నిన్న చైనా నుంచి కొవిడ్‌ 19 ‌భారతదేశం మీద దాడి చేసింది.

ఇవాళ పాకిస్తాన్‌ ‌నుంచి మిడతల దండు దాడి చేస్తోంది.

కరోనా మహమ్మారితో ఒక పక్క నిద్రాహారాలు లేకుండా దేశం పోరాడుతుంటే ఇప్పుడు కొత్తగా మరొక విపత్తు వచ్చిపడింది. మొదటిది కంటికి కనిపించని వైరస్‌ అయితే, రెండోది కంటికి కనిపించే మిడతల దండు. రెండూ పెనుముప్పును మోసుకొస్తున్నవే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి పెను సవాలు విసురుతున్నవే. కరోనాను పాండెమిక్‌ అం‌టున్నారు. అంటే విశ్వవ్యాప్త అంటువ్యాధి. ప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్య. మిడతల దండయాత్రలను లోకస్ట్ ‌ప్లేగ్‌ అం‌టారు. ఫలితం, అంతర్జాతీయ ఆహార సమస్య. దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ ప్రమాదకర స్థాయిలో భారత్‌ ‌మిడతల సమస్యను ఎదుర్కొంటున్నది. 1993 తరువాత ఇంత తీవ్ర స్థాయిలో మిడతలు దండెత్తడం మళ్లీ ఇప్పుడే. ఇవాళ్టి మిడతల సమస్యలో ఉన్న ఒక మేలు ఏమిటంటే ఇవి మానవాళికి హాని కాదు. చెట్టూచేమకే చేటు. ఇది మిడతల దాడే అని కొట్టిపారేయడానికి వీలు లేదు. పచ్చదనానికీ, పంటలకీ, చెట్టు చేమకి ఇది చేసే హాని అనూహ్యమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే, వేల పుస్తకాలను కొన్ని వారాలలోనే చెదపురుగులు ధ్వంసం చేయగలిగినట్టు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను మిడతలు కొన్ని గంటలలో తొలిచేస్తాయి. కరువు కాటకాలలోకి వ్యవస్థలను నెట్టివేస్తాయి. ఆహార భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తాయి. అంటే ఆకలిచావులను దారుణంగా పెంచుతాయి. ఇది అంతర్జాతీయ సమస్య కాబట్టి, దుష్ఫలితాలు దారుణంగా, విస్తారంగా ఉంటాయి. తూర్పు ఆఫ్రికా మీద మిడతల దండయాత్ర కారణంగా ఆహారభద్రతకు భంగం కలిగే అవకాశం చాలా ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అం‌డ్‌ అ‌గ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఇప్పటికే హెచ్చరించింది.

వీటిని ఎడారి మిడతలని (స్కిస్టోసెరికా గ్రెగారియా) కూడా అంటారు. ఇవి గ్రాస్‌హూపర్‌ ‌జాతికి చెందినవి. తూర్పు ఆఫ్రికా, ఆసియా, మధ్య ప్రాచ్యం నుంచి మిడతల దండు దూసుకువస్తున్నదన్న సమాచారం నిజానికి మార్చి రెండోవారంలోనే వెలువడింది. కానీ దీనిని మించిన ప్రమాదం కరోనా వైరస్‌ ‌కూడా అప్పుడే ప్రపంచం మీద దండెత్తింది. రెండూ అంతర్జాతీయ సమాజానికీ, సమస్త మానవాళికీ పెనుముప్పులే అయినా కరోనా నివారణకే పెద్ద పీట వేశారు. అందుకు కారణం, అది మనుషులను మిగల్చదు. మిడతలు పంటలను మిగ ల్చవు. మిడతల దండు యాత్ర ప్రారంభించిన వెంటనే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆహార పంటలకీ, జీవనోపాధికీ అపార నష్టం కలిగిస్తూ మిడతలు బీభత్సం సృష్టించే పని మొదలు పెట్టాయని ఘోషించారు. వీటిని నిరోధించకుంటే రెండు కోట్ల మంది నష్టపోతారని ఆనాటి అంచనా ప్రకారం చెప్పారు. అది ఇప్పుడు పెనుభూతమై పోయింది. కెన్యాలో ఏర్పడే మిడతల దండు ఎంత పెద్దదంటే 2400 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. అంటే మూడు న్యూయార్క్ ‌నగరాలంత వైశాల్యంలో విస్తరించిన దండు అన్నమాట. అలాగే వంద కిలోమీటర్ల మేరకు వ్యాపించిన మిడతల సమూహాలు కూడా ఉంటాయి. మిడతల సమూహాలను నివారించడానికీ, వీటితో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికీ కలిపి 138 మిలియన్‌ ‌డాలర్లు కావాలని ఫుడ్‌ అం‌డ్‌ అ‌గ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఐక్యరాజ్య సమితిని కోరింది.

