370 రద్దు
తలాక్‌పై వేటు
మందిర్‌కు పునాది
కరోనా కట్టడి

దేశ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ఒక సంచలనం. అది కేవలం సంచలనం కాదు. ఈ రాజకీయ వ్యవస్థ పునరుజ్జీవనానికి శ్రీకారం చుట్టిన సంచలనం. కప్పల తక్కెడ రాజకీయాలకు మంగళం పాడుతూ దాదాపు మూడు దశాబ్దాల తరువాత భారత పార్లమెంట్‌ ‌పూర్తి మెజారిటీ సాధించింది బీజేపీ నాయకత్వంలోనే. రాజకీయాలకు దేశీయమైన చింతన తోడు కావడానికి ఆస్కారం కల్పించింది ఈ పార్టీయే. ఇందుకు కేంద్ర బిందువు నరేంద్ర మోదీ. అటల్‌ ‌బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణీ ప్రభృతులు ఆరంభించిన భారతీయ జనతా పార్టీ (1980) ఈ దశకు రావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. ప్రజల మద్దతు అపారంగా ఉన్నా, ప్రజలతో మమేకమై ఉన్నా, దుష్ప్రచారం అనే ఎదురుగాలి బీజేపీని నిరంతరం నిరోధిస్తూనే ఉంది. దీనిని అద్భుతంగా అధిగమించినవారిలో మొదటి వారు అటల్‌ ‌బిహారీ వాజపేయి, తరువాత నరేంద్ర మోదీ. వారిద్దరి విజయాలు, పరిపాలన చరిత్రాత్మకమే. కానీ వాజపేయి అనుభవం, ప్రతిభ ఎన్‌డిఏ సర్కార్‌లో అగ్నిపరీక్షకు గురైనాయి. సంకీర్ణంలోని చాలామందితో ఆయన సమరమే చేయవలసి వచ్చింది. కానీ బీజేపీకి ఒక బ్రాండ్‌ను కల్పించడంలో ఆయన జీవితం, సచ్చీలత, రాజకీయం, నాయకత్వం, దేశాభిమానం అక్కరకు వచ్చాయి. పాలన మీదనే కాదు, భారత రాజకీయాల మీద, సాధారణ ప్రజల ఆలోచనా ధోరణి మీద కూడా గొప్ప ముద్రను వేశాయి. 2014లో మోదీ నేతృత్వంలో రాజకీయ వ్యవస్థ సుస్థిరత వైపు అడుగులు వేయడానికి కారణాలు అవే. 2019లో మోదీ నాయకత్వంలోని బీజేపీ దేశ రాజకీయాలలో అప్రతిహత రాజకీయ శక్తిగా అవతరించడమే కాదు, ప్రపంచ వ్యవహారాలలో కీలక పాత్రధారి అయింది.
మే 30, 2019న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండో దఫా ప్రమాణ స్వీకారం చేశారు. పదిహేడో లోక్‌సభ పరిపూర్ణ ‘కమల’ వికాసం చూసింది. 303 స్థానాల అసాధారణ విజయం. ఎంతో చరిత్రాత్మకం కూడా. ఎన్డీఏ భాగస్వాములతో కలుపుకుంటే 353 స్థానాలు. ఎన్‌డీఏ 45 శాతం ఓట్లు సాధించింది. 1950-1960 దశకాల మాదిరిగానే ఈ దేశంలో ఏక పక్ష ఆధిపత్యం మరొకసారి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యా నించారు. వారికి నెహ్రూ, ఇందిర కాలం నాటి కాంగ్రెస్‌ ఆధిపత్యం గుర్తుకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే పార్లమెంటులో కనిపించిన అప్రతిహతమైన ఏక పార్టీ ఆధిపత్యం మళ్లీ ఇప్పుడు కనిపించిందన్న మాట నిజం. మంచి పరిణామం కూడా. ఈ మే 30వ తేదీతో మోదీ రెండో దశ పాలనకు ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకోవలసిన అవసరమే ఉంది. కారణం- బీజేపీ/ఎన్‌డిఏ సాధించిన విజయాలు. ప్రజా జీవితంలో అవి తెచ్చిన సానుకూల మార్పులు. కానీ కొవిడ్‌ 19 ‌కారణంగా క్లుప్తంగానే వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించుకుంది. వార్షికోత్సవం నామమాత్రంగా జరుగుతున్నా, ఏడాది మోదీ పాలన ఈ దేశ ప్రయాణాన్ని ఒక మలుపు తిప్పింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది బీజేపీ ప్రభుత్వం. 2015లో మాత్రం జనకల్యాణ్‌ ‌పర్వ పేరుతో తొలి వార్షికోత్సవాలు జరిపారు. అది కూడా ప్రచారం కోసం కాదు, దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికే.
