జూన్‌ 23‌న పూరీజగన్నాథ స్వామి ఉత్సవం

స్వామి మూర్తి నుంచి ప్రసాద వితరణ వరకు ఎన్నో అంశాలలో భిన్నత్వం కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథోత్సవమే శూన్య మాసంగా వ్యవహరించే ఆషాఢంలో జరగడం ఒక ఉదాహరణ. నిరాటంకంగా సాగిపోయే జగన్నాథ చక్రాలకు కరోనా మహమ్మారి వేగనిరోధకంగా నిలిచింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వ్యాధి కారణంగా ప్రభుత్వ నిబంధనలు ఈ ‘శోభాయాత్ర’ను నిలువరించినట్లయింది.
సర్వవ్యాపి నారాయణుడి విశిష్ట, వైభవాలను యావత్‌ ‌ప్రపంచానికి చాటుతూ ఉత్తరాదిన బదరీనాథ్‌, ‌ద్వారక, దక్షిణాదిన శ్రీరంగం, తిరుపతి, మధ్య తూర్పున పూరీధామాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. శ్రీమహావిష్ణువు రామేశ్వరంలో స్నానసంధ్యా దులు ముగించుకుని, బదరీనాథ్‌లో అల్ఫాహారం స్వీకరించి, మధ్యాహ్న భోజనానికి పూరి ధామం చేరుకుంటారని, రాత్రి ద్వారకలో విశ్రమిస్తాడని పురాణ గాథ.
జగన్నాథుడు అంటే విశ్వరక్షకుడు. ఆయనను ‘దారుబ్రహ్మ’అంటారు. మనకు తెలియని బ్రహ్మ పదార్థం ఏదో ఆయనలో ఉంది.
పూరిని శ్రీ క్షేత్రంగా వ్యవహరిస్తారు. నీలాచలం, నీలాద్రి, జగన్నాథపురి, పురుషోత్తమధామం అనీ అంటారు. శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామాదుల దేవేరులతో కాకుండా అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో జగన్నాథస్వామిగా కొలువుదీరడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీపీఠం’గా పిలిచే పూరీ ఆలయం 214 అడుగుల ఎత్తయిన గోపురంతో 68 అనుబంధ ఆలయాలతో భక్తజనావళిని అలరిస్తోంది.

స్వామివారికి పూజాదికాలు ఘనంగా నిర్వహించినా దర్శనం మాత్రం సాధారణంగా, నిరాడంబరంగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక దర్శనాలు ఉండవు. ‘కోటికి పడగెత్తిన ధనవంతుడూ నీ గుడి ముంగిట సామాన్యుడు’ అని ఒక కవి అన్నట్లు, ఎంతటి ఉన్నతులైనా జగన్నాథుడి ముందు అతి సామాన్యులే. ప్రతి ఉదయం ‘సహనమేళ’పేరుతో దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు నేరుగా ‘రత్నసింహాసనం’ వద్దకు చేరి స్వామిని అతి సమీపం నుంచి దర్శించుకోవచ్చు.

శంకర భగవత్పాదులు, రామానుజయతీంద్రులు, మధ్వాచార్యులు తదితర ఎందరో మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. పీఠాలు నెలకొల్పారు. శంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా నలుదిక్కులా నెలకొల్పిన నాలుగు పీఠాలలో ఇదీ ఒకటి. దీనిని ‘భోగవర్థన’మఠంగా వ్యవహరిస్తారు. బదరినాథ్‌లో జ్యోతిర్మతి, రామేశ్వరంలో శృంగేరి, ద్వారకలో శారద పీఠాలు స్థాపితమయ్యాయి. వీటిని వరుసగా త్యాగ, భోగ, ఐశ్వర్య క్షేత్రాలుగా అభివర్ణిస్తారు. పూరీ మఠానికి ‘కర్మ’ క్షేత్రమని పేరు. స్వామి సదా తన కన్నుల ముందే ఉండాలంటూ ‘జగన్నాథస్వామి నయన పథగామీ భవతుమే’ అని జగన్నాథాష్టకంలో శంకరులు స్తుతించారు. రామానుజులు వైష్ణవ సంప్రదాయాన్ని ప్రతిష్ఠించేం దుకు ప్రయత్నించారు. ఆయన ద్వారా తెలుగునాట ‘జగన్నాథ సేవ’ ప్రాచుర్యం పొందింది. చైతన్య మహాప్రభువు శేష జీవితం ఇక్కడే గడిపారు. సిక్కుగురువు గురునానక్‌, శ్రీ‌పాదవల్లభులు, కబీర్‌, ‌తులసీదాస్‌ ‌వంటి మహనీయులు ఈ క్షేత్రాన్ని సందర్శించారని చరిత్ర. జయదేవుడు స్వామి సన్నిధిలో రచించిన ‘గీత గోవిందం’ కావ్యాన్ని ఆయనకే అంకితమిచ్చారు.

