అయోధ్య, ఆగస్టు 5, మధ్యాహ్నం 12.44, అభిజిత్‌ ‌లగ్నం.

శతాబ్దాల నిరీక్షణ ఫలించిన క్షణమది. ఎంత నిరీక్షణ… అక్షరాలా 491 సంవత్సరాలు. ఇప్పుడు రామమందిరానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేశారు. దేశం నలుమూలలా, విదేశాలలో ఈ కార్యక్రమాన్ని టీవీ చానళ్లలో కోట్లాది మంది వీక్షించారు. ప్రధాని పునాదులలో ఉంచినది నలభయ్‌ ‌కిలోల వెండి ఇటుకే కావచ్చు. కానీ దానితో నెరవేరుతున్నది మాత్రం కోట్ల భారతీయుల బంగారు కల. అది భారతీయతకూ, బంగారు భవిష్యత్తుకూ వేసిన పునాది కూడా. మూడేళ్లలో అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం పూర్తికానున్నది. మూడు దశాబ్దాలుగా గుడారంలో ఉండిపోయిన ఆ మర్యాదా పురుషోత్తముడికి ఇంతకాలానికి మందిరం సిద్ధమవుతున్నది. ఇది ఈ జాతి గుండె గుడి. కాబట్టి అది రాముడి భక్తకోటి కల నెరవేరిన రోజు.

ఈ ఘట్టాన్ని ఈ సంవత్సరంలో మొదటి దీపావళి పండుగలా జరుపుకున్నారు ప్రజలు. భూమిపూజ వేళ రామభక్తులు చేసిన జై శ్రీరామ్‌ ‌నినాదం అక్షరాలా మిన్నంటింది. అదే సమయంలో దశాబ్దాల నిరీక్షణ ఫలించిందన్న వాస్తవానికి మీడియా కూడా గొంతునిచ్చింది.

అయోధ్య ఉత్తర భారతదేశానికి నడిబొడ్డున ఉందనవచ్చు. కానీ రాముడు అందరివాడు. జగమంతా ఉన్నాడు. ఇది భారతీయ విశ్వాసం. రామమందిర భూమిపూజ కార్యక్రమం కూడా దీనిని ప్రతిబింబించే విధంగానే నిర్వహించారు. బెళగావి (కర్ణాటక)కి చెందిన ఎస్‌ఆర్‌ ‌విజయేంద్ర భూమిపూజకు ముహూర్తం పెట్టారు. రామజన్మ భూమి ఉద్యమంలో చిరకాలం ఆయన పనిచేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ముహూర్తం కోసం ఆయనను సంప్రదించారు. విజయేంద్ర నాలుగు ముహూర్తాలు పెట్టారు. జూలై 29, జూలై 31, ఆగస్టు 1,ఆగస్టు 5. అన్నీ శ్రావణంలోనివే. వాస్తు ముహూర్తాలలో ఆగస్టు 5 కూడా శ్రేష్టమైనది. ఉత్తర భారతానికి చెందినవారు పూజా కార్యక్రమం నిర్వహించారు. కరోనా కారణంగా 175 మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. తొలి ఆహ్వానం అయోధ్య వ్యాజ్యంలో ముస్లింల కక్షిదారు అన్సారికే. దేశంలోని 135 సిద్ధాంతాలకు సంబంధించిన 135 మఠాధిపతులను, పీఠాధిపతులను, సాధుసంతులను ఆహ్వానించారు. పెద్ద పీట వారికే. మిగిలిన నలభయ్‌ ‌మంది ప్రముఖులు, అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్నవారు. దేశంలోని పుణ్య నదుల నుంచి నీరు, ఆయా ప్రాంతాల నుంచి మట్టి తెచ్చి భూమిపూజలో ఉపయోగించారు. ప్రధాని వచ్చి భూమిపూజ చేయడం అంటే ఒక గొప్ప తాత్వికతను, ఉద్యమాన్ని, ఎందరో చేసిన త్యాగాన్ని గౌరవించడమే. అయోధ్యకు వచ్చిన తొలి భారత ప్రధానిగా కూడా ఆయన చరిత్రకెక్కారు. ఇక ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ‌గవర్నర్‌ ఆనందీబెన్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ ‌భాగవత్‌, అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహంత నృత్యగోపాల్‌ ‌దాస్‌ ‌కార్యక్రమంలో ఉన్నారు. ట్రస్ట్ ‌కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్‌ ‌నాయకుడు చంపత్‌రాయ్‌ ‌భూమిపూజలోను కీలక పాత్రనే పోషించారు. ఉమాభారతి, సాధ్వి రితంభర కూడా హాజరయ్యారు.