ఈ దేశంలో ప్రజాదరణ వేరు. మీడియాలో కనిపించే దృశ్యం వేరు. 2014 నాటి ప్రభుత్వం మీద, మళ్లీ రెండో దఫా 2019 ప్రభుత్వం మీద మీడియా చేసిన దాడి, చేసిన చేటు అసాధారణమైనవి. జాతీయ భావాల మీద దాడులుగానే వీటిని గుర్తించాలి కూడా. అయినా ఇండియా టుడే (లోకల్‌ ‌సర్కిల్‌) ‌చేసిన సర్వేలో మోదీ పాలన పట్ల ఈ దేశంలో 62 శాతం అయినా ప్రజలు సంతృప్తిని ప్రకటించారు. అంటే ఆ వర్గం మీడియా చెంప మీద లాగి కొట్టినట్టే. అంటే, ఈ దేశంలో క్షేత్ర స్థాయిలో సాధారణ భారతీయుని మనోభావాలు వేరు. అవి ఈ మట్టి వాసన వేస్తాయి. కానీ మేధోవర్గంగా చలామణి అవుతున్నవారి దృష్టి వేరు. అది సెక్యులరిజం పేరుతో, హక్కుల సాధన పేరుతో, భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో వాస్తవం మీద విషం చిలకరిస్తున్నది. అధిక సంఖ్యాకులైన హిందువుల మనోభావాలను నిరంతరం కించపరుస్తున్నవే. ఇందుకు తాజా ఉదాహరణ కొవిడ్‌ 19. ‌దీని మీద మేధావుల కప్పదాటు వైఖరి. వీళ్లంతా చూసిన మత కోణం. నిన్నటి దాకా వలస కార్మికుల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టు నటిస్తూ వారిని తరలించేదాకా మేధావులు, ఒక వర్గం మీడియా నిద్ర పోలేదు. వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు, ఇతర వాహనాలను అనుమతించేదాకా వదలలేదు. కానీ వలస కార్మికుల తరలింపు తరువాత పాజిటివ్‌ ‌కేసులు పెరిగాయి. పరిస్థితి ప్రమాదకరంగా తయారయింది. ఇప్పుడు వలస కార్మికుల విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ ప్రచారం ప్రారంభించింది అదే మీడియా. వలస కార్మికులు ముంబైలో రోడ్డెక్కితే మీడియా వారిని సమర్థించింది. ఇప్పుడు వలస కార్మికులే మళ్లీ ముంబై బాట పట్టడం, వేలాదిగా చేరుకోవడం కొత్త సమస్యకు కారణమవుతున్నది. ఇప్పుడు నోరెత్తడం లేదు మీడియా. మీడియా ద్వంద్వ ప్రమాణాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. కొవిడ్‌19 ‌సమయంలో ముస్లింల మీద ఏహ్యభావం పెంచడానికి ప్రయత్నం జరుగు తున్నదన్న ఆరోపణలు కూడా చేసింది ఈ వర్గం మీడియా.
అయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయి. మొదటి దఫా ఐదేళ్ల పాలన పార్టీ ప్రణాళికకు అనుగుణంగానే మోదీ సాగించారు. రెండో దఫా, మొదటి సంవత్సరంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా పార్టీ ప్రణాళికలోనివే. ఏదీ రహస్యంగా, దొడ్డిదారిన రుద్దడానికి మోదీ యత్నించలేదు. అవన్నీ కూడా విస్తృత ప్రయోజ నాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసినవే. ఆయన మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ పూర్వరూపం భారతీయ జనసంఘ్‌, ‌ప్రస్తుతం బీజేపీ కొన్ని దశాబ్దాల నుంచి చెబుతున్న ఆశయాలే.

