. కూచిపూడి నాట్యానికి మరింత వన్నె తెచ్చి ఆ కళాసేవలో తన జీవితాన్ని గడిపి తన పాత్ర ముగియగానే రంగస్థలం నుంచి నిష్క్రమించే పాత్రలా మనల్నందరినీ వదిలి భౌతికంగా వెళ్ళిపోయిన వదాన్యురాలు పద్మశ్రీ డా. శ్రీమతి శోభానాయుడు. భరతుడు తన నాట్యశాస్త్రంలో ఒక పాత్ర లేదా నర్తకికి ఉండవలసిన పది లక్షణాలు వివరిస్తాడు. ఆమె ఆ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న ఒకే ఒక్క కూచిపూడి కళాకారిణి అనిపిస్తుంది నాకు.

కూచిపూడి, భరతీయ నాట్య ప్రపంచంలో తనదైన ఉనికి చాటుకుంటున్న శోభానాయుడు1960 దశకాలలో తనమొదటి నాట్య ప్రదర్శన- ‘అరంగేట్రం’ గురువులు వెంపటి చినసత్యం పర్యవేక్షణలో చేశారు. నాటి నుండి, 28 ఫిబ్రవరి, 2020న జరిగిన చివరి ప్రదర్శన వరకు తిరుగులేని నర్తకిగా, రారాణిగా పేరు తెచ్చుకున్నారు. అంటే దాదాపు ఐదు దశాబ్దాల కళాసేవ. ఇలాంటి ఒక కళాకారిణిని బహుశా మనం మన జీవితకాలంలో చూడబోము. ఆమె అకుంఠిత దీక్ష, అంకితభావం, నిత్య సాధన, నిరంతర శ్రమ, పట్టుదల -ఇవన్నీ అమెను ఆ స్థాయిలో నిలిపాయి.

శ్రీమతి శోభానాయుడు ప్రస్థానాన్ని ఒకసారి అవలోకిస్తే – ఆమెకి చాలా చిన్నతనం నుంచి నాట్యం అంటే ఎంతో మక్కువ అన్న విషయం తెలుస్తుంది. తల్లితండ్రులు సరోజిని, కె.వి. నాయుడు ఇది గమనించకపోలేదు. అయినా తండ్రి అంతగా ప్రోత్సహించలేదు. వృత్తిపరంగా ఆయన ఇంజనీరు కావటం చేత తరచూ బదలీలు జరిగేవి. తల్లి మాత్రం కూతురి ఇష్టాన్ని కాదనలేక మొదట పి.టి. రెడ్డి దగ్గర నాట్యం నేర్పించారు. ఆ తరువాత అతి కొద్దికాలం శ్రీ కోరాడ వద్ద ఆమె నేర్చుకున్నారని విన్నాను. కూచిపూడి నాట్యకళలో నిష్ణాతులైన గురువుల వద్ద శిక్షణ పొందాలన్న తపనతో శోభానాయుడు తల్లి సహాయంతో మద్రాసు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో గురువులు శ్రీ వెంపటి చినసత్యం వద్ద చేరారు. తదాదిగా వెనక్కి చూడలేదు. శ్రీ వెంపటి శిక్షణలో కేవలం ఒకటి రెండు సంవత్సరాల లోనే ఆమె తన మొదటి నాట్య ప్రదర్శన ఇచ్చారు. అది చూసిన ప్రముఖ నాట్య గురువులు శ్రీమతి రుక్మిణీదేవి అరండెల్‌ ‌వంటి వారు మెచ్చుకోవటం, వెంపటి గారి నృత్య నాటికలు శ్రీకృష్ణ పారిజాతం’, ‘క్షీరసాగర మథనం’, ‘చండాలిక’, ‘శ్రీనివాస కల్యాణం’ వంటి నృత్యనాటికలలో ప్రధాన భూమికలు ఆమె ధరించారు. ఇటు పాత్రికేయుల, అటు సామాన్య ప్రజల అభిమానం కూడా పొందారు. నృత్య నాటికలలో ఆమె చేసిన పాత్రలన్నీ చెప్పుకోదగ్గవే. శ్రీకృష్ణ పారిజాతంలో సత్యభామ పాత్ర ప్రేక్షకుల అంతరంగంలో నడయాడుతూనే ఉంటుందంటే సత్యదూరం కాదు. ఆమెని కూచిపూడి సత్యభామగా చిరస్థాయిగా నిలబెట్టిందీ పాత్ర. అలాగే ‘చండాలిక’. తన అనుభవాలూ, అనుభూతులూ పంచుకొన్న సందర్భాలలో శోభానాయుడు చండాలిక అత్యంత క్లిష్టతరమైన పరిస్థితులకు గురిచేసిన పాత్రగా చెప్పేవారు. అకాడమీలో ‘చండాలిక’ను రూపకల్పన చేసినప్పుడు ఇతివృత్తానికి తగ్గట్టు, ఆయా సందర్భాలలో ఆవిష్కరించవలసిన దుఃఖం, నిరాశ, నిస్పృహ, క్రోధం, వంటి వైవిధ్యభరిత అభినయాలను పాత్రధారిణి శోభానాయుడు నుండి వెలికి తీయడానికి చినసత్యం పడ్డ శ్రమ, ఆమె పడ్డ మనోవేదన వర్ణనాతీతం అంటారామే. అందుకనే యేమో ఆమె ఆ పాత్రని అభినయించిన ప్రతిసారి కూడా వీక్షకులు కంటనీరు ఆపుకోలేక పోయేవారు. ‘క్షీరసాగరమథనం’ ప్రదర్శన 1976లో నా 8వ ఏట గుంటూరులో చూశాను. వెంపటి చినసత్యం శివుని పాత్ర, మంజు భార్గవి విష్ణుమూర్తి పాత్ర, శోభానాయుడు మోహిని పాత్ర ధరించారు. ఆ ప్రదర్శన చూస్తున్నంత సేపు సాక్షాత్తు ఆ దేవతలే దిగివచ్చి నర్తిస్తున్నారా అనిపించింది. బహుశా పరమ శివుడు అలాగే ఉంటాడేమో! విష్ణువు మోహినీరూపంలో ఇంత సుందరంగా ఉండబట్టే దానవులు ఆమె అమృతాన్ని దేవతలకిస్తున్నా గమనించకుండా ఆమె అందానికి దాసులైపోయారేమోననిపించింది. ఆ ప్రదర్శన ఆ గురుశిష్యుల సంఘటిత శ్రమ, నృత్య అభినయాలలో వారి ప్రతిభ, అభినివేశాలకు తార్కాణం.