‘చట్టబద్ధంగా నిర్మిస్తున్న ఈ ఆలయం దేశంలోని సామాజిక సామ రస్యానికీ, మన ప్రజల అభినివేశానికీ, రామరాజ్య విలువలతో నడిచే ఆధునిక భారతదేశానికి ప్రతీకగా నిలుస్తుంది’ అన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌.

‘‌చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించనున్న ఆలయం భారతదేశ సంస్కృతి, విశ్వాసాలకు, జాతీయ భావనకు ప్రతీకగా నిలుస్తుంది’ అన్నారు నరేంద్ర మోదీ.

‘రామమందిరానికి పునాది పడిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలలో ఆనందాన్ని నింపింది. దేశం స్వతంత్రంగా నిలబడగలదన్న ఆత్మ విశ్వాసం ఈ ఆలయం ద్వారా వస్తుంది’ అన్నారు ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ ‌భాగవత్‌.

ఎవరు వ్యాఖ్యానించినా, వారంతా శ్రీరాముడిని ఈ దేశ ఐక్యతా చిహ్నంగానే భావించారు. మన పురాతన సంస్కృతికి కేంద్రబిందువుగానే స్థానం ఇచ్చారు. జగదభిరామునిగానే దర్శించి నమోవాకాలు సమర్పించారు. రామమందిర నిర్మాణం ఒక మతపర మైన కార్యక్రమంలా కాకుండా మరింత విస్తృత దృష్టితో చూడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమయోచితంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ‌కూడా రామమందిర నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటూ చివరి క్షణంలో అయినా ఒక ప్రకటన ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌కూడా శుభ సందేశాలనే ఇచ్చారు. ఇది మంచి పరిణామం.

ఈ రోజు కోసం ఇన్ని కోట్ల మంది ఎందుకు నిరీక్షించారు? ప్రధాని తన ఉపన్యాసంలో చెప్పినట్టు భూమిపూజను తమ కళ్లతో తామే చూస్తున్నామా అన్న అనుమానం చాలామంది భక్తులకు కలిగినా ఆశ్చర్యం లేదు. అయోధ్య ఉద్యమం ఎన్ని ఆటు పోట్లను ఎదుర్కొన్నది! ఎంత ప్రతికూలతను చవిచూసింది. చివరికి సుఖాంతమైంది. రాముడిని విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ సొంతం చేసుకోలేదు. ఆయన మీద మాకే సర్వహక్కులూ ఉన్నాయని మేం చెప్పడం లేదు అని సాధ్వి ఉమాభారతి ఇటీవలనే ఒక కాంగ్రెస్‌ ‌నాయకుడికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. కానీ రామమందిర నిర్మాణం అవసరాన్ని ఈ ‘హిందూ పరివార్‌’ ‌మాత్రమే గుర్తించిందని చెప్పక తప్పదు. ఇంత ఉద్యమాన్ని నడిపించి, ఇన్ని త్యాగాలు చేసి, ఇంత న్యాయ పోరాటం చేసి భూమిపూజ వరకు తీసుకువచ్చిన ఘనత హిందూ పరివార్‌కే దక్కుతుంది. ఇందుకు వేలమంది సాధుసంతులు ఆశీస్సులు పలికారు. దేశ ప్రజలు అండాదండా ఇచ్చారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చేయూతనిచ్చినవారు లక్షలలో ఉన్నారు. రాముని కార్యక్రమం పూర్తికాకుండా నేనెలా విశ్రమించగలను! అంటూ ప్రధాని అయోధ్యలో చేసిన వ్యాఖ్య ఆలయం కోసం జరిగిన మహా తపస్సునే గుర్తుకు తెచ్చింది.