ఈ క్షేత్రంలోని దేవదేవతా విగ్రహాల నుంచి ఊరేగింపులు, ఉత్సవాలు, ప్రసాద వితరణ వరకు ఎన్నో అంశాలలో ఎన్నో ప్రత్యేకతలు. సాధారణంగా ఆలయాలలో స్వామి మూలరూపం స్వయంభువు గానో, ప్రతిష్ఠించో ఉంటుంది. పూరీనాథుడు జగన్నాథుడు ‘దైవం చెక్కిన దారుశిల్పం’. బలభద్ర, సుభద్ర, జగన్నాథుల విగ్రహాలు మొండి చేతులతో, నడుం వరకే దర్శనమిస్తాయి. విచిత్రంగా… దారుమూర్తులుగా పెద్ద కళ్లు మినహా, కాళ్లు, చేతులు, పెదవులు, చెవులు లేకుండా కేవలం ఒక చెట్టుకు పసుపు, కుంకుమలతో అలంకరించినట్లు ఉంటాయి. బలభద్రుడి విగ్రహం ఐదు అడుగుల ఐదు అంగుళాలు, సుభద్ర విగ్రహం ఐదు అడుగులు, జగన్నాథుని విగ్రహం ఐదు అడుగుల ఏడు అంగుళాలు ఉంటాయి.
అవయవ లోపంగల విగ్రహాలు అర్చనకు అనర్హమంటారు. కానీ ఈ నీలాచల క్షేత్రంలో అదే ప్రత్యేకత. ఇందుకు సంబంధించి వాడుకలో ఉన్న కథనం ప్రకారం, పూరీనాథుడికి నీలమాధవుడు అనీ పేరు. విశ్వావసు అనే శబర నాయకుడు ఈ స్వామికి తొలి పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. గంగ వంశీయులు స్వామికి ఆలయం నిర్మించారు. నీలమణితో తయారైన నీలమాధవుని విగ్రహం కాలగర్భంలో కలసిపోగా దాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రయత్నాలు సాగాయి. ‘సముద్రంలో కొట్టుకు వచ్చే కలప దుంగతో తన మూర్తిని చెక్కించవలసింది’గా ఇంద్రద్యుమ్నుడనే రాజును శ్రీ మహావిష్ణువు స్వప్నంలో ఆదేశిస్తారు. ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ కార్యభారాన్ని స్వీకరిస్తారు. 21 రోజలు వరకు తన పనికి ఆటంకం కలిగించవద్దని సూచిస్తారు. అయితే రాజదంపతులు ఉత్సుకతతో పక్షం రోజులకే తలుపులు తెరిపించగా, మూడు ప్రతిమలు అసంపూర్ణంగా కనిపించాయట. శిల్పి జాడలేదు. దాంతో ఆ శిల్పిని సాక్షాత్‌ శ్రీ‌మన్నారాయుణుడిగా భావించిన రాజు తమ పొరపాటునకు చింతించి, ఆ మూర్తులను యథాతథంగా ప్రతిష్ఠించి మందిరం కట్టించారట.

రథయాత్ర వైశిష్ట్యం

పూరీ పేరు విన్నవెంటనే స్ఫురించేది రథయాత్ర. ప్రపంచంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన పూరీ‘నాథుడి’ రథయాత్రకు గల విశిష్టత, వైభోగం మరెక్కడా లేదు. ఇది విశ్వజనీనమైన వేడుక. ‘రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే…’ రథంపై ఊరేగే విష్ణుదర్శనంతో పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందునా పూరీ జగన్నాథుడి రథోత్సవం మరింత విశిష్టమైందిగా చెబుతారు. ఇతర క్షేత్రాలలో ఉత్సవమూర్తులు ఆలయ/పురవీధుల్లో విహరిస్తే, ఇక్కడ మూలవిగ్రహాలే తరలి వెళతాయి. ఈ రథయాత్రను సోదరి ప్రేమకు ప్రతీకగా కూడా చెబుతారు. రథయాత్ర నేపథ్యంలో రకరకాలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సోదరి సుభద్రను ఆనందపరచడమే ఈ రథయాత్ర లక్ష్యమంటారు. బలరామకృష్ణులు కంసవధకు బయలుదేరిన ఘట్టానికి ఈ యాత్ర చిహ్నం పేర్కొంటారు. వారితోపాటు వెళ్లాలనుకున్న సుభద్రదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్రని కూడా చెబుతారు.