మద్రాసు అకాడమీలో ఉన్నంతకాలం నృత్య నాటికలలోనే కాక, ఒక సోలో నాట్యకళాకారిణిగా కూడా శోభానాయుడు ప్రసిద్ధి పొందారు. ఆమెకి అక్కడ సంపూర్ణ గురుకృప లభించింది.1970 ప్రాంతాల నుండి అనేక ముఖ్య పట్టణాలలో, దేశ విదేశాలలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ నృత్యోత్స వాలలో వెంపటిగారితో శోభానాయుడు ప్రధాన నాట్యకళాకారిణిగా పాల్గొన్నారు. వీరి ప్రతిభ, కీర్తి ఎంత స్థాయికి చేరిందంటే ప్రసార మాధ్యమాలు అంతగా లేని ఆ కాలంలో, ఆంధ్రదేశంలో దాదాపు అన్ని పట్టణాలలో శోభానాయుడి కూచిపూడి ప్రదర్శనలు జరిగేవి. చూడడానికి చుట్టుపక్కల పల్లెల నుండి వేలంవెర్రిగా ప్రేక్షకులు బండ్లు కట్టుకొచ్చేవారు. ఆమె ప్రతిభకు సమ్మోహితులయ్యేవారు.

శోభానాయుడు నాట్య ప్రస్థానంలో వెంపటి వారి ‘పద్మావతి శ్రీనివాసం’లో పద్మావతి పాత్ర మరొక మైలురాయిగా నిలిచింది. కొన్ని సందర్భాలలో శ్రీనివాసుని పాత్ర కూడా ఆమె ధరించారు. ఈ నృత్యనాటకం ఆఖరి ఘట్టంలో పద్మావతీ శ్రీనివాస కల్యాణ సన్నివేశంలో రంగస్థలం మీద సాక్షాత్‌ శ్రీ‌వే•ంకటేశ్వరస్వామి, పద్మావతీదేవీలు అవతరిం చారా అన్న అనుభూతి కలుగుతుంది. ఈ సన్నివేశంలో గురువుగారు ఎంత నివారించినా వినకుండా ప్రేక్షకులు రంగస్థలం పైకి వచ్చి వారికి పాదాభివందనాలు చేసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులిచ్చిన సందర్భాలు ఎన్నో. ఆమె గురువులు వెంపటి గారి వద్ద శిష్యరికం చేసిన 15 సంవత్సరా లలో ఈ గురువు శిష్యుల కలయిక కూచిపూడి నాట్యన్ని పతాకస్థాయికి చేర్చిందంటే, అది అతిశయోక్తి కాదు. ఒక సందర్భంలో గురువులు శ్రీ వెంపటి చినసత్యం, ‘శోభ నేను మలచిన నా అంశ’ అనటం శోభానాయుడు గారికి గురువు పట్ల ఉన్న భక్తి, క్రమశిక్షణ, అలాగే గురువుగారికి ఆవిడ పట్ల గల వాత్సల్యాన్నీ, నమ్మకాన్నీ ప్రస్ఫుటం చేస్తాయి.

1980లో హైదరాబాదులో కూచిపూడి ఆర్ట్ అకాడమిని నెలకొల్పి స్థిరనివాసం ఏర్పరుచుకోవడం శోభ నాట్య ప్రస్థానంలో రెండవ అంకం. కూచిపూడి ప్రదర్శనలేకాక సంయుక్త ఆంధ్రదేశ రాజధానిలో ఆ కళ ప్రచార గురుతర బాధ్యతను ఆమె చేపట్టారు. అకాడమి స్థాపించిన మొదటి దశకంలో ఇటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం, అటు నూతన అంశాలని