అకుంఠిత దీక్షతో సాగిన ఈ మహాయజ్ఞం వెనుక ఉన్న తాత్వికత ఏమిటి? శతాబ్దాల పాటు సాగిన ఈ పోరాటం అసలు లక్ష్యం ఏమిటి?

‘అయోధ్యలో రామమందిర పునర్‌ ‌నిర్మాణం అంటే భారతీయ సాంస్కృతిక అస్తిత్వం, చరిత్రలను ధ్రువపరచడం, విదేశీ సిద్ధాంతాల నుంచి దేశ ధార్మిక నాగరికత మేల్కొనడమే. భారతీయ సాంస్కృతిక స్వాతంత్య్రంలో భాగంగా దీనిని స్వాగ తించాల్సిందే. అయోధ్య వివాదం ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన వ్యాజ్యం’ అన్నారు డాక్టర్‌ ‌డేవిడ్‌ ‌ఫ్రాలే. అమెరికాలో ఉంటూ, ఆ దేశానికే చెంది, మన సనాతన ధర్మాన్నీ, సంస్కృతాన్ని అద్భుతంగా అధ్యయనం చేసిన ఆచార్య ఫ్రాలే మాటలు పై ప్రశ్నలకు కొంతమేరకు సమాధానంలా అనిపిస్తాయి.

1947లో స్వతంత్రం వచ్చింది. దేశీయమైన చింతన మాత్రం సంకెళ్ల లోనే ఉండిపోయింది. స్వతంత్ర భారతదేశ తొలి నాలుగు దశాబ్దాల రాజకీయం మొత్తంగా దేశ సామాజిక, సాంస్కృతిక విలువలను ధ్వంసం చేసింది. అలాంటి ప్రమాదకర, విచ్ఛిన్నకర రాజకీయం నడిపిన ఘనత భారత జాతీయ కాంగ్రెస్‌కే దక్కుతుంది. సెక్యులరిజం పేరుతో ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే ధోరణి ముదిరిపోవడానికి ఇక్కడి రాజకీయాలే దోహదం చేశాయి. సెక్యులరిజం అన్న పదం రాజ్యాంగంలోకి 70 దశకంలో వచ్చింది కదా, నెపమంతా ఆ ఇజం మీదకు నెట్టడం చారిత్రక దృష్టి అనిపించుకుంటుందా? అన్న ప్రశ్న రావచ్చు. కానీ ఆ ప్రశ్న సహేతుకమే. అయినా ఆ కీలకమైన ప్రశ్న ఎందుకు బలంగా వినిపించడం లేదంటే, బుజ్జగింపు తారస్థాయికి చేరడమే అందుకు కారణం. కశ్మీర్‌ ‌సంస్థానం వ్యవహారాలను మంత్రి షేక్‌ అబ్దుల్లాకు అప్పగించి మహరాజా హరిసింగ్‌ ‌బెనారస్‌లో విశ్రాంతి తీసుకోవడం మంచిదని ఆనాటి కాంగ్రెస్‌ ‌పెద్దల ఆదేశం. ఆశయం కూడా. అలాగే జరిగింది. కానీ హైదరాబాద్‌ ‌నవాబు మీద నెహ్రూ అవ్యాజమైన అనురాగం చూపారు. సోమనాథ్‌ ఆలయాన్ని పునరుద్ధరించిన తరువాత ప్రతిష్ట కార్యక్రమానికి ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేందప్రసాద్‌ను నాటి హోంమంత్రి సర్దార్‌ ‌పటేల్‌ ఆహ్వానించారు. రాజేందప్రసాద్‌ అం‌గీకరించారు. కానీ నెహ్రూ వ్యతిరేకించారు. అయినా రాజేందప్రసాద్‌ ‌వెళ్లారు. లియాఖత్‌ అలీ-నెహ్రూ ఒప్పందం మేరకు ఇక్కడి మైనారిటీలకు భారత ప్రభుత్వం, పాకిస్తాన్‌లోని మైనారిటీలకు, అంటే భారతీయులకు అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఇటు వారు అటు, అటు వారు ఇటు రావడానికి అవకాశం కల్పించాలి. ఆస్తులు రక్షించాలి. కానీ పాక్‌ ‌నుంచి హిందువులు ప్రాణాలు అరచేత పట్టుకుని రావలసి వచ్చింది. ఇక్కడ మాత్రం సెక్యులరిజం తదితర సిద్ధాంతాల మేరకు మైనారిటీలు, ప్రధానంగా ముస్లింలు ప్రత్యేక హక్కులు పొందారు.

సెక్యులరిజం అన్న పదం రాజ్యాంగంలో ఇందిరా గాంధీ హయాంలో చేరిన తరువాత, చేరక ముందు కూడా ఈ దేశంలో మైనారిటీల బుజ్జగింపు ధోరణి ఒకే విధంగా కొనసాగింది. సెక్యులరిజం అన్న పదం రాజ్యాంగంలో చేరడంతో జరిగినదేమిటీ అంటే బుజ్జగింపు ధోరణికి అధికార ముద్ర పడింది. మతాధిపత్య ధోరణులకు రాజమార్గం ఏర్పడింది. ఓట్‌ ‌బ్యాంక్‌ ‌రాజకీయాలు ముదిరిపోయాయి. దీనిని ప్రశ్నిస్తే హిందూ మతోన్మాది ముద్ర వేస్తున్నారు. కన్యాకుమారిలో వివేకానంద స్మారక మందిరం కట్టడానికి క్రైస్తవుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఇప్పటికీ కన్యాకుమారి జిల్లాలో హిందువులకు రక్షణ లేదు. కొన్ని నెలల క్రితమే కన్యాకుమారి జిల్లాలోనే ఒక గ్రామంలో ఒక హిందూ ఆలయం ప్రాంగణంలో భారతమాత విగ్రహం ఉండడం తమ మనోభావాలకు విరుద్ధమని అక్కడి క్రైస్తవులు అభ్యంతరం చెప్పారు. దాని మీద పెద్ద రగడే జరిగింది. సోమనాథ్‌ ఆలయం వ్యవహారం నుంచి షాహిన్‌బాగ్‌ ‌తమాషా వరకు కనిపించేదంతా హిందువుల మనోభావాల తృణీకరణే. మనోభావాలను గాయపరచడమే. కశ్మీర్‌ ‌సంస్థాన రాజకీయం మొదలు, హైదరాబాద్‌ ‌సంస్థాన వ్యవహారం వరకు సాగినదంతా మైనారిటీ అనుకూల వైఖరే. ముస్లిం మతోన్మాద ధోరణి గురించి ప్రపంచం మొత్తం జాగరూకతతో ఉండాలని భావిస్తూ ఉంటే, భారతదేశంలో మాత్రం ముస్లిం ఉగ్రవాదుల రక్షణ కోసం నినాదాలు వినిపిస్తున్నాయి. వారి హక్కుల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. పార్లమెంట్‌ ‌మీద దాడి చేసినవారిని అమరవీరులుగా కీర్తించే నీచ సంస్కృతి ప్రబలుతోంది. రోహింగ్యా ముస్లింల రక్షణకు కోర్టులను దబాయిస్తున్నారు. గోవును కాపాడడం రాజ్యాంగ విహితమైన బాధ్యత. ఆ మాట చెప్పినా హిందువులలో మతోన్మాదాన్నే చూస్తున్నారు. సరస్వతీ స్తుతి ఈ దేశ సంస్కృతి. జాతీయ గీతం స్వతంత్రానికి ప్రతీక. వీటిని కూడా ఎందరో ముస్లింలు ఉన్మాదంతో నిరాకరిస్తున్నారు. సరస్వతి ప్రార్థనను తాము పాడబోమని చెప్పడమే కాదు, సెక్యులరిజం పేరుతో బాహాటంగా ఆలపించడాన్ని కూడా వ్యతిరేకించారు. ఈ మొత్తం రగడలో ముస్లిం మతోన్మాదులకు అండగా నిలుస్తున్నవారిలో ఎక్కుమంది కాంగ్రెస్‌ ‌వారే. ఇక కమ్యూనిస్టు పార్టీల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మీడియాలో, విశ్వవిద్యాలయాలలో తిష్టవేసుక్కూర్చున్న వామపక్షవాదులు చేసేదంతా భారత వ్యతిరేక ప్రచారమే. ఈ దేశ చరిత్రను వక్రీకరించడమే. సంస్కృతిని హేళన చేయడమే. వీళ్ల గురించి డాక్టర్‌ ‌ఫ్రాలే ఏమన్నారో కూడా పరిశీలించాలి. ‘భారత వామపక్షవాదులు రాముడిని అవమానపరిచారు. నిజానికి వాళ్లంతా అయోధ్యకు తీర్థయాత్ర చేయాలి. సాధన చేయాలి. అలాగే తులసీదాస్‌ ‌లేదా వాల్మీకి రామాయణాన్ని క్షుణ్ణంగా చదవాలి. తద్వారా భారతీయ మహా నాగరికత గురించి, ఆధ్యాత్మిక వారసత్వం గురించి అవగాహనకు తెచ్చుకోవాలి. రామమందిర నిర్మాణం నెహ్రూవాదుల, మార్క్సిస్టుల, మావోయిస్టుల, చైనా మద్దతుదారుల ఓటమి. అలాగే భారత చరిత్రనీ, పురావస్తుశాస్త్రాన్ని, భక్తిని అవమానించే మీడియా, విద్యావేత్తల ఓటమి. భారత్‌ ‌తన నిజమైన లక్ష్యం దిశగా ప్రయాణించడానికి రామమందిర నిర్మాణం దోహదపడుతుంది.’ ఇది వాస్తవం.