370 అధికరణం రద్దు

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని మోదీ రద్దు చేశారు. ఇది అత్యంత సాహసోపేతమైన చర్య. ఈ అధి కరణం రాజ్యాంగంలో తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్నది. కానీ దీనిని రద్దు చేస్తే దేశం బుగ్గయిపోతుందని ఏడుదశాబ్దాల పాటు దేశాన్ని భయాందోళనల మధ్య ఉంచారు. దీనిని ఛేదించారు మోదీ. ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారు. లద్దాక్‌ను వేరు చేశారు. దీనితో చాలా విషయాలు స్పష్టమయ్యాయి. ఒకే దేశం రెండు రాజ్యాంగాలు అన్న దుష్ట సంప్రదాయానికి స్వస్తి పలికినట్టయింది. ఒకే దేశం రెండు జెండాలు అన్న వికృత ధోరణి కూడా అంతమైంది. గడచిన ఏడు దశాబ్దాలుగా భారత ప్రభుత్వాన్ని బెదిరిస్తూ కాలం గడుపుతున్న రాజకీయ (కుటుంబ) పార్టీలు, ఇరవై ఒక్క పార్టీల హురియత్‌ ‌కాన్ఫరెన్స్ ‌కేవలం కాగితం పులులే నన్న వాస్తవం బయటపడింది. పాకిస్తాన్‌ ఆటలకు నేరుగా అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం కలిగింది. చిత్రంగా పాకిస్తాన్‌, ‌మలేసియా, టర్కీ వంటి రెండు మూడు ముస్లిం దేశాలు తప్ప మరొక దేశమేదీ ఈ చర్యను తప్పు పట్టే ప్రయత్నం చేయలేదు. అది ఆ దేశ అంతర్గత అంశమని ప్రపంచ దేశాలు భావించాయి. అన్నింటికీ మించి ఇప్పుడు ఎవరి నిధులు వారికి వెళుతున్నాయి. పంచాయ తీలకు నేరుగా అందుతున్నాయి. పరిస్థితిలో మార్పు వచ్చింది. లద్దాక్‌ ‌వాటా అక్కడికి వెళుతున్నది. ఇంతకాలం వీటి గురించి ప్రశ్నించేవారు లేకపోయారు. చిత్రం ఏమిటంటే, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్, ‌పీడీపీ పార్టీల నేతలు ఫరూక్‌, ఒమర్‌, ‌మెహబూబా ముఫ్తీలను నెలల తరబడి గృహ నిర్బంధంలో ఉంచినా అక్కడ అడిగినవారు లేరు. భద్రతా బలగాల కాల్పులలో మరణించిన ఉగ్రవాదుల అంతిమ యాత్రలలో వందల సంఖ్యలో కశ్మీరీలు పాల్గొన్నప్పటికీ, ఈ నేతలను విడుదల చేయా లంటూ చిన్న ప్రజా ప్రదర్శన కూడా జరగలేదు.
370 అధికరణం రద్దుతో కశ్మీర్‌లో మొదటిసారి సామాజిక న్యాయం అమలులోకి వచ్చింది. అది కశ్మీర్‌ ‌లోయ పురుషుల హక్కుల రక్షణకు తప్ప, కశ్మీరీ స్త్రీలు సహా మరే ఇతర వర్గానికీ పనికొచ్చేది కాదన్న అభిప్రాయం ఉంది. 1950 దశకంలో పంజాబ్‌ ‌నుంచి కశ్మీర్‌కు వలసి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు కొన్ని తరాలుగా హక్కులకు దూరంగా ఉండిపోయారు. మిగిలిన దేశమంతటా అదే కులానికి ఎస్‌సి హోదా చలామణి అవుతున్నది. కానీ అక్కడ ఆ సౌకర్యం వారికి లేదు. పొరుగు రాష్ట్రం వెళ్లి ఆ సౌకర్యం అనుభవించడానికి కశ్మీర్‌ ‌రాష్ట్రం గుర్తింపు పత్రం ఇవ్వదు. ఇంతకాలం జమ్ము ప్రాంతంలో శాసనసభ స్థానాలు తక్కువగా ఉండేటట్టు, కశ్మీర్‌ ‌లోయలో ఎక్కువ స్థానాలు ఉండేటట్టు కుట్ర సాగించారు. ఇప్పుడు నియోజక వర్గాల పునర్‌ ‌విభజన జరుగుతున్నది. ఆ విధంగా జమ్ముకు కూడా అసెంబ్లీలో తగిన ప్రాధాన్యం తక్కబోతున్నది. అన్నింటికి మించి 1990 నాటి ఘోరాలతో లోయను వీడి, మూడు దశాబ్దాలుగా దేశం నలుమూలలా స్వదేశంలోనే శరణార్థు లుగా బతికిన పండిట్లకు ఇప్పుడు సొంత నేలకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. చిత్రంగా పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదుల ఆసరాతో అక్కడ హిందువులకు, హిందూ ఆలయాలకు, సంస్థలకు స్థానికులు చేసిన అన్యాయం గురించి మాట్లాడకుండా, పండిట్లకు, సిక్కులకు జరిగిన అన్యాయాలను ప్రస్తావించకుండా 370 రద్దును మాత్రమే తప్పు పట్టే వారికి ఇప్పుడు దేశంలో విలువ లేకుండా పోయింది. అంటే సెక్యుల రిస్టులు, ముస్లిం మతోన్మాదులు, మేధావులు, కాంగ్రెస్‌ ‌వంటి పార్టీలు దేశం ఎదుట తయారు చేసి పెట్టిన పెద్ద రాజకీయ భూతాన్ని ఒక్క సంతకంతో మోదీ పటాపంచలు చేయ గలిగారు. 370 అధికరణ రద్దు మీద చైనా అండతో పాకిస్తాన్‌ ‌చేసిన గగ్గోలును కూడా మోదీ ధీరోదాత్తంగా ఎదుర్కొనగలిగారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీ

తాము వలస వెళ్లిన లేదా నివాసం ఉంటున్న దేశాలలో (పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్తాన్‌) ‌మత వివక్షను ఎదుర్కొంటున్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులకు భారత్‌ ‌పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిన చట్టమిది. దీనితో ప్రస్తుతం భారతదేశంలో ఉంటున్న ఏ ఒక్కరి పౌరసత్వం రద్దు కాదు. కానీ ముస్లింల పౌరసత్వం రద్దు చేయడానికి జరుగుతున్న యత్నాలలో తొలి అడుగే సీఏఏ అంటూ దేశంలో ముస్లిం మతోన్మాదులు, దొంగ సెక్యులరిస్టులు అల్లర్లు చేయించారు. అలాగే జాతీయ పౌర జాబితా కూడా. ఈ అల్లర్లకు కాంగ్రెస్‌, ఆప్‌, ‌కమ్యూ నిస్టులు, ఎస్‌పి వంటి పార్టీలు ఊతమిచ్చాయి. జెఎన్‌న్యు, జామియా మిలియా విశ్వవిద్యా లయం ఈ అల్లర్లకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. ఈ జనవరిలోనే అల్లర్లు ఆరంభ మయినాయి. షాహిన్‌ ‌బాగ్‌లో కొన్ని వేల మంది ముస్లిం మహిళలు నిరసన పేరుతో చట్ట వ్యతిరేకంగా రోడ్డును అక్రమించారు. తమ హక్కే తప్ప ఇతరుల హక్కులతో తమకు పని లేదన్న వాస్తవాన్ని రాజధాని నడిబొడ్డున నిలబడి నిరూపించారు. ఢిల్లీ ఈ అల్లర్లకు నిలయంగా మారింది. లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించిన తరువాత గాని షాహిన్‌ ‌బాగ్‌ ‌శిబిరాన్ని తొలగించడం సాధ్యం కాలేదు. సీఏఏ, ఎస్‌ఆర్‌ ‌సీలను అడ్డం పెట్టుకుని షర్జిల్‌ ఇమామ్‌ ‌వంటివారు అస్సాంను ఈ దేశం నుంచి విడగొట్టవచ్చునన్న ముస్లింల మనోగతాన్ని బయటపెట్టాడు. ఈ చట్టంలో రోహింగ్యాలకు చోటు లేకపోవడమే ఈ దేశంలో మేధావులకు కన్నెర్రయింది.