రూపొందించటం, ప్రదర్శించటం ఇలా అనేకమైన ఒడిదుడుకులుకీ, శ్రమకీ ఆమె లోనయ్యరు. ఈ అకాడమీలో దాదాపు మొదటి దశకం అంతా వారి గురువు నుంచి వారసత్వంగా వచ్చిన అంశాల ప్రదర్శన, గురువు గారు ఒక్కప్పుడు చేసి, మరుగున పడిన నృత్యనాటకాల పునరుద్ధరణ, పునఃరూపకల్పన చేశారు శోభానాయుడు. ఈ క్రమంలో చేసిన నృత్యరూపకాలే ‘విప్రనారాయణ’, ‘మేనకా విశ్వామిత్ర’. విప్రనారాయణలో ఆమె ధరించిన దేవదేవి పాత్ర చూసిన వారికి అంత చక్కగా ఇంకెవ్వరూ చేయలేరేమోననిపిస్తుంది. ముఖ్యంగా దరువు, దేవదేవి దాసరిసాని వేషంలో విప్రనారాయణుడి ఆశ్రమానికి వెళ్ళే సందర్భంలో చేసే దరువు – ‘వెడలేనిదే దాసరిసాని వేషములో దేవదేవి’. అందులో ఆమె ప్రదర్శించే హావభావాలు, ఊడత ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. అలాగే విప్రనారాయణుని తన వశం చేసుకోవడానికి దేవదేవి చేసే ప్రయత్నపూర్వక చేష్టలు, చిర యశస్వి శ్రీ వేదాంతం సత్యనారయణ శర్మ గారిని గుర్తుకు తెస్తూనే అత్యంత గంభీరంగా ఉండేవి.

1989 నుండి శోభానాయుడు దాదాపు పది తన సొంత నృత్య నాటకాలను రూపకల్పన చేశారు. అవి- ‘కల్యాణ శ్రీనివాసం’, ‘శ్రీకృష్ణ శరణం మమ’, ‘విజయోస్తుతే నారి’, ‘సర్వం సాయిమయం’, ‘జగదానందకారకా’, ‘స్వామి వివేకానంద’, ‘సంభవామి యుగే యుగే’, ‘నవరస నటభామిని’. వీటి కథా వస్తువు గమనిస్తే మనకి ప్రస్ఫుటమైన వైవిధ్యం గోచరిస్తుంది. ఇటు పురాణ కథలే కాక, ఐతిహ్యాలను, కాల్పనిక కథలను కూడా వస్తువు గా ఆమె ఎంచుకున్నారు. వీటిలో అత్యంత కీర్తి, ప్రజాదరణ గడించిన నృత్యనాటకం ‘శ్రీకృష్ణ శరణం మమ’. ఇది ఆమె సృజనాత్మకతకు అద్దం పట్టి, వారిని ఒక మంచి గురువుగా నాట్యరూపకర్తగా నిలిపింది. ఈ నృత్యనాటకంలో ఆమెదైన ఒక ప్రత్యేక పంథా కనిపిస్తుంది. గురువులు వెంపటి తన రూపకల్పనలలో సూచనప్రాయమైన రంగాలంకరణకి ప్రాధాన్యమిస్తే, శోభానాయుడు ఒక అడుగు ముందుకు వేసి, అటు రంగాలంకరణ, ఇటు నృత్త అభినయ ప్రదర్శనలలో వాస్తవికతకు పెద్ద పీట వేశారు. ఇందుకు ఆమె సురభి కళాకారుల సహకరాన్ని తీసుకున్నారు. కూచిపూడి నాట్య ప్రదర్శనలలో ఇది నూతన ఒరవడి. ఇటువంటి ప్రయోగాలు అనేకం ఆమె తరువాతి నృత్యనాటకాలలో మనకి కనిపిస్తాయి. ఈ ప్రయోగాలే ఆమె నృత్యనాటకాలను సామన్య ప్రజలకు మరింత చేరువ చేశాయి.