అయోధ్య పోరాటం నేపథ్యం నేటి తరానికి తెలిసే అవకాశం కొంచెం తక్కువ. శిలాన్యాస్‌, ‌కరసేవ, అయోధ్య రథయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కరసేవలో పోలీసు కాల్పులు జరిగాయి. మృతుల వివరాలు కూడా సరిగా అందలేదు. ఎక్కడ ముస్లిం ఉగ్రవాదులు, వామపక్ష ఉగ్రవాదులు కాల్పులలో మరణించినా గొంతెత్తే హక్కుల వీరులు అప్పుడు నోరెత్త లేదు. కరసేవ కోసం, దర్శనం కోసం వెళ్లి వస్తున్న రామభక్తులను (59) గోధ్రా రైల్వే స్టేషన్‌ ‌సమీపంలో సజీవ దహనం చేశారు. దీని తరువాత అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల గురించే తప్ప, గోధ్రా రైలు బోగీ దగ్ధం ఉదంతం గురించి ఇప్పటికీ ఎవరూ ప్రస్తావించరు. అయినా ఒకరి తరువాత ఒకరు, ఒక తరం తరువాత ఒక తరం ఆలయ నిర్మాణం కోసం ముందుకు వచ్చాయి. కాబట్టి ఇదంతా కేవలం గుడి కోసం జరిగిన పోరాటం కాదు. ఇప్పటిదాకా పైన చెప్పుకున్న పెడ ధోరణుల మీద తిరుగుబాటు మాత్రమే. ఈ దేశంలో అత్యధికుల అస్తిత్వ పోరాటమే. చిత్రంగా ఈ దేశంలో మైనారిటీలంటే ముస్లింలు మాత్రమే అన్నట్టు తయారైంది పరిస్థితి. సిక్కుల హక్కుల గురించి, పార్సీల హక్కుల గురించి ఎవరూ మాట్లాడరు. ఈ దేశాన్ని ఇంకా ధర్మశాలగా భావిస్తున్నవాళ్ల మీద పోరాటమది. ఇస్లామిక్‌ ‌రాజ్యాలలో కూడా ప్రవక్త పుట్టినరోజుకు సెలవు ఇవ్వరు. కానీ ఆగస్టు 15న ఎర్రకోట ఎక్కిన వీపీ సింగ్‌ ‌ప్రధాని హోదాలో ఈ దేశంలో ప్రవక్త పుట్టినరోజుకు సెలవు ప్రకటించారు. ఇస్లామిక్‌ ‌రాజ్యం పాకిస్తాన్‌లో కూడా తలాక్‌ ఆచారం ఎత్తేశారు. కానీ భారతదేశంలో తలాక్‌ను రద్దు చేస్తే అది ముస్లింల మనోభావాలను గాయపరిచినట్టుగా మేధావులు, వామపక్షవాదులు ప్రచారం చేస్తున్నారు. ముస్లిం పాలనలోను హిందూ మతంమీదే దాడి జరిగింది. ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్‌ ఇం‌డియా పాలనలోను హిందూమతం మీదే దాడి జరిగింది. స్వతంత్ర భారతంలోను అదే కొనసాగుతున్నది. ఇలా ఎంతకాలం? కుహనా సెక్యులరిస్టులు (ఉన్నదే కుహనా సెక్యులరిజం), ఓట్‌ ‌బ్యాంక్‌ ‌రాజకీయ దళారులు, స్వయంప్రకటిత మేధావులు, వామపక్షాలు హిందుత్వం మీద పెంచుతున్న దాడికి సమాధానం గానే 1980 దశకం చివరిలోనే బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అడ్వాణీ అయోధ్య రథయాత్ర చేపట్టారు. క్రీస్తుశకం 1580 ప్రాంతం నుంచి అయోధ్య విముక్తి కోసం పోరాటం జరుగుతున్నా, అడ్వాణీ రథయాత్ర ఆ అంశాన్ని ఒక భారతీయ ఆత్మగౌరవ ప్రకటనగా మార్చగలిగింది. తమ పోరాటం దురాక్రమణ దారుడైన బాబర్‌ అవశేషం మీదనే తప్ప ఇక్కడి ముస్లింలతో కాదంటూ అడ్వాణీ చెప్పిన మాట సాధారణ ప్రజలకు అర్థమైంది. ఒకటి నిజం. ఖిల్జీనీ, బాబర్‌నీ, ఔరంగజేబును విమర్శించడం అంటే ఇస్లాం మొత్తాన్ని విమర్శించడం ఎందుకవుతుంది? రాబర్ట్ ‌క్లైవ్‌ను విమర్శిస్తే దానిని క్రీస్తు మీద నిందగా భావించడం సబబా? అడ్వాణీ యాత్రను మధ్యలో అడ్డుకున్నారు. కానీ ప్రజలలో వెల్లువెత్తిన ఆత్మ గౌరవ భావనను, రేకెత్తుతున్న ఆలోచనను మాత్రం ఆపలేకపోయారు. అందుకు నిదర్శనంగా అయోధ్య అంశానికి దేశం మొత్తం మద్దతు పలికింది. అయోధ్య అంశంతో ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూలింది. బీజేపీ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోల్పోయింది. కానీ ఆ శిథిలాల మీదనే బీజేపీ ఒక ఫీనిక్స్ ‌పక్షిలా నింగికి ఎగసింది. దాని వెనుక అయోధ్య ఆధారంగా నిర్మించిన ఆత్మ గౌరవ భావన, నీతినిజాయితీ కూడా ఉన్నాయి. దేశ మౌలికాంశాల పట్ల ఆ పార్టీ ప్రదర్శించిన నిబద్ధత కూడా ఉంది. ఒక్కమాట నిజం- వర్తమాన రాజకీయ పరిణామాలన్నింటకి మూలం అయోధ్య అంశమే. గడచిన ముప్పయ్‌ ఏళ్లుగా భారత రాజకీయాలు మొత్తం అయోధ్య అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. దాని తాత్వికత ఆధారంగానే నడుస్తున్నాయి.