త్రివిధ రథాలు

ఏ ఆలయంలోనైనా ఊరేగింపు సేవలో ఎప్పడూ ఒకే రథాన్ని వినియోగిస్తారు. ఇందుకు భిన్నం పూరీ క్షేత్రం. ఇక్కడ ఏటా కొత్త రథాలు తయారవుతాయి. ఇతర ఆలయాలలోని దేవదేవేరులను ఒకే రథంలో ఊరేగించడం కనిపిస్తుంది. ఇక్కడ అందుకు భిన్నంగా ముగ్గురికి వాహనాలు. 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో గల బలరాముని రథాన్ని ‘తాళధ్వజం’ అంటారు. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో దీనిని అలంకరిస్తారు. 43 అడుగుల ఎత్తు12 చక్రాలతో గల సుభద్రాదేవి రథాన్ని ‘పద్మధ్వజం’ (దర్పనదళ) అంటారు. ఎర్రటి చారలుగల నలుపు వస్త్రంతో అలంకరిస్తారు. జగన్నాథస్వామి రథాన్ని ‘నందిఘోష్‌’ అం‌టారు. 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తుగల ఈ రథాన్ని ఎరుపు, పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు… ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం గల తాళ్లను కడతారు. గజపతి మహారాజు జగన్నాథుడి తొలిసేవకుడు. రథయాత్ర ఆరంభానికి ముందు ఆయన తన కిరీటాన్ని తీసి నేలపై ఉంచి బంగారు చీపురుతో రథాలను శుభ్రపరచి మంచిగంధం నీటితో కడుగుతారు. దీనిని ‘చెర్రాపహరా’ అని వ్యవహరిస్తారు. దైతపతులనే శబరులు గిరిజన సంప్రదాయం ప్రకారం పెద్ద పూలకిరీటాలు, రంగురంగుపూలు, పూసలతో ‘జగన్నాయకుల’ను అలకరించి, తప్పెట్లు, శంఖనాదాలు, భాజాభజంత్రీల మధ్య పాటలు పాడుతూ విగ్రహాలను రథాలపైకి చేరుస్తారు. శబరులే ఈ పక్రియనంతా నిర్వహిస్తారు తప్ప ఎక్కడా వేద పండితులు ఉండరు.
ఇతర క్షేత్రాలలో ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహరిస్తే, ఇక్కడ మూలవిగ్రహాలే తరలి వెళతాయి. ‘యాత్ర’లో బలభద్రుని రథం ముందుభాగంలో, దాని వెంట సోదరి సుభద్ర రథం వెళుతుంటే, జగన్నాథుడి తేరు వారిని అనుసరిస్తూ చెల్లెలిని సు‘భద్రం’గా చూసుకోవలసిన తీరును బోధిస్తున్నట్లుంటుంది. ఆలయ నిబంధనల ప్రకారం ‘యాత్ర’ ప్రారంభమైన తరువాత ఎట్టి పరిస్థితల్లోనూ రథం తిరోగ మించకూడదు. ఈ ‘ఘోషయాత్ర’ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని ప్రమాదవ శాత్తు ఎవరైనా రథం కింద పడినా, దారిలో ఏ దుకాణమైనా అడ్డు వచ్చిన రథం వెనకగడుగు వేసే ప్రసక్తి ఉండదు. ఆలయం వద్ద ప్రారంభమైన రథయాత్ర అంగుళం అంగుళం కదులుతూ మూడు కిలోమీటర్ల దూరంలోని గుడించా (దేవతామూర్తులను ప్రతిష్ఠించిన రాజు ఇంద్రుద్యుమ్నుడి పట్టపురాణి గుడించ మందిరమని స్థలపురాణం)ఆలయానికి చేరడానికి 10నుంచి 12 గంటల సమయం పడుతుంది. ఆ రాత్రి ఆరుబయట రథాలలోనే మూలమూర్తులకు విశ్రాంతినిస్తారు. మరునాడు ఉదయం మేళతాళాలతో మందిరంలోకి తీసుకువెళతారు. వారం రోజులు గుడించా ఆతిథ్యం స్వీకరించి దశమినాడు తిరుగు ప్రయాణమవుతారు. దీనిని ‘బహుదాయాత్ర’ అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు శ్రీపీఠం (జగన్నాథ ఆలయం) చేరుకుంటాయి. ఇక్కడా విగ్రహాలు ఆరుబయటే ఉండిపోతాయి. మరునాడు (ఏకాదశి) స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీనిని ‘సునావేష’అని వ్యవహరిస్తారు. విగ్రహాలను ఆలయ ప్రవేశం చేయించి, రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర ముగుస్తుంది.
కులం, భాష, సంస్కృతి, లింగ, పేద – ధనిక, పండిత-పామర, వయోభేద రహితంగా లక్షలాది మంది ఈ రథయాత్రలో పాల్గొంటారు. రథాన్ని లాగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఊరేగింపునకు బయలుదేరిన రథం మరునాడు సూర్యోదయంలోగా యథాస్థానానికి తిరిగి రావలన్నది శాస్త్రవచనం. కానీ ఈ క్షేత్రంలో బయలుదేరిన మూడు రథాలు తొమ్మిది రోజుల తర్వాతే ఆలయానికి చేరుకుంటాయి.