విజయోస్తుతే నారీ, నవరస నటభామినీలలో కథాపరంగ స్త్రీవాద ధోరణులు గోచరించినా స్త్రీ ఔన్నత్యాన్నీ, సబలత్వాన్నీ చాటే విధంగా మలిచారు శోభానాయుడు. బహుశా కూచిపుడి నాట్య సంప్రదయంలో అంతర్లీనంగా ఉన్న సామాజిక కొణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ నృత్యరూపకాలను సృజయించారేమోననిపిస్తుంది. మద్యపానం వంటి సామాజిక రుగ్మతను, దానిపై మనిషి సాధించగలిగిన విజయాన్ని, విజయోస్తుతే నారీ ద్వారా ప్రదర్శించి భావితరాలకు ఒక స్పూర్తినిచ్చారామె. సర్వం సాయి మయం, స్వామి వివేకానందల ద్వారా శోభానయుడు తన సమకాలీన కళాకరులు ఎవ్వరూ చేయని సాహసం చేశారు. సత్యభామ, పద్మావతి వంటి శృంగార, లలిత భరితమైన పాత్రలకి చిరునామ అయిన ఆవిడ, సాయిబాబాగా, వివేకానందగా ఎంతో సులభంగా ఒప్పించటం ఆశ్చర్యకరం. బహుశా ఆవిడ తాను చేసే ప్రతి పాత్రలో సులువుగా పరకాయప్రవేశం చేయగలిగిన బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉండటంవల్లే ఇది సాధ్యపడిందేమో! ఈ నృత్యరూపకాలే కాక ఆమె అనేకమైన వ్యస్త నృత్యాంశాలను కూచిపూడి ఫణితిలో రూపొందిచారు. వాటిలో దాదాపు అన్నీ ప్రజాదరణనూ, పండితుల మన్నననూ పొందాయి.

కూచిపూడి నాట్యకళా ప్రదర్శన, ప్రచారమే తన జీవిత పరమావధిగా నమ్మిన శోభానయుడు గారు ‘నేను మదరాసులో భక్తురాలను, హైదరాబాదుకు వచ్చిన తరువాత పూజారిణినయ్యాను’ అని ఒక సందర్భంలో చెప్పుకున్నారు. ఒక గురువుగా ఆమె దాదాపు 1500 మంది శిష్యులకు శిక్షణ ఇచ్చి కూచిపూడి నాట్యానికి తరువాతి తర ప్రదర్శకులను, పరిశోధకులను, అధ్యాపకులను అందించి, తన గురు రుణం, నాట్యరుణం తీర్చుకున్నారు. ఏనాడైతే నేను కాలికి గజ్జె కట్టలేనో, ఆనాడు నేను శివైక్యం చెందాలన్న తన కోరికను అక్షరాల తీర్చుకున్న సంపూర్ణ కళాకారిణి శ్రీమతి శోభానయుడు. కూచిపూడి నాట్య ప్రచారం, సాధన కొనసాగించాలన్న ఆమె నిరంతర తపనను ఆమె శిష్యగణం ఆచరించటమే ఆ కూచిపూడి శోభకి అర్పించగల ఘన నివాళి.

– ఆచార్య అనురాధ (జొన్నలగడ్డ) తడకమళ్ళ

By editor

Twitter
Instagram