తలాక్‌ ‌వ్యతిరేక చట్టం

ముస్లిం మహిళా (వివాహ భద్రత, హక్కుల) చట్టం 2019 ద్వారా మోదీ ముస్లిం వనితలకు అసాధారణమైన హక్కు కానుకగా ఇచ్చారు. భర్తకు ఇష్టం లేకపోతే ఎక్కడ ఉన్నా భార్యతో మూడుసార్లు తలాక్‌ అని చెబితే ఆ వివాహం రద్దయిపోతుంది. ఇది ముస్లిం సమాజంలో ఒక పెను సంక్షోభంగా మారుతోంది. నిజానికి షాబానో కేసుతోనే దీనిలో కదలిక రావలసిన ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ‌బుజ్జగింపు రాజకీయాల కారణంగా సాధ్యం కాలేదు. ఆ కదలికను నరేంద్ర మోదీ తెచ్చారు.
జూలై 26, 2019న ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇది సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా జరిగినదే కూడా. దానితో ఆగస్టు 1 నుంచి ఆ విధంగా తలాక్‌ (అరబిక్‌లో విడాకులు అని అర్థం) చెబితే ఆ పురుషులు శిక్షార్హులవుతారు. నోటితో చెప్పినా, రాసి చూపినా, ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్‌ను ఉపయో గించి చెప్పినా అది చట్ట విరుద్ధమవుతుంది. మూడేళ్లు కనీస శిక్ష ఉంటుంది. ఇంతటి పురోగామి బిల్లు కూడా పార్లమెంటులో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నది. ముస్లింల బుజ్జగింపునకు చిరునామాగా ఉండే పార్టీలే కాదు, బిజూ జనతాదళ్‌ ‌వంటి పార్టీ కూడా వ్యతిరేకించింది. మిగిలినవి భారత జాతీయ కాంగ్రెస్‌, ‌ముస్లిం లీగ్‌, ‌మజ్లిస్‌, అన్నా డీఎంకే.

రామమందిర నిర్మాణం

అయోధ్యలో రామమందిర నిర్మాణం చేస్తామన్నది కూడా బీజేపీ హామీలలో ఒకటి. 1980 దశకంలో రామజన్మ భూమి ఉద్య మానికి జాతీయ స్థాయి గుర్తింపును బీజేపీయే తెచ్చింది. అద్వాణీ రథయాత్ర అందుకు కారణం. 1992లో వివాదాస్పద కట్టడం కూల్చివేశారు. అయితే రామమందిర నిర్మాణం బీజేపీ ఆశయం. ఆ ఆశయానికి ఆకృతిని ఇచ్చే అవకాశం నరేంద్ర మోదీకి రావడం చరిత్రాత్మకం. అది కూడా మోదీ రెండో దఫా పాలనలో సాధ్యమైంది. అద్వాణీ రథయాత్రలో మోదీ భాగస్వామి కూడా. నవంబర్‌ 9, 2019‌న సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆ స్థలం రామునిదేనని చెప్పడంతో అడ్డంకులన్నీ తొలగి పోయాయి. ఆయల నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ మోదీ ఒక ట్రస్టు ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ఏర్పాటు గురించి ఈ ఫిబ్రవరి 5న మోదీ పార్లమెంటులో ప్రకటిం చారు. అయోధ్య రాముని పేరుతో ఓట్లు దండు కోవడమే బీజేపీ పనిగా పెట్టుకుందని కుహనా సెక్యులరిస్టులు, కాంగ్రెస్‌ ‌చేస్తున్న విషప్రచారా నికి ఆ విధంగా మోదీ అడ్డుకట్ట వేయగలిగారు.


కరోనా కట్టడిలో మోదీదే అగ్రస్థానం

కరోనా కట్టడిలో ఏ దేశ నాయకుడు ఎలా వ్యవహరించాడు? ఇది చాలా ముఖ్యం. అమెరికాకు చెందిన మార్నింగ్‌ ‌కన్సల్ట్ అనే సంస్థ ఈ అంశం మీద ఒక సర్వే నిర్వహించింది. కొవిడ్‌ 19 అదుపు, దీని కోసం అమలు లోకి తెచ్చిన లాక్‌ ‌డౌన్‌ ‌కాలాలలో నాయకులు ఎలా వ్యవహరించారు? ఇంతటి మహా విపత్తు పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నారు? మార్చి 17 నాటి పరిస్థితి ఏమిటి? మే 19 నాటి పరిస్థితి ఏమిటి? ఈ మధ్యకాలంలో ఆయా దేశాల ప్రజలలో నాయకుల మీద ఆదరణ ఎలా మారుతూ వచ్చింది? ఈ అంశాలను కూడా ఆ సంస్థ బేరీజు వేసింది. ఈ వార్త మే 27వ తేదీ పత్రికలలో కనిపించింది. ఈ సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన నాయకుడు ఎవరో తెలుసా? భారత ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 82 శాతంతో ఆయన మిగతా దేశాధినేతల కంటే ముందంజలో ఉన్నారు.
మార్చి 17న జనాదరణ మోదీ మీద 74 శాతం ఉంది. అంటే 74 శాతం మంది ప్రజలు ఆయన చర్యల పట్ల, స్పందన పట్ల సంతృప్తికరంగానే ఉన్నారని అర్థం. మే 19 నాటికి మోదీ మీద ప్రజాదరణ 82 శాతానికి చేరింది. భారత్‌ (‌మోదీ, 82 శాతం), ఆస్ట్రేలియా మారిసన్‌ 66‌శాతం), జర్మనీ (మెర్కెల్‌, 56 ‌శాతం), బ్రిటన్‌ (‌బోరిస్‌ ‌జాన్సన్‌ 55 ‌శాతం), అమెరికా (ట్రంప్‌, 43 ‌శాతం) బొల్సొనారో (బ్రెజిల్‌, 41 ‌శాతం), ఫ్రాన్స్ (‌మెక్రాన్‌, 33 ‌శాతం), జపాన్‌ (‌షింజో అబె, 31 శాతం) నేతల పని తీరుపై ఈ సర్వే జరిపారు. అయితే ఇందులో బొల్సొనారో (బ్రెజిల్‌) 17 ‌శాతం ప్రతిష్టను కోల్పోయారు). అలాగే షింజో (జపాన్‌) ‌కూడా నాలుగు శాతం ప్రతిష్టను పోగొట్టుకున్నారు. నిజానికి ప్రపంచమంతా విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్‌ ‌మే 19 నాటికి ఒక శాతం ప్రతిష్టను పెంచుకున్నారు. అయితే ఇలాంటి వాస్తవాలు చెప్పడానికి ఒక వర్గం మీడియాకు మనస్కరించదు కాబట్టి అన్ని పత్రికలలోను ఈ సర్వే వివరాలు కనిపించలేదు. ఈ సర్వేతోనే ఆయా నేతలను పదవి నుంచి దింపరు. అలాగే నోబెల్‌ ‌బహుమతులు కూడా వరించవు. వారి పని తీరు ఆయా దేశాలు తెలుసుకునే అవకాశం చాలా వరకు వస్తుంది. అబద్దాలు ప్రచారం చేసే వారి దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండగలుగుతారు.


ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు

దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల ట్రిలియన్‌ ‌డాలర్లకు చేర్చాలన్నది (2024 ఎన్నికల నాటికి) మోదీ ఆశయం. కానీ కొవిడ్‌ 19 ఈ ఆశయానికి గదాఘాతంలా తగిలింది. నిజానికి కొవిడ్‌కు ముందే భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్న అభిప్రాయం ఉంది. ఇందుకు అనేక కారణాలు. కొవిడ్‌లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరీ మందగించిందని విశ్లేషకుల అభిప్రాయం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే సాగు ఆధారితం. వ్యవసాయం వెనుకబడిన కారణం గానే ఇటీవలి భారత్‌ ‌వృద్ధిరేటు మందగించిం దని చెబుతున్నారు. కానీ భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి మోదీకి స్పష్టమైన కల్పనే ఉంది. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు కూడా. కేవలం వినియోగమే కాకుండా, తయారీకి దేశం కేంద్రం కావాలన్నది ఆయన ఆశయం. మేక్‌ ఇన్‌ ఇం‌డియా దగ్గర మొదలైన ఈ యాత్ర వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌ ‌వరకు సాగాలన్నదే ఆయన కల. కానీ రెండో దశ పాలన ఆరంభమైన రెండు మాసాలలోనే ఆర్ధిక మందగమనం కనిపించడం వల్ల భవిష్యత్తులో కష్టాలు తప్పవని ఒక అంచనా ఉంది. మొత్తంగా చూస్తే ఇది ఆర్థిక వ్యవస్థకు పరీక్షా సమయం. అందుకే మోదీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొనవలసి వస్తున్నది. అయితే ఈ పరిస్థితికి కారణాలు అనేకం.

కొవిడ్‌ 19‌తో విజయవంతమైన పోరు

మోదీ రెండో దఫా తొలి ఏడాది పాలనకే కాదు, మొత్తం ప్రపంచానికే సవాలు విసిరిన అంశం కొవిడ్‌ 19. ‌ప్రజారోగ్యమా? ఆర్థిక వ్యవస్థ జీవజీవాలా? ఎటూ తేల్చుకోలేక ప్రపంచ నేతలంతా తలక్రిందులైన పరిస్థితి ఇది. మోదీ కొవిడ్‌ ‌విషయంలో అసాధారణమైన సంయమనం చూపించారు. ఆయన అటు ప్రాణహానికి చోటు రాకుండా, ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు ఇవ్వడానికి తన వంతు ప్రయత్నం చేశారు. కానీ నాలుగో దశ లాక్‌డౌన్‌లో మోదీని విపక్షాలు, మీడియా ఎమోషనల్‌ ‌బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేశాయనే అనిపిస్తుంది. వలస కార్మికుల తరలింపు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. కేసులు పెరుగుతున్నాయి. అదృష్టవశాత్తు మరణాల రేటులో వేగం లేదు. కానీ పెరుగుతున్న కేసులతో దేశం కకావిక లవుతున్నది. కొవిడ్‌ 19 ‌వ్యతిరేక పోరాటంలో కూడా మతాన్ని వెతికే ఘనులు ఉన్న దేశమిది. అయినా ఆయన కృషిని ప్రపంచం శ్లాఘిస్తున్నది.

చైనాతో సరిహద్దు తగాదా

చైనాతో తగాదా కొత్త కాదు. ఇంకా చెప్పా లంటే సరిహద్దు ఉద్రిక్తతలు నిత్యకృత్యం. భారత్‌ ‌కొవిడ్‌ ‌మహమ్మారితో తలపడుతూ ఉంటే సరిహద్దుల దగ్గర గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలని చైనా చూస్తున్నది. డోక్లాంలో ఇది వరకే భారత్‌, ‌చైనా సేనల మధ్య 18 రోజుల దిగ్బంధనం ఏర్పడింది. జాతీయ భద్రత కోణం నుంచి చైనాతో భారత్‌కు అనునిత్యం సమస్య గానే ఉంటుంది. తాజాగా వాస్తవాధీన రేఖ దగ్గర ఉద్రిక్తతలు పెగడంతో లద్దాక్‌ ‌తూర్పు ప్రాంతంలో ఇరు దేశాలు సేనలు వేలలో మోహరించి ఉన్నాయి. సరిహద్దు వివాదంలో మధ్య వర్తిత్వానికి సిద్ధమని మరొకసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌పిలుపునిచ్చారు.