సర్వం శ్రీ జగన్నాథం

జగన్నాథుడు నైవేద్య ప్రియుడు. నిత్యం 64 రకాల పిండివంటలను కట్టెలపొయ్యిల మీదనే తయారు చేస్తారు. ఆయన వంటశాల దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలలోని వంటశాలల కంటే పెద్దది. ప్రసాదాలన్నీ మట్టి కుండలలోనే వండుతారు. ఒకసారి వాడిన పాత్రను మరోసారి ఉపయోగించరు. కుండమీద కుండపెట్టి అన్నం వండడం, అన్ని పాత్రలలోని పదార్థం ఒకేలా ఉడకడం విశేషమే. శ్రీ మహాలక్ష్మీ దేవి వంటలను స్వయంగా పర్యవేక్షిస్తారని భక్తుల విశ్వాసం. జగన్నాథుని ప్రసాదం రెండు రకాలు. అన్నప్రసాదం, శుష్క ప్రసాదం. దైవదర్శనం తర్వాత తీసుకునేది అన్నప్రసాదం కాగా, ఇళ్లకు తీసుకువెళ్లేది శుష్కప్రసాదం. మహాప్రసాదం స్వీకరణలో అంటూ సొంటూ ఉండదు. ‘సర్వం శ్రీ జగన్నాథం’ నానుడి అలానే పుట్టిందంటారు. ఎందరు భక్తులు ఎప్పుడు వచ్చినా కాదనకుండా, లేదనుకుండా అన్నం దొరికేది జగన్నాథధామం.

నవకళేబర ఉత్సవం

ఎనిమిది నుంచి ఇరవై ఏళ్లకోసారి నవకళేబర ఉత్సవం నిర్వహిస్తారు. అంటే గర్భాలయంలోని మూలవిరాట్‌లను ఖననం చేసి, కొత్త విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. అధిక ఆషాఢం వచ్చిన సంవత్సరం ఉగాదినాడు ఈ ఉత్సవం ప్రారంభమై నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. ఆ సందర్భంగా పాత విగ్రహాలలోని బ్రహ్మ పదార్థాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహాలలో నిక్షిప్తం చేస్తారు. విగ్రహాలు నిర్మాణం తరువాత సహజసిద్ధంగా ఆకులు, బెరడు నుంచి సేకరించిన రంగులు పూస్తారు. జగన్నాథుడి విగ్రహానికి వాటితోపాటు కస్తూరి నుంచి తీసిన రంగును అద్దుతారు. రథయాత్రకు ముందు రోజు నూతన విగ్రహాలను శ్రీపీఠంపై ప్రతిష్ఠించి విశేష అర్చనాదులు నిర్వహించి భక్తులకు జగన్నాథ దర్శన భాగ్యం కల్పిస్తారు. దీనిని ‘నవ యవ్వన దర్శనం’ అంటారు. ఏటా జరిగే జగన్నాథ రథయాత్రే విశిష్టమైనదనుకుంటే, నవకళేబర ఉత్సవ సంవత్సరం నాటి ‘యాత్ర’ మరింత ప్రత్యేకమైంది. స్వామి వారి నూతన రూప సందర్శనకు భక్తులు పోటెత్తుతారు. ఏటా జరిగే రథోత్సవానికి హాజరయ్యే భక్తుల కంటే సుమారు అయిదారు రెట్లు ఎక్కువగా తరలివస్తారు. నవకళేబర మొదటి ఉత్సవం క్రీ.శ.1308లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ శతాబ్దపు మొదటి ఉత్సవాన్ని అయిదేళ్ల క్రితం (2015)లో నిర్వహించారు. తరువాతి ఉత్సవం 2035లో జరుగుతుంది.