ఇంతకీ ఈ సంవత్సరం ఇంత స్థాయిలో అవి విరుచుకుపడడానికి కారణాలు ఏమిటి? 2018 నాటి తుపానులు, 2019 నాటి వాతావరణ పరిస్థితులేనని శాస్త్రవేత్తలు తేల్చారు. 2020 ఆరంభంలోనే ఇథియోపియా, సోమాలియాలలో పెద్ద ఎత్తున మిడతల సమూహాలు బయలుదేరడం గమనించారు. అక్కడ నుంచి కెన్యా, ఉగాండా, సూడాన్‌ ‌వెళ్లాయి. యెమెన్‌, ‌సౌదీ, ఇరాన్‌, ‌భారత్‌లలో కూడా మిడతల సమూహాలు ఏర్పడినాయి.

కరోనా తరువాత ప్రస్తుతం మిడతల దండు దాడులు భారతదేశంతో పాటు పలు ఇతర దేశాలను కూడా వణికిస్తున్నాయి. పశ్చిమ భారతం ద్వారా మిడతలు భారతదేశంలోకి చొరబడ్డాయి. అక్కడికి పాకిస్తాన్‌ ‌నుంచే వచ్చాయి. ఇరాన్‌ ‌నుంచి ఆ దేశంలోకి వచ్చాయి. అక్కడి అన్ని ప్రావిన్సులలోను ఆరవై జిల్లాలలో వీరవిహారం చేశాయి. పాకిస్తాన్‌ ‌నుంచి రాజస్తాన్‌కు అక్కడ నుంచి పంజాబ్‌, ‌హరియాణా, మధ్యప్రదేశ్‌కూ, ఆపై ఉత్తరప్రదేశ్‌లోను మిడతలు ప్రవేశించాయి. రాజస్తాన్‌ ‌మీద మిడతలకి ప్రత్యేక ప్రేమ ఉంటుంది. వాటికి గుడ్లు పెట్టడానికి అనువుగా ఎడారి ఇసుక విస్తారంగా అక్కడే ఉంటుంది. అందుకే మిడతలు గంగా పరీవాహక ప్రాంతంలో లేదా గోదావరి, కావేరి పరీవాహక ప్రాంతంలోగాని గుడ్లు పెట్టవు. వాటి దాడి రాజస్తాన్‌ ‌నుంచి ఆరంభం కావడానికి కారణం కూడా ఇదే. దేశ రాజధానిని కూడా మిడతలు సమీపించే ప్రమాదం ఉన్నందున, శివారు ప్రాంత రైతులు పురుగుమందులు చల్లాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మే 28న ఆదేశాలు జారీ చేయవలసి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతానికి చేరాయి. ఈ ప్రాంతాలలో ఉన్న పచ్చదనంతో పాటు, పంటలు, కూరగాయలు ఖాళీ చేస్తాయని అధికారులు ఆందోళన పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో పత్తి పంట కూడా ఉంది. రాజస్తాన్‌లోని దౌసా, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ ‌ప్రాంతాలు ప్రధానంగా మిడతల దండుతో నష్టపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోనే ప్రయాగ్‌రాజ్‌ ‌పట్టణం మీద కూడా మిడతలు దాడి చేసే అవకాశం ఉందని ఆందోళనపడుతున్నారు. నిరుడు కూడా రాజస్తాన్‌, ‌గుజరాత్‌లలో వీటి సందడి కనిపించింది. కానీ ఈ సంవత్సరం ఎన్నో వందల రెట్లు ఉధృతితో మిడతలు వచ్చి పడుతున్నాయి. కాటోల్‌ అనే ప్రాంతంలో మిడతల సవ్వడి కనిపించడంతో బాణసంచా కాల్చమని మహారాష్ట్ర హోం మంత్రి రైతులకు సలహాలు ఇచ్చారు. చప్పుళ్లు చేస్తే ఇవి రావని చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి వచ్చిన మిడతలలో యాభయ్‌ ‌శాతం నిర్మూలించామని వ్యవసాయ మంత్రి చెప్పారు.

ఇప్పుడు దేశాలను గడగడలాడిస్తున్న ఈ ఎడారి మిడతలు అతివేగంగా ప్రయాణించే వలస కీటకాలు. ఒక చదరపు కిలోమీటరు పరిధిలో కనిపించే మిడతల దండు ఒక్కరోజులో 35,000 మంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని తినేస్తుంది. ఇది కూడా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన సమాచారమే. ఒక కిలోమీటరు వైశాల్యంలో ఏర్పడిన దండు ఇంత నష్టం చేయగలదు. అలాగే బాగా పెద్ద మిడతల సమూహం కోటీ ఎనభయ్‌ ‌లక్షల టన్నుల పచ్చదనాన్ని ఖాళీ చేస్తుందని కూడా సమితి చెప్పింది. ఒక మిడత బరువు రెండు లేదా మూడు గ్రాములే. అది తినేది కూడా సరిగ్గా అంతే. మరి ఇంతనష్టం ఎలా వస్తుంది? ఇందులో ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. పైన చెప్పినట్టు ఒక చదరపు కిలోమీటరు వైశాల్యం మొదలు, కొన్ని చదరపు కిలోమీటర్ల వైశాల్యం వరకు మిడతల దండు ఉండవచ్చు. నాలుగు కోట్ల మిడతల నుంచి ఎనిమిది కోట్ల వరకు (ఒక చదరపు కిలోమీటరు వైశాల్యంలో) మిడతలు ఉంటాయి. అందుకే వీటి ఆకలిని చూసి ఆశ్చర్యపోనక్కరలేదు. అంటే పెద్ద దండు దాదాపు ఎనిమిది కోట్ల మందికి సరిపోయే ఆహారాన్ని తినేస్తుంది. ఒక ఆడ మిడత 80 నుంచి 150 గుడ్లు పెడుతుంది. ఇప్పుడు ఈ దండు వ్యాపించి ప్రభావితం చేస్తున్న భూభాగం మొత్తం భూభాగంలో 20 శాతం. ఈ దండును ఇలాగే వదిలేస్తే జూన్‌ ‌మాసాంతానికి 400 రెట్లు పెరుగుతుంది. ఇవి ఎగిరి వెళ్లిన ఒక ప్రాంతంలోనే రెండు కోట్ల నలభయ్‌ ‌లక్షల మందికి ఆహార భద్రత కరువైపోతుంది. దాదాపు ఎనభయ్‌ ‌లక్షల మంది వలసలు పోవలసిన దుస్థితి ఎదురవుతుంది. అంతేకాదు, ఎక్కడా పచ్చదనం మిగలదు కాబట్టి, పశుగ్రాసానికి కూడా విపరీతమైన కరువు ఏర్పడుతుంది. ప్రజలు పొదుపు చేసుకున్నదంతా ఖర్చవుతుంది. దారిద్య్రం పెరుగుతుంది.

ఏప్రిల్‌ 2020 ‌ప్రాంతంలో మొదలైన తాజా మిడతల దండు వల్ల 23 దేశాలు బాగా నష్టపోతున్నాయి. అందుకే ప్రపంచం ఇంత కంగారు పడుతోంది. కొవిడ్‌ 19 ‌మహమ్మారి భయంతో ప్రపంచం ఈ మిడతల బెడదను సరిగా పట్టించుకోలేకపోయింది. దీనితో ఆఫ్రికా దేశాలు, మధ్య ప్రాచ్యదేశాలు ఆహారభద్రతకు దూరమవుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి ఆ దేశాలను రక్షించడానికి ప్రపంచ బ్యాంక్‌ 500 ‌మిలియన్‌ ‌డాలర్లతో ఒక కార్యక్రమం చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నది. ఇవి మనుషుల మీద, జంతువుల మీద దాడి చేయవు. కానీ వాటి దాడి తరువాత కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కూడా మిడతల దాడి గురించి రైతులను హెచ్చరించారు.
మిడతల దండులతో పోరాటంలో భారతదేశం అనుభవం ఇప్పటిది కాదు. అది రెండు వందల ఏళ్ల చరిత్ర. మిడతల దండు ప్రమాదాన్ని హెచ్చరించేందుకు ఈ దేశంలో ఒక సంస్థ కూడా పని చేస్తున్నది. అది బ్రిటిష్‌ ఇం‌డియాలోనే 81 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఆ అనుభవమే ఈ తాజా మిడితల దాడిని అరికట్టడంలో ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు. మిడతల దండయాత్రలను నివారించడం ఎలాగో అప్పుడే వ్యూహాలు సిద్ధం చేసుకోవడమే కాదు, అసలు మిడతలు ఇలా దండెత్తడం వెనుక ఉన్న రహస్యం గురించి వారు ఆనాడే తెలుసుకునే ప్రయత్నం చేశారు. పందొమ్మిదో శతాబ్దంలో వీటి బెడద దారుణంగా ఉంది. 1812, 1821, 1843, 1844, 1863, 1869, 1878, 1889, 1892 సంవత్సరాలలో మిడతల ప్రతాపాన్ని భారతదేశం చవిచూడవలసి వచ్చింది. ఆ తరువాత కూడా దండు దాడి చేసింది. ఆ సమాచారం మొత్తాన్ని ఆంగ్లేయులు సేకరించారు.

మిడతల దాడుల కట్టడి కూడా అంతర్జాతీయ సహకారంతో జరగవలసిందే. ఇవి ఒక ఖండంలో బయలుదేరితే రోజుకు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఇతర ఖండాలను కూడా ఖాళీ చేస్తాయి. నివారణోపాయాలతో పాటు, పరిశోధనలో కూడా దేశాలు సహకరించుకోవాలి. అలాగే దేశంలోని రాష్ట్రాల మధ్య కూడా సమన్వయం అవసరం. 1927, 1929 సంవత్సరాలలో పశ్చిమ భారతం, మధ్య భారతాల మీద మిడతల దండయాత్ర సాగినప్పుడు ఈ విషయం అనుభవానికి వచ్చింది. ఒక కేంద్రీకృత వ్యవస్థ ద్వారానే ఈ బెడదను ఎదుర్కొవాలన్న అభిప్రాయం వచ్చింది. ఫలితంగానే 1929లో స్టాండింగ్‌ ‌లోకస్టస్ ‌కమిటీ ఏర్పాటయింది. ఆ తరువాత సంవత్సరమే సెంట్రల్‌ ‌లోకస్ట్ ‌బ్యూరో కూడా ఆవిర్భవించింది. దీని తరువాత పరిణామమే 1939 నాటి లోకస్ట్ ‌వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌. ఇదే ప్రస్తుతం సేవలు అందిస్తున్నది. సైప్రస్‌ ‌పేపర్‌ అనే చమురు పూసిన కాగితాలు ఏర్పాటు చేయడం, వలలు వేయడం వంటి కొన్ని ప్రయోగాలు ఆనాడు జరిగాయి. కానీ పెద్ద ఫలితం రాలేదు. పైగా మిడతల దండును గురించి సాధారణ ప్రజలు రకరకాల కారణాలతో పట్టించుకునేవారు కాదు. మిడతల నివారణలో సహకరిస్తే పన్ను రాయితీ ఉంటుందని ప్రకటించి బ్రిటిష్‌ ‌పాలకులు ప్రజలను భాగస్వాములను చేయవలసి వచ్చేది. పందోమ్మిదో శతాబ్దం చివరిలో గద్దలు, కొంగలు, కాకులు వంటి పక్షులు మిడతలను నివారించగలవని కూడా భావించారు. ఇది కొంత వరకు విజయవంతమైంది. వాటిని పెంచి, మిడతల దండు మీదకు పంపడం వల్ల మనుషుల వల్ల జరిగే నివారణ కంటే ఎక్కువే అవి నివారించాయని తేలింది. ఇదే పద్ధతి సిరియాలో ఎంతో విజయవంతమైంది. ఇరవయ్యో శతాబ్దంలో చాలాకాలం ఇలా పక్షులను ప్రయోగించే విధానమే ఉంది. కొన్ని రకాల పక్షులను నిరంతరం కాపాడుకుంటూ ఉంటే అసలు మిడతల రాకనే అవి అరికడతాయని కూడా తేలింది. పైగా పురుగుమందులు చల్లే పని తప్పుతుంది. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెత వలె, మిడతల నివారణకు పురుగుమందులు చల్లితే అది పర్యావరణానికీ, భూమికీ చేటు చేస్తున్నది. కానీ ఇప్పుడు పక్షుల సందడి కూడా తగ్గిపోయింది. కొన్ని రకాల పక్షులు అంతరించిపోయే దశలో ఉన్నాయి.

ఆధునిక భారతదేశంలో కూడా వీటి దాడి జాడలు ఉన్నాయి. 2010లో చివరిసారిగా ఇవి వచ్చి పడ్డాయి. 1964 నుంచి 1997 మధ్యన 13 లోకస్ట్ ‌ప్లేగ్‌లను మన దేశం చూసింది. 1997 నుంచి 2010 వరకు ఐదుసార్లు మిడతల దాడులను ఎదుర్కొన్నారు. అయితే 2010 నుంచి 2018 మధ్య వీటి బెడద లేదు. 2019లో కూడా గుజరాత్‌, ‌రాజస్తాన్‌ల మీద ఇవి ప్రతాపం చూపాయి. 3.5 లక్షల హెక్టార్లలో పలు పంటలను ఆరగించాయి. కానీ 1993 నాటి దాడే దారుణమని అధికారులు చెబుతున్నారు. అప్పుడు 172 మిడతల దండులు వచ్చాయి. మొత్తంగా అరవై దేశాలకు వీటి బెడదతో అనుభవం ఉంది.

ఇప్పుడు మిడతలు పలు ఖండాలను చుట్టుకుంటూ ఇండియా రావడం కొత్తేమీ కాదు. 1929 నుంచి ఇలా అడపా దడపా మిడతల దాడులు జరిగాయి. వీటి జన్మస్థానం ప్రధానంగా ఇరాన్‌, అరేబియా, ఆఫ్రికా. ఇప్పుడు ఈ గతాన్ని గుర్తు చేసుకోవాలి. ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం మిడతల బెడదను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలు, ప్రాంతాలు తమ మధ్య సయోధ్యకు ఆ గతాన్ని గమనించవలసి ఉంటుంది. 1943లో రెండో ప్రపంచ యుద్ధం పతాకస్థాయిలో ఉన్నప్పుడు కొన్ని దేశాలు మిడతల మీద కూడా దాడి చేయవలసి వచ్చింది. ఫ్రాన్స్ ‌మిడతల దండు నివారణ గురించి చర్చించడానికి మొరాకోలోని రాబాత్‌ ‌నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశమే నిర్వహించవలసి వచ్చింది. ప్రకృతి సమతౌల్యం దెబ్బతినకుండా జాగ్రత్త పడకపోతే కూడా మిడతలు పొంచి ఉంటాయన్న సంగతి చెప్పడానికి చైనా అనుభవం అక్కరకు వస్తుంది. 1958లో చైనాలో గ్రేట్‌ ‌లీప్‌ ‌ఫార్వాడ్‌ అనే చర్య తీసుకున్నారు. అందులో భాగంగా నాలుగు జాతుల ప్రాణులను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు. అవే ఎలుకలు, ఈగలు, దోమలు, పిచ్చుకలు. కానీ పిచ్చుకల నిర్మూలనతో దేశం తరువాత అపార నష్టం చవి చూడవలసి వచ్చింది. ఆ చిట్టి జీవాలు క్రిమికీటకాలను తింటూ రైతుకు సాయపడేవి. పిచ్చుకల నిర్మూలనతో ఆ కీటకాలే విజృంభించాయి. అందులో మిడతలు కూడా ఉన్నాయి. పిచ్చుకలు కీటక జనాభాలో కొంత ఖాళీ చేసి సమతౌల్యం నిలిపేవి. తరువాతి కాలాలలో మిడతల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఇందుకోసం బాతుల సైన్యాన్ని రూపొందించుకోవలసి వచ్చింది. చిత్రం ఏమిటంటే, ఇటీవల పాకిస్తాన్‌ ‌మీద మిడతల దాడులు జరిగినప్పుడు ఇలాంటి బాతుల సైన్యాన్ని అక్కడకు పంపించాలని చైనా మొదట భావించింది. కానీ అది వాస్తవరూపం దాల్చలేదని వార్తలు వచ్చాయి. మిడతల నివారణలో ఇంకా పందులు, కప్పలు, పాములు కూడా ఉపకరిస్తాయి. కొన్నిరకాల పరాన్నజీవులు కూడా మిడతల బెడదను నివారించగలవు.

మిడతల దాడులు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో అవి ఎలా విరుచుకుపడగలుగుతున్నాయి? శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను బట్టి పర్యావరణంలో వచ్చిన అసమతౌల్యమే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది. తుపానులు, అంటువ్యాధులు, మిడతల దండులు వాటి శక్తిని దారుణంగా పెంచుకోగలుగుతున్నాయి. వాటి తీవ్రత ఇంతగా ఎందుకు పెరుగుతోంది? పర్యావరణానికి జరుగుతున్న చేటు. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది. అలాగే పర్యావరణాన్ని ప్రజలు కాపాడితే, గౌరవిస్తే అది కూడా ప్రజలను కాపాడుతుంది.

About Author

By editor

Twitter
Instagram