‘శిల్ప సుందరం.. శీల బంధురం’… అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరం గురించి అవధాన సరస్వతి డాక్టర్‌ ‌మాడుగుల నాగఫణిశర్మ అన్న మాటలివి. భూమిపూజ సందర్భంగా ఒక టీవీ చానల్‌లో ఆయన ఎన్నో గొప్ప గొప్ప ఉపమానాలతో అద్భుత భాషణం చేశారు. అయోధ్య రామాలయం అంటే ఇటుకలు, స్తంభాల మిశ్రమం కాదు. అది ఆత్మ గౌరవ వ్యక్తీకరణ. 500 ఏళ్ల పోరాటం తరువాత సాధ్యమైన విజయానికి గుర్తుగా భారతీయులు సగర్వంగా నిర్మించుకుంటున్న మహోన్నత కట్టడం. ఒక చరిత్రాత్మక న్యాయ పోరాటానికి గుర్తుగా అవతరిస్తున్న విజయస్తూపం. ఆ మందిర ప్రాథమిక నమూనా రెండు దశాబ్దాల క్రితమే రూపొందింది. ఇప్పుడు ఇంకొంత విస్తరించారు. కొత్త సోయగాలు అద్దారు. శతాబ్దాల పోరాటం, దీక్ష, త్యాగంతో సాధ్యమవుతున్న ఆ మందిరం ఎలా ఉండాలి? చూడగానే, లోపలికి ప్రవేశించగానే ఎన్ని తలపునకు రావాలి? ఎలాంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందాలి? ఎలాంటి జాతీయతా ధారలలో తడిసి ముద్ద కావాలి? మొత్తంగా అంతటి భవ్యమందిరం ఆకృతి ఎలా ఉండాలి? ఇటు సంప్రదాయం, అటు సంఘర్షణల సమాహారమది. అలాగే డాక్టర్‌ ‌మాడుగల మాటలోని ఆంతర్యం కూడా లోతైనది. ఆలయం కాబట్టి అది శిల్ప సుందరం. శీల బంధురం అంటే… అది రాములవారి సన్నిధానం. రాముడంటేనే శీలం. రామో విగ్రహవాన్‌ ‌ధర్మః అని కదా! మూర్తీభవించిన ధర్మమే రామయ్య. అంటే భారతజాతి ఔన్నత్యానికి ఆయన ప్రతీక. ‘రామో దీపయతి’ అంటారు. అంటే దీపింపచేసేవాడు రాముడు. ఆయన రాజ్యం అంటే శాసనంతో కాదు, హృదయంలో ఆసనం సాధించడం ద్వారా పాలించేది.

సరయూ తీరాన ఉన్న అయోధ్యాపురి ప్రాశస్త్యం గురించి ఎవరు ఎంతని వర్ణించగలరు? సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటి అయోధ్య. త్రిమూర్తులు తపస్సు చేయడానికి ఇష్టపడే స్థలమే అయోధ్య అని ప్రతీతి. దేవతలు నివసించేది అని కూడా చెబుతారు. ఇవి వేద భాగమైన అరుణంలో ప్రస్తావించి ఉన్నాయి. అధర్వం అయితే దేవతలే నిర్మించిన నగరమని ఘోషిస్తున్నది. అంతటి స్థల మహాత్మ్యం కలిగిన చోట, అంతటి పురాణ పురుషుడి మందిరానికి ఆకృతి ఇచ్చినవారు గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌కు చెందిన సోంపురా కుటుంబీకులు. పదిహేను తరాల నుంచి సోంపురా కుటుంబీకులు ఆలయాలకు ఆకృతులు రచించే పవిత్ర వ్యాపకంలో ఉన్నారు.