సమానత్వం జగన్నాథ తత్వ్తం

సర్వమానవ సమానత్వం, లౌకికతత్వ్తం జగన్నాథుని సిద్ధాంతం. దానిని అవగాహన చేసుకుంటే లోకమంతా అనందమయమవుతుందని, కులమతవర్ణ వైరుధ్యాలకు అతీతమైన సమసమాజం సిద్ధిస్తుందని విశ్వాసం. ఈ స్వామి సన్నిధిలో దర్శనం, అర్చనాదులలో హెచ్చుతగ్గులు, ‘మహాప్రసాద’ స్వీకరణలో తేడాలు, అంటూసొంటూ ఉండదు. ఎంగిలి అంటదు. ఆనందబజారులో ఒకే పంక్తిన ప్రసాదాలు అందచేస్తారు. ఎవరైనా వడ్డించవచ్చు. ఎవరైనా తినవచ్చు. కనుక•నే ‘సర్వం శ్రీ జగన్నాథం’ అనేది వాడుకలోకి వచ్చింది. పదార్థాలను పూర్తిగా వినియోగించవలసిందే తప్ప పారవేయడానికి వీలులేదు. ఇక, దేవదేవుడికి అందే సేవలు మానవ జీవిత చక్రాన్ని పోలి ఉంటాయి. ఆయనకు సహితం మానవుడిలా ఆకలిదప్పులు, అనారోగ్యం, మమతలు, అభిమానాలు, అలకలు తదితర లౌకిక జీవన ఘట్టాలు కనిపిస్తాయి. రథోత్సవం ప్రారంభానికి ముందు 108 బిందెలతో దేవతామూర్తులకు మంగళ స్నానం చేయిస్తారు. ఈ ‘సుదీర్ఘ’ స్నానంతో వారు మానవ సహజమైన అనారోగ్యం బారిన పడి, తిరిగి కోలుకునే వరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారట. పదుల సంఖ్యలో రకరకాల ఆహార పదార్థాలు స్వీకరించే భోజన ప్రియస్వామికి అనారోగ్యం కారణంగా ఆ సమయంలో కేవలం కందమూలాలు, పండ్లను ‘పథ్యం’గా సమర్పిస్తారు. రథయాత్ర అనంతరం అంతరాలయ పునః ప్రవేశంతో ‘నేత్రోత్సవం’ పిదప యథాప్రకారం నైవేద్యం సమర్పిస్తారు. శ్రీవారు తనను మరచి అన్నా చెల్లెళ్లతో పురవిహారం సాగించారన్న కినుకతో శ్రీమహాలక్ష్మి – జగన్నాథుడిని మందిరంలోకి వెళ్లకుండా అడ్డుకుందని, స్వామి కొన్ని మధుర పదార్థాలు ఇచ్చి ఆమెను ప్రసన్నం చేసుకొని మందిర ప్రవేశం చేస్తారని కథనం. అర్చకులు ఆ సన్నివేశాన్ని పాటలతో అభినయించడం ఆకట్టుకునే దృశ్యం.

భాగ్యనగరిలో ‘ఉత్కళ’ నాథుడు

భాగ్యనగర్‌ (‌హైదరాబాద్‌)‌లో ఉత్కళనాథుడు కొలువుదీరాడు. పూరీ ఆలయ శిల్పకళా సౌందర్యానికి ప్రతీకగా బంజారాహిల్స్‌లో ఎకరంన్నర విస్తీర్ణంలో జగన్నాథ మందిరం నిర్మితమైంది. 74 అడుగుల ఎత్తు గోపురంతో కల ఆలయ ప్రాంగణంలో శ్రీమహాలక్ష్మి, కాశీ విశ్వనాథ, విమల (దుర్గాదేవి), గణపతి, హనుమాన్‌, ‌నవగ్రహ ఉపాలయాలు ఉన్నాయి. కళింగ కల్చరల్‌ ‌ట్రస్ట్ ఆధ్వర్యంలో పూరీ క్షేత్రం తరహాలోనే ఇక్కడా అర్చనాదులు నిర్వహిస్తున్నారు.
‘నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే!
సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళమ్‌!!’

 -‌ డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram