అయోధ్య భూమిపూజకు హాజరైన ఒక ముస్లిం చెప్పిన నాలుగు మాటలను ‘టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’ ప్రచురించింది. మందిర నిర్మాణానికి ముస్లింలు వ్యతిరేకం కాదు అన్న విషయం ప్రజలకు తెలియడానికే తాను భూమిపూజ కార్యక్రమానికి హాజరైనట్టు చెప్పారు, ఇక్బాల్‌ అన్సారి. ఈయన అయోధ్య బాబ్రీ మసీదు వ్యాజ్యంలో ముస్లింల తరఫు కక్షిదారు. బాబ్రీ కట్టడం మసీదు అని వాదిస్తూ అన్సారి తండ్రి మొదట కోర్టుకు వెళ్లారు. ఆయన మరణించిన తరువాత అన్సారి ఆ వ్యాజ్యాన్ని కొనసాగించారు. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్య శ్రీరాముడికే చెందుతుందని తీర్పు ఇచ్చింది. ఆగస్టు 5న జరిగిన భూమిపూజకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ‌మొదటి ఆహ్వానం అన్సారికి అందించి గౌరవించింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి అన్సారి కూడా హాజరయ్యారు.

మీ తండ్రి హషీం అన్సారి జీవితం మొత్తం బాబ్రీ మసీదు కోసం కోర్టులో వ్యాజ్యం నడిపారు. భూమిపూజకు హాజరైన తరువాత ఆయన కుమారునిగా మీకేమనిపించింది? అని విలేకరి అడగగా, చక్కని సమాధానం ఇచ్చారు అన్సారి. ‘ఔను, నా తండ్రి కోర్టులో పోరాడారు. ఆయన మరణించిన తరువాత నేను పోరాటం కొనసాగించాను. మేం ఒక న్యాయ పోరాటం చేశాం. సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన తరువాత దానిని గౌరవించడం మా విధి. ముస్లింలు రామాలయ నిర్మాణానికి వ్యతిరేకం కాదన్న విషయం జనానికి తెలియడానికే నేను భూమిపూజకు హాజరయ్యాను.’ అని చెప్పారాయన. ముస్లిం కోణం నుంచి మీరు అయోధ్య తీర్పును ఎలా పరిగణిస్తారన్న మరొక ప్రశ్నకు, ‘మసీదు నిర్మాణం కోసం ముస్లింలు ఆలయాన్ని కూల్చలేదని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఆనందమయ క్షణంలో హిందూ సోదరులు మాతో ఉన్నారు. మేం వారితో ఉంటాం’ అని అన్నారాయన. మీరు ప్రధానికి ఏం చెప్పారు అన్న ప్రశ్నకు, ప్రధానికి నేను రామచరిత మానస్‌ ‌గ్రంథం బహూకరించాలని అనుకున్నాను. కానీ కొవిడ్‌ ‌కారణంగా ఆయన స్వీకరించలేనని చెప్పారు. ఆయనా నేనూ పరస్పరం అభినందించు కున్నాం. ఆయన తరఫున తీర్థక్షేత్ర కార్యదర్శి చంపత్‌రాయ్‌ ఆ ‌గ్రంథాన్ని స్వీకరించారు’ అని వివరించారు అన్సారి. రామమందిర నిర్మాణం తరువాత ముస్లింల వైఖరి ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా, ‘హిందువులలో అత్యధికులు సహనశీలురు. రాముడిని వారు విశ్వసిస్తారు. మేం కూడా వారి విశ్వాసాన్ని గౌరవిస్తే ఆలయం నిర్మాణం తరువాత ఇక సంఘర్షణ ఉండదు.’ అని అభిప్రాయపడ్డారు అన్సారి.

అయోధ్యలోని సున్నీ సోషల్‌ ‌ఫోరం అధ్యక్షుడు రాజూ రయీస్‌, ‌రాముడినే మేం ఇమామ్‌ ఇ ‌హింద్‌ (‌మతాధికారి, ప్రవక్త)గా భావిస్తామని చెప్పారు. రయీస్‌ ఒక్కరే కాదు, దేశంలో ఆగ్రా, ఇతర ప్రాంతాలతో పాటు అయోధ్యలో కూడా పలువురు ముస్లింలు భూమిపూజను స్వాగతిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం టీవీ చానళ్లలో కార్యక్రమాన్ని చూసినప్పటికి కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత తాము కూడా వెళ్లి దర్శనం చేసుకుంటామని చెబుతున్నారు. భూమిపూజ ముహూర్తానికే వారు మేళతాళాలు మోగించారు. మందిరం సమస్య హిందూ ముస్లిం సమస్యగా తాము పరిగణించడం లేదని లక్నోకు చెందిన సన్నీ అబ్బాస్‌ ‌వ్యాఖ్యానించారు. మందిర నిర్మాణాన్ని ఎక్కువ మంది ముస్లింలు స్వాగతిస్తూ, హిందువుల మనోభావాలను గౌరవిస్తున్నారు. ఇది సోదర భావాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. కరోనా తరువాత అయోధ్య వెళ్లి కరసేవ చేస్తామని కాన్పూర్‌కు చెందిన షానో ఖాన్‌ ‌చెప్పారు.

About Author

By editor

Twitter
Instagram