అయోధ్య రామమందిరం నాగర శిల్ప శైలిలో నిర్మిస్తున్నారు. భారత్‌లో ఆలయ నిర్మాణానికి అనుసరించే మూడు విధాలైన నిర్మాణ శైలులలో ఇదొకటి. మిగిలినవి ద్రావిడ, బసార్‌. ‌నాగర, ద్రావిడ శైలులలో దేనికదే భిన్నమైనవి. ఈ రెండింటి శైలుల కలయిక బసార్‌లో కనిపిస్తుంది. నాగర శైలిలో ఆలయాల నిర్మాణం ప్రధానంగా ఉత్తర భారతంలోనే ఉంది. దీని ప్రకారం గర్భాలయాన్ని అష్టభుజి ఆకృతిలో నిర్మిస్తారు. సోమనాథ్‌ ఆలయం కూడా నాగర శైలిలోనే నిర్మించారు. మొదట అనుకున్న నమూనా ప్రకారం అయోధ్య ఆలయం రెండంతస్తులలో నిర్మించాలి. కానీ ఇప్పుడు మూడు అంతస్తులతో నిర్మిస్తున్నారు. దీని ప్రకారం ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మూడో అంతస్తుతో ఎత్తు 33 అడుగులు పెరిగింది. మొదట అనుకున్న మూడు గోపురాలకు బదులు, ఇప్పుడు ఐదు గోపురాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 160, రెండో అంతస్తులో 132, మూడో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి. పది ఎకరాల స్థలంలో ఈ భవ్య మందిరం నిర్మిస్తారు. ఇసుక, ఇనుము ఉపయోగించరు. వేయేళ్ల పాటు పటిష్టంగా ఉండే విధంగా దీనిని నిర్మిస్తారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఇది మూడో అతిపెద్ద హిందూ ప్రార్థనాస్థలంగా భువి మీద ఆవిర్భవించబోతున్నది.

సోంపురా కుటుంబ సభ్యులు

విశ్వహిందూ పరిషత్‌ ఉద్యమం మహోధృతంగా ఉన్న కాలంలోనే, అంటే 1989లోనే ఒక నమూనాను సోంపురా కుటుంబీకులు రూపొందించారు. పరిషత్‌ ‌ప్రముఖుడు అశోక్‌ ‌సింఘాల్‌కు బిర్లా కుటుంబీకులు సోంపురా కుటుంబాన్ని పరిచయం చేశారు. కొన్ని తరాల నుంచి బిర్లాలు కట్టే ఆలయాలకు వీరే నమూనాలు గీస్తున్నారు.

సోంపురా కుటుంబీకుల వాస్తు పరిజ్ఞానం అంచనాకు అందనిది. గుజరాత్‌ ‌సోమనాథ్‌ ఆలయానికి ఆకృతిని ఇచ్చినవారు ఆ కుటుంబీకులే. అనేక ముస్లిం దాడుల తరువాత నామమాత్రంగా మిగిలిన ఆ ఆలయాన్ని తొలి హోంమంత్రి సర్దార్‌ ‌పటేల్‌ ‌పునర్‌ ‌నిర్మించే కార్యక్రమం చేపట్టారు. అంటే ఆ దివ్య ధామం కూడా భారతీయ ఆత్మకు గర్వకారణమే. అలాగే అక్షరధామ్‌ ‌కూడా వారి మస్తిష్కం నుంచి రూపుదిద్దుకున్నదే. అలాంటివారిని అయోధ్య రామమందిర ఆకృతి కోసం ఎంపికచేశారు. లండన్‌లోని స్వామి నారాయణ్‌ ఆలయం, అమెరికాలోని హిందూ దేవాలయాలకు రూపకల్పన చేసిన వారు వీరే. ఇప్పుడు అయోధ్య ఆలయం రూపకల్పనను ఆ కుటుంబంలో చిన్నవారైన నిఖిల్‌ (55), ఆశిష్‌ (49) ‌చేపట్టారు. వీరిద్దరు తండ్రి చంద్రకాంత్‌ (77) ‌పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. వయసు రీత్యా ఆయన ఇప్పుడు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయోధ్య తీర్థక్షేత్ర ఏర్పాటు చేసిన సమావేశాలకు నిఖిల్‌ ‌హాజరయ్యేవారు. సోమనాథ్‌ ఆలయ నిర్మాణం పని చంద్రకాంత్‌ ఎక్కువ చేయగా, వారి తాతగారు ప్రభాశంకర్‌ ‌పర్యవేక్షించారు. ప్రభాశంకర్‌ ‌శిల్పశాస్త్రం గురించి 14 పుస్తకాలు రాశారు. పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. చంద్రకాంత్‌ ‌తండ్రి బలదేవ్‌ ‌సోంపురా దురదృష్టవశాత్తు ఆయన 51వ ఏట ఒక ప్రమాదంలో కన్నుమూశారు. ఇప్పుడు నిఖిల్‌ ‌కుమారుడు కూడా ఇదే వ్యాపకంలోకి వచ్చారు. ఆయన కూడా అయోధ్య మందిర నిర్మాణంలో వీరితో కలసి పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరి చేతిలో అయోధ్యతో పాటు ఇంకో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్‌లోనే దేవస్థాన పావాగాథ్‌ అనే ప్రాజెక్టు వీరి చేతుల మీదుగానే రూపొందుతున్నది.

About Author

By editor

Twitter
Instagram