విధ్వంసకర మీడియా ఒకవైపు. ఇసుమం తైనా నిర్మాణాత్మక దృష్టి లేని, జాతిహితం పట్టని కాంగ్రెస్‌ ‌పార్టీ మరొకవైపు. వరస భంగపాట్లతో భారత్‌ ‌మీద దూకుడు పెంచు తున్న పాకిస్తాన్‌ ఇం‌కొకవైపు. చైనా కుట్రలు సరేసరి. ఇవన్నీ ఉమ్మడిగా మోదీ పాలనను గాడి తప్పేటట్టు చేయాలని అనుకుంటున్నాయి. ఈ దేశంలో ముస్లింల ఆలోచన ధోరణి కూడా వింతగా ఉంటుందని తెలిసిందే. 2014లో మోదీ సాధించిన అసాధారణ విజయం, 2019లో మరొకసారి ఘన విజయం సాధించడం ముస్లింలలో ఒక వర్గం జీర్ణించు కోలేకపోతున్నది. ఇందుకు కారణం వీరిని నడిపిస్తున్న కుహనా మేధావులు. తలాక్‌ ‌వంటి దురాచారం పాకిస్తాన్‌లో కూడా రద్దయింది.

కానీ ఇక్కడ రద్దు చేయడం చాలామంది ముస్లిం నేతలకు నచ్చడం లేదు. దీనిని ముస్లింల మత వ్యవహారాలలో, జీవితాలలో చొరబడ డంగా భాష్యం చెబుతున్నారు. అయోధ్య రామునిదేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం సరికాదని బాహాటంగానే ప్రకటించిన ముస్లింలు ఈ దేశంలో ఉన్నారు. ఇలా హిందువులను ఆనందపరిచే వరస పరిణామాలు గతంలో ఏనాడూ లేవు. అదే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. హలాల్‌ ‌బ్రాండింగ్‌ ‌వంటి వాటిని ముందుకు తెస్తున్నారు. హిందువుల దుకాణాలలో కొనుగోళ్లు చేయరాదని ఆంక్షలు పెడుతున్నారు. ఇదంతా సరే, ఇందులో వాస్తవాలను పరిశీలించకుండా భారత్‌లో మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నారంటూ గుడ్డితనం ప్రదర్శిస్తున్న అంతర్జాతీయ మీడియా కూడా ఇప్పుడు భారతీయ సమాజానికీ, మోదీ సర్కార్‌కీ పెద్ద సమస్య. రోహింగ్యా ముస్లింల వంటి కర్కశ మనస్తత్వం కలిగిన వారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించకపోవడమే హిందూ మతోన్మాదంగా చిత్రించే చేటుకాలం ఇప్పుడు నడుస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత్‌లో ఇస్లామోఫోబియా ప్రబలిపోతున్నదంటూ అసత్య ప్రచారం మరొకటి. మోదీ అవినీతి రహిత పాలన అందించడానికి చేస్తున్న మహా ప్రయత్నం కూడా చాలామందిని బాధిస్తున్నది. అందుకే రకరకాల ముద్రలు ఆయన పాలన మీద వేస్తున్నారు. క్రైస్తవ మిషనరీల నుంచి, భారత వ్యతిరేక ముఠాల నుంచి నిధులు రాకుండా అడ్డుకట్ట వేసినందుకు కక్ష కట్టిన చాలా ప్రభుత్వేతర సంస్థలు కూడా తమ వంతుగా దుష్ప్రచారంలో పాలు పంచుకుంటున్నాయి. వీటి మధ్య మోదీ పాలన సాగిస్తున్నారు. ఆయన వ్యక్తిగత శీలం, స్థిత ప్రజ్ఞత, నిర్భీకత, దేశభక్తి, వాస్తవిక దృష్టి అన్నింటికీ మించి భారతీయ జనతా పార్టీ నిబద్ధత, జాతీయతా కోణం, మద్దతు ఆయనకు కొండంత అండగా నిలుస్తున్నాయి. మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా ఇదే దృఢ చిత్తంతో మోదీ పాలన సాగాలని కోరుకుందాం.

About Author

By editor

Twitter
YOUTUBE