జూన్‌ 21 అం‌తర్జాతీయ యోగా దినోత్సవం

కొత్త కరోనా వైరస్‌, అం‌టే కొవిడ్‌ 19 ‌మనుషులను దారుణమైన ఆందోళనకు గురి చేస్తుంది. కొవిడ్‌ 19‌లో ఈ కోణం చాలా ముఖ్యమైనదని, ప్రమాదకరమైనదని వైద్యులంతా ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. ఆందోళనకీ, వైరస్‌ ‌నుంచి బయటపడడానికీ ఉన్న బంధం ఏమిటి? ఆందోళనతో శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. అదే వైరస్‌ ‌సోకడానికి దారి చూపుతుంది. కొవిడ్‌ 19 ‌మనదేశంలో విస్తరించడానికి కాస్త ముందే బాబా రాందేవ్‌ ఈ ‌విపత్కర సమయంలో యోగా అవసరాన్ని గుర్తు చేశారు. దీని నివారణకు ప్రాణాయామాన్ని ఏ విధంగా అభ్యాసించాలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనే కాదు, మన దేశానికి చెందిన యోగా గురువులతో పాటు, విదేశీయులు, హార్వార్డ్ ‌మెడికల్‌ ‌స్కూల్‌ ఆచార్యులు కూడా కరోనా నిరోధంలో యోగాభ్యాసానికి ఉన్న ప్రాధాన్యాన్ని నిర్ద్వంద్వంగా వెల్లడించారు. ఇంతకు ముందే యోగా గొప్పతనం తెలుసుకున్నా, అగ్రరాజ్యం అమెరికా యోగాభ్యాసాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకుంది. మనసులోని కల్లోల కెరటాలను శాంతింప చేయడానికి ప్రస్తుతం ప్రపంచానికి కనిపిస్తున్న మార్గం యోగాభ్యాసమే. మందులు కాదు, ఆస్పత్రులు కాదు, ప్రశాంత చిత్తమే మనిషిని కరోనా బారి నుంచి బయటపడేస్తుందని నేటి ప్రపంచం ఏకగ్రీవంగా ఆమోదించింది.

కరోనా ఒత్తిడి పెంచుతోంది. పెరిగిన ఒత్తిడి వైరస్‌ ‌బాధితుల సంఖ్యను పెంచుతున్నది. ఈ విషవలయాన్ని అధిగమించడానికి యోగాభ్యాసం ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన ప్రఖ్యాత హార్వార్డ్ ‌మెడికల్‌ ‌స్కూల్‌ (‌వైద్య కళాశాల) సిఫారసు చేసింది. ధ్యానం కూడా ఇందుకు ఉపకరిస్తుందని కూడా ఆ కళాశాల చెప్పింది. అమెరికాలో కరోనా వైరస్‌ ‌చెలరేగిపోతున్న తరుణంలోనే, అంటే ఈ సంవత్సరం మార్చి మధ్యలో ఈ సిఫారసులు వచ్చాయి. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఎకనమిక్‌ ‌టైమ్స్ ఈ ‌వార్తను (మార్చి 16) ప్రచురించింది. అప్పటికి ఇంకా అమెరికాలో కేసులు 3,485 మాత్రమే. మరణాలు మాత్రం 65. ఆ సమయంలోనే యోగ, ధ్యానం, ఉచ్ఛ్వాసనిస్వాసాల మీద అదుపు సాంత్వనకు నిజమైన మార్గాలని ఆ వైద్య కళాశాల ఆచార్యులు పేర్కొన్నారు. ‘కోపింగ్‌ ‌విత్‌ ‌కరోనా వైరస్‌ ‌యాంక్సయిటీ’ (కరోనా వైరస్‌ ఆం‌దోళనను ఎదుర్కొందాం) పేరుతో వచ్చిన ఒక వ్యాసంలో ఈ విషయాలు ఉన్నాయి. జాన్‌ ‌షార్ప్ (‌హార్వార్డ్ ‌మెడికల్‌ ‌స్కూల్‌), ‌డేవిడ్‌ ‌గాఫెన్‌ (‌స్కూల్‌ ఆఫ్‌ ‌మెడిసిన్‌ ‌కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం) ఈ వ్యాసం రాశారు. ఇంతకు ముందు అలవాటు లేకపోతే ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి. కొన్ని సమయాలలో కొన్ని విషయాలు తెలుసుకుంటే ఎంతో బావుంటుందని కూడా యోగాను ఉద్దేశించి వారు రాశారు. యోగా స్టూడియో, పాకెట్‌ ‌యోగా అనే రెండు యాప్‌లు చక్కగా వీటిని వివరిస్తున్నాయని వారు సిఫారసు చేశారు.

‘యోగాభ్యాసం మూడు అంచెలుగా పని చేస్తుంది. ఒకటి- యోగా రోగ నిరోధక శక్తిని ఇతోధికంగా వృద్ధి చేస్తుంది. రెండు- యోగాభ్యాసం వల్ల నిరాశానిస్పృహలను అధిగమించవచ్చు. మూడు- ప్రపంచం చేరవలసిన లక్ష్యాలను యోగా నిర్దేశిస్తుంది. దానితో మనం బలోపేతం కాగలం’ అంటారు ప్రముఖ భారతీయ యోగా గురువు భరత్‌ ‌ఠాకూర్‌. ఆం‌దోళన లేదా ఒత్తిడి నాడీమండలాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీనితో రక్తపోటు పెరుగుతుంది. కండరాల మీద కూడా ఒత్తిడికి లోనవుతాయి. దీనితో ఏకాగ్రత నశించిపోతుంది. వీటన్నిటిని చల్లార్చే గొప్ప గుణం యోగ సొంతం. ప్రయాణాల మీద పరిమితులు, ప్రతికూల వార్తల వెల్లువ, లాక్‌డౌన్‌ ‌కారణంగా భవిష్యత్తు గురించి, అంతకంటే, ఆ నెల తరువాత సమకూర్చుకోవలసిన వస్తువుల అందుబాటు గురించి చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. అన్నింటికీ మించి లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇప్పుడు నిరుద్యోగం దారుణంగా పెరిగిపోతున్నది. నిరుద్యోగం బారిన పడిన వారు, భవిష్యత్తు అనేది ఒకటి ఉందని, మళ్లీ జీవితం వికసిస్తుందని భావించవలసి ఉంటుంది. ఇందుకు యోగా పనికి వస్తుంది.

‘ఒక్క నిమిషం ఆగ్రహం రోగ నిరోధక శక్తి మీద నాలుగైదు గంటల పాటు ప్రభావం చూపుతుంది. ఒక్క నిమిషం నవ్వుకోగలిగితే దాని ప్రభావం రోగ నిరోధక శక్తి మీద 24 గంటల పాటు ఉంటుంది’ అంటాడు ప్రముఖ రచయిత లెస్‌ ‌బ్రౌన్‌. ‌కరోనా వైరస్‌ ‌భూమండలాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టిన తరువాత వైద్యులు చెప్పిన మొదటి మాట రోగ నిరోధక శక్తి గురించే. దేశం తరువాత దేశానికి క్షణాలలో వ్యాపిస్తూ భూగోళం మీద 219 దేశాలను కబళించిన కరోనాను చూసి ప్రపంచ ప్రజానీకం భయపడకుండా, ఆందోళన చెందకుండా, ఇంకా చెప్పాలంటే నవనాడులూ కుంగిపోకుండా ఎలా ఉండగలరు? భయం, ఆందోళన, ఒత్తిడి ప్రతి మనిషి అనుభవించిన సాధారణ లక్షణాలయిపోయాయి. మనిషికి రోగం వస్తే, మధుమేహం, బీపీ వంటి వాటితో ఒత్తిడితో రోగ నిరోధక శక్తి సన్నగిల్లి పోతుంది. ఇలాంటి సందర్భంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని, మన రోగ నిరోధక శక్తి మీద దుష్ప్రభావం ఏదీ పడకుండా చూసుకోవడం ఎలా? ఇదే అందరికీ వచ్చిన ప్రశ్న. యోగా ఈ సమయంలో చాలా ప్రతిభావంతగా పనిచేసే ఆయుధం. సాంత్వన చేకూర్చే చల్లని హస్తం.

‘మనసు అనేది నీళ్ల వంటిది. అది అతలాకుతలంగా ఉన్నప్పుడు చూడడం భయానకం. అది స్థిమితపడితే అంతా ప్రశాంతమే’ అంటారు ప్రసాద్‌ ‌మాహే. 1700 ఏళ్ల నాటి యోగా సూత్రాలలో వాటి కర్త పతంజలి మనసులోని అలలను కట్టడి చేసి నిశ్చలంగా ఉంచుకోవడం గురించే మాట్లాడాడు. ఆందోళన, క్షోభ, భయం, నిరాశ, ప్రతికూల భావాల ఉద్వేగాలు మనసునులో చురుకుగా కదిలే అలలను సృష్టిస్తాయి. ఈ కల్లోలమే, సంక్షుభిత మానసిక స్థితే నాడీ వ్యవస్థ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపగలుగుతుంది. ఇది తాత్కాలికమైతే శరీరానికి మంచిదే. రోగ నిరోధక శక్తికి కూడా దోహదం చేస్తుంది. అదే వారాలు, నెలల తరబడి కొనసాగితే రోగ నిరోధక వ్యవస్థ స్పందనను నీరసపడేటట్టుచేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతోనే వైరస్‌కు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మనలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోకుండా నిలబెట్టుకోవడానికి సహజ పద్ధతులలో ఉపయోగడేదే యోగాభ్యాసమని జర్నల్‌ ఆఫ్‌ ‌బిహేవియరల్‌ ‌మెడిసిన్‌ ‌పేర్కొంటున్నది. క్రమం తప్పని యోగాభ్యాసంతో రోగ నిరోధక శక్తిని సాధించుకోవచ్చునని ఆ పత్రిక సిఫారసు చేసింది.

యోగాభ్యాసం అంటే శారీరక వ్యాయామం అని మనలో చాలామంది అభిప్రాయపడుతూ ఉంటాం. కానీ యోగా అనే ఆకాశమంత చిత్రంలో అదొక రేఖ, అంతే. పతంజలి మహర్షి చెప్పిన సనాతన యోగాభ్యాసం ఎనిమిది అంగాలతో కూడుకున్నది. దీనిని మానసంలోని కల్లోలాన్ని నిరోధించడానికి నిర్మించారు. వాటినే ఆసనాలని పిలుచుకుంటాం. బ్రహ్మచర్యం (స్వీయ నియంత్రణ), శుచిత్వం, సంతోషం, స్వాధ్యాయ (నిరంతర జాగరూకత), ప్రాణాయామం యోగాలో చెబుతారు. ఈ ఐదు అంశాల యోగాభ్యాసం కరోనా ద్వారా మానవాళికి వచ్చే ఆందోళనను దూరం చేయగలుగుతుంది.
స్వీయ నియంత్రణ అనేది కరోనా వంటి సమయంలో అత్యవసరంగా కనిపిస్తుంది. దీనినే బ్రహ్మచర్యంగా పిలుస్తారు. రోగ నిరోధక శక్తిని భద్రంగా ఉంచుకోవలసిన సమయంలో వృథాగా శక్తిని కోల్పోకుండా చేయడానికి ఇది ఉపకరిస్తుంది. అంటే రోగ నిరోధక శక్తి స్పందన సక్రమంగా ఉండేటట్టు చేస్తుంది. ధూమపానం, మద్యపానం, అతిగా చక్కెర వాడకం, బయటి తిండి మన రోగ నిరోధక శక్తి మీద ప్రతికూలత కనపరుస్తాయి. ‘దేహమే నీ దేవాలయం. నీ ఆత్మ అధిష్టించడానికి వీలుగా దానిని పరిశుభ్రంగా ఉంచుకో’ అంటారు ప్రఖ్యాత యోగా గురువు బీకేఎస్‌ అయ్యంగార్‌.

యోగాభ్యాసంలోని శుచి నీ దేహాన్ని గౌరవంతో చూసుకుంటూ, శుచిగా ఉంచుకోవాలని ప్రబోధిస్తుంది. దీనిని ఒక యోగి వలె ఆహారం తీసుకుంటూ సాధించవచ్చు.శక్తిని కూర్చే పదార్థాలనే తినాలి. ప్రశాంతతను చెడగొట్టని వాటినే తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్నే స్వీకరించాలి. ఇవే మన ఆహారంలో అరవై నుంచి ఎనభై శాతం ఉండాలి. మనం శుచీశుభ్రాలను పాటించడం ద్వారా కూడా యోగాభ్యాసం చేయవచ్చును. శరీరంలో తగినంత జలం ఉండేరీతిలో మంచినీటిని తీసుకోవడం ఒకటి. శరీరంలో తగినంత జలం లేకపోతే, లేదా కోల్పోతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్న వాస్తవాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలి. తగినంత జలం లేకపోతే శరీరానికి రోగ నిరోధక శక్తిగా ఉపయోగపడే రక్తాన్ని, లింఫ్‌ ‌గ్రంథులను అది బలహీన పరుస్తుంది. తగినంత జలం ఉన్నప్పుడే శరీరంలోకి చేరిన విష పదార్థాలను, బాక్టీరియాను బయటకు పంపించే శక్తి శరీరానికి ఉంటుంది. కాబట్టి శరీరంలోని బాక్టీరియాను నిరోధించడానికి తగినంత జలం కూడా ఉండాలి.

లాక్‌డౌన్‌, ‌క్వారంటయిన్‌ ఒక నాణానికి అటు ఇటు ఉండేవే. లాక్‌డౌన్‌ ‌కాలంలో కొందరు సినిమా నృత్యాలు, పెద్దగా ఉపయోగం లేని ఆటలకు పరిమితమయ్యారు. కానీ కొందరు యోగాభ్యాసాన్ని ఆశ్రయించారు. మనసునీ, శరీరాన్నీ, ఆత్మనీ అనుసంధానం చేసే అద్భుత పక్రియ యోగ. క్వారం•యిన్‌ అయిన వారందరికీ యోగ గురించి తెలిసే అవకాశం లేదు. పేరు విన్నా పక్రియ గురించి తెలియకపోవచ్చు. క్వారంటయిన్‌లో ఉన్న కొత్తవారికి హఠయోగ మంచిదని శిక్షకులు చెబుతున్నారు. తాడాసనం, త్రికోణాసనం, అర్థకటి చక్రాసనం, వీరభద్రాసనం కూడా యోగాభ్యాసం ఆరంభానికి అనుకూలంగా ఉంటాయి. కరోనా లేదా, క్వారం టయిన్‌ ‌సమయంలో యోగ నిద్ర ఎంతో బాగా పనిచేస్తుందని ప్రముఖుల యోగా అధ్యాపకులు ఏనాడో వెల్లడించారు. 20 నిమిషాల యోగనిద్రతో ఆందోళనను, ఒత్తిడిని అధిగమించవచ్చు. కరోనా వైరస్‌ ‌నుంచి బయటపడిన తొలి ఢిల్లీ వాసి చెప్పిన మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రతి ఉదయం తాను చేసిన కపాలభాతి ప్రాణాయామం ఎంతో ఉపకరించాయని ఆయన చెప్పారు. కపాలభాతి అంటే కపాలాన్ని శుద్ధి చేసుకునేది. యోగ, ధ్యానం మనిషికి ఇచ్చేవి ఏమిటి. శారీరక చురుకుదనం, ఆరోగ్యకరమైన ఆహారం పట్ల మొగ్గు, ధూమపానం.. మద్యపానం పట్ల విము ఖత, సుఖనిద్ర, ఒత్తిడి స్థాయిని తగ్గించడం, మెదడులో గాబా అనే రసాయనాన్ని పెంచడం (దీనితోనే మనసు ప్రశాంతంగా ఉండగలగుతుంది), ఆందోళనకు గురిచేసే హార్మోన్లను తగ్గించడం. కరోనా కాలంలో దాని బయటపడడానికి చాలామందికి ఇవే కదా అడ్డంకిగా ఉన్నాయి.

సంతోషం కండరం వంటిది. ఉపయోగించేకొద్దీ బలపడుతుంది అంటారు పెద్దలు. యోగాభ్యాసంలో చెప్పే సంతోషానికి విస్తృతార్థం ఉంది. ఇక్కడ సంతోషం అంటే కృతజ్ఞతా భావంతో సాధ్యమయ్యే సంతృప్తి. అలాగే అవతలి వారి మంచి పనులను మనస్ఫూర్తిగా హర్షించడం. ఇవి మనలోని ఒత్తిడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని కాపాడుతూ ఉంటాయి. ప్రకృతి అనండి లేదా భగవంతుడు అనండి, రోజుకి మనకి 86,400 సెకెనులు ఇచ్చారు. అందులో కొన్ని సెకనులయినా అవతలి వారి పట్ల కృతజ్ఞత చూపడానికి ఉపయో గించగలుగుతున్నామా? అన్నది మంచి ప్రశ్న. ఇక్కడ అవతలి వారిని బుట్టలో వేయడానికి ఉపయోగించే విద్యల గురించి, అందుకు తోడ్పడే పొగడ్తల గురించి చెప్పడం లేదు. ఆశావాదం, అవతలి వారిని మెచ్చడం మన ఆరోగ్యం మీద చక్కని సానుకూల ప్రభావాన్ని చూపగల వని పరిశోధకులు చెబుతారు. ఆందోళనకు కూడా ఇదే విరుగుడు. నిజమే, మంచి పని చేసిన వారిని మనసు నిండా సంతోషంతో శ్లాఘించకపోతే ఎంత వెలితి? స్వాధ్యాయ బౌద్ధం నుంచి వచ్చిందం టారు. ఇది కూడా ఆందోళనకు విరుగుడే. అదే ధ్యానం. జనరలైజ్డ్ ‌యాంక్సయిటీ డిజార్డర్‌ను, ఒత్తిడిని తగ్గించడంలో ఇది చక్కని పాత్ర పోషిస్తుంది. ఇక ప్రాణాయామం అనేది పూర్తిగా ఒత్తిడిని, ఆందోళనను నిరోధించేదే. ఆ విధంగా ఇది రోగ నిరోధక శక్తికి ప్రాణం పోస్తుంది. క్రమం తప్పని, శ్రద్ధతో చేసే ప్రాణాయామం భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చక్కని అభ్యాసం వల్ల మన నాడీ మండలాన్ని రోగ నిరోధక శక్తితో, హర్మోన్ల విధానంతో అనుసంధానించే లక్షణం ఇందులో ఉంది. ఊపిరి మీద ఆదుపుతో లోలోపలి శక్తులను వెలికి తీయవచ్చు.

యోగా శారీరక వ్యాయామానికి మించినది. యోగాతో జీవితాలు బాగుచేసుకున్న వారు ఇప్పుడు విశ్వమంతటా కనిపిస్తారు. ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా ఆరోగ్యాన్నీ, మానసిక స్వస్థతను యోగాభ్యాసం ఇవ్వగలుగుతుంది. కేవలం కరోనా ద్వారా కలుగుతున్న ఒత్తిడి నుంచి విముక్తి పొంద డానికి కొన్ని ఆసనాలు చెబుతున్నారు. అందులో ఒకటి వీరభద్రాసనం. శరీరానికి చురుకును ఇచ్చి, శరీరానికీ, మేధస్సుకీ మధ్య అనుబంధం పెంచే ఆసనమిది. మరొకటి పర్వతాసనం. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. కండరాల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడి నుంచి తప్పిస్తుంది. అయితే ఇవి గురుముఖంగా నేర్చుకోవడం అవసరం. అలాగే సూర్య నమస్కారాలు. ఇవి మనిషి పరిపూర్ణతకు, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

About Author

By editor

Twitter
YOUTUBE