రథయాత్ర వేళ అడ్వాణీ ఇచ్చిన నినాదం గహనమైనదేమీ కాదు. కేవలం కుహనా సెక్యులరిజం మీద దాడి. ఈ దేశంలో కొన్నివేల ఆలయాలను ముస్లింలు కూలగొట్టారు. వాటిని అప్పగించమని అడగడం ఆయన ఉద్దేశం కాదు. కానీ అయోధ్యను, ఒక పురాతన వివాదాస్పద కట్టడాన్ని హిందువులకు అప్పగించడానికి కూడా ముస్లిం మతోన్మాదులు, కుహనా మేధావులు నిర్మొహమాటంగా నిరాకరించడమే ఇక్కడ అసలు ప్రశ్న. అది ఎందుకు? అధిక సంఖ్యాక ప్రజల మనోభావాల మీద చులకనభావంతో కాదా? నవంబర్‌ 9, 2019‌న అయోధ్య రామునిదేనని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. తొమ్మిది మాసాల తరువాత ఆగస్టు ఐదున భూమిపూజ జరిగింది. ఆ సమయంలో కూడా సుప్రీం తీర్పుతో తమకు నిమిత్తం లేనట్టు, ఇప్పటికీ ఆ స్థలం మసీదుకు చెందినదిగానే తాము భావిస్తున్నామని కొందరు ఉన్మాదులు బాహాటంగా ప్రకటించడంలో అర్ధమేమిటి? ఇది ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? హిందువులతో ఒక నిరంతర ఘర్షణను కోరుతున్న ఒక వర్గం ముస్లింలలో ఉన్నదనేనా? మళ్లీ దీనికి కూడా మేధావి బిరుదాంకితులు మద్దతు ఇస్తున్నారు. ఈ దేశంలో సుప్రీంకోర్టు, పార్లమెంటు, ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం కాకుండా, ముస్లింల మత ఆధారిత మనోభావాల మేరకే నడుచుకోవాలా? సెక్యులరిజం అంతిమ రూపం ఇదా?

ఇంతకీ సుప్రీంకోర్టు తీర్పునకు పునాది ఏమిటి? పురావస్తు అవశేషాలు. కానీ ఈ ఆధారాల విషయంలోను అత్యున్నత న్యాయస్థానాన్ని మోసగించే ప్రయత్నం చరిత్రకారులుగా చలామణి అవుతున్న వామపక్ష విద్రోహులు చేశారు. ఈ మేధోపరమైన దగాను డాక్టర్‌ ‌బి.లాల్‌, ‌డాక్టర్‌ ‌మీనాక్షి జైన్‌, ‌డాక్టర్‌ ‌కెకె మహమ్మద్‌ ‌వంటి పురావస్తు శాస్త్రవేత్తలు ప్రతిభావంతంగా ఎదుర్కొన్నారు. ఈ ధోరణి పరమ జుగుప్సాకరమే అయినా, సుప్రీంకోర్టు తన హోదాను, పరువును కాపాడుకుంటూ, ‘నిజంగా దురదృష్టం’ అని వ్యాఖ్యానించింది. విశ్వవిద్యాలయాలలో తిష్ట వేసి విద్వేష రాజకీయాలు నడిపే ప్రొఫెసర్లకు, భారత వ్యతిరేకతను రెచ్చగొట్టే బోధకులకు ఇదొక చెంపపెట్టు.

పార్లమెంటు మీద దాడి చేసిన వారిని, కశ్మీర్‌లో సైనిక శిబిరాల మీద బాంబులు విసిరినవారిని, బొంబాయి పేలుళ్ల బాధ్యులనీ, అక్షరధామ్‌ ‌రక్తపాతం సృష్టించిన వారినీ, హైదరాబాద్‌ ‌పేలుళ్ల రక్తపిపాసు లనీ, వీరిని సమర్థించేవారినీ ఈ దేశంలో విమర్శించే హక్కు కూడా హిందువులకు లేదు. అసలు మతోన్మాదం, ఉగ్రవాదం హిందువులదేనంటూ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చిదంబరం పార్లమెంటులో ప్రకటిస్తాడు. దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌కోరస్‌ ‌పాడతాడు. నిజంగానే హిందువులలో ఉగ్రవాద ధోరణే ఉంటే, అయోధ్య కరసేవ సమయంలో ఎన్ని మసీదులు కూలి ఉండేవి? హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాలలో ఎన్ని మసీదులు కూలగొట్టేవారు? 1990లో కశ్మీర్‌ ‌నుంచి హిందువులను ఎంత ఘోరంగా తరిమివేశారో ఈ దేశంలో ఎందరికి పట్టింది? కొన్ని వందల మందిని లోయలో చంపేశారు. కొన్ని లక్షల మందిని తరిమేశారు. తమ దేశంలోనే కాందిశీకులుగా వీరు బతికారు. ఒక్క బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌కొన్ని హిందూ సంస్థలు తప్ప వేరెవరూ వీరిని పట్టించుకోలేదు. సెక్యులరిస్టులు, వామపక్షాలు పూర్తిగా అంధత్వంలో కూరుకు పోయాయి. కానీ పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదుల మీద తూటా పేలితే హక్కుల కార్యకర్తలు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఈ ఆక్రోశమే అయోధ్య ఉద్యమానికి మానసిక సంసిద్ధతను ఇచ్చింది. ఇప్పటికీ హిందువులు ఈ దేశంలో అధిక సంఖ్యాకులమని ప్రకటించు కోవడం లేదు. సమరసతనే కోరుకుంటున్నారు. కానీ హిందువులగా తమకు కూడా ఇక్కడ చోటు ఉండాలని అందరిలాగే అడుగుతున్నారు. ఇది న్యాయమైన కోర్కె కాదని చెప్పగలరా? హిందువులు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడికి వెళతారు? ముస్లింలకు చాలా దేశాలు ఉన్నాయి. క్రైస్తవులకు కూడా అంతే.

ఇన్ని అవమానాలు జరిగినా, ఇంత సాంస్కృతిక విధ్వంసం జరిగినా హిందువలలో ఇప్పటికీ ఈ సహనం ఎక్కడ నుంచి వచ్చింది? భారతీయ సంస్కృతే ఆ సహనం ఇచ్చింది. పరమత సహనం, సమ భావన ఇతరల నుంచి నేర్చుకునే దుస్థితిలో హిందువులు లేరు. ఈ అంశంలోను రామాయణం, రాముడు కీలక భూమిక పోషిస్తున్నారు. మనదైన జీవన విధానం ఆ సంస్కారాన్ని ప్రసాదించింది. ‘స్వతంత్ర భారత దేశంలో రామమందిర నిర్మాణం చాలా ముఖ్య ఘట్టం. రామాయణం ఆసియాలోనే ఎంతో ప్రాచుర్యం కలిగిన గాధ. ఇది దక్షిణ తూర్పు ఆసియాల నాగరికతలకు, సంస్కృతికి పునాది వంటిది.’ అన్నారు ఫ్రాలే. ఇదే సహనాన్ని అందిస్తున్న శక్తి. డాక్టర్‌ ‌ఫ్రాలే వ్యాఖ్య దక్షిణ కొరియా రాయబారి క్లీన్‌ ‌బాంగ్‌ ‌కీల్‌ ‌మాటలతో (ఆగస్టు 3) మరొకసారి రుజువైంది. ‘కొరియాతో అయోధ్యకు కీలక సంబంధాలు ఉన్నాయి. కొరియా చరిత్ర చెప్పే ఒక పురాతన చరిత్ర గ్రంథంలో అయోధ్య రాకుమారిని కొరియా రాజు కిమ్‌ ‌సూరో వివాహం చేసుకున్నట్టు రాసి ఉంది. అయోధ్యకు సంబంధించిన పురాతన కళాఖండాలు ఆ రాజు సమాధిలో దొరికాయి.’ అన్నారాయన.

దాదాపు వేయేళ్ల బానిసత్వం ఫలితంగా ఈ దేశంలో ఎన్నో రుగ్మతలు తలెత్తాయి. దేశీయమైన చింతన నశించింది. సమాజం చీలికలు పేలికలు అయింది. మారిన ప్రపంచ పరిస్థితులు, పెరిగి పోతున్న మతోన్మాదం ఈ చీలికలను మరింత విస్తరింపచేస్తున్నాయి. ఈ బలహీనత నుంచి ఈ దేశాన్ని రక్షించడానికి ఒక ఆదర్శమూర్తి కావాలి. ఆ ఆదర్శమూర్తిని అత్యధికులు రామునిలో దర్శిస్తారు. ఆయన అందరివాడు. అందుకే రామాలయ నిర్మాణం ఒక కొత్త ఐక్యతను ఈ దేశంలో తీసుకువస్తుంది. అయోధ్య న్యాయపోరాటంలో ముస్లింల తరఫు కక్షిదారు భూమిపూజ ఆహ్వానం అందిన వెంటనే  ‘ఇది రాముని కోరిక కాబోలు’ అని అన్నారు. ఇది అయోధ్య ఉద్యమం ద్వారా రుజువైంది కూడా. ఆలయ నిర్మాణం అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రానికి నిజంగా గౌరవం ఇవ్వడమే.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram